Saturday, 18 July 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 24 - సరియా మాతో సమరాన నిలువగలడా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"




ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 24

దీపావళి - సరియా మాతో సమరాన నిలువగలడా

సనాతన ధర్మాన్ని గౌరవించే భారతీయులందరికీ దీపావళి అత్యంత ప్రధానమైన, విశిష్టత కలిగిన పర్వదినం. మంచి-చెడు, జ్ఞానం-అజ్ఞానం, వెలుగు-చీకటి మధ్య సమన్వయపర్చే ప్రయత్నమే దీపావళి పండగ. దుష్ట శిక్షణ శిష్టరక్షణ జరిగి చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఇళ్ల ముంగిళ్ళలో దీపాలను  వెలిగించి పండగ జరుపుకుంటారు. అంతర్ముఖంగా అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞానమనే వెలుగులను ప్రసరింపజేయడమే దీపావళి పరమార్థం.

ఈ దీపావళి పండగ వెనుక రెండు అతి ముఖ్యమైన పురాణ యితిహాసాలు వున్నాయి.  ఒకటి రామాయణం; మరొకటి భాగవతము. శ్రీరాముడు రావణాసురుని వధించి సీతాదేవితో అయోధ్యకు వచ్చిన రోజున,  లోక కంటకుడైన నరకాసురుని శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా యుద్ధంలో వధించిన రోజున ఈ దీపావళి పండగను జరుపుకుంటారు.

అసమాన వరప్రసాద బలంతో ముల్లోకాధిపత్యం సంపాదించి మితిమీరిన కండకావరంతో అసురుడిగా మారిన నరకుని హింసలనుండి    సాధు సజ్జనులను కాపాడమని  వచ్చిన మునులకు, భక్తులకు నరకుని రణరంగంలో సంహరిస్తానని అభయమిస్తాడు శ్రీకృష్ణుడు. అంతఃపురంలో వున్న సత్యభామ ఈ వార్తను విని యదుమౌళి ప్రియ సతిగా, తాను గీచిన గీటు దాటి చరించని (అమాయకపు భ్రమ)  తన పతికి తోడుగా రణరంగాన నరకునితో పోరాడి విజయం కట్టబెట్టి   తీరుతానని ఏకపక్ష నిర్ణయం తీసుకుంటుంది సత్యభామ. ఆ సమరోత్సాహంలో విల్లంబులు అందుకుని నరకుడు తమతో సరిసాటిగా సమరాన నిలువగలడా అంటూ ఒక పాట రూపంలో తన సుకుమార రూపలావణ్యాలను, వీర శౌర్య ప్రతాపాలను ప్రదర్శిస్తుంది ...


సరియా మాతో సమరాన నిలువగలడా 

                                                        !సరియా !

 పెదవుల వలపు సింగార మొలక

 కన్ను కొనల  కోపానల మెలయ

యదుపతి మురియ

నరకుడూ వెరవ చలము, బలము చూపేగా 

                                                        !సరియా!

దురమునా ప్రబల దానవకోటీ 

పరువుమాపి యిల గూల్చిన మేటి !దురమునా!

నరహరీ యెదుర నరకునీ తరమ

దురుసు పలుకులాడేనా

                                                        !సరియా!

కన్నెలు మదిని సమ్మోదపడగా దనుజ

లోకము కంపిలిపోవా !కన్నెలు!

ధనువుగొనీ మనోహరునీ 

సరసన నిలచి నరకునీ గెలిచి

బిరుదు గొనక మానేనా 


                                                        !సరియా!

సమరాన నిలువ,

సమరాన నిలువ,

సమరాన నిలువగలడా 


సత్యభామ నైజాన్ని బాగా గుర్తెరిగిన కృష్ణుడు ఆమె నిర్ణయాన్ని నిరుత్సాహపరుస్తాడు. రణరంగమంటే కోకిలాలాప కుసుమపరాగ వనవిహారం కాదని భీకరధ్వనులతో క్షతగాత్రుల ఆర్తనాదాలతో భయానకంగా వుంటుందని అది సత్యభామ వంటి కుసుమకోమలులకు తగిన స్థలం కాదని హితవు పలుకుతాడు. కానీ సత్యభామ తన మంకుతనాన్ని మరింత పెంచి నరకునితో యుధ్ధం చేసే తీరుతానని భీష్మించుకుని కృష్ణుడితో రణభూమికి తరలి వెడుతుంది. ఈ సందర్భం కోసమే కృష్ణుడు ఎదురుచూస్తున్నాడు. నరకాసురవధలో సత్యభామే ప్రధాన పాత్రధారియని జగన్నాటక సూత్రధారి యైన కృష్ణుడికి మాత్రమే తెలుసు. నరకాసురుడు తన మరణం  తల్లి ద్వారా మాత్రమే సంభవించేలా వరం పొందాడు. భూదేవి, వరాహస్వామి (విష్ణువు) కి జన్మించి అసురుడుగా మారినవాడే నరకుడు. దుర్మార్గుడైన నరకుని సంహరించడానికి అవతరించిన భూదేవియే సత్యభామ. నరకాసురవధతో ముల్లోకాలకు పట్టిన పీడ తొలగిపోయింది. ప్రజలంతా మహదానందంతో దీపాలను వెలిగించి సంబరాలు జరుపుకున్నారు.

ఈ వృత్తాంతమే  'దీపావళి' సినిమా గా 1960 లో మన ముందుకు వచ్చింది.

అందులో సత్యభామ ఆలపించిన ' సరియా మాతో సమరాన నిలువగలడా....' అనే గీతమే నేటి మన ఘంటసాల సజీవరాగం.

పౌరాణిక చిత్రాలకు కథ, మాటలు, పాటలు వ్రాయడంలో నిష్ణాతుడైన తెలుగు టాకీ తొలితరం సినిమా కవి సముద్రాల  రాఘవాచార్యులు. సీనియర్ సముద్రాలగా లబ్దప్రతిష్టులు. తెలుగు సినిమాలలో తొలి రోజులనాటి గ్రాంధిక పరిభాషకు స్వస్తి చెప్పి, తెలుగు భాషలోని సాహిత్యపు విలువలు విడనాడకుండా  వ్యవహారిక భాషలో మాటలు, పాటలు వ్రాయడం మొదలెట్టిన తొలి  కవి సముద్రాల సీనియర్.

దీపావళి సినిమా లోని మొత్తం 22 పాటలు, పద్యాలను  సముద్రాలగారే జనరంజకంగా వ్రాశారు. 'సరియా మాతో సమరాన నిలువగలడా' పాటను వీర శృంగార రసాలను సమపాళ్లలో మేళవించి తన కవితా పటిమను చాటిచెప్పారు సముద్రాల.   ఈ పాటలో వినపడే... 'ఎలయ', 'మురియ', 'వెరవ', 'చలము', 'సమ్మోదము',  'దురము', 'దురుసు', 'కంపిలి' వంటి సినీమాలలో అరుదైన పదాలు సముద్రాల వారి పాండిత్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చును.

దీపావళి చిత్రం ఆద్యంతం వైవిధ్యభరితమైన సంగీతాన్ని వినిపించిన ఘంటసాలవారు 'సరియా మాతో'...' అన్నట్లుగా  స్వరకల్పనలో తనకు తానే సాటిగా ఈ పాటను  మాల్కౌన్స్ రాగ స్వరాలతో అద్భుతంగా స్వరపర్చారు. హిందుస్థానీ మాల్కౌన్స్ రాగానికి సమాంతరమైన కర్ణాటక సంగీత రాగం హిందోళం. మాల్కౌన్స్ భైరవి థాట్ కు చెందిన ఔడవరాగం. అంటే ఈ రాగం ఆరోహణ, అవరోహణాక్రమంలో 'స గ మ ద ని' అనే ఐదు స్వరాలు మాత్రమే వినిపిస్తాయి. 'రి, ప' స్వరాలు ఈ రాగానికి వుండవు.

అతి ప్రాచీనము, సుప్రసిద్ధము అయిన ఈ మాల్కౌన్స్ రాగంలో  సుప్రసిద్ధ సంగీత విద్వాంసుల గీతాలే కాక వందలాది  సినిమా పాటలు కూడా వివిధభాషలలో రూపొంది ఆపాతమధురాలుగా నిలిచిపోయాయి.

'సరియా మాతో....' పాటలోని సంగతులు, గమకాలు, భావాలు గాయకులందరికీ పెను సవాలు. శృంగార, వీర రసానుభూతులనులను  ఒకే సమయంలో అతి సమర్ధవంతంగా గాయని గళంలోనుండి పలికింపజేయడంలో ఘంటసాల తన విద్వత్ ను ప్రదర్శించారు. తనకు సాటిగా ఈ పాటను మరెవ్వరూ పాడలేరన్న రీతిలో పాడి అటు సంగీతదర్శకుడు ఘంటసాలను, ఇటు శ్రోతలను మెప్పించిన కోమల గాయని  కోమల. సెమి క్లాసికల్ సాంగ్ అనగానే ఘంటసాలగారి మొదటి ఛాయిస్ ఆలిండియా రేడియో నిలయ విద్వాంసురాలు  ఆర్కాట్ పార్ధసారధి కోమలగారే. దీపావళి సినిమాలో హీరోయిన్ పాటలు పద్యాలన్నింటినీ ఎ.. కోమలే అద్వితీయంగా పాడారు.

ఘంటసాలగారు ఈ పాటకోసం వయొలిన్స్, వీణ, సితార్, ఫ్లూట్, క్లారినెట్, పియోనా, డబుల్ బేస్, తబలా, పక్వాజ్, డోలక్, మువ్వలు వంటి వాద్యాలను దురిత గమనప్రధానంగా ఉపయోగించి పాటను రక్తి కట్టించారు. ఈ చిత్రంలోని ఇతర గీతాలను ఘంటసాల, మాధవపెద్ది, ఎస్.వరలక్ష్మి,  జె.వి.రాఘవులు, జమునారాణి ఆపించారు.

సత్యభామ అనగానే తెలుగు కళాప్రియులకు ముందుగా గుర్తుకు వచ్చేది స్థానం నరసింహారావువేదాంతం సత్యనారాయణ శర్మ, ఎస్.వరలక్ష్మి, జమున, సావిత్రి గార్లే.  నవరసాలను అత్యద్భుతంగా పోషించగల నవరస కథానాయకి సావిత్రి మాత్రమే. దీపావళి సినిమాలో సత్యభామగా సావిత్రి ఈ పాటలో అసమానంగా నటించారు.

దీపావళి సినిమాలో ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వీ.రంగారావురమణారెడ్డి, కాంతారావు, గుమ్మడి, కృష్ణకుమారి, ఎస్.వరలక్ష్మి, వంటి హేమాహేమీ నటులు పోటాపోటీగా నటించి దీపావళి సినిమా దిగ్విజయానికి దోహదం చేశారు.

పూర్తిస్థాయి శ్రీకృష్ణుడిగా ఎన్.టి.రామారావుకు మూడవ చిత్రం దీపావళి. మాయా కృష్ణునిగా నరకాసురుడు గోపికలను అల్లరిపెట్టే సన్నివేశంలో ఎస్.వి.రంగారావు మేనరిజమ్స్ ను  ఎన్.టి.ఆర్. బహు చక్కగా అభినయించి మంచి వినోదం కలిగించారు.  

మ్యూజికల్ హిట్ గా అన్ని వర్గాల ప్రేక్షకుల అమోదాన్ని పొందిన దీపావళి  సినిమా అనేక కేంద్రాల్లో శతదినోత్సవాలు  జరుపుకుంది. ఇతర భాషల్లోకి కూడా డబ్ చేయబడింది.

చాలా తక్కువ సినీమాలకు మాత్రమే దర్శకుడిగా పనిచేసిన సబ్నవిస్ రజనీకాంత్ డైరక్ట్ చేసిన దీపావళి సినీమాను, వినాయకచవితి సినీమాను  తీసిన కె.గోపాలరావు గారే అశ్వరాజ్  ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించారు.

కొసమెరుపు: 

ఈనాడు మనకు ఆందుబాటులో వున్న దీపావళి సినిమా వీడియో టైటిల్స్ విషయంలో  ఏదో తారుమారు  జరిగింది. అవి ఒరిజినల్ టైటిల్స్ కావు.  మొదట్లోని కొన్ని  పేర్లు  మళ్ళా ప్రింట్ చేసి అతికించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. టైటిల్ మ్యూజిక్ లో కూడా జర్క్ కనిపిస్తుంది. ఆ గడబిడలో సంగీతదర్శకుడిగా  ఘంటసాలగారి పేరు మాయమైపోయింది. ఈ పొరపాట్లను గమనించని  టివి ఛానల్స్ సంగీతం సంగీతరావు అని  కూడా ప్రకటించడం జరిగింది. ఈ పొరపాటు ఏనాటికైనా  సవరించబడేనా!!


వచ్చేవారం, ఘంటసాలవారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 24 - సరియా మాతో సమరాన నిలువగలడా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...