Saturday, 3 October 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 35 - ఊహలు గుసగుసలాడే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 35


బందిపోటు - ఊహలు గుసగుసలాడే


ఆయన ఒక గొప్ప సంగీత మేధావి" అని డా.సి.నారాయణ రెడ్డిగారిచే సభాముఖంగా ప్రశంసించబడిన వ్యక్తి 'కలైమామణి' శ్రీ పట్రాయని సంగీతరావు గారు. గంధర్వ గాయకుడు ఘంటసాలగారి సంగీత సహాయకుడిగా 80 సినిమాలకు పైగా పనిచేశారు. సంగీతరావుగారికి సంగీతం, సాహిత్యం, తాత్త్విక విషయాల్లో జిజ్ఞాస,   పరిశోధనా దృష్టి ఎక్కువ. పాటల కంపోజింగ్ సమయంలో ఏ కొత్త ప్రయోగం జరిగినా వాటి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునేందుకు చాలా కృషి చేసేవారు. ఎన్నో గ్రంథాలను పరిశీలించేవారు. ఔచితీభంగం కాని రీతిలో కవిమిత్రులైన ఆరుద్ర, మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి వంటి ప్రముఖులతో  చర్చించేవారు.

ఘంటసాల మాస్టారు 'బందిపోటు' సినీమాకు సంగీతం దర్శకత్వం వహించి ఆ పాటలు బహుళ ప్రజాదరణ పొందిన ముప్ఫైయేళ్ళ తరవాత ఒక పాట రాగం విషయంలో కలిగిన జిజ్ఞాసతో తన దగ్గరున్న సంగీతం గ్రంథాలను పరిశీలించి ఘంటసాల గారు ఆ పాటకు ఎన్నుకున్న స్కేల్ 'సౌదామిని' అనే అరుదైన రాగస్వరాలు అని నిర్ధారించారు. ఆ పాటే  "ఊహలు గుసగుసలాడే నా హృదయం ఊగిసలాడే" .... మనందరి మనసులను దోచుకున్న సుశ్రావ్యగీతం. అదే నేటి మన ఘంటసాల సజీవరాగం.

ఈ పాట రాగం 'సౌదామిని' గురించి శ్రీ సంగీతరావుగారు చెప్పిన విషయాలనే ఇప్పుడు నా మాటల్లో మీముందు వుంచుతున్నాను.

గతవారం ఘంటసాల సజీవరాగంలో కైశికి నిషాదం, కాకలి నిషాదం స్వరస్థానాల భేదం వలన ఏర్పడిన మేళకర్తలు వకుళాభరణం, మాయామాళవగౌళల గురించి ప్రస్తావిస్తూ  వకుళాభరణ రాగంలో ఘంటసాలగారు చేసిన 'దయరాదా నామీద' పాట గురించి ముచ్చటించడం జరిగింది. అదేవరసలో 56వ, 57వ  మేళకర్తలు షణ్ముఖప్రియ, సింహేంద్రమధ్యమాలు. వీటికి జన్యరాగాలు సుమనేశరంజని, సౌదామిని రాగాలు. ఈ రెండు రాగాలు కూడా నిషాద(ని) స్వరస్థానాల మధ్య ఏర్పడిన భేదాల వలన పుట్టినరాగాలే. సుమనేశరంజని లో కైశికి నిషాదం, సౌదామినిలో కాకలి నిషాదం పలుకుతాయి. ఈ రెండు రాగాలు ఔడవ రాగాలు. ఆరోహణ అవరోహణ క్రమంలో 'స గ మ ప ని', 'స ని ప మ గ' స్వరాలు పలుకుతాయి. రిషభం(రి), ధైవతం(ద) స్వరాలు విడిచిపెట్ట బడ్డాయి. సుమనేశరంజనికి సమాంతరమైన హిందుస్థానీ రాగాన్ని మధుకౌంస్ అంటారు.

అత్యంత అరుదైన ఈ సౌదామిని, సుమనేశరంజని రాగాలలో సంగీతం ముమూర్తుల కృతులు, కీర్తనలు ఏవీ ఈ రాగంలో వున్నట్లు కనపడదు. సినిమాలలో కూడా సౌదామిని రాగంలో  చేసిన పాటలను వ్రేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.  ఈ రాగంలో సినిమా పాటను చేసి బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చిన ఘనత మన ఘంటసాలగారిదే. "ఊహలు గుసగుసలాడే" పాటలో అన్య స్వరంగా, పాసింగ్ నోట్ గా సుమనేశరంజని రాగంలోని కైశికి నిషాదాన్ని కూడా ఘంటసాల ప్రయోగించినా బలంగా వినిపించేది కాకలి నిషాద స్వరమే. అందుచేత ఈ పాటను ఘంటసాల గారు సౌదామిని రాగంలో నే చేసినట్లు సంగీతరావు గారు నిర్ధారించారు.

ఈ సౌదామిని రాగాన్ని ఘంటసాల గారు మరల తన భగవద్గీత లోని 80వ శ్లోకం 'సర్వయోనీషు కౌంతేయ' లో ఉపయోగించారు. 

'సౌదామిని', ' సుమనేశరంజని' రాగాలలో ఎవరు ఏ కృతులు చేయనందున కొత్త రాగాలను కనిపెట్టినవాడిగా ఘంటసాలగారు ప్రచారం చేసుకుని వుండవచ్చు. కానీ ఆ పని ఆయన చేయలేదు. ఇది ఘంటసాల గారి వినయవిధేయతలకు ఒక నిదర్శనం.

ఊహలు గుసగుసలాడడం, హృదయం ఊగిసలాడడం అనేది ఎప్పుడు మొదలవుతుంది మనసులో ప్రేమ బీజం జనించినప్పుడు. ప్రేమ అనే రెండు అక్షరాలులో ఎంతో మత్తు, మహత్తు వుంది. యావత్ప్రపంచం ఈ ప్రేమకు దాసోహం. ప్రేమ ఎప్పుడు ఎవరిలో ఎలా పుడుతుందో చెప్పడం ఎవరి తరం కాదు. అందులోనూ తొలిప్రేమలోని బలం, మాధుర్యం అనిర్వచనీయం. జీవితం లో ఎన్ని మార్పులు వచ్చినా, కాలం ఎంత గడిచినా తొలి ప్రేమ మధురస్మృతులు మాత్రం నిత్య హరితమే. ఆ భావనలు మర్చిపోవాలన్నా మరచిపోవడం ఎవరితరం కాదు.

కవులకు, కవిత్వానికి మూల ప్రేరణ ప్రేమే. తొలిప్రేమ అనుభూతిలో నుండి ఎన్నో గొప్ప గొప్ప కావ్యాలు, పద్యాలు, పాటలు ఉద్భవించాయి. ఇక మన సినిమాల గురించి చెప్పనే అక్కర్లేదు... తొంభై శాతం సినీమాలు ప్రేమ చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయి. ప్రేక్షకులు కూడా ప్రేమ కథలను, ప్రేమ గీతాలను అభిమానించినంతగా మరే అంశాలను అభిమానించరు. ఈ సత్యాన్ని గ్రహించిన మన సినీకవులెందరో అద్భుతమైన, చిరస్మరణీయమైన ప్రేమగీతాలెన్నింటినో సృష్టించారు. అలాంటి ఒక గాఢమైన తొలిప్రేమ గీతమే ఆరుద్ర గారి

'ఊహలు గుసగుసలాడే  నా హృదయం ఊగిసలాడే '... నేటి మన ఘంటసాల సజీవరాగం.

ప్రేయసి ప్రియుల హమ్మింగ్ ...

ప్రేయసి 

ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే ... ప్రియా...

ప్రియుడు

ఊ...

ప్రే. 

ఊహలు గుసగుసలాడే  నా హృదయము ఊగిసలాడే


ప్రే. వలదన్న వినదీ మనసూ కలనైన నిన్నే తలచూ- 2

ప్రి. తొలిప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు ! ఊహలు!

 

ప్రి. ననుకోరి  చేరిన బేలా దూరాన నిలిచేవేలా

ప్రే. నీ అనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడ !ఊహలు!


ప్రే.    దివి మల్లె పందిరి వేసే

ప్రి. భువి పెళ్లిపీటను వేసే -2


ఇద్దరు.  నెరవెన్నెల కురిపించుచూ  నెలరాజు పెండ్లిని చేసే


ఊహలు గుసగుసలాడే మన హృదయము లూయలూగే ...

ఊహుహూహుహూ... ... .... ... ... 


కయ్యంతో ప్రారంభమై వియ్యం తో శుభాంత మవుతుందని నానుడి. దీనిని తుచ తప్పక పాటిస్తారు మన సినిమావాళ్ళు. సినీమాలలోని నాయికా నాయకుల పరిచయాలు, స్నేహాలు, ప్రేమలు, కీచులాటలు, కలహాలతోనే ప్రారంభమవుతుంది. ఆ మూసలోంచి తీసినదే 'బందిపోటు'  కూడా. 

హీరో ఒక రాబిన్ హుడ్. అంటే ధనిక వర్గానికి విరోధి. దుర్మార్గులైన సైనికులను, దోపిడీదారులను దోచుకుని పేద ప్రజలను కాపాడుతూ ఉంటాడు. హీరోయిన్ ఒక రాజుగారి కూతురు. మరి వీరిద్దరి పరిచయం కలహంతోనే ఆరంభమై క్రమక్రమేణా ప్రేమగా మారుతుంది.

అనుమానాలు, అపార్ధాలు తొలగిన  నాయికా నాయకులు ఒక పున్నమి వెన్నెల వేళ తమ తమ స్థావరాలలో ఒకరిని గురించి మరొకరు తలుచుకుంటూ ఒక చక్కటి ఉద్యానవనంలో కలుసుకుని తమలోని మధుర భావాలను యుగళగీత రూపంలో పంచుకుంటారు. పాట ప్రారంభానికి ముందు నాయికా నాయకులులోని రొమాంటిక్ మూడ్ ఎస్టాబ్లిష్ చేసేవిధంగా ఘంటసాలగారు ఒక అద్భుతమైన మ్యూజికల్ నోట్ ను సితార్, కోంబోఆర్గన్, యూనివాక్స్, ట్యూబోఫోన్, వయొలిన్స్ కాంబినేషన్ తో  కంపోజ్ చేశారు.  ఆ తర్వాత సౌదామిని రాగ స్వరాలతో మృదుమధురంగా, సున్నితంగా నాయికానాయకుల ఊహల గుసగుసలు శ్రోతలను పరవశింపజేస్తాయి.

ఈ పాటలో ఘంటసాలగారు కొంచెం హెవీ ఆర్కెస్ట్రా నే ఉపయోగించారు. సితార్, గిటార్, మేండొలిన్, సాక్సోఫోన్, సింథసైజర్, యూనివాక్స్, ట్యూబోఫోన్, ఫ్లూట్, క్లారినెట్, వయొలిన్స్, పియోనా,  తబలా, డోలక్, కబాష్, చిటికెలు( వ్రేళ్ళతో వేసే చిటికెలు కాదు.. రెండు చిన్న పల్చటి కర్రపలకలు వ్రేళ్ళమధ్య పెట్టిన వాయించే వాద్యం) ఈ పాటలో వినిపిస్తాయి.

1956లో నిర్మాత గా సుందర్లాల్ నహతాగారి మొదటి తెలుగు చిత్రం 'జయంమనదే' ఒక జానపదం. తర్వాత 1963 లో తీసిన తమ 9వ చిత్రం 'బందిపోటు' కూడా జానపదమే. ఈ రెండూ రాబిన్ హుడ్ కథ ప్రేరణగా తీసినవే. మంత్రాలు, తంత్రాలు, మాంత్రీకులు, భూతాలు, దెయ్యాలు, కామినీ పిశాచములు లేని సినీమా. ఒక ప్రజానాయకుడి సాహసం వీరోచిత కార్యకలాపాలతో నిండిన సినిమాలు. ఈ రెండింటిలోను హీరో ఎన్.టి.ఆరే.

సుందర్లాల్ నహతా రాజశ్రీ/శ్రీ/రాజ్యలక్ష్మీ సంస్థలు ఆస్థాన సంగీత దర్శకుడిగా ఘంటసాల 11 సినిమాలకు (10 తెలుగు, 1 కన్నడం) నిరాటంకంగా సంగీత దర్శకత్వం నిర్వహించారు. ఆ సంస్థకు  ఘంటసాలగారు సంగీతం చేసిన ఆఖరు సినిమా గుడిగంటలు.

బందిపోటు సినిమా ను తెలుగు, కన్నడ భాషల్లో  (క్లైమాక్స్ సన్నివేశాలను రంగుల్లో) భారీఎత్తున నిర్మించారు.  తెలుగులో ఎన్.టి.ఆర్., కృష్ణకుమారి. కన్నడంలో రాజ్ కుమార్, లీలావతి లు ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ రెండు చిత్రాలకు దర్శకత్వం బి.విఠలాచార్యగారే. ఎన్.టి.ఆర్., ఘంటసాల, విఠలాచార్య కాంబినేషన్ లో వచ్చిన మొట్టమొదటి చిత్రం. విఠలాచార్య బాణికి, నిర్మాణ శైలికి భిన్నంగా తీయబడిన సినిమా బందిపోటు. ఎన్.టి.ఆర్., విఠలాచార్యగార్ల కాంబినేషన్ విషయంలో నిర్మాత సుందర్ లాల్ గారి అంచనాలు అత్యంత విజయవంతమై బందిపోటు అనేక కేంద్రాల్లో శతదినోత్సవాలు జరుపుకుంది.

ఇక ఘంటసాల, విఠలాచార్య కలిసి మూడు సినిమాలకు పనిచేశారు. మూడూ జానపదాలే. మూడింట హీరో ఎన్.టి.ఆరే. సంగీతం విషయంలో దర్శకుడు, సంగీతదర్శకుడు పరస్పర వైరుధ్యం. ఒకరికి పాటల్లో వేగం, హోరు, జోరు, శబ్దం ప్రధానం. మరొకరికి లాలిత్యం, భావం, సన్నివేశం, సందర్భం ప్రధానం. వీటన్నింటినీ సమన్వయ పర్చుకుంటూ మనోరంజకము, జనరంజకము అయిన సంగీతాన్ని బందిపోటు చిత్రానికి సమకూర్చారు ఘంటసాల.

బందిపోటు సినిమాలో మొత్తం ఏడు పాటల్లో నాలుగు పాటలు నారాయణరెడ్డి, ఆరుద్ర, దాశరథి, కొసరాజు చెరో ఒకటి వ్రాశారు. ఏడు పాటలు సంగీతపరంగా, సాహిత్యపరంగా  వైవిధ్యం గల పాటలే. వాటిని ఘంటసాల, లీల, సుశీల పాడారు. ఇందులోని సెమి క్లాసికల్ డాన్స్ సాంగ్ ను కొసరాజు గారు,  క్లైమాక్స్ లోని విప్లవ భావాలు గల థీమ్ సాంగ్ ను దాశరథి వ్రాయడం ఒక విశేషం. ఛేజింగ్ లు, కత్తియుద్ధాలు పుష్కలంగా గల జానపదచిత్రం కావడంవలన రీరికార్డింగ్ మ్యూజిక్ ను కూడా భారీఎత్తునే చేశారు ఘంటసాల.

బందిపోటు కన్నడ వెర్షన్ కు కూడా ఘంటసాల గారే సంగీతం నిర్వహించారు. తెలుగు వరసలే కన్నడంలో కూడా వినిపిస్తాయి. వాటిని కూడా ఘంటసాల, సుశీల, లీల పాడారు.

నేటి మన సజీవరాగం పాట 'ఊహాలు గుసగుసలాడే..' తెలుగు, కన్నడ భాషల్లో విపరీతమైన జనాదరణ పొంది ఈనాటికీ సూపర్ హిట్ సాంగ్ గా సంగీతాభిమానులను అలరిస్తోంది. జానపద చిత్రాలలో ఒక విలక్షణ చిత్రంగా 'బందిపోటు' ఎప్పటికీ నిలచిపోతుంది.



Link for ఘంటసాలగారి భగవద్గీత శ్లోకం - సంగీతరావుగారి సౌదామిని రాగ విశ్లేషణ

https://youtu.be/iBomEE_sIGU

కొసమెరుపు:

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే గత ఆరు దశాబ్దాలుగా సంగీతాభిమానులంతా ఎంతో మక్కువతో పాడుకుంటున్న "ఊహలు గుసగుసలాడే..." పాట బందిపోటు సినిమా డైరెక్టర్ బి.విఠలాచార్యగారికి నచ్చలేదట. కారణం పాటలో స్పీడ్ లేదు, చాలా స్లో గా వుంది, ట్యూన్ మార్చమని ఒత్తిడి తెచ్చారట. తర్వాత ఘంటసాల గారు విఠలాచార్యగారితో  సాంగ్ సిట్యువేషన్ గురించి పెర్సనల్ గా మాట్లాడి  సినిమాలో ఈ పాటే హైలైట్ అవుతుందని నచ్చజెప్పిన పిమ్మట విఠలాచార్యగారు అన్యమనస్కంగా ఈ ట్యూన్ ఓకే చేసారట. ఉత్తర దక్షిణ ధృవాలు.

 

వచ్చేవారం ఘంటసాల వారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్


No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 35 - ఊహలు గుసగుసలాడే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను...