Saturday, 25 July 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 25 - భక్త రఘునాథ్ – జయమురళీలోలా...

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"




ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 25

భక్త రఘునాథ్ – జయమురళీలోలా...

భారతీయుల ఆధ్యాత్మిక చింతనకు, కళా సంస్కృతికి దర్పణాలు మన ప్రాచీన దేవాలయాలు. విజ్ఞాన వికాసాలను అందించిన విద్యాలయాలు. శిల్ప, సంగీత, నృత్యాది కళలు మన దేవాలయాల నుండే అభివృద్ధి చెందాయి. భారతీయ దేవాలయ సంస్కృతి 12 వ శతాబ్దం నాటికే దక్షిణాసియా దేశాల వరకు  వ్యాపించింది. 

ప్రాచీన కాలంలో ఆలయాల్లోని దేవుని పూజా విధానంలో భాగంగా దేవుని సేవ కోసమై కొంతమంది  స్త్రీలు భగవంతుని పరంగా నృత్యాలు చేసేవారు. వారిని దేవదాసీలనేవారు. వంశపారంపర్యంగా వారు దేవుని సేవ కోసమే అంకితమైపోయినవారు. ఈ దేవదాసీ నృత్యాలు కాలక్రమేణా  ఈనాడు మనం చూస్తున్న శాస్త్రీయ నృత్యాలుగా పురోభివృద్ధి చెందాయి.

తమిళనాడుకు చెందిన భరతనాట్యం, ఆంధ్రపదేశ్ కు చెందిన కూచిపూడి, ఒరియాకు చెందిన    ఒడిస్సీ, కేరళకు చెందిన మోహినియాట్టం, కర్ణాటక యక్షగానం, అస్సాం సత్త్రియ నాట్యం మొదలైనవన్నీ దేవాలయాల వరప్రసాదమే.

గత మూడు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచమంతా ఎన్నో మార్పులు వచ్చాయి. ఆధునీకరణ, నవీనత్వంపేరిట అన్ని రంగాలలో విస్తృతమైన మార్పులు వచ్చాయి. ఆ  మార్పు శాస్త్రీయ సంగీత, నృత్యరంగాలలో కూడా బాగా కనిపిస్తుంది. సామాన్య ప్రజానీకాన్ని ఆకర్షించడం కోసం  చేపడుతున్న కొత్త ప్రక్రియలు ఎన్నో.  ఇందువలన  ఈనాటి సంగీత నృత్య కళలలో మన ప్రాచీన శాస్త్రీయ దృక్పథం కొరవడుతున్నదనే భావన కలుగుతున్నది . ఇది మంచికా, చెడుకా అనేది కాలమే నిర్ణయిస్తుంది.

ఈనాటి మన సజీవరాగం గత తరం సంగీతాభిమానులు మెచ్చిన ఒక పాతకాలపు సినిమాలోని శాస్త్రీయ నృత్య గీతం... అదే మన ఘంటసాలవారి స్వంత చిత్రం భక్తరఘునాథ్ లోని 'జయ మురళీలోల గోపాలా ...'


జయ మురళీ లోల గోపాలా - 2

మా ఎద మురిపాల జ్యోతుల చేసి

ప్రియమున కొలిచేము నిలిచేము స్వామి 

                                                !జయ!

 

మదవతులా మది దోచిన రాగీ

మౌనుల హృదయాల భాసించు యోగీ

కాళీయ ఫణిజాల తాండవలోలా

గైకొను మానంద  నీరాజనాలా 

                                                !జయ!

సాధారణంగా మన సినిమాలలోని శాస్త్రీయ నృత్యగీతాలు... దేవుని పరంగా కావచ్చు లేదా రాజు మహరాజుల పరంగా కావచ్చు, అవి శృంగార తత్త్వంతో నిండివుంటాయి. కానీ, ఈ నర్తకి మా త్రం కేవలం కృష్ణస్వామి నామ సంకీర్తనంతో  నృత్యం చేస్తూ  తన భక్తిప్రపత్తులు తెలియజేస్తోంది. సంకీర్తనం ద్వారా నర్తకి, శ్రవణం ద్వారా ఆలయంలోని భక్తులు దేవుని సేవించుకుంటున్నారు.

భక్త రఘునాథ్ సినీమాలో ఒక ఆలయ నృత్య సన్నివేశంకోసం  శ్రీ సముద్రాల రాఘవాచార్యులువారు వ్రాసిన చిన్నగీతం ఇది.  సాహి త్యందృష్ట్యా కేవలం ఒక చిన్న పల్లవి రెండేరెండు చరణాలతో ముగించారు. సముద్రాల వారు ఆరితేరిన శ్రీవైష్ణవ  కవి అయినా క్లిష్టమైన 'మదవతుల మది  దోచిన రాగి; మౌనుల హృదయాల భాసించు  యోగి అని శ్రీకృష్ణుని  సంబోధించడంలో సముద్రాలవారి కవితా శైలి స్పష్టమవుతుంది. సంగీత సాహిత్య నృత్య సమన్విత గీతంలో  సాహిత్యం ఎంతవరకు వుండాలో అంతవరకే ఉపయోగించుకున్నారు దర్శక రచయిత సముద్రాల. సన్నివేశానికి అనుగుణ్యమైన సంగీత నృత్యాలను సమకూర్చే  భాధ్యతను సంగీత దర్శకుడు ఘంటసాల, నృత్య దర్శకుడు వెంపటి పెద సత్యంకు  వదిలేశారు. సంస్కృత సమాసాల జోలికి పోకుండా సరళమైన చిన్న చిన్న పదాలనే సమర్థవంతంగా వాడారు.

ఘంటసాల మాస్టారు ఈ నృత్య గీతాన్ని శ్రీరంజని రాగంలో మలచారు. కర్ణాటక సంగీతంలో 22 వ మేళకర్త  ఖరహరప్రియకు జన్యరాగం. ఆరోహణ అవరోహణ క్రమంలో ఆరు స్వరాలు మాత్రమే వుండే షాఢవ రాగం. పంచమ స్వరం వుండదు. శృంగార భక్తి రసాలను వెల్లడించడానికి చాలా అనువైన రాగం శ్రీరంజని. అందుకే మాస్టారు ఈ రాగంలో ఈ నృత్య గీతాన్ని చేయడానికి సంకల్పించారు.  కర్ణాటక సంగీతంలో మంచి అనుభవం గల ఎ.పి.కోమలగారితో  ఈ పాటను పాడించారు పాటలో వచ్చే చిన్నచిన్న ఆలాపనలు, స్వరకల్పనలు, గమకాలు, సంగతులు అన్నీ కోమల గళంలో సలక్షణంగా పలికి శ్రోతలను రంజింపజేశాయి. మృదంగం, మోర్సింగ్ ల తాళగతులతో ఆరంభమయ్యే ఈ నృత్య గీతంలో ప్రధాన వాద్యంగా వీణను ఎన్నుకున్నారు ఘంటసాల గారు. రికార్డింగ్ లో ఈ పాటకు వీణను వాయించిన సంగీతరావుగారే తెరపై కూడా వీణ వాయిస్తూ కనపడడం ఒక విశేషం. శాస్త్రీయ సంగీతం నేర్చుకునే విద్యార్థులకు అభ్యాస గీతంగా ఘంటసాలగారు కర్నాటక సంగీత శాస్త్ర మర్యాదలననుసరించి స్వరపర్చిన అనేక గీతాలను నేర్పడం ఎంతైనా సముచితమని శ్రీ సంగీతరావుగారి నిశ్చితాభిప్రాయం. అటువంటి గీతాలలో శాస్త్రీయత ఉట్టిపడే ఈ 'జయమురళీలోలా' ఒకటి. 

భక్తరఘునాథ్ సినిమాకు వెంపటి పెదసత్యం, చిన్నిలాల్, సంపత్ లాల్ లు నృత్య దర్శకులుగా  వ్యవహరించారు. ఈ శాస్త్రీయ నృత్య గీతాన్ని మాత్రం వెంపటి వారే రూపొందించారు.  అప్పుడే  సినీమా రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన నర్తకి  సోదరీమణులు స్వర్ణ, మణిలలో స్వర్ణ చేత ఈ నృత్యాన్ని చేయించి ఆ కొత్త నటికి ప్రోత్సాహాన్ని అందించారు ఘంటసాల. ఆ నాటి ఆ మణియే తర్వాతి కాలంలో గీతాంజలిగా బహు భాషా చిత్ర నటిగా ప్రఖ్యాతి చెందారు.

సంగీతభరిత భక్తి చిత్రంగా ఘంటసాలగారు నిర్మించిన భక్తరఘునాథ్ ఈనాడు సినీమాగా  గాని వీడియోగా గాని మనకు అందుబాటులో లేకపోవడం చాలా విచారకరం.


వచ్చే వారం, ఘంటసాలవారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్ 

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 25 - భక్త రఘునాథ్ – జయమురళీలోలా...

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...