Saturday, 1 August 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 26 - పెళ్ళిసందడి – రావే ప్రేమలతా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"




ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 26


పెళ్ళిసందడి – రావే ప్రేమలతా ...


గతమొక చరిత్ర, తిరిగిరానిదిభవిష్యత్ ఎవరూ చెప్పలేరు, మన చేతిలో లేనిదివర్తమానమే మనది; ఈ క్షణమే శాశ్వతం. అందుచేత భూత భవిష్యత్ కాలాల గురించి ఆలోచించక మనకున్న ఈ కొద్ది క్షణాలు  సద్వినియోగం చేసుకుని జీవితాన్ని  సార్ధకపర్చుకోవాలి. ఇది వేదాంత సూక్తి. పరిమిత జ్జానంతో ఈ సూక్తిని ఎవరికివారు  తమకు కావలసినరీతిలో అన్వయించుకుని ఆచరిస్తున్నారు. ముక్తి సాధన కోసం కొందరైతేజ్ఞాన సముపార్జనకోసం కొందరు; ధనార్జన, పదవులు, అధికారాల కోసం; మదిర మగువల కోసం మరికొందరు అమూల్యమైన ఈ క్షణాన్ని(వర్తమానం) వినియోగించుకుంటున్నారు.

కానీ, ఇక్కడ, ఓ భావుకుడైన యువకుడు  మాత్రం తనకున్న కొద్ది క్షణాలను  తన ప్రియురాలి సమక్షంలో ఈ ప్రపంచాన్నే మరచి మధురాతిమధురంగా ఆనందమయం చేసుకోవాలని భావిస్తున్నాడు. ప్రేమించిన యువతిని ప్రేమలతగా, మనసులోని భావాల కవితగా తన చెంతకు ఆహ్వానిస్తున్నాడు...

పద్యం:

ఆహా చూపుల తీపితో కొసరుచున్ దరిజేరి మనోజ్ఞగీతికా

లాపనసేయు  కూర్మి  జవరాలోకవైపు మరొక్క వైపునన్

ఈ పసి కమ్మతెమ్మెరలు  ఈ పువుదోటల శోభలున్నచో

రేపటి ఆశ నిన్న వేతలేటికి నేటి సుఖాల తేలుమా! ఆ....ఆ....

యుగళగీతం:

అతడు: 

రావే ప్రేమలతా నీవే నా కవితా 

కిన్నెర మీటుల కిలకిలవే  

పలు వన్నెల మెరపుల మిలమిలవే

ఆమె:

ఓహో కవిరాజా నేడే నెలరాజా 

ఎందులకోయీ  పరవశము 

నీకెందులకోయీ కలవరము

అ: 

పూవులలో  నును తీవెలలో 

ఏ తావున  నీవే  వనరాణీ -2

ఆ: 

అందవతి కనిపించినచో 

కవులందరి  చందమిదేలే ! ఓహో!

అ: 

పరువులిడే  సెలయేరువలే  

నిను చేరగ కోరును నా మనసూ

ఆ: 

ఊహలతో  ఉలికించకుమా 

నవమోహన ఈ చెలి మదినే


అ: రావే ప్రేమలతా నీవే నా కవితా


ఆ: 

ముచ్చటగా  మనముండినచో 

మన మచ్చికకు  జగమేమనునో

అ: 

లోకముతో  మనకేమి పనీ 

మనసేకమయీ మనముంటే

ఆ: 

నేనే నీ కవితా

అ: రావే ప్రేమలతా ....

ఇద్దరూ కలసి : హమ్మింగ్...


హేమలత, స్వర్ణలత, సుమలత, ప్రేమలత, తనూలత ... యివన్నీ  యవ్వనంలో వున్న అందమైన యువతులకు పర్యాయ పదాలు, విశేషణాలు. అందుకే భావకుడైన కథానాయకుడు తన ప్రేయసిని 'ప్రేమలతా' అని సంబోధిస్తూ పూవులలో, నును తీవెలలో నిండిన వనరాణి యని వర్ణిస్తున్నాడు. అందుకు ఆ అమ్మాయి ఏమీ ఉబ్బి తబ్బిబ్బు అవలేదు. తనలాటి ' అందవతి'  కనిపిస్తే  కవులందరి తీరు ఇంతేనని ఎత్తిపోడుస్తోంది.  తన అందంమీద ఎంతవిశ్వాసం లేకపోతే తనను తానే 'అందవతి' అని పొగుడుకుంటుంది!  అంతలోనే ఆమెకు చిన్న భయం...  తమ అన్యోన్య స్నేహానికి లోకం ఏమనుకుంటుందోనని. 'మన మనసులు కలిసినపుడు లోకంతో ఏం పని అని అతని భరోసా. ఇలా ఈప్రేమ పక్షులు సుందరనందనోద్యానంలోకువకువలాడుతూ చూడముచ్చట గొలుపుతాయి.

ఈ చక్కటి యుగళగీతాన్ని జూనియర్ సముద్రాల (రామానుజం) గారు  1959లో వచ్చిన పెళ్ళిసందడి  సినీమా కోసం వ్రాశారు. ఘంటసాలగారు సంగీతం చేసిన సినీమాలలో పాటకు ముందు చిన్న సాకీయో లేక పద్యమో వుండడం ఆనవాయితీ. అలాగే ఈ పాటకు ముందు కూడా చందోబద్ధంగా ఒక మనోజ్ఞమైన పద్యాన్ని పెట్టారు రామానుజంగారు.

ఇంత  ముచ్చటైన ప్రేమ గీతంలో, బహుశా పారవశ్యంలో కాబోలు, దొర్లిన ' అందవతి' పదప్రయోగం ఆనాటి కొంతమంది తెలుగుభాషా ప్రియులకు పంటి క్రింద రాయిలా, కంటిలో నలుసులా ఇబ్బందిపెట్టింది. ఈ మాట తెలుగు నిఘంటువులలో కనపడదు.   సినీమా పాట కదా అలాగే వుంటుంది మరి అని అన్నవాళ్లు ఉన్నారు .

19-20  శతాబ్దాలకు చెందిన ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ ఒక సుప్రసిద్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు. ఈనాటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మైహార్ సంస్థాన ఆస్థాన విద్వాంసుడు.  సరోద్, వయొలిన్, పక్వాజ్, మృదంగం  వంటి వాద్యాలలో, పాశ్చాత్య సంగీతంలో నిష్ణాతుడు. సంగీతమంటే గాత్ర సంగీతమే సంగీతమని భావిస్తున్న రోజులలో వాద్య సంగీతానికి కూడా అంతటి ప్రాశస్త్యాన్ని తెచ్చిపెట్టిన గొప్ప కళాకారుడు అల్లావుద్దీన్ ఖాన్. పద్మవిభూషణ్ బిరుదు గ్రహీత. కుమార్తె అన్నపూర్ణాదేవి, పండిట్ రవిశంకర్, నిఖిల్ బెనర్జీ, పన్నాలాల్ ఘోష్, వి.జి.జోగ్ వంటి అంతర్జాతీయ కళాకారులంతా అల్లాఉద్దీన్ ఖాన్ శిష్యులే.

అంతటి లబ్దప్రతిష్టుడైన అల్లావుద్దీన్ ఖాన్ చే ప్రచుర్యంలోనికి తీసుకురాబడిన రాగమే హేమంత్. బిలావల్ థాట్ కు చెందిన ఔఢవ  సంపూర్ణరాగం.  అంటే ఆరోహణలో ఐదు స్వరాలు, అవరోహణ లో ఏడు స్వరాలు వుంటాయి. ఆరోహణ క్రమంలో లేని రిషభ పంచమ స్వరాలు అవరోహణ లో వుంటాయి.   కౌశికధ్వని  అనే రాగానికి అదనంగా కొన్ని స్వరాలు చేర్చి హేమంత్  అనే కొత్త రాగాన్ని అల్లావుద్దీన్ ఖాన్  తయారుచేశారు. హేమంత ఋతువంత  ఆహ్లాదకరమైన రాగం హేమంత్.

మనసుకు ప్రశాంతిని చేకూర్చే రాగం. అటువంటి హేమంత్  రాగ స్వరాలతో ఈనాటి ఘంటసాల సజీవరాగం ... ' రానే ప్రేమలతా  నీవే నా కవితా' యుగళగీతం రూపొందించబడింది.

తెలుగు చిత్రసీమ తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతిగారు. అలాగే, ఆలిండియా రేడియో తొలి లలితసంగీత గాయని కూడా ఆవిడే. ఆ తర్వాతే ఘంటసాలగారి రంగప్రవేశం. ఘంటసాలగారు సంగీతదర్శకుడైన తర్వాత బాలసరస్వతిగారితో ఎన్నో పాటలు పాడారు పాడించారు. ఆ ఇద్దరు కలసి పాడిన యుగళ గీతమే మన ఈనాటి సజీవరాగం. సరళమైన శ్రావ్యమైన గీతాలు పాడడంలో ఒకరిని మించినవారు మరొకరు. వీరి గాత్ర మాధుర్యంతో 'రావే ప్రేమలతా' పాట పెళ్లిసందడి సినిమాకు గొప్ప పెన్నిధి అయింది. ఈ పాటకు మరో పెద్ద ఆకర్షణ ఘంటసాలగారు సమకూర్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎందుకనో చిన్నప్పుడు నేర్చుకున్న జంటస్వరాలు, అలంకారాలు గుర్తుకు వస్తాయి.  ఓ పదిమంది హేమంత్ రాగంలో అలంకారాలు పాడినా వాయించినా ఇలాగే వుంటుందని ఒక ఊహ.  ఒక చిన్న మాండోలిన్ బిట్ తో పాట పల్లవి ప్రారంభమవుతుంది. పల్లవి తర్వాత, చరణాలు తర్వాత వచ్చే బిజిఎమ్స్  మనసుకు హాయిని కలిగిస్తాయి.  చరణం చరణానికి మార్పు లేకుండా పాటంతటికి ఒకే బిజిఎమ్ ను ఉపయోగించడం వలన పాట శాశ్వతంగా గుర్తుండిపోతుంది. 

ఘంటసాలగారు ఈ పాట కోసం మేండోలిన్, యూనివోక్స్ (క్లేవయొలిన్), వయొలిన్, పియానో, ఫ్లూట్, క్లారినెట్, డబుల్ బేస్, డ్రమ్స్, తబలా, చిటికెలు, బ్రషెస్ వంటి వాద్యాలను ఉపయోగించారు.   పాటకు ముందు కేవలం ఒక తంబురా శ్రుతితో ఘంటసాల గారు పాడిన  పద్యం ఈ సన్నివేశానికి గొప్ప హైలెట్.

తెలుగు సినిమా సంగీత స్వర్ణయుగంలో నీవే నేను,  నేనే నీవు అన్నట్లుగా మమేకమైపోయిన  అక్కినేని, ఘంటసాల ల కాంబినేషన్లో వచ్చిన అద్భుతగీతం 'రావే ప్రేమలతా ... నీవే నాకవితా...' . ఏదో డామ్ పరిసరాల్లో సుందర ప్రకృతి దృశ్యాలతో నిండిన  ఉద్యానవనంలో  ఎ.ఎన్.ఆర్., అంజలీదేవిల మీద చిత్రీకరించబడిన చక్కటి హుషారైన యుగళగీతం.

రిపబ్లిక్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బి.ఎ.సీతారాం నిర్మించిన మొదటి చిత్రం పెళ్లిసందడి. డి.యోగానంద్ డైరక్షన్లో వచ్చిన ఈ సినీమా హీరో, హీరోయిన్ లు అక్కినేని, అంజలీదేవి కాగా యితర పాత్రలలో బి.సరోజాదేవి, చలం, గుమ్మడి, రమణారెడ్డి, డా.శివరామకృష్ణయ్య, మొదలగువారు నటించారు.

ఘంటసాల గారి సంగీతంలో ఎన్నో మంచి పాటలతో నిండిన పెళ్లిసందడి ప్రేక్షకులలో మంచి సందడి నే సృష్టించి మంచి విజయాన్ని పొందింది.


వచ్చే వారం ఘంటసాల గారి మరో సజీవరాగంతో మరల  కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్ 

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 26 - పెళ్ళిసందడి – రావే ప్రేమలతా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...