Saturday, 15 August 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 28 - శబాష్ రాజా – అందాల రాణివై ఆడుమా

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 28


శబాష్ రాజా – అందాల రాణివై ఆడుమా


"రాధా!  నువ్వు వింటున్న పాట ఏమిటి?  చేస్తున్న అభినయం ఏమిటి? అభిసారికా లక్షణాలు ఇలాగేనా చూపించేది" ఓ శంకరశాస్త్రి గారి గాండ్రింపు. "ఒరేయ్! ఒరేయ్! ఏమిట్రా నువ్వు నేర్పిస్తున్నది! పట్టుమని పదేళ్లైనా  లేని ఈ పిల్లలకి అప్పుడే అష్టవిధనాయికలేమిట్రా అప్రాచ్యుడా!"  ఓ పూర్ణానందం గారి గగ్గోలు.  "రోజులు మారిపోయాయి... ఇది ఫాస్ట్ యుగం. అంతా స్పీడే. వాళ్లకన్నీ తెలుసు. ఏమి తెలియనిది నీకే, ఇక నువ్వేం మాట్లాడకు".

"శకుంతలా! ఏదీ నువ్వు విరహోత్కంఠిత నాయికా లక్షణాలు చేసి చూపించు". మనవడు  నేర్పే ముప్పైరోజుల నాట్యాభ్యాస విధానానికి పూర్ణనందంగారు తలపట్టుకు కూర్చున్నాడు... ఆలోచనలు ఎటో  మళ్లాయి.

అభిసారిక.... విరహోత్కంఠిత... ఇవి  యవ్వనదశలో, ముఖ్యంగా ప్రేమానుభవం  కలిగిన స్త్రీ యొక్క మానసికావస్థలుగా నాట్యశాస్త్రంలో వర్ణించబడ్డాయి. సుమారు రెండు వేల రెండు వందల సంవత్సరాల క్రితం ప్రాచీన భారతదేశానికి చెందిన భరతముని అనే యోగి నాట్య శాస్త్రాన్ని సంస్కృతంలో వ్రాశాడు. ఈనాడు మనం చూస్తున్న వివిధ రీతుల భారతీయ నాట్యాలకు, నాటకాలకు ప్రామాణికం ఈ భరతముని నాట్య శాస్త్రము.  ఒక్క నాట్యాన్నే కాక సంగీత, సాహిత్య, చిత్ర, శిల్పకళలను కూడా ప్రభావితం చేసిన శాస్త్రం. యౌవ్వనదశలో వున్న స్త్రీ మానసికావస్థలను ఎనిమిది విధాలుగా విభజించి వాటిని అష్ట విధనాయికలని అన్నారు. అవి ...

స్వాధీనపతిక, వాసకసజ్జిక, విరహోత్కంఠిత, అభిసారిక, విప్రలబ్ధ, ఖండిత,  కలహంతరిత, ప్రొషితభభర్తృక.  ఈ అష్టవిధనాయికల లక్ష్య లక్షణాలు, అవస్థలు మనకు  అన్నమయ్య, క్షేత్రయ్య పదాలలో, జయదేవుని గీతగోవిందంలో రాధాకృష్ణుల పరంగా వర్ణించడం జరిగింది.  మన కళలన్నింటి ప్రధానోద్దేశం వినోదం. దీనితోపాటు రస పోషణ. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని నాట్యాచార్యుడు తనశిక్షణను చేపట్టాలని శాస్త్రం బోధిస్తుంది. ఎంతో ప్రాచీనమూ,  సంప్రదాయబద్దమూ అయిన నాట్యశాస్త్రాన్ని నియమ నిష్టలతో బోధించే ఆచార్యులు, దానిని శ్రద్ధా భక్తులతో ఏళ్ల తరబడి కష్టపడి సాధన చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నర్తకులు దేశవ్యాప్తంగా ఎందరోవున్నారు.

తెలుగు సినీమా అవిర్భావ కాలం నుండి సినీమాలలో నృత్యం అనేది  తప్పనిసరి అంశంగా మారింది. సినీమా వినోదప్రధాన మాధ్యమం కావడం వలన ప్రేక్షకులను రంజింపజేయడానికి సినీమాలలో నృత్యాలు ఒక భాగమైపోయింది.  సంప్రదాయసిద్ధమైన మన భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, కథకళి  వంటి నృత్య శైలులలో నిష్ణాతులైన ఎందరో ఆచార్యులు సినీమా రంగంలో ప్రవేశించి సాంస్కృతిక రంగానికి ఎంతో సేవచేస్తూవచ్చారు. మన తెలుగుసినిమాకు సంబంధించినంత వరకు వేదాంతం రాఘవయ్య, వెంపటి పెదసత్యం,  చిన సత్యం, పసుమర్తి, శేషు, చిన్ని సంపత్ వంటి వారు శాస్త్రీయ మర్యాదలను అనుసరించి చక్కటి నృత్యాలును రూపొందించారు. ప్రముఖ నాట్యాచార్యుడు శ్రీ పసుమర్తి కృష్ణమూర్తి నేతృత్వంలో రూపొందిన ఓ నృత్య గీతమే ఈనాటి మన ఘంటసాల సజీవరాగం.

పసుమర్తి గా ప్రఖ్యాతిగాంచిన శ్రీ పసుమర్తి కృష్ణమూర్తిగారు తన మేనమామ, కూచిపూడి నాట్యకళకు ఎనలేని  సేవలందించిన సుప్రసిద్ధ నాట్యాచార్యుడు అయిన శ్రీ చింతాకృష్ణమూర్తిగారి వద్ద నాట్యాన్ని సంప్రదాయబద్ధంగా అభ్యసించారు. సినీమా రంగానికి రాకముందు వేదాంతం రాఘవయ్య, వెంపటి పెదసత్యంలతో కలసి అనేక నాట్య ప్రదర్శనలిచ్చారు. 1946 లో సినీరంగప్రవేశం చేసి తులసీదాసు అనే సినిమాలో ఒక నృత్య నాటికను రూపొందించారు. తర్వాత, వాహినీ విజయా సంస్థల ఆస్థాన నాట్యాచార్యుడిగా మంచిపేరు ప్రఖ్యాతులు సంపాదించి దాదాపు  ఐదు దశాబ్దాలపాటు వివిధ భాషలలో 500కు పైగా సినీమాలకు నృత్యదర్శకత్వం వహించారు.

ఈనాటి ఘంటసాల సజీవరాగంలో మనం చూడబోయే నృత్యగీతం 'శభాష్ రాజా' సినీమా కోసం  చేసినది. కథక్ నృత్య రీతిలో సాగే ఈ నృత్య గీతం ఆరుద్ర (గీత రచయిత), ఘంటసాల (స్వరకర్త), ఘంటసాల, పి.లీల (నేపథ్యగానం), రాజసులోచన (నర్తకి), ఉడిపి లక్ష్మీనారాయణన్ (నాట్యాచార్యుడు), పి.ఎస్.రామకృష్ణా రావు(భరణీ పిక్చర్స్ అధినేత) (చిత్ర దర్శకుడు). వీరి సమిష్టికృషి ఈ నృత్యగీతం.

ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదురైనా లెఖ్ఖ చేయకుండా ముందుగా నిర్ణయించుకున్న రహస్యస్థలంలో తన ప్రియుని కలుసుకోవడానికి వెళ్లే వనిత 'అభిసారిక'.    మనసారా వలచిన ప్రియుడు లేక భర్త యొక్క పరిపూర్ణ ప్రేమానురాగాలను స్వంతం చేసుకొని తనకు అనుకూలముగా చేసుకునే నాయిక  'స్వాధీనపతిక'.

'అభిసారిక', 'స్వాధీనపతిక' ల మనోభావాలతో పాటు, కారుమబ్బులను చూసి ఆనందించే మయూరి, వేటగానిని చూసి భయపడే లేడి - వీటి ఆనంద భయాందోళనలను కూడా ఏకకాలంలో అభినయించి చూపించమని గురువుగారు తన శిష్యురాలిని ఆదేశిస్తున్నారు. మరి ఆ నృత్య విశేషాలు మనమూ చూసి ఆనందిద్దామా!

నాట్యాచార్యుడు, నర్తకి ల యుగయుగళగీతం

రాగాలాపన 

నాట్యాచార్యుడు 

అందాల రాణివై ఆడుమా

అందాల రాణివై  ఆడుమా  !అందాల!

ఆనందపు విందులు చేయుమా

ఇ. !అందాల!

నా. 

ప్రియుని కలియగా  బీరబిర సాగే

వెలదిపేరు అభిసారికా - 


న. 

!ప్రియుని!

వలపులతో తన పతిని నిలుపుకొను

పడతి పేరు స్వాధీనపతికా - ఇ. !అందాల!

 

నా.  

నీటి మేఘమును  చూచిన నెమలీ

వేటకాని పరికించిన లేడీ! - న. !నీటి!

 

నా.  

హయీ భయమూ ఏకకాలమున

హవభావములు చూపుమా !అందాల!

 

నా. 

కాలి యందియలు  ఘల్లుఘల్లుమన

కరముల ముద్రలు గాధలు తెలుప

కన్నులతోనే కావ్యము పాడి

వన్నెచిన్నియలు  చిలుకుమా! అందాల!


ఉత్తరాది నృత్యశైలులు ప్రతిబింబించే ఈ సినిమా నృత్యగీతంలో ఆ సంప్రదాయాన్నే  అనుసరించి  చక్కటి ఆలాపనలు, సంగతులు, జతులతో కూడిన మనోరంజకగీతాన్ని సమకూర్చి ఘంటసాల  పి.లీలతో కలసి మధురాతిమధురంగా పోటీపడి ఆలపించారు.

ఘంటసాల మాస్టారు ఈ పాటను హమీర్ రాగంలో స్వరపర్చారు. హమీర్ రాగం కళ్యాణ్ థాట్ కు చెందిన వక్ర సంపూర్ణరాగం. వక్ర సంచారంతో ఆరోహణ అవరోహణ క్రమంలో ఏడు స్వరాలు పలుకుతాయి. చైతన్యవంతము, ఉత్సాహభరితమైన రాగం హమీర్.

కర్ణాటక సంగీతశైలిలో కూడా హమీర్ కళ్యాణి అనే రాగం ఒకటి వుంది. కానీ ఈ రెండూ ఒకటి కాదు. కర్ణాటక సంగీతంలోని హమీర్ కళ్యాణికి సమానమైన హిందుస్థానీ రాగం కేదార్ అని చెప్పుకోవచ్చు.  ఘంటసాలగారు చేసిన ఈ పాట మాత్రం హిందుస్థానీ బాణిలోని హమీర్ రాగమే. (రాగ వివరణ తెల్పిన శ్రీమతి కొచ్చెర్లకోట పద్మావతి గారికి ధన్యవాదాలు).

ఇదే వరసలో నౌషద్ ఆలి,  1960 లో వచ్చిన కోహినూర్ సినీమాలో 'మధుబన్ మె రాధికా' అనే ఒక హిందీ పాటను చేయగా మహమ్మద్ రఫీ పాడారు. ఈ పాట ' శభాష్ రాజా' సినిమా లోని తెలుగు పాటకు ఆధారమైనా  ఈ రెండు గీతాలకు మధ్యనున్న తేడాలు, వాద్యగోష్టితో సహా,  శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం వున్నవారందరికీ బాగానే తెలుస్తుంది.

అలాగే, పాట సాహిత్యం విషయంలో కూడా రెండు పాటల సాహిత్యం ఒకటి కాదు (హిందీ పాట సాహిత్యాన్ని అనువదించి తెల్పిన మిత్రులు జనాబ్ అమీర్ జాన్ షేక్ గారికి కృతజ్ఞతలు).

మంచి ఎక్కడున్నా స్వీకరించి అనుసరించడం అనుచితం కాదని  ఘంటసాల మాస్టారి అభిప్రాయం. పరభాషా చిత్రగీతాలను నిర్మాతల అభిష్టంమేరకు అనుసరించక తప్పని పరిస్థితులలో వాటిని మన ప్రాంతీయతకు తగినట్లుగా  తనదైన శైలికి మార్చి జనప్రియంగా మలచిన దిట్ట ఘంటసాలగారు. అలాటి ఒక హృద్యమైన గీతమే 'అందాలరాణివై ఆడుమా' గీతం.

ఘంటసాల మాస్టారు ఈ పాటకోసం సితార్, ఫ్లూట్జలతరంగిణిట్యూబోఫోన్, వయొలిన్స్, తబలా, ఫక్వాజ్, గజ్జెలు, తాంబోరిన్ వంటి వాద్యాలను ఉపయోగించినట్లు తెలుస్తున్నది.

సినిమా నృత్యాలు చేయడంలో మంచి అనుభవం కలిగిన నటి రాజసులోచన, కూచిపూడి, భరతనాట్య శైలి నృత్యాలలో కూడ శిక్షణ పొందివుండడం వలన ఈ కథక్ తరహా నృత్యాన్ని కూడా చాలా మనోజ్ఞంగా అభినయించారు. ఈ సన్నివేశంలో భరత నాట్యాచార్యుడు శ్రీ ఉడిపి లక్ష్మీనారాయణన్ నట్టువాంగం నిర్వహించి, మధ్యలో సితార్ కూడా వాయించి ఈ గీతానికి మంచి హుందాతనాన్ని కల్పించారు.

ఘంటసాలగారి సంగీతదర్శకత్వంలో వచ్చిన శభాష్ రాజా సినీమాలో  వున్న 12 పాటలను ఆరుద్ర, జూనియర్ సముద్రాల, కొసరాజులు రచించగా వాటిని ఘంటసాల, పి.లీల, పి.సుశీల, ఎస్.జానకి, జమునారాణి, మాధవపెద్ది పాడారు.

ఎన్నో ఉత్తమ చిత్రాలు నిర్మించి దర్శకత్వం వహించిన భరణీ పిక్చర్స్ అధీనేత శ్రీ పి.ఎస్.రామకృష్ణరావు శభాష్ రాజాకు  దర్శకత్వం వహించారు.  ఉదాత్త,  వినోదాత్మక సాంఘిక సినిమాలు తీయడంలో చక్కటి నైపుణ్యం గల దర్శకుడు రామకృష్ణ రావు.  




కొసమెరుపు-

ఎన్నో శతదినోత్సవ చిత్రాలనులాభసాటి సినిమాలను తీసిన సుందర్లాల్ తన సినిమాలకు ఐదు లక్షలు నష్టం వచ్చింది,  మూడు లక్షలు  నష్టం వచ్చింది అనేవారట. ఆయన లెఖ్ఖలో తనపెట్టుబడికి మించి  మంచి లాభాలు గడించినా తన అంచనాప్రకారం రావలసిన 10 లక్షలో 15 లక్షలో రాకపోతే అది ఆయన దృష్టిలో నష్టం క్రిందే జమ. ఎంతైనా మార్వాడీ బిడ్డ కదా! వాళ్ళ సక్సెస్ ఫార్ములాలు అలాగే వుంటాయి మరి. 


వచ్చే వారం ఘంటసాలగారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్


No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 28 - శబాష్ రాజా – అందాల రాణివై ఆడుమా

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద ...