అధ్యాయం - 2 - భాగం 29
టైగర్ రాముడు – ఆశ దురాశా వినాశానికే...
మనిషికి సానుకూల శక్తిని కలిగిస్తుంది. జీవితంలో గొప్ప లక్ష్యాలను
సాధించడానికి ఆశ ఎంతో తోడ్పడుతుంది. ఆశ వున్నచోట కృషి, సుఖసంతోషాలు వుంటాయి. ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం,
సమాజం, దేశం స్వయంసమృధ్ధి చెంది పురోగతి సాధించాలంటే
మనిషిలో ఆశ ఆవశ్యకమే. ఆ ఆశే మానవుడిలో మితిమీరితే దురాశగా మారుతుంది. ఆ
దురాశ వలన మనిషి అసంతృప్తికి లోనై ఈర్ష్యాద్వేషాలకు, కౄరత్వానికి దాసుడై సమాజానికి చీడపురుగులా అందరిచే
అసహ్యించ బడతాడు. జీవితమంతా దుఃఖమయమై చివరకు
పతనమవుతాడు. ఆశ దురాశగా మారితే అది వినాశానికే.
ఆశ ధర్మానికి , దురాశ అధర్మానికి
ప్రతీకలు. ఆశ వలన మనిషికి , సంఘానికి మంచి జరిగితే దురాశ వలన
అధర్మం పెరిగి కీడు జరుగుతుంది. మనిషి సజ్జనుడు కావడానికి , దుర్జనుడు కావడానికి తల్లితండ్రుల మనస్తత్త్వము, పెంపకమే ముఖ్య కారణమవుతుంది. తల్లిదండ్రులు రైలు
పట్టాలవంటివారు. రెండు పట్టాలలో ఏ ఒక్క పట్టా సరిగాలేకపోయినా రైలు బోల్తాకొట్టి
ప్రాణహాని కలుగుతుంది. అలాగే, తల్లిదండ్రులు లో ఏ ఒక్కరి నడత నియమబధ్ధంగా, క్రమశిక్షణతో లేకపోయినా దాని ప్రభావం పిల్లల మీద
పడుతుంది.
పిల్లల జీవనలతను పెంచి పోషించే తోటమాలి తల్లే... ఒక పూల తీగ పెరిగి ముందుకు సాగడానికి, కన్నులకింపైన, సుగంధభరిత పుష్పాలు పూయడానికి ఒక ఆధారం ఏలా అవసరమో అలాగే, పసి బిడ్డల జీవితమనే లత చిగురించి కుసుమించడానికి తల్లీ అనే ఆధారం ఎంతైనా కష్టపడుతుంది. పసి పాపడి మొదటి గురువు తల్లియే. మాట, నడక, ఆటా, పాటా అన్నీ అమ్మ దగ్గరే నేర్చుకుంటాడు. పిల్లల బంగారు భవిష్యత్తుకు తొలి సోపానం తల్లే. తల్లి బుద్ధులు, సంస్కారమే పిల్లలకు అబ్బుతుంది.
అటువంటి తల్లి దురాశాపరురాలు, కుత్సితబుద్ధి కలదైతే ఆమె సంతానం ఎలావుంటుంది? వారి బుద్ధులు ఎలా మారుతాయి? వారి భవిష్యత్ ఏమవుతుంది? జీవిత చరమాంకంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపపడితే మాత్రం ఏం ప్రయోజనం? తోటకూరనాడే చెప్పకపోతినే అని విలపిస్తే మాత్రం ఏం లాభం? మొక్కై వంగనిది మానై వంగుతుందా? జీవితాంతం కష్టాలను
అనుభవించవలసిందే.
ఆశా... దురాశా... వినాశానికే ...
'ఆశా దురాశా వినాశానికే ఏలా ప్రయసా
వృధా యాతనే !
నిరంతరం ధనమ్మని జపింతురే జనం
విరామమే ఎఱుంగక గడింతురే ధనం!
సమాధియౌ దినాన ఈ సిరి ప్రయోజనం?
తృణమ్మయిన నీవెంట రాదోయీ !తృణ! ఆశా!
చీకటిలో జనుల కనులు మూయగలవు గానీ
నేటికెటో దాగుకొని బయటపడిన గానీ
సర్వసాక్షి సన్నిధి నీసమాధానమేమీ?
గర్వపడకు నేరానికి శిక్ష తప్పదోయీ! ఆశా!
(పాట నిడివి కారణంగా ఈ చరణం గ్రామఫోను రికార్డులో తీసివేసినట్లున్నారు. ఈ చరణం ఆడియోలో లేదు)
తల్లీబిడ్డల వేరు జేసే కిరాతకుడా
నీవు సాధించే ఘనకార్యమేముందిరా
గుణం లేని తండ్రి కీనీడైనా మననీయదురా సుతుని సుఖానా
మార్చుకో నీమతం మార్చుకోరా! మమతా
మానవత్వం నేర్చుకోరా!
నీ బిడ్డకు నీ బాధ్యత నెరవేర్చుకోరా!
నీతిగా నీ బ్రతుకు కడతతర్చుకోరా ! నీ బ్రతుకు!
ఆశా దురాశా వినాశానికే ఏలా ప్రయాసా
వృధా యాతనే ! ఆశా!
కాజేసి పరుల సొమ్ము కనలేవు హాయి
కలదని ధర్శమందె నిజమైన హాయి
చేయుము ధర్మము దానమే పెన్నిధానము
నీ దానమె పెన్నిధానము
వేధించి పరులను కనలేని సౌఖ్యము
సాధించు మానవసేవలో విలపించువారి కన్నీరు తుడిచిన
వెలిగేను శాంతి నీలో! పశ్చాత్తాపు కన్నీరే నీపాపానికి పరిహారం
ఇది నీ జీవిత పరమావధికి సూటిగబోయే మార్గము
సాగుమా మును సాగుమా
ఫలమ్మేమి నేడిలా తలబాదుకోని విలపించీ
పిల్లల జీవనలత దిద్దే తోటమాలి తల్లే!
చిన్ననాడు చెడుత్రోవల పెంచిన
జీవితమింతలే
కన్నకడుపు చెరువై ఇల్లాలికి దూరమై
లోకానికి భారమై చెరలో నశించుటకేలే
వలదురా యీ ఘోర దండన ఏ తల్లికైనా! ఆశా!
1962లో వచ్చిన శ్రీ శ్రీనివాసా ప్రొడక్షన్స్ వారి
టైగర్ రాముడు చిత్రం లోని అతిపెద్ద పాట యిది. నేపథ్యగీతంగా ఘంటసాలగారు పాడిన
ఈ గీతమే నేటి మన సజీవరాగం. సినీమా కథాంశం అంతా ఈ పాటలోనే తేటతెల్లం చేశారు కథ, మాటలు, పాటల రచయిత సముద్రాల రామానుజాచార్యులవారు. ఈ పాట వింటేనేచాలు ఆయా పాత్రల
లక్ష్య లక్షణాలు ఇట్టే అర్థమైపోతాయి. ఒక
తల్లి దురాశ, తప్పుడు పెంపకం
వలన కొడుకు జీవితం ఎలా చిన్నాభిన్నమై
సర్వనాశనమవుతుందో ఈ సినీమా చూపిస్తుంది. ఆ
తల్లీ కొడుకులుగా ఎన్.టి.రామారావు,
హేమలత, నిస్సహాయుడైన మంచి తండ్రిగా సి.ఎస్..ఆర్. ఆయా
పాత్రలలో బాగా నటించారనడం కన్నా బాగా లీనమై జీవించేరనడం ఉచితం. సినీమాలో ఈ పాటంతా ఒకేసారి రాదు. కథాగమనంలో మూడు,
నాలుగుసార్లు వివిధ
సందర్భాలలో ఒక్కొక్క చరణంగా వినవస్తుంది. టైగర్ రాముడు సినిమాకే ఆయువుపట్టైన ఈ 'ఆశా దురాశ వినాశానికే ' పాటకు
ఘంటసాలగారు తన అపార సంగీతానుభవంతో, భావోద్వేగ గళంతో జీవం పోశారు. పాత్రల శోక తప్త హృదయావేదననంతా ఎంతో ఆర్ద్రతతో
గానం చేసి విషాదగీతాలకు తనకు సరిసమానమైన గాయకుడు మరోకడు లేడని మరోసారి
నిరూపించారు. సంగీతదర్శకుడే మంచి గాయకుడు కూడా అయితే ఆ పాట ఎంత సజీవమవుతుందో ఈ పాట
నిరూపిస్తుంది.
టైగర్ రాముడు సినీమాలో నవరసాలతో కూడిన 14 పాటలు పద్యాలను పొందుపర్చారు డైరక్టర్ సి.ఎస్.రావు. వాటిలో అల్లసాని పెద్దనగారి మనుచరిత్రలోని పద్యాలతో కూర్చిన వరూధిని ప్రవరాఖ్య నృత్య నాటిక డైరెక్టర్ గారి ఉత్తమఅభిరుచికి ఒక మచ్చుతునక. అధిక సంఖ్యాకంగా పదకొండు పాటలు పద్యాలు ఘంటసాలగారు పాడగా మిగిలినవాటిని లీల, ఎస్.జానకి, జమునారాణి, మాధవపెద్ది, రాఘవులు పాడారు. ఘంటసాలవారి సంగీత నిర్దేశకత్వంలో ఎన్.టి.ఆర్, రాజసులోచన, రేలంగి, గిరిజ, జంటలకు కూర్చిన డ్యూయెట్ పాటలన్నీ మంచి జనాదరణ పొందాయి.
టైగర్ రాముడు సినిమాకే కీలకమైన గీతం ' ఆశా... దురాశా... వినాశానికే '. ఘంటసాలగారు ఈ పాటను రాగమాలికలో చేశారు. అందుకోసం వారు తీసుకున్న రాగాలు - శివరంజని, గూర్జరి తోడి, బిలాస్ఖాన్ తోడి. పల్లవిని శివరంజనిలో, తర్వాతవచ్చే సాకీని గూర్జరి తోడిలో, రెండవ సాకీని బిలాస్ఖాన్ తోడి లో చేశారు. కర్ణాటక, హిందుస్థానీ సంగీత శైలులలో బాగా ప్రసిధ్ధి పొందిన రాగం శివరంజని. ఆరోహణ , అవరోహణ క్రమంలో ఐదు స్వరాలే వున్నందున ఔడవరాగంగా పరిగణిస్తారు. కర్ణాటక శివరంజని 22వ మేళకర్త ఖరహరప్రియకు జన్యరాగం. హిందుస్థానీ శివరంజని కాఫి థాట్ యొక్క జన్యం. శివరంజని రాగంలో మధ్యమ, నిషాద స్వరాలు వుండవు. విషాద కరుణరస ప్రధాన గీతాలకు అనువైన రాగం.
గూర్జరితోడి హిందుస్థానీ సంగీతంలోని తోడి థాట్ కు జన్యం. షాడవరాగం. అంటే ఆరోహణ అవరోహణలలో ఆరు స్వరాలే వుంటాయి. పంచమ స్వరం(ప) ఈ రాగంలో వినపడదు. భక్తి, విషాద భావాల ప్రకటనకు చాలా అవకాశమున్న రాగం. బిలాస్ఖాన్ తోడి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత రాగం. భైరవి థాట్ జన్యం. ఔఢవ- సంపూర్ణరాగం. ఆరోహణలో ఐదు స్వరాలు మాత్రమే. మధ్యమం (మ), నిషాదం (ని) స్వరాలు వర్జితాలు.
గంభీర, విషాద భావాల
వ్యక్తీకరణకు ఈ రాగం ఎంతో అనువైనది.
మొగలాయి సామ్రాట్ అక్బర్ పాదుషా ఆస్థాన గాయకుడు, సుప్రసిద్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు అయిన
తాన్సేన్ మరణ సమయంలో ఆయన కుమారుడు బిలాస్ఖాన్ ఈ రాగాన్ని ఈ స్వరాలతో గానంచేసి
విలపించినట్లు అందుకే ఈ రాగానికి బిలాస్ఖానీ తోడి అనే పేరు వచ్చినట్లు ప్రతీతి.
'ఆశా, దురాశా వినాశానికే' పాటలో ఘంటసాలగారు ఉపయోగించిన ఈ శివరంజని, గూర్జరితోడి, బిలాస్ఖాన్ తోడి రాగాల ఆధారంగా బహుళ జనాదరణ పొందిన బహు భాషా సినీమా పాటలు అనేకం వున్నాయి.
ఘంటసాలగారు స్వరపర్చిన ఈ పాట పల్లవి, చరణం నడకలలో, వాద్యగోష్టిలో మంచి వైవిధ్యం గోచరిస్తుంది. ఘంటసాల మాస్టారు ఈ పాటలో యూనివాక్స్ , వయొలిన్స్, ఫ్లూట్, క్లారినెట్, ట్రంపెట్, తబలా, డోలక్ వంటి వాద్యాలతో పాటకు ఎంతో నిండుతనాన్ని, భావస్ఫూర్తిని తీసుకువచ్చి అత్యద్భుతంగా గానం చేశారు. శోకము, గంభీరత్వము కలిగిన ఈ పాట వింటున్నంతసేపు మనం భారమైన భావోద్వేగాలను అనుభవిస్తాము. మనిషి ప్రకృతికి దర్పణం పట్టే ఈ పాట ఎప్పటికీ సజీవరాగమేనని నా భావన.
1962లో దాదాపు 20 పెద్ద హీరోల సినిమాలలో (ఎన్.టి.ఆర్. ఎ.ఎన్.ఆర్ సినీమాలే ఎక్కువ) ఘంటసాలగారు పాడిన పాటలు అన్నీ సూపర్ హిట్ అయాయి. వీటిలో ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో (ఒక డబ్బింగ్ సినిమా తో సహా) ఐదు సినిమాలు విడుదలయ్యాయి. ఎన్నో భారీ పౌరాణిక, సాంఘిక సినిమాల మధ్య ఈ ప్రబోధాత్మక విషాదభరిత సినీమా ఎంతవరకు నిలబడిందో నాకు తెలియదు.
(మా బొబ్బిలిలో, ఆ రోజుల్లో ఎంత గొప్ప సినిమా అయినా కూడా మూడు నాలుగు వారాలకి మించి ఆడేదికాదు. 'ఏ' క్లాస్ సెంటర్లలో సిల్వర్ జూబ్లీగా పేరుపొందిన సినిమాలు మా ఊళ్ళో 50 రోజులు ఆడితే గొప్పే( లవకుశ , శ్రీ వేంకటేశ్వర మహత్యం , సీతారామ కళ్యాణం వంటివి మినహాయింపు అనుకోండి)
శ్రీ శ్రీనివాసా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద వడ్డె శ్రీరాములు, పంతం చిన్నారావు నిర్మాతలుగా తీసిన సినిమా 'టైగర్ రాముడు' మంచి కధాంశం, శ్రావ్యమైన సంగీతం గల సినిమా 'టైగర్ రాముడు'.
వచ్చే వారం ఘంటసాలగారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.
ప్రణవ స్వరాట్

No comments:
Post a Comment