అధ్యాయం - 2 - భాగం 21
శబాష్ రాముడు - రేయీ మించెనోయి రాజా
"ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ వుంటుంది." ఇది నిన్నటివరకు చాలామంది నమ్మిన నానుడి. ఈనాడు ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నా సనాతన భారతీయ సంస్కృతిలో మాత్రం స్త్రీకి ఉన్నత స్థానమే వుంది. ఈ విశ్వంలోని సమస్త శక్తులు తనలోనే వున్న ఆదిపరాశక్తి స్త్రీరూపిణిగా సృష్టి, స్థితి, లయకారులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఆధారమై ఆరాధించబడుతున్నది. శక్తి అంటే కేవలం ధైర్య, సాహస, వీర, శౌర్య ప్రతాపాలే కాదు. సాత్వికత, జ్ఞానము, శాంతి, సహనము, తెలివితేటలు, విద్య, వివేకము, విచక్షణ, వంటి లక్షణాలన్నీ శక్తిలో భాగాలే. అటువంటి ఆదిపరాశక్తి శిష్టరక్షణ, దుష్టశిక్షణార్ధం వివిధయుగాలులో అనేక మూర్తులుగా అవతరించి సమస్తప్రాణులను కాపాడుతున్నది. ఆ దైవమే ఒక మాతృమూర్తిగా, గృహిణిగా, ఇతరుల ఔన్నత్యాన్ని కాంక్షించే ఒక మంచి స్నేహితురాలిగా జన్మనెత్తి కుటుంబ శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు శ్రమిస్తూనేవుంటుంది. మానసికంగా, ఆత్మస్థైర్య రీత్యా స్త్రీ పురుషుడికంటే చాలా శక్తివంతురాలు. జీవితంలోని కష్టనష్టాలను, ఒడిదుడుకులను తట్టుకుని ధైర్యంగా నిలబడగలిగేది పురుషుడికంటే స్త్రీ మాత్రమే. మగవాడి పురోభివృద్ధికి వివిధ దశలలో అన్నివిధాలా సహకరించి సహాయపడేది తల్లి, భార్య, మంచి స్నేహితురాలు మాత్రమే. ఆ విధంగా ప్రతీ పురుషుడి కృషి, విజయం వెనుక విధిగా స్త్రీ పాత్ర ఎంతైనా వుంటుంది.
ఈ విషయాన్ని రూఢిపరిచే అలనాటి సినిమా లోని ఒక ఆత్మస్థైర్య ప్రబోధాత్మక గీతమే నేటి మన సజీవరాగం.
విధి వక్రదృష్టికి బలియైపోయిన ఒక ధనవంతుడు పూవులమ్మినచోటే కట్టెలమ్ముకోవడం ఇష్టంలేక బ్రతుకుతెరువు కోసం తన భార్య, కూతురు, తమ్ముడితో సహా పట్నం చేరుకుని రిక్షావాలాగా కాలం గడుపుతూంటాడు. తమ్ముడిని బాగా చదివించి ఉన్నతస్థితికి తీసుకురావాలని కలలుకంటూవుంటాడు. అనుకూలవతి, వివేకము గల అతని భార్య కూడా అతని ఆశయాలు నెరవేరడానికి శాయశక్తులా కృషిచేస్తూ గుట్టుగా సంసారాన్ని నెట్టుకువస్తూంటుంది. కానీ, ఇక్కడ కూడా అదృష్టం ఆ కుటుంబాన్ని చిన్నచూపే చూసింది. అహర్నిశలు కష్టపడి శ్రమించే ఆ రిక్షావాలా కొంతమంది దుండగుల తుపాకీ గుళ్ళకు కాలికి బలమైన గాయమై ఆస్పత్రి పాలవుతాడు. కదలలేని స్థితి. నిత్యజీవనానికి, తమ్ముడి కాలేజీపరీక్షల ఫీజుకు డబ్బు ఎలా సద్దుబాటు చేయాలో తెలియక రిక్షారాముడి మనసు అల్లకల్లోలమై భవిష్యత్ గురించి మధనపడుతూ కంటిమీద కునుకు కరువై చింతక్రాంతుడై విచారంలో మునిగివుంటాడు.
అటువంటి దుర్భరపరిస్థితులలో భాధ్యతనెరిగిన భార్య అతనికి ధైర్యాన్ని , ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తూ.....
రేయీ మించేనోయి రాజా
హాయిగ నిదురించరా!
రేయీ!
హాయిగ నిదురించరా..
వెల్లివిరిసీ
వెన్నెల్లు కాసే
చల్లన్ని చిరుగాలి మెల్లంగ వీచే
!వెల్లి!
స్వప్నాలలోనా
స్వర్గాలు కంటూ
స్వర్గాలలో
దేవగానాలు వింటూ
హాయిగ నీవింక
నిదురించవోయి
!రేయీ!
చీకటి వెంట వెలుగే
రాదా
కష్టసుఖాలు
ఇంతేకాదా!చీకటి!
చింతా వంతా
నీకేలనోయి
అంతా జయమౌను
శాంతించవోయి
హాయిగ నీవింక
నిదురించవోయి
!రేయీ!
అని లాలిస్తూ అతను ప్రశాంతంగా నిదురించడానికి తాపత్రయపడుతోంది.
ఈ అనంతవిశ్వంలో చీకటివెలుగులు ఎంత సహజమో, మనిషిజీవితంలో కష్టాలు, సుఖాలు కూడా అంత సహజం. కష్టాలు వచ్చాయని కుంగిపోకూడదు. నీకు తోడుగా, అండగా నేనుండగా దిగులెందుకు అంతా విజయవంతంగా సాగుతుంది. కలతలు మాని వెల్లివిరిసే ఈ చల్లనివెన్నెలరాత్రిలో చక్కని కలలుకంటూ ఆ కలలో దేవగానాలు వింటూ హాయిగా నిదురపొమ్మని శ్రావ్యంగా గానంచేస్తూ భర్తకు మనశ్శాంతిని కలిగిస్తోంది ఒక ఆదర్శమహిళ.
ఔను! ఘంటసాలవారి హృదయాంతరాళాలనుండి పెల్లుబికి జాలువారిన ఈ సజీవరాగం సినీమా పాటే.
సుఖవంతమైన సంసారనావకి వివేకవంతురాలైన ఇల్లాలే చుక్కాని అని నిరూపించిన సినిమా. 1959లో విడుదలైన రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి 'శభాష్ రాముడు' సినిమా.
మంచి కథాంశాలతో, చక్కటి సాహిత్యం, మంచి సంగీతం కలిగిన పాటలతో పదిమందికి మంచిని నేర్పి ప్రజలలో చైతన్యం కలిగించాలని నిర్మాతాదర్శకులు భావించే రోజులలో వచ్చిన చిత్రం 'శభాష్ రాముడు'. తాను మాస్ హీరో మాత్రమే కాదు క్లాస్ హీరో కూడానని తన ఉదాత్తమైన నటనతో తెలుగువారందరిచేతా 'శభాష్ రిక్షారాముడు' అని జేజేలు కొట్టించుకున్న నందమూరి తారకరామారావు శభాష్ రాముడు సినిమాకు కథానాయకుడు.
ఇంటికి దీపం ఇల్లాలు అనే సామెతను సార్థకపరుస్తూ దేవిక ఈ సినిమాలో ఎన్.టి.ఆర్.కు దీటుగా చక్కగా నటించారు. ఇతర ముఖ్యపాత్రలలో నటించిన రమణమూర్తి, మాలిని, గుమ్మడి, కాంతారావు, రేలంగి, గిరిజ, ఆర్.నాగేశ్వరరావు, కె.వి.ఎస్.శర్మ, ఎ.మ్ఎన్.రాజమ్ చిత్రవిజయానికి ఇతోధికంగా దోహదం చేశారు.
'శభాష్ రాముడు'
సినిమా కు హిందీ మూలం 1957 లో వచ్చిన 'బడేభాయ్' అజిత్, కామినీకౌశల్,
కుమ్ కుమ్ ముఖ్యనటులు. కె.అమర్నాథ్ దర్శకనిర్మాత.
సుందర్లాల్ నహతాగారి ఆస్థాన సంగీతదర్శకుడిగా ఘంటసాలగారికి ఈ శభాష్ రాముడు నాలుగవ చిత్రం. ఇందులో వున్న తొమ్మిది పాటలు వైవిధ్యంతో కూడినవే. సందర్భోచితమైన, సన్నివేశానికి బలం చేకూర్చే భావజాలంతో నిండిన ఈ పాటలను కొసరాజుగారు (జయమ్ము నిశ్చయమ్మురా), (ఆశలే అలలాగ ఊగెనే సరదాగా), (వన్నెలు కురిసే చిన్నదిరా), సదాశివబ్రహ్మంగారు (రేయీ మించేనోయి రాజా), (జాబిల్లి వెలుంగులో కాళింది చెంత), (హల్లో డార్లింగ్ మాటాడవా), (ఓ చందమామ ఇటు చూడరా), శ్రీశ్రీగారు (ఓ దేవా మొరవినవా), (కలకల విరిసీ జగాలే పులకించెనే) వ్రాయగా వాటిని ఘంటసాల, పి.సుశీల, పి.లీల, కె రాణి, కె.జమునారాణి, సరోజిని, పిఠాపురం, జె.వి.రాఘవులు ఆలపించారు.
సుందర్ లాల్ గారి సినిమాలలో ఎక్కువగా పరభాషా చిత్రగీతాల ఆధారంగా చేసిన పాటలే ఎక్కువగా వుంటాయి. ఘంటసాలగారి స్వయంప్రతిభకు నిదర్శనంగా ఓ రెండో మూడో పాటలు వుంటాయి. అటువంటివాటిలో అత్యుత్తమైన గీతం నేటి మన సజీవరాగం, అదే పి.సుశీలగారు ఆలపించిన సుమధుర, సుస్వరాల హృద్యగీతం 'రేయీ మించేనోయి రాజా' వెంపటి సదాశివబ్రహ్మంగారి రచన. కథా నేపథ్యం స్ఫురింపజేస్తూ రసానుభూతికి తగిన పదజాలంతో ఉన్న ఈ పాటకు ఘంటసాలగారు అతిశ్రావ్యంగా జోలపాట పధ్ధతిలో వరసను సమకూర్చారు.
సన్నివేశానికి అనుగుణ్యంగా రసభావాలకు, కవి సాహిత్యానికి ప్రాధాన్యతనిస్తూ పాటలను మలచడంలో మేటి ఘంటసాల. కవి సదాశివబ్రహ్మంగారి సందర్భోచిత సాహిత్యానికి తన సంగీత ప్రతిభను జోడించి మనసులోని రాగభావాలను యథాతథంగా సుశీలగారి కోకిలకంఠం ద్వారా అతిమనోజ్ఞంగా ఈ 'రేయీమించేనోయి రాజా' పాట ద్వారా మనకందించారు ఘంటసాల.
మాట స్పష్టత, శ్రావ్యత, అనుభూతుల ప్రకటన ఘంటసాల, సుశీలగార్ల ప్రత్యేకత. అది ఈ పాటలో అణువణువున కనిపిస్తుంది. లాలిపాటలా వుండే ఈ సందేశాత్మకగీతంలో మనకు శంకరాభరణ రాగ స్వరాలు వినిపిస్తాయి. శంకరాభరణం 29వ మేళకర్త ధీరశంకరాభరణం జన్యం. వైవిధ్యం కూడుకున్న అతి ప్రాచీనరాగం శంకరాభరణం. హిందుస్థానీ సంగీతశైలిలో ఈ రాగాన్ని బిలావల్ అంటారు. వెస్ట్రన్ మ్యూజిక్ లో మేజర్ స్కేల్ లేదా లోనియన్ అని అంటారు. బహుళ ప్రచారం పొందిన బహుభాషా చిత్రగీతాలు అసంఖ్యాకంగా శంకరాభరణం, తదదీ ఇతర జన్యరాగాలలో వున్నాయి. అందుచేత పాటను అతిశ్రధ్ధగా విని రాగ లక్ష్యలక్షణాలను నిర్దిష్టంగా పరిశీలించి రాగనిర్ణయం చేయవలసివుంటుంది. లేకపోతే ఒక రాగానికి బదులు మరొకరాగంగా పొరపాటు పడే అవకాశం వుంది. లాలిత్యం ఉట్టిపడే ఈ పాట నేపథ్యసంగీతంలో ఉపయోగించిన సితార్, ఫ్లూట్, వయొలిన్స్, వైబ్రోఫోన్, తబలా, రిథిమ్స్ వంటి వాద్యాలు కూడా మృదువుగా ధ్వనిస్తూ శ్రోతల మనసుకు ఆహ్లాదాన్ని, ప్రశాంతతను కలిగిస్తాయి.
ఈ పాటలో ప్రముఖంగా వినపడే ఫ్లూట్, సితార్, తబలాలు పాట మూడ్ ను ఎంతగానో ఎలివేట్ చేశాయి. గాత్రాన్ననుసరించే వాద్యాలు తప్ప వాద్యాలననుసరించి గాత్రం కాదనేది ఘంటసాలగారి సిధ్ధాంతం. అందువల్లే వారి గీతాలన్నీ సజీవరాగాలై సంగీతాభిమానులను సదా అలరిస్తున్నాయి.
రాజశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద సుందర్ లాల్ నహతా & టి.అశ్వత్థనారాయణ నిర్మించి శతదినోత్సవాలను చేసుకున్న ఎన్.టి.ఆర్. 'శభాష్ రాముడు' ను తమిళంలోకి కూడా డబ్ చేసి మంచి విజయం సాధించారు.
కొసమెరుపు:
'మంచి మనసుకు మంచి రోజులు', 'శభాష్ రాముడు' - ఈ రెండు సినీమాలను తీసినది రాజశ్రీ సుందర్లాల్ నహతాయే. రెండింటిలో హీరో ఎన్.టి.ఆర్.కాగా ఘంటసాల సంగీతదర్శకుడు, సి.ఎస్.రావు డైరెక్టర్. మంచిమనసు మంచి రోజులకు తమిళ మూలం 'తై పిరందాల్ వళి పిరక్కుం'. ఈ సినిమాలో హీరో పాడిన పడవపాట 'ఆశయే అలైపోలే' పాట వరసలో 'ఆశలే అలలాగ ఊగెనే సరదాగా ఓడలాగా జీవితమంతా ఆడేముగా' అని కొసరాజుగారి చేత ఒక పాట వ్రాయించారు. పాట రికార్డింగ్ కూడా జరిగిందేమో, తెలియదు. అయితే ఏ కారణం చేతనో ఆ పాటను 'మంచి మనసుకు మంచి రోజులు సినిమా లో ఆ సన్నివేశంలో పెట్టలేదు. దానికి బదులుగా జూనియర్ సముద్రాలగారితో 'పొంగారు నడియేటి నదిపైన దోనె అలా అలా ఊరించు పేరాశ ఈ జీవితానా... ఏ తీరమేగేనో సుడిగాలిలోనా ఏనాటికేతీరో బ్రతుకీ జగానా' అనే మరో పాటను వ్రాయగా ఘంటసాలగారు వేరే ట్యూన్ లో చేసి పాడగా హీరో ఎన్.టి.ఆర్ పై చిత్రీకరించించారు. అయితే, సుందర్ లాల్ గారి పరభాషా గీత వ్యామోహం, వ్యాపార సరళి వలన మంచి మనసుకు మంచిరోజులు సినిమా కోసం వ్రాయించి ఉపయోగించకుండా వదిలేసిన తమిళ వరస గీతం 'ఆశలే అలలాగ ఊగెనే సరదాగా...' పాటను ఘంటసాలగారు పాడగా శభాష్ రాముడు సినిమాలో అదే పడవ ప్రయాణం సన్నివేశానికి ఉపయోగించుకుని రేలంగి మీద చిత్రీకరించారు దర్శకుడు సి.ఎస్.రావు. సినిమాలలో కూడా తెరవెనుక ఏ నిముషానికి ఏమి జరుగునో ఎవరూ ఊహించలేరు.
వచ్చే వారం ఘంటసాలవారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.
ప్రణవ స్వరాట్

No comments:
Post a Comment