అధ్యాయం - 2 - భాగం 20
పెళ్లిసందడి - సమయమిది దాయరా సరసుడా
"బ్రదర్, ఆ కళాసమితివారు చేతులెత్తేసారు. మన అమ్మాయిల డాన్స్
ప్రోగాము వాళ్ళ సభలో పెట్టలేరట. రెండేళ్ళవరకు కార్యక్రమాలు ఫిక్స్ చేసేసేరట.
అందులోనూ అమెచ్యూర్ డాన్సర్స్ కు వాళ్ళ కళాసమితిలో అవకాశం దొరికే ప్రసక్తే
లేదంటున్నారు. కానీ, అసలు విషయం అదికాదు.
మనవాళ్ళ డాన్స్ వాళ్ళ వేదికమీద జరగాలంటే మనం వాళ్ళకు ఎంతోకొంత డొనేషన్
ముట్టచెప్పాలనేది ఆంతర్యం. దానికి మనం అంగీకరిస్తే వచ్చే వారమే మన అమ్మాయిల
నృత్యకార్యక్రమం ఖాయం. ఆ సమితి ప్రెసిండెంటే స్వయంగా వచ్చి మన అమ్మాయిలను
అభినందించి ఆశీర్వదిస్తాడట. ఆ దెబ్బతో మన పిల్లల జాతకమే మారిపోయి కళాప్రపంచంలో ఓహో! అని ఓ వెలుగువెలిగిపోతారని ఆ
శెక్రెటరీ లోపాయికారీగా చెప్పాడు. నేను ససేమీరా కుదరదని చెప్పి వచ్చేసాను."
"కళాసేవ, కళాపోషణ అంటూ వీళ్ళు చేసే వ్యాపారం ఇదన్నమాట! మరిప్పుడెలా! ఏం చేద్దాము".
"చేయడానికి ఏముంది. మన తోట బంగళాలో ఓ పెద్దహాలు వుందికదా. సుమారు వెయ్యమంది దాకా కూర్చోవచ్చు. కొంచెం ఆలస్యమైనా అన్ని వసతులతో, హంగులతో ఒక సాంస్కృతిక సంస్థ ప్రారంభించి గ్రాండ్ గా వచ్చే ఉగాది నుండి ప్రతీ నెల మంచి మంచి నృత్య, నాటక, సంగీత, కార్యక్రమాలు ఉచితంగా ఏర్పాటు చేద్దాము. ఆ గొడవంతా నాకు వదిలేయ్, నేను చూసుకుంటాను."
"అమ్మాయిలూ! మన సంగీత, నృత్య, నాటక కళాసమితిలో మొదటి ప్రోగ్రాం మీదే. ఏం చేస్తారు? భరతనాట్యమా, కూచిపూడియా?" ఏదైనా ప్రేక్షకులు అదిరిపోవాలి, చూసుకోండి మరి".
"ప్రారంభమే శుధ్ధ శాస్త్రీయం వద్దు బాబాయ్. మన గురించి, మన టాలెంట్ గురించి పదిమందికి బాగా తెలిసేవరకు, సామాన్య ప్రేక్షకులకు అర్థమై చూసి ఆనందించేలా లలిత శాస్త్రీయ అంశాలనే ఏర్పాటు చేద్దాము".
"ఓహోహో! అంటే అప్పుడే మీరు ఐటమ్స్ కూడా సెలెక్ట్ చేసుకు కూర్చున్నారన్నమాట. ముందుగా, స్టేజ్ కోసం మోడర్న్ గా మీ పేర్లను మార్చేయాలి."
"మీ డాన్స్ ఐటెమ్స్ సిధ్ధంగా వున్నాయంటున్నారు, ఒకసారి పాడి, చేసి వినిపించండమ్మా."
"ఓ పాత తెలుగు సినిమాలోని పాటే నాన్నా! మా కాలేజీ ఫంక్షన్ కోసం మా డాన్స్ టీచర్ సెలెక్ట్ చేశారు. ఆ రోజు మా ఐటెమ్ కు చాలా మంచిపేరు వచ్చింది. చీఫ్ గెస్ట్ కూడా చాలా మెచ్చుకున్నారు."
"అలాగా! అయితే తప్పకుండా ఆ ఐటమ్సే ఫైనలైజ్ చెయ్యి బ్రదర్. "
"ఏదమ్మా ఆ పాట వినిపించండి."
"ఒక్క పాటేమిటి నాన్నా... విడియోవే చూపిస్తాము. "పెళ్ళిసందడి" అనే పాత సినిమా లో అంజలీదేవి, బి.సరోజాదేవి చేసిన ఒక వెరైటీ సెమిక్లాసికల్ డాన్స్ నెంబర్. జూనియర్ సముద్రాల వ్రాసిన పాటకు ఘంటసాల వరసలు కూర్చగా పి.లీల, జిక్కి పాడారు. అన్ని క్లాసెస్ వాళ్ళకీ బాగా నచ్చుతుంది.
"ఓకే బ్రదర్ ! మన కళాసమితి ఫస్ట్ ఉగాది ప్రోగ్రామ్ ఫిక్స్డ్. రెడీ ఫర్ స్టేజ్.
-+-
ఈలోగా మనం ఆ విడియో చూసేద్దాము
సమయమిదిదాయెరా సరసుడా-2
తమిగొని జతగొని
సరసాల తేలదగు
సమయమిదిదాయెరా
విరులు పూచెరా
వెన్నెల కాచెరా
మారునీ గెలిచి
కూరిమీ కలిసి
పరవశముల మెలగా! సమయ!
తాళలేనురా
జాలమిదేల రా
జాలినీ చూసి బాలనూ
కరుణ
ఏలరా కౌగిలిలో రారా
! సమయ!
జిక్కి:
రావోయి సక్కనోడా,
నావోడ
రావోయి సక్కనోడా
లీల:
వచ్చానె
సిన్నదానా, నాదాన
వచ్చానె సిన్నదానా
జిక్కి:
సల్లని ఎన్నెలలోన సన్నాని అలలపైన
సక్కనీ పడవానెక్కి సరదాగా పాడుకుంటూ
!రావోయి!
లీల:
సిలిపిసూపులు సూత్తు సెంతని నీవుంటే
సెంగునా నట్టేట దూకి సేపలన్నీ పట్టుకురానా
జిక్కి:
రావోయి సక్కనోడా
నావోడ
రావోయి సక్కనోడా
లీల:
పోదామె
సిన్నదానా నాదాన
పోదామె సిన్నదానా
జిక్కి:
హైలేలో నా రాజా రావోయి నీదే
కన్నె రోజా !
హైలేలో!
లీల:
సరసము కోరే
తరుణి యిదీ
సరసనజేరే తరుణమిదీ
కన్ను చెదిరే వన్నె
నాదీ
వలపు గొలుపు వయసు
చెలి యిదీ
!హైలేలో!
జిక్కి:
మిలమిల మెరిసే
మెయి తళుకూ
కలవరపరిచే కనుబెళుకూ
మనసు నీది మమత నీది
మరులుగొలుపు వయసు
చెలి యిదీ
!హైలేలో!
ఘంటసాలగారి సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అనేక ఆపాతమధురాలలో ఈ పాట ఒకటి. 1959 లో వచ్చిన "పెళ్ళిసందడి" లోని ఈ యుగళగీతమే నేటి మన సజీవరాగం.
ఇదొక రొమాంటిక్, వెరైటీ నృత్యగీతం. వైవిధ్యంతో కూడిన మూడు నృత్యరీతులు కనపర్చే పాట. పాట మొదటి భాగంలో భరతనాట్య శైలిలో ఒక జావళి, రెండవభాగం జానపదం. మూడవ భాగం విదేశ నృత్యరీతిలో వుంటుంది. ఈ నృత్యగీతం వినోదాన్ని ఆశించి చేసినదే అయినా, ఎక్కడా అశ్లీలత, అసభ్యత లేకుండా మన భారతీయ సంస్కృతికి తగినట్లుగా హుందాగా, గౌరవప్రదంగా చిత్రీకరించారు డైరెక్టర్ డి.యోగానంద్. ఈ సినిమా నృత్యదర్శకుడు (టైటిల్స్ లో పేరే వేయలేదు) ఎవరోగానీ అన్ని పాటలకు చక్కటి నృత్యభంగిమలను సమకూర్చి అంజలీదేవి, బి సరోజాదేవి చేత హుషారుగా నాట్యం చేయించారు.
ఘంటసాల మాస్టారు ఈ పాటను రాగమాలికలో చేశారు. ఒక పాటలోరెండు కన్నా ఎక్కువ రాగాలుంటే దానిని రాగమాలిక అంటారు. ఈ నృత్యమాలికలో మొదటిదైన భరతనాట్య జావళీని చారుకేశి రాగంలో, జానపదశైలిలో వుండే చరణాలను బృందావన సారంగలో, ఆఖరి ఫారిన్ టైప్ డాన్స్ ను తోడిరాగ స్వరాలతోనూ చేశారు.
చారుకేశి రాగాన్ని తెలుగు సినిమా సంగీతాభిమానులకు పరిచయం చేసినది మన ఘంటసాల మాస్టరుగారేనని గతంలో చెప్పడం జరిగింది. కర్ణాటక సంగీతంలో చారుకేశి 26వ మేళకర్త. దీనికి అనేక జన్యరాగాలున్నాయి. ముత్తుస్వామి దీక్షితర్ సంగీత సంప్రదాయం లో చారుకేశి రాగాన్ని తరంగిణిగా వ్యవహరిస్తారు. ఘంటసాలగారు ఈ పాటలో వచ్చే చారుకేశి రాగం జావళీకి కర్ణాటక సంగీత గమకశుధ్ధిని పాటిస్తూ సశాస్త్రీయమైన మెట్టునే కట్టారు. భరతనాట్య ప్రదర్శనకు ఉపయోగించే వీణ, వయొలిన్స్, ఫ్లూట్, మృదంగం, మోర్సింగ్, గజ్జెలతో పాటు తబలాను కూడా ఉపయోగించారు. పాట ప్రారంభం తబలా నడకతోనే మొదలవుతుంది.
ఈ పాటలో రెండవభాగం బెస్త యువతీయువకుల జానపదశైలి నృత్యం. ఈ భాగంలో నర్తకులు, గాయకులు ఆడవారే. ఈ చరణం నేపథ్యంలో వయొలిన్స్, ఫ్లూట్, క్లారినెట్, పియోనా, తబలా, డోలక్, డప్పు, గజ్జెలు, మొదలైన వాద్యాలు వినిపిస్తాయి.
ఈ భాగంలో మనకు
వినిపించే రాగం బృందావనసారంగ. కర్ణాటక, హిందుస్థానీ సంగీత శైలులలో బహుళ ప్రచారం పొందిన రాగం. కర్ణాటక సంగీతంలోని 22వ మేళకర్త ఖరహరప్రియకు జన్యం ఈ బృందావన సారంగ.
హిందుస్థానీ సంగీతంలో కాఫి థాట్ కు చెందిన
రాగం. భక్తి, శృంగార రసాది
అనుభూతులను వెల్లడించడానికి అనువైన శ్రావ్యమైన రాగం.
ఇక ఈ నృత్యగీతంలో మూడవ ఆంశం ఒక విదేశీ బాణీ నృత్యం. ఇది బహుళ ప్రచారంలో వున్న ప్రాచీన జపాన్ జానపద నృత్య ప్రక్రియ. దీనిని 'పారసల్' లేదా 'హిగస ఒడోరి' డాన్స్ అని అంటారు. ఈ నృత్యశైలి జపాన్ లోని కబుకి, ఒకినావన్ ప్రాంతాలలో నుండి అభివృద్ధిలోకి వచ్చింది. ఈ నృత్యంలో నర్తకీమణులు తమ సంప్రదాయ కిమోనా దుస్తులు ధరించి వివిధరకాల కేశాలంకరణత, చేతిలో రంగురంగుల గొడుగులు ధరించి, శ్రావ్యమైన, సున్నితమైన వాద్యసంగీతానికి తగినట్లుగా మెల్లని పదవిన్యాసంతో సాగే నాట్యప్రక్రియ. దీని ఆధారంగా మన నృత్య దర్శకులు రూపొందించిన చక్కటి అంశం. ఈ నృత్యంకోసం ఘంటసాల మాస్టారు తోడి రాగ స్వరాలు ఉపయోగించారు. తోడి కర్ణాటక సంగీతంలో అతి ప్రాచీనమైనది. 8వ మేళకర్త రాగం హనుమత్తోడి అని అంటారు. దీనికి సమాంతరమైన హిందుస్థానీ రాగం భైరవ్. హిందుస్థానీ సంగీతపు తోడి రాగానికి, కర్ణాటక సంగీత తోడిరాగానికి తేడా వుంది. పాశ్చాత్య (Western) దేశ సంగీతాలలో కూడా ఈ తోడి రాగం వినిపిస్తుంది. అక్కడ ఈ రాగాన్ని'ఫ్రిజియన్ మోడ్' అని అంటారు. అటువంటి సుప్రసిద్ధ రాగ స్వరాలను ఘంటసాలగారు ఈ భాగంలో ఉపయోగించారు.
పి.లీల, పి.జి.కృష్ణవేణి (జిక్కి) పోటీపడి పాడిన ఈ పాట చరణంలో మరో ప్రధాన ఆకర్షణ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. జిలిబిలిగా పక్కపక్క గమకాలతో శ్రోతలను గిలిగింతలు పెట్టే ఎమ్.ఎస్.రాజు మేండలిన్, రాజేంద్రన్ ఫ్లూట్ బిట్స్, గిటార్, పియోనా, డబుల్ బేస్ వ్యాపింగ్స్, డ్రమ్స్, సింబల్స్, ట్యూబోఫోన్, జలతరంగిణి, ఇతర రిథిమ్స్ చాలా చైతన్యవంతంగా, ఉత్సాహభరితంగా వినిపిస్తాయి. మొత్తంమీద ఈ పాటంతా ఎంతో మృదుమధురంగా, లయ ప్రధానంగా వుంటూ శ్రోతలను రంజింపజేస్తుంది. ఎన్నిసార్లు విన్నా, నా వరకూ, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే గమనప్రధాన నృత్యగీతం ఇది. అందుకే అనేక సుమధుర ఘంటసాల గీతమాలికలలో ఈ గీతం కూడా సజీవరాగమై శ్రోతలను ఎల్లప్పుడూ అలరిస్తూనే వుంటుంది.
నిజం చెప్పాలంటే, ఈ 20వ ఎపిసోడ్ నన్ను కొంచెం ఇరకాటాన పెట్టిందనే చెప్పాలి. ఈ 20వ ఎపిసోడ్ సజీవరాగ గీత చిత్రంగా 'పెళ్ళిసందడి' సినిమా నిర్ణయమైపోయినా, ఈ చిత్రంలోని ఏడు పాటల్లో ఏ పాటను సజీవరాగంగా తీసుకోవాలో నిర్దిష్టంగా ఇప్పటికీ నిర్ణయించుకోలేకపోతున్నాను. కారణం ఈ సినిమా లోని పాటలన్నీ సుస్వరాల సుమధురగీతాలే. సజీవరాగాలుగా కొనియాడదగ్గవే.
ఇక్కడ మరో విశేషం, ఈ ఏడు పాటల్లో ఆరు పాటలు డ్యూయెట్లే, ట్రిప్లెట్లే (ఈ మాట సరైనదికాదనుకుంటాను). ఒకే ఒక సోలో పి. లీల పాడిన పాట. ఘంటసాలగారికి సోలోలు లేవు. రెండు పాటలు లీల, జిక్కిలతో, ఒకటి బాలసరస్వతీదేవితో కలసి పాడారు. ఏడవ పాట కూడా డ్యూయెట్ పాటే - జె.వి.రాఘవులు, జిక్కి - చలం, బి.సరోజాదేవి కోసం పాడారు. ఈ సినిమాలో అధికసంఖ్యలో ఆరు పాటలను పి.లీల పాడారు. వీటిలో కె.రాణితో కలసి పాడిన పాట కూడా ఒకటి వుంది.
పూర్తి వినోదాత్మక చిత్రమైన పెళ్ళిసందడిలోని పాటలన్నింటికి కూడా ఘంటసాలగారు ఉత్సాహభరితంగా పదే పదే పాడుకునేలా వరసలు సమకూర్చారు. హీరో అక్కినేని, దర్శకుడు డి.యోగానంద్, ఘంటసాల కాంబినేషన్లో వచ్చిన అతికొద్ది చిత్రాలలో అత్యంత విజయవంతమైన చిత్రం పెళ్ళిసందడి. డైరెక్టర్ యోగానంద్ ఎన్.టి.ఆర్.కు మంచి స్నేహితుడు. ఎన్.టి.ఆర్. సినిమా లెన్నింటినో యోగానంద్ డైరక్ట్ చేశారు.
ఎఎన్.ఆర్. హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయనకు జోడీగా అంజలీదేవి, చలం, బి.సరోజాదేవి, గుమ్మడి, రమణారెడ్డి, సి.ఎస్.ఆర్., రాజనాల, ఆర్.నాగేశ్వరరావు, సురభి బాలసరస్వతి, డా.శివరామకృష్ణయ్య నటించారు.
కథ, మాటలు, పాటలు సముద్రాల రామానుజాచార్యులు సమకూర్చారు. రిపబ్లిక్ ప్రొడక్షన్ బ్యానర్ మీద బి.ఎ.సీతారాం నిర్మించిన తొలిచిత్రం 'పెళ్ళిసందడి'. పరిశ్రమలో సీతారాం నిర్మాతగా నిలదొక్కుకోవడానికి పెళ్ళిసందడి అన్నివిధాలా సహకరించింది.
వచ్చే వారం, మరల, ఘంటసాలవారి మరో సజీవరాగం తో కలుద్దాము.
ప్రణవ స్వరాట్

No comments:
Post a Comment