Saturday, 6 June 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 18 - మారుపల్కవదేమిరా నాతో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 18


సతీ అనసూయ - మారుపల్కవదేమిరా నాతో

 

సనాతన హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి, స్థితి, లయకారకులు. సృష్టికర్తయైన బ్రహ్మదేవుని మానసపుత్రులు దక్షప్రజాపతి, కశ్యపప్రజాపతి. అంటే సంకల్పమాత్రంచేత బ్రహ్మ మనస్సునుండి ఉద్భవించినవారు. బ్రహ్మదేవుడు చేసే సృష్టికార్యాన్ని అన్నిలోకాలలో విస్తరింపజేయడానికి, సకల జీవరాశులను సృష్టించడానికి బ్రహ్మకు సహాయకులుగా నియమింపబడినవారు. దక్షప్రజాపతికి అనేకమంది కుమార్తెలు. వారిలో చాలామందిని కశ్యపప్రజాపతి వివాహమాడాడు. వారిలో అదితి, దితి, వినత, కద్రువ, దను, గగనమండలంలో ప్రకాశించే  అశ్విని మొదలు రేవతి వరకు గల 27 నక్షత్రకాంతలు కశ్యపుని భార్యలే. అదితి, దితిలు మంచి చెడులకు, ద్వందప్రవృత్తులకు ప్రతీకలు. అదితి సంతానమైన  దేవతలు, దితి సంతానమైన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు  రాక్షసులుగా వృధ్ధిచెంది ఎల్లవేళలా పరస్పరం కలహించుకుంటూండేవారు.

అదితి కశ్యపులకు 12 మంది సంతానం.  సూర్యుని రూపాలైన వీరిని ద్వాదశాదిత్యులని అంటారు. వీరు సంవత్సరంలోని 12 నెలలకు అధిపతులు. ఇంద్రుడు, మిత్రుడు, ధాత, వరుణుడు, విష్ణువు (వామనావతారం) మొదలగువారు.

అష్టైశ్వర్యాలకు, భోగభాగ్యాలకు, సుఖసంతోషాలకు నిలయం స్వర్గం. అటువంటి స్వర్గలోకానికి అధిపతి ఇంద్రుడు.ఈయన భార్య శచీదేవి. ఐరావతం, ఉఛ్ఛైశ్రవం, వజ్రాయుధం వంటి అమూల్య విశేషాలకు స్వంతదారుడు. దేవేంద్రుడు, మహేంద్రుడు, సురేంద్రుడు, మఘవుడు, సహస్రాక్షుడు అనే నామాలు గలవాడు. దేవతల రాజైన ఇంద్రుడు తూర్పు దిక్కుకు అధిపతి. సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృధ్ధిగా పండడానికి ఇంద్రుడే కారకుడవడం చేత ముల్లోకాలు ఇంద్రుని పూజించేవి. యజ్ఞయాగాది క్రతువులు జరిపే సమయంలో హవిస్సులను ఇంద్రునికి సమర్పించి తృప్తి పరిచేవారు.

ఇక్కడ మరొక విషయం చెప్పవలసి వున్నది. స్వర్గలోక ఇంద్ర పదవి శాశ్వతం కాదు.  ఇంద్రపదవి ప్రతి మన్వంతరానికి మారుతూంటుంది.  మన్వంతరం అంటే 30+ కోట్ల మానవ సంవత్సరాలు. మొత్తం 14 మన్వంతరాలలో ఇప్పుడు మనం 7వ మన్వంతరంలో వున్నాము. దీనికి వైవస్వత మన్వంతరం అని పేరు. ఇప్పుడు ఇంద్ర పదవిలో వున్నవాడు పురందరుడు. 8వ మన్వంతరమైన సావర్ణిలో బలి చక్రవర్తి ఇంద్రపదవిని చేపడతాడు.  సత్యవాక్కుతో  నీతి నియమాలు పాటిస్తూ ధర్మపథాన ప్రజలను కాపాడేవారికి, లోక సంక్షేమం కోసం నిరాటంకంగా నూరు యజ్ఞయాగాదులు నిర్వర్తించినవారికి   ఇంద్రపదవి లభిస్తుందని పురాణాలు చెపుతాయి.

భోగభాగ్యాలకు, సుఖసంతోషాలకు నిలయమైన స్వర్గలోకవాసం అందరికీ అందుబాటులో వుండదు. మానవులు తాము చేసిన పుణ్యకార్యాలననుసరించి మరణానంతరం స్వర్గానికి చేరుకుంటారు. సజీవంగా బొందితో స్వర్గలోకంలో ప్రవేశించడమనేది భూలోకవాసులకు అసాధ్యం.

అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన మహాపతివ్రత అనసూయాదేవి. అత్రి మహర్షి భార్య. గొప్ప తపస్సంపన్నురాలు. జాతకంలోని దోషకారణంగా వైవాహిక జీవితానికి, సుఖసంతోషాలకు దూరమైన నర్మద అనే అభాగ్యురాలి కోరికను తీరుస్తూ అనసూయాదేవి తన తపోబలంతో నర్మదను సజీవంగా స్వర్గలోకానికి పంపిస్తుంది. ఆ సమయంలో నిరంతర సుఖభోగియైన దేవేంద్రుని అపురూప సౌందర్యవతియైన రంభ ...


మారుపల్కవదేమిరా నాతో -2

సుకుమారి ఒయ్యారి నిన్నే కోరి చేరా

                                                !మారు!

ఔరా! ఈ బిగువేల ఇది నీకు మేలా

ఆరడి సేయగనేలరా తగునటరా

                                                !మారు!

చక్కెరవిలుకాని ఉక్కున మెయిచిక్కి  

చిక్కిసగమాయె సొక్కిపోయెరా

చెక్కు చెక్కున చేర్చి చక్కెర మోమీర చుక్కరా! 

అందాలు చిందు పూరెక్కరా సొంపెక్కు వలపు 

కైపెక్కి మ్రొక్కె ముదమొలయ 

చెక్కునొక్కి మదికరుగ నిక్కపు  మక్కువ

మీరగ చేర్చవు అక్కున సరిగదా ప్రియమునను

                                                !మారు!

అంటూ శృంగార భాషణలతో, నృత్యగానాలతో తన రూపలావణ్యాలను ప్రదర్శిస్తూంటుంది. అటువంటి రసపట్టువేళ, సమయంకాని సమయంలో ఒక సాధారణ మానవకాంతయైన నర్మద సజీవంగా స్వర్గప్రవేశం చేయడంతో ఇంద్రసభే దద్దరిల్లింది. కారణం తెలుసుకున్న దేవేంద్రుడు ఆగ్రహం చెంది  దేవలోకాన్నే నర్మదకు కనపడకుండా అదృశ్యపరుస్తాడు.  అక్కడనుండి అదంతా మరొక గాధ. ప్రస్తుతం మనకు అనవసరం.

సతీ అనసూయ సినిమాలో ఇంద్రుని మైమరపిస్తూ  రంభ గానం చేసిన శృంగారపద జావళీయే నేటి మన సజీవరాగం. ఘంటసాలవారి శాస్త్రీయ సంగీత ప్రతిభకు మరో మచ్చుతునక. సంగీత సాహిత్యాలు రెంటికి సమాన స్థాయి కల్పించిన ఈ గీతం జూనియర్ సముద్రాలగారి సాహితీప్రకర్షకు, ఘంటసాలవారి శాస్త్రీయ సంగీత ప్రతిభకు దర్పణం పడతాయి.

సినిమాలలో అరుదుగా వినపడే ... 'ఆరడి సేయుట'(హింసపెట్టుట)'చక్కెరవిలుకాడు' (చెఱకుగడని విల్లుగా ధరించేవాడు - మన్మథుడు)'ఉక్కున' (ప్రతాపం, శౌర్యం), 'మెయి' ( శరీరం), 'సొక్కి' (పరవశం), 'పూరెక్క'( సుకుమారమైన పుష్పరేక)'సొంపెక్కు'(అతిశయించిన) వంటి పదాలను ఉపయోగించి ప్రాచీన కవుల శృంగార పదరచనలను గుర్తు చేశారు చినసముద్రాలగారు.

సాహిత్యానికి దీటైన రీతిలో మెట్టుకట్టారు ఘంటసాలగారు. అందుకుగాను వారు ఎన్నుకున్న రాగం 'శ్రీరంజని'. 22వ మేళకర్త ఖరహరప్రియకు జన్యరాగం శ్రీరంజని. ఆరోహణ, అవరోహణా క్రమంలో ఆరు స్వరాలు మాత్రమే వుండడంచేత ఇది షాఢవ-షాఢవ రాగంగా పరిగణిస్తారు. సప్తస్వరాలలోని ''(పంచమం) స్వరం శ్రీరంజనిలో వర్జ్యం. వదిలివేయబడింది. శృంగార, కరుణ, భక్తి రసాలను పలికించడానికి చాలా అనువైన రాగం శ్రీరంజని. హిందుస్థానీ బాణిలో కూడా కొంచెం భిన్నమైన రీతిలో  కాపి థాట్ లో శ్రీరంజని రాగాన్ని విద్వాంసులు ఆలపిస్తారు. సద్గురు శ్రీ త్యాగరాజస్వామివారి 'బ్రోచేవారెవరే, 'సొగసుగా మృదంగ తాళము',  'మారుబల్కకున్నావేమిరావంటి కీర్తనలు శ్రీరంజని రాగంలోనే కూర్చబడ్డాయి.  

శాస్త్రీయ సంగీతపు నుడికారం గల 'మారుపల్కవదేమిరా నాతో...అనే ఈ గీతాన్ని సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విదూషి శ్రీమతి ఎమ్.ఎల్.వసంతకుమారి చేత పాడించి ఎంతో ఔచిత్యాన్ని పాటించారు సంగీతదర్శకుడు ఘంటసాల. శాస్త్రీయగీతానికి కావలసిన సంగతులు, గమకాలు పుష్కలంగా గుప్పించిన   ఈ గీతాన్ని  వసంతకుమారి  అసమాన్యంగా ఆలపించి సన్నివేశాన్ని రక్తికట్టించారు. 


ఈ పాటలో సంప్రదాయ నృత్య గీతాలకు ఉపయోగించే వాద్యాలనే తీసుకున్నారు ఘంటసాలగారు.  వీణ, వయొలిన్స్, ఫ్లూట్, మృదంగం, ఘటం, కంజిరా, మోర్సింగ్, గజ్జెలు వంటి వాద్యాలు ఈ పాటలో ప్రధానంగా వినిపిస్తాయి.

ఇక తెరపై ఈ జావళీకి అభినయం పట్టిన నర్తకి సామాన్యురాలు కాదు. తిరువాన్కూర్ సోదరీమణులుగా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన భరతనాట్య కళాకారిణులు - లలిత, పద్మిని, రాగిణిలలోని రాగిణి ప్రముఖ నాట్యాచార్యుడు పసుమర్తి కృష్ణమూర్తి గారి నృత్య నిర్దేశకత్వంలో   రంభగా ఇంద్రసభలో ఈ పాటకు నృత్యం చేసి సన్నివేశాన్ని రక్తికట్టించారు. స్వర్గలోకాధిపతి, అష్టదిక్పాలకులలో ప్రముఖుడు, సకల మునిగణాల పూజలను అందుకునే ఇంద్రుడు మన సినీమాలలో దుష్టుడిగా, రాక్షసప్రవృత్తి కలవాడిగా కనిపించడం వింతగా అనిపిస్తుంది. ఇది సినిమా వారి కల్పనా? లేక, పురాణాలలో కూడా ఇంద్రుడు అలాగే వుండేవాడా! ఏమో మరి తెలీదు.

దేవేంద్రుడి పాత్రను మన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు బాగానే పాట్రనైజ్ చేసి శాశ్వతం చేశారు. సినిమాలలో దేవేంద్రుడు అనగానే మన కళ్ళముందు నిలబడేది రాజనాల, మిక్కిలినేని, ఆర్.నాగేశ్వరరావు, ఎ.. సుబ్బారావు సీనియర్ & జూనియర్ లు మాత్రమే. వీరు ఇంద్రుడి పాత్రకు పేటెంట్ హక్కుదార్లుగా ప్రేక్షక హృదయాలలో నిల్చిపోయారు. 'సతీ అనసూయ' సినిమాలో ఇంద్రుడిగా రాజనాల తన సహజ ధోరణిలో నటించి మెప్పించారు.

'సతీ అనసూయ'లో  గీతగోవిందంలోని అష్టపది, నారదపురాణంలోని రెండు శ్లోకాలతో కలిపి మొత్తం 22 పాటలు పద్యాలు వుండగా వాటిలో అత్యధిక గీతాలను సముద్రాల జూనియర్, ఒకటి రెండు పాటలను  కొసరాజు వ్రాసారు. ఘంటసాలవారి సంగీతదర్శకత్వంలో ఆ పాటలను ఆయనతోపాటు పి.లీల, పి.సుశీల, ఎమ్.ఎస్.రామారావు, మాధవపెద్ది , కె.రాణి మొదలగువారు పాడారు.

ఈ సినిమా లోని కొన్ని పాటల రికార్డింగ్ కు, రీరికార్డింగ్ కు నేనూ వెళ్ళేను. 1950 దశకంలో విడుదలైన 'నాగిన్' హిందీ సినిమాలోని నాగస్వరం పాట, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని దశాబ్దాలపాటు మార్మోగింది. ఆ పాట మ్యూజిక్  ప్రభావం అన్ని భాషా చిత్రాలమీదా పడింది. ఆ పాట వరసతో మరెన్నో పాటలు వచ్చాయి. ఆ పాట కోసం సంగీతదర్శకుడు హేమంతకుమార్ నాగస్వరంలాగే వినపడే క్లేవైలిన్ అనే ఎలక్ట్రానిక్ వాద్యాన్ని ఉపయోగించారు. తదాదిగా ఏ సినిమాలో ఎక్కడ నాగుపాము కనిపించినా ఈ క్లేవైలిన్ వాద్యం తప్పనిసరి అయింది. ఆనాటికి అపురూపమైన క్లేవైలిన్ ను ఘంటసాలగారు కూడా  'సతీ అనసూయ' లో ' ఓ ... నాగదేవతా...' పాటలో, తర్వాత ఆ నాగుపాము కనపించే సన్నివేశాలలో  తన సొంత బాణీలో ఉపయోగించారు. ఈ క్లేవైలిన్ వాద్యమే తర్వాతి కాలంలో మరికొన్ని అదనపు వాద్య శబ్దాలతో యూనివాక్స్ గా రూపాంతరం చెందింది. 'సతీ అనసూయ' సినిమా లో ఈ క్లేవైలిన్ వాద్యాన్ని ఘంటసాలగారి ఆర్కెష్ట్రాలో పనిచేసే హనుమంతాచారి అనే ఆయన వాయించారు. హిందుస్థానీ సంగీతంలో ప్రవేశమున్న హనుమంతాచారిగారు మంచి గాయకుడు, నటుడు కూడా. అనేక కన్నడం సినిమాలలో హాస్యనటుడిగా నటించారు. ప్రేమనగర్ సినిమాలో కూడా ఏరోప్రేన్ సీన్ లో ANR తో కనిపిస్తారు. AVM వారి 'రాము' తెలుగుతమిళ సినీమాలలో బాలనటుడిగా గర్తింపు పొంది, నేషనల్ అవార్డ్ పొందిన రాజ్ కుమార్ ఈయన కుమారుడే. ఘంటసాలగారితో ఎంతో సన్నిహితంగా వుంటూ ఎన్నో సినీమాలలో పనిచేసిన హనుమంతాచారి 1981 లో  జరిగిన తమిళ్ నాడు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఆక్సిడెంట్ లో దుర్మరణం చెందారు.

సతీ అనసూయ సినిమా సంగీతపరంగా ఘంటసాలగారికి మంచి పేరును తెచ్చిపెట్టడమేకాక ఆర్ధికంగా కూడా గొప్ప విజయం సాధించింది. రాజశ్రీ ప్రొడక్షన్స్ అధినేత సుందర్ లాల్ నహతా తన రెండవ చిత్రమైన 'సతీ అనసూయ' దర్శకత్వ బాధ్యతలను పౌరాణిక చిత్ర నిర్మాణంలో అనుభవజ్ఞుడైన  దర్శక నిర్మాత కడారు నాగభూషణం కు అప్పగించారు. సతీ అనసూయ టైటిల్ రోల్ లో అంజలీ దేవిఆమె భర్త అత్రి మహర్షి గా  గుమ్మడి నటించారు. ఇతర ముఖ్యపాత్రలలో జమున, ఆమె కురూపి భర్తగా కె.వి.ఎస్.శర్మఅమర్నాథ్, కాంతారావు, రేలంగి, ముక్కామల, పద్మనాభం, రాజనాల, సూర్యకళ నటించారు.


కొసమెరుపు -

ఇటీవలి కాలంలో 'సతీ అనసూయసినిమా వాల్ పోస్టర్లలో  అందాల రాకుమారుడిగా ఎన్.టి.రామారావు బొమ్మ  ప్రముఖంగా కనిపిస్తూ ఎన్.టి.ఆర్ అభిమానులకు  కన్నులవిందు చేస్తూంటుంది. అయితే ఆయన ఆ సినిమాలో ఎక్కడా కనపడరు. ఆ రోజుల్లో సినిమా ఆఖరున వేసే జాతీయగీతానికి మర్యాదపూర్వకంగా ఓ రెండునిముషాలు కూడా వేచివుండే ఓపికలేకుండా  థియేటర్లలోనుండి బయటకు పరుగులు తీసిన ప్రేక్షకులకు ఎన్.టి.ఆర్ ఆ సినిమాలో అసలు కనపడివుండరు. సతీ అనసూయ పాతివ్రత్య ప్రభావంతో నర్మద కురూపి భర్త (కె.వి.ఎస్.శర్మ) పునర్జీవుడై  లేచినప్పుడు సుందరాంగుడైన ఓ రాకుమారుడిగా ఎన్.టి.ఆర్  రెండు నిముషాలపాటు  దర్శనమిస్తారు. నామకార్ధం రెండు మూడు డైలాగ్స్, నో సాంగ్స్, ఓన్లీ జెస్చర్స్. సినిమాలో కనిపించే త్రిమూర్తులకు, అత్రిఅనసూయలకుసినిమా చూస్తున్న ప్రేక్షకులకు జమున ప్రక్కన నిల్చుని నమస్కారాలు చేయడంతో  సరి.   సినిమా టైటిల్స్ లో వేసినట్లుగా ఎన్.టి.ఆర్ ది  ఈ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఓన్లీ. అదే ఎన్.టి.ఆర్  ఆ సినిమా ప్రొడ్యూసర్ సుందర్లాల్  నహతా తీసిన మొదటి సినిమా  'జయంమనదే' లో ఫుల్ లెన్గ్త్ డాషింగ్ ఎండ్ డైనమిక్ హీరో.  ఆనాటి నటీనటులు, నిర్మాతల మధ్యనుండే స్నేహ సుహృద్భావాలకు ఇదొక చక్కని నిదర్శనం.


ఎన్.టి.ఆర్ గెస్ట్ అపియరెన్స్


వచ్చేవారం, మరో ఘంటసాల సజీవరాగం తో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 18 - మారుపల్కవదేమిరా నాతో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...