Saturday, 13 June 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 19 - రావే ముద్దుల రాధా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 19

పెళ్లినాటి ప్రమాణాలు - రావే ముద్దుల రాధా

ఆఫీసులో కొత్తగా చేరిన అమ్మాయితో పరిచయం పెంచుకుని సరాసరి ఒంటరిగా వున్న ఆమె ఇంటికే వెళతాడు ఓ అభినవ కృష్ణుడు. వెళ్ళినవాడు ఊరికేవుండక అక్కడ గోడకున్న రాధాకృష్ణుల చిత్రాన్ని చూస్తూ పరవశంతో పగటికల కంటూ ఆ అమ్మాయితో ఓ చక్కటి ప్రణయగీతాన్ని మొదలెడతాడు...

కృష్ణుడు: రావే ముద్దుల రాధా నా ప్రేమరాశి నీవెగా 

నవ రత్నాల రాశివి నీవెగా! రావే!

రాధ:

పోవయ్యా శ్రీ కృష్ణా! నీ సరసాలన్నీ మాయలే 

నువు దూరాన ఉంటే మేలులే ! పోవయ్యా!

 

కృష్ణుడు:

వనితలెవ్వరు నీ సాటిరారే

నిన్నె నిరతము నే కోరినానే! వనిత!

కోపమేలా దయగను బాలా

తాపమింకా నే తాళజాల !రావే!

రాధ:

మనసు నిలకడ సుంతైన లేదా

తరుణి తరుణితో ఈ ఆటలేనా 

                                            !మనసు!

చాలు చాలును ఈ మాటలేలా

నీటిమూటలు నే నమ్మజాల

                                            !రావే ! ! పోవయ్యా

పెళ్ళికాని నవయవ్వనంలో వున్న యువతీయువకుల మధ్య ఇలాటి ప్రేమసల్లాపాలు, కీచులాటలు ఈరోజుల్లో సహజమని సర్దిపెట్టుకున్నా,  సౌందర్యవతియైన ఓ భార్య మొగుడు, ఓ ముగ్గురి పిల్లల తండ్రి ఈ విధమైన ప్రేమాలాపాలు వల్లిస్తూ  తనచుట్టూ తిరగడం,  అతని ఆఫీసులో పనిచేస్తున్న ఆ యువతికి ఇబ్బందికరంగా మారింది. అతనిని అల్లరిపెట్టి పదిమందిలో నిలబెట్టి బుధ్ధిచెప్పడానికి అతడు దుష్టుడో దుర్మార్గుడో కాదు. మనిషి మంచివాడు,  భార్యాబిడ్డలంటే చాలా మమకారం కలవాడు. కానీ అందమైన ఆడపిల్ల విషయంలో చపలత్వం అతని బలహీనత.  అప్పటికీ అతని అంతరాత్మ,  అతనికి నవీనపంథాలో వివాహం జరిపించిన సంఘసంస్కర్త  రూపంలో  అప్పుడప్పుడు ప్రత్యక్షమౌతూ పెళ్ళిరోజున ఆ నవదంపతులు చేసుకున్న ప్రమాణాలను గుర్తుచేసి అతని తప్పిదాన్ని హెచ్చరిస్తూనేవుంటుంది. అయితే కుక్కతోక వంకర సాఫు చేయబడుతుందా!

సుదీర్ఘంగా రోజులతరబడి సాగే సంప్రదాయ హిందూ వివాహాల తంతులో పురోహితులుకాని, పెళ్ళిపెద్దలుకానీ చేయించే ప్రమాణం ఏమిటి? దాని అంతరార్ధం ఏమిటి? ...

"ధర్మేచ, అర్ధేచ, కామేచ, నాతి చరామి" ... దీనికి అర్ధం ఏమిటంటే... నీతినియమాలు పాటిస్తూ ధర్మపథంలో నడుచుకునే ప్రతీ విషయంలో, జీవనోపాధి కోసం సంపదను సన్మార్గంలో చేకూర్చుకునే విషయంలో, సంసారజీవితంలో సుఖసంతోషాలను కోరికలను తీర్చుకునే విషయంలో నీ అభిమతానికి విరుధ్ధంగా నడుచుకోను, ఎల్లప్పుడూ నీకు తోడు నీడగా వుంటానని అర్ధం.

(నిజ జీవితంలో   ఎంతమంది దంపతులు ఈ ప్రమాణానికి బధ్ధులై వ్యవహరిస్తున్నారో  అంతరాత్మ సాక్షిగా ఎవరికివారే ఆలోచించుకోవలసిన విషయం).

సంసారజీవితంలో భార్యాభర్తలకు ప్రేమగండం ఏర్పడుతుంది. భార్యకు పరపురుషుడి వలన, భర్తకు పరాయి స్త్రీ వలన ఈ ప్రేమగండం కలుగుతుంది. ఆ గండం నుండి బయటపడడానికి ఆ భార్యాభర్తలు తమ పెళ్ళిరోజున  కలసి వేసిన ఏడడుగులను, మంత్రాలసాక్షిగాపురోహితులు, బంధుమిత్రుల సమక్షంలో చేసుకున్న ప్రమాణాలను, వేసిన మూడు ముళ్ళ మంగళసూత్రాన్ని నిత్యమూ గుర్తుచేసుకోవాలి. తాము ఆ పని చేయకపోయినా తమ మనస్సాక్షి అనునిత్యమూ గుర్తుచేసి  వేధిస్తూనేవుంటుంది. ఆ మనస్సాక్షికి విరుధ్ధంగా తప్పిదాలు చేస్తే ఆ దంపతుల జీవితం సర్వనాశనం అవుతుందని అందువల్ల శీలం విషయంలో భార్యాభర్తలిద్దరూ నీతినియమాలు పాటించాలని పెళ్ళి ప్రమాణాలు చేయించిన పెద్దమనిషి హెచ్ఛరిస్తాడు. తనకు అటువంటి సమస్యే రాదని, తాను చాలా మనోనిగ్రహం కలవాడినని తనను ఏ ప్రేమగండమూ పీడించదని పదిమందిలో డంబాలు పలుకుతాడు మన హీరో.

"మొన్నటికన్నా నిన్నవింతగా

నిన్నటికన్నా నేడు వింతగా నీ సొగసు

నీ వగలు హాయి హాయిగా వెలసేనే...." అని  

"తనువు నాదిగా, మనసు నీదిగా... 

రేయి పగలుగా, పగలే రేయిగా 

నీతోనే లోకమూ నీతోనే స్వర్గమూ" 

అంటూ ప్రణయగీతాలు ఆలపించిన ఆ కథానాయకుడు ముగ్గురి బిడ్డల తండ్రి అయ్యాక తన ఆఫీసులో పనిచేసే అమ్మాయితో స్నేహం మొదలెట్టి పెళ్ళినాడు చేసిన ప్రమాణాలకు ద్రోహం చేస్తాడు. తమ స్నేహం లోకాతీతమని, అతి పవిత్రమని, సామాన్యులకు అర్థంకాని బంధమని అందుచేత పరపురుషులతో స్నేహం చేయవద్దని తనక్రింద పనిచేసే ఆ అమ్మాయికి హితోపదేశం చేస్తాడు. ఆ యువతి మాత్రం చాలా మంచిది. ఏ చెడు ఉధ్దేశాలు లేనిది. సంస్కారంగలది. అందుకే అతను ఆమెతో కలసి కనే పగటికలలో ఆమె...

" ఏదో తెలియక పిలచితినోయీ...

వాదుకు రాకోయీ...

అని

"మనసు నిలకడ సుంతైన లేదా...

తరుణి తరుణితో ఈ ఆటలేనా

చాలు చాలును ఈ మాటలేలా...."

అంటూ అతని ప్రేమకలాపాలను సున్నితంగా తిరస్కరిస్తూంటుంది. మంచి తెలివితేటలు, సంస్కారము, వివేకము, విచక్షణా గల ఆ అభ్యుదయ యువతి అతనిని సన్మార్గంలో పెట్టి అతని భార్యాపిల్లలకు సహాయపడడానికి నిశ్చయించుకుంటుంది. ఇదే  స్థూలంగా నేటి మన ఘంటసాల సజీవరాగానికి, ఈ పాట గల 'పెళ్ళినాటి ప్రమాణాలు' సినిమాకు గల నేపథ్యం.

సినిమా డైరెక్టర్ హోదాలో సెట్ మీదకు వచ్చాక సిగరెట్ల మీద సిగరెట్లు తగలేస్తూ ఆలోచించడం, సిగరెట్ పెట్టెల అట్టల వెనకాల ఆ సీన్ కు కావలసిన డైలాగ్ లు వ్రాయడం, డైలాగులు చెప్పడం చేతకాని నటీనటులచేత ఎబిసిడిలు 26 వల్లింపజేసి డబ్బింగ్ ఆర్టిస్ట్ లచేత మాట్లాడించి వాయిస్ మిక్స్ చేయడం వంటి పధ్ధతులకు బధ్ధ విరోధి ఆయన. సినీమా  షూటింగ్ మొదలెట్టడానికి మూడు మాసాల ముందే పూర్తి సినీమాకు కావలసిన స్క్రిప్ట్, సీన్ డివిజన్, కెమెరా ఏంగిల్స్, షాట్ డివిజన్ మొదలైనవాటినన్నింటినీ స్వహస్తాలతో ఒక పెద్ద పుస్తకంలో రాసుకుని దానిని తు.చ. తప్పకుండా తెరకెక్కించడం ఆయన సంప్రదాయం. షూటింగ్ సమయంలో అంతకన్నా మంచి ఆలోచనలు మనసులో మెదలినా వాటిని తన తర్వాతి సినీమాలో ఉపయోగించవలసిందే తప్ప ఈ సినిమా స్క్రిప్ట్ ను మార్చడానికి ససేమిరా ఒప్పుకునేవాడు కాదు. అలాగే ఆ సినిమా కోసం కేటాయించబడిన ముడి ఫిల్మ్ కోటాలో,  అనుకున్న బడ్జెట్ లోపలే సినీమాను ముగించడంలో అఖండుడు ఆయన. సినీ నిర్మాణానికి బ్రహ్మర్షి, మార్గదర్శి.

ఆయనే కదిరి వెంకటరెడ్డి. కళ, వ్యాపారం రెంటిని సమాన పాళ్ళలో అనుసరిస్తూ సినీమాలు తీసిన అత్యుత్తమ దర్శకుడు కె.వి.రెడ్డి. ఆయన అడుగుజాడలలోనే నడిచి దర్శక నిర్మాత గా ఎనలేని ఖ్యాతి నార్జించిన నటుడు ఎన్.టి.రామారావు. ఎంత ఆలస్యమైనా ఫర్వాలేదు తన మొదటి  సాంఘిక చిత్రానికి కె.వి.రెడ్డిగారే దర్శకత్వం వహించాలని కాచుకుని కూర్చొని కె.వి.రెడ్డిగారి దర్శకత్వంలో 'దొంగరాముడు' సినీమా ను తీశారు అన్నపూర్ణ పిక్చర్స్ దుక్కిపాటి మధుసూదనరావుగారు.

భక్తి, జానపదపౌరాణిక చిత్రదర్శకత్వంలో అసమాన్యుడైన కె.వి.రెడ్డిగారు నిర్మాతగా తన జయంతీ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మించిన తొలి సాంఘిక చిత్రం 'పెళ్ళినాటి ప్రమాణాలు'  తన 30 ఏళ్ళ సినిమా జీవితంలో కె.వి.రెడ్డిగారు మూడే మూడు సాంఘిక సినిమాలకు దర్శకత్వం వహించారు. అవి వాహినీవారి 'పెద్ద మనుషులు',  అన్నపూర్ణా పిక్చర్స్ 'దొంగరాముడు', జయంతీ పిక్చర్స్ 'పెళ్ళినాటి ప్రమాణాలు'. మూడూ మూడు ఆణిముత్యాలు. ఈ మూడు సినీమాలు ఘనమైన ఆర్ధిక విజయం సాధించడమే కాక ఉత్తమ చిత్రాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం బహుమతులు  పొందాయి.

తొలిసారిగా కె.వి.రెడ్డిగారు నిర్మాతగా, దర్శకుడిగా  తెలుగు ప్రేక్షకులకు సమర్పించిన చిత్ర కళాఖండం 'పెళ్ళినాటి ప్రమాణాలు'. పెళ్ళైన మగవారి చపలత్వం, పరస్త్రీ వ్యామోహం కథాంశంగా గల సినీమా. కథాంశం తీవ్రమైనదీ, గంభీరమైనదీ అయినా  ఏడ్పులు పెడబొబ్బలు, శోకగీతాలతో ప్రేక్షకులను విసిగించకుండా ఆద్యంతం వినోదాన్ని పుష్కలంగా పంచి సినిమాను హాస్యరసాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా ద్వారా సమాజానికి తాను ఇవ్వదల్చిన సందేశాన్ని అతి సున్నితంగా అందించారు కె.వి. రెడ్డి. తనకు అత్యంత సన్నిహితులైన పింగళి నాగేంద్రరావుగారి మాటలు పాటలు, ఘంటసాల వేంకటేశ్వరరావుగారి సంగీతం ఈ సినిమా ఉన్నత ప్రమాణాలకు ఎంతో దోహదం చేశాయి. పింగళి వారి మాటల్లోని, పాటల్లోని సున్నితమైన హాస్యం ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టింది.

కథా వస్తువుకు అనుగుణంగా తన సంగీతాన్ని కూడా వినోదభరితంగా జనరంజకంగా సమకూర్చారు ఘంటసాల. పెళ్ళినాటి ప్రమాణాలు సినీమా లో మొత్తం 11 పాటలు పద్యాలు వున్నాయి. అందులో ఓ రెండు పాటలు తప్ప మిగిలినవన్నీ హాస్యశృంగారరస ప్రధానమే. ఆ మూడ్ ను చిత్రం ఆద్యంతం అద్భుతంగా  కొనసాగించారు ఘంటసాల. హీరో  ఎ.ఎన్.ఆర్. పాటలను ఘంటసాల, హీరోయిన్ జమున పాటలను పి.లీల, సెకెండ్ హీరోయిన్ రాజసులోచన పాటలను పి.సుశీల ఎంతో ఉత్సాహభరితంగా ఆలపించారు. మిగిలినవాటిని జిక్కి, సురభి కమలాబాయి, మాధవపెద్ది పాడారు. ఘంటసాలవారి సంగీతదర్శకత్వంలో   అన్ని పాటలు బహుళ జనాదరణ పొందిన సినిమాల లిస్ట్ లోనికి పెళ్ళినాటి ప్రమాణాలు పాటలు కూడా నిస్సందేహంగా చోటుచేసుకుంటాయి. అందుకు ఘంటసాలవారి సంగీతప్రతిభ కొంత కారణమైతే దర్శకుడు కె.వి.రెడ్డిగారి సంగీతాభిరుచి మరికొంత కారణం.

ఈనాటి మన సజీవరాగం - 'రావే ముద్దుల రాధా నా ప్రేమరాశివి నీవెగా నవరత్నాల రాశివి నీవెగా...ఘంటసాల, పి.సుశీల ఆలపించిన ఈ యుగళగీతాన్ని తెరమీద అక్కినేని, రాజసులోచన రాధాకృష్ణుల పాత్రలలో ఎంతో ఉత్సాహంగా అభినయించి ప్రేక్షకులను సమ్మోహనపర్చారు.

ఈ పాటను స్వరపర్చడానికి ఘంటసాల మాస్టారు హిందుస్థానీ రాగమైన పీలును  ఉపయోగించుకున్నారు. పీలు రాగం  హిందుస్థానీ కాఫి థాట్ కు చెందిన రాగం. వక్రసంచారంతో 12 స్వరాలు పలికే సంపూర్ణరాగం. తుమ్రీ, భజన్స్ వంటి లలిత-శాస్త్రీయ గీతాలు, భక్తిశృంగార రస గీతాలాపనకు అనువైన రాగం పీలు. కానీ, ఘంటసాలగారివంటి ఉద్దండ సంగీతదర్శకులు పీలు రాగాన్ని విషాదగీతాలకు కూడా సమర్ధవంతంగా ఉపయోగించుకున్నారు. అందుకు ఉదాహరణ 'పుణ్యవతి' లోని 'ఇంతేలే నిరుపేదల బ్రతుకులు ' పాట. హిందుస్థానీ సంగీతంలోని కిర్వాని, గార వంటి రాగాలు ఈ పీలును పోలివుంటాయి. కర్ణాటక సంగీతంలో పీలుకు సమాంతరమైన రాగం కాపి. ఈ పీలు రాగంలో బహుళ జనాదరణ పొందిన  పాటలెన్నో తెలుగు, హిందీ సినిమాలలో వున్నాయి. పీలురాగ లక్షణాలన్నింటిని సక్రమంగా కనపరుస్తూ ఘంటసాల, సుశీల 'రావే ముద్దుల రాధా...' యుగళగీతాన్ని అత్యంత మధురంగా ఆలపించారు.

ఈ పాటలో వినిపించే తబలా జతులు,  గజ్జెల సవ్వడులతో,  వీణ, సితార్, షెహనాయ్, వయొలిన్స్, ఫ్లూట్, క్లారినెట్ ల సముదాయంతో చేసిన నేపథ్యసంగీతంతో  పీలు రాగభావాన్ని మరింత ప్రస్ఫుటం చేస్తూ శ్రోతలకు రసానందాన్ని కలిగించారు ఘంటసాల.

పెళ్ళినాటి ప్రమాణాలులో ఈ యుగళం మాత్రమే కాదు, అన్ని పాటలు శ్రవణానందాన్ని కలిగించేవే శ్రోతలలో రసహృదయం వున్నంతవరకూ, లాలిత్యంతో కూడిన సంగీతాన్ని ఆస్వాదిస్తున్నంతవరకూ ఘంటసాల గీతాలు సజీవరాగాలే.


వచ్చేవారం, మరల, మదిలో మెదిలే మరో సజీవరాగంతో కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 19 - రావే ముద్దుల రాధా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...