Saturday, 7 November 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 40 - హిమగిరి సొగసులు

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 40


పాండవ వనవాసము – హిమగిరి సొగసులు


ప్రాచీన భారతీయ ప్రబంధ, కావ్య నాయక గుణాతిశయాలను వరుసగా వాటి ఔన్నత్యాన్ని బట్టి నాలుగు విధాలుగా   వర్ణించారు. అవి - ధీరోదాత్తులు, ధీరోద్ధతులు, ధీరలలితులు, మరియు, ధీర శాంతులు. ధీరోదాత్తతకు శ్రీరాముడు, ధర్మరాజు లను; ధీరోద్ధతకు రావణాసురుడు, పరశురాముడు,  దుర్యోధనుడు, భీమసేనులను; ధీరలలితకు శ్రీకృష్ణుడు, వాసవదత్త కావ్య నాయకుడు ఉదయానుడు లను; ధీరశాంతతకు మృచ్ఛకటికం నాటక కధానాయకుడు చారుదత్తుడు, గౌతమబుద్ధుడు మొదలగువారిని ఉదాహరణలుగా శాస్త్రకారులు చెపుతారు.

మహాభారత గాధలో ప్రధాన పాత్రధారులైన దుర్యోధనుడు, భీమసేనుడు... యీ యిద్దరూ ధీరోద్ధత లక్షణ సమన్వితులు.  అత్యంత శౌర్యపరాక్రమాలు, అహంకారం, క్రోధం, ఈర్ష్యా ద్వేషాలు, తొందరపాటుతనం, వీరి సొత్తు. చేసిన ప్రతిజ్ఞలను నెరవేర్చుకోవడానికి  ఎంతకైనా తెగిస్తారు. రజోస్తమో గుణ సంపన్నులు. వీరిలోని ఈ గుణాలను ఆసరాగా చేసుకుని కౌరవులు తరఫున శకుని, పాండవులు తరఫున శ్రీకృష్ణుడు సమయోచితంగా పావులు నడిపి యుగయుగాలకు, తరతరాలకు మరపురాని మహోన్నత మహాభారత గాధను నడిపించారు. మాతృవాక్య పరిపాలన, భాతృ‌ప్రేమ, భార్య యెడల గౌరవపూర్వకమైనప్రేమానురాగాలు భీముడిలో పుష్కలంగా కనిపిస్తాయి. అటువంటి ధీరోద్ధత నాయకుడి సతి ద్రౌపది.

మహాభారత సంగ్రామానికి మూలకారకురాలు ద్రౌపది.  కురు సభలో ద్రౌపది పొందిన ఘోరావమానం, ఆమెలోని ప్రతీకారం వాంఛ కురుక్షేత్ర యుద్ధానికి ప్రేరణ. యుద్ధానంతరం పాండవులు రాజ్యపాలనకు వచ్చాక ద్రౌపది దాదాపు 36 సంవత్సరాలు కురుసామ్రాజ్ఞిగా ఉన్నత స్థానాన్ని అధిష్టించింది. దైవీక శక్తులు, పాతివ్రత్యం, అమితమైన వాక్చాతుర్యం, అసాధారణ ధైర్యసాహసాలు ద్రౌపది సహజ లక్షణాలు. గత జన్మలో శివుడిని భర్తగా పొందాలనే కోరికతో ఓ ముని కుమార్తె ఐదుసార్లు తపస్సు చేసి శివ సాక్షాత్కారం పొందిన ప్రతీసారి పతి కావాలని మాత్రమే కోరుకోవడంతో మరుజన్మలో ఐదుగురు పురుషులకు భార్య అయే వరాన్ని పొందడం వలన పంచపాండవుల పత్ని అయింది.

పాంచాల దేశ మహారాజు ద్రుపదుడు చేసిన మహాయజ్నంలో అగ్నిగుండం నుండి మహా తేజస్సు తో ఉద్భవించిన కన్య ద్రౌపది. ఆమె ద్రౌపది, పాంచాలి, యజ్నసేని, కృష్ణ (నల్లటి దేహఛాయ గలది) అనే నామాలతో పిలువబడేది. యాదవకుల శ్రీకృష్ణుడి పరమ భక్తురాలు, అంతేకాదు, కృష్ణుడు ఆమెను సోదరిగా అభిమానించి పలు సందర్భాల్లో ఆమెకు అండగా నిలిచి ఆదరించాడు. భారతీయ పురాణ ఇతిహాసాలలో ద్రౌపదిని పంచకన్యలలో ఒకరిగా వర్ణించారు.

పంచకన్యలంటే ఎవరు? అంటే... తెలిసో, తెలియకో చేసిన పాపాలను తొలగించుకోవడానికి నిత్యము చూపించవలసిన ఐదుగురు పవిత్ర స్త్రీ సముదాయాన్ని  పంచకన్యలంటారు

రామాయణ కాలంనాటి గౌతమ ముని సతీమణి అహల్య,  శ్రీరాముని పత్ని సీత,  వాలి భార్య తార,  రావణాసురుని సతీమణి మండోదరి; మహాభారత కాలం నాటి ద్రౌపది పంచకన్యలుగా పూజింప బడుతున్నారు. సీతకు బదులు పాండురాజు భార్య, పంచపాండవుల తల్లియైన కుంతీదేవిని పంచకన్యగా కొన్ని పురాణాలు పేర్కొంటున్నాయి.

కన్య అంటే వివాహం కాని యువతి అనే అర్థంలో మనం చెప్పుకుంటారు. కానీ పైన చెప్పిన ఐదుగురు స్త్రీలు వివాహితులే  అయినప్పటికీ తమ శీలానికి సంబంధించిన అనేక తీవ్ర సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని తమ పవిత్రతను, పాతివ్రత్యాన్ని నిలుపుకున్నారు. అందుకే భారతీయులు వీరిని పంచకన్యలుగా పరిగణించి,  వీరి నామస్మరణ పుణ్యప్రదం గా భావిస్తారు. యజ్నగుండం నుండి కన్యగా ఉద్భవించిన ద్రౌపది వివాహానంతరం కూడా పొందిన పరాభవాలు, అవమానాలు అనేకం. మాయా జూదంలో సర్వస్వం కోల్పోయిన పాండవులతో కలసి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం, రెండేళ్ళ అజ్ఞాతవాసం చేసి అష్టకష్టాలు అనుభవించిన ధర్మపత్ని. స్వయంవరంలో తనను గెలుచుకుని వరించినది అర్జునుడే అయినప్పటికీ,  గత జన్మలో పరమేశ్వరుడి వర ప్రభావం వలన, ఈ జన్మలో  పంచపాండవుల మాతృమూర్తియైన కుంతీదేవి అనాలోచిత వాక్య పరిపాలనా నిర్బంధం వలన పాంచాలి పంచభర్తృక అయింది. నారదమహర్షి సలహా మేరకు సంవత్సరానికి ఒక భర్తగా పంచపాండవులతో సంసార జీవితం చేసింది.  ఆ సమయంలో ఏ భర్తతో జీవితం పంచుకుంటున్నదో అతనిని తప్ప ఇతరులు తలంపే  రాని విధంగా  దైవీక శక్తుల అనుగ్రహంతో తన పాతివ్రత్య ధర్మాన్ని కాపాడుకున్నది.

మహాభారతం అరణ్య, విరాటపర్వాలలో భీమసేనుడు, ద్రౌపదే ప్రధాన భూమికలు వహిస్తారు. హిండింబాసుర, కీచకవధ, సౌగంధికాపహరణం మొదలైన సంఘటనలన్నీ పాండవుల అరణ్యవాసం కాలంలోనే జరిగి భీమసేనుని అవిక్రమ పరాక్రమాలు, ధీరోద్ధతనాయక లక్షణాలు లోకవిదితమయాయి.

పండితుల మొదలు పామరులవరకు అన్ని వర్గాలవారికి వినోద, విజ్ఞాన, వికాసాలు, ధర్మార్ధ మోక్ష సూత్రాలను నేర్పించే ఉత్తమ గ్రంథం మరేముంటుంది మహాభారతం తప్ప.

విజయవంతమైన సినిమా తీయడానికి  కావలసిన సమస్త అంశాలు పుష్కలంగా గల గాధ మహాభారతం. కురుక్షేత్ర భూమిపై శ్రీకృష్ణ పరమాత్మ ప్రవచించిన భగవద్గీతతో సహా 18 పర్వాల మహాభారతాన్ని యధాతధంగా తెరకెక్కించడమనేది మానవమాత్రులకు సాధ్యమయే కార్యం కాదు.

అందుకే మహాభారత గాధలోని కొన్ని రసవత్తర ఘట్టాలను మాత్రం తీసుకుని భారతీయ భాషలన్నిటిలో సినీమాలను, టెలివిజన్ ధారావాహికలుగాను నిర్మించడం జరిగింది. పౌరాణిక సినీమాలంటే తెలుగువారికి వున్న మక్కువ, మమకారం అసామాన్యం. తెలుగుభాష లో వచ్చినన్ని రామాయణ, మహాభారత గాధా చిత్రాలు మరే భాషలోనూ రాలేదంటే అది అతిశయోక్తి కానేకాదు. మూకీల కాలంనుండి నేటి హైటెక్ డిజిటల్ సినిమా యుగం వరకు పౌరాణిక సినీమాలు ప్రజాదరణ పొందుతునే వున్నాయి.

అలాటి ఒక ఉత్తమ పౌరాణిక చిత్ర కళాఖండమే 1965లో వచ్చిన సంగీత రసభరిత 'పాండవ వనవాసము'. మహాభారతంలోని అరణ్య, విరాట పర్వాలలోని రసవత్తర ఘట్టాలను తీసుకుని కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో మాధవీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అడుసుమిల్లి సీతా రామాంజనేయులు నిర్మించిన అజరామర పౌరాణిక చిత్రం పాండవ వనవాసము.

ఏ విధమైన పౌరాణిక పాత్రలు పోషించాలన్నా అలంకార శాస్త్రకారులు నిర్దేశించిన కావ్య నాయక లక్షణాలు, ఆంగిక, వాచకం, అభినయ సామర్థ్యంగల ఏకైక నటుడు, యావత్ భారతదేశంలో నందమూరి తారక రామారావు ఒక్కరే అంటే అది ప్రాంతీయ దురభిమానంగా భావించనేకూడదు. అటువంటి విలక్షణ నటుడిని  పాండవ వనవాసములో ధీరోద్ధత నాయకుడైన భీమసేనుని పాత్రకు ఎన్నుకున్నారు నిర్మాత ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు, చిత్ర దర్శకుడు కమలాకర కామేశ్వరరావు.

భీముడికి అన్నివిధాలా సమవుజ్జీయైన సుయోధన చక్రవర్తి పాత్రకు ఎస్.వి.రంగారావును, మహాభారత కథానాయిక ద్రౌపది పాత్రకు సావిత్రిని, శకుని పాత్రకు ముదిగొండ లింగమూర్తిని ఎన్నుకుని సినిమా ఘన విజయంపట్ల విడుదలకు ముందే  ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఉత్కంఠను రేకెత్తించారు. పాండవ వనవాసములో ఇతర పాత్రల్లో నటించిన ఇతర నటీనటులంతా కూడా తెలుగు చలనచిత్ర సీమలోని నటదిగ్గజాలే. అందరూ సాటిలేని మేటి నటులే. ఆనాటికింకా నటిగా స్థిరపడని, తరవాతికాలంలో డ్రీమ్ గర్ల్ గా ప్రసిద్ధిపొందిన ప్రముఖ నర్తకి, బాలీవుడ్ నటి హేమమాలిని ఒక నృత్య సన్నివేశంలో (సినిమా పరిభాషలో item songలో) నటించడం  ప్రత్యేక ఆకర్షణ. ఇంతమంది ఘనాపాటీలతో పాండవ వనవాసాన్ని భారీగానే తీయ సంకల్పించారు నిర్మాత, వాణీ ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ కు అధినేత కూడా అయిన ఎ.ఎస్.ఆర్.

పౌరాణిక సినీమాలంటే ఎన్నో పాటలు, పద్యాలతో సంగీత, సాహిత్య ప్రధానంగా వుంటాయి. ఆ శాఖలను నిర్వహించే బాధ్యతను శాస్త్రీయ, లలితసంగీతాలలో నిష్ణాతుడైన ఘంటసాలకు, సాహితీ పాండిత్య ప్రకర్ష గల సముద్రాల రాఘవాచార్యులవారికి అప్పగించారు నిర్మాత. పాండవ వనవాసము సినిమా ద్వారా చిత్రసీమలోకి అడుగుపెట్టిన మరో ప్రముఖుడు నిన్నటి మేటి దర్శకేంద్రుడు  కోవెలమూడి రాఘవేంద్రరావుగారు. నేను మొదటిసారి చూసిన నాటికి నెరిసిన గెడ్డాలుపెంచని నవయువకుడు.

మాధవీ ప్రొడక్షన్స్ ఆఫీసు అప్పట్లో టి.నగర్ లో ఘంటసాలగారింటికి కొంచెం దూరంలో హబీబుల్లా రోడ్ కు సమీపంలోని ఓ పెద్ద భవనంలో వుండేది. అక్కడే ఘంటసాలగారి మ్యూజిక్ కంపోజింగ్ సెషన్స్ జరిగేవి. ఆ కంపోజింగ్ లలో అసిస్టెంట్ డైరెక్టర్ హోదాలో రాఘవేంద్రరావుగారిని తరచూ చూస్తూ ఉండేవాడిని.

సముద్రాలవారి కథాకధనం ప్రకారం పాండవ వనవాసము సినిమాలోని చాలా పాటలు, పద్యాలు సన్నివేశపరమైనవే.    ఆ విధాన ఉపపాత్రధారుల మధ్యే ప్రేమ సంభాషణలకు, యుగళగీతాలకు అవకాశం వుంది తప్ప ప్రధాన పాత్రధారులైన ధర్మరాజు, భీమార్జునులు, ద్రౌపది మధ్య శృంగారానికి తావే లేదు. కానీ, ఈ కథలో ముఖ్యనాయకుడైన భీమసేనుని, ఆ పాత్రను పోషిస్తున్న ఎన్.టి.రామారావును, ఆయన అభిమానుల ఆనందం కోసం భీముడు, ద్రౌపదిని మధ్య ఒక విలక్షణమైన యుగం గీతం పెట్టవలసిన అవసరం ఎంతైనా వుందని నిర్మాత అభిప్రాయపడ్డారు. నిర్మాత, దర్శకుడు, కథా/గీత రచయితల సుదీర్ఘ చర్చల అనంతరం భీముడు, ద్రౌపదిల మధ్య ఒక శృంగార గీతాన్ని పెట్టడానికి నిర్ణయించారు. ఆ పాట ఎలా వుండాలనే చర్చ. ప్రవృత్తి రీత్యా భీముడు ధీరలలిత నాయకుడో, శృంగారపురుషుడోకాదు. ధీరోద్ధత నాయకుడు. శౌర్యప్రతాపాలు గలిగిన గంభీర పురుషుడు. భార్య పట్ల అమితమైన ప్రేమాభిమానాలు, గౌరవమర్యాదలు కలవాడు. నీతి నియమాలు అతిక్రమించనివాడు. ఈ లక్షణాలన్నింటిని దృష్టిలో వుంచుకుని పాట రచన సాగాలి. దానికి తగిన వరస కుదరాలి. గీత రచయిత ఆచార్యులవారికి, సంగీతం దర్శకుడు ఘంటసాలవారికి ఒక విషమ పరీక్ష. సముద్రాల వారు పల్లవులు ఇవ్వడం, మాస్టారు వాటికి ట్యూన్ లు కట్టి దర్శకుడు కామేశ్వరరావుగారికి, నిర్మాత ఎ.ఎస్.ఆర్.గారికి వినిపించడం, వాటి మీద వారి అభిప్రాయాలు చెప్పడం, మరొకటి, మరొకటి ఆలోచించమనడం.... ఇలా కొన్ని సిట్టింగ్స్ అయిన తర్వాత ఫైనల్ గా ఒక యుగళ గీతం అందరి ఆమోదానికి నోచుకుంది. ఆ పాటే... ' హిమగిరి సొగసులు మురిపించునూ మనసులూ...' అదే నేటి మన ఘంటసాలవారి సజీవరాగం.

 

ద్రౌపది:

 ఆలాపన...

హిమగిరి సొగసులు మురిపించునూ మనసులూ

!హిమగిరి!

 

భీముడు:

ఊ.. ఆపావేం.. పాడు..

ద్రౌ.

హిమగిరి సొగసులూ మురిపించునూ మనసులూ !హిమగిరి!

 

యోగులైనా మహాభోగులైనా మనసుపడే మనోజ్ఞ సీమా

 

భీ.

సురవరులూ సరాగాల చెలులా

ద్రౌ. ఆలాపన

భీ. సురవరులూ సరాగాలు చెలులా

కలసీ సొలసే అనురాగ సీమ

 

ద్రౌ.

హిమగిరి సొగసులు మురిపించునూ మనసులు

 

ఈ గిరినే ఉమాదేవి హరుని సేవించీ తరించెనేమో

 

భీ. ఆలాపన

ద్రౌ. ఈ గిరినే ఉమాదేవి హరునీ సేవించీ తరించెనేమో

భీ. ఆలాపన

ద్రౌ. ఈ గిరినే ఉమాదేవి హరునీ సేవించీ తరించెనేమో

భీ. సుమశరుడూ రతీదేవి జేరీ కేళీ తేలి లాలించె లేమా

 

ద్రౌ. హిమగిరి సొగసులూ మురిపించునూ మనసులూ..

భీ. ఆలాపన

ద్రౌ. హిమగిరి...

భీ.,ద్రౌ. హమ్మింగ్..

 

హిమాలయా పర్వతశ్రేణుల్లో విహరిస్తూ ఆలపించే ఈ లలితశృంగారగీతంలో భీమసేనుడు, ద్రౌపదిల పరస్పర విరుద్ధ భావాలు వ్యక్తమవుతున్నాయి. ద్రౌపది మనోభావాలు దైవీక ఆధ్యాత్మిక చింతనతో కూడినవిగా వుంటే భీముడి ఆలోచనలు శృంగారం, రతీమన్మధుల కేళీకలాపాలవేపే సాగుతూ ఉంటాయి. అలాగే పాటలోని ఆలాపనలు ... ద్రౌపది చేసే ఆలాపనలు సున్నితంగా, శ్రావ్యంగానూ వుంటే భీముడి ఆలాపనలలో గాంభీర్యం, కాస్తా మొరటుదనం ధ్వనిస్తాయి.  

ఈ సినిమా ఆద్యంతం భీమసేన పాత్రధారి ఎన్.టి.రామారావు ఒక విలక్షణమైన నడకను, అభినయాన్ని ప్రదర్శించారు. అలాంటి సందర్భాలలో ఎన్.టి.ఆర్ నడకమీద రీరికార్డింగ్ లో మాస్టారు ప్రయోగించిన గిటార్ బిట్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించి జనాదరణ పొందాయి. అలాంటి గిటార్ బిట్ ఒకటి ఈ పాట ప్రారంభంలో వినిపిస్తుంది. పాట వైబ్రోఫోన్ స్ట్రోక్  తో, తార్ షెహ్నాయ్ అన్న విశేష వాద్యంతో కూడిన సుశీల రాగాలాపనతో 'హిమగిరి సొగసులు' పాట పల్లవి ప్రారంభమవుతుంది. మాస్టారు ఈ పాటకోసం ఉపయోగించిన వాద్యాలు... వైబ్రోఫోన్, ట్యూబోఫోన్, జలతరంగిణి, తార్ షెహ్నాయ్, సారంగి, బేస్ గిటార్, సితార్, ఫ్లూట్, క్లారినెట్, వయొలిన్స్, తబలా, డోలక్, ఇతర రిథిమ్స్.

ఈ పాటకోసం ఘంటసాల మాస్టారు తీసుకున్న రాగం ద్విజావంతి. దీనినే హిందుస్థానీ శైలిలో జైజైవంతి అంటారు. కర్ణాటక సంగీత ముమూర్తులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితార్  రాగాన్ని కర్ణాటక సంగీతంలో ద్విజావంతిగా ప్రవేశపెట్టారు. ఖమాస్ థాట్ కు చెందిన జైజైవంతి కర్ణాటక సంగీతంలో ద్విజావంతిగా 28వ మేళకర్త హరికాంభోజి జన్యరాగంగా ప్రసిద్ధి చెందింది.

పాట ప్రారంభంలో వినవచ్చే సుశీల గారి మృదుమధురమైనరాగాలాపన ద్వారా ఈ ద్విజావంతి రాగం స్వరూపమంతా వ్యక్తీకరించారు ఘంటసాల మాస్టారు. కర్ణాటక సంగీత నుడికారంతో హిమగిరి సొగసులు పాటను మాస్టారు, సుశీల  అద్భుతంగా గానం చేసి అజరామరం చేశారు. అందుకు ఎన్.టి.ఆర్, సావిత్రి మనోజ్ఞాభినయం మరింత రాణింపును తీసుకువచ్చింది. సన్నివేశానికి, సందర్భానికి తగిన పర్వతప్రాంతీయ సంగీతాన్ని రీరికార్డింగ్ లో వినిపించారు ఘంటసాల.

పాండవ వనవాసం సినిమా లో వున్న తొమ్మిది పాటలు, పదమూడు పద్యాలు/శ్లోకాలు అన్నీ బహుళ ప్రచారం పొందాయి. తొమ్మిది పాటల్లో ఏడు పాటలను సముద్రాల రాఘవాచార్య, ఒకటి ఆరుద్ర, ఒకటి కొసరాజు (హేమమాలిని నృత్య గీతం) వ్రాశారు. పద్యాలలో అధికశాతం ఆచార్యులు గారే వ్రాయగా కొన్నింటిని నన్నయ్య భారతం నుండి, మరికొన్ని అనుశృతంగా వస్తున్న శ్లొకాలను తీసుకున్నారు. ఇందులో ధర్మరాజు (గుమ్మడి) పఠించిన సూర్యాష్టక శ్లోకాలను బాలమురళీకృష్ణ ఆలపించారు. ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలో బాలమురళీ పాడిన మొదటి, ఆఖరి చిత్రం 'పాండవ వనవాసము' మిగిలిన పాటలు పద్యాలను ఘంటసాల, లీల, సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, మాధవపెద్ది (దుర్యోధన రంగారావు), పి.బి.శ్రీనివాస్ పాడారు.

మాధవీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు తొలిసారిగా నిర్మించిన భారీ పౌరాణిక చిత్రం 'పాండవ వనవాసము’ పండిత, పామర ప్రశంసలందుకుని ఆర్ధికంగా ఘన విజయాన్నే పొందింది. ఇరవై ఐదు కేంద్రాల్లో శతదినోత్సవాలు, మరికొన్ని కేంద్రాల్లో రజతోత్సవాలు జరుపుకుంది. ఈ సినిమా ను బెంగాలీ లో డబ్ చేయగా అక్కడా మంచి విజయాన్నే పొందింది. జె.వి.రాఘవులు ఆ డబ్బింగ్ సినిమాకు సంగీతం నిర్వహించారు. మిగిలిన పాటలను ఇతర బెంగాలి, హిందీ గాయకులు పాడగా  ఆంజనేయ దండకాన్ని మాత్రం తెలుగులో ఘంటసాలగారు పాడినదాన్నే బెంగాలీలో కూడా యథాతథంగా  వుంచేసారు.

ఎన్నో ఆసక్తికరమైన విషయాలు గల పాండవ వనవాసములో ఆంజనేయుడిగా అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ప్రముఖ పహిల్వాన్ అజిత్ సింగ్ నటించడం ఒక విశేషం. ఆయన ఘంటసాలగారి గాత్రానికి ముగ్ధుడై తాను వెళ్ళిన ప్రతీ చోటా తనకోసం ఘంటసాల మాస్టారు ఆలపించిన ఆంజనేయ దండకాన్ని అందరికీ వినిపించేవారట.

తెలుగులో నిర్మించబడిన అత్యుత్తమ భారి పౌరాణిక చిత్రాలలో పాండవ వనవాసము కూడా ఎప్పటికీ  ముందు వరుసలోనే వుంటుంది.

 




కొసమెరుపు:

"హిమగిరి సొగసులు" పాటను సహజసిద్ధ ప్రకృతి సౌందర్యాలుతో నిండిన హిమాలయా లోయల్లో, మైదానాల్లో షూట్ చేస్తారనే వార్త వినవచ్చింది. కానీ, తన బిజీ షెడ్యూల్స్ కారణంగా మద్రాస్ వదిలి  ఎక్కువ రోజులు సుదూర  ప్రాంతాలకు  తరలి వెళ్ళడానికి ఎన్.టి.రామారావుగారు సుముఖత చూపకపోవడంతో కడుపులో చల్ల కదలకుండా పాట షూటింగ్ ను మద్రాసు వాహినీ స్టూడియో సెట్లోనే ముగించేసారు. పాటలో, సన్నివేశం లో పస వుంటే అది ఎక్కడ షూట్ చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారని 'హిమగిరి సొగసులు' నిరూపించింది.

 

వచ్చే వారం, ఘంటసాల వారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 40 - హిమగిరి సొగసులు

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను...