Saturday, 30 November 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 58వ భాగం - మనసున మనసై బ్రతుకున బ్రతుకై

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైయెనిమిదవ భాగం ఇక్కడ

58వ సజీవరాగం -  మనసున మనసై బ్రతుకున బ్రతుకై
చిత్రం - డాక్టర్ చక్రవర్తి
గానం - ఘంటసాల 
రచన - శ్రీశ్రీ
సంగీతం - సాలూరి రాజేశ్వరరావు

పల్లవి:
మనసున మనసై బ్రతుకున బ్రతుకై 
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము !!మనసున!!

ఆశలు తీరని ఆవేశములో ఆశయాలలో
ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతములో 
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము
                           !!మనసున!!

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు 
నీకోసమే కన్నీరునించుటకు - 2
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము...
                          !!మనసున!!

చెలిమియె కరువై వలపే అరుదై
చెదరిన హృదయమె శిలయైపోగా
నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే
తోడొకరుండిన అదే భాగ్యము
అదే స్వర్గము... మనసున మనసై!
                          !!మనసున!!

          
సంతోషం , దుఃఖం; విజయం , ఓటమి - ఇవన్నీ ఒకే సమయంలో సంభవిస్తే  ఒక వ్యక్తి ఎలా స్పందిస్తాడు; అతనిలోఈ భావాలు ఎలా ప్రతిఫలిస్తాయి. మాటల్లో చెప్పలేని  భావాలు సంగీతం ద్వారా వ్యక్తపర్చవచ్చని సంగీతజ్ఞులు అంటారు.  సంగీతరాగాల ద్వారా ఆయా మనోభావాలను స్పష్టంగా ప్రకటించవచ్చని గతకాలపు సంగీతవిద్వాంసులు నిరూపించారు. హిందుస్థానీ సంగీతంలో రాగాలను ఆలపించడానికి  ప్రత్యేకమైన కాలనిర్ణయం వుంది.

ఉదయకాలపు రాగాలు, సాయంకాల రాగాలు, రాత్రివేళ రాగాలుగా వర్గీకరించడం జరిగింది. గత తరం ప్రముఖ సంగీత విద్వాంసులందరూ ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించేవారు. ఆయా సమయాలకు నిర్దేశించిన రాగాలను మాత్రమే తమ కచేరీలలో వినిపించడం ద్వారా రసస్ఫూర్తిని సాధించేవారు. హిందుస్థానీ సంగీతంలో  'జయజయవంతి ' అనే రాగం వుంది. ఖమాస్ థాట్ కు చెందిన రాగం. దీనినే కర్ణాటక సంగీతంలో ద్విజావంతి అంటారు. 28 వ మేళకర్త హరికాంభోజి జన్య సంపూర్ణరాగం.  జయజయవంతి సాయంకాలపు రాగంగా నిర్ణయించడం జరిగింది. మనిషిలో సంతోషం, దుఃఖం, సాధన, ఓటమి పొందినప్పుడు కలిగే భావాలన్నీ ఈ జయజయవంతి లేదా ద్విజావంతి రాగంలో ప్రతిఫలిస్తాయని సంగీత విశ్లేషకులు చెపుతారు. ఈ రాగానికి దగ్గరలో వుండే మరో హిందుస్థానీ రాగం 'గార'.  నౌషద్ సంగీత దర్శకత్వంలో లతా మంగేష్కర్  ' ముఘల్ ఈ అజం' సినీమా కోసం పాడిన ' మోహెపన్ ఘట్ పె నందలాల్' భక్తిగీతం ఈ ' గార' రాగంలో చేసినదే.

భక్త జయదేవ చిత్రం కోసం సాలూరు రాజేశ్వరరావు గారు స్వరపర్చిన 'ప్రియే చారుశీలే', 'పాండవ వనవాసం' కోసం ఘంటసాలగారు చేసిన ' హిమగిరి సొగసులు' ,  అలాగే ఘంటసాలవారి' భక్త రఘునాధ్' లోని 'ఈ మరపేలా ఈ వెరపేలా' వంటి పాటలు ' ద్విజావంతి' రాగంలోనే వున్నాయి. 

ద్విజావంతి రాగంలో  'డాక్టర్ చక్రవర్తి' సినీమా కోసం సాలూరు వారు స్వరపర్చిన  మరువలేని మరో  అద్భుత గీతం
'మనసున మనసై బ్రతుకున బ్రతుకై''.   అదే ఈనాటి మన  ఘంటసాలవారి   సజీవరాగం .

కవుల సహజ ప్రవృత్తికి విరుధ్ధంగా వైవిధ్యభరితమైన పాటలు వ్రాయించుకోవడంలో అన్నపూర్ణా మధుసూధనరావుగారు దిట్ట. తమ తొలి చిత్రాలలో ఒకటైన ' తోటికోడళ్ళు' సినిమా లో మనసు కవిగా పేరుపొందిన ఆత్రేయగారి చేత  'కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడిచాన', ' డా.చక్రవర్తి లో శ్రీశ్రీగారు వ్రాసిన ' మనసున మనసై ' పాటలు ఇందుకు నిదర్శనం. శ్రీశ్రీగారు, ఆత్రేయగారు తమ మనసులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని ఈ పాటలు వ్రాసారేమో అనే సందేహం శ్రోతలకు కలగడం సహజం. 

అన్నపూర్ణా మధుసూధనరావుగారి మనసెరిగిన సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావుగారు. అలాగే రాజేశ్వరరావు గారి స్వేఛ్ఛకు, స్వాతంత్య్రానికి భంగం కలగకుండా తనకు కావలసిన పధ్ధతిలో అమృతగుళికలవంటి పాటలను చేయించుకున్న ఘనత మధుసూధనరావుగారిది. ఈ సంస్థకోసం సాలూరు వారు స్వరపర్చిన అసంఖ్యాక గీతాలు ఘంటసాల , సుశీల గాత్ర మాధుర్యం వలన నేటికి అజరామరంగా నిలిచిపోయాయి. 

అలాటి ఆపాతమధురమే ఘంటసాలవారు ఎంతో మనోజ్ఞంగా ఆలపించిన  "మనసున మనసై బ్రతుకున బ్రతుకై" పాట. శ్రీశ్రీ, రాజేశ్వరరావు, ఘంటసాల అపురూప కలయికలో రూపొందిన ఈ పాట గత ఆరు దశాబ్దాలుగా తెలుగువారందరినీ ఎంతో ప్రభావితం చేసింది. మనసు చెదిరి మనోక్లేశానికి గురియైన ఎందరికో స్వాంతన చేకూర్చిన గీతం 'మనసున మనసై'.  అన్నీ కలిగివున్న  సంస్కారవంతుడైన ఒక ప్రముఖ డాక్టర్ కు, తన మనసును అర్ధం చేసుకోలేని  ఒక సగటు స్త్రీ జీవిత భాగస్వామిగా లభించి అతని జీవితం నరకప్రాయమైనప్పుడు,  అతని హృదయంలో రగిలే బాధ, ఆవేదనలకు 
ప్రతీక ఈ పాట. ఈ భావాలన్నింటికి తమ అద్వితీయ గాన పటిమతో  ఘంటసాల, నటనా వైదుష్యంతో అక్కినేని నాగేశ్వరరావు గార్లు ప్రాణప్రతిష్ట చేసి చక్రవర్తి అనే ఒక ఉన్నత వ్యక్తిని మన కళ్ళెదుట నిలబెట్టారు.  ఒకరికోసం మరొకరు పుట్టారన్నట్లుగా తెలుగువారంతా భ్రమించడానికి ఈ రకమైన భావగాంభీర్యం గల పాటలే ముఖ్యకారణం.

శాస్త్రీయ సంగీత రాగాల పట్ల గల  చక్కటి అవగాహనతో ద్విజావంతి రాగ లక్షణాలన్నింటిని  ఈ పాటలో ఘంటసాల తన గాత్రమాధుర్యంతో మరింత ఇనుమడింపజేసారు.

కధానాయకుని మనోభావాలను, ఆవేశ, ఆవేదనలను పరిపూర్ణంగా తనలో అనుభవిస్తూ చక్రవర్తి పాత్రలో పూర్తిగా లీనమైపోయి ఆర్తితో ఘంటసాలవారు ఈ పాటను గానం చేశారు. తోడుగా సితార్ జనార్దన్ లాటి ప్రతిభావంతులైన కళాకారులు వాద్యబృందంలో వుంటే హృద్యమైన గీతాలకు స్వరకల్పన చేయడం రాజేశ్వరరావుగారిలాటి వారికి నల్లేరు మీద నడకే. ఈ పాటలో సితార్ తో పాటు ఫ్లూట్, వైయొలిన్స్, పియోనా, తబలా, రిథిమ్స్  వంటి వాద్యాలు సున్నితంగా , శ్రావ్యంగా వినిపిస్తాయి.

తెరమీద అక్కినేని తో పాటు జగ్గయ్య , సావిత్రి కూడా ఈ పాట  సన్నివేశం రక్తికట్టడానికి తోడ్పడ్డారు.

తెలుగు పత్రికా రంగాన  మహిళా రచయిత్రుల నవలలు రాజ్యమేలుతున్న తరుణంలోనే సినీమాలకు కావలసిన మసాలా దినుసులన్నీ వుండే నవలలు చాలానే వెలువడ్డాయి. వాటిలో కోడూరి కౌసల్యాదేవిగారి ' చక్రభ్రమణం' నవల ఒకటి. ఆంధ్రప్రభలో ఉత్తమ నవలగా బహుమతి పొంది ధారావాహిక గా ప్రచురించబడి పత్రిక సర్క్యులేషన్ ను ఎంతగానో పెంచింది. ఆ నవల దుక్కిపాటి , ఆదుర్తి దృష్టిలో పడి  'డా. చక్రవర్తి' సినీమా గా రూపొందింది. గొల్లపూడి మారుతీరావు, ఆత్రేయ  సంభాషణాబలం,  అక్కినేని, సావిత్రి, జగ్గయ్య, జానకి, గుమ్మడి, కృష్ణకుమారి మొదలగువారి నటకౌశలం, అన్నిటికి మించి సాలూరి వారి సంగీతం, ఘంటసాల, సుశీల  గానామృతం డాక్టర్ చక్రవర్తి సినీమా ఘనవిజయానికి ఢోకాలేకుండా చేసింది. 1964 సంవత్సరం లో కేంద్రప్రభుత్వ ఉత్తమ చిత్ర బహుమతిని , రాష్ట్రప్రభుత్వం బంగారు నందిని 'డా. చక్రవర్తి' తన సొంతం చేసుకున్నది. 

తెలుగునాట తెలుగు పాట వున్నంతకాలం తెలుగు హృదయాలలో ఘంటసాలవారి ఈ మనసున మనసై పాట చిరస్థాయిగా నిలిచేవుంటుంది.  



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 

Saturday, 23 November 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 57వ భాగం - జగమే మారినది మధురముగా ఈవేళ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైయారవ భాగం ఇక్కడ

57వ సజీవరాగం - జగమే మారినది మధురముగా ఈవేళ 
చిత్రం - దేశద్రోహులు
గానం - ఘంటసాల 
రచన - ఆరుద్ర
సంగీతం - సాలూరి రాజేశ్వరరావు

పల్లవి:
జగమే మారినది మధురముగా ఈవేళ 
కలలు కోరికలు తీరినవి మనసారా 
                                  !!జగమే!!

మనసాడెనే మయూరమై పావురములు
పాడే ఎల పావురములు పాడే
!మనసాడెనే!
ఇదె చేరెను గోరువంక రామచిలుక చెంత అవి అందాల జంట
నెనరూ కూరిమి ఈనాడే పండెను
జీవితమంతా చిత్రమైన పులకింత
                                  !!జగమే!!

విరజాజుల సువాసన స్వాగతములు
పలుక సుస్వాగతములం పలుక.. ఆ....
తిరుగాడును తేనెటీగ తీయదనముకోరి
అనురాగాల తేలి కమ్మని భావమే
కన్నీరై చిందెను
ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి
                                  !!జగమే!!

"నెనరుంచినాను అన్నిటికి నిదానుడని నేను నీదుపై నెనరుంచినాను" - అంటే ఈ లోకంలో జరిగే సకల కార్యాచరణకు కారణభూతుడవని విశ్వసించి నేను నీపై కృతజ్ఞత కలిగియున్నాను అని అంటారు సద్గురు త్యాగరాజస్వామి తమ కీర్తనలో. నెనరు -  అనే మాటకు ప్రేమ, దయ, విశ్వాసము, స్నేహము,  కృతజ్ఞత వంటి అర్ధాలు ఎన్నో ఉన్నాయి. కవులు తమ తమ భావాలకు అనుగుణంగా ఈ ' నెనరు' అనే మాటను ప్రయోగిస్తూంటారు.

నేటి ఘంటసాల సజీవరాగం లో 'నెనరు కూరిమి ఈనాడే పండెను' అనే పదజాలంతో ఆరుద్ర ఒక పాటలోని చరణాన్ని పూరించారు. ఇక్కడ వారు ఉపయోగించిన 'నెనరు' ప్రేమకు పర్యాయపదంగా భావించవచ్చును.

ఈ మాటలు వినగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేపాట "జగమే మారినది మధురముగా ఈవేళ", దేశద్రోహులు సినీమాలోని పాటే. ఇదే నేటి మన సజీవరాగం.

దేశద్రోహులు చిత్రంలో ఉన్న పది పాటలను ఆరుద్ర, మల్లాది రామకృష్ణశాస్త్రిగారు, చెరొక ఐదు పాటలు వ్రాసారు. ఈ సినీమాలో ఇన్ని పాటలున్నా, దేశద్రోహులు సినిమా పేరు చెప్పగానే సంగీతాభిమానుల కు గుర్తు వచ్చే పాట "జగమే మారినది మధురముగా ఈవేళ" పాట ఒక్కటే. సాలూరి రాజేశ్వరరావుగారి స్వరకల్పనలో ఈ పాట ఆపాతమధురమై అజరామరమయింది.

కళ్యాణి రాగంలో స్వరపర్చబడిన ఈ మధురగీతం సినిమా ప్రధమార్ధంలో ఘంటసాల, సుశీల పాడిన యుగళగీతంగా, ద్వితీయార్థంలో ఘంటసాలవారి సుస్వరంలో ఏకగళ గీతంగా శ్రోతల హృదయాలను దోచుకున్నది. కళ్యాణి రాగ వైశిష్ట్యాన్ని గురించి గతంలో ఇదే శీర్షికలో పలుమార్లు ముచ్చటించడం జరిగింది, కనుక ఆ రాగాన్ని గురించిన పరిచయం చర్వితచరణమే అవుతుంది.

గతంలో కళ్యాణి రాగంలో ఏ సంగీత దర్శకుడు ఏ పాట చేసినా అధికసంఖ్యాకమైన గీతాలను ఘంటసాలే ఆలపించడం, వాటిని పరవశత్వంతో విని ఆదరించిన సంగీతాభిమానులు ఘంటసాల అభిమాన రాగం కళ్యాణి అని ప్రేమతో ఆపాదించడం జరిగింది. ఆ రాగంలో ఎన్ని పాటలు పాడినా ప్రతి ఒక్క పాటకు తన గాన ప్రతిభతో  ఘంటసాల జీవంపోసారు. 

దేశద్రోహులు చిత్రంలో "జగమే మారినది" పాట రెండు సార్లు పునారావృతం కావడం మూలాన మరింతగా శ్రోతల హృదయాలకు చేరువయింది. మొదటిసారిగా ప్రేయసీ ప్రియులు పాడుకునేప్పుడు ఈ పాట  సాహిత్యం అంతిమ చరణంలో ...."ఎదలో ఇంతటీ సంతోషామెందుకో ఎవ్వరికోసమో ఎందుకింత పరవశమో జగమే మారినది మధురమూగా ఈవేళా" అని నాయకుని పరంగా " కలలు కోరికలు తీరినవి మనసారా" అని నాయిక పరంగా పద ప్రయోగం చేసిన ఆరుద్ర రెండవసారి కధానాయకుడు మాత్రమే పాడేటప్పుడు ఆఖరి చరణంలో "కమ్మని భావమే కన్నీరై చిందెను ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి" అనే గంభీరమైన భావంతో పాటను ముగించారు.

తోటలోని యుగళగీతం , తర్వాత పదిమంది మధ్య ఒక పార్టీలో తన ప్రేయసి మరొకరి భార్యగా కనిపించినప్పుడు ఆ మనోభావాల వైవిధ్యాన్ని అత్యద్భుతంగా తన గళంలో పలికించారు ఘంటసాల. ఈ పాట సోలోగా పాడినప్పుడు పైస్థాయిలో సంచారం, కళ్యాణి రాగాలాపన ఘంటసాలవారి గానప్రతిభకు దర్పణం.

ఈ పాట స్వరకల్పనలో రాజేశ్వరరావుగారి ముద్ర సుస్పష్టం. ఆయన ఈ పాటను వెస్ట్రన్ వాల్ట్జ్ బాణీలో చేసారు. భారతీయ, పాశ్చాత్య బాణీల మిశ్రమంగా ఈ పాటను సుస్వరామృతంలో ముంచెత్తారు రాజేశ్వరరావుగారు. ఈ పాట ఆద్యంతం వినిపించే పియోనా, డబుల్ బేస్, తబలా, సితార్, వైయొలిన్, ఫ్లూట్ ల సమ్మేళనం సాలూరి వారి orchestration ప్రతిభకు ఒక మచ్చుతునక.

తెరపై యుగళగీతంలో పాల్గొన్న ఎన్.టిఆర్., దేవికల సరస శృంగారాభినయాలు, ఏకగళ గీతంలో ఎన్.టి.ఆర్ ప్రదర్శించిన గాంభీర్యం, హుందాతనం ఈ పాటకు మరింత విశిష్టతను చేకూర్చింది.

దేశద్రోహులు సినీమా విజయం మాట ఎలా వున్నా , ఆరు దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ఈ ఘంటసాల కళ్యాణి గీతం తెలుగువారందరినీ  నిత్యకళ్యాణిగా అలరిస్తూనేవుంది. 







వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 

Saturday, 16 November 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 56వ భాగం - అలిగినవేళనే చూడాలీ గోకులకృష్ణుని అందాలూ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైయైదవ భాగం ఇక్కడ

56వ సజీవరాగం - అలిగినవేళనే చూడాలీ గోకులకృష్ణుని అందాలూ
చిత్రం - గుండమ్మ కథ
గానం - ఘంటసాల 
రచన - పింగళి
సంగీతం - ఘంటసాల

పల్లవి:
అలిగినవేళనే చూడాలి
గోకులకృష్ణునీ అందాలూ - 2

రుసరుసలాడే చూపులలోనే -2
ముసిముసి నవ్వుల అందాలూ 
                !! అలిగినవేళనే...!!
చరణం 1 :
అల్లన మెల్లన నల్లపిల్లి వలె
వెన్నను దొంగిల గజ్జెలు ఘల్లన-2
తల్లి మేలుకొని దొంగను చూసి ఆ...2
అల్లరిదేమని అడిగినందుకే !     
                !! అలిగినవేళనే...!!
చరణం 2 :
మోహన మురళీ గానము వినగా
తహతహలాడుచు తరుణులు
రాగా !! మోహన !!
ద్రిష్టి తగులునని జడిసి యశోద
!!ద్రిష్టి!!
తనను చాటుగా దాచినందుకే
                !! అలిగినవేళనే...!

అలగడం ఆడవారి జన్మహక్కు. వారి అలుకలు తీర్చి అనునయంతో వారిని సంతోషపెట్టడం మగవారి బాధ్యత.  భరించువాడే భర్త అనే నానుడి వుంది కదా. భర్తలు తప్పు చేసినా చేయకపోయినా అలగడమనేది స్త్రీ నైజం. ప్రేయసీ ప్రియుల మధ్య, భార్యాభర్తల మధ్య అలుకలు, కోపతాపాలు రావడం సహజం 'అల్క మానవుకదా అరాళకుంతలా' అని కృష్ణుడు కాళ్ళబేరానికి వచ్చినా కూడా భామచేత తన్నింపజేశారు  నంది తిమ్మన్నగారు తమ పారిజాతాపహరణం లో. 

శ్రీకృష్ణుడంతటి మోహనాకారుడైన భర్త అలిగితే అతనిని తన చేష్టలతో మరింత రెచ్చగొట్టకుండా  తన భర్తలో బాలకృష్ణునిపరంగా ఆ  చిలిపిచేష్టలను ఊహించుకొని  ఒక ఆదర్శమూర్తి తన  ముద్దు మురిపాలతో అతనిని అనునయించి ,అలుకలు తీర్చి ఎలా తన దారికి తెచ్చుకుందో అనే విషయాన్ని "అలిగినవేళనే చూడాలి గోకులకృష్ణుని అందాలు" అనే పాటలో అతి  రసరమ్యంగా చూపించారు దర్శకుడు కమలాకర,  నిర్మాణ సంచాలకుడు చక్రపాణి, గీత రచయిత పింగళినాగేంద్రరావుగార్లు. 

ఈ పాట గుండమ్మకథ చిత్రంలోనిదని ప్రత్యేకించి చెప్పవలసిన పనిలేదు. చక్కన్నగారికి ఏడుపుగొట్టు వ్యవహారాలు నచ్చవు.  తన సినిమా లోని హీరో హీరోయిన్ లు లైవ్లీగా, లౌవ్లీగా వుంటూ అందరికీ ఆనందం కలిగించాలి. ప్రేక్షకుల ఆనందమే తన ఆనందం. ఆ ఆశయంతోనే  తన సినిమా లన్నీ  సభ్యతతో కూడిన సున్నితమైన హాస్యంతో,  వినోదమే ప్రధానంగా నిర్మించారు. 

మెలొడీ అంటే ప్రాణం పెట్టే గాయక,  సంగీతదర్శకుడు ఘంటసాల. విజయావారి మనసెరిగిన సంగీత దర్శకుడు. ఘంటసాలవారి సంగీత దర్శకత్వంలో విజయావారి చిత్రాలెన్నో సంగీతపరంగా అఖండ విజయాన్ని సాధించాయి. అలాటివాటిలో గుండమ్మకథ ఒకటి. ఈ సినీమా లోని టైటిల్ మ్యూజిక్ తో సహా అన్ని పాటలు సూపర్ హిట్ చేయడంలో ఘంటసాలవారి కృషి , ప్రతిభ అనితరసాధ్యం. 

ఈ సినీమా లోని ప్రతీ ఒక్క పాటా ఒక ఆణిముత్యం, ఒక సజీవరాగం. అలాటి ఒక సజీవరాగమే శ్రీమతి పి. సుశీలగారు అలవోకగా,  సుమధురంగా ఆలపించిన ఏకగళ గీతం  "అలిగినవేళనే చూడాలి". సుశీలగారి గాత్రం ద్వారా ఈ పాటలో వినిపించే ప్రతీ భావము, గమకం, శ్రావ్యత ఘంటసాల మాస్టారి బాణీకి, ప్రతిభకు ప్రతిబింబం.

మాస్టారు ఈ పాటను హిందుస్థానీ రాగమైన 'దేశ్' రాగంలో చేశారు. ఖమాస్ థాట్ కు చెందిన ఈ జన్యరాగం ఔడవ సంపూర్ణరాగం. అంటే అరోహణాక్రమంలో ఐదు స్వరాలు, అవరోహణాక్రమంలో ఏడు స్వరాలు వినిపిస్తాయి.  'దేశ్' రాగంలాగే అనిపించే మరో రాగం ' తిలక్ కామోద్'. ఈ  రెండు రాగాల పట్ల పూర్తి అవగాహన లేకపోతే ఒకదానికొకటి పొరపాటు పడే అవకాశం వుంది.  హిందుస్థానీ సంగీతంలోనే 'దేశి' అని మరో రాగం వుంది. దీనికి దానికి సంబంధం లేదు. 'దేశ్' కు సమాంతరమైన కర్ణాటక రాగం 'కేదారగౌళ'. మనసుకు ప్రశాంతతను, హాయిని చేకూర్చే రాగం 'దేశ్'. ఘంటసాలగారు ఈ రాగంలో అనేక మంచి పాటలు చేశారు. 

ఘంటసాల మాస్టారు ఈ పాటలో ప్రధాన వాద్యంగా షెహనాయ్ ను వినిపించారు. దాక్షిణాత్య సినీమా లలో సితార్ కు మిట్టా జనార్దన్ ఎలా ప్రసిధ్ధుడో, షెహనాయ్ వాద్యానికి పిఠాపురం సత్యం అంతటి లబ్దప్రతిష్టుడు. షెహనాయ్ సత్యం అంటే చిత్రసీమలో తెలియనివారే వుండరు. ఆ సత్యమే ఈ పాటకు షెహనాయ్ వాయించారు.  షెహనాయ్ తో పాటు ఈ పాటలో ఫ్లూట్,  తబలా, కోలు, సితార్, గజ్జెలు, మొదలైన వాద్యాలు ఎంతో మనోజ్ఞంగా వినిపిస్తాయి. శ్రీమతి పి.సుశీలగారి కంఠంలో, పాట మధ్యలో వచ్చే గాత్ర ,   షెహనాయ్  ఆలాపనలు దేశ్ రాగ శ్రావ్యతను, ఆ రాగ విశిష్టతను తెలియజేస్తాయి. సుశీలగారి కంఠంలోంచి వెలువడే పద స్పష్టత, భావప్రకటన, మాధుర్యం, శ్రుతిశుధ్ధత అవి ఆవిడకు మాత్రమే సొంతం. ఇంతకుముందు చెప్పినట్లు ఈ పాటలో ఆవిడ గళంలోనుండి వినిపించిన ప్రతి గమకాలు, సంగతులు, భావప్రకటన అన్ని ఘంటసాలవారి బాణీకి replica.

ఇక తెరపై ఈ పాటకు అభినయించిన సావిత్రి, ఎన్.టి.ఆర్. ఎంతో హుందాగా, చాలా అందంగా కనిపించారు. వారి ఉదాత్త నటకౌశలం, బాలకృష్ణుని  తైలవర్ణ చిత్రాలు, ఈ పాటకు, సన్నివేశానికి మరెంతో పుష్టిని, నిండుదనాన్ని కలిగించి 'అలిగినవేళనే చూడాలి' పాట సజీవరాగమై నిలవడానికి దోహదం చేశాయి.

విలియం షేక్స్పియర్ 'టేమింగ్ ఆఫ్ ది ష్రూ' నాటకం నుండి కొంత, బి.విఠలాచార్యగారి 'మనె తుంబిద హెన్ను' అనే సినిమా కథ నుండి మరికొంత ప్రేరణను పొంది తనదైన బాణీలో చక్రపాణిగారు ఈ చిత్రాన్ని నిర్మించారు.   డైరెక్టర్ గా తన తొలి చిత్రం 'చంద్రహారం'  పరాజయం తర్వాత  విజయా సంస్థలో స్థానం కోల్పోయిన కమలాకర కామేశ్వరరావుగారికి  'గుండమ్మకథ' ద్వారా మరల తన సత్తాను చాటుకునే అవకాశం లభించింది. టైటిల్ రోల్ లో సూర్యకాంతం, ఎన్.టిఆర్., ఎ.ఎన్.ఆర్., ఎస్.వి.ఆర్., సావిత్రి, జమున, రమణారెడ్డి, ఛాయాదేవి, హరనాథ్, ఎల్.విజయలక్ష్మి, రాజనాల, మిక్కిలినేని మొదలగు వారి అద్భుత నటనా ప్రతిభవలన, చక్రపాణిగారి కథాసంవిధానం వలన  ఘంటసాలవారి సంగీతం, గానం వలన గుండమ్మకథ అఖండ విజయం సాధించి  అనేక కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. ద్విభాషా చిత్రంగా మొదలైన గుండమ్మకథ తమిళంలో కూడా "మణిదన్ మారవిల్లై"గా విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగు లో ఎన్.టి.ఆర్ పాత్రను తమిళంలో జెమినీ గణేశన్ పోషించారు.  తమిళ వెర్షన్ కు కూడా ఘంటసాలవారే సంగీతం నిర్వహించారు. తెలుగు పాటల వరసలే తమిళంలో ఉపయోగించారు. తాను తెలుగులో పాడినవాటిని తమిళంలో శీర్కాళి గోవిందరాజన్, ఎ.ఎల్.రాఘవన్ ల చేత  పాడించారు. కొన్ని పాటల మధ్యలో వచ్చే హమ్మింగ్స్ మాత్రం ఘంటసాలవారివి అలాగే ఉంచడం జరిగింది. 

గుండమ్మకథ సినీమా ద్వారా చిత్రంలోని ప్రతీ పాట, డాన్స్ మ్యూజిక్, టైటిల్ మ్యూజిక్ హిట్ చేసిన ఘనత ఘంటసాల మాస్టారికి దక్కింది. 



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 

Saturday, 9 November 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 55వ భాగం - ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైనాలుగవ భాగం ఇక్కడ

55వ సజీవరాగం - ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
చిత్రం - అమరశిల్పి జక్కన్న
గానం - ఘంటసాల 
రచన - ఆత్రేయ
సంగీతం - సాలూరు రాజేశ్వరరావు

పల్లవి:
ఈ నల్లని రాలలో ఏ కన్నులు
దాగెనో .. ఈ బండల మాటునా
ఏ గుండెలు మ్రోగెనో ఓ....
                        !!ఈ నల్లని రాలలో!!
చరణం 1:
పాపాలకు తాపాలకు బహు దూరములో నున్నవి
మునులవోలె కారడవుల
మూలలందు పడియున్నవి
                        !!ఈ నల్లని రాలలో!!
చరణం 2:
కదలలేవు మెదలలేవు
పెదవివిప్పి పలుకలేవు
ఉలి అలికిడి విన్నంతనే
జలజలమని పొంగి పొరలు
                        !!ఈ నల్లని రాలలో!!
చరణం 3:
పైన కఠినమనిపించును
లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న
శిలలే నయమనిపించును
                        !!ఈ నల్లని రాలలో!!

మోహనా? బిలహరిలా వుంది!... పహడి కావచ్చు!?... ఇలాటి అసందిగ్ధతను ఏర్పర్చడం ఒక్క సినీమా పాటలకే సాధ్యం. సినిమా పాటలకి రాగనిర్ణయం చేయడం అంత సులభమూ కాదు, అంత అవసరమూ లేదని సంగీత విశ్లేషకులెందరో అభిప్రాయ పడుతున్నా ఒక మంచి పాట వింటున్నప్పుడు ఈ ఏ రాగంలో చేసివుంటారానే జిజ్ఞాస సంగీతాభిమానులలో కలగడం సహజం. నాలాటి సామాన్య శ్రోతలకి ఏ రాగమైనా ఒక్కటే. ఏ రాగమైతేనేం? శ్రావ్యమైనదిగా,  మనసుకు హాయిని, చెవులకు ఇంపును కలిగించేదిగా వుండే ప్రతీ  పాటా జనరంజకమై శాశ్వతత్త్వాన్ని పొందుతుంది. సజీవరాగమై నిలుస్తుంది. అటువంటి సుశ్రావ్యగీతమే "ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో..." అదే నేటి మన ఘంటసాలవారి సజీవరాగం.

ఈ ప్రకృతిలో జడ పదార్ధంగా గోచరించే కొండలలోని బండలన్నింటినీ తన ఉలితో  సౌందర్యమూర్తులుగా మలచి వాటికో నూతనత్వాన్ని, అస్తిత్వాన్ని కలిగించాలని ప్రతి శిల్పి కలలు కంటాడు. అహర్నిశలు శ్రమిస్తాడు. శిల్పకళకే తన జీవితం ధారపోస్తాడు. శిల్పికి, శిలకు మధ్య విడదీయలేని రాగానుబంధం వుంటుంది. ప్రాణంలేని రాయి రప్పలలో  సజీవమైన సౌందర్యాన్ని శిల్పి వీక్షిస్తాడు. బండలలోని హృదయాన్ని, మానవత్వాన్ని శిల్పి అర్ధం చేసుకోగలడు. పైకి కఠినంగా వుండే ఆ రాళ్ళు శిల్పికి మృదువుగా, మెత్తగా తోస్తాయి. రాగద్వేషాలకు అతీతంగా వుండే మునులలాగ కారడవులలో మౌనంగా వుంటాయి. స్వార్ధంతో ఇతరులకు హాని కలిగించే ప్రాణమున్న మనిషికన్నా  చైతన్యంలేని శిలలే నయమనిపిస్తాయి. 

దాదాపు ఆరు దశాబ్దాలకు ముందు డా. సి.నారాయణరెడ్డి గారు ఆకాశవాణి కోసం  "రామప్పకొండ" అనే శ్రవ్యనాటకాన్ని  వ్రాసారు. అందులో ఒక శిల్పియొక్క మనోగతమే ఈ సున్నితమైన , ఉదాత్తమైన "ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో" అనే గీతం. ఆకాశవాణి కార్యక్రమం కోసం పాలగుమ్మి విశ్వనాథంగారు ఈ పాటను జోగ్ అనే హిందుస్థానీ రాగంలో స్వరపర్చి గాయకులు ఎమ్.చిత్తరంజన్ గారి చేత పాడించారు.

తర్వాత కొన్నేళ్ళకు ప్రముఖ దర్శక నిర్మాత బి.ఎస్ రంగా ఈస్ట్ మన్ కలర్ లో కన్నడ, తెలుగు భాషలలో జక్కనాచార్య అనే శిల్పి కథను సినీమాగా తీస్తున్న సమయంలో డా.సి.నారాయణరెడ్డిగారిని పాటలు వ్రాయవలసిందిగా కోరినప్పుడు ఆయన ఈ పాటను నిర్మాతకు వినిపించడం, అది అందరి అమోదం పొందడం జరిగింది. అప్పట్లో తెలుగు సినిమా నిర్మాణం ఎక్కువగా మద్రాసులో సాగడం, నారాయణరెడ్డిగారు హైదరాబాద్ లో స్థిరపడడం వలన ఆయన వ్రాసిన అధిక సంఖ్యాకమైన పాటలు పాటకు మెట్టు కూర్చడమనే పధ్ధతిలోనే సాగేది. 

అమరశిల్పి జక్కన్న తెలుగు కన్నడ భాషలు రెండింటి కీ సాలూరు రాజేశ్వరరావు గారే సంగీతదర్శకుడు. రెండు భాషలలోనూ ఘంటసాల, సుశీలలే ఎక్కువ పాటలు పాడారు. కన్నడంలో కళ్యాణ్ కుమార్, తెలుగులో నాగేశ్వరరావు హీరోలుగా నటించారు. బి.సరోజాదేవి, నాగయ్య, హరనాథ్, ఉదయకుమార్, ధూళిపాళ రెండు భాషల్లో నటించారు.

నృత్య, సంగీతాలకు అధిక ప్రాధాన్యత వున్న ఈ సినీమాలోని పాటలన్నీ అత్యంత జనాదరణపొందాయి. రాజేశ్వరరావుగారి ప్రతిభకు గీటురాయిగా నిలిచే చిత్రం "అమరశిల్పి జక్కన్న". ఈ చిత్రంలో ఘంటసాలగారు పాడిన మూడు సోలోలు, మూడు డ్యూయెట్లు ఎంత హిట్టయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. వాటన్నిటిలోకి మకుటాయమానంగా  ఈనాటికీ ప్రజలందరి మనసులలో నిలచిపోయిన గీతం "ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో". ఘంటసాలవారి గళ మాధుర్యం, రస భావ ప్రకటనలు, తెరపై అక్కినేని వారి సున్నితమైన హావభావాలు పూవుకు తావి అద్దినట్లుగా ఈ పాట ఆపాతమధురంగా, అజరామరం గా నిల్చిపోయింది.

పాట ప్రారంభంలో కొండలలో ప్రతిధ్వనిస్తూ వినిపించే ఘంటసాల మాస్టారి ఆలాపన, దానికి ఊపిరిపోస్తూ ట్యూబోఫోన్, మువ్వల మేళవింపుతో వినవచ్చే ఉలుల శబ్దాలు, శ్రోతను పాటలో లీనమయేలా చేస్తాయి. చరణాల మధ్య వచ్చే బిజిఎమ్స్ లో రాజేశ్వరరావు గారికే  సొంతమైన సంగతులు, గమకాల పోకడలు వైయొలిన్స్ మీద చిత్ర విచిత్రంగా వినిపించి శ్రోతలకు పరవశత్వం కలిగిస్తాయి. 

ఇక ఈ పాట పాడిన ఘంటసాలవారి గాన మాధుర్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. Melancholy తో పాటు భావగాంభీర్యంగల పాటలు పాడడంలో ఘంటసాల మాస్టారికి మించిన గాయకులు లేరంటే అది అతిశయోక్తి కానేరదు.

బి.ఎస్.రంగాగారి నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన ఈ ద్విభాషా చిత్రం అన్నివిధాల ఘనవిజయం సాధించింది. కన్నడంలో ఈస్ట్ మన్ కలర్ లో వచ్చిన మొట్టమొదటిచిత్రం  "అమరశిల్పి జక్కనాచార్య".

ఇదే కథ ఆధారంగా ప్రముఖ దర్శకనిర్మాత వి.శాంతారాం హిందీలో 'గీత్ గాయా పథ్థరోంనే' అనే సాంఘిక సినీమాగా నిర్మించారు. ఇందులో జంపింగ్ జాక్ జితేంద్ర హీరోగా నటించడం ఒక విశేషం. 




వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 

Saturday, 2 November 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 54వ భాగం - నీ సుఖమే నే కోరుతున్నా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఏభైమూడవ భాగం ఇక్కడ

54వ సజీవరాగం - నీ సుఖమే నే కోరుతున్నా
చిత్రం - మురళీకృష్ణ
గానం - ఘంటసాల 
రచన - ఆత్రేయ
సంగీతం - మాస్టర్ వేణు

పల్లవి: 
ఎక్కడవున్నా ఏమైనా మనమెవరికి వారై వేరైనా.....
నీ సుఖమే నే కోరుతున్నా ... 2
నినువీడి అందుకే వెళుతున్నా....
                            !!నీ సుఖమే!!

చరణం 1:
అనుకున్నామని జరగవు అన్ని
అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికని
అనుకోవడమే మనిషి పని
                            !!నీ సుఖమే!!
చరణం 2:
పసిపాప వలె ఒడి జేర్చినాను
కనుపాప వలె కాపాడినాను
గుండెను గుడిగా చేశాను - 2
నువు వుండలేనని వెళ్ళావు 
                            !!నీ సుఖమే!!
చరణం 3:
వలచుట తెలిసిన నా మనసునకు
మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే 
మన్నించుటయే ఋజువుకదా
                            !!నీ సుఖమే!!
చరణం 4:
నీ కలలే కమ్మగ పండనీ
నా తలపే నీలో వాడనీ..
కలకాలం చల్లగ వుండాలని
దీవిస్తున్నా నా దేవిని - 2
ఎక్కడ వున్నా ఏమైనా మనమెవరికి
వారై వేరైనా....
                            !!నీ సుఖమే!! 

"నాకు దక్కని అందం , ఆనందం మరొకరి సొంతమవుతూంటే చూస్తూ వూరుకోవడానికి నేనేం చచ్చు దద్దమ్మను కాను, ఈ ఏసిడ్ తో నీ అందాన్ని, నిన్ను సర్వనాశనం చేస్తాను..." అనే పైశాచిక ప్రేమికులే ఎక్కువగా ఉన్న ఈ ఆధునిక ప్రపంచంలో ... " నీ సుఖమే నే కోరుతున్నా నిను వీడి అందుకే వెళుతున్నా..." అని అనే  ఉదారమైన, ఉన్నత సంస్కారం గల భర్తలు ఈ రోజుల్లో బహు అరుదుగా కనిపిస్తారు. కట్టుకున్న భార్యను తనకు నచ్చినవాడితో కలసి సుఖంగా జీవించమని ఆమెతో గల భార్యాభర్తల అనుబంధాన్ని త్రెంచుకొని ఎక్కడో దూరంగా ఒంటరిగా భార్య జ్ఞాపకాలతో  అలమటిస్తున్న ఓ భర్త  శోక గీతమే నేటి మన సజీవరాగం.

సినీమాలు కేవలం కాలక్షేపం కోసం తప్ప వాటివల్ల సమాజానికి ఏ ప్రయోజనం లేదనే వాదన సరికాదని నిరూపిస్తుంది ఈనాటి ఘంటసాల సజీవరాగం. అదే " నీ సుఖమే నే కోరుతున్నా.." 

పి. పుల్లయ్యగారి "మురళీకృష్ణ" సినీమా కోసం ఆత్రేయగారు వ్రాసిన ఈ పాట నిజమైన ప్రేమకు దర్పణం. బాహ్యాకర్షణ వలన ఏర్పడిన ప్రేమలో, అనుబంధంలో మోహావేశం తప్ప  నిజాయితీ, గాఢత్వం వుండవు. ఎదుటి మనిషి మనసును, వ్యక్తిత్వాన్ని గుర్తించి హృదయాంతర్గతమైన ప్రేమతో ఒకరినొకరు అర్ధం చేసుకున్నప్పుడే ఆ ప్రేమానుబంధం శాశ్వతంగా నిలుస్తుంది. అధికారంతో, బలవంతాలతో ప్రేమ నిలవదు. అవసరమైతే ప్రేమ త్యాగానికి సంసిధ్ధం కావాలి.  నిజమైన ప్రేమకు  అనుబంధానికి గల నిర్వచనమేమిటో ఆత్రేయగారు ఈ పాటలో చాలా చక్కగా విశదీకరించారు.

" అనుకున్నామని జరగవు అన్ని
అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని...."

"మనసిచ్చినదే నిజమైతే 
మన్నించుటయే ఋజువుకదా..."

" నీ కలలే కమ్మగ పండనీ
నా తలపే నీలో వాడనీ ( తొలగిపోవాలనే అర్ధంలో)
కలకాలం చల్లగ వుండాలని
దీవిస్తున్నా నా దేవిని...."

ఎంతటి ఉదాత్తమైన భావన. ఆత్రేయగారి ప్రేమ -మనసు- మమతలకు సంబంధించిన పాటలేవైనా  చాలా మనోమథనం జరిగిన తర్వాతే  అక్షరరూపం దాలుస్తాయి.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మాస్టర్ వేణు. విషాదభావోద్వేగాలతో కూడిన ఈ పాటను  వేణు శ్రీరాగం లో స్వరపర్చారు. శ్రీరాగం కర్ణాటక సంగీతంలో అతి ప్రాచీనమైనది. 22వ మేళకర్త కరహరప్రియ జన్యం. ఔడవ వక్ర సంపూర్ణ రాగంగా పేర్కొంటారు. ఆరోహణలో ఐదు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు పలుకుతాయి. సంగీత ముమూర్తుల రచనలెన్నో శ్రీరాగంలో వున్నాయి. ఘనరాగ పంచకంలో శ్రీరాగం ఐదవది.  త్యాగయ్య గారి పంచరత్న కీర్తనలలోని "ఎందరో మహానుభావులు" శ్రీరాగంలోనే స్వరపర్చబడింది. శ్రీరాగంలో చేసిన సినీమా పాటలెన్నో బహుళజనాదరణ పొందాయి. 

వైయొలిన్స్, సెల్లోస్, సితార్, ఫ్లూట్, జలతరంగ్, తబలా, కాంగోడ్రమ్స్, బాంగోస్ వంటి హెవీ ఆర్కెస్ట్రాతో రూపొందిన ఈ పాటను మాస్టర్ వేణు ఘంటసాల మాస్టారి చేతే పాడించారు. నవరసాలను తన గొంతులో అవలీలగా పలికించగల ఘంటసాల గారు ఈ పాటను మృదుమధురంగా, విషాదభావాలు తొణికిసిలాడేలా గంభీరంగా ఆలపించారు. నాగేశ్వరరావుగారే  పాడుతున్నారనే భ్రమను కల్పించారు. 

ఉత్తమ ప్రమాణాలతో చక్కని సందేశాత్మక గీతానికి ప్రతీక ఘంటసాలవారి "నీ సుఖమే నే కోరుతున్నా..."

భగ్న ప్రేమికుని పాత్రలకు  అక్కినేని నాగేశ్వరరావుగారు పెట్టింది పేరు. డా.కృష్ణ పాత్రలో సంపూర్ణంగా ఇమిడిపోయి నటించారు. భార్యాభర్తల మధ్య పరస్పర ప్రేమానురాగాలు వున్నా అపోహలకారణంగా విడిపోయి అనేక సంఘటనల తర్వాత మరల ఒకటి కావడమే ఈ "మురళీకృష్ణ" సినీమా.  అక్కినేని, జమున, హరనాథ్, శారద, ఎస్.వి. రంగారావు, గుమ్మడి మొదలగువారు నటించిన చిత్రం. పద్మశ్రీ పిక్చర్స్ పి పుల్లయ్య దర్శక నిర్మాత.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 107వ భాగం - బలే మంచి రోజు

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...