Saturday, 31 August 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 45వ భాగం - మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రీ , తనయుడు ఎవరో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నలభైనాలుగవ భాగం ఇక్కడ

45వ సజీవరాగం -  మమతలు లేని మనుజులలోన
ఎవరికి ఎవరో తండ్రీ , తనయుడు ఎవరో

చిత్రం - గాలిమేడలు
గానం - ఘంటసాల 
రచన - సముద్రాల
సంగీతం - టి.జి.లింగప్ప

పల్లవి:
మమతలు లేని మనుజులలోన
ఎవరికి ఎవరో తండ్రీ , తనయుడు ఎవరో ! మమతలు లేని !

చరణం:
ఏ కులమైనా నెలవెది అయినా
మదిలో కూరిమి జాలుకొనా
పిలిచి లాలించి కొడుకు చందాన - 2
చూచి కాచే దాతే నాయన కాదా 
! మమతలు!

చరణం:
మాటలు నమ్మీ మనసూ నీరై 
దరికీ తీసిన తండ్రులను
దేవుని  చందాన తలచీ పూజించి -2
కొలువూ చేసేవాడే కొడుకౌగాదా 
! మమతలు లేని !

యారిగె యారుంటూ ఎరవిన
సంసార నిర మెలగిన గుళ్ళే నిజవల్ల
హరియే యారిగె యారుంటూ 
( కన్నడ భాష తెలియనందున అక్షర దోషాలుంటాయి. అందుకు క్షంతవ్యుడిని)

1962లో "గాలిగోపుర" అనే కన్నడం సినీమా వచ్చింది. కన్నడంలో విపరీత జనాదరణ పొందిన ఈ గీతాన్ని వ్రాసిందెవరో తెలుసా! కర్ణాటక సంగీత పితామహుడిగా కీర్తిపొందిన 16వ శతాబ్దపు భక్త, కవి, గాయక, సంగీత విద్వాంసుడైన శ్రీ పురందర దాసులవారు. 

కర్ణాటక సంగీతాభ్యాసానికి కావలసిన ప్రాథమిక ప్రణాళికను రూపొందించినది శ్రీ పురందరదాసులే. సంగీత శిక్షణకు తొలి మెట్టయిన మాయామాళవగౌళ రాగంలోని సరళీస్వరాలు, జంటలు, అలంకారాలు, ఇవన్నీ రూపొందించింది ఈయనే. శ్రీ పురందరదాసుల వారి "లంబోదర లకుమికరా అంబాసుత అమరవినుత" అనే గణపతిస్తుతితోనే కర్ణాటక సంగీత శిక్షణ ఆరంభించడం సంప్రదాయం.

అంతటి లబ్దప్రతిష్టులైన వాగ్గేయకారుని గీతాన్ని సందర్భోచితంగా సినీమా లో ఉపయోగించిన ఘనత  'గాలిగోపుర' చిత్ర నిర్మాత, దర్శకుడు బి.ఆర్.పంతులుకు చెందుతుంది.

కన్నడ "గాలిగోపుర", తెలుగు  "గాలి మేడలు"  ఈ రెండు సినిమాలు ఒకేసారి సంయుక్తంగా నిర్మించబడ్డాయి. "యారిగె యారుంటూ" పాట భావార్ధంతోనే తెలుగులో "మమతలు లేని మనుజులలోన ఎవరికి ఎవరో తండ్రీ తనయుడు ఎవరో" అనే పాట ఆవిర్భావం జరిగింది. ఈ తెలుగు పాటను సముద్రాల రామానుజాచార్యులుగారు వ్రాశారు. తెలుగు, కన్నడ భాషలు రెంటిలోనూ ఘంటసాలవారే పాడగా, ఈ రెండు చిత్రాలకు కన్నడ సంగీత దర్శకుడు టి.జి.లింగప్ప సంగీతం సమకూర్చారు.

ఘంటసాలగారు 'గాలిమేడలు' సినీమా లో పాడిన ఏకగళ  హృద్యమైన "మమతలు లేని మనుజులలోన" గీతమే నేటి మన మదిలో సదా మెదిలే సజీవరాగం.

నటనలో శిఖరాగ్రాలకు చేరుకున్న హేమాహేమీలు ఎన్.టి.రామారావు, నాగయ్యల మీద తెలుగులోనూ,  రాజ్ కుమార్, అశ్వథ్థ్ ల మీద కన్నడంలోనూ ఈ రెండు పాటలను చిత్రీకరించారు. ఈ అగ్రనటుల నటనకు ప్రాణ ప్రతిష్టచేసినది ఘంటసాలవారి గాన మాధుర్యం, భావార్ద్రత. అందువల్లనే ఈ రెండు పాటలు  రెండు రాష్ట్రాలలో విపరీత జనాదరణ పొంది, ఆరు దశాబ్దాల తర్వాత కూడా సంగీతాభిమానుల హృదయాలలో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్నాయి. 

పరభాషా చిత్రాలలో ఎన్ని వందల, వేల గీతాలు పాడినా ఒక గాయకుడికి తన మాతృభాషలో పాడేప్పుడు వున్న స్వేఛ్ఛ, స్వఛ్ఛత, తృప్తి పరాయి భాషలో పాడేప్పుడు వుండదనేది ఘంటసాలవారి నిశ్చితాభిప్రాయం. ఆ కారణం చేతనే తనకు లభించిన ఎన్నో అవకాశాలను నిరాకరించి స్థానిక గాయకుల చేతే పాడించమని ఘంటసాలవారు నిర్మాతలను ప్రోత్సహించేవారు. అయినప్పటికీ ఘంటసాల కన్నడ సినీమాలలో చాలా పాటలనే పాడి కన్నడిగుల అభిమాన గాయకుడయ్యారు.

మనుషుల్లో మమతానురాగాలు, ప్రేమ బంధాలు సమసిపోయి ద్వేషభావాలు పెరిగిపోయినప్పుడు తండ్రీ, కొడుకుల బాంధవ్యాలు తెగిపోతాయి. రక్త సంబంధీకులైనా చెల్లాచెదరై జీవితాలు అస్తవ్యస్తంగా మారుతాయి. ఇలాటి పరిస్థితిని ఎదుర్కొంటున్న ఓ యువకుడు ఓ వృధ్ధునికి (అతడే కన్నతండ్రని తెలియక) సేవ చేస్తూ నిర్వేదంతో హృదయవేదనతో  ఆలపించిన గీతం. ఒక రకంగా ఇది ఒక జోలపాట.  ఘంటసాలవారి కంఠంలో ఈ రకమైన వేదనాతప్త హృదయ గీతాలు ఎంత భావయుక్తంగా వుంటాయో అందరికీ తెలిసిందే.

టి.జి.లింగప్ప ఈ పాటను చాలా హృదయవిదారకంగా అందరి మనసులకు హత్తుకునేలే స్వరపర్చారు. ఈ పాట రాగం విషయంలో పలువురు పలు రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. అందుచేత ఈ పాట ఫలానా రాగమని చెప్పే అర్హత నాకు లేదు. అది ఏ రాగమైనా ఘంటసాలవారి హృదయాంతరాళాలలో నుండి వెలువడి సన్నివేశ పరిపుష్టిని కలిగించిందనేది వాస్తవం. ఈ పాటకోసం టి.జి.లింగప్ప సితార్, వైయొలిన్స్, ఫ్లూట్, క్లారినెట్, తబలా, డోలక్, చిటికెలు, డబుల్ బేస్ వంటి వాయిద్యాలు ఉపయోగించారు.

ఒక గాయకుడి పాట కానీ, ఒక నటుడి నటన కానీ రాణించాలంటే బలమైన సన్నివేశం వుండాలి. అప్పుడే గీత రచయిత ఉన్నత విలువలుగల పాటను వ్రాయగలుగుతాడు, సంగీతదర్శకుడు మంచి వరసను కూర్చగలుగుతాడు. అలాటి మంచి విలువలు గలిగిన పాట కావడం మూలాన్నే "గాలిమేడలు" సినీమాలోని ఘంటసాలవారి "మమతలు లేని మనుజులలోనా..." పాట సజీవమయింది.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్  

Saturday, 24 August 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 44వ భాగం - ప్రళయ పయోధిజలే ధృతవానపి వేదం - జయదేవుని అష్టపది

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నలభైమూడవ భాగం ఇక్కడ

44వ సజీవరాగం -  ప్రళయ పయోధిజలే ధృతవానపి వేదం

చిత్రం - భక్త జయదేవ
గానం - ఘంటసాల 
రచన - జయదేవుని అష్టపది
సంగీతం - సాలూరు రాజేశ్వరరావు

నవ విధ భక్తులలో ' భార్యాభర్తృ' విధానాన్ని ప్రవేశపెట్టిన గొప్ప తత్త్వవేత్త నింబాచార్యుడు. బ్రహ్మసూత్రాలకు భాష్యం చెప్పిన ప్రముఖ వేదాంతి. ద్వైతాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించినవాడు. ఇతనికే నింబార్కుడు, నింబాదిత్యుడు అని పేర్లు వున్నాయి. భక్తి ఉద్యమం మహా ఉధృతంగా ప్రచారమైన మధ్య యుగానికి చెందిన వైష్ణవ మత ప్రచారకుడు. అవతారపురుషులైన  రాధాకృష్ణుల ప్రణయారాధనను బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చినవాడు.

నింబార్కుని మార్గాన్ని అనుసరించిన మరో గొప్ప కవి జయదేవుడు. 12 వ శతాబ్దానికి చెందిన జయదేవుడు ఉత్కళ (నేటి ఒడిస్సా) దేశంలోని పూరి సమీపాన వున్న కెందుళి గ్రామానికి చెందినవాడు.  భారతదేశంలో కెందుళి పేరుతో ఇతర ప్రాంతాలలో కూడా కొన్ని గ్రామాలువున్నందువలన జయదేవుని పుట్టుక , స్వస్థలం విషయంలో కొన్ని చారిత్రక వివాదాలున్నాయి. జయదేవుడు సంచారజీవిగా అనేక ప్రాంతాలలో నివసించాడు. వంగదేశపు రాజైన లక్ష్మణసేనుని ఆస్థాన కవీశ్వరునిగా మిక్కిలి ప్రసిధ్ధిపొందిన కవి జయదేవుడు. జయదేవుడు గొప్ప విష్ణుభక్తుడు కూడా. జయదేవుడు సంస్కృతంలో మరికొన్ని రచనలు చేశాడు. రాధాకృష్ణుల ప్రణయతత్త్వాన్ని గీతగోవిందం పేరిట ఒక గొప్ప కావ్యం రచించాడు. జయదేవుని గీతగోవిందం మధ్యయుగం భక్తి ఉద్యమంలో ప్రముఖపాత్ర వహించింది. 

జయదేవుడు శ్రీకృష్ణుని పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజించాడు. గీతగోవిందంలో కృష్ణుడు నాయకుడు  రాధ నాయకి. ఇక్కడ రాధ జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ, సఖి. సఖి జీవాత్మను పరమాత్మలో లీనం కావడానికి తోడ్పడుతుంది. అదే గీతగోవిందంలోని సారాంశం. జయదేవుడు ఈ గీత గోవిందాన్ని మధురభక్తితో నాయికా, నాయక పరంగా శృంగార రసాత్మకంగా రచించాడు.

జయదేవుని గీతగోవింద కావ్యాన్నే జయదేవ అష్టపదులని అంటారు. ఈ మధురభక్తి కావ్యంలో 12 అధ్యాయాలు. ఒక్కోక్క అధ్యాయానికి 24 ప్రబంధాలు. ఒక్కొక్క ప్రబంధంలో ఎనిమిదేసి ద్విపదలు. వీటినే అష్టపదులంటారు. మొత్తం మీద జయదేవుని గీతగోవింద కావ్యంలో ఇరవైనాలుగు అష్టపదులు, ఎనభైకి మించిన శ్లోకాలు భక్తి, శృంగారాలను ప్రతిబింబిస్తూ వర్ణించబడ్డాయి. కృష్ణుడే జయదేవుని రూపంలో వచ్చి గీతగోవిందం లోని  కొన్ని అసంపూర్ణ భాగాలను పూరించడం; జయదేవుని ప్రాణసఖి, భార్యయైన పద్మావతి అకస్మాత్తుగా మరణిస్తే తిరిగి తన ప్రార్ధనలతో పునర్జీవం కల్పించడం వంటి సంఘటనలు భక్తునిగా జయదేవుని మహిమలను చాటి చెపుతాయి. 

అటువంటి సుప్రసిద్ధ సంస్కృత కవి జీవితచరిత్ర  " భక్త జయదేవ" పేరిట ఒక సంగీతభరిత చిత్రంగా  రూపొంది తెలుగు ప్రేక్షకులను అలరించింది. 1938లో మొదటిసారి విశాఖపట్నంలో " భక్త జయదేవ" సినీమా నిర్మించబడింది.

మరల 1961 లో లలితకళా నికేతన్ నారాయణరావు, పి.వి.రామారావు దర్శకత్వంలో భక్త జయదేవను అక్కినేని, అంజలీదేవి లు నాయికా నాయకులుగా తీశారు. భరణీ రామకృష్ణ గారు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ చిత్రం రూపొందింది. సాలూరు రాజేశ్వరరావుగారి సంగీత విద్వత్తు, ఘంటసాలవారి గానపటిమ‌, అక్కినేని నాగేశ్వరరావుగారి నటనా వైదుష్యం ఈ ' భక్త జయదేవ' సినీమాను ఒక గొప్ప కళాఖండంగా తీర్చిదిద్దింది. 

జయదేవుని గీతగోవిందంలోని అతి రమణీయమైన అష్టపదులను, శ్లోకాలను తీసుకొని  వాటికి సముద్రాల రాఘవాచార్యులవారి మరికొన్ని మధురాతి మధుర గీతాలను జతపర్చి భక్త జయదేవ సినీమాలో పొందుపర్చడం జరిగింది. సంగీతపరంగా ఈ చిత్రంలో అగ్రతాంబూలం ఘంటసాల మాస్టారిదే. వారిలోని సంగీత ప్రజ్ఞాపాటవాలకు దర్పణం పట్టే చిత్రం భక్థ జయదేవ. ఇందులో జయదేవ కవి విరచితమైన "ప్రళయ పయోధిజలే" అని దశావతారాల విశిష్టత ను చాటిచెప్పే అష్టపదే నేటి మన సజీవరాగం.

నిజానికి ఈ చిత్రంలోని ప్రతీ గీతము , శ్లోకమూ సజీవరాగమే. ఈ సినీమాలో ఉపయోగించిన  -

- యారమితా వనమాలి
- ధీరసమీరే యమునాతీరే( మోహన)
- ప్రియే చారుశీలే
- ప్రళయ పయోధిజలే (రాగమాలిక)
వంటి అష్టపదులు ;
- మందారగంధ సంయుక్తం
- మేఘైర్మేమరమంబరం వనభువ శ్యామా
- వాగ్దేవతా చరిత
- సాధుస్వరముభోయమస్తు
వంటి జయదేవుని రచనలు ;
సముద్రాల రాఘవాచార్యులవారి
- దయగనుమా జగదీశ
- నాదుప్రేమ భాగ్యరాశి
-  నీ మధుమురళీ గానలీల(హమీర్ కళ్యాణీ)

ఇలా ప్రతి ఒక్కటీ ఒక్కొక్క ఆణిముత్యం. వీటన్నింటినీ ఘంటసాలవారే ఆలపించి చిత్రానికి ఔన్నత్యం కల్పించారు. మిగిలిన గీతాలను పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, సీతారామానుజాచార్యులు ఆలపించారు.

భక్త జయదేవ చిత్రానికి సాలూరి రాజేశ్వరరావుగారి సంగీతమే సగం ప్రాణం. ఇక్కడ జయదేవుని అష్టపదుల స్వరరచన విషయమై ప్రస్తావించాలి. అన్నమయ్య కీర్తనలలాగే, జయదేవుని అష్టపదులు కూడా రాగని‌ర్దేశనం చేయబడి వాటికి వరసలు కట్టి గానం చేయబడ్డాయి. అయితే ఆ అసలు బాణీలు ఏవి ఇప్పుడు లేవు. గాయకులంతా ఎవరికి తోచిన రాగాలలో వరసలు కట్టి వారివారి మనోధర్మాన్ని బట్టి గానం చేస్తున్నారు.

ఆ రకంగా సాలూరు వారి ప్రతిభావ్యుత్పత్తులకు నిదర్శనంగా భక్థజయదేవ పాటలు నిల్చిపోయాయి. ఈ సినీమా విడుదలైన కొన్నేళ్ళకు ఘంటసాల మాస్టారు కూడా ఓ నాలుగు అష్టపదులను తనదైన బాణీలో వరసలు కట్టి గ్రామఫోన్ రికార్డ్స్ గా విడుదల చేశారు. అలాగే తన సంగీతకచేరీలలో పాడుతూవచ్చారు.

ఈ నాటి "ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" గా భక్త జయదేవలోని " ప్రళయ పయోధి జలే" గీతాన్ని ఎంచుకోవడం జరిగింది. దీనిని ఘంటసాలగారు ఏకగళగీతంగా ఆలపించారు. పరమాత్మ అయిన మహావిష్ణువు యొక్క దశావతార వర్ణనలను అత్యద్భుతంగా, అత్యంత భక్తిభావంతో గానం చేశారు మాస్టారు. తెరపై ఇదొక నృత్యగీతం. జయదేవుని(అక్కినేని) గానానికి ఆయన భార్య( అంజలీదేవి) నటనమాడే దృశ్యం. ఏడుం పావు నిముషాలు నిడివిగల ఈ దశావతార గీతంలో మనకు శుధ్ధ శాస్త్రీయ రాగాలైన - కాపి, హిందోళ, హంసానందిని, కేదారగౌళ, మోహన రాగాలను అతి సమర్ధవంతంగా ప్రయోగించారు సంగీతదర్శకుడు సాలూరు రాజేశ్వరరావుగారు. అంతే సమర్ధవంతంగా మృదుమధురంగా, భక్తిభావం ప్రస్ఫుటం చేస్తూ ఈ గీతానికి ఘంటసాల ప్రాణప్రతిష్టచేశారు. లలిత, శాస్త్రీయ సంగీత నుడికారం ఘంటసాలవారి గళంలో అలవోకగా పలుకుతుందనే పండిత విమర్శకుల ప్రశంస మరోసారి భక్త జయదేవ గీతాలలో నూటికి నూరుశాతం ఋజువు అయింది. ఈ గీతం లో రాజేశ్వరరావుగారు  సితార్, ఫ్లూట్, క్లారినెట్,  వీణ,  వైయొలిన్స్, జలతరంగ్, తబలా, మృదంగం,  కోల్, తబలాతరంగ్, పక్వాజ్, మువ్వలు, తాళాలు వంటి వాద్యాలను ఉపయోగించారు. 

సంగీతదర్శకుడిగా సాలూరు రాజేశ్వరరావు, గాయకుడిగా ఘంటసాలవారి కీర్తి ప్రతిష్టలను దశదిశలా వ్యాపింపజేసిన భక్త జయదేవ గీతాలు ఎన్ని యుగాలైనా సజీవరాగాలే. 

భక్త జయదేవ  పాటలు విడుదలైన కొత్తల్లో రోజూ ఆ పాటలను ఘంటసాల మాస్టారు ఇంట్లో లేని సమయంలో గ్రామఫోన్ లో వింటూవుండేవాళ్ళం.  ఒకరోజు ఇంట్లోని ఆడవారు ఈ భక్త జయదేవ పాటలు అరగదీస్తున్న సమయంలో మాస్టారు సడన్ గా బయటనుండి వచ్చి హాల్ లో అడుగుపెట్టారు. ఆ సమయంలో "ధీర సమీరే యమునాతీరే"  పాట వినిపిస్తోంది. ఈపాటకు అర్ధం తెలుసునా అని మాస్టారు అడిగారు. అక్కడున్నవారంతా తెల్లబోయి చూశారు. తర్వాత మాస్టారు సావిత్రమ్మగారికి ఏం చెప్పారో ఏమో కానీ భక్త జయదేవలోని కొన్ని అష్టపదులు రికార్డ్ ర్యాక్ లో కనపడలేదు. జయదేవ అష్టపదులు సంస్కృత భాషలో వుండబట్టి  సరిపోయింది. అంత మంచి సుశ్రావ్య గీతాలు అందుబాటులోకి వచ్చాయి. వాటినే మన తెలుగు భాషలోకి అనువదించి వుంటే సగం అష్టపదులు సెన్సార్ బారినపడి మనకు వినే భాగ్యం కలిగేది కాదు. జయదేవుని మధురభక్తి తత్త్వాన్ని పరిపూర్ణంగా అర్ధం చేసుకునే జ్ఞానం అలవడనంతవరకు  బుధ్ధి వికసించని పసివాళ్ళే. గీత గోవిందంలోని కొన్ని అష్టపదుల సాహిత్యం for Adults only మాత్రమే. 

అయితే ఇది ఆరు దశాబ్దాల క్రితం మాట. ఇప్పుడు మల్టీమీడియా పుణ్యమాని చిన్నా పెద్దా తేడాలేకుండా అందరిలో లోకజ్ఞానం విపరీతంగా పెరిగిపోయింది.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్   

Saturday, 17 August 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 43వ భాగం - శేషశైలావాసా శ్రీ వేంకటేశా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నలభైరెండవ భాగం ఇక్కడ

43వ సజీవరాగం -  శేషశైలావాసా శ్రీ వేంకటేశా

చిత్రం - శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం
గానం - ఘంటసాల 
రచన - ఆత్రేయ
సంగీతం - పెండ్యాల

పల్లవి:
శేష శైలా వాసా శ్రీ వేంకటేశా
శయనించు మా అయ్య శ్రీ చిద్విలాసా
శేష శైలా వాసా ...

చరణం 1:
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకు
అలమేలు మంగకు అలుక రానీయకు......2
ముద్దు సతులిద్దరినీ ఇరువైపులా జేర్చి... 2
మురిపించి లాలించి ముచ్చటల దేల్చి..
శేషశైలావాసా...

చరణం 2:
పట్టుపానుపు పైన పవ్వళించర స్వామి..2
భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ...
చిరునగవు లొలుకుచూ  నిదురించు నీ మోము 
కరువుతీరా కాంచి తరియింతుము మేము...
శేషశైలావాసా శ్రీవేంకటేశా...

" వేంకటాద్రీ సమం స్థానం
బ్రహ్మాండే నాస్తికించన
వేంకటేశ సమో దేవో
నభూతో నభవిష్యతి"

వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు; అలాగే , వేంకటేశ్వరుని తో సమానమైన దైవమూ లేడు.

నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అంటూ సంవత్సరం పొడుగునా నిత్యం కళ్యాణంగా విరాజిల్లే ఏకైక క్షేత్రం తిరుపతి తిరుమల. సుప్రభాతం మొదలు ఏకాంత సేవ వరకు నిర్విరామంగా జనసందోహంతో శ్రీవేంకటేశ్వరుని సన్నిధి అనుక్షణం కోలాహలంగా, కళకళలాడుతూ వుంటుంది. భక్త శిఖామణుల స్తోత్ర గీతాలు సప్తగిరులలో సదా ప్రతిధ్వనిస్తూనే వుంటాయి.

తాళ్ళపాక అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, భగవద్రామానుజాచార్యులు వంటి దాసభక్తులెందరో కలియుగ దైవం అయిన వెంకటాచలపతిని కీర్తించి, ఆరాధించి, తరించి, పునీతులయ్యారు.  అపర రామభక్తుడు, సంగీత త్రిమూర్తులలో ఒకరైన సద్గురు త్యాగరాజస్వామి వారు కూడా తిరుపతి వేంకటేశ్వరుని మీద కీర్తనలు రచించారు.

వీరి కోవలోనికి చెందినవారే ఈ శతాబ్ది గాయకుడిగా అందరిచేత కొనియాడబడుతున్న భక్త గాయక శిఖామణి, కోట్లాది తెలుగుల అభిమాన గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరావు. తిరుపతి వేంకటేశ్వరుని మీద ఘంటసాల వేంకటేశ్వరుడు ఆలపించిన భక్తి గీతాలు అసంఖ్యాకం. ఆయన ఆలపించిన గీతాలన్నీ ఈనాటికీ ఏడుకొండలలో మార్మోగుతూనే వుంటాయి. 

ఘంటసాల కంఠమాధుర్యానికి, గుండెల్లో దాగిన భక్తి తత్పరతకు మెచ్చి తిరుపతి వేంకటేశ్వరుడు ఈ ఘంటసాల వేంకటేశ్వరుని తన ఆస్థానగాయకునిగా నియమించుకొని ఆశీర్వదించాడు, తనలోనే ఐక్యం చేసుకున్నాడు.

తిరుమల-తిరుపతి దేవస్థాన గాయకుడిగా నియమించబడడానికి తొమ్మిదేళ్ళ ముందే  శ్రీ వేంకటేశ్వర మహత్యం సినీమాలో ఘంటసాల భక్తగాయకుడి గా శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో గానం చేస్తూ తెరమీద కనిపించారు. 

ఆ సన్నివేశం లో ఘంటసాల ఆలపించిన " శేషశైలావాసా శ్రీ వేంకటేశా" పాట నేటి మన సజీవరాగం.

శ్రీనివాసుడికి సంబంధించిన ఏ గాధలైనా, ఏ గీతాలైనా, కార్యక్రమాలైనా ప్రజలను అమితంగా ఆకర్షిస్తాయి, కనకవర్షం కురిపిస్తాయి. శ్రీ వేంకటేశ్వరుడి మహత్యాన్ని సినీమాగా పి.పుల్లయ్య రెండుసార్లు నిర్మించి ఘనవిజయం సాధించారు. 1939 లో మొదటిసారి తీసినప్పుడు పుల్లయ్య గారి సతీమణి శాంతకుమారి పద్మావతిగా, సి.ఎస్.ఆర్. శ్రీనివాసుడిగా నటించారు. అదే కథను మరల 1960 లో నిర్మించగా అందులో ఎన్.టి.రామారావు శ్రీనివాసునిగా, సావిత్రి పద్మావతిగా నటించారు. మొదటి చిత్రంలో పద్మావతిగా నటించిన శాంతకుమారి  రెండవ చిత్రంలో శ్రీనివాసుని పెంపుడు తల్లి వకుళమాతగా నటించారు. కాలం తెచ్చే మార్పును ఎవరైనా స్వీకరించక తప్పదు.

1960 లో వచ్చిన శ్రీ వేంకటేశ్వర మహత్యం లోని పాటలన్నీ అమృతగుళికలు. పెండ్యాల నాగేశ్వరరావు  సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలన్నీ విపరీత జనాదరణ పొందాయి. ఈ చిత్రంలోని పాటలన్నిటిలోకి తలమానికంగా, ఆపాతమధురంగా , అజరామరంగా నిల్చిపోయిన గీతం ఆత్రేయ వ్రాసిన "శేషశైలావాసా శ్రీవేంకటేశా" అనే  ఏకాంతసేవా గీతం. ప్రధాన సినీమా కథాకధనంతో ఏమాత్రం సంబంధం లేకుండా సినీమా చివరలో శ్రీవారి ఉత్సవ సన్నివేశాలు (స్టాక్ షాట్స్) చూపించే ఈ సందర్భంలో స్వామి సన్నిధిలో ఒక భక్తుడు గానం చేస్తున్నట్లుగా ఈ ఏకాంత సేవ గీతాన్ని చిత్రీకరించారు. ఈ పాటను తెరమీద కూడా ఘంటసాలే పాడుతూ కనిపించడం ఒక విశేషం. 

ఘంటసాల చిత్రరంగ ప్రవేశం చేసిన తొలిరోజులలో భుక్తి కోసం 'సీతారామ జననం', 'త్యాగయ్య', 'యోగి వేమన' వంటి చిత్రాలలో చిన్న చిన్న వేషాలు ధరించినా, గాయకుడిగా స్థిరపడిన తర్వాత  తెరమీద నటన జోలికి పోలేదు. అనేకమంది నిర్మాతలు ఆయనకు తగిన పాత్రలిచ్చి నటించమన్నా సున్నితంగా తిరస్కరించారు. తాను నటించడం ద్వారా ఇతర నటులకు వచ్చే అవకాశాలు పొగొట్టి వారి కడుపుమీద కొట్టడం తనకు ఇష్టంలేదని, సంగీతం ద్వారా వచ్చే అవకాశాలే తనకు చాలని తనని అభిమానించి వచ్చిన నిర్మాతలకు నచ్చచెప్పిన ఉదారుడు, సహృదయుడు ఘంటసాల.

కానీ, పి పుల్లయ్యగారి బలవంతాన్ని, గాఢమైన కోరికను త్రోసిపుచ్చలేక ఈ పాత్రలో కనిపించడానికి అంగీకరించారు. ముఖ్యంగా ఈ సన్నివేశం  తన ఇష్టదైవమైన శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలో చేసే గానానికి సంబంధించినది కావడంతో తను తెరమీద నటించడానికి ఒప్పుకున్నారు. వాహినీ స్టూడియో లో వేసిన ఒక సెట్ లో ఈ పాట చిత్రీకరణ జరిగింది. (ఈ పాట చిత్రీకరణ సమయంలో ఓ రెండుగంటలపాటు నేనుకూడా ఆ సెట్ లో ఉన్నాను). ఈ పాటలో ఘంటసాలవారితో పాటు సంగీత దర్శకుడు పెండ్యాల, వేణువాద్య కళాకారుడు నంజప్ప, తంబురాతో సంగీత సహాయకుడు డి.బాబూరావు, మృదంగం పై వాహినీ సౌండ్ ఇంజనీర్ వల్లభజోస్యుల శివరాం, మొదలగువారు కూడా కనిపిస్తారు.

దాక్షిణాత్య దేవాలయాలలోని కళా సంస్కృతి చాలా ఉన్నతంగావుంటుంది. ఆచారవ్యవహారాలను నియమనిష్టలతో పాటిస్తారు. అక్కడి కళాకారులు వివాహాది కార్యక్రమాలలో పాల్గొనేప్పుడు ఒకలా , రాజాధి రాజులు సమక్షంలో ఒకలా తమ వస్త్రధారణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. దేవాలయాలలో అయితే వస్త్రధారణ విషయంలో వారి ఆచారాలు  మరింత కఠినంగా వుంటాయి. పురుషుల విషయంలో మామూలు ప్యాంట్, షర్ట్ లతో వెళ్ళేవారిని ఆలయంలోనికి అనుమతించరు. కేవలం పంచెలు మాత్రమే ధరించాలి. నడుము కు పైభాగాన ఏ ఆఛ్ఛాదన లేకుండా వుండాలి. నడుముకు విధిగా అంగవస్త్రాన్ని బిగించి కట్టుకుంటారు. దైవ సన్నిధిలో తమ తమ అహంకారాలు, అభిజాత్యాలు వదలి వినయ విధేయతలతో భక్తితో మసలుకోవాలనేది వారి భావన. సంగీత కచేరీల సమయంలో కూడా గాయకులు, ప్రక్కవాద్య కళాకారులు ఈ నియమాలను తప్పక పాటిస్తారు.  అయితే తిరుమల తిరుపతి ఆలయప్రవేశానికి అంతటి నియమ నిబంధనలు లేవనిపిస్తుంది. అందుకే 'శేషశైలావాసా' పాట చిత్రీకరణలో ప్రధాన గాయకుడైన ఘంటసాలవారు తప్ప మిగిలినవారంతా సాదా దుస్తులలోనే కనిపిస్తారు.

పెండ్యాల ఈ రక్తి, భక్తి, ముక్తిప్రదమైన గీతాన్ని రీతిగౌళ రాగంలో స్వరపర్చారు. రీతిగౌళ రాగం సినీమాలలో అరుదుగా వినిపించే రాగం. ఘంటసాలవారి గిరిజాకళ్యాణంలో (రహస్యం) వచ్చే 'ఈశుని దాసుని చేతువా అపసదా...' అనే చరణానికి కూడా రీతిగౌళ రాగాన్ని ఉపయోగించారు.

రీతిగౌళ రాగం ఖరహరప్రియ రాగ జన్యం. వక్ర షాఢవ- సంపూర్ణ రాగం. ఆరోహణలో ఆరు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు వుంటాయి. ఈ రాగంలో తెలుగు సినీమా పాటలు అరుదు. త్యాగయ్యగారి ' ద్వైతము సుఖమా', 'పరిపాలయ', 'చేరరావదేమిరా'  మొదలగు ప్రసిధ్ధ కృతులు రీతిగౌళ రాగంలోనే మలచబడ్డాయి.

గతకాలపు భక్త గాయకులందరినీ మనసులో పెట్టుకొని అత్యంత భక్తిశ్రధ్ధలతో ఘంటసాలవారు 'శేషశైలావాసా శ్రీ వేంకటేశా' గీతాన్ని సంప్రదాయబధ్ధంగా గానం చేశారు. వేంకటేశ్వరస్వామి తన ఏకాంతంలో తన భార్యలతో ఎలా మసలుకొంటాడో అనే దానిని ఆత్రేయ  రక్తికరంగా, సూచనప్రాయంగా తెలియజేశారు. స్వామి లీలలన్నీ భక్తి ముక్తి దాయకం అని సామాన్యులందరికీ అర్ధమయేలా తేట తేట తెలుగులో సుస్పష్టంగా, రీతిగౌళ రాగాన్ని ఆస్వాదిస్తూ భావయుక్తంగా గానం చేశారు ఘంటసాల. ఈ భక్తిగీతంలో తెరమీద మనకు కనిపించేవి మృదంగం, ఫ్లూట్, తంబురాలే అయినా తమ ఆర్కెస్ట్రాలో జలతరంగ్, ట్యూబోఫోన్, తబలా వంటి వాద్యాలను కూడా పెండ్యాల ప్రముఖంగా  శుశ్రావ్యంగా వినిపింపజేసి శ్రోతలను భక్తితన్మయత్వానికి లోనయేలా చేశారు. తాను పాడే ప్రతీ పాటా భగవదత్తం అని భావించి గానం చేసే ఘంటసాలవారికి 'శేషశైలావాసా' గీతం ఎంతో అపురూపమైనదీ, అపూర్వమైనది. అందుకే ఈ పాట కలియుగ దైవం వేంకటేశ్వరుడు వున్నంతవరకూ సజీవరాగంగా సదా మన మదిలో మెదులుతూనే వుంటుంది.

ఇక్కడ, ఎంత వద్దనుకున్నా నా మనోచాపల్య బలం వలన మరో చిన్న విషయాన్ని  చెప్పకుండా వుండలేకపోతున్నాను.  శ్రీ వేంకటేశ్వర మహత్యం సినీమా చివరిలో చూపించిన స్వామి విగ్రహాన్ని (మోల్డెడ్), స్వామికి అలంకరించిన ఆభరణాలను, మా జంటసంస్థలు మద్రాస్ తెలుగు అకాడెమీ & భారత్ కల్చరల్ ఇంటగ్రేషన్ కమిటీల మీద వున్న గౌరవాభిమానాలతో శ్రీ పి.పుల్లయ్యగారు కానుకగా అందజేశారు. మా జాతీయోత్సవాలన్నింటిలో ఆఖరి మూడవరోజు కార్యక్రమం 'బాలాజీ సంగీత్ కళ్యాణోత్సవం' వేదికమీద ఈ విగ్రహాన్ని సకల శాస్త్రోక్తంగా సర్వాలంకారాలతో నిలబెట్టి ఉత్సవ విగ్రహాలకు తోమాలసేవ మొదలు అన్ని సేవలు జరిపి చివరకు కళ్యాణమహోత్సవం కూడా నిర్వహించి చివరలో  ఏకాంతసేవలో అన్నమయ్య 'జో అచ్యుతానంద' జోలపాటను బోంబే జయశ్రీ, సుధారఘునాధన్, ప్రియా సిస్టర్స్ గానం చేస్తూ మంగళం పాడేప్పటికి అర్ధరాత్రి దాటి రెండు గంటలయ్యేది. ఇలా నిర్విరామంగా 1981 (మద్రాస్) మొదలు 2008 (విజయనగరం)  వరకు ప్రపంచ ప్రఖ్యాత కళాకారుల సహాయ సహకారాలతో భారతదేశంలోని ప్రధాన నగరాలన్నింటిలో దేశ ప్రముఖుల సమక్షంలో  జాతీయ సమైక్యతోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలన్నిటిలో నేనూ తగిన పాత్ర వహిస్తూ పాల్గొనే అదృష్టం కలిగింది. దీనంతటికీ కలియుగదైవమైన శ్రీ వేంకటాచలపతి దివ్యాశిస్సులే ముఖ్యకారణంగా భావిస్తాను.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్   

Saturday, 10 August 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 42వ భాగం - పుత్తడి బొమ్మా పూర్ణమ్మ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నలభైయొకటవ భాగం ఇక్కడ

42వ సజీవరాగం - పుత్తడి బొమ్మా పూర్ణమ్మ

చిత్రం - కన్యాశుల్కం
గానం - ఘంటసాల & బృందం
రచన - గురజాడ అప్పారావు పంతులు
సంగీతం - ఘంటసాల

సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం మన సమాజంలో ప్రబలివున్న కన్యాశుల్క దురాచారాన్ని, బాల్య వివాహ దురాగతాలను రూపుమాపి ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి  ఆనాటి సంఘసంస్కర్తలెందరో కృషిచేశారు. అలాటివారిలో గురజాడ అప్పారావు పంతులుగారు ప్రముఖులు. ఆనాటి విజయనగర సంస్థానాధీశుడు ఆనందగజపతి మహారాజావారి ఆంతరంగిక మిత్రుడు. ఉభయభాషలలో మంచి కవి, రచయిత అయిన గురజాడ అప్పారావుగారి సహాయ సహకారాలతో ఆనాటి సమాజంలో నెలకొన్న మూఢాచారాలను తొలగించి, బాల్య వివాహాలు, బాల వితంతువుల విషయంలో ప్రజల  దృక్పధాన్ని, జీవనవిధానాన్ని మార్చడానికి ఆనందగజపతి చాలా కృషిసల్పారు.
దాని ఫలితంగా నే గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం, 'పూర్ణమ్మ కథ' అనే గేయం వెలుగులోకి వచ్చి ఒక గొప్ప సంచలనాన్ని సృష్టించాయి. గురజాడ వారి కవితాశిల్పానికి , రచనావైశిష్ట్యానికి, సంస్కార హృదయానికి  దర్పణం పట్టే ఒక కరుణ రసాత్మక గాధ పుత్తడిబొమ్మ పూర్ణమ్మ కథ. పూర్తిగా పదేళ్ళు కూడా నిండని పూర్ణమ్మ అనే బాలికను ఆమె తల్లిదండ్రులు కన్యాశుల్కానికి  ఆశపడి అరవైఏళ్ళు దాటిన ఒక వృధ్ధుడితో పెళ్ళిచేయ సంకల్పిస్తారు. ఆ పిల్ల ఆశలు, ఆశయాలు, కొరికలు ఏమిటో పెద్దలెవరికి పట్టవు. ఆనాడు ఆడదంటే అబల, ఓ కీలుబొమ్మ. ఆమెకు ఓ మనసుంటుందని , దానికి గౌరవం ఇవ్వాలనే భావనే లేని రోజులు. అలాటి పరిస్థితులలో, అభం శుభం తెలియని ఆ అమాయ బాలిక  వివాహం  జరిపిస్తారు . తర్వాత, భర్తతో అత్తింటికి వెళ్ళే సమయంలో  పూర్ణమ్మ ఓ కొలనులో దూకి ఆత్మహత్య చేసుకొని తాను నమ్మిన దేవత దుర్గమ్మ లో ఐక్యమైపోతుంది. ఇది స్థూలంగా పూర్ణమ్మ కథ. ఈ కథను గురజాడ అప్పారావు గారు నడిపించిన తీరు కటిక పాషాణాలను కూడా కరిగిస్తుంది.

ఆ పూర్ణమ్మ కథే నేటి మన సజీవరాగం.

బుర్రకథ మన తెలుగువారి ప్రాచీన జానపద కళాప్రక్రియలలో ఒకటి. సినీమా, టి.వి. మాధ్యమాలు లేని రోజుల్లో హరికథ, రంగస్థలనాటకాలు, వీధిభాగవతాలతో సమానంగా బుర్రకథ కూడా బహుళ జనాదరణ పొందింది. కాలక్రమేణా సాంకేతిక పరిజ్ఞాన ప్రభావంతో అన్ని ప్రాచీన కళాప్రక్రియలలో లాగే బుర్రకధ కూడా క్షీణించింది. బొబ్బిలియుధ్ధం, పల్నాటి యుధ్ధం, అల్లూరి సీతారామరాజు, బాలనాగమ్మ వంటి  వీర, కరుణ, శోక రసాత్మక గాధలెన్నో బుర్రకథలుగా ప్రచారమై ప్రజలలో ఉత్తేజాన్ని, నవచైతన్యాన్ని కలిగించాయి. బుర్రకథ పేరు చెప్పగానే వెంటనే మన స్ఫురణకు వచ్చే పేరు షేక్ నాజర్. గుంటూరు జిల్లాకు చెందినవారు. బుర్రకథా పితామహుడిగా కీర్తిపొందినవారు.
ఈ బుర్రకథా గానం పేరుకు ముగ్గురితో నిర్వహించినా ప్రధాన కథకుడిదే ముఖ్యపాత్ర. మిగిలిన ఇద్దరూ  తందానా ... తాన తందనానా అని వంతపాడుతూ మధ్య మధ్య హాస్యాన్ని పంచుతూ, వర్తమాన విషయాలను ప్రస్తావిస్తూంటారు. అటువంటి ఈ బుర్రకధను మన తెలుగు సినిమాలు కూడా సందర్భోచితంగా ఉపయోగించుకున్నాయి. 

అలాటివాటిలో ప్రధానంగా పేర్కొనదగ్గది 1955 లో వచ్చిన వినోదావారి కన్యాశుల్కం సినీమా. గురజాడ అప్పారావుగారి నాటకం ఆధారంగా ఓ మూడుగంటల కాలానికి అనువుగా మార్పులు, చేర్పులు చేసి తీసిన సినిమా. కన్యాశుల్కం నాటకం వేరు, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ కథ వేరు. ఈ రెంటిని సమన్వయపరుస్తూ సందర్భోచితంగా కన్యాశుల్కం సినీమా లో ఒక బుర్రకథ రూపంలో  పూర్ణమ్మ కథను ప్రవేశపెట్టి నూతన ప్రయోగం చేసారు దర్శకుడు పి.పుల్లయ్య.

ఘంటసాలవారు ఈ సినీమాకు సంగీతదర్శకుడు, ఈ బుర్రకథ గాయకుడు కూడా. తెరమీద  ప్రధాన కథకుడిగా నటించినవారు మోపర్రు దాసు. ఈయన ఆనాటి ప్రముఖ హరికథా కళాకారులలో ఒకరు. ఈ బుర్రకథలో మోపర్రు దాసు తో పాటు నేపథ్యంలో పూర్ణమ్మ కథ దృశ్య చిత్రీకరణ, అందులోని పాత్రధారులు సన్నివేశానికి కావలసిన పుష్టిని చేకూర్చారు. ఘంటసాల వారి నాద హృదయమే  ఈ పూర్ణమ్మకు జీవం.

ఘంటసాల విజయనగర సంగీత సంపర్కం ఈ సినీమాకు ఎంతగానో ఉపయోగించింది. విజయనగరం, ఆ పరిసర ప్రాంతాలన్నీ వివిధ కళాప్రక్రియలకు కేంద్రాలు. ఆ కళా సంస్కృతినంతా క్షుణంగా ఆకళింపు చేసుకొని తనలో జీర్ణింపజేసుకున్న సంగీతజ్ఞుడు ఘంటసాలవారు. సంగీత దర్శకుడిగా, గాయకుడిగా ఆ అనుభవమంతా కన్యాశుల్కం సినీమా సంగీతంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏ సంగీత కళా ప్రక్రియైనా అది తన స్వంతం అనిపించేలా గానం చేయడం ఘంటసాల మాస్టారి ప్రతిభ , విశిష్టత. అసలు సిసలు బుర్రకధా కళాకారుడిగా పరకాయ ప్రవేశం చేసి ఘంటసాలవారు పూర్ణమ్మ కథను వినిపించారు. వారి హృదయంలోని కరుణ, శోక భావాలు ఈ బుర్రకథ రూపంలో ప్రస్ఫుటమై శ్రోతల హృదయాలు కరిగింపజేసి, కంటతడిపెట్టిస్తాయి. గాత్రంతో వారికి సహకారం అందించిన గాయనీ గాయకులు కూడా భావయుక్తంగా గానంచేసి రసోద్దీపన కలిగించారు. బుర్రకథ కళా స్వరూప సహజత్వాన్ని, గానంలో, వాద్యాలలో ప్రతిబింబించేలా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఘంటసాల మాస్టారు పూర్ణమ్మ కథకు తగు వరస సమకూర్చారు. ఇదొక రాగమాలికా గేయం. ఆనందభైరవి, శుభపంతువరాళి, సింధుభైరవి, కాపి, నవరోజ్, జంఝూటీ వంటి రాగాలను సమయస్ఫూర్తి తో ఉపయోగించి ఈ గీత వైశిష్ట్యాన్ని పెంచారు ఘంటసాల. ఇందులో జానపద వాద్యాలైన డప్పు, జముకు, డక్కి, మువ్వలు ను కూడా చక్కగా వినియోగించారు ఘంటసాల.

భావాన్ని అనుభవిస్తూ హృదయాంతరాళాలలోనుండి గానం చేసే ఏకైక గాయకుడు ఘంటసాల అనే విషయాన్ని ఈ పూర్ణమ్మ మరోసారి నిరూపిస్తుంది. ఈ గేయంలోని ఆర్ద్రతకు, కరుణకు కరగని తెలుగు హృదయమే వుండదు. అందుకే పుత్తడిబొమ్మ పూర్ణమ్మ మన మదిలో మెదిలే సజీవరాగం అయింది.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్   


Saturday, 3 August 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 41వ భాగం - అలిగితివా సఖి ప్రియ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నలభైయవ భాగం ఇక్కడ

41వ సజీవరాగం - అలిగితివా సఖీ ప్రియా

చిత్రం - శ్రీకృష్ణార్జున యుద్ధం
గానం - ఘంటసాల
రచన - పింగళి
సంగీతం - పెండ్యాల

నంది తిమ్మనగారు ఆంధ్రభోజునిగా కీర్తిపొందిన శ్రీకృష్ణ దేవరాయలవారి ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులలో ఒకడు. ఈయన కవిత్వం సరళంగా, సుకుమారంగా, బహురమ్యంగా వుంటుంది.  అందమైన స్త్రీ నాసికను వర్ణిస్తూ ఎంతో రమణీయమైన పద్యాన్ని చెప్పిన తిమ్మనగారు కవి ప్రపంచంలో 'ముక్కు' తిమ్మనగా అనంత ఖ్యాతిని పొందిన కవికులాలంకారుడు. 

ముక్కు తిమ్మనగారు రాయలవారి పట్టమహిషి తిరుమలదేవి వివాహ సందర్భంలో అరణపు కవిగా విజయనగరానికి వచ్చినవాడు. మహారాణివారి మంచి చెడ్డలను గమనిస్తూ ఆమెకు చేదోడువాదోడుగా వుండేవాడు. ఒకసారి తిరుమలదేవి, కృష్ణదేవరాయల మధ్య ఒక రకమైన ప్రణయకలహం ఏర్పడింది. రాణీవారిమీద అలగిన రాయలు ఆమెను ఉదాసినపర్చి ఆమె మందిరానికే రావడం మానేసాడు. ఈ అంతఃపుర కలహానికి కారణమేదైనా తమ రాణివారి జీవితాన్ని చక్కపర్చవలసిన గురుతర బాధ్యత తనమీదనున్నదని భావించిన నంది తిమ్మనగారు రాయలవారిని నేరుగా మందలించే ధైర్యం చేయలేక, కలహ సమయంలో భార్యలను అనునయించి, సానుకూలంగా సమాధానపర్చి తమ దారికెలా తెచ్చుకోవాలో  రాజావారికి తెలిసివచ్చేలా వెంటనే  'పారిజాతాపహరణం'  అనే కావ్యాన్ని రచించి రాయలవారికి వినిపించాడు. 

నారదుడు తెచ్చిచ్చిన ఒక స్వర్గలోకపు పారిజాత పుష్పం సత్యభామ అలకకు ఎలా కారణమయిందో, ఆమె ఆగ్రహాన్ని తీర్చడానికి సత్యాపతి ఎంతవరకూ సిధ్ధపడ్డాడో అత్యంత మనోహరంగా పారిజాతాపహరణం కావ్యంలో తిమ్మనగారు వర్ణించారు. అందులోని పద్యమే -'నను భవదీయదాసుని  మనంబున నెయ్యపుకిన్క బూని తాచిన యది నాకు మన్ననయ..." అని భామ కాలితాపులను కూడా భరించాడు శ్రీకృష్ణుడు. ఆ కావ్యాన్ని   ఆసాంతం రసహృదయంతో ఆస్వాదించిన కవిభోజుడు కృష్ణరాయలవారు తన తప్పిదాన్ని గ్రహించి తిరుమలదేవితో తిరిగి సఖ్యత పొందాడు.

శ్రీకృష్ణార్జున యుధ్ధం సినీమాలో సందర్భోచితంగా ఉపయోగించుకున్న నంది తిమ్మనగారి ఆ పద్యము, దానికి అనుగుణంగా ముందు వచ్చే పాటే నేటి మన సజీవరాగం.

ఒక పాటో, పద్యమో గురించి చెప్పడానికి ఇంత ఉపోద్ఘాతం అవసరమాయని కొందరికి సందేహం కలగవచ్చు, కానీ అవసరమే.

ఒక చిత్రంలోని పాటైనా, పద్యమైనా రసోద్దీపన కలిగించి ప్రేక్షకుల హృదయాలలో కలకాలం నిలిచిపోవాలంటే ఆ సందర్భంయొక్క పూర్వాపరాలు, ఆయా పాత్రల స్వభావాల పట్ల  ఆ పాటతో సంబంధమున్న కవికి, దర్శకునికి, సంగీతదర్శకునికి, గాయనీగాయకులకు, తెరమీద నటించే నటీనటులకు పరిపూర్ణంగా అవగాహన వుండాలి. అప్పుడే ఆ సన్నివేశం మనోజ్ఞంగా రూపొంది ప్రేక్షకులను అలరిస్తుంది.

అటువంటి సదవగాహన కల దర్శకుడైనందు వల్లనే కె.వి.రెడ్డిగారు ఆణిముత్యాలవంటి కళాఖండలను చలనచిత్రాలుగా,  మాధుర్యమైన చిత్రగీతాలను రసగుళికలుగా తెలుగువారి సొంతం చేయగలిగారు.

కె.వి.రెడ్డిగారు నిర్మించి దర్శకత్వం వహించిన అద్భుత పౌరాణిక చిత్రరాజం 'శ్రీ కృష్ణార్జున యుధ్ధం'. పింగళి, పెండ్యాల, ఘంటసాల, సుశీల, ఎన్.టి.ఆర్, అక్కినేని, సరోజాదేవి, ఎస్.వరలక్ష్మి వంటి హేమాహేమీల సహాయ సహకారాలతో అజరామర చిత్రంగా నిల్చిపోయింది. ఆ సినీమా లోని అన్ని పాటలు, పద్యాలు  ఈనాటికీ మన మనసులలో నిల్చిపోయాయి. అందులోని "అలిగితివా సఖీ ప్రియా కలత మానవా" అనే పాట భార్యభర్తల మధ్య ప్రణయ కలహాలు, చిలిపి కయ్యాలు వున్నంతవరకూ సజీవరాగమై నిత్యనూతనంగా వినిపిస్తూనేవుంటుంది. వైవాహిక జీవితం అనుభవంలేని బ్రహ్మచారి పింగళి నాగేంద్రరావుగారు మధురమైన  ఊహాపోహలతో మృదువైన శృంగార రసభావనలతో ఈ పాటను వ్రాసారు. (వివాహం అయివుంటే ఇలా వ్రాయగలిగేవారు కారేమో!)

'లేని తగవు నటించడం', ' సత్యాపతి నా బిరుదని నింద', ' సరసనుండి విరహం విధించడం' వంటి ప్రయోగాలు పింగళివారి రచనా శైలికి దర్పణం.

శృంగారభావాలను, విరహవేదనలను వెలిబుచ్చే రాగమైన 'భాగేశ్వరి'ని తీసుకొని పెండ్యాలగారు ఈ పాటను స్వరపర్చారు. భాగేశ్వరి, రాగేశ్వరి రాగాలు రెండూ సామాన్య శ్రోతల చెవులకు ఒకేలా వినిపిస్తాయి. ఈ రెండు రాగాలలో పలికే 'గ' ( గాంధారం) లలో తేడా వుంది. ఆ తేడా  తెలియకపోతే భాగేశ్వరి ని రాగేశ్వరి గా లేదా రాగేశ్వరి ని భాగేశ్వరి గా పొరబడే ప్రమాదముంది. ఈ భాగేశ్వరి రాగం కూడా మియా తాన్సేన్ ద్వారా సంగీతప్రపంచం లో బహుళ ప్రచారంలోకి వచ్చింది. 

ఇలాటి రాగాలపట్ల ఎంతో అవగాహన, అనుభవం వుండడం చేతనే ఘంటసాల మాస్టారు ఈ పాటను ఎంతో హృద్యంగా పాడగలిగారు. శ్రీకృష్ణుడి లోని చిలిపిదనం, జాణతనం పూర్తిగా అర్ధం చేసుకొని అనుభవించి  ఘంటసాల ఆలపించడం వలన తెర మీద కృష్ణుడు ఎన్.టి.రామారావు పాటకు తగినట్లుగా సునాయాసంగా తన హావభావాలతో ప్రేక్షకులను అలరించి కృష్ణుడంటే తాను తప్ప వేరెవరు కారని నిరూపించారు. అలిగితివా, సఖీ ప్రియా అంటూ భామామణిని అనునయించే క్రమంలో చివరికి  తన శిరసును ఆమె కాలితో తన్నినా కూడా అది ఆవిడనే బాధించిందేమోనని సత్యాపతి కలత చెందడం విషయంలో అటు ఘంటసాలగారు, ఇటు రామారావుగారు కనపర్చిన  గాత్ర, నట వైదుష్యం మనలను పులకాంకితులను చేస్తుంది. కవి కల్పనలోని చమత్కారాన్ని పరిపూర్ణంగా అర్ధం చేసుకుంటేనే తప్ప ఆ గాయకుడు తన గళంలో ఆ మాడ్యులేషన్స్ పలికించలేడు,  ఆ నటుడు తన ముఖభావాలు ప్రస్ఫుటంగా చూపించలేడు. ఈవిషయంలో ఘంటసాలగారు, రామారావుగారు తమ తమ ప్రజ్ఞను చాటి చెప్పారు.

భాగేశ్వరిలో రూపొందిన ఈ పాటలో పెండ్యాలగారు పియోనా, సితార్, ఫ్లూట్, వైయొలిన్స్, తబలా, తదితర రిథిమ్స్ ను చక్కగా ఉపయోగించారు.

ఈ పాట చరణాలలో  'దయను చూడవా' అనే చోట, 'నింద ఎరుగవా' అనే చోట వచ్చే సంగతులు,  వెనువెంటనే చిన్న నవ్వు, 'విరహమిటుల విధింతువా'  దగ్గర రాగాలాపన వింటేనే చాలు ఘంటసాల గాత్ర విశేషం మనకు తెలియడానికి. అలాటి సంగతులను  అంత నిర్దిష్టంగా పలకగల  లలిత సంగీత గాయకులే ఈనాడు కరువయ్యారు. ఒకరిద్దరు ఎవరైనా పాడినా ఆ గాత్రాలలో లాలిత్యం, నిండుదనం, రిఫైన్నెస్ కనపడదు.

ఇక్కడ మరో చిన్న విషయం చెప్పాల్సివుంది. మన తెలుగు సినీ దర్శకులకు ముక్కు తిమ్మనగారి పారిజాతాపహరణం లోని ఈ పద్యం పట్ల మక్కువ 1958 నుండే ప్రారంభమయింది. మొదటసారిగా ఈ పద్యాన్ని శ్రీకృష్ణమాయ సినీమాలో పెట్టారు.  అప్పుడు కూడా  ఈ పద్యాన్ని ఘంటసాలవారు ఆలపించగా నారద పాత్రధారి అక్కినేని, జమున (మాయ) పై చిత్రీకరించారు. అయితే పద్యం ఆఖరులో 'అరాళకుంతలా' అనే మాటను మార్చి 'వినీలకుంతలా' అనే పదప్రయోగం చేసారు.   ఆ తర్వాత, శ్రీకృష్ణార్జునయుధ్ధం. చివరగా, శ్రీకృష్ణతులాభారం సినీమాలో భామా కృష్ణులపై ఇదే సన్నివేశంలో ఒక పాట తర్వాత మరల ఈ పద్యం పెట్టారు. ఖమాస్ రాగంలోని ఈ పాటకు, పద్యానికి సంగీతం మరల పెండ్యాలగారే. గాయకుడూ ఘంటసాలగారే. కృష్ణుడూ ఎన్.టి.ఆర్ గారే. 'అలకబూనిన అరాళకుంతల 'మాత్రం మారింది. సత్యభామగా జమున నటించారు.

ఈవిధంగా పలు పౌరాణిక పద్యాలను పలు సినీమాలలో పలుసార్లు గానం చేసిన ఘనత ఒక్క ఘంటసాలవారికే చెందుతుంది.  ఎన్నిసార్లు, ఏ విధంగా గ్రోలినా తనివితీరని గానామృతం ఘంటసాల గళామృతం.




వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.

ప్రణవ స్వరాట్   


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...