Saturday, 11 January 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 64వ భాగం - మదిలో మౌనముగా కదలె మధుర వీణ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
అరవై మూడవ భాగం ఇక్కడ

64వ సజీవరాగం - మదిలో మౌనముగా కదలె మధుర వీణ

చిత్రం - శకుంతల
గానం - ఘంటసాల
రచన - సినారె
సంగీతం - ఘంటసాల

శ్లోకం :

అనాఘ్రాతం పుష్పం కిసలయమలూనం కరరుహై

అనావిధ్ధం రత్నం మధు నవమనాస్వాదిత రసమ్

అఖండం పుణ్యానాం ఫలమివ చ తద్రూప మనఘం

నజానే భోక్తారం కమిహ సముపస్థాస్యతి విధిః నజానే 

 (కాళిదాసు విరచిత అభిజ్జాన శాకుంతలం నుండి)

తాత్పర్యం :

అభిజ్ఞాన శాకుంతలం రెండవ అంకంలో శకుంతల గురించి రాజా దుష్యంతుడు తన చెలికానితో పలికిన మాటలు ...

 "ఈమె వాసన చూడబడని పువ్వు, ఏ గోళ్ళచేతా గిల్లబడని చిగురుటాకు. రంధ్రం తొలవబడని రత్నం. రుచి చూడబడని తియ్యని కొత్త తేనె. చేసుకున్న పుణ్యాలకి పరిపూర్ణమైన ఫలం. ఎవడు ఈ కన్నెను అనుభవించాలని బ్రహ్మ వ్రాసిపెట్టాడో! నాకు తెలియదు."

ఈ శ్లోకం దుష్యంతుడి వ్యామోహానికి, నిర్లజ్జకు పరాకాష్టగా కవి కాళిదాసు మలిచాడని భావించవచ్చును.

 (కీ.శే. పట్రాయని సంగీతరావుగారు ఇచ్చిన వివరణ )

పల్లవి : 

మదిలో మౌనముగా

కదలె మధుర వీణ - 2

చరణం 1 :

రాజహంసవోలె సాగి రమణి తిరిగి చూసే

మరుడేమొ దాగి దాగి విరితూపులు దూసె

ఈ విరాళి నాలో ఏ నాటికి తీరునో

                                    ! మదిలో!

 చరణం 2 :

తెలివెన్నెల జాలువారె చెలియ నవ్వులోన

కనరాని జ్వాలలేవో కలిగెను నాలోన

ఈ తీయని రేయి ఇటులే తెలవారునో

                                    ! మదిలో!

️అనాదిగా మన సమాజంలో  పురుషాధిక్యత వలన స్త్రీ అబలగా, బానిసగా, భోగవస్తువుగా అణగద్రొక్కబడింది. ఏ స్వేఛ్ఛ, స్వాతంత్ర్యం లేకుండా  స్త్రీలు అనుభవించే  కష్టనష్టాలకు, అవమానాలకు దర్పణం శకుంతల. పుట్టిన వెంటనే పసికందుగా వున్న కన్నబిడ్డను  నిర్దాక్షిణ్యంగా వదలిపెట్టి వెళ్ళి పోయిన ఆమె తల్లిదండ్రులు మేనకా విశ్వామిత్రులు. శాకుంతల పక్షులు కరుణించి  ఆ పసికందు ఆకలిని తీర్చడం వలన శకుంతలగా గుర్తించబడింది. కణ్వ మహర్షి దయతో పెరిగి పెద్దయిన కన్య శకుంతల.

కణ్వాశ్రమంలోని శకుంతల అందచందాలకు, ముగ్ధత్వానికి వ్యామోహం చెంది దుష్యంత మహారాజు ఆమెను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. అక్కడినుండే శకుంతల కష్టాలు ప్రారంభమయాయి. నేడు మనం ఎవరి పేరుతో ఈ దేశాన్ని భారత దేశం అని పిలుచుకుంటున్నామో ఆ భరత చక్రవర్తి ఈ శకుంతల కుమారుడు. అంతటి చారిత్రక ప్రశస్తి పొందిన కావ్యనాయిక శకుంతల. ఐదవ శతాబ్దానికి(?) చెందిన సంస్కృత కవి కాళిదాసు వ్రాసిన అభిజ్ఞాన శాకుంతలంలోని కథానాయిక శకుంతల. శకుంతల, దుష్యంతుల ప్రణయగాథ ఇతివృత్తం. కాళిదాసు మహాకవి ఏ రాజాస్థానానికి చెందినవాడో నిర్దిష్టమైన చారిత్రకాధారాలు లేవు. అయినా రెండవ చంద్రగుప్తుని ఆస్థానకవియని కొంతమంది చరిత్రకారుల వాదన. విక్రమాదిత్యుని కొలువులో వున్నట్లు చెప్పబడినా 'విక్రమాదిత్య' అనే బిరుదు అనేక మంది చక్రవర్తులకు వున్నట్లు తెలుస్తోంది. కాళిదాసు మహాకవి అభిజ్జాన శాకుంతలంతో బాటు రఘువంశం, కుమారసంభవం, మేఘదూతం, విక్రమోర్వశీయం వంటి గొప్ప కావ్యాలను కూడా వ్రాశాడు.

సినీమా మాధ్యమం ఆవిర్భవించినప్పటినుండి ఈ కథను అనేక భాషలలో అనేకసార్లు అనేక దిగ్ధంత దర్శకులు సినిమాగా మలిచారు. ముందుగా, 1940లో Ellis R. Dungan దర్శకత్వంలో తమిళంలో సుప్రసిధ్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి, జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం శకుంతల, దుష్యంతులుగా ఈ శకుంతల వచ్చింది. ఆ తర్వాత హిందీలో వి.శాంతారాం తన మొదటి భార్య జయశ్రీ గాడ్కర్ శకుంతలగా, చంద్రమోహన్ (తెలుగు రంగులరాట్నం  హీరో చంద్రమోహన్ కాదు) దుష్యంతుడిగా 1943లో నిర్మించారు. భారతీయ సంగీత, నృత్య, చిత్రకళలలోఅణువణువున ద్యోతకమయ్యే భావ సౌందర్యాన్ని, విశిష్టతను తన సినిమాల ద్వారా అద్భుతంగా ఆవిష్కరించి ప్రపంచానికి చాటిచెప్పిన నిర్మాత, దర్శకుడు వి.శాంతారామ్. ఆయనకు శకుంతల పాత్ర అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది.

ఈ శకుంతలను తిరిగి కలర్ లో  తెలుగు, హిందీ భాషలలో ఎన్.టి.రామారావు దుష్యంతుడిగా, ఘంటసాలవారు సంగీత దర్శకుడిగా నిర్మించబోతున్నారనే వార్త కొన్నాళ్ళు మద్రాస్ లో సంచారం చేయడం చేసింది. కానీ, ఏ కారణం చేతనో శాంతారాం సంకల్పం నెరవేరలేదు. అదే కనుక జరిగివుంటే ఎన్.టి.ఆర్., ఘంటసాల కీర్తికిరీటాలలో మరో ఉత్తమ మణిగా భాసిల్లివుండేది.

తర్వాత, 1961లో శాంతారాం తానే దుష్యంతుడిగా, తన రెండవ భార్య సంధ్య శకుంతలగా 'స్త్రీ' పేరిట నిర్మించి అఖండ ఖ్యాతిపొందారు. ఈ సినీమాను మౌంట్ రోడ్ లోని గ్లోబ్ ధియేటర్ (LIC పక్కన వుండేది) లో చూసిన గుర్తు. ఈ చిత్రంలోని పాటలు, నృత్యాలు,దృశ్య చిత్రీకరణ ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. విదేశాలలో, చలనచిత్రోత్సవాలలో కూడా ప్రదర్శించబడి విమర్శకుల , ప్రేక్షకుల ప్రశంసలను పొందిన చిత్రం శాంతారాం 'స్త్రీ'.

ప్రేక్షకులను ఇంతటి ప్రభావితం చేసిన 'శకుంతల' ను 1965 లో తీయ సంకల్పించారు లక్ష్మీరాజ్యం, శ్రీధర్ రావులు. కమలాకర కామేశ్వరావు దర్శకత్వంలో ఎన్.టి.రామారావు దుష్యంతుడిగా, బి.సరోజాదేవి శకుంతలగా, నాగయ్య కణ్వుడిగా, ఇ.వి.సరోజ, ముక్కామల మేనకా విశ్వామిత్రులుగా, శారదా, గీతాంజలి శకుంతల నెచ్చెలులు, అనసూయ, ప్రియంవదలుగా ప్రముఖ తారాగణంతో తలపెట్టారు. సంగీత దర్శకుడిగా ఘంటసాలవారిని నియమించారు.

ఈ విషయం నాకు చాలా రకాలుగా ఆనందం కలిగించింది. ఒకటి ఈ సినిమా ఘంటసాలవారు సంగీత దర్శకుడిగా పని చేయడం; సహజంగానే పౌరాణిక చిత్రాలంటే సుశ్రావ్యమైన మంచి సంగీతానికి స్కోప్ వుంటుంది; మరొకటి, శాంతారాం తీసిన  స్థాయిలో తెలుగులో సినీమా వస్తుందనే ఆశ. అయితే అది ఆశగానే మిగిలిపోయింది. కారణం ఈ తెలుగు సినీమా కలర్ లో కాకుండా బ్లాక్ ఎండ్ వైట్ లో తీసారు. అది నాకు బాగా అసంతృప్తి కలిగించిన విషయం. కారణం, ప్రకృతి సౌందర్య దృశ్యాలు,  కళాత్మకమైన భారీ సెట్ల ఔన్నత్యం  రంగులలో ప్రతిఫలించినంతగా తెలుపు నలుపులలో ప్రతిఫలించవు. అయితే, పీత కష్టాలు పీతవి, చెప్పుకుంటూపోతే కొండవీటి చేంతాడంత. ఆ  నిర్మాతల సాధకబాధకాలు వారివి.

సినీమా కలర్ కాకపోతేనేం! నటీనటుల పాత్రోచిత నటన, దర్శకుని ప్రతిభ, నవరసాలతో నిండిన వైవిధ్యభరితమైన ఘంటసాలవారి పాటలు, నేపథ్య సంగీతం శకుంతలకు ప్రాణప్రతిష్ట చేశాయి. ఈ సీనీమాలో  దుష్యంతుడిగా  ఎన్.టి.ఆర్ హుందాగా, దర్జాగా, రాజసంతో నటించారు. ఆ పాత్రకు ఘంటసాల మాస్టారు పాడిన ' అనాఘ్రాతం పుష్పం' అనే కాళిదాసు శ్లోకం,  'మదిలో మౌనముగా' పాట ఎంతో మనోహరంగా వుంటుంది. అదే ఈనాటి మన 'ఘంటసాల - సజీవరాగం'.

'అనాఘ్రాతం పుష్పం' శ్లోకాన్ని ఘంటసాల మాస్టారు కళ్యాణి రాగంలో స్వరపర్చి ఎంతో హృద్యంగా ఆలపించారు. ఈ శ్లోకం అయిన మరుసటి ఒకటి రెండు సీన్లలో "మదిలో మౌనముగా" విరహగీతం.  ఎంతో ఔచిత్యంతో  డా.సి.నారాయణరెడ్డిగారు సమకూర్చిన సాహిత్యంఈ పాటకు నిండుదనాన్ని చేకూర్చింది. ఘంటసాల మాస్టారు హిందుస్థానీ ఖమాస్ రాగ నుడికారంతో అద్వితీయంగా గానం చేసారు. గాంభీర్యం, లాలిత్యంతో కూడిన ఘంటసాలవారి గాత్రమాధుర్యంతో ఈ పాట ఆపాతమధురమే అయింది.  ఘంటసాల మాస్టారు ఉపయోగించిన సితార్, ఫ్లూట్, హార్ప్, ఎలక్ట్రిక్ గిటార్, వైబ్రోఫోన్, వైలీన్స్, తబలా, డబుల్ బేస్ వంటి వాద్యాలు  "మదిలో మౌనముగా" పాటకు  నిండుదనాన్ని, శ్రావ్యతను చేకూర్చాయి. 'శకుంతల' చిత్రానికి ఆద్యంతం ఘంటసాల మాస్టారు అందించిన నేపథ్య సంగీతాన్ని అనుభవించడానికి ఎంతో రసహృదయం కావాలనడంలో ఎటువంటి సందేహం లేదు.  పాటలో 'కదలె మధుర వీణ' అంటూ నేపధ్యంలో పూర్తిగా సితార్ నే వినిపించడం; తెరమీద సితార్, వీణలకు బదులు ' గోటు' వాద్యంలాటిదానిని చూపించడం గీత వాద్యాల పట్ల కనీస అవగాహన ఉన్నవారిని కూసింత ఇబ్బంది పెట్టే విషయమే. అయితే ప్రాచీనకాలంలో ప్రతీ తంత్రీ వాద్యాన్ని 'వీణ' అనే అనేవారట. ఆ విధంగా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవలసిన అగత్యంలేదు.

మంచి సంగీతాన్ని ఆస్వాదించాలని ఆశించే ప్రతీ ఒక్కరు తప్పక చూడవలసిన చిత్రం ' శకుంతల'.




వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్


Saturday, 4 January 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 63వ భాగం - మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
అరవై రెండవ భాగం ఇక్కడ

63వ సజీవరాగం -  మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా

చిత్రం - శ్రీకృష్ణపాండవీయం
గానం - ఘంటసాల
రచన - కొసరాజు
సంగీతం - టి.వి.రాజు 

వచనం - అపాయమ్ము దాటడాని కుపాయమ్ము కావాలి

అంధకార మలమినపుడు

వెలుతురుకై వెతకాలి

ముందుచూపు లేనివాడు ఎందునకూ కొరగాడు

సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము

గ్రహించలేడు !

 పల్లవి :

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా

ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తౌదువురా 

                                             !మత్తు!

చరణం 1:

జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు

మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు

అతినిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు-2

పరమార్ధం కానలేక వ్యర్ధంగా చెడతాడు

                                             !మత్తు! 

వచనం :

సాగినంతకాలం నా అంతవాడు లేడందురు సాగకపోతే  ఊరక

చతికిలబడిపోదురు కండబలముతోటే ఘనకార్యము 

సాధించలేరు బుధ్ధిబలము తోడైతే విజయమ్ము వరింపగలరు 

                                             !మత్తు!

చరణం 2:

చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్ట బూనుమురా

పిరికితనము కట్టిపెట్టి ధైర్యము చేపట్టుమురా

కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు

చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ఖర్మం

                                             !మత్తు!

సంగీత సాహిత్యాల సమాహారం పాట. కొన్ని పాటలు సంగీత రస ప్రధానంగా వుంటే మరికొన్ని పాటలు సాహితీ రస ప్రధానంగా , సందేశాత్మకంగా వుంటాయి. అలాటి పాటల్లో రాగభావం , స్వరమాధుర్యం కంటే భావానికే ఎక్కువ ప్రాముఖ్యత వుంటుంది. అలాటి ఒః ఆపాతమధురమే నేటి మన మదిలో సదా మెదిలే సజీవరాగం. అదే - 'శ్రీకృష్ణపాండవీయం' చిత్రంలోని గీతం 'మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా '.

 

మని+షి = మనిషి ; మకార త్రయ సమన్వితుడు( మదం, మదిర, మగువ) లాటి చమత్కార నిర్వచనాలెన్నో సగటు మనిషి తత్త్వానికి నిదర్శనంగా చెప్పబడ్డాయి. మనిషిలో సాత్విక గుణాలు లోపించినప్పుడు  రజో, తమో గుణాలు మనిషిని పట్టి పీడిస్తాయి. అలాటి సందర్భాలలో కర్తవ్య విమూఢుడై, సోమరిగా మారి రోజంతా తినడంలోనూ, నిద్రపోవడంలోనే గడిపేస్తూంటే ఎందుకు కొరగాకుండా పోతాడు. అలాటప్పుడు  భగవంతుడు సాధు సత్పురుషుల రూపంలో మార్గాన్ని నిర్దేశిస్తాడు. మనిషి ఆ  ఉపదేశాలను సక్రమంగా  అనుసరిస్తే వృధ్ధిచెందుతాడు. లేదంటే పతనమైపోతాడు. భగవంతుడైనా కొంతవరకే మార్గం చూపించి చేయూతనిస్తాడు. పాటించాడా సరి, లేదంటే  'నీ ఖర్మం' అని వదిలేసి చక్కా పోతాడు.

ఇదే ' మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా' పాటలోని సారాశం.

పౌరాణిక చిత్ర నిర్మాణంలో నిష్ణాతుడు ఎన్.టి.రామారావుగారు. మంచి అభిరుచి గల దర్శక, నిర్మాత. తన చిత్రాల ద్వారా సమాజానికి ఉపయోగించే సందేశం వినిపించాలని తపించిన నట దర్శకుడు. తమ సొంత బ్యానర్ లో భారీ ఎత్తున నిర్మించిన పౌరాణిక చిత్రరాజం  'శ్రీకృష్ణ పాండవీయం'. పరస్పర విరుధ్ధ భావాలు గల శ్రీకృష్ణ, దుర్యోధన పాత్రలను ఎంతో వైవిధ్యంతో పోషించి నటరత్న బిరుదుకు వన్నె తెచ్చారు.

 నేటి సజీవరాగమైన "మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా " పాట శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలోనిదే.

కార్యార్ధియై వెళ్ళిన భీముడు కర్తవ్యాన్ని  మరచి నిద్రమత్తులో పడినప్పుడు శ్రీకృష్ణుడు మారువేషంలో వచ్చి అతనిని జాగ్రదావస్థకి తీసుకువచ్చి కర్తవ్యాన్ని బోధించే సన్నివేశంలో వచ్చే పాట ఇది. సన్నివేశపరంగా ఇది భీముని ఉద్దేశించి పాడినా ఆ పాటలోని సందేశం. ఈ లోక ప్రజలందరికీ వర్తిస్తుంది. ఈ పాటను కొసరాజు రాఘవయ్య చౌదరిగారు చాలా అద్భుతంగా వ్రాసారు. ముందు చెప్పినట్లుగా ఈ పాట సాహిత్య ప్రధానమైన గీతం. నిరక్షరాస్యులకు కూడా అతి తేలికగా అర్ధమయేరీతిలో ఈ పాటను కొసరాజు వ్రాసారు. మనిషిలోని బలహీనతలను, దుర్గుణాలను ఎత్తిచూపుతూ వాటిని తొలగించుకోవలసిన ఆవశ్యకతను చమత్కారంగా చిన్నచిన్న మాటలతో  సుస్పష్టం చేసారు. మత్తు, గమ్మత్తు, చిత్తు, చుట్టుముట్టు, మట్టుబెట్టు, కట్టిపెట్టు, చేపట్టు  వంటి  పదాలు అంత్యప్రాసల మీద కొసరాజుగారికున్నమక్కువను తెలియపరుస్తాయి. పాటలోని భావాన్ని, సాహిత్యాన్ని విశ్లేషించవలసినంత కఠినతర భాషేమీ ఈ పాటలేదు. అన్నివర్గాలవారు అత్యంత సులభంగా అర్ధం చేసుకోగల పాట. ఇది కూడా అర్ధం కాలేదంటే ఇంక అది వారి 'ఖర్మం'.

ఇందులో సంగీతం పాత్ర నామమాత్రం. అయినా అందరూ సులభంగా పాడుకునేలా స్వరపర్చారు సంగీతదర్శకుడు టి.వి.రాజు. మ‌రెన్నో శ్రవణపేయమైన గీతాలున్న శ్రీకృష్ణ పాండవీయంలో ఘంటసాలవారు ఆలపించిన ఈ పాట మాత్రం కధాపరంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ రకమైన గీతమైనా ఆ పాట భావంలో లీనమై అవలీలగా మధురంగా ఆలపించగల నేర్పరి ఘంటసాల. ఈ పాటలో వున్న తమాషా ఏమంటే ఈ పాటలో వచనం, పాట రెండూ వినిపిస్తాయి.  'అపాయమ్ము దాటడానికుపాయమ్ము కావాలి...' అనే వచనంతో ప్రారంభమై తర్వాత 'మత్తు వదలరా' అనే పల్లవి తో పాట సాగుతుంది. అలాగే, ఒకటవ చరణానికి , రెండో చరణానికి మధ్య మరల వచనం వస్తుంది. ఒక్కొక్కసారి పాట సాహిత్యం లోని పదాలు తాళానికి ఎదురుతిరిగి పాట వరసకు,  నడకకు అడ్డు తగులుతూంటాయి. అలాటి సందర్భాలలో పాటను ఆపి వచన రూపంలో చెప్పదలచుకొన్న విషయాన్ని  చెప్పిస్తారు. ఇందువల్ల సంగీత పరంగా, సాహిత్య పరంగా ఔచిత్యం దెబ్బతినదు.  ఈరకమైన విషయాలన్నింటిని ఆకళింపుజేసుకొని గీతానికి కావలసిన రసోత్పత్తిని సమర్ధవంతంగా కలిగించడం ఘంటసాలవారి ప్రత్యేకత.

టేప్(డప్పు), తబలా డక్క, గిటార్, ఫ్లూట్ వంటి వాద్యాలను మాత్రమే ఔచిత్యంతో ఉపయోగించారు టి.వి.రాజు. ఎన్నో మంచి పాటలున్న ఈ చిత్రంలో  సి.నా.రె. వ్రాసి సుశీల, లీల గార్లు ఆలపించిన 'స్వాగతం, సుస్వాగతం' పాట సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు.

1995లో  ప్రశాంతినిలయంలో శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి 70 జన్మదినోత్సవ సందర్భంగా అక్కడ మా జంటసంస్థల జాతీయసమైక్యతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆ సందర్భంలో బాబావారు తమ రథంలో ఊరేగింపుగా వచ్చినప్పుడు ఈ 'స్వాగతం , సుస్వాగతం' పాట వరసలో  బాబా వారి పరంగా వేరే సాహిత్యం వ్రాయించి ప్రముఖ గాయకుడు మనో, నటుడు సాయికుమార్, బృందంతో పాడించడం, అది లక్షలాది సంఖ్యలో హాజరయిన భక్త సందోహానికి అమితమైన  ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించింది ఇంకా కనులముందు కదలాడుతోంది.

శ్రీకృష్ణపాండవీయం చిత్ర దర్శకుడిగా, శ్రీకృష్ణ, దుర్యోధన పాత్రధారిగా ఎన్.టి.రామారావు తన విశ్వరూపాన్ని, బహుముఖ ప్రజ్ఞను దిగంతాలకు చాటిచెప్పారు. సుప్రసిద్ధ కన్నడ నటుడు ఉదయకుమార్ ఈ చిత్రంలో భీమసేనుడిగా నటించారు. తమ పూర్వీకం తెలుగునాటకు చెందినదేనని తమ ఇంట్లో తెలుగులోనే మాట్లాడుకుంటామని ఉదయకుమార్ ఏదో పత్రిక ఇంటర్వ్యూలో చెప్పగా చదివిన గుర్తుంది. తాను హీరోగా నటించిన మరికొన్ని ఇతర చిత్రాలలో కూడా ఉదయకుమార్ కు మంచి అవకాశాలు కల్పించి ప్రోత్సహించిన సహృదయుడు ఎన్.టి.ఆర్. పరమానందయ్య శిష్యుల కథ విజయం తరవాత నిర్మాత తోట సుబ్బారావు నిర్మించిన 'భువనుందరి కథ' చిత్రంలో చాకలి తిప్పడు పాత్ర వాటిలో ఒకటి. శ్రీ కృష్ణపాండవీయం సాధన గురించి, ఘనవిజయం గురించి నేను ప్రత్యేకించి చెప్పబూనడం హాస్యాస్పదమే అవుతుంది.




వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్  


Saturday, 28 December 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 62వ భాగం - బొమ్మను చేసి ప్రాణముపోసి ఆడేవు నీకిది వేడుకా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
అరవైయొకటవ భాగం ఇక్కడ

62వ సజీవరాగం -  బొమ్మను చేసి ప్రాణముపోసి ఆడేవు నీకిది వేడుకా

చిత్రం - దేవత
గానం - ఘంటసాల 
రచన - వీటూరి & శ్రీశ్రీ
సంగీతం - కోదండపాణి

సాకీ - 

'బ్రతుకంత బాధగా కలలోని గాధగా కన్నీటి

ధారగా కరగిపోయే తలచేది 

జరుగదూ జరిగేది తెలియదూ...'

పల్లవి :

"బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు

నీకిది వేడుకా -2

గారడి చేసి గుండెలు కోసి నవ్వేవు ఈ వింత చాలిక 

                                        !బొమ్మను!

చరణాలు :

అందాలు సృష్టించినావు

దయతో నీవూ మరల నీ చేతితో

నీవె తుడిచేవులే  -2

దీపాలు నీవే వెలిగించినావే

గాఢాంధకారాన విడిచేవులే

కొండంత ఆశ అడియాస చేసి -2

పాతాళ లోకాన తోసేవులే! బొమ్మను!

                                        !బొమ్మను!

 

ఒకనాటి ఉద్యానవనమూ నేడు కనమూ 

అదియే మరుభూమిగా నీవు మార్చేవులే ! ఒకనాటి!

అనురాగ మధువు అందించి నీవు

హాలాహలజ్వాల చేసేవులే ! అనురాగ!

ఆనందనౌక పయనించువేళా

శోకాల సంద్రాన ముంచేవులే

                                        !బొమ్మను!

నిశ్చలంగా వున్న తటాకంలో రాయి విసిరితే ఏమవుతుంది , అందులోని నీరంతా అల్లకల్లోలమవుతుంది... నట్ట నడి సముద్రంలో ప్రశాంతంగా సాగిపోతున్న నౌక అకస్మాత్తుగా పెనుతుఫానుకు గురై పడవ మునిగిపోతే ప్రయాణీకుల హాహాకారాలు, వారి బంధువుల మనోవేదన ఎలా వుంటుంది... 

గాఢనిద్రలో వున్న ప్రయాణీకులు హటాత్తుగా రైలు ఘోర ప్రమాదానికి లోనై  నదిలోపడి కంటికి కనపడకుండాపోతే వారి ఆత్మీయుల మనఃస్థితి ఎలా వుంటుంది... ఇలాటి ఉపమానాలతో హీరో మనోక్లేశాన్ని వివరిస్తూ డైరెక్టర్ గారు కవిగారిని ఒక శోక గీతం వ్రాయమన్నారు. మాటలు బరువుగా, అర్ధవంతంగా ప్రేక్షకుల హృదయాలను కరిగించేలావుండాలని కోరుకున్నారు.

అలనాడు సీతా సాధ్విని కోల్పోయి మనసు కకావికలై దుఃఖసముద్రంలో ములిగిపోయినప్పుడు రాముడు ఎంతటి బాధను, మనోవేదనను అనుభవించాడో, అలాటి సంక్షోభాన్ని తన భార్య చనిపోయిందని తెలుసుకుని హీరో దీనాతి దీనంగా విలపిస్తున్నాడు.

 ఈ సిట్యుయేషన్ కి మీరు అద్భుతమైన పాట వ్రాయాలి... కవిగారికి దర్శకుడు , నిర్మాతల సూచన.

 సిల్క్ జుబ్బా, సిల్క్ వేస్టి (లుంగీ) ధరించి, బుగ్గన ఘాటైన కిల్లీతో, చేతి వ్రేళ్ళ మధ్య  త్రిబుల్ ఫైవ్ సిగరెట్ తో కవిగారు ఆలోచనలో పడ్డారు. అంతా నిశబ్దంగా వున్నారు ఫ్యాన్ గాలికి కదలాడే ఎదురుగా వున్న ప్యాడ్ లోని తెల్లకాగితాల రెపరెపల శబ్దం తప్ప మరేదీ వినపడడం లేదు. కవిగారికి ఒక థాట్ వచ్చింది...

 

"బ్రతుకంత బాధగా కలలోని గాధగా కన్నీటి ధారగా కరగిపోయే తలచేది జరుగదూ జరిగేది తెలియదూ" అని సాకీతో మొదలెట్టారు కవి వీటూరి. ఈ బ్రహ్మాండమైన ఓపెనింగ్ నిర్మాత పద్మనాభంగారికి, దర్శకుడు హేమాంబరధరావుగారికి, సంగీత దర్శకుడు కోదండపాణిగారికి మహబాగా నచ్చేసింది. పల్లవి వ్రాయాలి... పల్లవి ట్యూన్ వినిపించారు. వీటూరిగారు మరల ఆలోచనలో పడ్డారు. రెండు మూడు పల్లవులు వ్రాసి వినిపించారు. దర్శకుడికి నచ్చలేదు. సాంగ్ కంపోజింగ్ మర్నాటికి వాయిదా వేసారు. మర్నాడు మరల నిర్మాత ఆఫీసులో పాట కంపోజింగ్ . కాఫీ, టిఫిన్ లు, తాంబూల సేవనం తర్వాత అందరూ పాటమీద కూర్చున్నారు. వీటూరిగారు చాలా రకాలుగా వ్రాసిన పల్లవులేవి దర్శకుడికి తృప్తినివ్వడం లేదు. ఇంకా వెరైటీగా, అంతకుముందు ఎవరూ వ్రాయని థాట్ తో పదాలు పడాలని, మరోసారి ప్రయత్నించమని కోరిక. రెండోరోజు కూడా ఏవిధమైన సానుకూల పల్లవి రాలేదు. కవిగారి ఆలోచనల్లోంచి వచ్చిన పల్లవులేవి ఆమోదానికి నోచుకోలేదు. పల్లవి లేనిదే చరణానికి అడుగువేయడమెలా?

ఇలాటి తర్జనభర్జనలతో రోజులు గడచిపోతున్నాయి. పాట మాత్రం తయారుకాలేదు.  పాట ఘంటసాలగారితో పాడించి, అన్నగారిమీద షూట్ చేయాలి. అన్నగారి కాల్షీట్లు దొరకడమే కష్టం. అనుకున్న ప్రకారం ఈ షెడ్యూల్ లో పాట షూటింగ్ ముగించకపోతే చాలా కష్టాలొస్తాయి...  నిర్మాత బి.పద్మనాభంగారికి బిపి పెరిగిపోతోంది.

పాట వేగంగా వ్రాయించాలంటే వీటూరిని తప్పించి వేరే కవిగారిని రప్పించాలి. పద్మనాభంగారు , వీటూరిగారు మంచి మిత్రులు. ఇద్దరి మధ్య మంచి అవగాహన వుంది. ఈ పాట వరకు కవిగారిని మార్చడానికి నిర్ణయించారు. వీటూరి స్థానే ఈ పాట వ్రాయడానికి శ్రీశ్రీ వచ్చారు.

తెల్లటి అరచొక్కా , షెరాయితో వ్రేళ్ళ మధ్య నిరంతరం ఆరక వెలిగే శ్వేతకాష్ట వెలుగులనుండి, పొగల అలలనుండి ప్రేరణను, స్ఫూర్తిని పొందే శ్రీశ్రీ హాలాహల జ్వాలలాంటి పదాలతో మనసుకు పట్టే శోక గీతాన్ని వ్రాసిచ్చారు.

(ఇదంతా ఊహాచిత్రం. వాస్తవంలో ఏం జరిగిందో  సంబంధిత వ్యక్తులకు తప్ప పూర్తిగా ఎవరూ చెప్పలేరు. అంతా ఊహాగానమే.)

మహాప్రస్థాన కవి శ్రీశ్రీ  పద్మనాభంగారి 'దేవత' కోసం వ్రాసిన పాటే నేటి మన ఘంటసాల సజీవరాగం. అదే "బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకిది వేడుకా" అనే పాట.

విధాత వ్రాత గురించి, విధివిలాసం గురించి, విధి చేసే వింతల గురించి గతంలో ఎన్నో పాటలు, ఎంతోమంది కవులు వివిధ రకాలుగా వర్ణించి వ్రాసారు. వాటన్నిటిని మించిన అపూర్వ గీతాన్ని ప్రేక్షకులకు అందించాలని ఆకాంక్షించారు దర్శక నిర్మాతలు. ఆ ప్రయత్నంలో భాగంగా ఒకే పాటను ఇద్దరు కవులచేత వ్రాయించవలసి వచ్చింది. పడ్డ కష్టానికి మించిన సత్ఫలితమే దొరికింది శ్రీశ్రీ గారి సౌజన్యంతో.

ప్రశాంతంగా సుఖప్రదమైన సంసారజీవనం గడుపుతున్న ఒక వ్యక్తి జీవితంలో అనుకోని దుర్ఘటన ఏర్పడితే అందువలన కలిగిన దుష్ఫలితాలను తట్టుకోలేక , నిజాన్ని భరించలేక ఒక వ్యక్తి పడే మానసిక వేదనను శ్రీశ్రీ ఈ పాటలో అత్యంత హృదయవిదారకంగా వెల్లడించారు. సామాన్య జనాలకు సైతం సులభంగా అర్ధమయే ఉపమానాలతో ఈ పాటను వ్రాసారు.

దేవుడు మనిషనేవాడికి సుఖాన్ని , దుఃఖాన్ని రెంటినీ పంచుతూ వాటివల్ల మనిషి పడే పాట్లను చూసి నవ్వుకుంటాడు. మనుషులను తన చేతిలో కీలుబొమ్మలుగా చేసి ఆడిస్తూంటాడు. భగవంతుడి లీలా వినోదాన్ని అర్ధం చేసుకోవడం అంత సులభం కాదు.

శ్రీశ్రీ విప్లవ కవి మాత్రమే కాదు, మనసు కవి కూడా అని నిరూపించే ఆయన జీవిత, రచనా శైలి, భావోద్వేగం అనితరసాధ్యం.  ఎన్ని తరాలు గడచినా  మనసున పట్టి కుదిపే మరపురాని మహొద్వేగభరితం ఈ శోక గీతం.

'దేవత' సినీమా వచ్చేవరకు ఒక వర్గపు ప్రేక్షకులచేత మాత్రమే గుర్తింపబడిన సంగీత దర్శకుడు ఎస్ పి కోదండపాణి. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తిగారి ద్వారా గాయకుడిగా పరిచయం కాబడి ఆయన వద్ద సహాయకుడిగా ఎన్నో చిత్రాలకు పనిచేసారు. కోదండపాణిగారికి సంగీత సహాయకుడిగా ఎన్నో సినీమాలకు పనిచేసిన జి.నాగరాజన్ మా తండ్రిగారు(పట్రాయని సంగీతరావు) వెంపటి చిన సత్యంగారి నృత్యనాటకాలకు సంగీతదర్శకుడిగా వున్నకాలంలో వారి వాద్యబృందంలో ఫ్లూట్ వాద్యకారుడిగా సహకరించేవారు. శాస్త్రీయ సంగీతంలో మంచి ప్రవేశం గల వ్యక్తి నాగరాజన్.

'దేవత' సినీమా కోదండపాణిగారికి మంచి గుర్తింపును , ఖ్యాతిని తెచ్ఛిపెట్టింది. ఈ సినీమాలోని పాటలన్నీ అందరినీ అమితంగా అలరించాయి. 'దేవత' సినీమాకు సన్నివేశపరంగా మకుటాయమానమై నిలిచే పాట "బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుకా" పాట. ఎంతో కరుణను, శోకాన్ని ధ్వనింపజేసే పాట. కోదండపాణిగారు ఈ పాటను బిలాస్ఖాన్ తోడి స్వరాల ఆధారంగా చేసినట్లు విన్నాను. రాగాల విషయంలో నాది వినికిడి జ్ఞానం మాత్రమే. (బిలాస్ ఖాన్ తోడి కరుణరస ప్రధాన హిందుస్థానీ రాగం.  కర్ణాటక సంగీతంలో సంపూర్ణరాగమైన హనుమత్తోడి రాగంలో ఆరోహణాక్రమంలో 'నిషాదాన్ని', అవరోహణాక్రమంలో 'పంచమాన్ని' స్వరాలను వర్జించి ప్రయోగిస్తే అది హిందుస్థానీ శైలిలో బిలాస్ఖాన్ తోడి అంటారని, ఈ రాగాన్ని సుప్రసిధ్ధ హిందుస్థానీ సంగీత చక్రవర్తి తాన్సేన్  మరణించినప్పుడు ఆయన కుమారుడు బిలాస్ఖాన్ ఈ రాగం ఆలపిస్తూ శోకించారని , ఆవిధంగా ఈ రాగం బిలాస్ఖాన్ తోడిగా ప్రచారమయిందని శ్రీ పట్రాయని సంగీతరావు గారు ఘంటసాల భగవద్గీత రాగస్ఫూర్తి గురించిన విశ్లేషణలో పేర్కొన్నారు.)

ఘంటసాల ఈ పాటను ఎంతో ఆర్ద్రతతో, హృదయాలను కదిలించేలా ఆలపించారు. పాట  సాకీని మంద్రస్థాయిలో ప్రారంభించి క్రమక్రమంగా మధ్యమంలో పాడుతూ చివరకు  శ్రోతల దేహాలు గగుర్పొడిచేలా తారస్థాయిలో ముగించారు. ఈ తరహా గంభీరమైన గీతాలకు తనకు తానే సాటియని మరోసారి నిరూపించారు ఘంటసాల. ఈ పాటలోని భావోద్వేగాలకు తగినట్లుగా కోదండపాణి హెవీ ఆర్కెస్ట్రానే ఉపయోగించి ' బొమ్మను చేసి' పాటకు ప్రాణ ప్రతిష్ట చేసారు.

తెర వెనుక ఘంటసాల బరువైన గాత్రానికి దీటుగా తెరమీది ఎన్.టి.రామారావు అమోఘమైన నటవైదుష్యం ఈ పాటకు అజరామరత్వాన్ని కల్పించింది. ఎన్.టి.ఆర్, సావిత్రి, నాగయ్య, రాజనాల, పద్మనాభం, గీతాంజలి, మొదలగువారు నటించిన 'దేవత' బాక్సాఫీస్ వద్ద ఘన ఫలితాలానే సాధించింది.

నిర్మాత గా తన మొదటి చిత్రాన్ని ఎన్.టియరామారావు సహకారంతో నిర్మించిన బి.పద్మనాభం తర్వాత మరెన్నో సినీమాలు తీసారు, డైరెక్టర్ గా వ్యవహరించారు. కానీ మరల ఎన్.టి.ఆర్ తో మరే చిత్రమూ నిర్మించకపోవడం ఒక విశేషం. 



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 


Saturday, 21 December 2024

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 61వ భాగం - కులములో ఏముందిరా సోదరా మతములో ఏముందిరా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   

ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
అరవైయవ భాగం ఇక్కడ

61వ సజీవరాగం -  కులములో ఏముందిరా సోదరా
                         మతములో ఏముందిరా
చిత్రం - సత్యహరిశ్చంద్ర
గానం - ఘంటసాల 
రచన - పింగళి
సంగీతం - పెండ్యాల

పల్లవి: కులములో ఏముందిరా సోదరా

మతములో ఏముందిరా

ఆ మట్టిలో కలిసేటి మడిసీ మడిసికి

భేదం ఏముంది ఏముందిరా 

                            !కులము!

నిలువు బొట్టుతో సొరగం రాదుర-2

అడ్డబొట్టుతో నరకం పోదుర-2

జుట్టు బొట్టు కట్టులన్నీ-2

పాడె కట్టుతో ఎగిరిపోవురా  

జంగాలంతా శివుడే యంటరు

దాసరులో కేశవుడే యంటరు!జంగా! 

                            !కులము!

 జంగము దాసరి జగడమాడుకొని-2

వల్లకాటిలో ఒకటైపోతురె !కులము!

 తలకో మతముగ నీతులు గీతులు

బోధలు చేసే స్వాములు చివరకు -

!తలకో! కాటిరేడు యీ వీరబాహుని 

చేతిమీదుగా బుడిదౌతరే  

                            !కులము! హహాహహా !

కులమా? గుణమా? గుణమా? కులమా? ఏది మనిషిని , సమాజాన్ని ప్రగతిఫథంలోకి తీసుకువెళ్ళేది - గుణమా? కులమా?   సాత్విక లక్షణాలు మనిషిని తన ఆధీనంలో వుంచుకున్నంత కాలం సద్గుణాలే మార్గదర్శకంగా వుండేవి. చాతుర్వర్ణాశ్రమ ధర్మాలను పాటిస్తూ నీతి నియమాలతో ఎవరి వృత్తులను వారు చేసుకున్నంతకాలం ఈ లోకం సుఖసంతోషాలతో శాంతియుతంగా వుండేది.  రాను రాను ఎప్పుడైతే రజో తమో గుణాల ఆధిక్యత ప్రబలడం మొదలయిందో అప్పుడే మనిషి తెగలని, జాతులని, కులాలని, మతాలని ఏర్పర్చుకొని రాక్షసుడిగా మారాడు. బలమున్నవాడిదే రాజ్యమయింది.   సత్యలోకం, రామరాజ్యం, సమైక్యత, వసుధైక కుటుంబకం వంటి మాటలు ఎండమావులైనాయి. జాతి, కులం, మతం ప్రాతిపదిక మీద దుష్టరాజకీయముఠాలు ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. అనాదిగా వున్న ఈ జాతి, కుల, మత జాడ్యం వలన మానవ సమాజం భ్రష్టుపడకుండా వుండడానికి,   ఈ దేశాన్ని రక్షించడానికి మహానుభావులెందరో వివిధరకాలుగా కృషిచేసారు. కుల, మత తత్త్వాలకు అతీతమైన నవసమాజస్థాపన కోసం అహర్నిశలు శ్రమించారు.

ఆ దిశగా తెలుగు సినీమా చేసిన సేవకూడా సామాన్యమైనది కాదు. నేడు సంఘంలో ప్రబలివున్న జాతి, కుల, మత రాజకీయ వ్యవస్థ అవలక్షణాలను తెగనాడుతూ అనేక సుబోధక గేయాలను లబ్దప్రతిష్టులైన సినీ కవులెందరో  సినీమా పాటల ద్వారా ప్రచారం చేసి పామర ప్రజలలో జాగృతిని తీసుకురావడానికి తమ వంతు కృషి తాము చేసారు.

జనపదాలకు అర్ధమయేలా సులభమైన, సరళమైన శైలిలో కవి పింగళి నాగేంద్రరావుగారు వ్రాసిన ఒక వ్యంగ్య, ప్రబోధ గీతమే ఈనాటి సదా మదిలో మెదిలే  ఘంటసాల సజీవరాగం. అదే - "కులములో ఏముందిరా సోదరా, మతములో ఏముందిరా" పాట. ఈ పాటలోని ప్రతి అక్షరం, ప్రతీ భావం మనం ఉలిక్కిపడేలా చేస్తుంది. జీవిత సత్యాలను బోధిస్తుంది.

మంచిని బోధించడానికి సకల శాస్త్ర పారంగతుడో, సర్వసంగ పరిత్యాగో కానక్కరలేదు. జీవితసత్యాన్ని క్షుణంగా అర్ధం చేసుకున్న సర్వసాధారణ నిరక్షర కుక్షి కూడా మంచిని నేర్పడానికి అర్హుడే. అలాటి పామరుడే వీరబాహు అనే కాటికాపరి. ఈ భూమండలాన్నే ఏలిన సత్యవాక్పరిపాలకుడు హరిశ్చంద్ర చక్రవర్తి విధివిలాసం వలన సర్వస్వం చివరకు భార్యా సుతులను కోల్పొయి అనాధగా మిగిలిపోయినప్పుడు శ్మశానంలో పని ఇచ్చి ఆదుకున్న వ్యక్తి వీరబాహు.  పరమ దుర్మార్గుడిగా , తాగుబోతుగా  బయటకు కనిపించినా సమాజంలోని అవలక్షణాలను, వాటిని పెంచి పోషించే పెద్ద మనుషులను నిర్భయంగా దుయ్యబట్టే వీరబాహుని చూస్తే చెడ్డవారికి భయము కలుగుతుంది, మంచివారికి గౌరవము పెరుగుతుంది. వైరాగ్య, వేదాంత సారాన్నంతా చిన్న చిన్న మాటల్లో  సుస్పష్టం చేసారు పింగళి.  'మట్టిలో కలిసేటి మడిసి మడిసికి భేదం ఏముంది'; 'నిలువు బొట్టుతో సొరగం రాదు, అడ్డబొట్టుతో నరకం పోదు';

(ఆ రోజుల్లో జరిగిన ఒక స్వారస్యమైన సంఘటన. కాంచీపురం వరదరాజస్వామి ఆలయంలోనే అని జ్ఞాపకం, వడకళం , తెన్కళం అనే  రెండు తెగల శ్రీవైష్ణవుల మధ్య ఆధిపత్యపు పోరు నడుస్తూండేది. ఆలయంలోని ఏనుగు నుదుటన నామం 'U'  ఆకారంలో పెట్టాలా ? లేక ' Y' ఆకారంలో పెట్టాలా? అనే విషయంలో  వారిలో వారు తీవ్రంగా కలహించుకొని మద్రాస్ హైకోర్ట్ కో, ఢిల్లీ సుప్రీం కోర్టుకో వెళ్ళినట్లు వార్తలు వచ్చాయి)

'జుట్టు బొట్టు కట్టులన్ని పాడెకట్టుతొ ఎగిరిపోవురా'; శివకేశవులను ఆరాధించే జంగాలు, దాసరులు జగడమాడుకొని వల్లకాటిలో ఒక్కటైపోతారు. "తలకో మతముగ నీతులు గీతులు చెప్పే స్వాములు సైతం కాటిరేడు చేతిమీదుగా బూడిదో, సమాధో కాకతప్పదు. ఇక ఆమాత్రందానికి జాతి ఏమిటి, కులమేమిటి, మతమేమిటి? బతికిన మూణ్ణాళ్ళు జీవితం సార్ధకం చెందేలా  మంచిగా, శాంతిగా గడపకుండా ఎందుకీ ఆరాటం, ఎందుకీ వ్యామోహం. ఎంతటి అర్ధవంతమైన పాట. ఈనాడు మన దేశంలో కులం, మతం ప్రసక్తిలేని రాజకీయయ దాదాపు శూన్యమనే చెప్పాలి.

పెండ్యాలగారి సంగీత దర్శకత్వంలో అద్బుతంగా రూపొందిన ఈ జానపద వైరాగ్య గీతానికి ఘంటసాల జీవం పోసారు. వీరబాహుని మొరటుదనం, మాటల కరుకుదనం, భావంలో వీరావేశం వీటన్నిటిని ఘంటసాల బాగా ఆకళింపుజేసుకొని తానే ఓ వీరబాహు అన్నట్లుగా తన గళంతో నటించారు. తెరమీద వీరబాహు పాత్రధారి రాజనాల పాత్రోచిత నటనకు మరింత దోహదం చేసారు. (1954లో వాహినీ స్టూడియోలో జరిగిన ఆల్ స్టార్ కార్నివాల్ లో దాదాపు గా ఈ వీరబాహుని గెటప్ లోనే ఘంటసాల స్వయంగా డప్పువాయిస్తూ కనిపిస్తారు).

నిమ్నజాతివాడిగా పరిగణింపబడిన వీరబాహు కల్లుముంతతో వీరంగం వేస్తూ  వీధుల్లో పాడిన ''కులములో ఏముందిరా సోదరా మతములో ఏముందిరా'' పాటలో ప్రధానంగా వినపడేవి  డప్పులు, గజ్జెలు, తబల వంటి తాళవాద్యాలు.  పాటలో ప్రతీ పాదం తర్వాత ఘంటసాల మాస్టారు వినిపించే జానపద తరహా జతులు ఈ పాటకు జీవం. ఘంటసాలవారు ఈ పాటలో కనపర్చిన జోరు, హుషారు, వీరావేశం వీరబాహు పాత్రను ఎలివేట్ చేసాయి. తెరమీద రాజనాల మరింత విజృంభించి ఆ పాత్రలో లీనమైపోయారు. రాజనాల- ఘంటసాల కాంబినేషన్లో వచ్చిన పాటల్లో ఈ పాటనే తలమానికంగా చెప్పాలి.

12వ శతాబ్దంలో హొయసళ రాజుల కాలంలో రాఘవాంక అనే కన్నడ కవి రచించిన 'హరిశ్చంద్ర కావ్య' బహుళ ప్రసిధ్ధి చెందింది.  తర్వాత గత శతాబ్దంలో ప్రముఖ కవి, నటుడు, నాటకప్రయోక్త అయిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి హారిశ్చంద్ర చరిత్రను నాటకానికి అణుగుణం మలిచారు. తదాదిగా హరిశ్చంద్ర నాటకం తెలుగువారికి అత్యంత ప్రియతమ నాటకమయింది. 1913లో దాదా సాహేబ్ ఫాల్కే నిర్మించిన మొట్టమొదటి పూర్తి నిడివి మూకీ చిత్రం 'హరిశ్చంద్ర'. మరాఠీ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో సబ్ టైటిల్స్ వేసారు. తర్వాత 1956 లో రాజ్యం పిక్చర్స్ వారు  జంపన చంద్రశేఖరరావు డైరెక్టర్ గా ఎస్.వి.రంగారావు హారిశ్చంద్రుడిగా, సుసర్ల దక్షిణామూర్తి సంగీతంతో ఒక అద్భుతమైన చిత్రం తీసారు. మరల 1965లో విజయావారు కె.వి.రెడ్డి దర్శకుడిగా ఎన్.టి.రామారావుతో సత్య హరిశ్చంద్రను నిర్మించారు. పెండ్యాల సంగీతం నిర్వహించారు. పౌరాణిక నాటకాలలో పద్య కృష్ణుడు, గద్య కృష్ణుడు లాగనే ఎస్.వి.రంగారావు హరిశ్చంద్ర పద్య హరిశ్చంద్రగా, ఎన్.టి.ఆర్ సత్యహరిశ్చంద్రను గద్య హరిశ్చంద్రగాను తెలుగు ప్రేక్షకులు గుర్తించి ఆదరించారు. విజయావారే సత్యహరిశ్చంద్రను కన్నడంలో కూడా రాజ్ కుమార్ తో నిర్మించి ఘనవిజయం సాధించారు. ఈ మూడు సినీమాలలోనూ ఘంటసాలవారి పాటలు, పద్యాలు బహుళ జనాదరణ పొందాయి. కన్నడ హరిశ్చంద్రలో పాటలన్నీ తెలుగు వరసలతో చేసినవే. అన్నింటినీ ఘంటసాలే ఆలపించి చిత్ర విజయానికి దోహదం అయ్యారు. ముఖ్యంగా , సత్యహరిశ్చంద్రలోని ''కులములో ఏముందిరా సోదరా'' పాట తెలుగు కన్నడనాట ఘంటసాలవారి కీర్తిని ద్విగుణీకృతం చేసింది.


https://youtu.be/j2c-vLUVi-8?si=kPvpjWjkVs-Rt_we

వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 40 - హిమగిరి సొగసులు

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను...