Saturday, 25 April 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 12 - సరసుడ దరిచేరరా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 12


కన్యాశుల్కం - సరసుడ దరిచేరరా


డామిట్! కధ అడ్డంగా తిరిగింది!

ఇది గురజాడ అప్పారావు గారి 'కన్యాశుల్కం' నాటకంలో గిరీశం మొదటి డైలాగ్. ఇదే డైలాగ్ తో సినిమా మొదలెడితే కథ అడ్డం తిరుగుతుందని నిర్మాత అనుకున్నారో ఏమో, మధురవాణి పడకటింట్లో గిరీశం, మధురవాణి సరస సంభాషణలతో మొదలెట్టారు. కన్యాశుల్కం నాటకాన్ని యథాతధంగా తెరకెక్కించలేని తమ నిస్సహాయత కు గురజాడ వారి ఫోటో సాక్షిగా ప్రేక్షకులకు సంజాయిషీ కూడా చెప్పుకున్నారు.

కన్యాశుల్కం సినిమా ప్రారంభంలోనే మొదటి సీన్ లోనే ఒక చక్కటి జావళి. అదే నేటి మన 'ఘంటసాల- సదా మదిలో మెదిలే సజీవరాగం. 70 ఏళ్ళ తర్వాత ఈ పాట ఇంకా జనాల మదిలో మెదులుతున్నదో లేదో నాకు తెలియదుకాని సంగీత సాహిత్యాల దృష్ట్యా ఈ పాట నిస్సందేహంగా సజీవరాగమే.

జావళి ...

కర్ణాటక సంప్రదాయ సంగీతంలో ఓ భాగం. స్వరపల్లవులు, కృతులు, కీర్తనలు లాగనే జావళీ ఒక సంగీత, సాహిత్య ప్రక్రియ. సాధారణంగా సంగీత కచేరీల ఉత్తరార్ధంలో ప్రదర్శింపబడుతూంటుంది. దాక్షిణాత్య సంగీత, నృత్య కార్యక్రమాలలో జావళి కూడా ఒక ప్రధానాంశం. పల్లవి, అనుపల్లవి, చరణాలతో  జావళీల సాహిత్యం వుంటుంది. ఈ జావళీలలోని సాహిత్యం  శృంగారపరమైవుంటుంది. నాయికా నాయకుల ప్రణయం ముఖ్యాంశంగా, నాయకునికి దూరమైన నాయిక యొక్క విరహవేదన వర్ణనలతో నిండివుంటుంది. బాహ్యంగా శృంగారరస ప్రధానంగా కనిపించినా ఇందులో భక్తి తత్త్వం ముడిపడివుంది.  ఇక్కడ నాయికా నాయకులు పరమాత్మ, జీవాత్మ.  పరమాత్మలోజీవాత్మ ఐక్యమై ముక్తిని పొందడమే అంతిమ పరమార్ధం. ఈ లక్ష్యంతోనే ప్రముఖ వాగ్గేయకారులంతా తమ  రచనలు చేశారు. (కాలక్రమేణా ప్రజలు సంగీత, నాట్యాది కళలలోని భక్తికన్నా వినోదానికి, రక్తికి ఎక్కువగా ఆకర్షితులవడం మొదలెట్టారు.)

భాషాపరంగా జావళీలు  కన్నడతమిళ భాషలలో కన్నా తెలుగులోనే  ఎక్కువగా వ్రాయబడ్డాయి. 19వ శతాబ్దం నుండి బహుళ ప్రచారంలో కి వచ్చిన ఈ కళాప్రక్రియ మూలాలు, కాలానికి సంబంధించి అనేక భిన్నాభిప్రాయాలున్నాయి. జావళి అనే పేరు కనపడకపోయినా ఆ రకమైన సాహిత్యం సారంగపాణి, అన్నమాచార్య పదకవితలలో కనిపిస్తుంది.

పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్( సమయమిదే రారా నా సామి) , స్వాతి తిరునాళ్ (సారమైన మాటలెంతో), ధర్మపురి సుబ్బరాయర్ (పరులన్నమాట నమ్మవద్దు) మొదలగువారు రచించిన జావళీలు మిక్కిలి ప్రసిధ్ధి చెంది ఈనాటికి బహుళ ప్రచారంలో వున్నాయి.

సందర్భం కనుక అందరూ స్మరించుకోతగ్గ మరొక జావళి గురించి చెప్పవలసి ఉంది. సాధారణంగా ప్రచారంలో  వుండే శృంగారరస ప్రధాన జావళీలకు కొంచెం భిన్నంగా  భార్యభర్తల మధ్య వుండే ప్రేమానురాగాలను, బాధ్యతలను ప్రకటితం చేస్తూ   ఘంటసాలవారి గురువుగారు,  వాగ్గేయకారులు అయిన పూజ్యులు శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారు రచించి,  కాపీ రాగంలో స్వరపరచిన 'వగల వయ్యారి అదిరా...'  అనే జావళీ ఒక నవ్యపంథాకు నాంది పలికింది.

ఈనాడు భరతనాట్యం, కూచిపూడి శైలులకు చెందిన కళాకారులందరి ప్రదర్శనలలో జావళి తప్పనిసరి అంశం. పండిత పామరులను సరిసమానంగా ఆకర్షించే జావళిని బ్లాక్&వైట్ కాలం నాటి  తెలుగు సినిమా కూడా యథాశక్తిని సద్వినియోగం చేసుకుంది. శాస్త్రీయ, లలితసంగీతాల మేళవింపుతో మనోరంజకమైన జావళీలెన్నో  సంగీతాభిమానులను అలరించాయి.

అలాటి వాటిలో ప్రముఖంగా పేర్కొనవలసిన  సత్సంప్రదాయ జావళి కన్యాశుల్కం మధురవాణి కోసం అమరగాయకుడు ఘంటసాలవారు స్వరపర్చిన 'సరసుడ దరిచేరరా'. 

మన దాక్షిణాత్య సినిమాలలో శుధ్ధ శ్రోత్రీయ సంగీతం (తంజావూరు బాణి), నృత్య సంగీతం అనగానే చటుక్కున గుర్తుకు వచ్చేవి  ఎమ్.ఎస్., పి.లీల, కోమల, ఎమ్.ఎల్.వి.శూలమంగళం (రాధా) జయలక్ష్మి, మొదలైనవారి గాత్రాలే.  ఆ కోవకు చెందిన మరో గాయనీమణి ఎన్.ఎల్.గానసరస్వతి. 1950-60 ల మధ్య వచ్చిన అనేక తెలుగుతమిళ భాషా చిత్రాలలో గానసరస్వతి గానం చేసిన  అనేక శాస్త్రీయ సంగీతనృత్యగీతాలు బహుళ జనాదరణ పొందాయి. ఆవిడ పాడిన సినిమా పాటలు రాశిలో తక్కువే అయినా వాసిలో చాలా మిన్నయనే చెప్పాలి. అలాటి సంప్రదాయ సంగీత గీతాలలో చెప్పుకోదగ్గది 'కన్యాశుల్కం' సినిమాలో శ్రీమతి ఎన్.ఎల్.గానసరస్వతి ఆలపించిన జావళి 'సరసుడ దరిజేరరా...'

జావళి రచన -

వెంపటి సదాశివ బ్రహ్మం

స్వరరచన : ఘంటసాల

గాయని : ఎన్ ఎల్ గానసరస్వతి

నృత్యదర్శకుడు : పసుమర్తి కృష్ణమూర్తి

అభినయం: సావిత్రి


పల్లవి: 

సరసుడ దరిజేరరా.. ఔరా! - 2

సమయమిదే

సరసాల కిదివేళ చలమేలరా

                                    !సరసుడ!

వలచినదానర నే చినదానరా

పిలచిన బిగువేలరా  నన్నేలరా

                                    !సరసుడ!

 

చక్కెర విలుకాని బారి వేసారి

మక్కువతో నిన్నె  మనసార కోరి

చేరితి నీచెంత దయగను మావంత

మురిపించి మరిపించ రారా జాగేలరా

                                    !సరసుడ!

ఖమాస్  ఒక కర్ణాటక సంగీత రాగం. ఇది 28 వ మేళ కర్త అయిన హరికాంభోజికి జన్యరాగం. షాఢవ-సంపూర్ణ రాగం. వక్రసంచారం గల ఈ రాగం ఆరోహణా క్రమంలో ఆరు స్వరాలుఅవరోహణా క్రమంలో ఏడు స్వరాలువుంటాయి. శృంగారరస ప్రధాన కృతులు , కీర్తనలు, జావళీలు ఎక్కువగా ఖమాస్ రాగంలోనే వుంటాయి. ఖమాస్ రాగంలో బహుళ జనాదరణ పొందిన సినీమా పాటలు ఎన్నోవున్నాయి. ప్రఖ్యాతి చెందిన సంప్రదాయ జావళీ రచనలన్నీ ఖమాస్, కాపీ, ఫరజ్, బేహగ్, వంటి లలితమైన రాగాలలో కనిపిస్తాయి. శాస్త్రీయ సంగీత రాగలక్షణాలను క్షుణంగా అర్ధంచేసుకొని ఆయా రాగాలను  సందర్భోచితంగా, జనరంజకంగా ప్రయోగించిన ప్రతిభాశాలి ఘంటసాల. సన్నివేశం రక్తికట్టడానికి తగిన రాగాలను, గాయనీగాయకులను ఎన్నుకోవడంలో దిట్ట ఘంటసాల మాస్టారు. 'సరసుడ దరిజేరరా' అనే సదాశివబ్రహ్మంగారి జావళీని ఘంటసాలగారు ఖమాస్ రాగంలో మలిచారు. సంప్రదాయ  జావళి నృత్యానికి ఉపయోగించే వయొలిన్, వీణ, ఫ్లూట్ , మృదంగం, ఘటం, మోర్సింగ్ వంటి వాద్యాలతోనే ఘంటసాలగారు ఈ పాటను రూపొందించారు. శుధ్ధ శాస్త్రీయ సంగీత సంగతులతో, గమకశుధ్ధిని పాటింపజేస్తూ గానసరస్వతి చేత అద్భుతంగా గానం చేయించారు ఘంటసాల.

శాస్త్రీయ సంగీత విద్వాంసులు/నృత్య  ప్రదర్శనలలోని గాయకులు మూడు కాలాలలో పాడతారు. వాటిని విలంబ, మధ్యమ, ధృత కాలాలని అంటారు. నాలాటివారికి అర్ధమయే భాషలో చెప్పాలంటే --  స్లో, మీడియం, ఫాస్ట్ టెంపోలు. సాధారణంగా జావళీలు మధ్యమకాలంలో లేదా ధృతకాలం లో వుంటాయి.

కన్యాశుల్కంలో తెరమీది మధురవాణి (సావిత్రి) అంగసౌష్టవాన్ని, అభినయ పరిమితులను దృష్టిలోపెట్టుకుని సంగీత దర్శకుడు ఘంటసాల, నృత్యదర్శకుడు పసుమర్తి కృష్ణమూర్తి ఈ జావళీని మధ్యమకాలంలో నడిపించారు. మధురవాణి పాత్రలో పూర్తిగా లీనమైపోయిన సావిత్రి, శృంగారరస ప్రధానమైన ఈ జావళీని పాత్రోచితంగా,  హుందాగా అభినయించి సన్నివేశాన్ని రక్తి కట్టించారు.

ఈ జావళీని రచించిన కవి వెంపటి సదాశివ బ్రహ్మంగారు పంచకావ్యాలను అధ్యయనం చేసిన సంస్కృతాంధ్ర భాషాకోవిదుడు. తిరుపతి వెంకట కవుల స్ఫూర్తితో శతావధాన, అష్టావధాన ప్రక్రియలలో నిష్ణాతుడు. హరికథా విద్వాంసుడు. స్వాతంత్ర్య సమరయోధుడు.

1940 ల నుండి 1970 ల లోపల ఎన్నో  విజయవంతమైన సినిమాలకు కl, మాటలు, పాటలను సమకూర్చారు. సినిమా గీతాలకు ఒక స్థాయిని, విశిష్టతను తెచ్చిన కవి సదాశివబ్రహ్మంగారు.

కన్యాశుల్కం సినిమా అదృష్టమే అదృష్టం. ఈ సినీమాలో తెలుగువారందరూ గర్వించదగ్గ మహాకవులందరి రచనలు వున్నాయి. గురజాడ అప్పారావు గారి  -'పుత్తడిబొమ్మ పూర్ణమ్మకథ', 'ఇల్లు ఇల్లనియేవు నీ యిల్లు యెక్కడే చిలుకా'; బసవరాజు అప్పారావుగారు వ్రాసిన 'నాగులచవితికి నాగేంద్రా'; దేవులపల్లి వారి 'చేదాము రారే కళ్యాణము'; మల్లాది రామకృష్ణశాస్త్రిగారి 'చిటారుకొమ్మను మిఠాయి పొట్లం'; శ్రీశ్రీ మహాప్రస్థానం లోని 'ఆనందం అర్ణవమైతే'; సముద్రాల వారి 'కీచకవధ' వీధి భాగవతంశ్రీకృష్ణ కర్ణామృత శ్లోకం- కలశ నవనీతచోరే'. ఘంటసాలవారి సంగీతవిద్వత్ కు ఒక సవాల్ కన్యాశుల్కం. శ్రోతలకు సంగీత మృష్టాన్న భోజనం. ఇంతమంది లబ్దప్రతిష్టులైన కవుల వివిధ రసాల గీతాలకు  వైవిధ్య భరితమైన సంగీతాన్ని సమకూర్చి 'కన్యాశుల్కం' ఒక ఉత్తమ చిత్రంగా రూపొందడానికి ముఖ్యకారకులయ్యారు.

ఈ సినిమాలోని నవరత్నాలవంటి ఎనిమిది పాటలను+ఒక శ్లోకాన్ని ఘంటసాలమాధవపెద్ది, ఎన్.ఎల్.గానసరస్వతి, పి. సుశీల, పద్మప్రియఆలపించారు. సుప్రసిద్ధ బహుభాషా చిత్ర దర్శకుడు పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన 'కన్యాశుల్కం' దృశ్యకావ్యానికి నిర్మాత డి.ఎల్.గా చిత్రసీమకు చిరపరిచితుడైన ద్రోణావఝ్ఝల లక్ష్మీనారాయణ. భానుమతిగారి భరణి స్టూడియో ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేసి 1951 లో 'స్త్రీ సాహసంనుండి 1969 లో వచ్చిన 'ఏకవీర' వరకు ఓ డజన్  సినిమాలను నిర్మించారు. డి.ఎల్. నిర్మించిన దేవదాసు, కన్యాశుల్కం, చిరంజీవులు, ఏకవీర మొదలైన సినిమాలు ఆయన ఉత్తమాభిరుచికి అద్దం పడతాయి.

డి.ఎల్. సినిమాలన్నింటిలో ఘంటసాలగారు గాయకుడిగానో లేక సంగీతదర్శకుడిగానో ప్రముఖపాత్ర వహించారు.

70 సంవత్సరాలు నిండిన 'కన్యాశుల్కం' ఎన్ని తరాలు మారినా చిరస్మరణీయమే. ఆ చిత్ర సంగీతం సజీవరాగమే.


కన్యాశుల్కం - సరసుడ దరిచేరరా


కొసమెరుపు : -

1950 దశకంలో ఘంటసాలగారి సంగీతదర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాల్లో  ఎన్నో పాటలు పాడిన పి.లీల ఈ సినిమాలో ఒక పాట కూడా పాడకపోవడం ఆశ్చర్యమే.

 

వచ్చేవారం ఘంటసాలవారి మరో సజీవరాగం తో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 12 - సరసుడ దరిచేరరా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...