Saturday, 11 April 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 10 - విజ్ఞానదీపమును వెలిగింప రారయ్యా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 10


చంద్రహారం - విజ్ఞానదీపమును  వెలిగింప రారయ్యా

'అమ్మాయిలూ! అందరూ వచ్చేశారా! కాసేపు మీ గాసిప్ పురాణం కట్టిపెడితే కొత్త పాట నేర్చుకుందాము. మనం నేర్చుకునే విద్య - స్కూల్ పాఠాలుసంగీతం, సాహిత్యం, డాన్స్, చిత్రలేఖనం, ఏదైనా కావచ్చు అది  మానసికోల్లాసంతోపాటు విజ్ఞాన వికాసాలను, పరోపకార పరాయణత్వాన్ని మనకు, మన చుట్టూ వున్న సమాజానికి కలిగించాలి అప్పుడే మనం నేర్చుకున్న విద్యకు సార్ధకత ఏర్పడుతుంది.

ఉదాహరణకు ఈవేళటి పాటనే తీసుకోండి ... ఈ పాట చరణంలో కవి ఏమంటున్నాడో తెలుసా !


'పరహితమె పరసుఖమే పరమార్ధ

చింతనయే మానవుల ధర్మమని భావించరయ్యా...

వినయమున సహనమున విజయములు సాధించి దీన

బలహీనులను కరుణతో పాలించి

జీవులకు దేవులకు భేదమే లేదని

భువిని ఈ సత్యమును చాటించరయ్యా....'

 

ఇక పాట పల్లవి ఎలా ఎత్తుకున్నాడో చూద్దామా...

 

'విజ్ఞాన దీపమును వెలిగింప రారయ్య

అజ్ఞాన తిమిరమును హరియింపరయ్యా

                                    !విజ్ఞానదీపమును!

ఈ పాటలో అందరూ పాటించదగిన గొప్ప సందేశమున్నది. ఎంతో అర్ధమూ పరమార్ధమూ వున్నది.  చూడండీ...

చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా వినయవిధేయతలు, శాంత సహనాలు కలిగివుండాలి. ఆపదలోవున్నవారికి సాయపడాలనే పరోపకార చింతన వుండాలి. ఈ లక్షణాలన్నీ ప్రతి మనిషి కలిగివుంటే మనిషికి దేవుడికి భేదమే వుండదు. ఏమంటారు .... చాలా ఆదర్శవంతమైన గీతం కదూ! 

ఇలాటి పాటలను నేర్చుకుని పదిమందిలో పాడడంలో ఎంతో ఆత్మానందం, తృప్తి కలుగుతుంది కదూ... ఈ పాటను ఎవరు వ్రాసారో తెలుసా! ఆయన పేరు పింగళి నాగేంద్రరావుగారు. తాను వ్రాసిన ప్రతి పదమూ సామాన్య ప్రజలకు అందుబాటులో వుంటూ వినోదంతోపాటు సామాజిక స్పృహను కూడా కలిగించాలని ఆశించిన గొప్ప ప్రజాకవి.

ఇప్పుడు ఈ పాటను నేర్చుకుందామా!

ఓ రెండువారాల క్రితం మీరంతా ఇష్టపడే కళ్యాణి రాగంలో చేసిన పాటను గురించి చెప్పుకున్నాం గుర్తుందా... 'పెళ్ళిచేసుకుని ఇల్లుచూసుకుని'.... ఆ! అదే.. కర్నాటక సంగీతంలో చాలా సుప్రసిధ్ధమైన రాగం కళ్యాణి యని, దీనినే మేచకళ్యాణి అని కూడా అంటారని, ఇది 65వ మేళకర్తయని చెప్పుకున్నాము. ఈ 65వ మేళకర్త యైన కళ్యాణికి చాలా జన్యరాగాలు వున్నాయి. అందులో సారంగ రాగం ఒకటి. సారంగ భక్తి, శృంగార రస భావాల ప్రకటన కు అనువైన రాగం.

హిందుస్థానీ సంగీతంలో కూడా సారంగ్ అనే రాగం వుంది అయితే దానికి కర్ణాటక సారంగకు సంబంధం లేదు. సారంగ రాగ ఆరోహణఅవరోహణా క్రమం రెండు విధాలుగా ప్రచారంలో వుంది. ఆ శాస్త్ర వివరాలు కాలక్రమేణా నేర్చుకుందాము. ఈ సారంగ రాగంలో త్యాగయ్య, దీక్షితర్ ల కృతులు అనేకం ప్రచారం లో వున్నాయి.

ఇప్పుడు, పింగళి వారి 'విజ్ఞాన దీపమును' పాటను సారంగ రాగంలో పాడి వినిపిస్తాను.... మీరు కూడా అలాగే నాతో కలసి పాడండి.

ఇదే పాట కొన్నేళ్ళ క్రితం నా ఊహల్లో మరోలా వుండేది .... కొంతమంది స్త్రీ పురుష గంధర్వులు ఆకాశంలో మేఘాలలో విహరిస్తూంటారు. వారు భూలోకవాసులను ఉద్దేశించి ఈ గీతాన్ని ఆలపిస్తూ తమ చేతులలోని

ప్రకాశవంతమైన జ్ఞానదీపికలను నలుదెసలా ప్రసరింపజేస్తూ అదృశ్యమైపోతారు. ఇదో రకమైన ఊహాచిత్రం. ఈ పాటను ఎవరైనా ఎలాగైనా ఊహించుకోవచ్చు. కారణంఈ పాటకు దృశ్యరూపం లేదు.  అలాటి ఒక చిత్రగీతమే నేటి ఘంటసాల సజీవరాగం.

ఆ వివరాలు తెలియాలంటే మనం డెభ్భైరెండేళ్ళ గతానికి వెళ్ళి  విజయా నాగిరెడ్డి-చక్రపాణి ల అద్భుత భారీ జానపద చిత్రం  'చంద్రహారంను చూడాలి. ఘంటసాలగారి మధురాతిమధుర సంగీతంఊహాలోకాల్లో విహరింపజేసే గోఖలేగారి కళాచాతుర్యం, మార్కస్ బార్ట్లీ ఛాయాగ్రహణం, ఎన్.టి.ఆర్., సావిత్రి ల అపురూప సౌందర్యం, విభిన్న పాత్రలలో ఎస్.వి.రంగారావు, రేలంగి నటనా ప్రాభవం  చంద్రహారానికి జీవం.

చంద్రహారం సినిమా టైటిల్స్ మీద అత్యంత శ్రవణానందకరంగా వినపడే 'విజ్ఞానదీపమును వెలిగించరారయ్యా..' అనే గీతమే ఈనాటి సజీవరాగం. ఘంటసాలగారు ఈ పాటను సారంగ రాగంలో స్వరపర్చి గానం చేశారు. ఈ పాట శ్రోతలలో మానసికానందాన్ని కలిగిస్తూ, భక్తిభావాన్ని, తాత్త్విక చింతనను మేల్కొలుపుతుంది.

ఈ పాటలోని సాహిత్యం, భావం ఎంతోఉదాత్తమైనది. ఘంటసాల, ఎ.పి.కోమల, బృందం పాడిన ఈ పాట గంటానినాదం, త్రిస్థాయిలలో ఓంకార స్వరం, పియోనాడ్రమ్స్ ల లయతో ప్రారంభమై ఒక  ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. పాట మధ్యలో  అక్కడక్కడ వినపడే వయొలిన్ బిట్స్ (తీగెలను కమాన్ తో కాక వ్రేళ్ళతో మీటితే ఆ రకమైన ధ్వని వస్తుంది. వేరే సినిమా పాట రికార్డింగ్ లో విన్నాను. అలాటి నోట్స్ ను ఆర్కెష్ట్రాలోని వైయొలినిస్టులు ఏదో పేరుతో అనేవారు. ఆ మాట ఇప్పుడు గుర్తుకు రావడంలేదు).

ఈ పాట సినిమా టైటిల్స్  గీతం లతల చిత్రాలతో కూడిన మండపం, మధ్యన వేలాడుతున్న పెద్ద దీపపు సెమ్మె  నేపథ్యంగా తీసుకుని  వినిపించారు.  అక్కడ మరే దృశ్యరూపం కనపడదు.  నా వరకుఒక సంగీతం గురువుగారు ప్రశాంతమైన వాతావరణంలో తమ శిష్యురాళ్ళకు ఈ పాటను నేర్పుతున్న అనుభూతిని కలిగిస్తుంది. కారణంబహుశా, నేను పుట్టిపెరిగిన సంగీత వాతావరణం కావచ్చు.

నాకు ఎనిమిదేళ్ళ వయసులో విజయనగరంలో మాతాతగారింట్లో వుండేప్పుడు ఆయన శిష్యుడైన ఘంటసాల సంగీతం సమకూర్చి పాటలు పాడిన ఈ చంద్రహారం సినిమా విడుదలయింది (విజయనగరం కృష్ణా టాకీస్ అని జ్ఞాపకం). విజయావారి సినిమాలంటే మొదటినుంచి ప్రేక్షకులకు ఒక ఉత్సాహం, ఉత్కంఠ ఉండేవి.  విజయావారి సినిమా పబ్లిసిటీ కూడా వినూత్నంగా,భారీగానే వుండేది. సొంత ప్రెస్ (బి.ఎన్.కె. ప్రెస్) చేతిలో వుండడంవలన నాణ్యమైన రంగురంగుల పోస్టర్లు, పాంప్లెట్స్ తో చంద్రహారం సినిమా పబ్లిసిటీ చాలా ఘనంగానే జరిగింది.  సినిమా రిలీజ్ కు ముందు మామూలుగా వచ్చే పోస్టర్ల తడకలు కట్టిన  జట్కాబళ్ళుసైకిల్ రిక్షాలే కాకమధ్య మధ్య స్పెషల్ గా విజయవాడ డిస్ట్రిబ్యూటర్ ల వాళ్ళు పంపే రంగురంగు దీపాల ఎడ్వర్టైజ్మెంట్ వ్యాన్ లు కూడా మా విజయనగరం వీధుల్లో దర్శనమిచ్చాయి. సాధారణంగా సైకిల్ రిక్షా, జట్కాబండి పబ్లిసిటీకి మాత్రమే అలవాటుపడిన మా సుబ్రహ్మణ్యం పేట గెడ్డవీధివారికి విజయావారి రంగుల పోస్టర్ వ్యాన్ కూడా ఒక రాత్రి వేళ రావడం  మహదానందం కలిగించింది. మిగతా పిల్లలతోపాటూ నేను కూడా ఆ వ్యాన్ వెనకాల కొంత దూరం పరిగెత్తి అతికష్టం మీద ఎ4 సైజ్ లో వున్న రంగురంగుల గ్లేజ్డ్ పాంప్లెట్ ను సంపాదించడం ఆ వయసులో ఓ గొప్ప ఘనకార్యం.

ఎన్.టి.ఆర్., ఎస్విరంగారావు, సావిత్రి, శ్రీరంజని ముఖాలతో వున్న ఆ రంగుల పేపర్ ను నా రైటింగ్ పాడ్ కు అంటించి అపురూపంగా చూసుకునేవాడిని. ఆ రైటింగ్ పాడ్ మా విజయనగరం ఇంటిలో చాలా ఏళ్ళే వుండేది.

ఎన్.టి.ఆర్.ఎస్విరంగారావుసావిత్రిశ్రీరంజని ముఖాలతో వున్న ఆ పింకు, బ్లూ రంగులలో పల్చటి పేపర్ ను నా రైటింగ్ పాడ్ కు అంటించి అపురూపంగా చూసుకునేవాడిని. ఆ రైటింగ్ పాడ్ మా విజయనగరం ఇంటిలో చాలా ఏళ్ళే వుండేది.

ఈ చంద్రహారం సినిమాకు ముందు వచ్చిన విజయావారి 'పాతాళభైరవిసినిమా చంద్రహారం సినిమా పట్ల భారీ అంచనాలకు తావు ఇచ్చింది. నా ఉద్దేశంలో అదే చంద్రహారం కొంపముంచింది. అత్యంత విజయం పొందిన విజయావారి పాతాళభైరవి తర్వాత ఆ సంస్థ నుండి వస్తున్న సినిమా అనగానే  సామాన్య ప్రేక్షకులు ఎంతో ఊహించారు. 'పాతాళభైరవి' లో లాగే ఎస్విరంగారావు మాయలు, తంత్రాలుఎన్.టి.ఆర్. కత్తియుధ్ధాలు, సాహసకృత్యాలు, ఇతర వినోదాలు పుష్కలంగా వుంటాయనుకున్నారు. దానికి తగ్గట్టుగా  తెలుగు తమిళ భాషలలో భారీగా నిర్మించిన చంద్రహారం ఒక్క తెలుగులోనే నలభై కేంద్రాలలో విడుదలచేశారు. చంద్రహారంలో పాతాళభైరవి లెవెల్ లో  ఏ థ్రిల్స్ కనపడకపోవడంతో B ,C సెంటర్ ప్రేక్షకులు పెదవి విరిచారు. సినిమా ఫెయిల్ అనే టాక్ మొదటి మూడు ఆటల్లోనే ప్రచారమయింది. పాతాళభైరవిలోని ఎన్.టి.ఆర్., ఎస్.వి.రంగారావుల రాజసతామస గుణాలుకు పూర్తి విరుధ్ధంగా చంద్రహారం సినిమాలోని  చందనరాజు ఎన్.టి.ఆర్., మాలీ ఎస్.వి.రంగారావుల సాత్విక లక్షణాలను subtle expressions ను మామూలు ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. సాధారణంగానే రాజసగుణాలు గలవారి పట్ల ఉండే ఆకర్షణ, మోజు సాత్విక గుణాలు వున్నవారిపట్ల వుండదు. ఏ సినిమా లోనూ కనిపించనంత అందంగా ఎన్.టి.ఆర్. అందరి మనసులను దోచుకున్నా పది రీళ్ళకు పైగా unconscious stage లో inactive గా వుంటే (చంచల (సావిత్రి) శాపమే అనుకోండి) ఎవరికి నచ్చుతుంది.

పింగళివారి పంచ్ లు పేల్చాల్సిన ఎస్.వి.రంగారావు  పరమ సీరియస్ గా నాగయ్యగారిలా సాత్వికంగా కనిపిస్తే ఎలా? నవ్వులు పండించవలసిన రేలంగి విలన్ కావడం, గయ్యాళి సూర్యకాంతం సాఫ్ట్ సిస్టర్ రోల్, వ్యాంప్ చంచల సావిత్రిలో వుండే గ్లామర్ హీరోయిన్ శ్రీరంజనిలో ప్రేక్షకులకు కనపడకపోవడమూ  మైనస్ పాయింట్లే. ఇవేవీ సగటు ప్రేక్షకులకు నచ్చలేదు.  విశేషం ఏమంటే, డైరెక్టర్ గా కమలాకర కామేశ్వరరావు గారికి చంద్రహారం మొదటి సినీమా. కె.వి.రెడ్డిగారి సహాయకుడిగా అనుభవం గల ఆయన డైరక్షన్ కు సోషల్ కామెడీ సినిమా ల స్పెషలిస్టు ఎల్.వి.ప్రసాద్ గారిని పర్యవేక్షకుడిగా ఎందుకు పెట్టవలసివచ్చిందో ఏమైతేనేం.. డైరెక్టర్ గారి మొదటి సినిమా యే హాంఫట్. ఆ దెబ్బతో కామేశ్వరరావు గారు  మళ్ళీ ఓ ఎనిమిదేళ్ళపాటు  గుండమ్మకథ సినిమా వరకూ విజయాలో అడుగుపెట్టలేదు. 1954 నాటి భారీనష్టాన్ని గుండమ్మకధ సిల్వర్ జూబ్లీతో కొంతవరకు compensate చేశారు కమలాకర. ఈ జయాపజయాలన్నిటి వెనుక చక్రపాణి గారి హస్తం తప్పనిసరి. 72 ఏళ్ళ క్రితమే 25 లక్షల  ఖర్చుతో నిర్మించబడి బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టిన భారీ జానపదచిత్రం 'చంద్రహారం' . కళ్ళుమిరుమిట్లుగొలిపే గోఖలేగారి  భారీ సెట్ల కళానైపుణ్యం, మార్కస్ బార్ట్లీ గారి కెమేరా పనితనం అన్నీ బూడిదలో పొసిన పన్నీరయింది. ఇంత హెవీ లాస్ ను విజయా సంస్థ కనుక తట్టుకుని నిలబడి వరుస చిత్రాలను నిర్మించగలిగింది.  రామారావు పది రీళ్ళకు పైగా నిద్రపోతుంటే సినిమా ఫ్లాప్ కాక మరేటవుద్ది అని చక్రపాణి గారు తనమీద తానే కామెంట్ చేసుకున్నారట.

వ్యాపారరీత్యా నిర్మాత లకు నష్టం తెచ్చినా  గొప్ప సాంకేతిక వీలువలు కలిగిన ఉత్తమ కళాఖండం 'చంద్రహారం'. ఘంటసాలగారి సంగీతం, గోఖలేగారి ఆర్ట్ విభాగం, బార్ట్లీ కెమేరా, నటీనటుల హృద్యమైన నటన చంద్రహారానికి ఎప్పటికీ పెద్ద ఎసట్.

చంద్రహారానికి ఘంటసాలగారు సమకూర్చిన సంగీతం ఎన్ని తరాలకైనా నిత్యనూతనమే, ఆపాత మధురమే. ఘంటసాల, లీల, మాధవపెద్ది, పిఠాపురం, కోమల, రాణి , లలిత, పద్మావతిలు ఆలపించిన 13 గీతాలు చంద్రహారపు ఆణిముత్యాలుగా భాసిల్లుతూనేవుంటాయి.


కొసమెరుపు -

రెండు మూడు లక్షలతో తీసిన 'పరోపకారం' ఫెయిల్, పాతిక లక్షల భారీ చంద్రహారం ఫెయిల్. ప్రేక్షకులకు ఎప్పుడు ఏది నచ్చుతుందో ఆ బ్రహ్మకే తెలియదు.

వచ్చేవారం  ఘంటసాలవారి  మరో సజీవరాగం తో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 10 - విజ్ఞానదీపమును వెలిగింప రారయ్యా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...