Saturday, 4 April 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 9 - వలపుల కథకిది తొలిపలుకు

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 9


పరోపకారం - వలపుల కథకిది తొలిపలుకు

'కట్టాణిముత్యం' - ఆణిముత్యాలు అనే మాట తరచూ వినేదే. కానీ, కట్టాణి ముత్యం అనే మాట అరుదుగా కనిపిస్తుంది. స్వాతివానలకు ముత్తెపు చిప్పలలో లభించే సహజసిద్ధమైన ఆణిముత్యం. స్వచ్ఛమైన, ఏ కల్మషం అంటని పవిత్రమైన, మంచి తేజస్సు కలిగిన ముత్యాన్ని 'కట్టాణిముత్యం'గా కవులు వర్ణిస్తారు. ముత్యానికి విశేష విశేషాణార్ధం 'కట్టాణిముత్యం'. 'కట్టాణిముత్యం'   వలపుల కథకు తొలిపలుకు, అంటే ముందుమాట.

లయబధ్ధంగా సాగే వచనానికి మాధుర్యాన్ని, అమరత్వాన్ని కలిగించేది గాయకుని గళంలోని గమకాలుసంగతులే. కానీ, మరపురాని  ఆ పాటలోని మధురమైన సంగతికన్న మనసైన జవరాలి పేరే ఎన్నటికైన మిన్న  అని అంటున్న విశిష్టకవి భాగవతుల సదాశివ శంకరశాస్త్రి(ఆరుద్ర)గారి తొలకరి చినుకు వంటి వలపు గీతమే నేటి మన సజీవరాగం.

 

తన  సినీప్రస్థానం తొలిరోజుల్లో ఆరుద్ర కలం నుండి జాలువారిన మరపురాని మధురగీతం - సుమధుర గాయకుడు ఘంటసాల తొలిసారిగా నిర్మాతయై, స్వీయసంగీత దర్శకత్వంలో నిర్మించి తెలుగు-తమిళ భాషల్లో 1953 లో విడుదల చేసిన 'పరోపకారం' సినిమా లోని ఒక మధురగీతం - 'వలపుల కథకిది తొలిపలుకు' -

 

ఆరుద్ర సాహిత్యం-

ఘంటసాల సంగీతంనేపథ్యగానం -

వెంపటి చినసత్యం, సావిత్రి, రామశర్మ ల అభినయం :

 

సాకీ : ఆ... ఆ.... 

మరపురాని పాటలోని మధురమైన సంగతికన్న-2

మనసైన జవరాలి పేరు ఎన్నటికైన మిన్నా... ఔను...

 

పల్లవి : వలపుల కథకిది తొలిపలుకు-2

తొలిసారి చెలిపేరు తొలకరి చినుకు

                                            !వలపుల!

 

2 వ సాకీ -  వేచియున్న చెవులలోన

ప్రియురాలి పేరు స్వాతి వాన

ఏమిటేమిటీ... 

వేచియున్న చెవులలోన

ప్రియురాలి పేరు స్వాతి వాన

కట్టాణిముత్యమై తొలిప్రేమ 

కరడుగట్టినదే భామా 

ఆహాహాహా

                                            !వలపుల!

 

చరణం-

కమ్మతేనె గుమ్మపాలు కలసినచో తీపు

నిమ్మనీరు తీయ ద్రాక్ష  నిషా కుషీ కైపు-2

సమ్మతైన చిన్నదాని 

పేరుముందు బలాదూరు-2

                                            !వలపుల!

లల్లలలాలెలెలల్లలలాలెల-2

లల్లలలాలెలలా.. 3

 

తొలి పరిచయం లోనే ఆ అమ్మాయి అతనికి తన పేరు చెపుతుంది. అది ఆ అబ్బాయిలో తొలకరి ప్రేమ చినుకులు కురిపిస్తుంది. ఈ ఇద్దరిని గమనిస్తున్న ఒక వీధి గాయకుడు అన్యాపదేశంగా ఆ యువకుడి మనోభావాలను ఓ చక్కటి పాట రూపంలో మనోజ్ఞంగా వినిపిస్తాడు - 'వేచియున్న చెవులలోన ప్రియురాలి పేరు ఒక స్వాతివానలాటిదంటాడు. అంతేనా.. ఇంకొంచెం ముందుకు సాగి 'కమ్మటి తేనెగుమ్మపాలు కలిస్తే అమృతంగా మారుతుందట... తియ్యని నిమ్మ ద్రాక్షరసాల నిషాకైపు నచ్చిన చిన్నదాని పేరు ముందు బలాదూరు ' అని  ప్రేమాస్పదంగా అమ్మాయిని వర్ణిస్తాడు. తొలిప్రేమలో పడ్డ ఆ యువతీ యువకులు ఈ నృత్యగీత సన్నివేశంలో ఆ రోడ్డున పోయే ఇతరులతో కలసి ప్రేక్షకపాత్రను వహిస్తారు. ఏ హంగూఆర్భాటం లేని ఒక సామాన్య హృద్యగీతం.

ఘంటసాల మాస్టారు ఈ పాట స్వరరచనకు ఖరహరప్రియ రాగాన్ని ఎంచుకున్నారు. కర్ణాటక సంగీతంలో ఖరహరప్రియ 22వ మేళకర్తరాగం. హిందుస్థానీ బాణీలో దీనికి సమానమైన రాగాన్ని కాపి థాట్ అంటారు. వెస్ట్రన్ సంగీతంలో డోరియన్ .  ఘంటసాలగారు ఈ పాటలో ఇతరవాద్యాలతోపాటు హార్మోనియంకు కూడా మంచి ప్రాముఖ్యత ఇచ్చారు. సాకీలకు ముందు హార్మోనియం బిట్స్ ఎంతో హాయిని కలిగిస్తాయి. ఘంటసాలగారు కూడా ఈ పాటను ఎంతో శ్రావ్యంగా భావస్ఫోరకంగా హుషారుగా ఆలపించారు. 

ఈ గీతరచనలో చక్కటి ఆధునిక భావుకతను కనపర్చారు ఆరుద్ర.  ఆరుద్రగారికి పరభాషా పదప్రయోగ మోజు ఆనాటినుంచి వుందని ఈ గీతంలోని 'నిషా, కుషీ, కైపుబలాదూర్ వంటి ఉర్దూ మాటలు నిరూపిస్తాయి. పాటల రచయితగా ఆరుద్రగారి తొలినాళ్ళ సినిమా 'పరోపకారం'.

ఈ సినిమా లోని 11 పాటలను ఆరుద్రే వ్రాసారు. అన్నీ కట్టాణిముత్యాలే అంటే అతిశయోక్తి కాదు. ఇలాటి మరో అపురూపమైన పద ప్రయోగమే 'కోనారికూన'హృదయమా సాగిపొమ్మా భావ వేగాన సాగిపొమ్మా' లో కనిపిస్తుంది. ఆ పాట కూడా 'పరోపకారం' సినిమా లోనిదే. అభ్యుదయ కవిగా, పండితుడిగా పేరుపొందిన ఆరుద్రగారి సాంగత్యం ఘంటసాలగారికి  విజయనగర కాలంలోనే ఏర్పడిందేమో! ఆరుద్రగారి విప్లవకవితా ధోరణికి తొలిబీజం పడింది విజయనగరంలోనే అంటారు.

తర్వాతి కాలంలో ఘంటసాలగారు, ఆరుద్రగారు కలసి అసంఖ్యాకమైన కట్టాణిముత్యగీతాలను సృష్టించారు. ఆరుద్రగారి 'తూరుపుదిక్కున అదిగో చూడు' వంటి ప్రబోధగీతాలను కూడా ప్రైవేట్ గ్రామఫోన్ రికార్డు లుగా ఘంటసాల పాడి వాటికి మంచి ప్రాచుర్యం కల్పించారు. నవ్య కళాకారులను గుర్తించి ప్రోత్సహించడంలో ఘంటసాలగారిదెప్పుడూ ముందంజే. తాను నిర్మాత గా తీసిన మొదటి చిత్రం పరోపకారానికి నృత్యదర్శకుడిగా వెంపటి చినసత్యంగారిని తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం చేశారు. చినసత్యంగారు తన అన్నగారైన వెంపటి పెదసత్యంగారి వద్ద అనేక సినిమా లకు సహాయకుడిగా పనిచేసినా స్వతంత్రంగా నృత్యదర్శకుడిగా పనిచేసిన చిత్రం మాత్రం 'పరోపకారం' అనే చెప్పాలి.

ఘంటసాలగారి పరోపకారం సినిమా ద్వారా  చిత్రసీమలోకి అడుగుపెట్టిన మరో కళాకారుడు, మా నాన్నగారుపట్రాయని సంగీతరావు. పరిస్థితుల ప్రాబల్యం వలన, ఆప్తమిత్రుల బలవంతంతో, ముఖ్యంగా ఘంటసాలగారి సాదరపూర్వక ప్రోత్సాహంతో అనాసక్తంగా  సినీమాలోకానికి వచ్చిపడ్డారు. తదాదిగా ఘంటసాలగారి చివరిశ్వాస వరకు సుమారు ఓ 80 సినిమా లకు ఘంటసాలగారి సంగీత సహాయకుడిగా పనిచేశారు. సంగీతరావుగారు పరోపకారం సినీమాలో కొన్నిపాటలకు హార్మోనియం వాయించారు. ఒక చిన్న పాటను కూడా పాడారు. అయితే అది సినిమాలో కనపడదు. అలాగే, ఘంటసాలగారు నిర్మించిన 'సొంతవూరు'(సి.ఎస్.ఆర్.తో ఓ సన్నివేశం) 'భక్త రఘునాథ్' (ఆలయ నృత్యంలో వైణికుడు)  చిత్రాలలో తెరపై కనిపిస్తారు. ఇందుకు ఘంటసాలగారి సుహృద్భావ ప్రోత్సాహమే కారణం. (ఘంటసాలగారి నిర్యాణం తర్వాత సంగీతరావుగారు డా.వెంపటి చినసత్యంగారితో కలసి కూచిపూడి నృత్యకళకు చేసిన సంగీతసేవ ... మరో జీవితాధ్యాయం.)

పరోపకారం సినిమాకు దర్శకుడుగా పనిచేసిన  కమల్ ఘోష్  పేరుపొందిన కెమెరామన్.  కమల్ ఘోష్ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది 'చంద్రలేఖ' సినీమా, అందులోని డ్రమ్ డ్యాన్సే.  ఈయన తొలితరం బెంగాలీ, హిందీ సినిమాల సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత అయిన దేవకీబోస్ కు మేనల్లుడు. దేవకీబోస్ రచించిన కథ ఆధారంగానే  పరోపకారం సినిమాను ఘంటసాల తెలుగుతమిళ భాషలలో  జి.వరలక్ష్మి, సావిత్రి, ముక్కామల, రేలంగి, సి.ఎస్.ఆర్., ఆర్.నాగేశ్వరరావు, రామశర్మ వంటి ఆనాటి ప్రముఖ నటులతో నిర్మించారు. అయినాఆయన దురదృష్టం. సినిమా రెండు భాషలలోనూ  వసూళ్ళపరంగా ఘోరంగా విఫలమయింది. కర్ణుడి చావుకు కారణాలనేకం అన్నట్లుగా దేవదాసు, బ్రతుకుతెరువు, కన్నతల్లి పిచ్చిపుల్లయ్య, చండీరాణి వంటి సినిమాల మధ్య పరోపకారానికి గుర్తింపు లేకుండా పోయింది. దేవదాసు ప్రభంజనంలో 'పరోపకారం' తో పాటు ఆ సమయంలో వచ్చిన మరికొన్ని సినిమాలు కొట్టుకుపోయాయి.

పరిశ్రమలోని కొందరికి ఉపకారిగా మారిన పరోపకారం ఘంటసాలగారిని మాత్రం అప్పులపాలుజేసింది. నిర్మాతగా నష్టపోయీనా దేవదాసు గాయకుడిగా ఘంటసాలగారి  పేరుప్రఖ్యాతులు ఈనాటికీ చెక్కుచెదరకుండా  ఆయనను అగ్రస్థానాన కూర్చుండబెట్టాయి. పరోపకారం సినిమా  ఆర్ధిక పరాజయం పొందినా ఆ సినీమాలోని  అన్ని పాటలు ఘంటసాలగారి అభిరుచికిసంగీత ప్రతిభకు మచ్చుతునకలుగా నిలిచిపోతాయి.

తెలుగులో ఎక్కడా కనపడని 'పరోపకారం' తమిళం సినిమా యూట్యూబ్ లో ఇంకా కొంత ఆదరణ పొందుతున్నది. ఆనాటి లోబడ్జెట్ సినిమాల శైలి పట్ల ఆసక్తికలవారు తమిళ పరోపకారాన్ని చూడవచ్చు. అందులో అందరూ తెలుగువారే.

కొసమెరుపు:-

నేటి సజీవరాగానికి ఘంటసాలగారు తీసుకున్న రాగం ఖరహరప్రియ అని చెప్పుకున్నాము. కరుణ శోక రసాల భావప్రకటనకు అనుకూలమైన రాగంగా చెపుతారు. అతి ప్రాచీనమైన ఈ రాగం అసలు పేరు 'హరిప్రియ' . అహంభావియైన రావణాసురుడు ఒకసారి కైలాసపర్వతం క్రిందపడి భంగపాటుతో ఆక్రోశిస్తూ పరమేశ్వరుని అనేక స్తుతులతో ప్రార్ధించాడట. అందులోని కొన్ని స్తుతులు ఈ రాగంలో వుండి అవి శివునికి ఎంతో ప్రీతిని కలిగించి రావణుని కాపాడాయని, ఆ విధంగా ఆ రాగానికి హరిప్రియ అనే పేరు వచ్చిందని అదే కాలక్రమేణా 'ఖరహరప్రియ' గా మారిందని ఒక కథనం.



వచ్చేవారం  ఘంటసాలవారి  మరో సజీవరాగం తో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

1 comment:

  1. కర్ణాటక సంగీతంలోని 22వ మేళకర్త రాగమైన ఖరహరప్రియ రాగం యొక్క పాత లేదా అసలు పేరు 'హరప్రియ' అని అనుకుంటాను. కటపయాది సూత్రం ప్రకారం, మేళకర్త రాగ వ్యవస్థలో దీనికి ఖరహరప్రియ అని పేరు మార్చారు. ఇది శివుడికి ప్రియమైనదిగా (హర - శివుడు, ప్రియ - ఇష్టమైన) పరిగణించబడుతోంది.

    ReplyDelete

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 9 - వలపుల కథకిది తొలిపలుకు

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...