అధ్యాయం - 2 - భాగం 11
చెరపకురా చెడేవు - ఆపకురా మురళి/ఆపితివా మురళి
జీవితసరళి... 'ఆ మాటేదో అందరికీ అర్ధమయేలా చెప్పవయ్యా...
Life style. .. ' ఓస్ అదా! మా మనవడి స్టైలే స్టైల్. చదవడానికి అమెరికా వెళ్ళాడు. వాడి హెయిర్ స్టైల్ కి అక్కడి దొరలే ముక్కున వేలేసుకుంటారట ఓ కామందుగారి బడాయి. 'మా మనవరాలు మాత్రం.. దాని దగ్గరున్నన్ని మోడర్న్ డ్రెస్ లు, మాచింగ్ లిప్ స్టిక్ లు, కాలిజోళ్ళు, కళ్ళజోళ్ళు ఈ ఊళ్ళో ఎవరికీలేవు. అన్నీ బొంబాయి నుంచే తెప్పిస్తుంది. వాటిని నన్ను కూడా వేసుకోమని ఒకటే గోల... అయినా నాకు సిగ్గు బాబూ.. 'కామందుగారి భార్య మురిపెం. మనవల ముద్దు ముచ్చట్లు తీర్చడానికి బంగారం లాంటి భూములు తెగనమ్మేస్తున్నారని కోడలు రోజూ మొగుడితో లడాయి.
ఇది ఆ కుటుంబం
జీవితసరళి.
ఇంతకీ జీవితసరళి అంటే...
ఒక మనిషి తన నిత్యజీవితంలో అనుసరించే విధివిధానాలు, ఆహార విహారపుటలవాట్లు, నడవడిక, సమాజంలో ఇతర వ్యక్తులతోడి స్నేహ సత్సంబంధాలు అతడి జీవితశైలిని లేదా జీవిత సరళిని తెలియజేస్తాయి. అపరిమితమైన సమాచార, ప్రసార సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్ల వినియోగం, ఆధునికీకరణ, ప్రపంచీకరణ వంటి విషయాలు అందుబాటులోకి వచ్చాక మనిషి జీవిత విధానమే పూర్తిగా మారిపోయింది. సమాజంలోని వ్యక్తుల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర స్నేహానురాగాలు, మమతానుబంధాలు క్రమక్రమంగా రూపుమాసిపోతున్నాయి. దీని ప్రభావం మన కుటుంబ వ్యవస్థ మీద, వివాహ వ్యవస్థ మీద కూడా తీవ్రంగా కనిపిస్తోంది. గత డెభ్భై ఎనభై ఏళ్ళక్రితం వున్న జీవన విధానానికి, ఆచార వ్యవహారాలకు, ఆహారపు అలవాట్లకు ఇప్పుడున్న తీరుతెన్నులకు సంబంధమే లేదు. మనిషి జీవిత సరళి పూర్తిగా మారిపోయింది. IT పురోభివృద్ధి ప్రభావం మన సినిమాలమీద కూడా పడింది. గత రెండున్నర దశాబ్దాలలో మన సినీమాల సరళి పూర్తిగా మారిపోయింది. నిన్న మొన్నటివరకు భారతీయ స్త్రీకి పతియే ప్రత్యక్ష దైవం. (ఈనాటి ఆధునిక వతులు ఈ సూత్రానికి కట్టుబడి వుండడానికి సిధ్ధంగా వున్నారా అంటే సందేహమే). ప్రేమాభిమానాలతో చేరదీసినా, నిర్లక్ష్యం చేసి కొట్టి తిట్టినా ఆనాటి స్త్రీకి భర్తే సర్వస్వం. ఈ రకమైన సామాజిక నీతిని అనుసరించిన కథాంశాలతో వచ్చిన సినిమాలే గత నాలుగు దశాబ్దాల క్రితం వరకు వచ్చేవి. వాటిని స్త్రీ పురుష ప్రేక్షకులంతా సమానంగా అభిమానించారు, ఆదరించారు. అందుకు ఉదాహరణగా ఈ పాటలోని సాహిత్యం చూడండి...
పల్లవి:
ఆపకురా మురళీ... గోపాలా-2
అదే నా జీవిత సరళీ..
ఆపకురా!
చరణం 1:
మధుర మధురమౌ నీ మురళీ
సుధలను చిలికే ఆ
మురళీ
నా ఎద నవ్వుల రవళీ
అదే నా జీవిత సరళీ
!ఆపకురా!
పతి నీ రూపని నీవే
ప్రాపని
మధురగానమున రాధగ
మారెద
మధుపము నయ్యెద పదముల వ్రాలెద
నాపతి మాధవుడేరా
!ఆపకురా!
ఆ మురళీగానలోలుని
ప్రార్ధిస్తూంటుంది.
1955 లో వచ్చిన 'చెరపకురా-చెడేవు' సినిమా కోసం
జూనియర్
సముద్రాల వ్రాసిన ఈ పాటకు స్వరకర్త
ఘంటసాల.
సన్నివేశానికి తగిన
భావావేశంతో మృదుమధురంగా భక్తితత్పరతతో
పి లీల గానం చేయగా
భర్తపట్ల అపరిమిత ప్రేమ, విశ్వాసం గల సతిగా షావుకారు జానకి తెరపై అత్యంత
సహజంగా నటించారు.
ఈ పాటలో 'మురళి', 'రవళి', 'సరళి'
యని ఒక చరణంలో,
మరొక చరణంలో 'రూపని', 'ప్రాపని';
'మారెద', 'నయ్యెద', ' వ్రాలెద'
వంటి పదప్రయోగాలు
చేసి జూనియర్ సముద్రాల గారు ప్రాసలపట్ల
తనకు గల మక్కువను చాటుకున్నారు.
వెలుగు చీకట్లలా ఈ
పాటకు రెండు పార్శ్వాలు. జీవితసరళి సవ్యంగా సాగిపోతున్నప్పుడు సంతోషంతో చేసిన
దైవస్మరణ ఒకటైతే , భర్త త్రాగుడు,
చెడుసావాసాలు, పరస్త్రీ వ్యామోహానికి లోనై తనను అలక్ష్యపర్చి
దూరంచేసినప్పుడు బ్రతుకంతా భారమై ఆవేదనతో
దైవం ముందు విలపించిన గీతం మరొకటి. అది....
ఆపితివా ...మురళీ...గోపాలా -2
ఇదియే నా జీవిత సరళీ
!ఆపితివా!
నవ వసంతమౌ నా వయసు
అతి ప్రశాంతమౌ ఈ
మనసూ
పాపపు చీకటి పాలేనా
ఇదియేనా జీవితసరళీ
నా పతికె దూరమా! నీకే భారమా
నాధుని నమ్మిన
నాతికి వెతలా
పెదవుల వేణువు
వదలకురా ప్రభూ...
పతి దర్శనమీరా
!ఆపకురా!
సినిమాలో రెండు వేర్వేరు సందర్భాలలో ఆనంద విషాద భావోద్వేగాలతో వినపడే ఈ గీతాన్ని ఘంటసాల పీలు రాగంలో స్వరపర్చి పి.లీలచేత భక్తిపూర్వకంగా గానం చేయించారు.
పీలు ... ప్రసిద్ధి చెందిన ఒక హిందుస్థానీ రాగం. 'కాపి థాట్' కు జన్యం. తుమ్రీ, దాద్రా వంటి లలిత శాస్త్రీయ రీతులలో గానం చేసేప్పుడు విద్వాంసులు ఈ పీలు రాగాన్ని ఎన్నుకుంటారు. పీలు రాగంలో ఇతర రాగాల ఛాయలు కూడా వుండడం వలన దీనిని మిశ్రరాగంగా పరిగణిస్తారు. భక్తి, శృంగార, కరుణ, ఆనంద, విషాదాది రస భావాలకు అనువైన ఈ పీలు రాగంలో ఉస్తాద్ బడేగులాం ఆలీఖాన్ (తుమ్రీ), పండిట్ రవిశంకర్ (సితార్) బిస్మిల్లాఖాన్ (షెహనాయ్), అంజాద్ ఆలీఖాన్ (సరోద్), హరిప్రసాద్ చౌరాసియా (ఫ్లూట్) వంటి సుప్రసిద్ధ సంగీత కళాకారుల స్వరరచనలెన్నో సంగీతప్రియులను అలరిస్తున్నాయి.
అలాగే సినిమా సంగీతంలో కూడా పీలు రాగం చేసిన అనేక గీతాలు శ్రోతల మనసులలో నిలిచివున్నాయి. భారతీయులందరికి అత్యంత ప్రీతిపాత్రమైన భక్తిగీతం 'రఘుపతి రాఘవ రాజారాం' ఈ పీలు రాగంలోనే స్వరపర్చారు. పీలు రాగానికి సమానమైన కర్ణాటక రాగం కాపి. దీనికి హిందుస్థానీ శైలిలోని కాపికి సంబంధం లేదు. కర్ణాటక సంగీతంలోని కాపి రాగం 22వ మేళకర్త అయిన ఖరహరప్రియ కు జన్యరాగం. అటువంటి జన, మనోరంజకమైన పీలురాగంలోని భక్తి, ఆనందం, విషాద రసాలకు ప్రాధాన్యతనిస్తూ ఘంటసాల మాస్టారు 'ఆపకురా మురళీ గోపాల' గీతాన్ని సార్ధకత చెందేలా స్వరపర్చి శ్రోతలలో భక్తిభావాన్ని ఇనుమడింపజేసేలా పి.లీలచే అద్భుతంగా పాడించారు.
రసపోషణకు అవసరమైనంతమేరకు మాత్రమే మాస్టారు ఈ పాటకు వాద్యాలను సున్నితంగా ఉపయోగించారు. వయొలిన్స్, వీణ, సితార్, ఫ్లూట్, క్లారినెట్, హార్మోనియం, తబలా, డోలక్, తాళాలు వంటి వాద్యాలు ఈ పాటలో వినిపిస్తాయి. శాస్త్రీయ సంగీత నేపథ్యంగల శ్రీమతి పి.లీల గళంలో గమకాలు, ఆలాపనలు సునాయాసంగా పలుకుతాయనడానికి ' ఆపకురా మురళీ' ఒక నిదర్శనం.
ఈ పాటను ఒక సత్సంగ సభ్యులు (పురుషులు) తమ భజన కార్యక్రమంలో ఆలపించడం యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యము, ఆనందమూ కలిగాయి.
ఘంటసాలగారి అనేక గీతాలు శాస్త్రీయ సంగీతవిద్యార్ధులకు రాగ పరిచయానికి అభ్యాసగీతాలుగా తగినవని గాఢంగా విశ్వసించే పట్రాయని సంగీతరావుగారు నా చిన్నతనంలో తరచూ వీణమీద, హార్మోనియం మీద వాయిస్తూ పిల్లలకి నేర్పడం నాకు బాగా గుర్తు.
1950 దశకం నాటికి ఘంటసాలగారు చలనచిత్ర గాయకుడిగా, సంగీతదర్శకుడిగా తనకంటూ ఒక బాణీని, దృఢమైన సుస్థిరతను ఏర్పరచుకున్నారు. సినీగీత సంగీత కచేరీలకు ఆద్యుడు ఘంటసాలగారు. వివిధ సంగీత ప్రక్రియలతో కూడిన ఘంటసాలగారి సంగీతకచేరీ శ్రోతలకు మరపురాని మధురానుభూతిని కలిగిస్తుంది. గాయకుడిగా, సంగీతదర్శకుడిగా ఉచ్ఛ స్థాయికి చేరుకున్న ఘంటసాల తన స్వంత ఆర్కెష్ట్రాను ఏర్పాటు చేసుకోవడం ఆవశ్యకమని భావించారు. ప్రసాదరావు ఆర్కెష్ట్రా, దక్షిణామూర్తి ఆర్కెష్ట్రా, మాస్టర్ వేణు ఆర్కెష్ట్రా అని కొన్ని ఆర్కెష్ట్రాల పేర్లు పాత సినిమా టైటిల్స్ లో మనం చూస్తూంటాము. సినిమా సంగీతదర్శకుడిగా ఒకరి పేరు , ఆర్కెష్ట్రాకు మరొకరి పేరు వుంటుంది.
1954 సంక్రాంతి పండగరోజులన్నీ అయ్యాక ఒక శుభముహుర్తాన ఘంటసాలగారు తమ స్వంత ఆర్కెష్ట్రాను .... సర్వశ్రీ - పామర్తి (తబలా), పి. సంగీతరావు (హార్మోనియం), హుస్సేన్ రెడ్డి (ఆర్గన్), ఎన్.సి.కృష్ణమాచారి (వయొలిన్), సుబ్రహ్మణ్యం (వయోలా), ఎమ్.ఎస్.రాజు (వీణ), రాజేంద్రన్ (ఫ్లూట్), సుభాన్ (క్లారినెట్), కణ్ణన్, ఆర్.వి.భద్రం (రిథిమ్స్) వంటి సంగీత కళాకారులతో, గురుసమానుడైన ఉస్తాద్ బడేగులాం ఆలీఖాన్ సమక్షంలో వారి ఆశిస్సులతో ప్రారంభోత్సవం జరిపారు.
ఘంటసాల ఆర్కెష్ట్రాతో తయారైన మొట్టమొదటి చిత్రం భాస్కర్ ప్రొడక్షన్స్ 'చెరపకురా-చెడేవు' 1955 లో విడుదలయింది. ఎన్.టి.రామారావు, అమర్నాథ్, ఆర్.నాగేశ్వరరావు, సి.ఎస్.ఆర్., రేలంగి, షావుకారు జానకి, రాజసులోచన, లక్ష్మీరాజ్యం, చంద్రకుమారి, పుష్పలత మొదలగువారు నటించిన ఈ చిత్రాన్ని నిర్మాత అయిన భాస్కరరావుగారే డైరక్ట్ చేశారు. చెరపకురా చెడేవు అనే పేరు చూడగానే కథాసారాంశం అంతా అర్ధమైపోతుంది. 'బ్రతుకుతెరువు' సినిమా తర్వాత తీసిన ఈ సినిమా కూడా మంచి విజయాన్నే పొందింది. దీనిని తమిళంలో 'ఇల్లరమే ఇన్బం' పేరుతో డబ్ చేశారు.
ఘంటసాలగారిని అమితంగా అభిమానించి గౌరవించిన నిర్మాత లలో భాస్కరరావు గారు ఒకరు. భాస్కర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఆయన నిర్మించిన దాదాపు ఆరేడు సినీమాలు అన్నింటికీ వరుసగా ఘంటసాలగారే సంగీతదర్శకుడు. ఆ బ్యానర్ కు ఘంటసాలగారు సంగీత దర్శకత్వం నిర్వహించిన ఆఖరు చిత్రం 'మోహినీ రుక్మాంగద' ఆ తర్వాత, కోవెలమూడి భాస్కరరావుగారు సినీమాలు తీసినట్లుగా కనపడదు.
'చెరపకురా-చెడేవు' లోని పది పాటలను సముద్రాల జూనియర్, రావూరి సత్యనారాయణ రావు వ్రాశారు. పి.లీల పాడిన ' ఆపకురా మురళీ', 'యోగము అనురాగము', జిక్కి పాడిన 'గులాబీలతోట', అందాల నా రాజ రావోయి' , ఘంటసాల & రాణి పాడిన 'నాటకం ఆడుదాం', ' ప్రేమో ప్రేమో ప్రేమ', పాటలు ఆనాడు బహుళజనాదరణ పొందాయి. సంగీతపరంగా ఘంటసాలగారికి మంచి పేరు తెచ్చిన సినిమా 'చెరపకురా-చెడేవు'.
ఇందులోని విశేషం ఏమంటే హీరో ఎన్.టి.ఆర్ కు గాని, సెకండ్ హీరో అమర్నాథ్ కు గాని పాటలే లేవు. ఉన్న రెండు డ్యూయెట్ లు రేలంగి, పుష్పలతలకే. దీనినిబట్టి ఆనాడు దర్శకులు కథాంశానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో అర్ధమవుతుంది.
కొసమెరుపు:-
పురాణపురుషుడు, త్రిలోకసంచారి అయిన నారదుడికి చొక్కా తొడిగిన ఘనత కోవెలమూడి భాస్కరరావు
గారిదే. వివరాలు తెలియాలంటే చూడండి భాస్కర్ ప్రొడక్షన్స్ వారి 'పార్వతీ కళ్యాణం'.
ప్రణవ స్వరాట్



No comments:
Post a Comment