Saturday, 28 June 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 88వ భాగం - ఆవేశం రావాలి ఆవేదన కావాలి

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఎనభైయేడవ భాగం ఇక్కడ

88వ సజీవరాగం - ఆవేశం రావాలి ఆవేదన కావాలి 

చిత్రం - మనసు మాంగల్యం
గానం - ఘంటసాల
రచన - దాశరథి

సంగీతం - 
పెండ్యాల

పల్లవి : 

ఆవేశం రావాలి ఆవేదన కావాలి-2

చరణం 1:

గుండెలోని గాయాలు

మండించే గేయాలు

వేదనలై శోధనలై రగలాలి విప్లవాలు

రగలాలి విప్లవాలు

                                !ఆవేశం!

చరణం 2:

నరజాతిని భవితవ్యానికి

నడిపేదే ఆవేశం

పదిమందికి భవితవ్యాన్ని పంచేదే ఆవేదన

వేగంతో వేడిమితో 

సాగేదే జీవితం సాగేదే జీవితం 

                                !ఆవేశం!

చరణం 3

రణదాహం ధనమోహం కాలి

కూలిపోవాలి సమవాదం 

నవనాదం ప్రతియింటా పలకాలి

ప్రతి మనిషి క్రాంతి కొరకు

రుద్రమూర్తి కావాలి-2

                                !ఆవేశం!

 చరణం 4:

తరతరాల దోపిడీల ఉరితాళ్ళను

తెగతెంచీ నరనరాల అగ్నిధార

ఉప్పెనలా ఉరికించీ

మరో కొత్త ప్రపంచాన్ని 

మనిషి గెలుచుకోవాలి

                                !ఆవేశం!

చరణం 5

నిదురించిన  నా కవితకు

కదలించిన ఆవేశం

మరుగుపడిన నా మమతకు

చెరవిప్పిన ఆవేదన

కన్నుగప్పి వెళ్ళింది! 

నన్ను మరచిపోయిందీ - 2

                                !ఆవేశం!

హృదయాంతరాళాలలోనుండి తపనవేదనఆవేశం పెల్లుబికివచ్చినప్పుడే ఉత్తమమైన సాహిత్యం గానీసంగీతం గానీ ఆవిర్భవిస్తుంది. దేశ చరిత్రలను మార్చే విప్లవోద్యమాలుగానిశాంతియుత సమరాలుగానిమారణహోమాలుగాని సంభవించేది కూడా తీవ్రమైన ఆవేశంఆవేదనల నుండే. గొప్ప గొప్ప కవుల కవిత్వానికి, మహాగాయకుల సంగీతానికి ప్రేరణ ఆ ఆవేశమూఆవేదనలే. 

రణదాహం ధనమోహం కాలి కూలిపోవాలనిసమవాదం నవనాదం ప్రతి యింటా పలకాలని, ప్రతి మనిషి క్రాంతి కొరకు రుద్రమూర్తి కావాలని తపించి ఆవేశం చెందే ఒక కవికి జరుగుతున్న సన్మాన సభ. ఆతని కవితలు వినాలని అభిలషించే అభిమానులెందరో కవిగానానికై ఎదురుచూస్తున్నారు. ప్రేమ వైఫల్యంతో త్రాగుడుకు బానిసైన ఆ కవి  ప్రేక్షకుల కోరికను కాదనలేక త్రాగుడు మైకంలోనే వేదికనెక్కి 'ఆవేశం రావాలి ఆవేదన కావాలిఅని అచ్చం  ఘంటసాలలా  ఆలపిస్తాడు. ఆ  ఉద్వేగ  ఆవేశభరిత గీతమే నేటి మన సజీవరాగం. 'మనసు-మాంగల్యం' అనే సినిమా కోసం 'తెలంగాణ కోటి రతనాల వీణ' గా భాసిల్లిన కవికోకిల దాశరథిగారి భావావేశాలనుండి ఉద్భవించిన సినీ గేయమిది. సినీగీత రచయితగా నవరసాలతో నిండిన పాటలెన్నింటినో సన్నివేశానుగుణంగా రచించారు. సామ్యవాదంతో నవప్రపంచాన్ని మనిషి గెలుచుకోవాలని ఈ గీతం ద్వారా పిలుపునిచ్చారు దాశరథి. చిత్రంలోని కథాపాత్ర త్రాగుడు మైకంలో వున్నందున అతని మనసు, ఆలోచనలకు తగినట్లుగానే దాశరథిగారి భావాలుపదజాలం కూడా కలగలుపుగా అనిపిస్తాయి.

'మనసు-మాంగల్యం' సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావుగారు. తెలుగు సినిమా అత్యుత్తమ సంగీత దర్శకులలో ప్రముఖులు. చేసేది సాంఘికమైనాపౌరాణికమైనాజానపదమైనా పెండ్యాలగారి ముద్ర సుస్పష్టంగా కనిపిస్తుంది. అక్కినేని కథానాయకుడిగాపెండ్యాల సంగీత దర్శకుడిగా పనిచేసిన చిత్రాలెన్నింటిలోనో ఘంటసాలగారు అద్భుతమైన పాటలెన్నో పాడారు. అలాటివాటిలో ఈ 'ఆవేశం రావాలి ఆవేదన కావాలి' పాట కూడా మకుటాయమానంగా నిలుస్తుంది.

పెండ్యాలగారు ఈ పాటను సౌదామిని రాగ స్వరాలతోపాటు ఆ రాగంలో లేని రిషభాన్ని కూడా అన్య స్వరంగా చేర్చి మిశ్ర సౌదామినిగా మలచినట్లు భావించవచ్చును. అటు కర్నాటక సంగీతంలోగానిఇటు సినిమా సంగీతంలోగాని సౌదామిని రాగంలో వుండే కృతులుగాని, పాటలుగాని చాలా అరుదు. ఈ విషయంలో ఘంటసాలగారే ఆద్యుడని చెప్పాలి. 'బందిపోటు'లోని 'ఊహలు గుసగుసలాడే' పాట ద్వారా సౌదామిని రాగాన్ని తెలుగువారికి పరిచయం చేశారు.(అంతకుమించి ఎక్కువగా చర్చించడం ఇక్కడ సముచితం కాదు) సౌదామిని 57వ మేళకర్త రాగమైన సింహేంద్రమధ్యమ రాగానికి జన్యరాగం. పెండ్యాలగారు ఈ పాటను పూర్తిగా వైయొలిన్స్, సెల్లోట్రంపెట్స్, వైబ్రోఫోన్తబలాడోలక్ వంటి వాద్యాలతో స్వరపర్చారు.

తెరపైని అక్కినేని వారికి ఏ రకమైన మాడ్యులేషన్ తో ఏవిధమైన ఎక్స్పెషన్ తో పాడాలో  తెర వెనకని ఘంటసాల మాస్టారికి బాగా ఎరికే. సన్నివేశానికి కావలసిన ఆవేశాన్నంతా తన కంఠంలో పూరించి ఈ విప్లవ నినాదగీతాన్ని భావగాంభీర్యంతో ఆలపించి తెరమీది ఎ.ఎన్.ఆర్.కు దీటుగా నటించారు. చివరిలోని దగ్గు కూడా ఘంటసాలగారిదే.

ఘంటసాలగారు తన కచేరీలలో దేవదాసులోని జగమే మాయకు పరిచయ వాక్యాలు చెపుతూ 'చివరిలోని దగ్గు కూడా నాదే బాబూ! నాగేశ్వరరావు గారిది కాదు' అని చెప్పేవారు. అలాగే ఈ పాటలోని చివరి దగ్గు కూడా ఘంటసాలగారిదే ఎ.ఎన్.ఆర్.ది కాదు.

మనసు మాంగల్యం చిత్ర దర్శకుడు కె.ప్రత్యగాత్మ. ఎ.ఎన్.ఆర్. హీరోగా ప్రత్యగాత్మ అనేక విజయవంతమైన సినిమా లు అందించారు. నిర్మాత కోగంటి కుటుంబరావుగారు చిత్ర నిర్మాతగా కంటే మా పక్కింటాయనగా మాకు పరిచితులు. వారింటికి మా ఇంటికి మధ్య ఒక చిన్న పిట్టగోడ మాత్రమ అడ్డు. వారి అమ్మాయి ఆ గోడదూకి వచ్చి మా ఇంటి పిల్లలతో ఆటలాడుకునేది. నాకు తెలిసినంతవరకు కోగంటి కుటుంబరావు గారు  రెండే సినిమా లు తీసిన గుర్తు -  ఎ.ఎన్.ఆర్.తో 'మనసు మాంగల్యం', ఎన్,టి.ఆర్.తో 'దీక్ష'. ఘంటసాల మాస్టారు పాడిన ఆఖరి చిత్రాలలో దీక్ష కూడా ఒకటి. మనసు మాంగల్యం సినిమా లో  ఘంటసాలగారు  రెండు డ్యూయెట్ లు, రెండు సోలోలు పాడారు. వాటిల్లో దాశరథిగారు వ్రాసిన ' ఆవేశం రావాలి ఆవేదన కావాలి' పాట నేటికీ సజీవంగా నిలిచిపోయింది. 


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

Saturday, 21 June 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 87వ భాగం - శ్రీరస్తు చిన్నారి నా చెల్లికి చిరాయురస్తు వరాల మా తల్లికి

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఎనభైయరవ భాగం ఇక్కడ

87వ సజీవరాగం - శ్రీరస్తు చిన్నారి నా చెల్లికి చిరాయురస్తు వరాల మా తల్లికి   

చిత్రం - విజయం మనదే
గానం - ఘంటసాల
రచన - దేవులపల్లి కృష్ణశాస్త్రి

సంగీతం - 
ఘంటసాల

పల్లవి : 

శ్రీరస్తు చిన్నారి నా  చెల్లికి

చిరాయురస్తు వరాల మా తల్లికి....

 

కొంచెం కొంచెం బిడియాలు

పొంచి పొంచి సరదాలు

మా మంచి పెళ్ళికూతురికి

మగనింటికిపోయే తొందరలు

                                        !శ్రీరస్తు...!

 చరణం 1:

కనుదోయి కాటుకతీర్చి కస్తూరి తిలకం దిద్ది - 2

కన్నీటి తెరలో నుంచే కళ్యాణమూర్తిని

చూసి ఆ మూర్తి నాలో దాచి

!కొంచెం కొంచెం బిడియాలు!

                                        !శ్రీరస్తు...!

చరణం 2:
ఆ కంటనీరు రాకూడదు

ఈ గుండె చెదిరిపోకూడదు

ఈ జంట కలిసి వెళ్ళేవరకు

నా చెల్లి వెంట వుండాలని

వెంట వెంట వుండాలని

!కొంచెం కొంచెం బిడియాలు!

                                        !శ్రీరస్తు...!

చరణం 3: 

పుట్టినింట మహరాణియని

మెట్టినింట యువరాణి యని

ఒట్టువేసి చెయిలో చెయివేసి

భర్త చేత వుంచాలని అతని వెంట పంపాలని.....

!కొంచెం కొంచెం బిడియాలు!
                                        !శ్రీరస్తు...!

ఘంటసాలగారు గొప్ప హృదయధర్మమున్న మనిషి అని మా నాన్నగారు అనేవారు. ఉన్నతమైన హృదయధర్మమున్న వ్యక్తి బంధుప్రీతితోఆదరాభిమానాలతో చాలా ఔదార్యంగా ఉంటాడు. తల్లితండ్రులమీద, తోబుట్టువుల మీద అపరిమితమైన ప్రేమానురాగాలు కలిగి జీవితాంతం వారి మంచిచెడ్డలు గమనిస్తూ వారి కష్టాలన్ని తన కష్టాలుగా అనుభవిస్తూ వారిని సంరక్షిస్తూంటాడు. అందులోనూ తల్లితండ్రులు లేని అక్కచెల్లెళ్ళుంటే వారి బాగోగులన్నీ అతనివే. కన్నతల్లి తండ్రి కంటే ఎక్కువగా సాకుతూ  పెంచి, విద్యాబుధ్ధులు చెప్పించి వారి పెళ్ళిళ్ళు పేరంటాలు జరిపిస్తూ వారి ఆనందమే తన ఆనందంగా జీవితాన్ని గడుపుతాడు. 

ఈ రకమైన నేపథ్యంలో అన్నా చెల్లెళ్ళ అనురాగాలను, రక్తసంబంధాలను ప్రతిబింబించే తెలుగు సినిమాలెన్నో మనకు వున్నాయి. తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తూ  తన తోబుట్టువుల సుఖసంతోషాలకోసం తన జీవితాన్ని కూడా త్యాగం చేసే అన్నల కథలెన్నో మనకు వచ్చాయి. విభిన్నమైన కథాంశాలెన్నున్నా వాటితోపాటూ అన్నాచెల్లెళ్ళులేదా అక్కాతమ్ముళ్ళ సెంటిమెంటును కూడా మేళవించి రూపొందించిన నవరసభరితమైన సినిమాలు ఎన్నో ప్రేక్షకుల ఆదరాభిమానాలకు నోచుకున్నాయి.

అలాటి చిత్రాలలో మంచి సాహిత్యంతోవీనులవిందైన సంగీతంతో నిండిన ఆణిముత్యాలవంటి పాటలెన్నో మనకు లభించాయి. అలాటి అన్నాచెల్లెళ్ళ సెంటిమెంట్ తో ప్రేక్షకుల హృదయాలను బరువెక్కించే ఒక సాగునంపు గీతమే ఈనాటి మన సజీవరాగం. 

అదే... 'శ్రీరస్తు చిన్నారి నా చెల్లికి చిరాయురస్తు వరాల మా తల్లికి...అనే మకుటంతో ప్రారంభమయే 'విజయం మనదే' జానపద చిత్రంలోని దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి గీతం.

ఇక్కడ అన్న ఎన్.టి.ఆర్., అతని గారాల ముద్దుల చెల్లెలు దేవిక. చెల్లెలికి వివాహం చేసి భర్తతో అత్తవారింటికి సాగనంపే సందర్భంలో చెల్లెలిపట్ల గల మమతానురాగాలవల్ల చెల్లెలిని విడచిపెట్టలేక భావోద్వేగాలతో కన్నీటితో హృదయవిదారకంగా స్వగతంగా పాడుకునే గీతం. ఇందుకు పెళ్ళికూతురు నెచ్చెలుల శోకభరిత గళాలు కూడా సన్నివేశానికి మరింత రసోద్దీపన కలిగించాయి.

విఠలాచార్య సినిమా అభిమానులకు సంబంధించినంతవరకు 'విజయం మనదేనిరాశాజనకం. ఇది ఒక మిస్ క్యాస్ట్. సరోజాదేవి, దేవికఘంటసాల,దేవులపల్లి వంటివారు విఠలాచార్య తరహా సినిమాలకు తగినవారు కారు. 'కనుదోయి కాటుకతీర్చి కస్తూరి తిలకం దిద్ది కన్నీటి తెరలో నుంచే కళ్యాణమూర్తిని చూసి ఆ మూర్తి నాలో దాచి'; 'పుట్టినింట మహరాణియని మెట్టినింట యువరాణియని ఒట్టువేసి చెయిలో చెయివేసి భర్త చేత వుంచాలని అతని వెంట పంపాలనిఅనే మాటలలోని భావావేశం సామాన్య ప్రేక్షకుల స్థాయికి మించినది. ఈ తరహా  కవిత్వ ధోరణి పద ప్రయోగం విఠలాచార్య మార్క్ సినిమా ప్రేక్షకులకు కొంత బరువైనవే. వారు ఆశించే పాటల తరహా అది కాదు. అందుకే ఈ చెల్లి పాట ఒక వర్గం వరకే చేరింది. అలాగే ఘంటసాల-విఠలాచార్య కాంబినేషన్ కూడా. వీరిద్దరి కలయికలో మూడు సినిమా లు వచ్చినా వీరి అభిరుచులు, ఆలోచనా సరళి పరస్పర విరుధ్ధమైనవి. ఇలాటివారిని కలుపుకొని నందమూరి సాంబశివరావు( ఎన్.టి.ఆర్ కజిన్) 'విజయం మనదే' సినిమా ను తీశారు.

అభిరుచులలో ఎటువంటి భేదాభిప్రాయాలు వున్నా ఘంటసాలవారి సంగీతం విషయంలో మాత్రం ఎప్పుడూ ఒక మినిమం గ్యారంటీ వుంటుంది. వారి సంగీత దర్శకత్వంలోని పాటలలో శ్రావ్యతకుమార్దవతకు కొరతవుండదు. ఒక పాట హిట్సూపర్హిట్ కావడమనేది అనేక అంశాలపై ఆధారపడివుంటుంది. ఆ విధంగా 'విజయం మనదే' చిత్రంలోని ఏడు పాటలు సందర్భోచితమైనవే, శ్రవణానందకరమైనవే. ఘంటసాల, సుశీలజానకి పాడిన ఆ పాటలను సి నారాయణరెడ్డి, దేవులపల్లి, వీటూరికొసరాజు వ్రాశారు.

'శ్రీరస్తు శుభమస్తు' పాట కంపోజి్గ్రికార్డింగ్ లలో శ్రోతగా నేను కూడా పాల్గొన్నాను.  ఈ పాట కంపోజింగ్ నిర్మాత నందమూరి సాంబశివరావుగారి (రాజేంద్రా ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్) ఆఫీస్ (మద్రాస్ టి నగర్ సౌత్ ఉస్మాన్ రోడ్ చివర సిఐటి నగర్) లో జరిగింది. కృష్ణశాస్త్రిగారి నోటమ్మట మాట ఎలాగూ రాదు. కలం ద్వారా  పాట కూడా అంత వేగంగా కాగితం మీద పడదు. ఆ విషయం లోకవిదితమే. ఆయన అక్కడున్న అందరి మొహాలు చిరునవ్వులు చిందిస్తూ చూస్తూ కూర్చొనేవారు. సంగీతరావుగారు హార్మోనియం, జడ్సన్ గారు తబలా వాయిస్తూండగా పాట పల్లవి కోసం ఘంటసాల మాస్టారు  'తననా'లు ఆలపించడం జరిగింది. నిర్మాత, అసిస్టెంట్ డైరెక్టర్ సన్నివేశాన్ని కృష్ణశాస్త్రి గారికి వివరించి చెప్పారు. కవి గారు అందరి మాటలు వింటున్నారే తప్ప  కాగితం మీద అక్షరం పడలేదు. గంటారెండు గంటలు గడిచాయి.అందరిలో కొంత చిరాకు గమనించి  శాస్త్రిగారు కాగితం మీద వ్రాసారు ' భావం బుర్రలోకి వచ్చిందిచరణాలు ట్యూన్ రెడీ చేసుకోండి ఒకటి రెండురోజుల్లో పాట తయారైపోతుంది' అని. అనుకున్న ప్రకారమే, చెల్లెలిని అత్తవారింటికి పంపించే అన్నగారి మానసికస్థితికి దర్పణం పట్టేలా దేవులపల్లి వారి ఈ గీతం రూపొందింది. 'శ్రీరస్తు చిన్నారి నా చెల్లికి చిరాయురస్తు వరాల మా తల్లికి 'అనే మాటలను సాకీగా పెట్టుకొని, 'కొంచెం కొంచెం బిడియాలు పొంచి పొంచి సరదాలను... పల్లవిగా చేసుకొని ఉద్వేగభరితమైన ఒక చక్కని పాటకు సజీవత్వాన్ని కల్పించారు ఘంటసాల. హార్ప్, సితార్, ఫ్లూట్తబలాబాంగోస్, టప్పాట్రంపెట్స్వైయొలిన్స్సెహనాయ్వంటి వాద్యాలతో పెళ్ళి వాతావరణానికి మరింత నిండుదనం తీసుకువచ్చారు. ఘంటసాల మాస్టారినే అనుసరిస్తూ ఇతర గాయనీబృందం కూడా శ్రోతల హృదయాలకు హత్తుకునేలా ఈ పాటను అద్భుతంగా పాడారు. అన్నా చెల్లెళ్ళుగా ఎన్టీఆర్ , దేవికలు సందర్భోచితంగా నటించి సన్నివేశాన్ని రక్తికట్టించారు.

1921 లో ఇంగ్లీష్ లో 'స్కారమౌచ్' అనే నవల వెలువడి 1952లో హాలీవుడ్ సినిమాగా వచ్చింది. దానిని జూపిటర్ పిక్చర్స్ వారు తమ ఆఖరు చిత్రంగా తమిళంలో 'అరసిలన్ కుమారి' అనే పేరుతో 1961లో విడుదల చేశారు. ఎమ్.జి.ఆర్., పద్మినినంబియార్, రాజసులోచన నటించిన ఈ చిత్రం ఆర్ధికంగా పరాజయం పొందింది. దీనినే తెలుగులో 'కత్తి పట్టిన రైతు' గా డబ్ చేయగా అందులోని ఓ ఐదుపాటలను ఘంటసాలగారే పాడారు. అదే కథను  విఠలాచార్య, ఎన్.టి.ఆర్ ల మీద భరోసాతో నందమూరి సాంబశివరావు 'విజయం మనదే' గా నిర్మించి  1970 లో విడుదల చేసారు. ఆ సంవత్సరంలోనే కేంద్రం ప్రభుత్వం పద్మశ్రీ బిరుదు పురస్కారంతో సత్కరించింది .

 

వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్  


Saturday, 14 June 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 86వ భాగం - జో లాలీ... లాలీ నా చిట్టి తల్లీ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఎనభైయయిదవ భాగం ఇక్కడ

86వ సజీవరాగం - జో లాలీ... లాలీ నా చిట్టి తల్లీ   

చిత్రం - ధర్మదాత
గానం - ఘంటసాల
రచన - సి.నా.రె.

సంగీతం - టి.చలపతిరావు

పల్లవి : 

జో లాలీ... జో లాలీ ...

లాలీ నా చిట్టి తల్లీ

లాలీ ననుగన్న తల్లీ

లాలీ బంగారు తల్లీ

లాలీ నా కల్పవల్లీ

జో లాలీ.... జో లాలీ...

చరణం 1:

చిరునవ్వు కిరణాలు

చిందించు మోము

కన్నీరు మున్నీరుగా చూడలేను-2

నిను గన్న నీ తల్లి కనుమూసె గానీ-2

నిను వీడి క్షణమైన నేనుండగలనా-2

                                                !జో లాలీ!

చరణం 2: 

రతనాల భవనాల నిన్నుంచలేను

ముత్యాల ఉయ్యాల లూగించలేను-2

కనుపాపలా నిన్ను కాపాడుకోనా-2

నిరుపేద ఒడిలోన నిను దాచుకోనా-2

                                                !జో లాలీ!

బంగారుతూగుటుయ్యాలలో మెత్తని పరుపుల మధ్య శయనించే కోటీశ్వరుల బిడ్డయినాపూరిగుడిసెలో లేదా ఆరుబయట చెట్టుకొమ్మలకు వేలాడదీసిన పాత చీర ఉయ్యాలలోని పేదవారి శిశువైనా ఆశించేది అమ్మ వెచ్చని ఒడిలో పరుండి చనుబాలు త్రాగడంమమతానురాగపూరితమైన కమ్మని జోలపాటలలో మైమరచి నిదురపోవడం. ఇంతకుమించిన వైభోగం మరేది ఆ పసిహృదయాలకు తృప్తిని కలిగించవు. అయితే అలాటి భాగ్యానికి నోచుకోని పసివారికి నాన్నే అమ్మ. అమ్మ ద్వారా పొందే  సకల ప్రేమాభిమానాలు ఆ తండ్రే పంచుతాడుఅన్ని సేవలు చేసి పెంచి పెద్దజేస్తాడు. పసివయసులోనే తల్లినిఅష్టైశ్వర్యాలను పోగొట్టుకొన్న తన ముగ్గురు బిడ్డలకు  తల్లిలేని కొఱతదీరుస్తూ  అన్నీ తానేగా వారిని  పెంచి పెద్దజేసే ఓ మమతానురాగమూర్తి గుడ్డ ఉయ్యాలలోని తన ఆఖరు బిడ్డనుద్దేశించి పాడే లాలి పాటే ఈనాటి మన సజీవ రాగం. 

ముల్లోకాలను సంరక్షించే దేవదేవునే పసిబిడ్డగా భావించి మధురమైన లాలిపాటలతో అలరించాడు మాతృహృదయంగల పరమభక్తుడు త్రాళ్ళపాక అన్నమాచార్యుడు. ఆ భక్తశిఖామణి పదకవితలే తప్ప ఆయన గాత్రమాధుర్యం ఎట్టిదో మనెవరికీ ఎఱుకలేదు. ఈ  తరంవారికి ఆ కొఱతను దీర్చిన అసలుసిసలు తెలుగు గాయకశిఖామణి ఘంటసాల. నవరసాలు నిండిన ఆ హృదయంలో అమృతతుల్యమైన మాతృత్వం కూడా నిండివుంది.  ఇందుకు నిదర్శనంగా ఆయన పాడిన 'శేషశైలావాసా', 'చిలిపి కృష్ణునితోని చేసేవు పోటీ', ఆయన స్వరకల్పనలోని 'ఏడుకొండలవాడా వెంకటా రమణ', 'తెల్లవార వచ్చె తెలియకనా సామి (మేలుకొలుపు), 'చినపాప లాలి, కనుపాప లాలి' వంటి పాటలను, కుంతీకుమారి పద్యాలుపాపాయి పద్యాలను చెప్పుకోవచ్చు. ఆ కోవలోకి చెందిన మరో మంచి పాట ' జో లాలీ.... లాలీ నా చిట్టి తల్లీ...'  

'ధర్మదాత' చిత్రంలో అక్కినేనివారికోసం ఘంటసాల ఆలపించిన ఆ మృదు మధుర గీతమే నేటి మన సజీవరాగం.

తాతినేని చలపతిరావు గారి సంగీతనేతృత్వంలో వెలువడిన ఒక సంగీతాణిముత్యం ' జో లాలి.... జో లాలీ.. లాలీ నా చిట్టితల్లీ...' డా.సి.నారాయణ రెడ్డిగారి సాహిత్యం. హృదయాలకు హత్తుకునే సరళమైన మాటలు. తన గత జీవిత వైభవాన్ని, ప్రస్తుత దుర్భర పేదరికాన్ని ఊయలలోని పసిపాపకు మాతృత్వం ఉట్టిపడేలా లాలిత్యంతో వర్ణించిన తీరు హృద్యంగా వుంటుంది. చలపతిరావు గారు శ్రీరాగంలో చేసిన ఈ లాలిపాటకు ఘంటసాల జీవంపోసారు. లాలిత్యం, మాధుర్యం నింపిన గళంతో ఘంటసాల ఈ పాటలో ఒక అమృత మాతృమూర్తిగా మనకు దర్శనమిస్తారు.

ఈ పాట వినగానే మధ్యమావతి రాగమేమో అనే భావన కలిగే అవకాశం లేకపోలేదు. మధ్యమావతి, శ్రీరాగం రెండింటికి ఆరోహణా క్రమం స్వరాలు ఒక్కటే. కానీ , శ్రీరాగం అవరోహణలో 'రిగరిస' అనే స్వరాలు అదనంగా వుండి మధ్యమావతి తో గల తేడాను చూపిస్తుంది. శ్రీ రాగంమధ్యమావతి రాగం - ఈ రెండూ ఖరహరప్రియ రాగ జన్యాలే కావడం వలన ఈ మూడు రాగాలలో చేసిన సినిమా పాటలు సాధారణ శ్రోతకు  ఒకేలా వినిపించే అవకాశం ఉంది. శ్రీరాగ మాధుర్యమంతా మన హృదయాలలో నిండేలా ఘంటసాల ఈ పాటను పాడారు. జో...జో లాలీ అనే పదాలను ఘంటసాల ఎంతో వేరియేషన్ తో చాలా సరళంగా లాలిత్యంతో ఆలపించారు.

'ధర్మదాత' సినీమాలోని తొమ్మది పాటల్లో ఏడు పాటలను (ఒక శ్లోకంతో సహా) ఘంటసాలగారే ఆలపించారు. ఈ చిత్రంలో అక్కినేని తండ్రీ కొడుకుల వేషాలలో ద్విపాత్రాభినయం చేశారు. తండ్రి పాత్ర సోలోలను, కొడుకు పాత్ర డ్యూయెట్లను ఘంటసాలగారే గానం చేసి అక్కినేనికి తనకు మధ్యగల రాగబంధాన్ని మరింత పటిష్టం చేశారు. ధర్మదాత చిత్రంలోని పాటలలో కొన్ని తమిళ వాసనలు కలిగివుండక తప్పలేదు. కారణం ఈ సినిమాకు మూలం శివాజీ గణేశన్ నటించిన తమిళ చిత్రం ' ఎంగ ఊరు రాజాఎమ్.ఎస్.విశ్వనాధన్ సంగీతంలోని ఆ పాటల వరసలే తెలుగులో కొన్ని పాటలకు ఉపయోగించడం జరిగింది. అయితే, ఈనాటి మన సజీవరాగం మాత్రం సంపూర్ణంగా తెలుగుగీతమే. ఈ గీతం తమిళంలో లేదు. చలపతిరావుగారు ఈ పాటను మనసుకు హత్తుకుపోయేలా స్వరపర్చారు. శ్రీరాగంలో చేసిన ఈ పాట కోసం  ఫ్లూట్, క్లారినెట్సితార్, పియోనావైయొలిన్స్తబలాడోలక్ వంటి వాద్యాలను ఉపయోగించారు.

తమిళంలో 'ఎంగ ఊరు రాజా' తెలుగులో ధర్మదాతై తర్వాత హిందీలో 'దిల్ కా రాజా' గా1972 లో దర్శనమిచ్చింది. రాజ్ కుమార్వహీదారెహ్మాన్లీనా చందవర్కర్ నటించిన ఈ చిత్రానికి ఆర్.డి.బర్మన్ సంగీతం నిర్వహించారు. మూడు భాషలలో విజయవంతంగా నడచిన సినిమా. ధర్మదాత తెలుగు వెర్షన్ అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకోవడమే కాక ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా సంపాదించుకున్నది. ఇందుకు చలపతిరావుగారి సంగీతం, ఘంటసాలగారి గానం, ఎ.ఎన్.ఆర్.గారి ద్విపాత్రాభినయం ఎంతో దోహదం చేశాయనే చెప్పాలి. 


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 


Saturday, 7 June 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 85వ భాగం - కరుణాలవాలా ఇది నీదు లీల

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఎనభైనాలుగవ భాగం ఇక్కడ

85వ సజీవరాగం - కరుణాలవాలా ఇది నీదు లీల   

చిత్రం - చెంచులక్ష్మి
గానం - ఘంటసాల
రచన - ఆరుద్ర

సంగీతం - ఎస్.రాజేశ్వరరావు

పల్లవి : 

కరుణాలవాలా ఇదు నీదు లీలా

అంతయును వింత పొగడగ నేనెంత -2

నీ మాయ కానంగలేరూ

వేయి నేత్రాలు ఉన్నను ఎవరూ -2

 

పరసతులను చెరపట్టే అంధుడు

అతడా సురలోకము పాలించే ఇంద్రుడూ

పదవిమీద ఆశచేత ప్రభువాయెను-2

 పశువూ పాపము తననేమి చేసె

కడుపులోని శిశువు ! కరుణాలవాలా!

 

బ్రహ్మ ఇచ్చిన వరములు తెచ్చెను

ఖర్మ - ఈ కర్మ దుష్కర్మనాపుట బ్రహ్మ విష్ణులా తరమా తరమా-2

నీపైన పాడగ చాలదొక నాలుకా-2 తాను తీసిన గోతి లోపల పడునే తానే

తపోశక్తిని జయించలేరు దైవమైనా పరదైవమైననూ - కరుణాలవాలా!

 

ఏడేడు లోకాల ఏలికా

నీవు తలచిన చాలు మేరువే అణువు

నీ చేతిలో గలదు అందరి పరువు

ఆ..........

మహిమన్నది నీదేనులే

ఏమైన దైవమన నీవేనులే

 

శ్రీహరియే నటనసూత్రధారీ

కాని ప్రవేశించు కొత్త పాత్రధారి-2

ఇది నీవాడించుచున్న నాటకము

ఇక నుండదు వింతలకే కాటకము -2

                                        !కరుణాలవాలా!

 

అధినాధుని పత్ని కూడ విధికి బానిసే-2

జీవపథము మారిపోవునపుడు చిత్రహింసయే

పాలకడలిలోన పుట్టి వైకుంఠము మెట్టి..

ఆ... ఆ... ఆ.. -!పాలకడలి!

నేలపాలు అయినావా నేటికి

మహలక్ష్మీ నేటికి మహలక్ష్మీ

                                        !కరుణాలవాలా!

 

మహాశక్తివంతులైనా నిజం తెలియలేరయ్యో నిజం తెలియలేరే

నీ మాయలరయలేరే

నరహరి రూప నారాయణ

జయ నారాయణ హరి నారాయణ

నీరు పల్లమెరుగు ఎపుడు

నిజం తెలుసు నీకే ! నీరు!

నరహరి రూప నారాయణ జయ

నారాయణ హరి నారాయణ-2

కాంత చేతిలోపల ఏ మంత్రమున్నదో-2

ఎంత భీకరుండైన శాంతమొంది తీరునే

ఇంతికంటి చూపుకి ఇనుమైనా కరగునని 

అంత ఉగ్రమూర్తివి ఇటుల మారినాడవా

                                        !కరుణాలవాలా!

 'ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం' ధారావాహికలో ఈనాటిది 85వ సజీవరాగం.

గతంలో ఒకటి రెండుసార్లు మనవి చేశానుఈ గీత విశ్లేషణ ద్వారా ఏదో ఒక విశిష్ట శైలిని, ఉన్నత భావజాలాన్నిభాషా పటిమనిరచనా చమత్కృతిని ఎక్కువగా ఆశించవద్దని. ఘంటసాల గానమాధుర్యంఘంటసాల సంగీతం పట్ల గల భక్తిఆరాధనలతో ఈ శీర్షికను ప్రారంభించడం జరిగింది. తెలుగు భాష మీద సాధికారంభావప్రకటనలో కావలసినంత వైశాల్యం లేకపోవడం వలన నా యీ వ్యాసాలలోని పదజాలంభావాలు పునరావృతం అవుతూంటాయి. చెప్పింది చెప్పకుండా చెప్పుకు రావడం (ఇదీ భావ చౌర్యమే) నా శక్తికి మించిన కార్యంగా అనిపిస్తోంది. క్షంతవ్యుడిని.

మన తెలుగు భాష అతి ప్రాచీనమైనది, బహు సుందరమైనది, అంతకంటే అత్యంత ఉన్నతమైనది కూడా. తెలుగు భాష సౌందర్యాన్ని భాసిల్లజేసే అనేక అంశాలలో ప్రధానమైనది అలంకార శాస్త్రమనే చెప్పాలి. కవుల భావప్రకటనకురచనా చమత్కృతికి దోహదం చేసే ప్రాస ప్రయోగ విశేషాలు ఈ అలంకార శాస్త్రం నేర్పుతుంది. వీటిలో 'అంత్యప్రాసాలంకారము' బహుళ ప్రచారంలో వుంది. 18 వ శతాబ్దానికి చెందిన కూచిమంచి జగ్గకవి అంత్యప్రాసలతో కవితలల్లడంలో నిష్ణాతుడని ఆయన వ్రాసిన 'భక్తమందార శతకం' లోని పద్యాలు విశదీకరిస్తాయి. ఆధునికాంధ్ర కవులెందరో  అంత్యప్రాసలతో రసస్ఫూర్తిని కలిగిస్తూ అర్ధవంతమైన కవిత్వాన్ని వెలువరించి సాహితీలోకంలో మన్ననలు పొందుతున్నారు. పులిని చూసి వాతలు పెట్టుకునే నక్కల్లాటి కుహానా కవులెందరో ప్రాస కవిత్వం  పేరిట తెలుగుభాషను ధ్వంసం చేస్తున్నారు. డబ్బాలో గులకరాళ్ళలా రసవిహీనమైన తమ ఊకదంపుడు మాటలతో పామరులను ఆకర్షించి కవులుగా చెలామణి అవుతున్నారు. అయినా ఎప్పటికి అసలు అసలేనకిలి నకిలీయే.

గత తరం  కవులలో విభిన్న ప్రక్రియలలో  ఉత్తమ సాహిత్యాన్ని వెలువరించిన లబ్దప్రతిష్టుడు ఆరుద్రగారు.  అంత్యప్రాసలతో కవితలల్లడంలో బహు నిష్ణాతుడు. ముందుగా సాహితీలోకంలో  కవిగా ప్రసిధ్ధుడై తర్వాత సినీ గీత రచయిత గా తనదైన ప్రత్యేక ముద్రతో సినీ శ్రోతలను అమితంగా ఆకర్షించారు. ఆరుద్ర అంత్యప్రాసల తో తెలుగు ప్రేక్షకులందరినీ అలరించిన 'కరుణాలవాలా ఇది నీదు లీల

అంతయును వింత పొగడగ నేనెంతఅనే 'చెంచులక్ష్మి' సినిమాలోని ఘంటసాల మధురగీతమే నేటి మన సజీవరాగం.

బ్రహ్మ మానసపుత్రుడైన నారదుడు మహాజ్ఞాని, సదా హరినామ స్మరణంతో లోక సంచారం చేస్తూ ముల్లోకాలలో జరిగే సమాచారాన్నంతా చేర్చవలసిన చోట చేర్చవలసిన విధంగా చేరుస్తూ కలహాలకు కయ్యాలకు కారకుడవుతూంటాడు. కలహభోజుడిగా పేరుపొందిన నారదుడు సృష్టించే తగవులు, తంటాలు లోకకళ్యాణంతో ముగుస్తాయి. అటువంటి నారదుడు మహారాక్షసులులోకకంటకులైన హిరణ్యాక్షహిరణ్యకశిప సోదరులకు సంబంధించి  ఆది నుండి అంతం వరకు వివిధ సందర్భాలలో  జరిగిన అనేక ఘట్టాల ప్రత్యక్ష వ్యాఖ్యానమే నేటి మన సజీవరాగం. బ్రహ్మరుద్రుల వర ప్రభావంతో ముల్లోకాలను అగ్గగ్గలాడించే అసురులను మట్టుబెట్టి దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసే ప్రధాన సూత్రధారి శ్రీమహావిష్ణువు లీలలను చక్కటి సాహితీ విలువలతో చాలా రసవత్తరంగా ఓ రెండు గీతాలలో వర్ణించారు కవి ఆరుద్ర. అవే 'నీల గగన ఘనశ్యామా', మరియు,'కరుణాలవాలా ఇదు నీదు లీల అనే సుదీర్ఘ గీతాలు. ఈ రెండు గీతాలను నారద పాత్రధారి రేలంగి కోసం ఘంటసాల మధురాతి మధురంగా ఆలపించారు. సినీమా పొడుగునా అక్కడక్కడ వివిధ సందర్భాలలో నారద పాత్ర ద్వారా వినపడే అతి పెద్ద గీతం. ఈ పాటలో ఆరుద్రగారు మహదానందంగా అంత్యప్రాసలతో ఆటలాడుకున్నారనిపిస్తుంది.

'వాలా - లీలా'; 'వింత -'ఎంత'; 'కానంగలేరూ-ఎవరూ'; 'అంధుడు-ఇంద్రుడు'; 'పశువు-శిశువు'; 'ఏలికా-నాలుకా'; 'సూత్రధారి-పాత్రధారి; 'నాటకము-కాటకము'; 'పుట్టి-మెట్టివంటి పదాలను చాలా అర్ధవంతంగా

మరింత సమర్ధవంతంగా ప్రయోగించారు ఆరుద్రకవి. అలాగే, బ్రహ్మ ఇచ్చిన వరములు చరణంలో   ఖర్మ- కర్మ- దుష్కర్మ అనే పదప్రయోగంలో ; ' ఏడేడు లోకాల ఏలికా నీపైన పాడగ చాలదొక నాలుకా';

అధినాధుని పత్ని కూడ విధికి బానిసే'; 'పాలకడలిలో పుట్టి వైకుంఠము మెట్టి నేలపాలు అయినావా' 'ఇంతికంటి చూపుకి ఇనుమైనా కరుగునే' వంటి పద ప్రయోగాలు ఆరుద్రగారి విజ్ఞతకు, భాష మీద గల పట్టుకు మచ్చుతునకలు.

సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావుగారు చెంచులక్ష్మి చిత్రాన్ని తన సుశ్రావ్య సంగీతంతో సుసంపన్నం చేశారు. ఈ సినిమా లోని దాదాపు ముఫ్ఫై పాటలు పద్యాల గానంలో  సింహభాగం ఘంటసాలవారిదే ఓ పదిహేను పద్యాలు పాటలవరకు ఘంటసాలగారు పాడినవే. మహావిష్ణువు/చెంచు యువకుడుగా నటించిన అక్కినేని వారి పాటలకునారద పాత్రధారి రేలంగి పాటలుపద్యాలకు మధ్య గల వైవిధ్యాన్ని అనితరసాధ్యంగా పోషించారు గంధర్వగాయక ఘంటసాల. నారద పాత్రధారి గానం చేసిన రెండు గీతాలలో మొదటిదైన 'నీలగగన ఘనశ్యామా' పాటను బెహాగ్ రాగంలోరెండవ పాటయైన 'కరుణాలవాలా' పాటను మోహన-కళ్యాణి రాగంలోనూ రాజేశ్వరరావుగారు స్వరపర్చారు. పాట వినగానే ఇది బిలహరి రాగమే అని అనిపించినా బిలహరి రాగంలో లేని ప్రతిమధ్యమం ఈ పాటలో అస్పష్టంగా వినవస్తున్నందున ఈ పాట మోహన-కళ్యాణి రాగంలోనే స్వరపర్చారనుకోవడం సముచితమే. సంప్రదాయరీత్యా అది ఏ రాగమైనా ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా సజీవరాగం గా నిలిచి సంగీతాభిమానుల వీనులకు విందు చేస్తూనే వుంది.

చెంచులక్ష్మి లోని పాటలను ఆరుద్రసదాశివ బ్రహ్మంకొసరాజు వ్రాయగా పద్యాలను మాత్రం బమ్మెర పోతనామాత్యుల మహాభాగవతం నుండి తీసుకున్నారు. ఈ పాటలను ఘంటసాలపి.బి.శ్రీనివాస్, మాధవపెద్ది (ఎస్.వి.రంగారావు-హిరణ్యకశిపుడు)పి.సుశీలజిక్కి, కోమల పాడారు. చెంచులక్ష్మి సినిమా కోసం పి.బి.శ్రీనివాస్, పి.సుశీల పాడిన రెండు యుగళగీతాలు గ్రామఫోన్ రికార్డ్ లలో తప్ప సినిమాలో ఉపయోగించలేదు. సినిమాలో  ఘంటసాల జిక్కి పాడినవి మాత్రమే ప్రచారంలోకి వచ్చాయి.

అక్కినేనిఅంజలీదేవి, ఎస్.వి.రంగారావు, రేలంగిపుష్పవల్లిమాస్టర్ బాబ్జి నటించిన ఈ పౌరాణిక చిత్రరాజం ఆనాడు తెలుగునాట విజయదుందుభులు మ్రోగించి పెద్ద సంచలనమే సృష్టించడానికి ప్రధాన కారణం సాలూరు రాజేశ్వరరావుగారి సుమధుర సంగీతం, ఘంటసాలవారి సుశ్రావ్య గానమేనని చెప్పక తప్పదు.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 



ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...