Saturday, 31 May 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 84వ భాగం - టా...టా... వీడుకోలు గుడ్ బై! ఇంక శెలవు...

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఎనభైమూడవ భాగం ఇక్కడ

84వ సజీవరాగం - టా...టా... వీడుకోలు గుడ్ బై! ఇంక శెలవు...   

చిత్రం - బుద్ధిమంతుడు
గానం - ఘంటసాల
రచన - ఆరుద్ర

సంగీతం - కె.వి.మహాదేవన్

పల్లవి : 

'టా..టా.. వీడుకోలు

గుడ్ బై ... ఇంక శెలవు...  2

తొలినాటి స్నేహితులారా!

చెలరేగే కోరికలారా! హోయ్ 

తొలినాటి... 

                                టా...టా...

 

చరణం 1:

ప్రియురాలి వలపులకన్నా

నునువెచ్చనిదేదీ లేదని - 2

నిన్నను నాకు తెలిసింది

ఒక చిన్నది నాకు తెలిపింది

ఆ ప్రేమ నగరుకే 

పోతాను...పోతాను... పోతాను...

పోతాను ఈ కామనగరుకు 

రాను ఇక రాను... 

                                    టా...టా...

చరణం 2:

ఇచ్చుటలో వున్న హాయి వేరెచ్చెటనూ లేనేలేదని  - 2

లేటుగ తెలుసుకున్నాను నా లోటును దిద్దుకున్నాను

ఆ స్నేహ నగరుకే పోతాను.. పోతాను..

పోతాను ఈ మోహ నగరుకు రాను ఇక రాను...  

                                    టా...టా...

చరణం 3: 

మధుపాత్ర కెదలో యింక ఏ మాత్రం చోటు లేదని - 2

మనసైన పిల్లే చెప్పింది -2

నా మనసంతా తానై నిండింది -2

నే రాగ నగరుకే పోతాను

అనురాగ నగరుకే పోతాను

హు..హు..హు.. పోతాను ఊ..హ్హా !

ఏ మనిషి స్వతహగా చెడ్డవాడు కాదు. పరిసరాలు, కుటుంబవాతావరణం,యితర సావాసాల ప్రాబల్యంతో చెడు అలవాట్లకు బానిసౌతాడు. వాటిబారినుండి అతనిని కాపాడడానికి తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎంత ప్రయత్నించినా వారి హితవు అతనికి చేదుగానే వుంటుంది. రక్తసంబంధీకులుఆత్మీయులంతా విరోధులుగా కనిపిస్తారు. అటువంటి సమయాలలో ఏదో ఒక బలమైన ఆకర్షణతో అతను తన దురలవాట్లకు స్వస్తి పలికి సన్మార్గంలో పయనించాలని ఆశిస్తాడు, కానీ అది అంత సులభమా? కాదే! తనకు ఆనందాన్ని కలిగించే చెడు పరిసరాలు,మిత్రుల దుష్ప్రభావంతో మరింత బురదలో కూరుకుపోయి సమస్యల వలయంలో చిక్కుకుంటాడు.

ఒక అందమైన యువతి గుణగణాలకు ఆకర్షితుడై  చెడు సావాసాలకు దూరం కావాలని అశిస్తూ  మంచి హృదయం గల యువకుడు కడసారిగా మిత్రుల బలవంతం మీద మధుపానం చేస్తూ ఆ మత్తులో  తన మనోభావాలు వెల్లడిస్తూ పాడే పాటే నేటి మన సజీవరాగం. అదే ... 'టా...టా... వీడుకోలు గుడ్ బై... ఇంక శెలవు' ఘంటసాల మాస్టారి ఆపాతమధుర గీతం.

పరాయి భాషా పదాలతో ఆటలాడుకుంటూ కవితలల్లడం ఆరుద్రగారికి అలవాటే.  'టాటా , గుడ్ బై' అనే ఆంగ్ల పదాలతో పల్లవి మొదలెట్టి  చెడుమార్గం పట్టే నవతరం యువకులకు ఈ పాట ద్వారా మంచి స్ఫూర్తిని అందించారు. ఇంటనున్న తల్లిఅన్నగారు ఎంత మొత్తుకున్నా విననివాడు మనసైన పిల్ల చెప్పిందని మధుపాత్రకు, చెలరేగే కోరికల వంటి మిత్రులను శాశ్వతంగా వదలుకోవడానికి సిధ్ధపడ్డాడంటే ప్రేమెంత తీవ్రమైనదోబలమైనదో తెలుస్తుంది.

ఆరుద్రగారు ఈ పాటలో 'ప్రేమనగరు', 'స్నేహనగరు', 'రాగనగరు', 'అనురాగనగరువంటి మాటలను సద్భావాలకు'కామనగరు','మోహనగరు' వంటి పదాలను విరుధ్ధభావాలకు అన్వయిస్తూ వ్రాసారు. అలాగే, ఇంగ్లీష్  లోని  'లేటు'ను, తెలుగులోని 'లోటు'ను కలిపి 'లేటుగ తెలుసుకున్నాను' 'నా లోటును దిద్దుకున్నాను' అనే పద ప్రయోగం ఆరుద్రగారి రచనా శైలికి నిదర్శనంగా నిలబడుతుంది.

ఆరుద్రగారి ఈ మందు పాటను 'మామ' మహాదేవన్ భైరవి రాగ స్వరాలతో కంపోజ్ చేశారు. హిందుస్థానీ శైలిలోని భైరవి అంటే కర్ణాటక సంగీత సంప్రదాయంలో అది హనుమత్తోడి అనబడే తోడి రాగం.  స్వరాలు రెండు శైలులలో సమానమే అయినా  రాగ గమకాలలోని తేడాలవలన భైరవి, తోడి వేర్వేరు రాగాలనే భావన కలిగిస్తాయి. కె.వి.మహాదేవన్ వాద్య నిర్వహణ చాలా విలక్షణంగా వుంటుంది. అకార్డియన్, ఫ్లూట్సాక్సోఫోన్వైయొలిన్స్, బాంగోస్ వంటి వివిధ రకాల వాద్యాల సహకారంతో పాశ్చాత్య సంగీతం లో 'ఫ్రిజియన్ మోడ్' అనబడే హిందుస్థానీ భైరవి రాగ స్వరాల సమ్మిళితమైన  ఈ మందుపాటను  తెర వెనుక  ఘంటసాలగారు, తెరమీద అక్కినేని గారు పరిపూర్ణంగా అనుభవిస్తూ, అభినయిస్తూ రసికులకు పరమానందం కలిగిస్తూ సన్నివేశానికి జీవంపోసారు.

బుధ్ధిమంతుడు చిత్రంలో అన్నీ మంచి పాటలే. మొత్తం ఎనిమిది పాటల్లో ఆరు పాటలను ఘంటసాలగారే (ఐదు సోలోలు, ఒక డ్యూయెట్) పాడి అక్కినేని సినీ విజయాలలో తనకూ తగిన భాగస్వామ్యం వుందని నిరూపించారు. చెడు సావాసాలకు అలవాటు పడిన అక్కినేని ని తీర్చిదిద్దిన మనోహరిణిగా విజయనిర్మల, సదాచార సంపన్నుడైన పూజారి  మాధవాచారిగా, తమ్ముడు గోపిగా అక్కినేని (ద్విపాత్రాభినయం) సనాతనాపరుడైన మాధవాచార్య  భ్రమలలో కనిపించే శ్రీకృష్ణ పరమాత్మగా శోభన్ బాబు, గుమ్మడి, దుర్మార్గులకు ప్రతీకలుగా కృష్ణంరాజునాగభూషణం, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం మొదలగువారు 'బుధ్ధిమంతుడుచిత్ర విజయానికి   సంపూర్ణంగా దోహదం చేశారు.

మంచి చెడుల ఘర్షణ, ఆస్తికత, నాస్తికత ల మధ్య సంఘర్షణ ఈ 'బుధ్ధిమంతుడు' సినిమా ప్రధానాంశాలు. బాపురమణల మేధోమథన ఫలితం 'బుధ్ధిమంతుడుఅయితే ఇందులో బుధ్ధిమంతుడు ఎవరు? పరమ సనాతనాపరుడై చివరకు కాలమాన పరిస్థితులకు తలొగ్గిన మాధవాచారా? లేక అన్నగారి మీది గౌరవంతో విపత్కర పరిస్థితులు నుండి రక్షించ ప్రయత్నించిన గోపి బుధ్ధిమంతుడాక్లైమాక్స్ విషయంలో ఇదమిధ్ధమైన నిర్ణయం తీసుకోకుండా బాపు రమణలు కొంత సంకోచత్వాన్ని ప్రదర్శించినట్లు అనిపిస్తుంది.

'బుధ్ధిమంతుడు' చిత్రవిజయం తమిళహిందీభాషలలో ఈ చిత్ర పునర్నిర్మాణానికి కారణమయింది. 1975లో తమిళంలో 'మణిదనుం దైవమాగలాం' గా వచ్చింది. 1995లో బాపు దర్శకత్వంలోనే హిందీలో 'పరమాత్మ' గా రూపొందింది.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 


Saturday, 24 May 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 83వ భాగం - విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఎనభైరెండవ భాగం ఇక్కడ

83వ సజీవరాగం - విరిసిన వెన్నెలవో  పిలిచిన కోయిలవో    

చిత్రం - బందిపోటు దొంగలు
గానం - ఘంటసాల
రచన - దాశరధి

సంగీతం - పెండ్యాల

పల్లవి : 

విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో

తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో

                                                !విరిసిన!

చరణం 1: 

సిగలో గల జాబిల్లి చిరునగవులు చిందగా ఆ... - 2

అడుగడుగున హంసలూ వొయ్యారములొలుకగా

వెదికే పెదవులతో తొణికే మధువులతో - 2

పొందుగోరి చెంతజేరి  మురిపించే  నా చెలీ

                                                            !విరిసిన!

చరణం 2: 

కరుణలేని శిలనైనా కరిగించే నవ్వుతో ఓ... - 2

ముల్లునైన మల్లియగా మలచే కనుదోయితో ...

నడిచే తీవియవై  పలికే దీపికవై -2

అవతరించి ఆవరించి అలరించే నా చెలీ

                                                            !విరిసిన!

దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వర ప్రసాదం అందం. ప్రకృతిలోని అందంస్త్రీ పురుషులలోని అందం మనసుకు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. 'A thing of beauty is a joy for ever' అని అంటాడు సుప్రసిద్ధ ఆంగ్ల కవి జాన్ కీట్స్. సౌందర్య శాస్త్రంలో ప్రధాన అంశం అందమే. స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణను కలిగించి వారిలో ప్రేమభావనలను ప్రేరేపించేది నిశ్చయంగా అందమే. ఏది అందం అన్నదానికి సరైన నిర్వచనం ఎవరూ చెప్పలేరు. అది మనిషి మనిషికి వారి వారి తత్త్వాన్ని బట్టి మారుతుందనే చెప్పాలి. ఆది కాలం నుండి కవులకు, గాయకులకు  గొప్ప కవితా వస్తువు స్త్రీ అందమే. స్త్రీ సౌందర్యాన్ని వర్ణిస్తూ వెలువడిన కవితలు, వాటి ఆధారంగా రూపొందించబడిన గీతాలు అసంఖ్యాకం. అందమైన స్త్రీని చూడగానే ఆమెను ఆపాదమస్తకం ఉత్తమోత్తమ విశేషణాలతో వర్ణించాలనే ఆకాంక్ష ప్రతీ వ్యక్తిలో అంతో ఇంతో వుంటుంది. 

'బందిపోటు దొంగలు' అనే  సినిమాలో కథానాయిక అందానికి ముగ్ధుడైన కథానాయకుని మనోభావాలే ఘంటసాలవారి మధురస్వరంలో సజీవరాగమై 'విరిసే వెన్నెలవో పిలిచిన కోయిలవో తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో'  అనే పాటగా తెలుగు సినీ సంగీతాభిమానులను అలరిస్తూన్నది. కథానాయకునికి ఆ యువతి అపరిచిత కాదు. వారిలో ఏ భావనలు లేనప్పుడు పలు సందర్భాల్లో కలుసుకోవడం జరుగుతుంది.  క్రమేపీ పరస్పర ప్రేమానురాగాలు పెరిగాక ఒక ఫంక్షన్ లో  ఆ యువతిని చూసినప్పుడు  ఆమెలోని కొత్త అందాలేవో అతని చేత 'ఓ చెలీ చెలీ నీవెవరో' అంటూ పాడిస్తాయి.  శృంగార గీత రచనలో ఆరితేరిన  మధురకవి దాశరధిగారు ఈ పాటలో ' విరిసిన వెన్నెల ', 'పిలిచిన కోయిల', ' తీయని కోరిక',' సిగలో జాబిల్లి', అడుగడుగున హంసల వయ్యారం', 'ముల్లునైన మల్లియగా మలచే కనుదోయి', 'పలికే దీపిక' నడిచే తీవెఅంటూ  ఆ యువతి అందాన్ని మెచ్చుకోలుగా వర్ణిస్తారు. శ్రావ్యతకు మారుపేరైన ఘంటసాలగారు ఈ పాటను అత్యంత మృదుమధురంగా ఆలపించారు. ఇక ఇలాటి శృంగార గీతాలను అభినయించడంలో ఎ.ఎన్.ఆర్. ను మించినవారెవరుసాత్వికంగా, సున్నితమైన హావభావాలతో  అక్కినేని ఈ పియోనా పాటను చాలా సహజంగా రక్తి కట్టించారు. సినిమాలో ఇదొక కీలకమైన ఘట్టం కావడం వల్ల ఈ పార్టీ సన్నివేశంలో ఎ.ఎన్.ఆర్. తో పాటు కథానాయిక జమున, బందిపోటు దొంగల నాయకుడు జగ్గయ్య, కె.వి.చలం, గుమ్మడి, ప్రభాకరరెడ్డి, రాజబాబు,నాగభూషణం ఇత్యాది ప్రముఖ తారాగణమంతా కనిపిస్తారు. 

పల్లవిచరణాల మధ్య వచ్చే ఆలాపనల మీది సంగతులు, గమకాలు తనకు మాత్రమే సాధ్యం, సొంతం అనే రీతిలో ప్రేక్షక హృదయాలను తాకుతూ అతి శ్రావ్యంగా ఘంటసాల మాస్టారు గానం చేశారు. పియోనావైయొలిన్స్, సెల్లోతబలాడోలక్ లు ప్రధాన వాద్యాలు గల ఈ మెలడీని కీరవాణి, సింధుభైరవి రాగ స్వరాల మిక్స్ తో మనోహరంగా మలచారు సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు. కీరవాణి కర్నాటక సంగీతంలో 21వ మేళకర్త రాగం. వెస్ట్రన్ మ్యూజిక్ సిస్టమ్ లో దీనిని 'హార్మోనిక్ మైనర్ స్కేల్' అని అంటారు. అందువల్లనే ఈ స్వరాలు ఈ పియోనా పాటకు చాలా అనువుగా అమరి ఘంటసాలగారి గళం నుండి వీనులవిందు చేశాయి. 

'బందిపోటు దొంగలు' వంటి ఏక్షన్ సినిమాలో ఇలాటి మంచి పాట చోటు చేసుకుందంటే అందుకు కారణం పెండ్యాల, ఘంటసాల,అక్కినేని, జమునల కాంబినేషన్ వల్లనేనని చెప్పకతప్పదు. 'పాండవ వనవాసం' వంటి భారీ పౌరాణిక చిత్రం నిర్మించిన ఏ.ఎస్.ఆర్ ఆంజనేయులు సమర్పణలో వచ్చిన ఈ సినిమాను కె.ఎస్.ప్రకాశరావు డైరక్ట్ చేశారు.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

Saturday, 17 May 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 82వ భాగం - నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఎనభైయొకటవ భాగం ఇక్కడ

82వ సజీవరాగం - నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే       

చిత్రం - మూగనోము
గానం - ఘంటసాల
రచన - దాశరధి

సంగీతం - ఆర్. గోవర్ధనం

పల్లవి : 

'నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే

పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే

                                            !నిజమైనా!

చరణం 1:

పదే పదే ఎవరినో పరాకుగా పిలిచేవు

నా నీడే తోడై జగమంతా తిరిగేను 

                                            !నిజమైనా!

చరణం 2:

గులాబినై నీ జడలో మురిసానే ఆనాడు

బికారినై నీకోసం వెతికానే ఈనాడు 

                                            !నిజమైనా!

చరణం 3: 

చెలీ చెలీ నా మదిలో చితులెన్నో రగిలేను

చెలి లేని నాకేమో విషాదమే మిగిలేను 

                                            !నిజమైనా!

ఎడారిలో ఒకటేలే ఒకటేలే....

మనిషి ఆశాజీవి. జీవితమంతా ఆశలతోనే సతమతమవుతూ  వాటిని నెరవేర్చుకోవడం అహర్నిశలు కృషిచేస్తూనేవుంటాడు. ఆ ఆశలో నుండే నిరాశ కూడా ఏర్పడుతుంది. ఆశించినవి సఫలం కాకపోతే మిగిలేది నిరాశే. ఈ ఆశనిరాశ రెండూ మానసికస్థితులే. మితిమీరిన ఆశ, నిరాశ రెండూ మనిషి పురోభివృద్ధికి నిరోధకాలే. వీటిని అధిగమించి ముందుకుసాగాలంటే బుధ్ధిని సక్రమరీతిలో ఉపయోగించాలి. మనుషులలో రెండు రకాలవారు - బుధ్ధికారకులు, మనసుకారకులు. బుధ్ధికారకులు వివేకంతోవిచక్షణాజ్ఞానంతో సమతుల్యంగా వుంటే మనసుకారకులు అత్యధిక భావోద్వేగాలతోమానసికోద్రేకాలతో ప్రతీ చిన్న విషయానికీ విపరీతంగా చలించిపోతారు. ఇలాటివారే ఎక్కువగా నిరాశా నిస్పృహలకు గురియై తీవ్రంగా బాధపడుతూంటారు. ఇలాటి నిరాశా నిస్పృహలు వర్తక వ్యాపారాలలోని వైఫల్యాలవలన లేదా ఆర్ధిక సంబంధ కష్ట నష్టాల వలన బాధపడేవారికంటే  ప్రేమ సంబంధిత వ్యవహారాలలో విఫలమైనవారిలోనే తీవ్రస్థాయిలో కనిపిస్తాయి. 

నడి ఎడారిలో వున్నవారికి తమ గమ్యం కడు దూరం కనుక  రేయింబగళ్ళతో పనిలేదు. అలాగే నిరాశలో మునిగితేలే వారు  నిజమైనా కలయైనా ఒకటే అనే భావనలో వుంటారు. అలా ప్రేమలో విఫలమైన ఒక భగ్న ప్రేమికుడి మనోగతమే నేటి మన సజీవరాగం.

అదే ఘంటసాలగారు మృదుమధురంగా, ఆవేదనాభరితంగా ఆలపించిన దాశరధిగారి 'నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే'. 

ఈ భగ్నప్రేమికుడు ఒక ధనవంతుని కొడుకు. ఒక పేదరైతు కూతురిని ప్రేమించి రహస్యంగా పెళ్ళాడుతాడు. ఈ విషయం తెలిసిన ఆ ధనవంతుడు పై చదువుల పేరిట కొడుకును విదేశాలకు పంపితన పరువుప్రతిష్టలకు భంగకరమైన గర్భవతి కోడలు దగ్గర  బలవంతంగా ప్రమాణం చేయించుకొని ఆ కుటుంబాన్ని ఆ ఊరినుండి సాగనంపుతాడు. తర్వాత విదేశాల నుండి తిరిగివచ్చిన కొడుకుకు అతని భార్యమీద అభాండాలు వేసి అతని మనసు విరిచేస్తారు. భార్య శీలాన్ని శంకించిన కథానాయకుడు త్రాగుడుకు అలవాటు పడి భార్య ఎడబాటు వల్ల కలిగిన నైరాశ్యంతో ఒంటరిగా తిరుగుతూ 'ఒకనాడు  ప్రేయసి జడలో గులాబినై మురిసిన తాను ఈనాడు బికారిలా ఆమె కోసం వెతుకులాడుతున్నానని'... 'నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే' అని పాడుతూ తన మనోవేదనను వ్యక్తం చేస్తాడు.

కథా సన్నివేశానికి పరిపుష్టి కలిగించే మాటలతో దాశరధిగారు వ్రాసిన ఈ సందర్భోచిత గీతానికి  హరికాంభోజి స్వరాలతో హృదయాలకు హత్తుకుపోయేలా ఒక చక్కటి పాటను మలిచారు సంగీత దర్శకుడు ఆర్.గోవర్ధనం. హరికాంభోజి రాగం కర్నాటక సంగీతంలో 28వ మేళకర్త కాక అత్యంత ప్రాచీనమైనది కూడా. ఖమాస్, యదుకుల కాంభోజినాటకురంజిశహన వంటివి ఎన్నో ఈ హరికాంభోజికి జన్యరాగాలుగా ప్రసిద్ధి చెందివున్నాయి.

గత ఐదు దశాబ్దాలుగా సజీవమై నిలచిన  ఈ నైరాశ్యగీతాన్ని ఘంటసాల మాస్టారు ఎంతో భావయుక్తంగా, సన్నివేశానికి కావలసిన విషాదాన్ని, గాంభీర్యాన్ని తన గొంతుకలో పలికిస్తూ  అతి సునాయాసంగా  ఆలపించారు.

'మూగనోము' సినిమాలో వున్న ఏడు పాటల్లో నాలుగు పాటలు ఘంటసాలగారు పాడినవే. రెండు సోలోలు, రెండు డ్యూయెట్ లు. అన్ని పాటలకు  మంచి శ్రావ్యమైన వరసలను కూర్చారు గోవర్ధనం. ఘంటసాల, సుశీల గానం చేసిన ఈ మనోజ్ఞగీతాలకు తెరపై అక్కినేని, జమున తమ నటనతో సజీవత్వం కల్పించారు. డి.యోగానంద్, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరూ చాలా అనుభవజ్ఞులైన కళాకారులే. వీరిద్దరి కాంబినేషన్లో  వచ్చిన చాలా కొద్ది సినీమాలలో ' మూగనోము' ఒకటి దీనిని ఎ.వి.ఎమ్.ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎ.వి.మెయ్యప్ప చెట్టియార్ వారసులు మురుగన్, శరవణన్కుమరన్, బాలసుబ్రహ్మణ్యన్గుహన్  ఈ సినిమాను నిర్మించారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ నిర్మాతలందరి పేర్లు ఒక్క దేవుడికి సంబంధించినవే. ఈ పేర్లన్నీ శివుని కుమారుడైన కార్తికేయుడు లేదా షణ్ముఖునికి చెందిన నామాలే.

ఇదే ఎ.వి.ఎమ్.ప్రొడక్షన్స్ వారు 1960లో ఎ.భీమ్ సింగ్ డైరెక్టర్ గాసావిత్రి, జెమినీ గణేశన్ నాయికా నాయకులుగా 'కళత్తూర్ కణ్ణమ్మ' అనే తమిళం సినీమా తీసారు. ఆర్.గోవర్ధనం సోదరుడు ఆర్.సుదర్శనం సంగీతం నిర్వహించారు. సుప్రసిద్ధ బహుభాషా చిత్ర కథానాయకుడు, నిర్మాత, దర్శకుడు, రాజకీయవేత్త అయిన  కమలహాసన్ బాలనటుడిగా పరిచయం చేయబడిన సినిమా. ఆ సినిమాయే 1969లో అదే సంస్థ ద్వారా 'మూగనోము' గా తెలుగులో రీమేక్ చేయబడింది. తమిళంలో కమలహాసన్ నటించిన పాత్రను తెలుగులో మాస్టర్ బ్రహ్మాజీ పోషించాడు.

వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 



Saturday, 10 May 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 81వ భాగం - వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
ఎనభైయవ భాగం ఇక్కడ

81వ సజీవరాగం - వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా       

చిత్రం - గోవుల గోపన్న
గానం - ఘంటసాల
రచన - కొసరాజు

సంగీతం - 
ఘంటసాల

పల్లవి : 

ఓ...ఓ...ఓ.... వినరా వినరా నరుడా

తెలుసుకోర పామరుడా ! - 2.

గోమాతను నేనేరా ! నాతో సరిపోలవురా 

                                            !వినరా!

కల్లాకపటం ఎరుగని గంగీగోవును నేను

ఏది చెప్పినా కాదని ఎదురుచెప్పలేను

పారేసిన గడ్డితిని బ్రతుకు గడుపుతున్నాను

పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను 

                                            !వినరా! 

కమ్మనైన గుమ్మపాలు కడవలతో ఇస్తున్నా 

నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా

వయస్సుడిగిన నాడు నన్ను

కటికవాని పాల్జేస్తే - !వయస్సు!

ఉసురు గోల్పోయి మీకే ఉపయోగిస్తున్నాను 

                                            !వినరా!

నా బిడ్డలు భూమిచీల్చి దుక్కి దున్నుతున్నవోయి

నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయి

నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయి - 2

నా ఒళ్ళే ఢంకాలకు నాదము పుట్టించునోయి 

                                            !వినరా!

 నమో దేవ్యై మహా దేవ్యై

 సురాభయైచ నమో నమః

గవాంబీజ స్వరూపాయ

నమస్తే జగదంబికే 

కుల వృధ్ధి, సత్సంతానం, ధనం, కీర్తిసకల పుణ్యనదీ స్నాన సత్ఫలితాల కోసం ఆర్యులు కామధేను స్తోత్రాన్ని నిత్యం పఠించేవారు.యుగయుగాలుగా  గోవు పరమ పవిత్రమైన దేవతా స్వరూపంగా సనాతన భారతీయులచే పూజించబడుతున్నది. కృతయుగంలో క్షీరసాగర మధన సమయాన ఆవిర్భావం చెందిన అనేక అమూల్య వస్తువులలో కామధేను అనే గోవు ఒకటి. కోరిన కోరికలు తీర్చగల అపూర్వ శక్తిగలది. బ్రహ్మవిష్ణుమహేశ్వరులుసూర్యచంద్రాది దేవ ప్రముఖులు ఈ కామధేనులో వసించియుండడం వలన ఇది చాలా పవిత్రమైనదిగా, పూజనీయమైనదిగా పురాణాలలో వర్ణించబడింది. కామధేను పంచి యిచ్చిన అమృతం వంటి పాలను త్రాగి దేవతలంతా సకల సుభిక్షాలను, సుఖసంతోషాలను అనుభవించారు. ఈ కామధేను సంతతే సురభికపిల వంటి గోవులు. ఇవి వశిష్ఠకశ్యపాది మహర్షుల ఆశ్రమాలలో వుంటూ వారు చేసే యజ్ఞయాగాది క్రతువులకు కావలసిన సకల సామగ్రిని సమకూరుస్తూ లోక సంక్షేమానికి ఎంతగానో తోడ్పడ్డాయి. ప్రపంచమంతా గో సంతతిని వృధ్ధిపర్చాయి. గోమాతను కులదైవంగా పూజించే ఆచారం కూడా మన దేశంలో వుంది. యుగాలు మారడంతో కాలధర్మం కూడా మారిపోతున్నది. ఒకప్పుడు ధర్మం నాలుగు పాదాల నడిచి  ప్రపంచమంతా సుభిక్షంగాసశ్యశ్యామలంగా వుండేది. ఈనాడు ఈ కలియుగంలో ధర్మం ఒంటి పాదాన కుంటి నడకలు నడుస్తోంది. మానవులలో జాలి,కరుణ,దయ అనే గుణాలు కనుమరుగై కర్కశంగా ప్రవర్తిస్తున్నారు. తమ తమ స్వార్ధం కోసం జంతుజాలాన్ని తీవ్రంగా హింసిస్తున్నారు.  దైవంగా, కన్నతల్లిగా భావిస్తూ వచ్చిన గోమాతను  మనిషి క్రమక్రమంగా తన ధనార్జనను పెంచే ముడి సరుకుగా ఉపయోగించడం మొదలెట్టాడు. గోవు నుండి లభించే పాలు మొదలు పేడ వరకు ప్రతీది అత్యంత విలువలు కలిగి మనిషి ఆదాయానికి ఉపయోగపడుతున్నాయి.

యంత్ర సాంకేతిక పరిజ్ఞానం లేనంతకాలం పశువులే వ్యవసాయ, రవాణా సాధనాలుగా మనిషికి జీవనానికి ఆలంబన అయ్యాయి. వయసుడిగిన గోమాతను నిర్దాక్షిణ్యంగా కసాయివాడికి అమ్మగా వచ్చిన డబ్బును కూడా మనిషి ఆనందంగా అనుభవిస్తున్నాడు. చివరకు ప్రాణం పోయిన పశువుల చర్మం కూడా వివిధ తోలు వస్తువుల రూపేణా మనిషికి భోగభాగ్యాలను సమకూరుస్తున్నది. 

రానురాను గోవు అంటే దైవస్వరూపం, పవిత్రమైనదనే భావన మనుషులలో క్షీణిస్తోంది.  ప్రతీ ప్రాణి తన మనుగడను కాపాడుకోవడం  కోసం తీవ్రంగా పోరాడవలసిన పరిస్థితి ఏర్పడింది.  తమ ఉనికిని ఔన్నత్యాన్ని తామే చాటిచెప్పుకోవలసిన దుస్థితి ఏర్పడింది.  మనిషి బుధ్ధి జీవి. నోరుంది. తన కష్టసుఖాలను ఇతరులకు చెప్పుకోగలడు. కానీ పశువులు తమ కష్టాలను ఎలా చెప్పుకుంటాయి. తమకు జరిగే అన్యాయాన్ని ఎలా ఎదుర్కోగలవు.

మనిషి స్వార్ధం వలన ఆవుల వంటి సాధు జంతువులు ఎంతగా హింసించబడుతున్నవో ఊహించుకుని  చదువు సంధ్యలు లేని దయార్ద్ర హృదయంగల ఒక పశువుల కాపరి ఒక గోవు యొక్క స్వగతాన్ని మనసుకు హత్తుకునేలా వినిపిస్తున్నాడు. ఆ పాటే ఈనాటి మన సజీవరాగం.

తమ  గుణగణాలనుకీర్తిప్రతిష్టలనుఔన్నత్యాన్ని ఇతరులు పొగడాలే తప్ప ఎవరికి వారే చెప్పుకోవలసి రావడం చాలా బాధాకరందైన్యం. అటువంటి దుస్థితిని మనం ఈ గోవు పాటలో చూస్తాము. పాట ప్రారంభంలోనే ' వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడాఅని అంటారు కవి కొసరాజు. పల్లెటూరిలో పశువులను కాచుకునే పామర గోపన్న పాడే గో స్వగతం ఈ పాట. ఎవరి కోసం ఈ పాట? ఇందులో పామరుడు ఎవరు? చదువు లేకపోయినా సాటి ప్రాణిగా  గోవు కష్ట సుఖాలకు చలించిపోయే మంచి హృదయమున్నవాడు పామరుడా? లేక గొప్ప గొప్ప చదువులు చదివినా   మానవత్వాన్ని మరచిపోయి సాధుజీవులను తన స్వార్ధం కోసం దయారహితంగా హింసించేవాడా? ఎవరు పామరుడు?

ఈ పాటలోని సాహిత్యం అత్యంత సరళం. ఐదారేళ్ళ పసిపాపలకు కూడా చాలా సులభంగా అర్ధమయే రీతిలో వ్రాసారు కొసరాజు. ఈ పాటను విని చలించనివాడే పామరుడు. అసలు నరుడే కాడు. సినిమా ఆరంభంలోనే టైటిల్స్ అయిన వెంటనే హీరో మనస్తత్త్వాన్ని  పరిచయం చేసేలా వచ్చే ఈ పాట 'గోవుల గోపన్న' సినీమాలోనిది. 

సున్నితంగా శ్రావ్యంగా వినవచ్చే ఈ గీతాన్ని ఘంటసాల మాస్టారు మోహన రాగ స్వరాలతో చేశారు. 28 వ మేళకర్త రాగమైన హరికాంభోజి రాగ జన్యమైన మోహన ఔడవరాగంగా జగత్ప్రసిధ్ధం.  దీనికి సమాంతరమైన హిందుస్థానీ రాగాన్ని 'భూప్ ' అంటారు. అయితే పై పాటలో  మోహనకు సంబంధించని అన్యస్వరాలు కూడా ప్రయోగించబడడం వలన దీనిని సినీమోహన రాగంగా చెప్పుకోవడమే సముచితం. ఫ్లూట్క్లారినెట్, పియనోయూనివాక్స్అకార్డియన్, వైెయొలిన్స్, తబల, డోలక్ఘటసింగారి వంటి వాద్యాలు  ఈ పాటలో  వినిపిస్తాయి. 

హృదయధర్మానికి చెందిన సందేశపూర్వక గీతాలను  పరిపూర్ణంగా తనలో జీర్ణింపజేసుకొని భావయుక్తంగా పాడే ఘంటసాల, దానికి తన నటన ద్వారా మెరుగులు దిద్దే అక్కినేని మధ్య గల పరస్పర అవగాహన వలన కొసరాజుగారి ఈ 'వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా' పాట కూడా ప్రజాబాహుళ్యంలోనికి చొచ్చుకుపోయి ఈనాటివరకు సజీవంగా నిల్చిపోయింది. 

అమాయకుడైన పశులకాపరిగా, లా చదివిన జూనియర్ అడ్వొకేట్ గా ఎ.ఎన్.ఆర్. ద్విపాత్రాభినయం చేసిన సినిమా.

రాజ్యం పిక్చర్స్ శ్రీధరరావు& నటి లక్ష్మీరాజ్యం దంపతులు నిర్మించిన 'గోవుల గోపన్న'  సినిమా కు రాజ్ కుమార్ నటించిన బి.ఆర్.పంతులు కన్నడ సినిమా 'ఎమ్మె తమ్మణ్ణ' మూలం. తర్వాత ఈ సినిమా హిందీలో జితేంద్ర తో ' జిగ్రిదోస్త్గా , తమిళంలో ఎమ్.జి.ఆర్ తో 'మాట్టుకార వేలన్' గా వచ్చింది. ఇలా ఒకే కధ కన్నడ,తెలుగు,హిందీ, తమిళ భాషలలో సినిమాలుగా రూపొంది ఘనమైన ఆర్ధిక విజయాన్ని సాధించడం ఒక విశేషం. 

కథతో ఏ సబంధం లేకపోయినా 'వినరా వినరా నరుడా' పాటలోని సందేశం సామాన్య ప్రజలందరినీ ఆకర్షించి ఈ పాట సజీవరాగంగా నిలిచేందుకు దోహదపడింది. సినిమా లో ఈ పాట రెండు సందర్భాలలో ఏకగళ గీతంగా, యుగళగీతంగా వస్తుంది.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 


Saturday, 3 May 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 80వ భాగం - నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభై తొమ్మిదవ భాగం ఇక్కడ

80వ సజీవరాగం - నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా      

చిత్రం - పూలరంగడు
గానం - ఘంటసాల
రచన - కొసరాజు

సంగీతం - ఎస్.రాజేశ్వరరావు

పల్లవి : 

ఓహో ! హెయ్య.... 

నీతికి నిలబడి నిజాయితీగా

పదరా ముందుకు పదరా

అహ ఛల్ రే బేటా ఛల్ రే ! నీతికి!

తాతల తండ్రుల ఆర్జన తింటూ

చరణం  1:

జలసాగా నువు తిరగకురా - 2

కండలు కరగగ కష్టం చేసి

తలవంచక జీవించుమురా

పూలరంగడిగా వెలుగుమురా 

                                హెయ్య! నీతికి!

చరణం  2: 

పెంచిన కుక్కకు రొట్టె మేపుతూ

హుషారుగా ఒకడున్నాడూ

బల్ ఖుషీ ఖుషీగా వున్నాడూ

కన్నబిడ్డకు గంజి దొరకక ఉసూరుమని ఒకడున్నాడూ.....

ఛల్ ఛల్ రే... 

                                            !నీతికి!

చరణం  3:

ఉన్నవాడికి అరగని జబ్బు

లేనివాడికీ ఆకలి జబ్బు

ఉండీ లేని మధ్య రకానికి

చాలీచాలని జబ్బురా

ఒకటే అప్పుల జబ్బురా!

                                హెయ్య! నీతికి!

చరణం  4: 

కష్టాలెన్నో ముంచుకు వచ్చినా

కన్నీరును ఒలికించకురా

కష్టజీవుల కలలు ఫలించే

కమ్మనిరోజులు వచ్చునురా

చివరకు నీదే విజయమురా

!నీతికి నిలబడి నిజాయితీగా

పదరా ముందుకు పదరా.....!

ఉన్నవాడు- లేనివాడు... ఈ ఆర్ధిక అసమానత్వం మన సమాజంలో ఏనాడు ఉద్భవించిందో గానీ ఈనాటికీ మనలను పట్టి పీడిస్తూనేవుంది.  ఈ ఊబిలోంచి బయటపడే మార్గం కానరాక కొట్టుమిట్టాడుతూనేవున్నాము. ఏనాడో ఐదున్నర దశాబ్దాల క్రితం కొసరాజుగారు రాశారు 'పూలరంగడు'

సినిమా కోసం, ఏమని, ... 'ఉన్నవాడికి అరగని జబ్బు లేనివాడికి ఆకలి జబ్బు ఉండీ లేని మధ్య రకానికి అప్పుల జబ్బుఅని.  కన్నబిడ్డలకు గుక్కెడు గంజి కోసం ఒకడు అలమటిస్తూంటే, తన డాబును దర్జాను చాటుకునేలా పెంపుడు కుక్కలపై వేలకు వేలు ఖర్చు పెట్టే అమీర్లు ఒక వైపు. ఈ పరిస్థితిలో అప్పటికీ ఇప్పటికీ పెద్ద మార్పేమీ రాలేదు. ఆనాడు ఎలా ఉన్నామోఈనాడూ అలానే ఉన్నాము. ఈ అంతరాన్ని గుర్తు చేస్తూ ఘంటసాలగారు ఆలపించిన  'నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా' అనే గీతమే ఈనాటి మన సజీవరాగం. 

ఈ పాటలో కొసరాజుగారు ' పూలరంగడు' అంటే ఎవరో మనకు తేటతెల్లం చేశారు. పెద్దలు సంపాదించిన ఆస్తులను  దుర్వ్యసనాల కోసం దూబరాగా ఖర్చు చేస్తూ జల్సాగా కులాసాగా తిరిగేవాడు పూలరంగడనిపించుకోడు. పూలరంగడంటే కండలు కరిగేలా కాయకష్టం చేసి ఆ వచ్చిన సంపాదనతో ఎవరికీ తలవంచక నీతి నిజాయితీ లతో ఇతరులకు సహాయపడుతూ తాను సంతోషంగా వుంటూ ధైర్యంగా ముందుకు సాగేవాడే అసలు సిసలు 'పూలరంగడు' అంటారు. 

ఎ జె క్రానిన్ అని స్కాట్లెండ్ లో ఒక ఆంగ్ల రచయిత. 1953లో ఆయన వ్రాసిన 'బియాండ్ దిస్ ప్లేస్' అనే నవల ఆధారంగా బెంగాలీలో ఉత్తమకుమార్ తో ఒక సినిమా వస్తే దానిని హిందీలో 'కాలాపానీ' గా దేవానంద్ తో తీశారు. 1959 లో వచ్చిన ఆ సినీమాలోని మూలకథను మాత్రమే తీసుకొని దుక్కిపాటి మధుసూదనరావుగారు ఆదుర్తి నిర్దేశకత్వంలో 'పూలరంగడు' సినిమాను అక్కినేని నాగేశ్వరరావు కధానాయకుని గా  నిర్మించారు. 

జమున, నాగయ్యగుమ్మడిశోభన్ బాబు, విజయనిర్మలమొదలగువారు నటించారు. చేయని నేరం కోసం యావజ్జీవ జైలు శిక్షను అనుభవించే ఒక వ్యక్తిని అతని కొడుకే అసలు నేరస్తుడిని కనిపెట్టి తండ్రిని నిరపరాధిగా నిరూపించి బయటకు తీసుకురావడం ఈ సినిమా కథ సారాంశం.  

ఈ ఫార్ములా ఇండియాలో బాగా క్లిక్ అయింది. బెంగాలీహిందీతెలుగు భాషలలో సూపర్హిట్ కావడంతో 1970లో ఎమ్.జి.ఆర్. జయలలిత తమిళంలో 'ఎంగ అణ్ణన్' గా తమిళనాట కూడా ఘనవిజయం సాధించింది. ఈ కథ మీది వ్యామోహంతో ఆదుర్తి సుబ్బారావు గారే స్వయంగా  1972 లో మళ్ళా హిందీలో 'జీత్' గా రణధీర్ కపూర్, బబితలతో తీసారు. ముడి పదార్ధంలో సత్తా వుంటే అది సత్ఫలితాలనే ఇస్తుంది. 

'పూలరంగడు' సినిమా టైటిల్స్ మీద వచ్చే ఈ పాటను ఘంటసాలగారు బల్ హుషారుగా ఆలపిస్తే భాగ్యనగర్ రోడ్లమీదపబ్లిక్ గార్డెన్స్ లో జట్కాబండిని తోలుతూ   ఎ.ఎన్.ఆర్.  మరింత ఖుషీ ఖుషీగా నటించారు.

(1960 ల నాటికే మా బొబ్బిలి లాంటి చిన్న చిన్న టౌన్లలోనే  గుర్రపు జట్కాల హవా అంతరించి సైకిల్ రిక్షాల కాలం ప్రారంభమయింది. మరి 1967లో కూడా హైదరాబాద్ వంటి మహా నగరంలో హీరో జట్కాబండి తోలడాన్ని చూపించారంటే అతనెంత కాయకష్టం చేసినిజాయితీగా  బ్రతికాడో ప్రేక్షకులం మనమే అర్ధం చేసుకోవాలి. 

కథానాయకుని లక్ష్య లక్షణాలు తెలియజేసే కొసరాజుగారి పాటకు రసరాజేశ్వరరావుగారు ఇచ్చిన టెంపో పాట ఆద్యంతం శ్రోతలను ఆనందపరుస్తుంది. రాజేశ్వరరావు ఈ పాటను తనదైన స్టైల్ లో  లోనియన్ మోడ్ స్వరాలతో కూర్చారు. వెస్ట్రన్ మ్యూజిక్ లో మేజర్ స్కేల్ . ప్రపంచంలోని అన్ని సంగీత శైలులలో వినపడే సర్వ గమక సంపూర్ణం రాగం. దీనిని హిందుస్థానీ వారు బిలావల్ అంటే దాక్షిణాత్య సంగీత శైలిలో ధీరశంకరాభరణం(శంకరాభరణం) అంటారు.29 వ మేళకర్త రాగం ఎంతో శ్రావ్యంగాసున్నితంగా వుంటూ శ్రోతల మనసులను రంజింపజేస్తుంది. ఈ మేళకర్త రాగానికి ఉన్న జన్యరాగాలు కూడా జనరంజకమైనవే. అలాటి శంకరాభరణం రాగ స్వరాలతో  రాజేశ్వరరావుగారు చేసిన ఈ జట్కాబండి పాట వెర్సటైల్ సింగర్ అయిన  ఘంటసాల మాస్టారికి నల్లేరు మీద బండి నడకే. అందుకే ఎన్ని దశాబ్దాలైనా  నీతికి నిలబడి నిజాయితీగా ఘంటసాల గానాభిమానులంతా వారి పాటలను అనుక్షణం మననం చేసుకుంటూ తమ  స్వరప్రస్థానంలో ముందుకు సాగిపోతూనే వున్నారు.

సాలూరివారి సంగీత దర్శకత్వంలో ని పాటలంటే అమృతగుళికలే.  మాస్టారు పాడిన ఈ పాటే కాక ఇతర పాటలు కూడా బహుళ జనాదరణ పొందాయి. కొసరాజుగారే రాసిన ఘంటసాల మాస్టారు, నాగయ్యగారు కలసి పాడిన "చిల్లర రాళ్ళకు మ్రొక్కుతు వుంటే చెడిపోదువురా ఒరే ఒరే' పాట, అలాగే,  ఆనాటి దేశకాలమాన పరిస్థితులకు దర్పణం పట్టే విధంగా మాస్టారుసుశీలజమున కలసి ఆలపించిన బుర్రకథ అన్నపూర్ణా వారి బ్యానర్ ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసి అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకోవడానికి దోహదపడాయి.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 92వ భాగం - పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...