సఖీ! నీవలిగితే నే తాళజాలా
!!ఓ చెలీ!!
చరణం 1:
అందాలు చిందే మోము కందేను
ఆవేదనలో పన్నీట తేలించదనే మన్నించవే
!!ఓ చెలీ!!
చరణం 2:
ఏనాడు దాచని మేను ఈనాడు
దాచెదవేలా దరిచేరి అలరించెదనే దయజూపవే
!!ఓ చెలీ!!
చరణం 3:
ఈ మౌనమోపగలేనే విరహాలు
సైపగలేనే తలవంచి నీ పదములకూ
మ్రొక్కేనులే ...
పద్యం
నను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కిన్కబూని
తాచిన అది నాకు మన్ననయ, చెల్వగు
నీ పదపల్లవమ్ము మత్తను పులకాగ్ర కంటకవితానము తాకిన
నొచ్చునంచు నేననియద! అల్క మానవుగదా యికనైన అరాళకుంతలా !
నల్లని ఒత్తైన కేశ సంపద కలదానా! నేను నీ దాసానుదాసుడిని. ఏదో ప్రణయకలహము వలన నాపై ఆగ్రహము చెంది నీవు నన్ను తన్నినందుకు నేను బాధపడడం లేదు. అది మహద్భాగ్యంగానే భావిస్తాను. కానీ , నీ స్పర్శతో నా శరీరంలోని రోమాలు గగుర్పొడిచి ముళ్ళవలె వున్నాయి. అసలే కుసుమకోమలివి , ఆ ముళ్ళు నీ మృదువైన పాదాలకు గుచ్చుకొని గాయపడితే నేను భరించలేను. అందుకే నీ అలుక విడచి నను కరుణించమని బ్రతిమాలుకుంటున్నాను". ఇది ఆ పద్య తాత్పర్యం.
" నెయ్యపు కిన్క - ప్రణయ కోపానికి మారు పదం ; " మత్తనుపులకాగ్ర కంటకవితానము - అంటే గగుర్పాటు వలన దేహంపైని రోమాలు ముళ్ళవలె మారి గుచ్చడం. చూశారా ఈ కవి చమత్కారం. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అనే సూత్రాన్ని అక్షరాలా అన్వయింపజేసాడు 'పారిజాతాపహరణ' కావ్యకర్త నంది (ముక్కు) తిమ్మనగారు.
అష్టభార్యలు, పదహారువేల గోపికలను భరించిన శృంగారరసాధినాయకుడు, దక్షిణనాయకుడిగా పేరుపొందిన శ్రీకృష్ణుడికి భామ కాలితాపులు ఒక లెఖ్ఖా! ఆవిడగారి అహాన్ని ఒకపక్క తన మాటలతో చేష్టలతో పెంచుతూనే ఒక దశలో సమూలంగా అణచివేసిన లీలా జగన్నాటక సూత్రధారి, లీలామానుష రూపధారి.
"ఓ చెలీ! కోపమా! అంతలో తాపమా సఖీ! నీవలిగితే నే తాళజాలా.." అంటూ శ్రీకృష్ణుడు ఆడి, ఆడించిన శృంగారలీలా వినోదమే నేటి మన సజీవరాగం.
సరిగ్గా 25 వారాల క్రితం ఇదే సన్నివేశం మీద ముచ్చటించడం జరిగింది. అక్కడా ఇదే పద్యం, కానీ పాట, పాట సాహిత్యం వేరే. అక్కడా, ఇక్కడా భామలు వేరైనా కృష్ణుడు (ఎన్.టి.రామారావు), ఆ కృష్ణుని గాన పాత్రధారి ఒకరే. అలాగే అక్కడా ఇక్కడా నారదుడు (కాంతారావు), నారదుని గాన గాత్రధారీ ఒక్కడే. రెండు పాత్రలకు తన గళంతో ద్విపాత్రాభినయం చేశారు ఘంటసాల. అది 'శ్రీ కృష్ణార్జునయుధ్ధం' లోని శృంగార ఘట్టమయితే ఇది 'శ్రీకృష్ణతులాభారం' లోని శయ్యాగృహ ప్రణయకలహ శృంగార సన్నివేశం.
రెండు సినిమాలకు సంగీత దర్శకుడు ఒకరే - పెండ్యాల. మొదటిది పింగళి వారి రచనైతే ఇది దాశరధి కృష్ణమాచార్యులవారిది. ఇద్దరూ కవులుగా, సినీగీత రచయితలుగా లబ్దప్రతిష్టులే.
అసలు ఈ వారం సజీవరాగంగా చెప్పాలనుకున్నది శ్రీకృష్ణతులాభారం సినీమాలోని "భలే మంచి చౌకబేరము" పాట గురించి. ఘంటసాల గళాభినయనం గురించి. అయితే అందులో స్త్రీ కంఠం, ఇతరుల బృందగానం కూడా వుండడం వలన ఈనాటి ఈ శీర్షికలో చోటుచేసుకోలేకపోయింది.
అదే శ్రీకృష్ణ తులాభారం లో ఘంటసాలవారు ఆలపించిన గీతాలలో మరో ప్రాశస్త్యం కలిగిన పాట "ఓ చెలీ! కోపమా! అంతలో తాపమా..." పాట.
ఘంటసాలవారి గాన వైదుష్యానికి దర్పణం పట్టిన సినీమా 'శ్రీకృష్ణతులాభారం'. వైవిధ్యభరితమైన తన కంఠస్వరంతో బహుపాత్రాభినయం చేశారు. శ్రీకృష్ణ, నారద పాత్రల పద్యాలు, పాటలు రెండూ తానే పాడుతూ ఆ పాటలను పాడేది ఆయా పాత్రధారులే అన్న అనుభూతి ని కలిగించారు ఘంటసాల.
బుజ్జగింపు, సరస శృంగారం కలిగిన గీతం "ఓ చెలీ కోపమా" పాట. ఆ భావాలను అతి సమర్ధవంతంగా తన గాత్రంలో పలికించారు ఘంటసాల. ఈ పాటలో "ఏనాడు దాచని మేను ఈనాడు దాచెదవేలా..." అంటూ దాశరధి ఒక అభ్యంతరకరమైన పదప్రయోగం చేశారు. అంటే ఏ అలుకా కోపం లేని సమయాలలో భామ తన దేహాన్ని బహిరంగపరచేదా (శయనమందిరంలోనే అనుకుందాం)? సెన్సార్ బోర్డ్ లో భాషమీద పట్టున్న రంధ్రాన్వేషక సభ్యులు ఎవరైనా వుండివుంటే ఈ పాట సాహిత్యం యిలాగే వుండేదా!
ఈ సరస శృంగారగీతాన్ని పెండ్యాల గారు ఖమాస్ రాగంలోనూ, పద్యాన్ని హిందోళరాగంలోనూ స్వరపర్చారు. ఖమాస్ 28వ మేళకర్త హరికాంభోజికి జన్యం. వక్ర షాఢవ సంపూర్ణరాగం. ఆరోహణలో ఆరు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు కలిగిన రాగం. శృంగారరస భావాలను ప్రకటితం చేయడానికి అనువైన రాగం ఖమాస్. అలాగే, పాట చివరలో వచ్చే పద్యాన్ని పెండ్యాల గారు గతంలో ఆరభిలో, ఈసారి హిందోళంలోనూ రసవత్తరంగా ఘంటసాలవారిచేత ఆలపింపజేసారు. హిందోళరాగం ఐదు స్వరాలు కలిగిన ఔఢవరాగం. హిందోళం జనకరాగం విషయంలో సంగీత ప్రపంచంలో భిన్న భేదాభిప్రాయాలు వున్నాయి. హిందోళానికి సమానమైన హిందుస్థానీ రాగం మాల్ఖౌంస్. సున్నితభావాలకు అనువైన రాగం హిందోళం. ఈ హిందోళ, మాల్ఖౌంస్ రాగాలలో ఎన్ని వందల సుశ్రావ్య గీతాలున్నాయో అందరికీ తెలిసినదే.
"ఓ చెలీ కోపమా!" పాటలో 'కోపమా! తాపమా!' అనే మాటలమీది సంగతులను, గమకాలను ఎంతో సరళంగా, శ్రావ్యంగా ఆలపించి ఈ పాటను సజీవరాగం గా మలచారు గానగంధర్వ ఘంటసాల. పెండ్యాలగారు ఈ పాట కోసం సితార్, ఫ్లూట్, పియోనా, వైబ్రోఫోన్, వైలిన్స్, డబుల్ బేస్, తబలా వంటి వాద్యాలను పాటలోని మెలోడీకి అవసరమైనంత మేరకు ఉపయోగించి పాట ఔన్నత్యాన్ని పెంచారు.
అలాగే, పాట చివరలో వచ్చే ముక్కు తిమ్మనగారి పారిజాతాపహరణంలోని - "నను భవదీయ దాసుని" పద్యాన్ని ఘంటసాలగారు ఎంతో హృద్యంగా హిందోళ రాగంలో ఆలపించారు. ఈ పద్యంలో వచ్చే "చెల్వగు నీ పదపల్లవమ్ము మత్తనుపులకాగ్ర కంటకవితానము తాకిన నొచ్చునంచు నే ననియద" అనే అతి పెద్ద సమాసాన్ని గుక్కతిప్పుకోకుండా భావయుక్తంగా ఘంటసాలవారు ఆలపించిన తీరు అనన్యసామాన్యం.
ప్రేక్షకుల మనసులలో గాఢంగా ముద్రవేసుకున్న ఒక సన్నివేశాన్ని వారి మరపుకు రాకముందే మరల జనప్రియత్వాన్ని కలిగిస్తూ అదే నటునితో, ఆదే గాయకునితో చిత్రీకరించడమనేది ఏమంత సులభసాధ్యమైన కార్యంకాదు. ఉన్నదానికి రెట్టింపు ఔన్నత్యాన్ని కలిగిస్తూ సన్నివేశాన్ని రక్తికట్టించడానికి దర్శకుడు, రచయిత, సంగీతదర్శకుడు, గాయకుడు, నటీనటులు ఎంతగానో శ్రమించవలసి వస్తుంది. అటువంటి సవాలును అతి సమర్ధవంతంగా ఎదుర్కొని బహుళ జనామోదాన్ని పొందారు శ్రీకృష్ణతులాభారంలోని "ఓ చెలీ కోపమా! పాటకు సంబంధించిన కళాకారులు - దాశరధి, పెండ్యాల, ఘంటసాల, ఎన్.టి.ఆర్, జమున, కమలాకర కామేశ్వరరావు ప్రభృతులు.
మంచి సంగీతానికి ఎంతో స్కోప్ వున్న శ్రీకృష్ణతులాభారం సినీమాలో పాటలు, పద్యాలు అన్ని కలసి 31 వరకు వున్నాయి. ఓ పదిహేడు వరకు పద్యాలు, పాటలను కృష్ణుడు ఎన్.టి.రామారావు, నారదుడు కాంతారావు కోసం ఘంటసాల ఎంతో వైవిధ్యంతో గానం చేసి చిత్ర విజయానికి దోహదపడ్డారు. ఏ రకమైన గీతమైనా ఘంటసాల కంఠం నుండి వెలువడితే అది అమృతతుల్యమే అవుతుందని మరోసారి నిరూపించారు.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్