15వ సజీవరాగం -
"ఇది నా చెలి, ఇది నా సఖి నా మనోహరి ..."
రాగం : రాగేశ్వరి
చిత్రం : చంద్రహారం
గీతరచన : పింగళి నాగేంద్ర రావు
సంగీతం, గానం : ఘంటసాల
పల్లవి : ఇది నా చెలి , ఇది నా సఖి నా మనోహరి
చరణం: మనసులోని మమతలన్ని
కనులముందు నిలచినటుల
వన్నెలతో చిన్నెలతో
మనసుగొనిన ఊహాసుందరి
ఇది నా చెలి ....
చరణం 2 : కలువకనుల చల్లని సిరి
ఉల్లములో ప్రేమలహరి
వినయ సహన శోభలతో
తనివినించు
సుగుణసుందరి
ఇది నా చెలి ... ఇది నా సఖి .... నా మనోహరి ....
ఘంటసాలవారి ఈ వారం సజీవరాగం "ఇది నా చెలి, ఇది నా సఖి , నా మనోహరి" అనే మనోజ్ఞమైన గీతం, 1954లో వచ్చిన " చంద్రహారం" చిత్రం లోనిది. ఈ పాటను ఘంటసాలగారు "రాగేశ్వరి" రాగంలో స్వరపర్చారు. రాగేశ్వరి రాగం ఘంటసాల మాస్టారికి ఇష్టమైన రాగాలలో ఒకటి. ఈ రాగంలో ఘంటసాలగారు చేసిన చాలా పాటలు మంచి జనాదరణ పొందాయి.
ఈ రాగేశ్వరి రాగం విషయంలో సుప్రసిధ్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ బడే గులామ్ ఆలీఖాన్ గారి ప్రభావం ఘంటసాలవారి మీద చాలానే ఉందని చెప్పుకోవడం ఉన్నది. ఖాన్ సాబ్ మద్రాస్ ఎప్పుడు వచ్చినా ఘంటసాలవారింటి మేడమీదనే బసచేసి వారి ఆతిధ్యం పొందేవారు. ఆయన అక్కడ ఉన్నంతకాలం మద్రాస్ లోని ప్రముఖ సంగీత విద్వాంసులంతా అర్ధరాత్రి దాటేవరకు ఆయనను దర్శనం చేసుకొని వారి గాత్రం విని ప్రేరణ పొందేవారు. ఆ సమయంలో ఘంటసాలగారు కూడా తాను చేసిన పాటలను పాడి వినిపించేవారు. 1959లో ఖాన్ సాబ్ సంగీతాన్ని, ఘంటసాలవారింట, ప్రత్యక్షంగా వినే మహాద్భాగ్యం నాకు కూడా కలిగింది. రాత్రిపూట ఆయన నిద్రలో కూడా ఆయన చేతి వ్రేళ్ళు తన గుండెలమీదున్న స్వరమండల్ ను మీటుతూనే వుండేవి.
రాగేశ్వరి రాగం హిందుస్థానీ శైలికి చెందినది. ఈ రాగానికి దగ్గరలో ఉండే కర్నాటక రాగం నాటకురింజి రాగం. 28వ మేళకర్త రాగమైన హరికాంభోజి రాగ జన్యరాగం నాటకురింజి. రాగేశ్వరి రాగంలో లేని పంచమ (ప) స్వరం నాటకురింజిలో వుంటుంది. ఆ ఒక్క తేడా తప్ప రెండు రాగాలు వినడానికి ఒకేలా ఉంటాయి.
చంద్రహారం లోని ఈ రాగేశ్వరి రాగ గీతం ఆనాటినుండి ఈనాటివరకు పండిత పామరులందరిచేతా ప్రశంసించబడుతూనే వుంది. అంత కోమలంగా, శ్రావ్యంగా ఆలపించి శ్రోతలను రంజింపజేసారు ఘంటసాల. ఈ పాటకు పింగళి నాగేంద్రరావుగారు చాలా సరళమైన , భావయుక్తమైన సాహిత్యాన్ని అందించారు.
సినీమాలో కధానాయకుడు తన ఊహలలోని సుందరిని చిత్రిస్తూ "ది నా చెలి, ఇది నా సఖి... నా మనోహరీ..." అంటూ ఈ పాటను ఆలపిస్తూంటాడు.
మనసులోని మమతలన్నింటినీ కళ్ళెదుట నిల్పి తన సొగసు, సోయగాలతో మనసును దోచుకున్న ఊహాసుందరిని చిత్రంలో చూసుకుంటూ మైమరచిపోతూంటాడు. రెండవ చరణంలో ఆ సుందరి అందాన్ని, గుణగణాలను వర్ణిస్తూ -- కలువకనులతో చల్లదనాన్ని కురిపిస్తూ లక్ష్మీకరంగా గోచరిస్తున్నదట; హృదయంలో ప్రేమ తరంగాలను ఉప్పొంగించే ఆ సుగుణసుందరి సహనశీలియై, వినయ విధేయతలతో, శోభాయమానంగా తనివితీరేలా దర్శనమిస్తున్న ఆ చెలే సఖియని, తన మనోహరి అని అంటాడు ఆ ధీరలలిత నాయకుడు. పింగళివారి పాళి ఈ మృదువైన భావాలను ఎంత సున్నితంగా వర్ణించిందో కదా!
పాట చాలా చిన్నదే. కానీ, ఘంటసాలవారి గాత్రంలోని భావసౌందర్యం, శ్రావ్యత అనితరసాధ్యం అంటే అతిశయోక్తి కాదు. ఈ పాటలోని వాద్యగోష్టికూడా చాలా సున్నితంగా పాటను అనుసరించి పోతుంది. ఘంటసాలవారి గళంలోని తీయనైన గమకాలు, సంగతులు, మెల్లని ఉయ్యాలవూపు వంటి హాయినిగొలిపే చిన్న ఆలాపన ఈ పాటకు ఎంతో విశిష్టతను చేకూర్చాయి. రాగేశ్వరి రాగ మాధుర్యమంతా ఈ పాటలో ధ్వనించింది.
కావ్య నాయకుని లక్షణాలకు ప్రతీకగా చంద్రహారం కధానాయకుడు చందన దేశ యువరాజు ఎన్.టి.రామారావు, అంతవరకు ఏ సినిమాలోను కనిపించనంత అందంగా, నవ మన్మధాకారంతో, హుందాగా నటించారు.
'మ్యాస్ట్రో' ఇళయరాజా అంతటి గొప్ప సంగీతమేధావి తన చిన్నతనంలో చాలాఇష్టపడి బాగా గుర్తుండిపోయిన పాటగా, బహుదా ప్రశంసించిన గీతం ఘంటసాలగారి' ఇది నాచెలి ఇది నా సఖి' పాట.
ప్రముఖ దర్శకుడు ఎల్ వి ప్రసాద్ పర్యవేక్షణలో కమలాకర కామేశ్వరరావు తొలిసారిగా దర్శకత్వం చేపట్టిన భారీ జానపద చిత్రం 'చంద్రహారం'. ఎన్టీఆర్, ఎస్.వి.రంగారావు, రేలంగి, జోగారావు, శ్రీరంజని, సావిత్రి, సూర్యకాంతం, మొదలగువారు నటించగా విజయా ప్రొడక్షన్స్ నాగిరెడ్డి-చక్రపాణి లు నిర్మించిన చిత్రం చంద్రహారం.
1954 లోనే దాదాపు పాతిక లక్షల ఖర్చుతో తెలుగు, తమిళ భాషలలో భారీ ఎత్తున నిర్మించబడిన ఈ కళాత్మక జానపద చిత్రం బాక్సాఫీస్ దగ్గర పరాజయంపాలైనా సంగీతపరంగా ఈ చిత్రంలోని పాటలన్నీ ఈనాటికీ ప్రజల హృదయాలలో నిలిచే ఉన్నాయి. తన తొలి చిత్రం అపజయంతో కలిగిన అపప్రధను కమలాకర కామేశ్వరరావుగారు మరో ఎనిమిదేళ్ళ తర్వాత అదే విజయావారి గుండమ్మ కధ ఘనవిజయంతో తొలగించుకున్నారని పాత్రికేయుల విశ్లేషణ.
Click here for video ఇది నా చెలి, ఇది నా సఖి నా మనోహరి
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్
🕉శ్రీ ఘంటసాల మాస్టారి ఏకగళ గీతాలను మంచి విలువలు కలిగిన వాటిని ఎంపిక చేసి , ఆ గీతాలకు సంబంధించిన వివరాలు , వివరణలు , విశేషాలు తెలియజేస్తున్న, శ్రీ పట్రాయని ప్రణవ స్వరాట్ గారి కృషి ఎంతైనా అభినందనీయం. వారికి అనేక ధన్యవాదాలు. పట్రాయని ప్రసాద్ , గురుగ్రామ్ , ( ఢిల్లీ దగ్గర ), హర్యానా రాష్ట్రం, తేదీ:04-02-2024, ఆదివారం.🔯
ReplyDelete