Saturday, 14 February 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 2 - వివిధ రాగాలలోని పాత గీతాలు

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!



ఘం
టసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 2


ఈ ధారావాహిక ప్రారంభించే ముందు గతంలో సమీక్షించిన ఘంటసాలవారి 101 ఏకగళ గీతాలకు ఉపయోగించిన రాగాల వివరాలను గమనిద్దాము. ఘంటసాలగారి కాలంలో అధిక సంఖ్యాక గీతాలు శాస్త్రీయ సంగీత రాగాధారితంగానే వుండేవి. ఆనాటి సంగీత దర్శకులు,దర్శకనిర్మాతలు కూడా అలాటి స్వర రచనలనే ప్రోత్సహించేవారు.అలాటి రసగుళికలే ఈనాటికీ అన్ని వర్గాల గాయనీగాయకులచేత బహిరంగ సభలలో గానం చేయబడుతూ శ్రోతల అభిమానాన్ని చూరగొంటున్నాయి. ఈనాటి సినిమాలలోని సంగీత, సాహిత్యపు విలువలు ఏ రీతినున్నాయో మీ అందరికీ ఎరుకే, పనికట్టుకు మరల వివరించవలసిన పనిలేదనే భావిస్తాను.

ముఖ్య గమనిక:-

ముందుగా నే చెప్పినట్లు నేను సంగీతరంగానికి చెందినవాడిని కాకపోవడం వలన నా యీ వ్యాసాలలో పేర్కొన్న రాగాల పేర్లు,  వివరాలు నా సొంతం కాదు. పలువురు సినీ సంగీత విమర్శకుల వ్యాసాలలో పేర్కొన్న రాగాల పేర్లనే సేకరించి ఉపయోగించడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

కొన్ని పాటల రాగాల విషయంలో ఒకే పాటకు  వేర్వేరు రాగాల పేర్లు కనిపిస్తున్నాయి. ఏ యిద్దరి విశ్లేషకుల అభిప్రాయాలు ఒకేలా వుండడం లేదు. నిర్ధారణగా ఈ పాట ఈ రాగం అని చెప్పుకోవడానికి వీలుపడడం లేదు. ఇందుకు కారణం ఏమిటో సంగీతవేత్తలే వివరించగలరు.

నా అవగాహన మేరకు నాకు కనిపిస్తున్నది --

1. పక్కపక్క మేళకర్తలలోని స్వరాల మధ్య పోలికల వలన రాగనిర్ణయంలో పొరపాటు రావచ్చు.

2. జన్యరాగాల స్వరాల మధ్య పోలికల వల్ల కూడా పాట రాగ నిర్ణయం తప్పుకావచ్ఛు.

3. మిశ్రమ స్వరాలు , అన్యస్వరాల ప్రయోగం వలన కూడా రాగనిర్ణయంలో పొరపాటు పడే అవకాశం వుంది. కేవలం, రాగం యొక్క అరోహణ, అవరోహణలను బట్టి సినిమా పాట రాగం నిర్ధారించడం జరగదు.

4. స్వరస్థాయిలో బేధాలు సక్రమంగా గమనించకపోతే కూడా నిర్ణయం తప్పు కావచ్చు.

5. విశ్లేషకుల సంగీతశాస్త్ర పరిజ్ఞానం, అవగాహనా లోపం.

శాస్త్రీయ సంగీతంలోలా సినిమా సంగీతానికి నియమనిబంధనలు ఏవీ లేవు. అక్కడ వారికి ప్రధానం - సన్నివేశం, రసపోషణ, స్వరరచనలో సౌలభ్యం, మాధుర్యం. వీటి ఆధారంగానే సంగీతదర్శకుడు రచయిత ఇచ్చిన పాటకు వరసలు కడతాడు. అవి రాగానికి కట్టుబడివుండవచ్చు, వుండకనూ పోవచ్చు. ఘంటసాలగారి వంటి సంగీత దర్శకులు కొన్ని రాగాలలో అన్యస్వర ప్రయోగం చేసినా అవి ఆయా రాగాల శాస్త్రీయతకు భంగకరం కాని పధ్ధతిలోనే చేసారని సంగీత విమర్శకులు అంటారు. శాస్త్రీయ, లలిత సంగీతాలలో అసమాన ప్రతిభ కలిగిన ఘంటసాలవారి సంగీత నిర్వహణలో వచ్చిన అనేక గీతాలు కర్ణాటక సంగీతం నేర్చుకునే విద్యార్ధులకు అభ్యాస గీతాలుగా దోహదం చేస్తాయని అలాటివాటిని సంగీత విద్యార్ధులకు పాఠ్యాంశాలుగా పెట్టడం సమంజసమని  ప్రముఖ సంగీతవేత్త 'కలైమామణి' శ్రీ పట్రాయని సంగీతరావు  తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు

నేను ఇవ్వబోయే ఘంటసాలవారి 101 గీతాల రాగాల పేర్ల పట్టికలో ఏవైనా పొరపాట్లు సంగీతశాస్త్రవేత్తల  దృష్టినపడితే సాహేతుకంగా వివరించి సరిదిద్దండి. వీలుకాని పక్షంలో సహృదయతతో చదివి వదిలేయవలసిందిగా కోరుతున్నాను.

ఘంటసాలవారికి కళ్యాణి రాగమంటే మహా ఇష్టమని కొందరంటే కాదు రాగేశ్వరి అని కొందరంటారు. భీంప్లాస్, సింధుభైరవి వంటి రాగాల పేర్లు కూడా కనిపిస్తాయి. నా దృష్టిలో ఘంటసాలగారికి అన్నిరాగాలు ఇష్టమే. సన్నివేశానికి,భావప్రకటనకు అనుకూలంగా వుండే రాగాలన్నింటిని తన సంగీతదర్శకత్వంలోని పాటలకు ఉపయోగించుకున్నారని ఈ క్రింది 101 పాటల రాగాలపట్టిక ద్వారా అర్ధమవుతుంది. ఇప్పుడు ఆ సరాగాల వరసను చూద్దాము --

1. కళ్యాణి(కర్నాటిక్)/యమన్(హిందుస్థానీ) రాగంలో చేయబడిన పాటలు:

1.పలుకరాదటే చిలుకా (షావుకారు)

2.ఆ మనసులోనా (పల్లెటూరు)

3.కుడి ఎడమైతే (దేవదాసు)

4.చల్లని వెన్నెలలో (సంతానం)

5.హృదయమా సాగిపొమ్మా (పరోపకారం)

6.రావే నా చెలియా (మంచి మనసుకు మంచిరోజులు)

7.మది శారదాదేవి మందిరమే (జయభేరి)

8.జగమే మారినది (దేశద్రోహులు)

9.పూవై విరసినా పున్నమివేళా (శ్రీ తిరుపతమ్మ కధ)

10. రారా కృష్ణయ్యా (యమన్ రాగం) (రాము)


2. రాగేశ్వరి లేదా రాగేశ్రీ లో పాటలు:-

1.అన్నానా భామినీ (సారంగధర)

2.ఇది నా చెలీ ఇది నా సఖీ (చంద్రహారం)


3. భీంప్లాస్ లేదా అభేరి రాగంలో పాటలు:-

1.అందమె ఆనందం (బ్రతుకుతెరువు)

2.దేవదేవ నారాయణ (శ్రీకృష్ణార్జున యుధ్ధం)

3.చల్లగ చూడాలి పూలను (పెళ్ళినాటి ప్రమాణాలు)

4.పదిమందిలో పాట పాడినా (ఆనందనిలయం)

5.నేలతో నీడ అన్నది (మంచిరోజులు వచ్చాయి)

6. ఈ జీవన తరంగాలలో (జీవనతరంగాలు)

 

4. షణ్ముఖప్రియ:-

1.దేవీ శ్రీదేవీ మొరలాలించి (సంతానం)

 

5. హుసేనీ:-

1.రాజా మహరాజా (టింగురంగ)

 

6. హరికాంభోజి స్వరాలు:-

1.మనవి సేయవే మనసార (రేచుక్క పగటిచుక్క)

2.నిజమైనా కలయైనా నిరాశలో (మూగనోము)

3.రామయతండ్రీ (సంపూర్ణరామాయణం)

 

7. రీతిగౌళ రాగంలోని పాటలు:-

1.శేషశైలావాస (శ్రీ వేంకటేశ్వర మహత్మ్యం)

 

8. కాపి(కర్నాటక):-

1.కలకానిది నిజమైనది (వెలుగునీడలు)

 

9. ఖరహరప్రియ రాగంలో పాటలు:-

1.పయనించే మన వలపుల (బావామరదళ్ళు)

2.మనసుగతి ఇంతే (ప్రేమనగర్)

3.వద్దుర బాబూ వద్దురా (కనకతార)

 

10. శంకరాభరణం లో పాటలు:-

1.నా హృదయంలో నిదురించే చెలీ (ఆరాధన)

2.నీతికి నిలబడి నిజాయితీగా (పూలరంగడు)

 

11. దర్బారీకానడ లో పాటలు:

1.శివశంకరీ శివానందలహరి (జగదేకవీరుని కధ)

2.విరిసే కన్నులలో వేయి బాసలు (డాక్టర్ బాబు)

 

12. హిందోళం లేదా మాల్కౌంస్ రాగాలలోని పాటలు:-

1.మోహనరూపా గోపాలా (కృష్ణప్రేమ)

2.కరుణా చూడవయా (దీపావళి)

3.సందేహించకుమమ్మా(లవకుశ)

4.నీ లేతగులాబీ పెదవులతో (మా ఇంటి దేవత)

5.సుడిగాలిలోన దీపం (జీవితచక్రం)

 

13. హంసధ్వని లో పాటలు:-

1.వాతాపి గణపతిం భజే (వినాయకచవితి)

 

14. పంతువరాళి లేదా కామవర్ధని లో పాటలు:

1. దినకరా శుభకరా (వినాయకచవితి)

 

15. ఖమాస్ రాగంలో పాటలు:-

1. సుందరి నీవంటి దివ్యస్వరూపమ్ము (మాయాబజార్)(కర్ణాటక శైలి)

2.మదిలో మౌనముగా(శకుంతల) (హిందుస్థానీ శైలి)

3. ఓ చెలి కోపమా అంతలో తాపమా (శ్రీకృష్ణ తులాభారం)

 

16. భాగేశ్వరి రాగంలో పాటలు:-

1.అలిగితివా సఖీ ప్రియా (శ్రీకృష్ణార్జునయుధ్ధం)

 

17. మోహన లేదా భూప్ రాగాలలో పాటలు:-

1.మౌనముగా నీ మనసు పాడినా (గుండమ్మకధ)

2.మత్తు వదలరా నిద్దుర (శ్రీకృష్ణ పాండవీయం)

3.వినరా వినరా నరుడా (గోవులగోపన్న)

4.తిరుమల మందిర సుందరా (మేనకోడలు - సినిమాలో లేని పాట)

5. ఘనా ఘన సుందరా (భూప్) (భక్త తుకారాం)

 

18. మధ్యమావతి రాగం:-

1.రావే ప్రణవరూపిణీ రావే (స్వర్ణమంజరి)

2.మల్లియలారా మాలికలారా (నిర్దోషి)

 

19.  గౌరీమనోహరి రాగం:/

1.మమతలు లేని మనుజులలోనా (గాలిమేడలు)

 

20. శుధ్ధ సావేరి రాగం :-

1.నిన్నలేని అందమేదో (పూజాఫలం)

 

21. శ్రీరాగం :-

1.నీ సుఖమే నే కోరుకున్నా (మురళీకృష్ణ)

2.జో లాలీ..లాలి నా చిట్టితల్లీ (ధర్మదాత)

 

22. పహడి రాగం:

1. ఈ నల్లని రాలలో (అమరశిల్పిజక్కన్న)

 

23. ద్విజావంతి రాగం:-

మనసున మనసై (డాక్టర్ చక్రవర్తి)

 

24. చక్రవాకం:-

1.విధి వంచితులై (పాండవవనవాసం)

 

25. మలయమారుతం:-

1.కొండగాలి తిరిగింది (ఉయ్యాలజంపాల)

 

26. ఆరభి రాగం:-

1.కులములో ఏముందిరా (సత్య హరిశ్చంద్ర)

2.ఈ జన్మ సరిపోదు గురుడా (రహస్యం)

 

27. బిలాస్ఖాన్ తోడి రాగం:-

1. బొమ్మను చేసి ప్రాణము పోసి (దేవత)

 

28. వలజి:-

1. నా రాణి కనులలోనే (చిలకా గోరింక)

 

29. శివరంజని రాగం:-

1.జోడుగుళ్ళ పిస్తోలు ఠా... (అత్తా ఒకింటి కోడలే)

 

30. నఠభైరవి రాగం:-

1. మగజాతికి నువు బలిపశువమ్మా (స్త్రీజన్మ)

2. రాధనురా నీ రాధనురా (పెళ్ళిచేసిచూడు)

 

31. పీలు రాగం:

1.ఇంతేలే నిరుపేదల బ్రతుకులు

     (పుణ్యవతి)

 

32. సావేరీ రాగం:-

1. దీని భావము నీకే తెలియునురా (రహస్యం)

 

33. జంఝూటి రాగం:

1.ధనమేరా అన్నిటికి మూలం (లక్ష్మీనివాసం)

 

34. తోడి రాగ స్వరాలు:-

1. మనిషైతే మనసుంటే (అమాయకుడు)

2.బాబూ వినరా అన్నదమ్ముల కథ ఒకటి (పండంటికాపురం)


35. ఘూర్జరి తోడి:-

1.మాధవా మౌనమా సనాతనా (శ్రీ సత్యనారాయణ మహత్మ్యం)

 

36. ఆనందభైరవి రాగం:-

1.నే తాళలేనే ఓ చెలియా (శ్రీ కృష్ణావతారం)

 

37. మోహన కళ్యాణి:-

1. కరుణాలవాల ఇది నీదులీల (చెంచులక్ష్మి)

 

38. సింధుభైరవి రాగంలో పాటలు:-

1.శ్రీరస్తు చిన్నారి నా చెల్లికి (విజయం మనదే)

2.ఎవరో వస్తారని ఏదో చేస్తారని (భూమికోసం)

3.ముక్తిమార్గమూ కనలేవా (కృష్ణమాయ)

 

39. అన్యస్వరాలతో సౌదామిని రాగం:

1.ఆవేశం రావాలి ఆవేదన కావాలి (మనసు మాంగల్యం)

 

40. భైరవి స్వరాలు:

1.గాంధి పుట్టిన దేశమా ఇది (పవిత్రబంధం)

 

41. మలహరి రాగం:-

1.ఏనాడు మొదలెడితివో ఓ విధి (చంద్రహారం)

 

42. ఉదయరవిచంద్రిక లేదా శుధ్ధ ధన్యాసి రాగం:-

1. భలే మంచి రోజు పసందైన రోజు (జరిగినకథ)

 

మిశ్రమ రాగాలతో పాటలు:-

 

43. మోహన,శంకరాభరణం రాగాలతో :

  1.  అవునా'! నిజమేనా (మల్లీశ్వరి)

 

44. భీంప్లాస్, ఖరహరప్రియ రాగాలతో:

1. నిన్న కనిపించింది (రాణి రత్నప్రభ)

 

45. చక్రవాకం, కానడ రాగాలతో:

1.రసికరాజ తగువారము కామా (జయభేరి)

 

46. పహడి,కాపి,పీలు రాగాల ఛాయలతో:

1. పాడుతాతీయగా చల్లగా (మూగమనసులు)

 

47. కీరవాణి, సింధుభైరవి రాగ స్వరాలతో:

1.విరిసిన వెన్నెలవో పిలిచిన... (బందిపోటు దొంగలు)

 

48.  భైరవి ,తోడి స్వరాలతో:

1. టా టా వీడుకోలు... (బుధ్ధిమంతుడు)

 

రాగమాలిక గీతాలు :-

 

 1. ఆనందభైరవి/శుభపంతువరాళి/

సింధుభైరవి/కాపి/నౌరోజ్/జంఝూటి రాగాలతో -

పుత్తడిబొమ్మా పూర్ణమ్మా (కన్యాశుల్కం)

 

2.కాపి/హిందోళం/హంసానందిని/

కేదారగౌళ/మోహన రాగాలతో -

ప్రళయ పయోధిజలే (భక్తజయదేవ)

 

3.హంసానందిని/హిందోళం రాగాలతో

జయ జయ జయ నటరాజా(వాల్మీకి)

 

4.కళ్యాణి/మోహన/హంసధ్వని రాగ ఛాయలతో:-

 ఎవరివో నీవెవరివో (పునర్జన్మ)


5.మాయామాళవగౌళ/ముఖారి/

సింధుభైరవి/సోహిని రాగాలతో:

తకిట తకిట ధిమి తబలా ఢక్కా (రాజమకుటం)

 

6.హంసధ్వని/వలజి/మోహన రాగాలతో:

జయత్వదభ్రవిభ్రమ- శివస్తోత్రం (సీతారామకళ్యాణం)

 

7.కానడ/శంకరాభరణం/మోహన/

ధన్యాసి/కేదారగౌళ/కళ్యాణి రాగాలతో

శ్రీ నగజా తనయం (హరికథ) (వాగ్దానం)


8.జంఝూటి/కాపి రాగాలతో:

దేవదేవ ధవళాచల (భూకైలాస్)

 

9.కళ్యాణి/కేదారగౌళ/శంకరాభరణం/కానడ

/పంతువరాళి/మధ్యమావతి రాగాలతో

శ్యామలా దండకం (మహాకవి కాళిదాసు)

 

11.కాంభోజి/కానడ/కీరవాణి/

మాయామాళవగౌళ/నాటకురంజి రాగాలతో -

ముక్కోటి దేవతలు ఒక్కటైనారూ (బావామరదళ్ళు)

 

12.శుధ్ధ ధన్యాసి/పడదీప్/

నఠభైరవి/ఖరహరప్రియ రాగాలతో

 శిలలపై శిల్పాలు చెక్కినారు (మంచిమనసులు)

 

13.కళ్యాణి/భాగేశ్వరి/హిందోళం రాగాలతో:

 ఝణఝణ కింకిణీ.. (కన్నకొడుకు)

 

14.కేదార్/మాల్కౌంస్/హేమంత్ రాగాలతో:

చెలియ కురుల నీడ (పెద్దక్కయ్య)

 

వచ్చే వారం నుండి ఘంటసాల  స్వీయ సంగీత దర్శకత్వంలోని  సదా మదిలో మెదిలే సజీవరాగాలు మీకోసం...

అంతవరకు సెలవు...


ప్రణవ స్వరాట్

Wednesday, 11 February 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 1 - ఉపోద్ఘాతం

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!



ఘం
టసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 1

నేడు కోట్లాది తెలుగువారల అత్యంత అభిమాన, ఆరాధ్యగాయకుడు శ్రీ ఘంటసాల వేంకటేశ్వరావు గారి 52వ వర్ధంతి. 52 ఏళ్ళకే ఈ లోకంతో బంధాన్ని తెంచుకొని మనకు తెలియని లోకాలకు తరలి పోయి అప్పుడే 52 సంవత్సరాలు అవుతున్నదంటే నమ్మశక్యం కాదు. భౌతికంగా ఘంటసాల మనకు దూరమైనా ఆయన పాట, మాట, రూపం మన మనస్సుల్లో ఇంకా పదిలంగానే వుంది. తెలుగు భాష వున్నంతవరకు ఘంటసాల పాట వినిపిస్తూనేవుంటుంది.

సంగీత సరస్వతి మానసపుత్రుడు ఘంటసాల. తెలుగువారి అదృష్టంకొద్ది లభించిన అపురూప గానపెన్నిధి. కఠోర పరిశ్రమతో సంప్రదాయ, శాస్త్రీయ సంగీతాలలో అపారమైన ప్రజ్ఞను సాధించినప్పటికి అధునాతన లలితసంగీత నిర్మాతగా ఘంటసాల వేసిన ముద్ర ఎన్నటికి చెరగదు, చెరపబడదు.

1944 లో తెలుగు చలనచిత్ర రంగప్రవేశం చేసినది మొదలు 1974 లో (అతి చిన్నవయసులో 52 ఏళ్ళు) నిర్యాణం చెందేంతవరకుఘంటసాల పాట, ఘంటసాల సంగీతం తెలుగువారందరినీ తీవ్రంగా ప్రభావితం చేసింది. సుమధురమైన గాత్రం, ఆపాతమధుర స్వరరచనలు, ఉన్నత వ్యక్తిత్వం, సామాజిక స్పృహ ఘంటసాలను తెలుగువారి ఆరాధ్యపురుషునిగా చేసాయి. మరి ఏ ఇతర గాయకుడికి లభించని ప్రజాదరణ, అభిమానం, గౌరవమర్యాదలు ఘంటసాల సొత్తై ఎవరికీ అందనంత ఉన్నతశిఖరాలపై కూర్చుండబెట్టాయి. రాశికన్నా వాసి యే మిన్నయని నిరూపించిన ఏకైక లలితసంగీత గాయకుడు మన ఘంటసాల. తన 30 సంవత్సరాల సినీజీవిత కాలంలో తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో పాడిన పాటలు నాలుగువేలకు లోపే అయినా, స్వర రచన చేసినది 120 సినీమాలకే అయినా అవి అపూర్వ చరిత్రను సృష్టించి ఘంటసాలవారిని మరపురాని మధురగాయకుడిగా నిలబెట్టాయి. మానవతా దృక్పథంతో ఘంటసాల సమాజానికి, చిత్రసీమకు చేసిన సేవలను పాలిత ప్రభుత్వాలు తగురీతిలో గుర్తించకపోయినా, కోట్లాది తెలుగు హృదయాలు కనపరుస్తున్న భక్తిపూర్వక ప్రేమాభిమానాలు ఘంటసాలవారిని అత్యున్నత బిరుదులన్నింటికీ అతీతుడిని చేశాయి.

శ్రీ ఘంటసాల గానగంధర్వుడు, అమరగాయకుడు. నవరసభరితమైన ఈ అపూర్వ గాయకుని గీతాలు ఎల్లప్పుడు శ్రోతల మనస్సులను రంజింపజేస్తూ, మనకే తెలియని ప్రశాంతతను, మానసికానందాన్ని, స్ఫూర్తిని కలుగజేస్తాయి.

శ్రీ ఘంటసాల శతజయంతి ఉత్సవాల తర్వాత, ప్రపంచవ్యాప్తంగా వారి జయంతి, వర్ధంతి సంగీతోత్సవాలు నిరంతరం భారీగా ఎక్కడో చోట నిర్విరామంగా జరుగుతున్నాయి.

నిజానికి  శాస్త్రీయ, లలిత సంగీతాలు నా వృత్తి, ప్రవృత్తి కాకపోయినా కేవలం ఘంటసాలవారి సంగీతం మీద వున్న మక్కువ, మమకారాలతో ఒక సామాన్య సంగీతాభిమానిగా నా వంతు పాలుపంచుకునే ఉద్దేశంతో ఘంటసాల 101వ జన్మదినోత్సవ సందర్భంగా, ఆయన గానం చేసిన వేలాది గీతాలనుండి 101 ఏకగళ గీతాలను  కొన్ని వాట్సప్ సమూహాలలో ఘంటసాల సజీవరాగాలుగా పునశ్చరణ చేసుకోవడం జరిగింది.

ఈనాడు శ్రీ ఘంటసాల 52వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన స్వీయసంగీత దర్శకత్వంలో తాను ఇతర గాయనీ గాయకులతో పాడిన ఆణిముత్యాలను 'ఘంటసాల-సదా మదిలో మెదిలే సజీవరాగాలు' అనే మకుటంతో వారం వారం ధారావాహికగా సమర్పించాలని సంకల్పిస్తున్నాను.

మీ అందరి ప్రోత్సాహాభిమానాలు తప్పక లభిస్తాయని ఆశిస్తున్నాను.


ప్రణవ స్వరాట్

 

...తరువాయి వచ్చేవారం...


Saturday, 8 November 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 107వ భాగం - బలే మంచి రోజు

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నూటయరవ భాగం ఇక్కడ

107వ సజీవరాగం - బలే మంచి రోజు

చిత్రం - జరిగిన కథ
గానం - ఘంటసాల
రచన - డా.సి.నారాయణరెడ్డి

సంగీతం - ఘంటసాల

పల్లవి:

బలే మంచిరోజు పసందైన రోజు

వసంతాలు పూచే నేటి రోజు

హా..య్.. వసంతాలు పూచే నేటి రోజు

చరణం 1:

గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు

గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు ! గుండెలోని!

నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు 

                                                !బలే మంచి రోజు!

చరణం 2:

చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు

తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు! చందమామ!

కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు 

                                                !బలే మంచి రోజు!

లలిత, సినిమా గీతాలకు తన కచేరీల ద్వారా విస్తృత ప్రచారాన్ని కల్పించి, శాస్త్రీయ సంగీత కచేరీల పధ్ధతిలో లలిత సంగీతానికి కూడా  ఒక మర్యాదను, విశిష్టతను, ఔన్నత్యాన్ని తెచ్చిపెట్టిన ఖ్యాతి గానగంధర్వుడు ఘంటసాలగారికే దక్కుతుంది. లలిత, సినీమా గీతాలతో సంగీత కచేరీలు చేసే సత్సాంప్రదాయం ఘంటసాలగారితోనే ప్రారంభమై ప్రజా బాహుళ్యంలో ఒక గుర్తింపును పొందిందని చెప్పవచ్చును.

ఘంటసాలవారు తన లలిత సంగీత కచేరీలకు ఒక నూతన ఒరవడిని, క్రమశిక్షణను ఏర్పర్చారు. తన కచేరీ వేదికకు ఒక మర్యాదను, పవిత్రతను కల్పించారు. శాస్త్రీయ సంగీత విద్వాంసులులాగే పరిమిత వాద్యగోష్టితో  వేదికమీద కూర్చొనే పాడేవారు. ఒక చేత పాటల పుస్తకం, మరో చేయి చెవిమీద పెట్టుకొని పాడడం ఘంటసాలగారి అలవాటు. ఎన్నో వందల కచేరీల అనుభవం వుండీ కూడా ఆయన పుస్తకం చూడకుండా  ఏ పాటా పాడేవారు కాదు. గతం తరంలో అనేకమంది మహావిద్వాంసులంతా తమ కచేరీలను 'ఆది నాట అంత్య సురట' అనే సూత్రాన్ని పాటిస్తూ వచ్చారు. అంటే తమ కచేరీలను నాట రాగంతో ప్రారంభించి చివర సురటి రాగంతో ముగించేవారు. నాట, సురటి రెండు రాగాలు జన్యరాగాలే అయినప్పటికీ అత్యంత శుభప్రదమైన రాగాలుగా భావిస్తారు. అలాగే, ఘంటసాలవారు కూడా తన సినీ గీత కచేరీలలో ఒక క్రమపధ్ధతిని పాటించారు. తన కచేరీలో మొదటి గీతంగా 'వినాయకచవితి' సినిమా లోని 'దినకరా శుభకరా దేవా..' తో ప్రారంభించి ఆఖరున 'బ్రతుకుతెరువు' సినిమాలోని 'అందమె ఆనందం' పాటతో ముగించేవారు.  'దినకరా' పాట లోకరక్షకుడైన సూర్యభగవానుని స్తుతిస్తూ పాడే పాట. పంతువరాళి లేక కామవర్ధని అనే రాగంలో ఘంటసాలవారే స్వరపర్చిన గీతం. ఈ రాగాన్నే హిందుస్థానీ బాణీలో పూర్యాధనశ్రీ అని అంటారు. ఆఖరు పాట 'అందమే ఆనందం' హిందుస్థానీ భీంపలాస్ రాగంలో ఘంటసాలగారే చేశారు. దీనిని కర్ణాటక సంగీత శైలిలో అభేరి అంటారు. ఈ రెండు గీతాలు రెండు విధాలైన మూడ్స్ ను శ్రోతలలో రేకెత్తించి ఆనంద పరవశులను చేసేవి. (ఈ రెండు పాటలు రావడానికి ముందు ఘంటసాలగారు తన కచేరీలలో తమ గురువుగారి కృతులు పద్యాలతో, కరుణశ్రీ, జాషువా, పద్యాలతో, జానపద గీతాలతో కచేరీలు చేసేవారని చెప్పగా విన్నాను). 

తర్వాతి కాలంలో అంటే 1969లో తన స్వీయసంగీతంలో ఆలపించిన 'జరిగినకథ' చిత్రంలోని సి.నారాయణరెడ్డిగారి 'బలే మంచిరోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు' అనే పాట బహుళ జనాదరణ పొంది ఘంటసాలవారి కచేరీలలో ఆఖరి వరస పాటలలో చోటు చేసుకుంది. 'అందమే ఆనందం' లేదా 'బలే మంచిరోజు' ఈ రెండు పాటలలో ఏదో ఒక పాటతో మాస్టారు తన కచేరీని ముగించేవారు.

అటు ఘంటసాల మాస్టారికి, ఇటు కోట్లాది తెలుగువారికి హృదయరంజకమైన 'బలే మంచి రోజు పసందైన రోజు' పాటే ఈ ధారావాహికకు ముగింపు సజీవరాగం గా మీకు సమ‌ర్పిస్తున్నాను.

యువక దశ దాటి నడివయసులో వున్న ధనిక కథానాయకుడు తన ఇంట ఆశ్రయంకోరి వచ్చిన ఓ పేద పిల్లను చూసి మనసుపడి ఆమెను వివాహం చేసుకునే తలపులో పడి మహదానంతో 'బలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు అని పరవశించి పాడిన పాట. అయితే తన ప్రేమ ఫలించదని, తన తమ్ముడు, ఆ అమ్మాయి పరస్పరం ప్రేమించుకుంటున్నారని తెలిసి మౌనంగా తన ప్రేమను తమ్ముడి సుఖసంతోషాలకోసం త్యాగం చేసిన ఒక అన్నగారి కథే 'జరిగినకథ' సినిమా.

డా. సినారాయణరెడ్డిగారు వ్రాసిన ఈ గీతాన్ని ఘంటసాల మాస్టారు 'శుధ్ధ ధన్యాసి' రాగ స్వరాలతో చేశారు. ఈ రాగాన్నే 'ఉదయరవిచంద్రిక' అని కూడా అంటారు. ఇది కర్ణాటక సంగీతంలో 22వ మేళకర్త యైన 'ఖరహరప్రియ'కు జన్యం. ఐదు స్వరాలు కలిగిన ఔడవరాగం. ప్రపంచదేశాలన్నిటిలో ఈ స్వరాలు కలిగిన స్కేల్స్ ప్రచారం లో వున్నాయి. వెస్ట్రన్ సంగీతంలో ఈ రాగాన్ని 'మైనర్ పెన్టానిక్ స్కేల్' అని, ఈస్టర్న్ కంట్రీస్ లో 'చైనీస్' స్కేల్ ' అని అంటారట.  అందుకే జనరంజకమైన రాగంలో  ఘంటసాలగారు స్వరపరిచిన 'బలే మంచి రోజు' పాట ఈనాటికీ సంగీతాభిమానులను మురిపించి మైమరపిస్తూనే వుంది. ' అందమే ఆనందం' పాటలాగే ఈ పాటకూడా పియానోను ప్రధాన వాద్యంగా చేసుకొని రూపొందించిన గీతం. పియానోతో పాటు సితార్, ఫ్లూట్, క్లారినెట్, వైలిన్స్, డబుల్బేస్, తబలా, డోలక్, తాళవాద్యాలను ఈ పాటలో ఉపయోగించారు. ఇక పాట పాడిన ఘంటసాలగారి గాత్రమాధుర్యం గురించి ఏం చెప్పగలం! తనివితీరా విని ఆనందించడం తప్ప. పాట మధ్యలో వచ్చే హమ్మింగ్స్, గమకాలు, సందర్భోచితమైన భావప్రకటనలు కేవలం ఘంటసాల మాస్టారికే సాధ్యం. అతి సునాయాసంగా, అలవోకగా ఆలపించారు.

1970లో జరిగిన కథ సినిమాను కన్నడంలో రాజ్ కుమార్ హీరోగా 'నన్న తమ్మ' పేరుతో నిర్మించారు. తెలుగు వెర్షన్ కు డైరక్ట్ చేసిన కె.బాబూరావే కన్నడం సినిమాకు డైరెక్టర్. అలాగే ఈ కన్నడ చిత్రానికి సంగీత దర్శకత్వాన్ని ఘంటసాలగారే నిర్వహించారు. అయితే ఆయన ఈ సినిమా లో ఒక పాట కూడా పాడకపోవడం విశేషం. ' 'బలే మంచిరోజు' వరసలోనే చేసిన కన్నడం పాటను పి.బి.శ్రీనివాస్ ఆలపించారు.

ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారందరికీ తన మధుర గీతాలతో  ఆనందప్రదమైన ఎన్నో  మంచిరోజులను పంచి ఇచ్చిన గానగంధర్వుడి జీవితంలో చోటు చేసుకున్న కొన్ని మరపురాని మధుర క్షణాలను మనం మననం చేసుకుందాము.

'బలే మంచిరోజు పసందైన రోజు' 1969 లో వచ్చింది.

అంతకుముందు ఘంటసాలవారి జీవితంలో చోటుచేసుకున్న మధుర క్షణమంటే అది సావిత్రమ్మగారితో 1944 మార్చ్ లో జరిగిన వివాహమే. ఆ వివాహం జరిగిన శుభముహుర్త బలం శ్రీ సముద్రాల రాఘవాచార్యులవారి పరిచయ భాగ్యం కలిగి సినిమా రంగంలో బంగారు భవిష్యత్తు కు బాటలు వేసింది.

1969 - తిరుమల-తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయక పదవి.

1970 జనవరి లో భారత ప్రభుత్వ 'పద్మశ్రీ' బిరుదు ప్రదానం.

1970 ఫిబ్రవరి 1 న హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో లో జరిగిన అతి బ్రహ్మాండమైన 'ఘంటసాల

సినీ సంగీత రజతోత్సవం.

1971 అక్టోబర్- నవంబర్ లలో యూరప్, యు.ఎస్., కెనడా దేశాల సంగీత పర్యటన. అదే పర్యటనలో ఐక్యరాజ్య సమితిలో జరిగిన సంగీత కచేరీలో శాంతి పతకం బహుకరణ.

1972-73 లో అతి పవిత్రమైన,  ప్రతిష్టాత్మకమైన తెలుగు తాత్పర్య సహిత భగవద్గీతా గానం.

ఇవి ఘంటసాలగారు సజీవులైవుండగా  వారి జీవితం లో చోటుచేసుకున్న కొన్ని మధుర స్మృతులు, నవ వసంతాలు విరిసిన బలే మంచి రోజులు.

నిజానికి ఘంటసాల సంగీతం అనంత రసవాహిని. ఎన్ని యుగాలైనా ఈ విశ్వంలో ధ్వని అనేది వున్నంతవరకు ఘంటసాల గళం నిత్యనూతనంగా సంగీతాభిమానులను అలరిస్తూనే వుంటుంది. ఘంటసాల పాట ఏది విన్నా ఏదో ఒక స్ఫూర్తిని, ఒక గమ్యాన్ని సూచిస్తునేవుంటుంది. ఘంటసాల గీతం కలిగించే దివ్యానుభూతి తో ప్రతీరోజు ఆనందప్రదమైన రోజుగా మనసుకు హాయిని కలిగిస్తుంది.

ప్రపంచంలో ఏ ఇతర గాయకుడు పొందనంత అపరిమిత ప్రజాభిమానాన్ని, గౌరవ మర్యాదలను పొందిన అద్వితీయ గాయకుడు మన ఘంటసాల. గత రెండేళ్లుగా వారి శతజయంతిని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నిర్విరామ లలిత సంగీతోత్సవాలే అందుకు నిదర్శనం. వేలాది గాయనీగాయకులు, సాంస్కృతిక సంస్థలు అత్యద్భుతమైన సంగీతోత్సవాలు జరుపుతూ ఘంటసాలవారి పట్ల తమకుగల భక్తిప్రపత్తులను ప్రకటిస్తున్నారు.

ఘంటసాల శత జయంతి సందర్భంగా నేను మొదలు పెట్టిన 'ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం' ధారావాహిక  ప్రారంభమై నేటికి 107 వారాలు అయింది. నేను గాయకుడినో లేక భాషాజ్ఞానమున్న రచయితనో కాదు. కేవలం ఘంటసాలవారి సంగీతం పట్ల గల శ్రధ్ధాసక్తులతో 'ఘంటసాల సజీవరాగాలు' శీర్షికను మీ అందరి ప్రోత్సాహంతో, ఆదరాభిమానాలతో కొనసాగించగలిగాను. ఘంటసాల సంగీతం అనంతం. ఎందరు ఎన్ని విధాలుగా విశ్లేషించినా మనసుకందని భావాలెన్నో ఆ పాటలలో నిగూఢమైయ్యే వుంటాయి.

నాకున్న పరిమిత జ్ఞానానికి ఎక్కడో చోట, ఏదో దగ్గర ముగింపు (.) పెట్టక తప్పని పరిస్థితి. చాలామందిలాగే నాకు ఒక చిన్న ఆశ. ఘంటసాల సజీవరాగాలు అందరూ 'బాగానే వుంది' అని అనకుండా 'బాగుంది' అనే స్థాయిలోనే ముగించాలనేది నా కోరిక.  'బాగుంది', 'బాగానే వుంది' అనే మాటల మధ్య గల వ్యత్యాసం ఏమిటో మీ అందరికీ బాగా తెలిసిందే.

అందుకే ఈనాటి ఈ 'బలే మంచి రోజు, పసందైన రోజు' తో  ఘంటసాలవారికి భక్తిప్రపత్తులతో నివాళులు సమర్పించుకుంటూ శెలవు తీసుకుంటున్నాను.



ప్రణవ స్వరాట్


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 34 - దయరాదా నామీదా మరియాదా

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను...