అధ్యాయం - 2 - భాగం 16
వినాయకచవితి - నలుగిడరే నలుగిడరే నలుగిడరారే
"ఈ శెలవుల్లో మనందరం అమ్మమ్మగారి వూరెడుతున్నాం" అమ్మకి ఆనందం, పిల్లలికి ఆటంబాంబ్. "అమ్మమ్మ ఊరికా! నో ఛాన్స్, నేను ఛస్తే రాను! అక్కడికి వస్తే అమ్మమ్మ వారం వారం నలుగుపిండితో నలుచుకుని కుంకుడుకాయరసంతో తలంటు స్నానం అంటూ టార్చర్ పెడుతుంది. ఆ హరాస్మెంట్ భరించడం నావల్లకాదు. నే రానంటె రానే రాను" మనవడి ఓవర్ రియాక్షన్.
"నలుగుపిండితో తలంటుస్నానం ఒంటికి ఎంతో మంచిది తెలుసా! మీ షాంపూలు, షవర్ బాత్ ల కంటే చాలా ఆరోగ్యకరం. మా చిన్నప్పుడు విధీగా ప్రతీ శనివారం తెల్లవారుజామునే పిల్లల్ని లేపి ఒంటికి నువ్వులనూనె పట్టించి, బియ్యపుపిండి, శెనగపిండిలో పసుపుపొడి, పన్నీరు వంటి సుగంధ ద్రవ్యాలు కలిపి, ఆ ముద్దతో ఒళ్ళంతా నలిచి, కుంకుడుకాయరసంతోనో లేకపోతే షీకాయ ముద్దతోనో తలంటు స్నానం చేయించేవాళ్ళు! ఆ తర్వాత సాంబ్రాణి పొగతో జుట్టంతా ఆరబెట్టి జడలేశేవారు. ఇప్పటికీ నా ఒళ్ళు ఇంత నున్నగా, నిగనిగలాడుతూ ప్రకాశవంతంగా వుందంటే దానికి కారణం నలుగుపిండి స్నానమే తెలుసా!" బామ్మ సెల్ఫీ.
మా బామ్మ పురాణకాలపు కబుర్లని , సూక్తిముక్తావళిని శ్రద్ధగా వింటూ పాటించే ఏకైక శ్రోత మా మున్నీ ఒక్కర్తే. నలుగుపిండి తయారీ గురించి వాటిలోని ఔషధ గుణాలగురించి, అవి మన ఒంటికి చేసే మంచి గురించి బామ్మ లెక్చెర్ ని మహా శ్రద్ధగా ఆలకిస్తోంది.
"అసలు నలుగుపిండి
తలంటు స్నానం వెనుక ఒక గొప్ప పౌరాణిక గాధే వుంది తెలుసా"! కథలు, కాకరకాయలు అంటే మైమరచిపోయే మా మున్నీ ఆ కధేమిటో చెప్పమని బామ్మని
ఊదరకొట్టింది.
అప్పుడు మా బామ్మ
చెప్పిన కథాకధనం బెట్టిదనినా...
ఫ్లాష్ బ్యాక్ లో...
కైలాసం
హిమవన్నగంలో పార్వతీ
పరమేశ్వరుల ఆవాసం. ఇల్లు, ఇల్లాలు అసలు ఈలోకంతోనే సంబంధం లేదనట్లుగా ఒక ఏకాంత ప్రదేశంలో శివుడు
ఏకాగ్రచిత్తంతో ధ్యానం చేస్తూ
తపస్సమాధిలో వున్నాడు. పతి
ప్రేమాదరణలకు దూరమై ఏకాంతవాసంలో వున్న పార్వతి ...
మధురహాసా మృదువిలాసా
శైలసుత హృదయేశా కరుణించి
తనను దరిచేర్చుకోమని దీనంగా ప్రార్ధిస్తున్నది. పార్వతి విరహవేదనను, శోకాన్ని తట్టుకోలేని చెలికత్తెలు స్వాంతన వాక్యాలు పలికి పార్వతిని సర్వాంగసుందరంగా అలంకరించి మహేశునిచెంతకు తీసుకువెళ్ళాలని పరిపరివిధాలుగా సపర్యలు చేయడం మొదలెడతారు. అందులో భాగంగా పార్వతీదేవి చెలికత్తెలంతా ....
"నలుగిడరే నలుగిడరే నలుగిడరారే
చెలువుగ
శ్రీగౌరికిపుడు నలుగిడరారే!
పసిడిపూలపీటా శివునిల్లాలికి వేయరే
జతజేసి కస్తూరి
జవ్వాజీ పూయరే
పసుపుగలిపి చందనమూ
నెమ్మేన రాయరే! నలుగిడరే!
మనసులోని వగదీరా
పన్నీరు చల్లరే
చిన్నారీ కన్నులలో వెన్నెలలు కాయగా
చెలియ మోము గని శివుడే చిందేసి డాయగా ! నలుగిడరే!
అంటూ నృత్యగీతాలతో పార్వతి దేహమంతా పరిమళద్రవ్యాలు కలిపిన నలుగుపిండితో నలిచి అభ్యంగన స్నానానికి సంసిద్ధం చేస్తారు. ఆ విధంగా తన శరీరానికి పట్టించిన నలుగుపిండితో పార్వతీదేవి ఒక అందమైన బాలుడి ప్రతిమను రూపొందిస్తుంది. అతి సుందరంగా వున్న ఆ బాలుడి ప్రతిమను చూసి ముచ్చటపడిన చెలికత్తెలంతా ఆ బొమ్మకు ప్రాణం పోయమని కోరడంతో పార్వతీదేవి తన దివ్యశక్తులతో ఆ ప్రతిమకు ప్రాణంపోస్తుంది. ముద్దులొలికే ఆ బాలుడిని చూసి పార్వతి మాతృహృదయం ఉప్పొంగి ఆ బాలుని తన కుమారునిగా స్వీకరిస్తుంది. తాను స్నానం చేసి వచ్చేదాకా పరులెవ్వరు లోపలికి రాకుండా కాపలాగా వుండమని తన కుమారుని ఆదేశించి లోపలకు వెళుతుంది.
అదే సమయంలో పరమశివుడు తన ధ్యానాన్ని ముగించుకుని పార్వతి ని చూచేందుకు వస్తాడు. శివుడు లోపలికి వెళ్ళడానికి వీలులేకుండా పార్వతీపుత్రుడు అడ్డుపడతాడు. ఇద్దరిమధ్యా వాగ్వాదం పెరిగి పెద్దై ఆగ్రహావేశాలతో త్రినేత్రుడు ఆ బాలుని శిరస్సును తన త్రిశూలంతో ఖండిస్తాడు. ఇంతలో స్నానంచేసి వచ్చిన పార్వతి తన కుమారుని మృతదేహాన్ని చూసి తీవ్రంగా చలించి విలపిస్తుంది. తర్వాతే పరమేశ్వరుడు జరిగిన విషయమంతా తెలుసుకుని పార్వతీ పుత్రుని పునరుజ్జీవుడిని చేయాలని సంకల్పిస్తాడు. కానీ ఆ బాలుని శిరస్సు లభించకపోవడం ఉత్తరదిక్కుగా పోయి ఉత్తరాభిముఖంగా తలపెట్టుకొని వున్న ఏ జీవి శిరస్సునైనా తీసుకురమ్మని శివుడు ఆజ్ఞాపిస్తాడు. శివుని ఆజ్ఞ మేరకు శివసేవకులు ఉత్తరాభిముఖంగా వున్న ఒక ఏనుగు శిరస్సును ఖండించి తీసుకువస్తారు. ఆ శిరస్సును మృతదేహానికి అతికించి మరల ప్రాణాలను పోస్తాడు మహేశ్వరుడు. ఆవిధంగా పార్వతీ తనయుడు గజముఖుడు అయ్యాడు. తర్వాత, పరమశివుడు ఆ కుమారుని కైలాసంలోని ప్రమధగణాలకు అధిపతిని చేశాడు. అందువలన గణపతి అని పిలవబడుతున్నాడు. ఏ కార్యం తలపెట్టినా తనను తొలుతగా పూజించి ప్రార్ధించేవారికి ఎటువంటి విఘ్నాలు కలుగకుండా ఆ కార్యం విజయవంతం చేసే దైవం కనుక గణపతిని విఘ్నేశ్వరుడని , వినాయకుడని దేవతలందరిచేతా కీర్తించబడ్డాడు. ఈనాటికీ మన అందరికీ తొలిదైవం వినాయకుడే.
అదీ కథ. చూశావా !
నలుగుపిండి స్నానం వెనుక ఎంతటి మహత్తర గాధ వున్నదో !
ఈవిధంగా నలుగుపిండి మన సంస్కృతి సంప్రదాయాలలో ఒక భాగమైపోయింది. పెళ్ళిళ్ళు, పండగలు, మరే ఇతర శుభకార్యాలు జరిగినా మంగళకరమైన ఈ నలుగుపిండి స్నానాలు తప్పనిసరి.
మన పౌరాణిక గాధలలో
కూడా దేవుళ్ళ కళ్యాణ ఘట్టాలలో ఈ నలుగు స్నానాల గురించి రసవత్తర వర్ణనలు
కనిపిస్తాయి. మన జనపదాలలో స్త్రీలకు
సంబంధించిన అనేక పాటలలో నలుగు పాటలకు కూడా ప్రాముఖ్యత నిచ్చారు. గత తరం వరకు భారతీయ స్త్రీలంతా ఆయా పాటలను తమ తల్లులు,
అమ్మమ్మలు, బామ్మల ద్వారా నేర్చుకుని పండగ పర్వదినాలలో
సందర్భానుసారంగా ఆ గీతాలను భక్తిశ్రధ్ధలతో పాడుతూ సంతోషంగా గడిపేవారు.
ఈ సదాచారాన్ని మన సినిమాలు కూడా బాగానే ఉపయోగించుకున్నాయి. మన సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పడుతూ వాటి విశిష్టతను అన్ని వర్గాల ప్రజలు తెలుసుకుని, చూసి ఆనందించేలా చక్కటి నృత్యగీత సన్నివేశాలను రసవత్తరంగా రూపొందిచేవారు. ఎంతో కళాత్మకదృష్టితో ఉదాత్తంగా ఆయా ఘట్టాలను కన్నులకింపుగా చిత్రీకరించేవారు. కన్నులకు, వీనులకు విందుచేసే అటువంటి నృత్యగీతం ... 'నలుగిడరే నలుగిడరే నలుగిడరారే' 1957 నాటి పౌరాణిక చిత్రరాజం 'వినాయకచవితి' సినీమాలోని పాట అదే నేటి మన సజీవరాగం.
ట్యాలెంట్ ఉన్న కళాకారులెందరో సినిమా రంగంలో వుండేవారు. అయితే వారందరికీ నిరంతరం అవకాశాలు లభించేవికావు. ప్రతిభ, విద్వత్ గల ఎంతోమంది గాయనీగాయకులు ప్రథమశ్రేణి గాయకులుగా రాణించే అవకాశాలు లభించక కోరస్ సింగర్స్ గానే మిగిలిపోయారు. అలాటి వారిని చూసి ఘంటసాల మాస్టారు చాలా బాధపడేవారు. అవకాశం వున్నంతవరకు తన సంగీతదర్శకత్వంలో కోరస్ పాటలు పాడే గాయనీగాయకులను ఎంతగానో ఆదుకుని ప్రోత్సహించేవారు.
ఈ నాటి మన సజీవరాగ గీతం ఒక బృందగానమే. ఘంటసాల మాస్టారు ఈ పాటను వైదేహి, ఉడత సరోజిని, సత్యవతి అనే గాయనులచేత సన్నివేశానికి తగినట్లుగా భావరాగ గమకయుక్తంగా పాడించారు. వినాయకచవితి సినిమాలో ఈ సన్నివేశంలో తెరమీద పార్వతీ దేవిగా సూర్యకళ, చెలికత్తెలుగా బాల, రాజేశ్వరి, శ్రీదేవీలు నటించారు.
ఘంటసాల మాస్టారు ఈ పాటను స్వరపర్చడానికి తన శుద్ధశాస్త్రీయ సంగీత విద్వత్ ను ఉపయోగించలేదు. సాధారణ కుటుంబాలలో సంగీతం తెలియని సామాన్య స్త్రీలు పాడుకునే నోముల పాటలు, మంగళహారతుల పాటల రీతిని అనుసరిస్తూ మన ప్రాంతీయత ప్రతిబింబించేలా సున్నితంగా, శ్రావ్యంగా ఈ పాటను తనదైన శైలిలో పాడించారు. ఇదమిద్ధంగా ఈ పాట ఫలానా రాగంలో వుందని చెప్పబడదు కానీ, ఖమాస్, దేశ్, తిలాంగ్ రాగ ఛాయలు వున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు రాగాలు హిందుస్థానీ సంగీతం లోని ఖమాస్ థాట్ కు చెందినవే.
ఈ సందర్భం
స్నానానికి, అందుకు సంబంధించిన
వస్తుసామగ్రితో నిండినది కావడంతో ఘంటసాల మాస్టారు ఈ పాటలో జలతరంగిణి, ట్యూబోఫోన్ వాద్యాలు స్ఫుటంగా వినపడేట్లు
ఉపయోగించారు. ఇతర వాద్యాలుగా వయొలిన్స్, సెల్లో, ఫ్లూట్, క్లారినెట్, తబలా, డోలక్ రిధిమ్స్ వినిపిస్తాయి.
ఘంటసాలగారిలోని సంగీతజ్ఞానాన్ని బాగా వినియోగించుకున్న సినిమా వినాయకచవితి. ఈ సినిమాలో మొత్తం 25 పాటలు, పద్యాలు, శ్లోకాలు వున్నాయి. ఇవికాక సన్నివేశాలను elevate చేయడానికి రీరికార్డింగ్. వీటన్నిటితో ఘంటసాలగారు ఈ సినిమాలో బాగానే శ్రమించి మంచి ఫలితాలు పొందారు. ఈ పాటలు, పద్యాలను ఘంటసాల, లీల, సుశీల, రాణి, కోమల, ఎమ్.ఎస్.రామారావు, మాధవపెద్ది, రాఘవులు, వైదేహి, సరోజిని, సత్యవతి మొదలగువారు పాడారు.
వినాయకచవితిలోని అన్ని పాటలను, మాటలను వ్రాసిన సముద్రాల రాఘవాచార్యులవారే ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. ముచ్చటగా మూడే సినిమాలకు డైరక్షన్ చేపట్టిన సముద్రాల వారి మొదటి సినిమా వినాయకచవితి కాగా, మిగిలిన రెండూ భక్త రఘునాధ్ (ఘంటసాలగారి స్వంత చిత్రం), బబృవాహన సినిమాలు.
అశ్వరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కె.గోపాలరావు నిర్మించిన మొదటి పౌరాణిక చిత్రం 'వినాయకచవితి'లోఎన్.టి.రామారావు, గుమ్మడి, జమున, కృష్ణకుమారి, సూర్యకళ, రాజనాల, ఆర్.నాగేశ్వరరావు, మిక్కిలినేని, జి.ఎన్.స్వామి, బాలకృష్ణ, నటించారు.
మాయాబజార్ సినిమా తర్వాత ఎన్.టి.రామారావు పూర్తి స్థాయి కృష్ణుడిగా నటించిన చిత్రం వినాయకచవితి. ఈ రెండు సినిమాలు 1957లో కొన్ని నెలలు వ్యవధిలో విడుదలై ఘనవిజయం సాధించాయి. వినాయకచవితి సినిమాలో శ్రీకృష్ణ పాత్రధారి ఎన్.టి.ఆర్.కు ఒక పాటకానీ, పద్యం కాని లేకపోవడం ఒక విశేషం.
వచ్చేవారం ఘంటసాలవారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.
ప్రణవ స్వరాట్

No comments:
Post a Comment