అధ్యాయం - 2 - భాగం 14
సంసారం - మనవూరే భారతదేశం మనమంతా భారతీయులం
" ... అందుచేత, విద్యార్ధులారా ..., భావిభారత పౌరులారా ... నవసమాజ నిర్మాతల్లారా... ఈ శుభదినాన నేను మీకు చెప్పొచ్చేదేమిటంటే, మనమంతా భారతీయులం, భరతనగర వాసులం. ప్రపంచంలో ఎవరికీ లేని ప్రత్యేకత మనకు వుంది... అదేమిటో తెలుసా! 'భిన్నత్వంలో ఏకత్వం'. ఈ దేశంలో వందలాది కోట్ల ప్రజలున్నారు. వీరందరిది ఒక భాషకాదు, ఒక మతం కాదు. ఇక్కడ వందలాది భాషలు, అంతకు రెట్టింపు జాతులు, కులాలు, మనిషికో మతంతో విభిన్నమైన ఆచార వ్యవహారాలు, సంస్కృతులు కలిగివున్నారు. పరస్పర భేదాభిప్రాయాలతో అంతఃకలహాలతో మనశ్శాంతి లేకుండా మనుగడ సాగిస్తున్నారు. అయినా జాతీయ సమైక్యత అనే సూత్రానికి దేశవాసులంతా కట్టుబడి వున్నారు. భారతీయత అనే మూలసూత్రం ఈ దేశవాసులను ఒక్కటిగా చేస్తోంది.
ఎన్నో శతాబ్దాల కాలం ఈ దేశవాసులు విదేశీయుల పాలనలో బానిస బ్రతుకులు బ్రతికి అష్టకష్టాలు అనుభవించడానికి వారిలోని అనైక్యతే ముఖ్యకారణం. తమ కష్టాలనుండి బయటపడడానికి, పరాయి పాలన నుండి విముక్తిని పొంది స్వాతంత్ర్యం సాధించుకోవడానికి జాతీయసమైక్యత, అహింసావాదమే తప్పనిసరియని భారత స్వాతంత్ర్య సమరయోధులంతా భావించారు. గాంధీ మహాత్ముడి నాయకత్వంలో నిస్స్వార్ధ ప్రజానాయకులంతా కలసికట్టుగా కృషిచేస్తూ భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి శాంతి సమరం చేస్తున్నారు. ఈ దేశంలో వున్న రాచరికపు సంస్థాన సముదాయాలనన్నింటినీ ఏకం చేసి ఆసేతుహమాచలపర్యంతం స్వయంసమృధ్ధి అఖండభారతదేశాన్ని నిర్మించాలని కోరుకుంటున్నారు.
అందుచేత, విజ్ఞులైన భావిభారత పౌరుల్లారా మేల్కొనండి. కుల, మత, భాష, ప్రాంత తత్త్వాలకు అతీతంగా కృషి చేసి అన్ని వర్గాల ప్రజలమధ్య శాంతి సామరస్యాలను, సమైక్యతా భావాన్ని పెంపొందించండి. అఖండ భారతదేశ నిర్మాణానికి , పవిత్రమైన మన భారతీయతను పరిరక్షణకు మీచేయూతనివ్వండి. ఇదే మీ తక్షణ కర్తవ్యం. దేశమాత ఋణం తీర్చుకోవడానికి ఇదే మంచి తరుణం.
పదండి ముందుకు,
కదంతొక్కుతూ ఉరకండి. శాంతియుతంగా స్వాతంత్ర్యాన్ని సాధించండి.
...
'బోలో !భరత్ మాతాకీ జై! జైహింద్!
ఇటువంటి ఉపన్యాసాలతో, ఉద్వేగభరిత నినాదాలతో 1942 క్విట్ ఇండియా ఉద్యమం తీవ్రతరమై
స్వదేశాభ్యుదయవాదులను, యువకులను
స్వాతంత్ర్య పోరాటంలోనికి దూకేలా ఉత్తేజితులను చేసి చైతన్యవంతులను చేసింది.
అటువంటివారిలో చౌటపల్లి యువరక్తం ఘంటసాల కూడా ఒకరు.
తాను నేర్చుకున్న
సంగీతంతో దేశభక్తి గీతాలు పాడుతూ ప్రజోద్యమంలో కలిసిపోయారు. తత్ఫలితంగా ఆనాటి
బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులు ఘంటసాలను జైల్లో పెట్టారు. జైలుజీవితం మంచే చేసింది.
గొప్పగొప్ప రాజకీయ నాయకుల సాంగత్యం ఏర్పడింది. తనలోని సంస్కారం, వ్యక్తిత్వం మరింత మెరుగులు దిద్దుకుంది. దేశంకోసం
తన వంతు సేవ ఏదో రూపంలో చేయాలనే తపన పెరిగింది.
అదృష్టంకొద్ది
సినీరంగంలోకి అడుగుపెట్టిన ఘంటసాల అచంచల కృషి ఫలితంగా అంచెలంచెలుగా ఎదిగి లలితసంగీత ప్రపంచంలో అద్వితీయ గాయకుడిగా,
సంగీత దర్శకుడిగా
శిఖరాగ్రాలకు చేరుకున్నారు. సమయం, సందర్భం సమకూరినప్పుడల్లా సమాజం కోసం, దేశం కోసం తన సంగీతాన్ని సద్వినియోగం చేశారు.
తనలోని ఉన్నతభావాలను లోకవిదితంచేసే దిశలో చిత్ర నిర్మాణం తలపెట్టారు ఘంటసాల. తత్ఫలితమే, 1956 లో వచ్చిన 'సొంతవూరు' సినిమా. దేశ పురోభివృద్ధికి పల్లెలు, పంటపొలాలే పట్టుకొమ్మలనే అనే అంశం ఆధారంగా తీసిన సినిమా, దేశాభ్యుదయానికి తోడ్పాటునిచ్చే మంచి మంచి సందేశాత్మక గీతాలెన్నో వున్న సినీమాలోని అలాంటి ఒక ప్రబోధగీతమే 'మన వూరే భారతదేశం, మనమంతా భారతీయులం!' ఇదే నేటి మన ఘంటసాల సజీవరాగం.
పల్లవి:
మన వూరే భారతదేశం
మనమంతా భారతీయులం -2
పల్లెలన్ని పంటలతో
నింపేస్తాం
పేదగుండె మంటలనే
ఆర్పేస్తాం
కరువులేని , పరువుపోని పౌరులౌతాం
!మన వూరే!
గాంధితాత చెప్పినదే
వేదమంటాం
పేద గొప్ప భేదములే
లేవంటాం
ఒక్కతల్లి
బిడ్డలుగా జీవిస్తాం
తల్లివంటి దేశమునే
ప్రేమిస్తాం!ఒక్క!
సత్యమెంచి ధర్మమెంచి పూజిస్తాం
!మన వూరే!మాటుపడ్డ శౌర్యమునే
వెలికీతీస్తాం
పూడుకున్న ఛాందసమే
తొలగిస్తాం
ద్వేషబుధ్ధి
కాలపట్టి రాసేస్తాం
నవ్యలోక ధర్మములే
పాటిస్తాం!ద్వేష!
భారతీయ శాంతిగీతి
పాడుకుంటాం-3
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం
అభ్యుదయ కవి రావూరి సత్యనారాయణ గారు వ్రాసిన గీతం. స్వీయ సంగీతంలో ఘంటసాలగారు, గాయకబృందం కలసి ఆలపించిన ఉన్నత సందేశగీతం. ఒక్క మాటలో చెప్పాలంటే మన స్వతంత్ర భారతదేశ విదేశాంగ విధానానికి ఆధారంగా రూపుదిద్దుకున్న పంచశీల సిధ్ధాంతానికి ప్రతీక 'మన వూరే భారతదేశం' పాట.
'పల్లెలన్ని పంటలతో నింపేస్తాం పేదగుండె మంటలనే ఆర్పేస్తాం కరువులేని పరువుపోని పౌరులౌతాం' ఎంత గొప్ప భావన. ఎంత చక్కటి దూరదృష్టి. సమాజానికి ఇంతకన్నా మంచి సందేశం ఎవ్వరివ్వగలరు, మన శతాబ్దిగాయకుడు ఘంటసాల తప్ప. జయహో ఘంటసాల.
వెస్ట్రన్ బ్యాండ్ వాద్యాలతో మార్చింగ్ ట్యూన్ లా వినపడే ఈ బృందగానాన్ని ఘంటసాల మాస్టారు వెస్ట్రన్ మ్యూజిక్ ప్రపంచంలో బహుళ ప్రచారం పొందిన 'లోనియన్ మోడ్' లో స్వరపర్చారు. లోనియన్ మోడ్ నే మేజర్ స్కెల్ అని కూడా అంటారు. దీనికి సమాంతరమైన కర్ణాటక రాగం అందరికీ బాగా తెలిసిన శంకరాభరణం, 29వ మేళకర్త. దీనినే ధీరశంకరాభరణం అని అంటారు. ఇతర రాగాలన్నింటికంటే ఎక్కువ గమకాలు గల రాగంగా శంకరాభరణం ప్రసిధ్ధి చెందింది. 'మన వూరే భారతదేశం' పాటను ఘంటసాలగారు శంకరాభరణం స్వరాలతో స్వరపర్చారు. ఘంటసాలగారు ఈ ప్రబోధగీతాన్ని ఎంతో ఉత్సాహంగా ఉత్తేజంతో పాడి శ్రోతలలో సరికొత్త చైతన్యాన్ని కలిగించారు. రిపబ్లిక్ పెరేడ్స్ లో సైనిక విన్యాసాలలో ఈ రకమైన ట్యూన్స్ వినిపిస్తాయి. ఈ పాటలో ఘంటసాల మాస్టరు ట్రంపెట్స్, ఫ్లూట్స్, డ్రమ్స్, సింబల్స్, వయొలిన్స్, క్లారినెట్ వంటి వాద్యాలను ఘనంగానే వినిపించారు.
చెప్పుకుంటే 'సొంతవూరు' సినిమా కు చాలా విశేషాలే వున్నాయి.
ఘంటసాల మాస్టారంటే వున్న ప్రత్యేక గౌరవాభిమానాల కారణంగా తన పరిపూర్ణ సహాయ సహకారాలందించి హీరోగా నటించిన ఎన్.టి.రామారావుకు జోడీగా ఈ చిత్రంలో అంతవరకు చిన్న చిన్న వేషాలు వేస్తూ వచ్చిన రాజసులోచనను పూర్తిస్థాయి కథానాయికగా ఎలివేట్ చేశారు.
ఈ సినిమాలోని మరో విశేషం, ఒక నృత్యగీత సన్నివేశంలో ఎన్.టి.ఆర్ శ్రీకృష్ణుడి గెటప్ లో కనిపించడం. అంతేకాదు, మల్లాది వారు వ్రాసిన ఆ పాటకు ఘంటసాలగారు అంతకుముందే ప్రైవేట్ రికార్డుగా పాడిన కరుణశ్రీ గారి' చూచెదవేలనో ప్రణయసుందరి', 'అంజనరేఖ వాల్గనుల', 'క్రొంజిగురాకు వ్రేళుల' పద్యాలను జోడించి కృష్ణుని వేషంలోని ఎన్.టి.ఆర్ పై చిత్రీకరించారు. ఈ సినిమాకు ముందు'ఇద్దరు పెళ్ళాలు' అనే సినిమాలో కూడా ఎన్.టి.ఆర్ కృష్ణుడి వేషంలో కనిపించారు. ఈ రెండింటి తర్వాతే మాయాబజార్ లో , వినాయకచవితిలో ఎన్.టి.రామారావు శ్రీకృష్ణుడి పాత్రలు ధరించి పౌరాణిక పాత్రలకు తనకు మించిన ప్రత్యమ్నాయ నటుడు మరొకరు లేరనే ఖ్యాతిని ఆర్జించారు.
సొంతవూరు సినీమాలోని పదిపాటలు, రెండు సీస పద్యాలు అన్నీ కట్టాణిముత్యాలే. వీటిని రావూరి సత్యనారాయణ గారు, మల్లాది రామకృష్ణశాస్త్రిగారు, సముద్రాల రాఘవాచార్యగారు వ్రాయగా ఘంటసాల, జిక్కి, పి. లీల, జె.వి.రాఘవులు ఆలపించారు. ఏ పాటకు ఆపాటే వైవిధ్యం తో కూడిన పాటలుగా మలచారు ఘంటసాల.
'సొంతవూరు' సినిమా పాటలను ఏ రికార్డింగ్ కంపెనీ విడుదల చేసిందో గుర్తులేదుకానీ అవి మామూలుగా వచ్చే RPM78 నలుపు రికార్డులుగా కాక RPM45 లో తెల్లటి రికార్డులుగా వచ్చాయి. అలాగే కొన్ని పాటలు తెల్ల రంగు రికార్డులుగా వచ్చాయి. వాటిని వినైల్ రికార్డు లంటారని విన్నాను. Polyvinyl chloride - PVC బహుశా ప్రోమోలుగా రిలీజ్ చేసి వుంటారు. అయితే నాకు ఈ విషయంలో సరైన అవగాహన లేదు.
ఎన్.టి.ఆర్, రాజసులోచన, షావుకారు జానకి, అమర్నాథ్, సి.ఎస్.ఆర్., చంద్రకుమారి, రమణారెడ్డి, సూర్యకాంతం, హేమలత, సురభి కమలాబాయి, చదలవాడ, వంగర, మొదలగువారు నటించిన ఈ సినిమాలో మాస్టారి సహాయకుడైన సంగీతరావుగారు కూడా ఒక చిన్నపాత్రలో సి.ఎస్.ఆర్. తో కలసి ఒక సన్నివేశంలో కనిపిస్తారు.
సుప్రసిద్ధ బహుభాషా చిత్ర ఛాయాగ్రహకుడైన ఎ.విన్సెంట్ ఈ సినిమా కు కెమెరామన్ గా పనిచేశారు. సొంతవూరు సినిమా కు డైరెక్టర్ ESN మూర్తి. డైరెక్టర్ గా ఆయనకు ఇదే మొదటి, ఆఖరి సినిమా కూడానేమో!
జి.వి.ఎస్. ప్రొడక్షన్స్ బ్యానర్ కు తన తమ్ముడు సదాశివుడిని నిర్మాతగా ఉన్నతస్థితికి తీసుకురావాలని అశించారు ఘంటసాల. అయితే వారి దురదృష్టం, ఈ రెండో సినిమా కూడా ఆర్ధికంగా పరాజయం పొందింది. ముచ్చటగా మూడవసారి అంటూ మరో మూడేళ్ళ తర్వాత మరో సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. ఆ విషయాలు మరో భాగంలో చూద్దాము.
సొంతవూరు వసూళ్ళ రూపేణా ఫెయిల్ అయినా ఘంటసాలవారి సంగీతం మాత్రం సంగీతాభిమానులను ఏమాత్రం నిరాశపర్చలేదు. ఆ సినిమా లోని... 'శ్రీగోపాలా రాధాలోలా..', 'మనవూరే భారతదేశం', 'మల్లె మొగ్గల్లారా', 'చెంగు చెంగునా ఎగిరే రాజా' పాటలు, 'స్వాగతంబోయి ఈ స్వాతంత్ర్య సీమకు', 'రాణ్మహేంద్ర కవీంద్రు రత్నాలమేడలో' అనే పద్యాలు ఈనాటికీ అడపాదడపా వినిపిస్తూనేవున్నాయి
కొసమెరుపు:
ఏనాడో ఒక 65 ఏళ్ళ క్రిందటి మాట. ఘంటసాలవారి సినిమా నిర్మాణ అవశేషాలుగా కొన్ని పనికిమాలిన వస్తువులన్నింటినీ వారింటి మేడమీది గది ఒకదాంట్లో డంప్ చేశారు. అది నాకు, విజయకుమార్ కు ఆటస్థలంగా వుండేది. అలాటి వాటిలో GVS PRODUCTIONS emblem ఒకటి. సినిమా టైటిల్స్ కు ముందు ఒక తోరణం మధ్య వేలాడదీసిన ఒక పెద్ద గంట, దానిక్రింద GVS PRODUCTIONS అనే అక్షరాలు కనిపిస్తాయి. ఆలయ గంటలా ఈ గంట కూడా ఖంగుమని మూడు సార్లు మ్రోగుతుంది (అని జ్ఞాపకం. ఎప్పుడో 1956 లో స్టూడియోలో ప్రివ్యూ చూడడమే). సినిమాలో లాగే ఈ గదిలో పడివున్న గంట కూడా మ్రోగుతుందని ఆడించి చూశాను. ఖంగుమని కంచులా మ్రోగడానికి బదులు 'డబ్ డబ్' అని చప్పుడు చేయడం నాకు పెద్ద షాక్. తర్వాత తెలిసింది ఆ తోరణం , ఆ వేలాడే గంట ఏదీ లోహంతో చేసింది కాదు , అది పేపర్ మోల్డ్ ఆర్టిఫిషియల్ వస్తువని. ఆ గంటానాదం సౌండ్ ఎఫెక్ట్స్. అంతా రీరికార్డింగ్ మహిమ.
ఆనాడే తెలిసిపోయింది సినిమా అంటే ఒక మాయాప్రపంచం, అక్కడ అంతా కృత్రిమం, ఏదీ సహజంకాదని.
ఘంటసాలవారి మరో సజీవరాగం తో వచ్చేవారం మరల కలుద్దాము.
ప్రణవ స్వరాట్

No comments:
Post a Comment