అధ్యాయం - 2 - భాగం 15
రేపు నీదే - చిని పాపలాలీ కనుపాప లాలీ చిన్నారి పొన్నారి చివురింత లాలీ
మొన్న ఆదివారం జరిగిన 'అంతర్జాతీయ మాతృదినోత్సవ సందర్భంగా మా ఊరి మహిళామండలివారు తమ మహిళా సభ్యులకోసం అనేక రకాల వినోదకార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆఖరుగా పాటలకార్యక్రమం పెట్టారు. అందులో పాల్గొన్న గాయనీ మణులంతా ఆ మహిళామండలి సభ్యులే. సంగీతమంటే ఇష్టము, పాడాలనే ఆసక్తి కలిగినవారంతా ఎమ్మెస్లో, మంగేష్కర్లో, లీలా, సుశీలలో కాలేరుకదా! అందరూ తమ శక్తివంచనలేకుండా శ్రోతలను తమ పాటలతో రంజింపజేసారు. వారంతా పాడిన అన్ని పాటలలో నా మనసుకు బాగా హత్తుకు పోయిన పాట....
"చిని పాపలాలీ, కనుపాప లాలీ చిన్నారి పొన్నారి చివురింత లాలీ..." అనే ఒక పాత సినిమాలోని లాలి పాట.
నిజం చెప్పొద్దూ.... ఆ పాటలోని మాధుర్యం, శ్రావ్యత, మాతృమూర్తి మమతానురాగం నాకెంతో హాయిని, మానసిక ప్రశాంతతను కలిగించి నా కనులు మూతలుపడేలా చేసింది. పదేపదే ఆ పాట నా మదిలో మెదలాడసాగింది.
చిని పాపలాలీ కనుపాప లాలీ
చిన్నారి పొన్నారి చివురింత లాలీ...
చిన్నితండ్రీ నవ్వుచూచి
చిన్నబోయే చందమామ
నవ్వు వెన్నెల నావలోన
తేలనా
- విహరించనా ! చిని పాప!
కన్నతండ్రి కనులకాంతీ
తుడిచివేయును కలతలన్నీ
జన్మభూమి కి వన్నె తేగా
పెంచనా తరియించనా..."
అమ్మ అంటేనే దైవం. తల్లినిమించిన దైవం ఈ లోకాన లేదు. అమ్మ హృదయాంతరాళాలనుండి పెల్లుబికే మమకారపు జోలపాటలో మైమరచిపోని చిన్నారులే వుండరు. తల్లి ప్రేమామృతానికి మించినదేదీ లేదు. తల్లికి బిడ్డలపట్ల గల మమతానుబంధానికి ఎల్లలు లేవు. తన బిడ్డల బంగారు భవిష్యత్తు గురించి కనే కలలే జోలపాటలు. తన బిడ్డను నిద్రపుచ్చే క్రమంలో పాడే లాలి పాటలు అమ్మ మనసుకు దర్పణాలు.
జోలపాటలు మన సంస్కృతి లో ఒక భాగం. పసిపాపలను నిద్రపుచ్చడానికి, మారాము చేయకుండా వుండడానికి తల్లులు, లేదా ఇంట్లోని పెద్దవారు పాడే లయబధ్ధమైన పాట. ఈ పాటల్లోని లయ, సరళమైన, మృదుమధురమైన భాష పసిపాపలకు స్వాంతనను, ప్రశాంతతను కలిగిస్తుంది. సాధారణంగా లాలిపాటల్లో వినిపించే 'రామ', 'కృష్ణ' వంటి పురాణపురుష నామాలు, వారి లీలలు చిన్న పాపలలో భక్తి భావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందిస్తుంది. సనాతనకాలం నుండి వస్తున్న ఈ సంప్రదాయం పసిబిడ్డలలో మానసిక వికాసాన్ని, కన్నతల్లితో మమతానుబంధాన్ని పెంపొందిస్తుంది.
గత తరంలో ఈ జోలపాటలు దైనందిక జీవితంలోనే కాక సినీమాలలో కూడా వినిపించేవి. కథాకథనానికి దోహదం చేస్తూ సన్నివేశానికి పరిపుష్టి కలిగేలా ఈ జోలపాటలను మన సినిమాలలో ఉపయోగించేవారు.
పసిపాపలకే కాక పెద్దలకు కూడా మానసిక ఉల్లాసాన్ని, ప్రశాంతతను చేకూర్చే అటువంటి లాలిపాట -- 'చిని పాప లాలీ కనుపాపలాలీ' 1957 లో వచ్చిన 'రేపు నీదే' సినిమాలోనిది. ఇదే ఈనాటి మన ఘంటసాల సజీవరాగం.
1950 దశకంలో ఎంతోమంది గేయ రచయితలు సినిమాకి పరిచయం చేయబడ్డా, వారంతా పరిపూర్ణంగా చిత్రసీమలో నిలదొక్కుకోలేకపోయారు. అలాటి వారిలో శ్రీ కొండముది గోపాలరాయశర్మగారు ఒకరు. సామాజిక ఇతివృత్తాలతో గీతాలను, నాటకాలు వ్రాసి పేరుపొందిన రచయిత. చిత్రసీమలో ఈయనకు ఎక్కువ అవకాశాలు కల్పించి ప్రోత్సహించినది మన ఘంటసాల మాస్టారే. మాస్టారి సంగీత దర్శకత్వంలో గోపాలరాయశర్మగారు భావయుక్తమైన పాటలెన్నింటినో చాలా సరళమైన భాషలో వ్రాసి ఆయా సన్నివేశాలకు నిండుదనం తెచ్చారు. ఈనాటి మన సజీవరాగం లోని లాలిపాటను కూడా వ్రాసింది గోపాలరాయశర్మగారే. మృదువైన చిన్న చిన్న మాటలతో కన్నతల్లి మనోభావాలకు అక్షరరూపాన్నిచ్చి అమ్మంటే ఏమిటో మనకు తెలియజేశారు.
'చినిపాప లాలీ కనుపాప లాలీ, చిన్నారి పొన్నారి చివురింత లాలీ' పాట పల్లవిలోనే అమ్మ మనసులోని లాలిత్యాన్ని, మమతను వెల్లడిచేశారు. కన్నబిడ్డ ఎంత మారాము చేసి చీకాకు కలిగించినా ఆ తల్లికి తన బిడ్డంటే మురిపమే. అందుకే చరణంలో అంటారు - చిన్నితండ్రి నవ్వు చూసి చందమామే చిన్నబోయిందట. ఆ నవ్వుల వెన్నెల ఒక నావైతే ఆ నావలో తేలియాడుతూ విహరిస్తానంటోంది.
తర్వాతి చరణంలో తన పాపడి భవిష్యత్తు విషయంలో తన కలలు - తన పిల్లవాడి కన్నుల్లోని కాంతి తన తన కష్టాలను, కన్నీళ్ళను తుడిచిపెడుతుందని, దేశమంతా మెచ్చేలా, మాతృభూమికి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా పెంచి పెద్ద చేస్తానని ఆ అమ్మ జోలపాడుతోంది.
ఈ లాలిపాటను స్వరపర్చిన ఘంటసాలవారిలో గొప్ప మాతృహృదయం వుంది. మనసుకు కష్టం కలిగించే ఎటువంటి వేదనాపూరిత విషయానికైనా ఇట్టే చలించిపోయే సున్నితమైన మనసుగల ఘంటసాలగారు తల్లి మనసులోని ప్రేమను, మమకారాన్ని ఈ పాటలో రంగరించి స్వరపర్చారు.
ఈపాటను నేపథ్యంలో అద్భుతంగా అమ్మలాగే పాడినది పి.లీలగారే అయినా, తెరమీద భావోద్వేగాలతో నటించి సన్నివేశానికి బలం చేకూర్చినది షావుకారు జానకిగారే అయినా ఇక్కడ మనకు వినపడేది, కనపడేది ఘంటసాలగారి మాతృహృదయమే. ఈ పాటను ఘంటసాలగారే పాడితే ఎంతటి గాఢత్వము, భావోద్వేగము మనము అనుభవిస్తామో అంతటి అనుభూతిని లీల ఈ లాలిపాటలో మనకు కలిగించారు. మధ్యమావతి రాగంలోని కరుణ, మాధుర్యమంతా పాట మధ్యవచ్చే ఆలాపనలో, షెహనాయ్ బిట్స్ లో నింపి మనకు అందించారు ఘంటసాల. పాటలోని గమకాలు లాలిపాటల స్వభావ స్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది. ఘంటసాలగారి రాగభావాన్ని యథాతధంగా తన గొంతులో పలికించగల గాయని పి.లీల. అందుకు నిదర్శనం ఈ లాలి పాటే. ఈ పాటలో ప్రధానంగా వినిపించేది షెహనాయ్ యే అయినా పియోనా, మేండలిన్, వయొలిన్స్, ఫ్లూట్, క్లారినెట్, హార్మోనియం, తబలా వంటి వాద్యాలను చాలా హృద్యంగా ఉపయోగించుకున్నారు ఘంటసాల.
మాస్టారు ఈ పాటకు ఎన్నుకున్న రాగం మధ్యమావతి. చాలా మంగళకరమైన, భక్తి, కరుణరస ప్రధానమైన రాగం మనసుకు ప్రశాంతతను చేకూర్చే రాగం. సంగీత విద్వాంసుల కచేరీల ముగింపులో మధ్యమావతి రాగాన్ని ఆలపించడం సంప్రదాయం. మధ్యమావతి 22 వ మేళకర్త అయిన ఖరహరప్రియ కు జన్యరాగం. మధ్యమావతి రాగ ఆరోహణ, అవరోహణ క్రమంలో ఐదు స్వరాలు మాత్రమే వుంటాయి. ఏడు స్వరాలలోని గ (గాంధారం), ధ (ధైవతం) స్వరాలు ఈ రాగానికి వుండవు. అందుచేత మధ్యమావతి ఔడవ-ఔడవ రాగంగా పరిగణించబడుతోంది. మధ్యమావతి కి సమాంతరమైన హిందుస్థానీ రాగం మధుమాద్ సారంగ్. కాఫీ థాట్ కు జన్యరాగం. మనిషిలోని ఆర్ద్రత, మమతానురాగాలు, శాంతస్వభావం, సజీవంగా వున్నంతకాలం ఈ లాలిపాట సజీవరాగంగా మనసులో సదా మెదులుతూనే వుంటుంది.
భాస్కర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కోవెలమూడి భాస్కరరావుగారు 'రేపు నీదే' సినిమాను తన స్వీయదర్శకత్వంలో నిర్మించారు. జగ్గయ్య, షావుకారు జానకి, ఎస్.వి.రంగారావు, రేలంగి, రాజసులోచన, ఆర్.నాగేశ్వరరావు, సి.ఎస్.ఆర్ మొదలగువారు నటించారు. ఘంటసాల మాస్టారి సంగీత దర్శకత్వంలో ఈ సినిమా లో వున్న ఏడు పాటలను కొండముది గోపాలరాయశర్మగారే వ్రాయగా వాటిని ఘంటసాల, పి.లీల, జిక్కి, పిఠాపురం, మొదలగువారు పాడారు.
ఈ సినిమా లోని - చినిపాప లాలీ, పిలవకురా నిలపకురా, ఎక్కడైనా బావయ్యా, నీలోకంలో ఒక భాగమిది, చక్కనిది దక్కనిది ఒక్కట్టున్నది వంటి పాటలు బహుళ జనాదరణ పొంది తరచు రేడియోలో ప్రసారమయేవి. వాట్సప్ సమూహాలలో పాత పాటల పంపకాలు ప్రారంభమైన తొలిరోజుల్లో దాదాపుగా అందరూ మరచిపోయినా ఈ ' చినిపాప లాలి కనుపాప లాలీ' పాటను నేనే శ్రోతలకు పునఃపరిచయం చేశాను. '(ఇలాటి ఆణిముత్యం ఒకటుందని ఇంతవరకు నాకు తెలియనే తెలియదు' అంటూ చాలామంది చేసిన వ్యాఖ్య బలంతో ఈ మాట ఉపయోగించాను). చాలా సినీమాలలాగే ఈ సినిమా విడియో కూడా అలభ్యం కావడంతో ఈ సినిమాలోని మంచి పాటలు అందుబాటులో లేకుండా పోయాయి. సంగీతాభిమానుల దురదృష్టం.
మనకు బ్లాక్ బస్టర్ సినిమాలలో సూపర్హిట్ పాటలుగా చెలామణి అవుతున్న పాటలొక్కటేకాదు, మంచి సంగీత సాహిత్యపు విలువలు గలిగిన గొప్ప గీతాలు గల సినీమాలు ఎన్నో వున్నాయి. అయితే తగిన ప్రచారం, మార్కెటింగ్ లభించక, కాలం కలసిరాక బాక్సాఫీస్ దగ్గర కొన్ని సినిమాలు పరాజయం పొందాయి. దానివలన మన సంస్కృతి సంప్రదాయాలకు దర్పణం పట్టే అమూల్యమైన గీతాలు ఎన్నో మరుగున పడిపోయాయి. నా పరిధులమేరకు అలాటి మధురగీతాలను ఈ 'ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం' పునఃపరిచయం చేయడమే ముఖ్యోద్దేశం.
ఈనాడు మనకు తెలిసి, మనం మెచ్చిన పాటలతో పాటు ఈ
తరం వారికి అంతగా పరిచయం లేని ఉత్తమ గీతాలను కూడా ఈ శీర్షిక ద్వారా పరిచయం
చేయాలనేది నా సంకల్పం. అందుకు మీరంతా తప్పక ప్రోత్సహించగలరని ఆశిస్తాను.
వచ్చే వారం, ఘంటసాలగారి మరో సజీవరాగం తో
మరల కలుద్దాము.
ప్రణవ స్వరాట్

No comments:
Post a Comment