Saturday, 28 February 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 4

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘం
టసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 4

అమృతపానీయాన్ని అమరగానాన్ని కలబోసి తెలుగువారి  సంగీత దాహార్తిని తీర్చి, ఆ వీనులవిందులో సోలిపోయేలా చేసిన గంధర్వగాయకుడు ఘంటసాలవారి అపురూప గీతం - 'కాదుసుమా కలకాదు సుమా'

నా చిన్నతనంలో ప్రతీరోజూ ఉదయాస్తమానం ఎవరినోట విన్నా, ఎచ్చోట గాంచినా  ఈ సూపర్ డూపర్ డ్యూయెట్టే వినపడేది. ఈ పాటతో తెలుగు ప్రజానీకాన్ని మెస్మరైజ్ చేసి కట్టిపడేసిన వర్ధమాన దినదిన ప్రవర్ధమాన  గాయకుడు ఘంటసాల 'స్టోన్' (టోన్)ను అనుకరించనివారే లేరంటే  అది  కాదు సుమా  అబద్ధం కానే కాదు సుమా.

ప్రేమలు పూచే సీమలలో, వలపులు పారే సెలయేరులలో,  కన్నె తారకలతో కలగానము చేస్తూ దక్షిణనాయక ప్రేమతత్త్వంతో సరికొత్త శృంగారాభినయనానికి నాంది  పలికి   ఆనాటి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన అద్భుత  జానపద చిత్రం 'కీలుగుఱ్ఱం' లోని సుమధుర ప్రేమగీతమే 'కాదుసుమా కలకాదు సుమా'.  

కీలుగుఱ్ఱం మహిమతో యువ నాయకీనాయకులు గగనసీమలలో తేలియాడుతూ ఆలపించిన యుగళగీతమే నేటి మన సజీవరాగం -

'కాదుసుమా కలకాదు సుమా
అమృతపానమును అమరగానమును
గగనయానమును కల్గినట్లుగా
గాలిని తేలుచు సోలిపోవుటిది   !కాదుసుమా!

ప్రేమలు పూచే సీమల లోపలా...2
వలపులు పారే సెలయేరులలో
తేటి పాటలను తేలియాడుటిది    !కాదుసుమా!

కన్నె తారకల కలగానముతో
వెన్నెల చేరుల ఉయ్యాలలో
ఓ ఓ ఓ....2
ఉత్సాహముతో ఊగుచుండుటిది   !కాదుసుమా!

పూలవాసనల గాలితెరలలో
వలపు చీకటుల వన్నె కాంతిలో-2
అహహా..అహహా..
దోబూచులాడుటిది     
కాదుసుమా కలకాదు సుమా -2
ఈ శృంగారగీతాన్ని వ్రాసినవారు అలనాటి ప్రముఖ కవి, పత్రికా సంపాదకుడు, సినీ గేయ రచయిత అయిన తాపీ ధర్మారావుగారు. 
తాపీ ధర్మారావు
ఆయన ఈ పాటలో చరణాలను పల్లవితో అన్వయించడానికి - 'సోలిపోవుటిది'; 'తేలియాడుటిది'; 'ఊగుచుండుటిది'; 'దోబూచులాడుటిది'; అంటూ 'ఇది' అనే మాటను పలుసార్లు ఉపయోగించడం విశేషంగా అనిపిస్తుంది. 'కీలుగుఱ్ఱం' సినిమా లోని అధికసంఖ్యాక గీతాలను ధర్మారావుగారు వ్రాయగా ఓ నాలుగైదు పాటలను ఇనుగంటి శోభనాద్రి రావుగారు రచించారు.

'బాలరాజు' అఖండ విజయం తర్వాత హీరో నాగేస్సర్రావ్ అందుకున్న మరో సూపర్హిట్ సినిమా 'కీలుగుఱ్ఱం'. ఎ.ఎన్.ఆర్ కు రొమాంటిక్ హీరో ఇమేజ్ ను క్రియేట్  చేసిన సినిమా. ఇందులో అక్కినేనికి ముగ్గురు హీరోయిన్లు. ఆ ముగ్గురితో స్టెప్ లంటే వేయలేదుకాని ఘంటసాల కంఠంతో ఒక హీరోయిన్ తో రెండు డ్యూయెట్ లు పాడారు. మల్టీహీరోయిన్ ట్రెండ్ కు నాందిపలికిన సినిమా "కీలుగుఱ్ఱం" అంటే తప్పులేదేమో! 

ఈ సినిమాలో అంజలీదేవి వున్నా నాగేశ్వరరావు కు హీరోయిన్ కాదు. వ్యాంప్ కారెక్టర్. హీరోకు సవతి తల్లి. రాజావారి రెండవ భార్యలాటిది. పగటిపూట ప్రియురాలుగా పాటలు పాడుతుంది. అర్ధరాత్రయితే  తన నిజరూపంలో రాక్షసిగామారి కోటలోని గుఱ్ఱాలను, ఏనుగులను చంపి భక్షిస్తుంటుంది. ఇలాటి వేషం ససేమిరా వేయనని అంజలీదేవి భీష్మించుకుని కూర్చుంటే చిత్ర నిర్మాత, నటగాయని సి.కృష్ణవేణి బలవంతాన ఒప్పించారట. అందుకు బదులుగా అంజలీదేవి  సినిమాలో తాను పాడవలసిన పాటలన్నీ కృష్ణవేణే పాడాలని కండిషన్ పెట్టారట. దాని ప్రకారం కీలుగుఱ్ఱం సినిమాలో అంజలీదేవికి కృష్ణవేణి నాలుగు పాటలు పాడారు.

భోజనప్రియులకు మృష్టాన్నభోజనంలా  లలిత సంగీతప్రియులకు మృష్టాన్నపు విందు కీలుగుఱ్ఱం పాటలు. విడుదలైన తన తొలి సినిమాలోనే  వివిధరసాలతో నిండిన 17 ఆణి ముత్యాల్లాంటి గీతాలను స్వరపర్చి, గానం చేసి ప్రేక్షకుల జేజేలు అందుకున్నారు ఘంటసాల. ఇందులో ఘంటసాల పాడిన ఏడు పాటలు (ఏకగళగీతాలు,యుగళగీతాలు) కాక మిగిలిన పాటలను సి.కృష్ణవేణి, పి.లీల, శ్రీదేవి, రేలంగి, కనకం మొదలగు వారు పాడారు. ఈ పదిహేడు గీతాలలో  16 గీతాలకు ఘంటసాల సంగీతం సమకూర్చగా
టైటిల్స్ మీద వినిపించే 'శోభనగిరి నిలయా దయామయా' అనేఒక్క పాటకు మాత్రం టి.ఎ.మోతి అనే ఆయన వరస కూర్చారు.

ఘంటసాలవారి 'కాదుసుమా కలకాదుసుమా' పాటతో తెలుగువారందరికీ చిరపరిచితురాలై ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్న గాయని వక్కలంక సరళ. 1940ల తర్వాత జెమినీ స్టూడియోలో నిర్మితమైన సినిమాలకు సహ సంగీత దర్శకురాలిగా వుండిన వక్కలంక సరళను ఘంటసాలగారి  'కాదుసుమా కలకాదుసుమా' పాట వరించింది. ఘంటసాల, సరళల ఈ యుగళగీతం ఆనాటి ఆంధ్రదేశమంతా మార్మోగింది.

వక్కలంక సరళ
ఈనాటికీ కీలుగుఱ్ఱం అంటే అందరికీ వెంటనే స్ఫురణకు వచ్చే పాట ఈ 'కాదుసుమా కలకాదుసుమా' మాత్రమే. సంగీత కుటుంబానికి చెందిన వక్కలంక సరళ కుమార్తెలు ఇద్దరూ కళాకారులే. ఒక కుమార్తె స్వప్నసుందరి. అంజలీదేవితో తనకు గల సాన్నిహిత్యం కు నిదర్శనంగా స్వప్నసుందరి అని పేరు పెట్టారట. ఈ స్వప్నసుందరి కూచిపూడి, భరతనాట్యాలలో నిష్ణాతురాలు. పద్మభూషణ్ బిరుదుపొందారు. మరొక కుమార్తె వక్కలంక పద్మ దాసరి నారాయణరావు 'గోరింటాకు' సినిమాలో శోభన్ బాబుతో హీరోయిన్ గా నటించారు. తర్వాత నటనకు స్వస్తిచెప్పి అంతర్జాతీయ స్థాయి పత్రికావిలేఖరిగా పనిచేస్తున్నారు. వక్కలంక సరళ తండ్రి, ప్రముఖ రచయిత చలం గారికి తమ్ముడు. ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వక్కలంక సరళ చిత్రగాయనిగా కేవలం ఓ ఏడెనిమిది సినిమాలలో మాత్రమే పాటలు  పాడి చిత్రసీమ నుండి వైదొలిగారు.

మీర్జాపురం జమీందారుగారు తన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'కీలుగుఱ్ఱం' సినిమా కథను కాశీమజిలి కథల స్ఫూర్తితో  తాపి ధర్మారావు నాయుడు & వెంపటి సదాశివబ్రహ్మం తయారుచేశారు.  సినిమా టైటిల్స్ లో దర్శకుడు మీర్జాపురం రాజాగారే అయినా  అధికభాగం చిత్రదర్శకుడు చిత్రపు నారాయణమూర్తి భుజస్కంధాలపైనే జరిగిందంటారు. 

కీలుగుఱ్ఱం ప్రధాన తారాగణం - అంజలీదేవి, సీనియర్ ఎ.వి.సుబ్బారావు, అక్కినేని నాగేశ్వరరావు, రేలంగి, కనకం, సురభి కమలా బాయి, సూర్యశ్రీ, జూనియర్ లక్ష్మీరాజ్యం, బాలామణి, వి.కోటేశ్వరరావు, మాణిక్యరావు మొదలగువారు.

1948లో కీలుగుఱ్ఱం సినిమా నిర్మాణంలో వున్న సమయంలోనే ప్రముఖ నటుడు, దర్శకుడు లంక సత్యం దర్శకత్వంలో జూపిటర్ పిక్చర్స్ స్వామి తమిళంలో 'మోహిని' అనే సినిమాను దాదాపు ఇదే కథతో తీశారు. ఈ సినిమాకు హీరోగా సుప్రసిద్ధ విలన్, కమేడియన్ నటుడు టి.ఎస్.బాలయ్య నటించగా  తమిళుల ఆరాధ్యదైవం ఎమ్.జి.రామచంద్రన్, ఆయన భార్య వి.ఎన్.జానకి ఇతర పాత్రలలో నటించారు. 1948లో విడుదలైన తమిళ 'మోహిని' జయాపజయాలపై భిన్నాభిప్రాయాలు వున్నాయి. ఈ నేపథ్యంలో మీర్జాపురం రాజావారు  పది కేంద్రాలలో శతదినోత్సవాలు, ఒక కేంద్రంలో 150 రోజులు ఆడి ఘనవిజయం సాధించిన తన కీలుగుఱ్ఱాన్ని  మొండిధైర్యంతో తమిళంలోకి  'మాయా కుదిరై' పేరిట డబ్ చేసి వదిలారు. తెలుగు నుండి తమిళంలోకి డబ్ చేయబడిన మొట్టమొదటి తెలుగు సినిమా 'కీలుగుఱ్ఱం'. ఈ డబ్బింగ్ వెర్షన్ విజయంపై కూడా  తమిళ పత్రికలలో భిన్నాభిప్రాయాలు చూడగలం

కీలుగుఱ్ఱం చిత్ర విజయానికి ఎంతో దోహదంచేసిన అంశం, వైవిధ్యం తో కూడిన ఘంటసాలవారి సుమధుర సంగీతం.  సినిమా విడుదలయి 76 సంవత్సరాలైన ఆ సినీమాలోని 'కాదుసుమా కలకాదుసుమా' యుగళగీతం మాత్రం నిత్యనూతనంగా అన్ని వర్గాల శ్రోతలను అలరిస్తూనేవుంది. 

కథానాయిక సూర్యశ్రీ, నాయకుడు ఎ.ఎన్.ఆర్

ఘంటసాలగారు ఈ పాటను తోడి రాగ స్వరాలతో చేసినా, సింధుభైరవి రాగానికి దగ్గరగా వున్నట్లు ఒకరి విశ్లేషణలో తెలిసింది. తోడిరాగం అతి ప్రాచీన రాగం. కర్ణాటక సంగీతంలో 8 వ మేళకర్త రాగం తోడి. ఆరోహణ,అవరోహణ క్రమంలో ఏడు స్వరాలు కలిగివున్న సంపూర్ణరాగం.
దీనినే హనుమత్తోడి అని కూడా అంటారు. ఈ తోడి రాగంలో సంగీత ముమూర్తుల కృతులు ఎన్నో వున్నాయి.
ఇక, సింధుభైరవి రాగం విషయానికి వస్తే ఈ రాగం కర్ణాటక, హిందుస్థానీ శైలులలో వినిపించే భాషాంగరాగం.
సింధుభైరవి హనుమత్తోడి రాగానికి జన్యరాగం. సింధుభైరవి రాగంలో అసంఖ్యాకంగా సినీగీతాలు అన్ని భాషలలోనూ వున్నాయి.

ఇప్పుడు - 'కాదుసుమా కలకాదుసుమా' పాటను చూస్తూ విందామా!!


 
ఘంటసాలగారు ఈ పాటలో వైలిన్స్, వీణ, ఫ్లూట్, క్లారినెట్, పియోనా, ట్రంపెట్స్, తబలా, డోలక్ వంటి వాద్యాలను వినియోగించుకున్నట్లు అనిపిస్తుంది.

ఈ 76 సంవత్సరాల 'కీలుగుఱ్ఱం' సొంతదారుడు, దర్శకుడు, శోభనాచల స్టూడియో అధినేత, మీర్జాపురం రాజా మేకా వెంకటరామయ్య బహదూర్.
మీర్జాపురం రాజా మేకా వెంకటరామయ్య బహదూర్

వచ్చే వారం, మరల ఘంటసాలవారి మరో సజీవరాగం తో మరల కలుద్దాము.

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 4

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...