"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!
అధ్యాయం - 2 - భాగం 3
మన దేశం - జయ జననీ పరమ పవనీ
"ఆదిలోనే హంసపాదు"
ఈ తెలుగు సామెత మీ అందరికీ తెలిసినదే. ఏదైనా కార్యాన్ని తలపెట్టి అది నిర్విఘ్నంగా కొనసాగకుండా మొదట్లోనే ఆటంకాలు ఏర్పడి తాత్కాలికంగా లేదా సంపూర్ణంగా ఆగిపోతే దానిని 'ఆదిలోనే హంసపాదు' అనేవారు. అలాగే - ఈ ^ గుర్తు హంసపాదు కు సంకేతం. ఏవైనా రచనలు, వ్యాజ్యాలకు సంబంధించిన వివరాలు వ్రాస్తున్నప్పుడు సరైన పదం దొరకక ఆ వ్రాత పని తాత్కాలికంగా ఆగిపోతే ^ ఈ గుర్తును ఉపయోగించి తర్వాత ఆ వ్రాతను కొనసాగించేవారు.
అలాటి హంసపాదు ఘంటసాలవారు తొలిసారిగా సంగీతదర్శకత్వం చేపట్టినప్పుడు ఎదురయింది. అదేలా అంటారా...
భరణీవారి 'రత్నమాల' సినిమా లో సిఆర్ సుబ్బురామన్ కు సంగీత సహాయకుడిగా, ప్రతిభా వారి 'బాలరాజు' సినిమా కు సహ సంగీతదర్శకుడిగా పనిచేసిన ఘంటసాలగారికి మహతీవారి 'లక్ష్మమ్మ' సినిమాకు స్వతంత్ర సంగీత దర్శకుడిగా పనిచేసే అవకాశం లభించింది. ఆయితే ఆయన దురదృష్టం. ఆదిలోనే హంసపాదు. కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. కొన్నాళ్ళ తరువాత ఆగిపోయిన 'లక్ష్మమ్మ'ను శోభనాచల అధినేతలు మీర్జాపురం రాజా, ఆయన సతీమణి, నటి సి.కృష్ణవేణి కొనుగోలు చేసి అదే నటులు,సాంకేతిక వర్గంతో పునఃప్రారంభించారు. ఆ సినిమాకు ప్రముఖ రచయిత త్రిపురనేని గోపీచంద్ డైరెక్టర్. అదే సమయంలో కృష్ణవేణి, మీర్జాపురం రాజాగార్లు ఎల్.వి.ప్రసాద్ డైరక్షన్ లో 'మనదేశం', మీర్జాపురం రాజావారి దర్శకత్వంలో 'కీలుగుర్రం' సినిమాలను కూడా తీయ సంకల్పించి ఆ రెండు సినిమాల సంగీత దర్శకత్వం బాధ్యతలను కూడా ఘంటసాలగారికి అప్పచెప్పారు. ఘంటసాలగారు తన మొదటిచిత్రం 'మనదేశం' అనేవారు. ముందుగా ఒప్పందం చేసుకున్న సినిమా'లక్ష్మమ్మ' అయినప్పటికీ పాటల కంపోజింగ్ చేపట్టిన మొదటి సినిమా 'మనదేశం'. అయితే ఈ మూడు సినిమాలలో ఆఖరున మొదలెట్టిన 'కీలుగుర్రం' సినిమా ముందుగా విడుదలయింది, తరవాత, 'మనదేశం', ఆఖరున మొదటిసారి ఒప్పందం చేసుకున్న 'లక్ష్మమ్మ' సినిమాలు రిలీజై ఆనాటి ఆంధ్రప్రదేశంతా విజయభేరులు మ్రోగించాయి. సంగీతదర్శకుడిగా ఘంటసాలవారి versatality ఆనాడే తెలుగువారందరికి తెలిసింది.
నా చిన్నతనంలో అంటే నాఎలిమెంటరీ స్కూల్, తరువాత హైస్కూల్ లో చదువుతున్న రోజుల నుండి ఒక పాటను మా మాస్టర్లు ప్రార్ధనా గీతంగా పాడగలిగిన పిల్లలతో ప్రార్ధనాగీతంగా రోజూ స్కూల్లో పాడించేవారు. మిగతా పిల్లలంతా కూడా పెదవులు కదిపేవారు. రిపబ్లిక్ డే అయినా, ఆగస్ట్ 15 వచ్చినా, గాంధీజీ పుట్టినరోజైనా ఆ పాట తప్పక వినిపించేది. అప్పట్లో ఆ మాటలకు అర్ధం సరిగ్గా తెలియకపోయినా ఆ గీతం వినడానికి, పాడడానికి ఎంతో ఉత్సాహకరంగా,ఆసక్తిదాయకంగా, చెవులకింపుగా వుండేది.
ఆ పాటే "జయ జననీ పరమ పావనీ జయ జయ భారత జననీ" అనే ప్రబోధగీతం. స్కూల్ ఫంక్షన్లలోనూ, లౌడ్ స్పీకర్లలోనూ ఈ పాట మార్మోగేది. చాలాకాలం వరకు ఆ పాట మన జాతీయగీతమనే అనుకునేవాడిని. టెలివిజన్ లలో సినీమాలు వేయడం ప్రారంభించేక ఒకసారి 'మన దేశం' అనే అతిపాత సినీమా ను చూడడం తటస్థించింది. అంతవరకూ ఆ సినిమా పేరు వినడమే తప్ప చూడలేదు. ఆ సినిమా ప్రారంభంలో టైటిల్స్ మీద 'జయ జననీ పరమ పావని' అనే ఈ ప్రబోధగీతం వినవచ్చింది. అప్పుడే తెలిసింది ఇదొక సినీమా గీతమని. పాఠశాల విద్యార్ధులను ఎంతో ప్రభావితం చేసిన ఈ ప్రబోధగీతాన్ని శ్రీ సముద్రాల రాఘవాచార్యులవారు వ్రాసారు. ఘంటసాల, సి.కృష్ణవేణి, పిఠాపురం నాగేశ్వరరావు, బృందం కలసి ఈ పాట పాడారు.
సుప్రసిద్ధ బెంగాలీ రచయిత శరత్చంద్ర ఛటర్జీ వ్రాసిన 'విప్రదాస్' నవల ఆధారంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని నేపధ్యంగా తీసుకొని నటి, గాయని, మీర్జాపురం రాజావారి సతీమణి శ్రీమతి సి కృష్ణవేణి నిర్మించిన చిత్రం 'మనదేశం'. ఒక చిన్న పోలీసు ఇన్స్పెక్టర్ వేషంలో ఎన్.టి.రామారావును తెలుగువారికి పరిచయం చేసిన చిత్రం 'మనదేశం'.
'జయ జననీ పరమ పావని' పాట ద్వారా తెలుగు ప్రజలందరిలో ఉత్తేజాన్ని, చైతన్యాన్ని, దేశభక్తిని పురిగొల్పిన సముద్రాలగారు ఈ పాటలో ఆ సేతుహిమాచల పర్యంతం గల సస్యశ్యామలమైన భారతదేశం గురించి, ఆ దేశంలో గల పవిత్ర జీవనదుల ఔన్నత్యం గురించి వర్ణించి చెప్పారు.
ఆ గీతం: -
"జయ జననీ పరమపావనీ
జయ జయ భారత జననీ !జయ!
శీతశైల మణి శృంగ కీరీటా
సింహళ జాంబూనద పీఠా
వింధ్యమహీధర మహామేఖలా
విమల కాశ్మీర కస్తూరిరేఖ !జయ!
గంగా సింధూ మహానదీ
గౌతమీ కృష్ణా కావేరీ
జీవసార పరిపోషిత కోమల
సశ్య విశాలా శ్యామలా !జయ!
ఈ గీతంలో భారతదేశ నైసర్గిక స్వరూపాన్ని,భారతమాతకు అలంకారప్రాయంగా నిలిచే సహజ వనరుల గురించి, భరతమాత ఔన్నత్యాన్ని కీర్తించి చెప్పారు. అటువంటి ఉత్కృష్ట దేశంలో జన్మించడం మన అదృష్టమని ప్రజల హృదయాలలో చైతన్యం రేకెత్తించారు సముద్రాల రాఘవాచార్యులవారు. ముత్యాలసరాల వంటి సరళ పదజాలానికి లాలిత్యంతో కూడిన సంగీతం సమకూర్చి శ్రీమతి సి.కృష్ణవేణి బృందంతో గానం చేసిన శ్రీ ఘంటసాలవారి గళంలోని మార్దవం , శ్రోతలను పరవశులను చేస్తుంది.
తెలుగు భాషలోని సౌందర్యమంతా ఘంటసాలవారి సుస్పష్టమైన ఉచ్ఛారణలో,భావ ప్రకటనలో, సుశ్రావ్యమైన గానంలో ప్రకటితమయింది. "ఇంతై వటుడింతై" అనే రీతిలో ఘంటసాలవారి సంగీత విశ్వరూపం అనతికాలంలోనే దిగంతాలకు ప్రాకింది. "జయ జననీ పరమ పావనీ" అనే గీతాన్ని ఘంటసాలవారు ' శుధ్ధ సావేరీ' రాగంలో స్వరపర్చినట్లు ఒక వ్యాసంలో చదివాను.
"శుధ్ధ సావేరి" కర్ణాటక మేళకర్త రాగమైన "ధీరశంకరాభరణం" యొక్క జన్య రాగం. ఈ రాగంలో కేవలం ఐదు స్వరాలు మాత్రమే ఉంటాయి. శుధ్ధ సావేరీ రాగానికి సమాంతరమైన హిందుస్థానీ రాగాన్ని 'దుర్గ' అంటారు. ఇటీవల మరొకరు ఈ పాట విని శుధ్ధ సావేరీ రాగంలో లేని గాంధారం కూడా ఈ పాటలో వినిపిస్తున్నందున ఈ పాట 'సామ' రాగంలో వుందని తమ అభిప్రాయం వెలిబుచ్చారు.
సరే... ఇప్పుడు ఆ సామ రాగ లక్షణాలు కూడా చూద్దాము.
సామ రాగం కర్నాటక సంగీతం లో 28వ మేళకర్త అయిన హరికాంభోజి రాగ జన్యం. ఆరోహణ-అవరోహణ క్రమం :- 'సరిమపదస - సదపమగరిస'
శుద్ధసావేరి :- 'సరిమపదస-సదపమరిస'
29వ మేళకర్త ధీరశంకరాభరణం రాగానికి జన్యరాగం శుద్ధసావేరి.
శుద్ధసావేరి, సామ పక్క పక్క మేళకర్తల జన్యరాగాలు.
సామకు శుద్ధసావేరి కి మధ్య గల తేడా గాంధారం ఒక్కటే.
ఈ స్వరబేధాలు సక్రమంగా గుర్తించకపోతే రాగనిర్ణయంలో పొరపాటు జరిగే అవకాశం వుంది.
ఘంటసాలవారు ఈ పాటకు వైలిన్స్, ట్యూబోఫోన్, జలతరంగ్, సాక్సోఫోన్, తబలా మొదలగు వాద్యాలను నేపథ్యంలో ఉపయోగించినట్లు తెలుస్తోంది.
ప్రాంతీయ దురభిమానాలను పక్కన పెడితే ఈ గీతం సర్వ విధాలా ఇతర జాతీయగీతాల జాబితాలో చేర్చదగ్గ ఉత్తమ జాతీయగీతం. ఈ తరం పిల్లలంతా తప్పక నేర్చువలసిన ఉత్తేజభరిత ప్రబోధ గీతం. ఇప్పుడు ఆగీతాన్ని చూస్తూ విందామా!
కొసమెరుపు -
మన దేశం సినిమాలో సముద్రాల సీనియర్ గారు వ్రాయగా హీరోయిన్ సి కృష్ణవేణి పాడి అభినయించిన 'అత్తలేని కోడలుత్తమురాలు'; పి.జి.కృష్ణవేణి(జిక్కి) పాడగా లక్ష్మీకాంత, రేలంగి నటించిన 'పంచదార వంటి పోలీసెంకటసామి నిను నేను మరువలేనురా ' పాటలు సూపర్హిట్ అయాయి. ఆ పాటలను మరల ఘంటసాల గారు గ్రామఫోన్ రికార్డులుగా పాడగా అవి ఆంధ్రదేశమంతా మార్మోగాయి. జానపదబాణీలో సాగిన ఆ రెండు పాటలను స్త్రీల ముఖభావాలతో అభినయిస్తూ ఘంటసాలగారు తన కచేరీలలో విధిగా పాడి ప్రేక్షకులను సమ్మోహనపర్చేవారు.
అత్తలేనికోడలుత్తమురాలు ఓయమ్మా...
మరువలేనురా నిను నేను పంచదారవంటి
సదా మదిలో మెదిలే ఘంటసాలవారి మరో మధురగీతంతో మళ్ళీ వచ్చేవారం.....
ప్రణవ స్వరాట్




No comments:
Post a Comment