అధ్యాయం - 2 - భాగం 5
అమీర్ ఖుస్రో.
ప్రాచీన హిందూదేశ చరిత్ర గురించి అంతో ఇంతో అవగాహన వున్నవారందరికీ ఈ 13వ శతాబ్ది చరిత్ర పురుషుని గురించి తెలిసేవుంటుంది. అమీర్ ఖుస్రో ఢిల్లీ సుల్తానుల ఆస్థానంలోని గొప్ప కవి,సంగీతవిద్వాంసుడు, వేదాంతి. సూఫీ భక్తితత్త్వాన్ని అవలంబించినవాడు. ఈ పారశీక కవి జీవితకాలమంతా హిందూదేశంలోనే గడిచింది. హిందుస్థానీ సంగీతం ఉజ్జ్వలంగా వెలుగొందడానికి ముఖ్యకారకులలో ఒకడు అమీర్ ఖుస్రో. ఈనాడు మన దేశంలో బహుళప్రచారంలో వున్న సితార్ వాద్యాన్ని కనిపెట్టినవాడు ఆయనే. అలాగే, హిందుస్థానీ సంగీతంలో ఒక భాగమైన 'తరానా'ను, ఖవాలీ పధ్ధతి గానానికి ఆద్యుడు ఈ అమీర్ ఖుస్రోయే.
నేటి మన ఘంటసాల సజీవరాగానికి ఈ అమీర్ ఖుస్రోకు ఏమిటి సంబంధం అనే మీ సందేహం సహజమే. ఆ విషయానికే వద్దాము. అమీర్ ఖుస్రో హిందుస్థానీ సంగీతంలో ప్రవేశపెట్టిన 'తరానా' కు సమాంతరమైన కర్ణాటక సంగీత ప్రక్రియ 'తిల్లానా'. కర్ణాటక సంగీత కచేరీలలో, భరతనాట్య ప్రదర్శనలలో ఆఖరి అంశంగా ఈ తిల్లానాను గానం చేస్తారు. లయతాళ ప్రధానమై, మధ్యమ, ధృతకాలంలో (త్వరితగతిన) జతులతో కూడివుండిన తిల్లానా శ్రోతలలో అత్యుత్సాహాన్ని, చైతన్యాన్ని, మహదానందాన్ని కలిగిస్తుంది. తిల్లానాలో కృతులలోలాగే పల్లవి, అనుపల్లవి, చరణాలున్నా సాహిత్యానికి ప్రాముఖ్యత తక్కువ. భక్తి, శృంగారరస ప్రధానమైన ఈ తిల్లానాలో జతులు, సంగతులతో కూడిన సంగీతమే నడుస్తుంది. మన భారతీయ సంగీతంలో ఈ తిల్లానా చాలా ప్రముఖమైన అంశం.
ప్రారంభకాలంలో తిల్లానాలను రచించినవారిలో ప్రసిద్ధులు శ్రీ వీరభద్రయ్య. అలాగే, శ్రీ మహావైద్యనాధయ్యర్ అనే విద్వాంసుడు కానడ రాగం సింహనందిని తాళంలో చేసిన తిల్లానా ఆయన విద్వత్ కు పట్టం కడతుంది. గతించిన కాలంలోని శ్రీయుతులు - పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్, స్వాతితిరునాళ్ వంటి సంగీత విద్వాంసులు చేసిన తిల్లానా రచనలు చాలా ప్రసిధ్ధి పోందాయి. ఈ శతాబ్దంలో సర్వశ్రీ లాల్గుడి జి.జయరామన్, బాలమురళీకృష్ణ, మహారాజపురం సంతానం వంటి ప్రముఖ సంగీతవిద్వాంసులెందరో తిల్లానాలను రచించి, ప్రదర్శించి రసజ్ఞుల ఆదరాభిమానాలు పొందారు.
తిల్లానా స్వరరచనలు మనకు ఎక్కువగా కదనకుతూహలం, ఖమాస్, కళ్యాణి, కానడ బృందావని, కుంతలవరాళి, కాపి, బెహాగ్, గంభీరనాట, సింధుభైరవి, ద్విజావంతి, సింహేంద్రమధ్యమం మొదలైన రాగాలలో కనిపిస్తాయి.
శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం లేని సామాన్య శ్రోతలు కూడా లయప్రధానమైన తిల్లానాలకు మంత్రముగ్ధులవుతారు. పండితులతో పాటు పామరులకు కూడా బాగా ఆనందాన్ని కలిగించే ఈ తిల్లానాలను ఘంటసాల, పెండ్యాల, ఎస్.రాజేశ్వరరావు వంటి సినీ సంగీత దర్శకులు పాత సినిమాలలో ప్రవేశపెట్టి తమ ప్రతిభను కనపర్చారు.
ఆవిధంగా శ్రీ పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి ఫరజ్ రాగంలోని తిల్లానా రచనను ఒకదానిని ఘంటసాలగారు తన సంగీత దర్శకత్వంలో వచ్చిన ఒక సినిమాలో ఉపయోగించారు. ఫరజ్ 15వ మేళకర్త అయిన మాయామాళవగౌళ కు జన్యరాగం. ఇది షాఢవ, సంపూర్ణ రాగం. రాగ ఆరోహణలో 6స్వరాలు, (రిషభం వర్జితం), అవరోహణ లో 7 స్వరాలు (రిషభంతో సహా) పలుకుతాయి.
స్వీయ సంగీతంలో ఘంటసాల బెజవాడ రాజరత్నంతో కలసి గానం చేసిన ఈ తిల్లానా యే నేటి మన 'ఘంటసాల-సదా మదిలో మెదిలే సజీవరాగం'.
గత వారాలలో చెప్పుకున్నాం - సంగీతదర్శకుడిగా ఘంటసాలగారికి తొలి అవకాశం కల్పించినది శోభనాచలా స్టూడియో అధినేతలు శ్రీ మీర్జాపురం రాజా, ఆయన సతీమణి, నటగాయని శ్రీమతి సి.కృష్ణవేణి. వీరు ఒకేసారి 'లక్ష్మమ్మ', 'మనదేశం', 'కీలుగుఱ్ఱం' అనే మూడు సినిమాలు నిర్మించడానికి సంకల్పించి ఘంటసాలవారిని సంగీతదర్శకుడిగా ఎన్నుకున్నారు. ముందుగా సంగీతదర్శకుడిగా ఒప్పందం జరిగింది 'లక్ష్మమ్మ' సినిమాకే అయినా దీనికంటే ముందుగా 'కీలుగుఱ్ఱం', 'మనదేశం' సినిమాలు విడుదలై గాయక సంగీతదర్శకుడిగా ఘంటసాలకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.
ఘంటసాలగారి తొలి మూడు సినీమాలలో ఆఖరున రిలీజైన 'లక్ష్మమ్మ' కు వున్నంత నిర్మాణ నేపథ్యం మరే సినిమాకు వుండివుండదు.
1947 లో పెందుర్తి సుబ్బారావు అనే ఆయన మహతీ పిక్చర్స్ బ్యానర్ మీద గోపీచంద్ డైరక్షన్ లో సిహెచ్.నారాయణ రావు హీరోగా, పి.భానుమతి ని హీరోయిన్ గా పెట్టి ఈ లక్ష్మమ్మ కథను సినిమాగా తీయాలని ప్లాన్ చేశారు. అయితే, ఇలాటి ఏడుపుగొట్టు వేషాలు తన ఒంటికి పడవని భానుమతిగారు ఈ పాత్రను నిరాకరిస్తే తర్వాత ఆ వేషానికి మాలతిని తీసుకున్నారు. ఈ సినిమాకు బాలాంత్రపు రజనీకాంతరావుగారు గీతరచన, సంగీతనిర్వాహకులు. తారానాథ్ అనే మారుపేరుతో కొన్ని పాటలు వ్రాసి వరసలు కట్టారు. కానీ, ఈ సినిమా నిర్మాణం కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ఆగిపోయింది. డైరెక్టర్ గోపీచంద్ ఈ కథను శోభనాచలావారికి వినిపించగా ఆ కథ వారికి నచ్చి నిర్మాణ హక్కులను కొనుగోలు చేసి గోపీచంద్ డైరక్షన్లో పునఃప్రారంభించారు. లక్ష్మమ్మ పాత్రను కృష్ణవేణే నటించడానికి నిర్ణయించారు. రజనీకాంతరావు అనారోగ్యకారణాల వలన ఈ సినిమా కు సంగీతం చేయలేనని తనకు బదులుగా ఘంటసాలను పెట్టుకోమని చెప్పడంతో లక్ష్మమ్మ సంగీత దర్శకుడిగా ఘంటసాల రంగప్రవేశం చేశారు. రజనీకాంతరావుగారు వ్రాసిన పాటలను, కొన్ని వరసలను ఘంటసాల యథాతధంగా వుంచి రికార్డు చేశారు. కొన్నింటికి ఘంటసాల వరసలు కట్టారు.
ఆ సమయంలోనే 'బాలరాజు' సినిమా తీసిన ఘంటసాల బలరామయ్యగారు ఎ.ఎన్.ఆర్., అంజలీదేవిలతో
'స్వప్నసుందరి' సినిమా తీస్తున్నారు. ఆయన ఈ లక్ష్మమ్మ కథను విని తాను కూడా ఆ చిత్రాన్ని నిర్మించాలని స్వప్నసుందరి ని పక్కనపెట్టారు. బలిజేపల్లి లక్ష్మీకాంతంగారితో కథ, మాటలు వ్రాయించి యుధ్ధ ప్రాతిపదికన షూటింగ్ మొదలెట్టారు. అంతవరకు స్నేహంగా వుండిన శోభనాచలా, ప్రతిభా పిక్చర్స్ యూనిట్ల మధ్య యుధ్ధవాతావరణం నెలకొంది.
నువ్వా!నేనా! అని పోటాపోటీగా రాత్రింపగళ్ళు కష్టపడి షూటింగ్ లు జరిపారు. ఘంటసాల బలరామయ్యగారి 'లక్ష్మమ్మ కధ' కు సి.ఆర్.సుబ్బురామన్ సంగీత దర్శకుడు. ఆ సినిమా లో మన ఘంటసాలగారు ఒక్క పాట కూడా పాడలేదు. అందులోని మగవారి పాటలను సుసర్ల దక్షిణామూర్తి, సుబ్బురామన్ లు పాడారు.
ఈ రెండు సినిమాలు 1950 ఫిబ్రవరిలోనే పోటాపోటీగా విడదలయ్యాయి. వీటిలో ఘంటసాలగారు సంగీతం నిర్వహించిన శోభనాచలా వారి లక్ష్మమ్మకే తెలుగు ప్రజానీకం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.
నేటి ఘంటసాలవారి సజీవరాగంగా ఎంచుకున్న తిల్లానా గీతం శోభనాచల-కృష్ణవేణి నిర్మాణంలో వచ్చిన 'లక్ష్మమ్మ' సినిమా లోనిదే. త్యాగరాజస్వామివారి ప్రియశిష్యుడైన మానాంబుచావడి సుబ్బయ్యర్ గారి శిష్యుడు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్. గొప్ప వాగ్గేయకారుడు. ఫరజ్ రాగంలో రచించి, స్వరపర్చిన ఆయన రచించిన తిల్లానా ను ఇప్పుడు ఘంటసాల, బెజవాడ రాజరత్నం గళాలలో విందాము.
పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ తిల్లానా -'సుదతి నీకు తగిన చిన్నదిరా - సాహిత్యం:-
తదీం ధీంత తననాం తోం తదర
తకిట ధీం
తిరికిటతక నాదరికిటతక
తరికిట తక తక
!తదీం ధీంత!
నాదరిదీం నాదరిదీం తదియనదరి
ధీంత తదరదాని తోందరి దాని
తిరునదర దర ధీం
తఝుణతక ధీంత తకఝుణుతక ధీంత -
తరికిటకిట తక
తథిత్తళాంగు తోం
తకదిత్తళాంగు
తోంతక తదిగిణతోం
సుదతి నీకు తగిన చిన్నదిరా
సురతకేళి కది బలుసూటిరా
!సుదతి!
సదయుడైన వెంకటేశ్వరా నిను
సరగున రమ్మనెరా సమయమురా
!సుదతి!తారానాథ్ పేరుతో రజనీకాంతరావుగారు కొన్ని గీతాలకు వరసలు కట్టినా ఈ తిల్లనాతో సహా చాలా పాటలను ఘంటసాలగారే స్వరపర్చారు. విజయనగరం సంగీతకళాశాలలో శ్రీ పట్రాయని సీతారామశాస్త్రిగారి శిష్యరికంలో నేర్చుకున్న శాస్త్రీయ సంగీతం, సంపాదించిన అనుభవం తర్వాతి కాలంలో సినిమా రంగంలో ఘంటసాలగారికి ఎంతగానో ఉపయోగించిందనడానికి ఈ తిల్లానాయే నిదర్శనం.
సంప్రదాయబధ్ధంగా సాగిన ఈ నృత్యప్రదర్శనలో అవసరంమేరకు, మృదంగం, తాళాలు, మోర్సింగ్, గజ్జెలు, వైెయొలిన్స్, ఫ్లూట్ వంటి వాద్యాలను మాత్రమే ఘంటసాల ఉపయోగించి తెరపై నృత్యప్రదర్శనను హుందాగా నడిపించారు. ఈ తిల్లానాను ఘంటసాల, బెజవాడ రాజరత్నం ఆలపించగా, లక్ష్మమ్మ చిత్రంలోని మరో పదహారు గీతాలను ఘంటసాల, సి.కృష్ణవేణి, ఎమ్.ఎస్.రామారావు, టి.జి.కమలాదేవి, బెజవాడ రాజరత్నం మొదలగువారు పాడారు.
సంగీతపరంగా మొదటి మూడు సినీమాలు hattrick సాధించిన ఘనవిజయం ఘంటసాలగారు భవిష్యత్ లో మరో 110 సినిమాలకు సంగీతదర్శకత్వం వహించడానికి రాచబాటను వేసిందని నిస్సందేహంగా చెప్పవచ్చును.
ఘంటసాలగారి సంగీతనిర్వహణలోని మరో సజీవరాగంతో వచ్చే వారం మరల కలుద్దాము.
ప్రణవ స్వరాట్


No comments:
Post a Comment