అధ్యాయం - 2 - భాగం 5
ఒక సాయంత్రం పార్క్ లోకి వచ్చిన ఓ వృధ్ధదంపతులు ఒకరికొకరు ఆసరాగా మెల్లగా నడుచుకుపోతున్నారు... 'ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేటు వయసులో' అంటూ వేళాకోళంగా ఓ యువజంట వారిని దాటుకుంటూ ముందుకు పోయారు. ఇది నా మనసుకు పట్టలేదు. ఫన్ కి సీరియస్నెస్ కు తేడా తెలియని ఆ వయసులో, ఈ యువజంట చేసిన కామెంట్ కు నా ఒళ్ళుమండింది. ఆనాడు ఇలాటి పేరడీలు కోకొల్లలు. శ్రీరంగం నారాయణబాబు పేరడీ కింగ్. నాకు సాహిత్యంలో ఓనామాలు తెలియకపోయినా వీళ్ళంతా తెలుగు సాహిత్యాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారని తెగ ఫీలయైపోయేవాడిని.
శ్రీశ్రీ వంటి మహాకవి కూడా పేరడీ ప్రభావానికి లోనై ఘాటుప్రేమను లేటు వయసుకు అన్వయించి ఒక సినిమాలో పాట వ్రాశారు. తదాదిగా మరింతమంది సినీ గేయరచయితలు ఈ ఘాటుప్రేమను ఉపయోగించి మరింత ఆదాయం పొందారు. వాళ్ళ తప్పేంలేదు. 'శంఖంలో పోసిందే పవిత్రతీర్థం' అని నమ్మే మనస్తత్త్వం ఉన్నంతకాలం మనకు సెలబ్రిటీస్ చెప్పిందే వేదం, దానికే విలువ, గుర్తింపు, గౌరవం. అప్పటికే ఉన్న అసలు మూలాలను గురించి ఎవరూ పట్టించుకోరు. తలవను కూడా తలవరు.
సరే ఈ విషయం పక్కనపెట్టి అసలు విషయానికి వద్దాము.
'ఘాటు ప్రేమ'..' కన్నుకాటు'... 'తీవ్రవీక్షణం', లేత వలపులో కళలు విరియడం వంటి పదప్రయోగాలతో తెలుగు ప్రజానీకాన్ని తీవ్రంగా బాధపెట్టిన ఆద్య సినీ కవి పింగళి నాగేంద్రరావు గారు. ఇలాటి పదాలు మన తెలుగులో ఎప్పటినుంచో వున్నవే, నేను కొత్తగా కనిపెట్టిందేమీ లేదని పింగళి గారు ఎంత చెప్పినా ఒప్పుకోరే.. కాదు కాదు మీరే నూతన పద సృష్టికర్తలంటూ తెలుగు సినిమా ప్రేక్షకులు ఆయనను అగ్రాసనంపై కూర్చోపెట్టారు.
గత 75 సంవత్సరాలుగా తెలుగువారందరినీ అంతటి ప్రభావితులను చేసిన 'ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్రవీక్షణమో.....' పాతాళభైరవి' సినిమా లోని ఈ గీతమే ఈనాటి ఘంటసాల సజీవరాగం.
పింగళి రచనకు ఘంటసాల సంగీతం; పి.లీల, ఘంటసాలల యుగళం; తెరపై మాలతి (రాకుమారి-ఇందుమతి), ఎన్.టి.రామారావు (తోటరాముడు) ల అభినయం. ----
రాకుమారి (లీల):
'ఎంత ఘాటుప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో! ఓ...
!ఎంత!
కన్నుకాటు తిన్నదిగా కళలు విరిసెనే..
నా.. మనసు మురిసెనే...
!ఎంత!
తోటరాముడు(ఘంటసాల):
ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో ఓ...
!ఎంత లేత!
కన్నులలో కనినంతనే తెలిసిపోయెనే
నా... మనసు నిలిచెనే-2
!ఎంత లేత!
రాకుమారి:
ఈ జాబిలి, ఈ వెన్నెల ఈ మలయానిలమూ-2
విరహములో వివరాలను విప్పి చెప్పెనే
!ఎంత!
తోటరాముడు:
ఓ జాబిలి... ఓ వెన్నెల.. ఓ మలయానిలమా - 2
ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయవే
!ఎంత లేత!
అసలు ప్రేమంటే... చాలామందికి కలిగే సందేహమే. కుల మత భాషా ప్రాంతాలకు, కాలమాన పరిస్థితులకు అతీతమైనది. అవ్యక్తం, అనుభవైకవేద్యం. పరమ పవిత్రం. స్వార్ధరహిత పరస్పరానురాగ బంధం. వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన, విశ్వాసాల ప్రాతిపదికన గాఢంగా పెనవేసుకునే జీవితబంధం. శారీరక సౌందర్యాకర్షణల వలన, ఆస్తిఅంతస్తులు,హోదాల మోజులో కలిగే ప్రేమ తాత్కాలికం. నీతి, నిజాయితీ లేని ప్రేమ అశాశ్వతం. ప్రేమ తత్త్వం సరిగా అర్ధంకానివారికి అదెప్పటికీ బ్రహ్మ పదార్ధమే.
నిజాయితీ తో కూడిన సున్నితమైన, మధురమైన అసలు ప్రేమలోని గాఢత్వాన్ని విశదపర్చే క్రమంలో పింగళివారు ప్రయోగించిన నవ్యపదం 'ఘాటు ప్రేమ'. సున్నితము,లలితము అయిన ప్రేమను ఈ 'ఘాటు'తప్పక ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
ప్రథమ వీక్షణలోనే ప్రేమాంకురం. అది అతి'తీవ్రం'. నాయిక కన్ను ప్రేమకాటు తినడంతో విరిసిన కళలు మనసును మురిపించి పరవశం కలిగించాయి. నాయిక లేతవలపులోని చాటు మోహం చూసిన మరుక్షణమే అర్ధం చేసుకున్న నాయకుడు నాయికలో విరహాగ్నిని మరింత పెంచమని జాబిలి, వెన్నెల, మలయానిలాల సహాయాన్ని అర్ధిస్తున్నాడు. ప్రేమ జంటలకు ప్రేరణను, స్ఫూర్తిని కలిగించే ఈ ప్రేమగీతాన్ని అద్భుతమైన పదజాలంతో పింగళి నాగేంద్రరావుగారు 'పాతాళభైరవి' సినిమా కోసం వ్రాశారు. 'పాళాళభైరవి' సినిమా విడుదలై 75 సంవత్సరాలు గడిచినా ఈ ప్రేమగీతం ఆనాటినుంచి ఈనాటివరకు నవ్యహరితంగా ప్రేమజంటలను,శ్రోతలను మురిపిస్తూనే వున్నది,మైమరపిస్తూనే వున్నది.
ఈ డ్యూయెట్ పాటలోని విశేషమేమిటంటే... ఈపాటను నాయికా నాయకులిద్దరూ ఒకే స్థలంలో నుండి ఆలపించరు. ఓ వెన్నెల రాత్రివేళలో రాజమందిరంలోనుండి రాకుమార్తె,తోటలోనుండి తోటరాముడు తమ తమ మనసులోని ప్రేమభావాలను చంద్రుడి సమక్షంలో ఈ పాటరూపంలో విప్పి చెప్పుకుంటారు.
ఈ ఆపాతమధుర గీతాన్ని మనకు అందించిన 'పాతాళభైరవి' సినిమాకు సంబంధించిన విషయాలు, విశేషాలు ఒకటా, రెండా ! తవ్వినకొద్ది ఈ అమూల్యనిధి నుండి బయటపడుతూనే వుంటాయి.
ఆసియా ఖంఢంలోనే అతి పెద్ద సినిమా స్టూడియోగా పేరుపొందిన వాహినీ స్టూడియో అధినేత బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. 1948లో వాహినీ స్టూడియో కట్టిన తర్వాత నిర్మించబడిన మొదటి సినీమా వాహినీ పిక్చర్స్ బ్యానర్ మీద కెవిరెడ్డి దర్శకత్వంలోని 'గుణసుందరి కథ'. 1949లో వచ్చింది. తర్వాత, నాగిరెడ్డిగారు విజయా ప్రొడక్షన్ సంస్థను చక్రపాణి సహ నిర్మాతగా ప్రారంభించి 1950లో 'షావుకారు' సినిమాను విడుదల చేశారు. 'పాతాళభైరవి' విజయావారి రెండవ చిత్రం. విజయా వాహినీ స్టూడియో పెర్మెనెంట్ కెమేరామన్ మార్కస్ బార్ట్లీ. విజయావారి చిత్రాలలో పాటలకు, ముఖ్యంగా, వెన్నెల పాటలకు పెట్టింది పేరు.
చక్రపాణి గారి ఆధ్వర్యంలోని 'చందమామ' పత్రిక అంటే ప్రజలకెంత అభిమానమో, అంతే ప్రేమ విజయావారి సినిమా చందమామ. తెలుపు నలుపు సినిమా లలో చందమామను, తటాకాలలో వెన్నెలక్రీనీడలను, చల్లగ వీచే పిల్లతెమ్మెరలకు సన్నగ నడుమూపే లతా సౌందర్యాలను అత్యద్భుతంగా చిత్రీకరించడంలో మార్కస్ బార్ట్లీని మించినవారు లేరు. భారతీయ కళా సంస్కృతిని పూర్తిగా అర్ధం చేసుకుని తెలుగు సినిమాఔన్నత్యానికి పాటుపడిన ఛాయాగ్రహకుడు. ఒంటికన్నుతో అపూర్వాలను సృష్టించిన మేధావి మార్కస్ బార్ట్లీ. ఆయన పనితనం పాతాళభైరవి సినిమాలో అణువణువున ప్రతిబింబిస్తుంది.
'ఎంత ఘాటు ప్రేమయో' పాట చిత్రీకరణ ప్రేక్షకులలో మోహాన్ని రేకెత్తించి పరవశం కలుగజేసింది. ఈ విషయంలో గాయక,సంగీత దర్శకుడు ఘంటసాల; ఛాయాగ్రహకుడు మార్కస్ బార్ట్లీ పోటాపోటీగా కృషి చేశారనిపిస్తుంది.
కాశీమజిలి కథలు, అల్లావుద్దీన్ కథల ఆధారంగా తీయబడిన అపూర్వ జానపద చిత్రం 'పాతాళభైరవి'. చిత్రనిర్మాణంలోని 24 శాఖల అసమాన్య కృషి ఫలితం 'పాతాళభైరవి'. తెలుగు తమిళ భాషలలో నిర్మించిన ఈ కళాఖండం ఘనవిజయానికి ముఖ్య కారణం పింగళివారి మాటలు, ఘంటసాలవారి పాటలు. మాటలు, పాటలు రెండూ సమానంగా తెలుగనాట ప్రజలనోట నానాయి. కెవిరెడ్డిగారి దర్శకత్వ ప్రతిభతో 200 రోజులు ఆడిన మొట్టమొదటి తెలుగు సినిమా 'పాతాళభైరవి'. అలాగే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడిన మొట్టమొదటి తెలుగు సినిమా 'పాతాళభైరవి'. ఈ సినీమా హీరో తోటరాముడు ఎన్.టి.ఆర్ కు, విలన్ మాయలమాంత్రీకుడు ఎస్.వి.రంగారావుకు తిరుగులేని స్టార్ ఇమేజ్ ను సంపాదించిపెట్టిన ఫాంటసీ సినిమా 'పాతాళభైరవి'. మొదట్లో ఈ సినిమా హీరోగా ఎవరిని పెట్టాలనే మీమాంసలో డైరెక్టర్ కెవిరెడ్డి గారు పడ్డారు. అంతవరకూ ఫోక్లోర్, గ్లామరస్ హీరోగా పేరు సంపాదించుకున్న ఎ.ఎన్.ఆర్ కు బదులుగా కొత్త హీరో (షావుకారు) ఎన్.టి.ఆర్ ను తోటరాముడు పాత్రకు ఎన్నుకున్నారు.
పండిత పామర జనాలను ఒకే రీతిలో అలరించిన 'పాతాళభైరవి'సంచలన విజయానికి ఘంటసాల సంగీతం, పాటలు ముఖ్య కారణమయ్యాయి. ఈ సినిమా లో వున్న 11 పాటలను ఘంటసాల, పి.లీల, జిక్కి, కోమల, టి.జి.కమలాదేవి, రేలంగి, పిఠాపురం పాడారు.
ఈ సినిమా లో ఏ పాటకు ఆ పాటే గొప్పగా వున్నప్పటికి సాహిత్య పరంగా, సంగీతపరంగా పి.లీల, ఘంటసాల 'ఎంత ఘాటు ప్రేమయో' పాట ఈనాటికీ సజీవరాగంగా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది.
ఘంటసాలగారికి ఉస్తాద్ బడేగులాం ఆలీఖాన్ గారి హిందుస్థానీ సంగీతమంటే చాలా మక్కువ. ఖాన్ సాహేబ్ గానం చేసిన అనేక రాగాల స్ఫూర్తితో ఘంటసాలగారు మంచి మంచి పాటలెన్నో స్వరపర్చారు. అలాటి రాగాలలో రాగేశ్రీ (రాగేశ్వరి) ఒకటి. ఆ రాగంలోనే 'ఎంత ఘాటు ప్రేమయో' పాటను స్వరపర్చారు. రాగేశ్రీ లేదా రాగేశ్వరి హిందుస్థానీ సంగీతం లో ఖమాస్ థాట్ రాగం. అంటే జన్యరాగం. ఔడవ షాడవ రాగం. ఆరోహణలో ఐదు స్వరాలు, అవరోహణలో ఆరు స్వరాలు పలుకుతాయి. శృంగార రసానికి, సరళమైన మృదుభావాలకు అనువైన రాగం రాగేశ్వరి.
ఘంటసాలగారికి, మలయాళ గాయని పి.లీలగారికి తెలుగు, తమిళ భాషలలో ఎనలేని ఖ్యాతి తెచ్చిపెట్టిన పాట 'ఎంత ఘాటు ప్రేమయో'. ఘంటసాల మాస్టరు ఈ పాటలో ఉపయోగించిన పియానో, వైయొలిన్స్, సాక్సో, ట్రంపెట్, క్లారినెట్, ఫ్లూట్, మాండొలిన్, గిటార్, తబలా వంటి వాద్యాలు ఎంతో మృదుమధురంగా ఈ ప్రేమగీతాన్నిఉన్నతస్థాయి కి తీసుకువెళ్ళాయి. ఎన్ని తరాలు మారినా చెక్కుచెదరని సజీవరాగం, నిత్యనూతన ప్రేమగీతం' ఘంటసాలవారి 'ఎంత ఘాటు ప్రేమయో'.
జెమినీ వాసన్ 'పాతాళభైరవి'ని హిందీలోకి డబ్ చేసినప్పుడు. తెలుగులోని ఈ యుగళగీతాలను తలత్ మహమ్మద్, గీతాదత్ పాడారు. ఆ హిందీ డబ్బింగ్ 'పాతాళ్ భైరవి' కూడా వాసన్ గారికి మంచి ఆదాయాన్నే అందించింది.
విజయా నాగిరెడ్డి-చక్రపాణి లు తీసిన 'పాతాళభైరవి' ని నాగిరెడ్డి గారి అబ్బాయిలు ఎన్.టి.ఆర్ కుమారుడు
బాలకృష్ణ హీరోగా 'భైరవద్వీపంగా' రంగుల్లో తీసి మంచి విజయం పొందారు.
అలాగే హీరో కృష్ణ 1985 లో ఈ సినిమా ను జితేంద్ర, జయప్రద హీరో హీరోయిన్ లుగా హిందీలో భారీ ఎత్తున నిర్మించి నిర్మాత గా తన ఖ్యాతిని పెంచుకున్నారు.
నూరు భారతీయ ఉత్తమ కళాఖండ చిత్రాలలో విజయావారి తెలుగు 'పాతాళభైరవి' చోటుచేసుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం.
కొసమెరుపు:-
ఒకసారి మద్రాస్ మ్యూజిక్ ఎకాడెమీలో మద్రాసు తెలుగు అకాడెమీ ఉగాది పురస్కారోత్సవంలో 'ఘంటసాల సకల గాయక సంగీతోత్సవం' జరిగింది. లబ్దప్రతిష్టులైన సినీ గాయనీగాయకులంతా ఆ అమరగాయకుని స్మరించుకుంటూ ఆయన పాటలనే ఆలపించారు. ఆ సందర్భంగా ప్రముఖ నేపధ్యగాయకుడు పి.బి.శ్రీనివాస్ గారు పాతాళభైరవి లోని ఈ 'ఎంత ఘాటు ప్రేమయో ' పాటలోని ప్రతీ వాక్యాన్ని తన సహజ వాగ్ధోరణిలో విశ్లేషిస్తూ, పాడుతూ ఘంటసాల మాస్టారి సంగీత ప్రతిభను బహుదా ప్రశంసించారు. తానే కనుక భోజరాజు అయివుంటే ఈ పాటలోని ఘంటసాలగారి స్వరమాధుర్యానికి, 'ఓ జాబిలి, ఓ వెన్నెల, ఓ మలయానిలమా అనే పదాల మీద ప్రయోగించిన స్వరస్థానాల తీరుకు లక్షేసి వరహాలు కానుకగా సమర్పించుకునేవాడినని చెప్పగానే వేలాది ప్రేక్షకుల హర్షధ్వానాలు, కరతాళధ్వనులతో మ్యూజిక్ ఎకాడెమీ ఆడిటోరియం మార్మోగింది. సాటి గాయకుడి ప్రశంసను మించిన ప్రశంస వేరింకేముంటుంది! గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాల అంతటి ఘనతను సాధించారు.
మరో సజీవరాగంతో మరల కలుద్దాము.
ప్రణన స్వరాట్

No comments:
Post a Comment