Saturday, 25 October 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 105వ భాగం - ఏనాడు మొదలిడితివో ఓ విధి

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నూటనాలుగవ భాగం ఇక్కడ

105వ సజీవరాగం - ఏనాడు మొదలిడితివో ఓ విధి

చిత్రం - చంద్రహారం
గానం - ఘంటసాల
రచన - పింగళి

సంగీతం - ఘంటసాల

"ఏమిటీ! సినిమాలలో పాటలు పాడడానికి ఉన్న ఉద్యోగం వదిలేసి వచ్చావా! ఇంతకీ 'సాపాసా'లు పట్టగలవా! ఈ మాట తరచూ నా చిన్నప్పుడు పాండీబజార్లో వినిపించేది. ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఇప్పుడలాటి బాదరబందీయేమీ లేదు సినిమా లో పాటలు పాడడానికి.

 ఇంతకీ 'సాపాసా' లు పట్టడమంటే?

సంప్రదాయ సంగీతంలోని ప్రాథమిక సూత్రాలను (basics) నిత్య సాధన ద్వారా అధ్యయనం చేయడం. 'సరిగమ పదనిస'; 'సనిదప మగరిససప్త స్వరాలు. ఈ సప్తస్వరాలను అనేక కాంబినేషన్లలో వివిధ స్థాయిలలోవివిధ కాలగతులలో శ్రుతిలయలను సమన్వయపర్చుకుంటూ సాధన చేయడం. ఇందుకుగాను 16 వ శతాబ్దానికి చెందిన కర్ణాటక దేశపు పురందరదాసులవారు అభ్యాస సంగీతానికి కావలసిన సిలబస్ ను రూపొందించారు. సరళీస్వరాలుజంటస్వరాలు, అలంకారాలు, గీతాలతో ప్రారంభించి క్రమక్రమేణా స్వరజతులు, వర్ణాలుకీర్తనలుకృతులుజావళీలుతిల్లానాఇత్యాది శాస్త్ర గ్రంథం నేర్చుకోవడానికి కావలసిన విధివిధానాలను ఏర్పరిచినది పురందరదాసులవారే. ఈనాడు మనం  నేర్చుకుంటున్న, వింటున్న సరళీస్వరాలు, జంటస్వరాలుఅలంకారాలు అన్నీంటిని పురందరదాసులవారు 'మాయామాళవగౌళ రాగం'లో నిర్దేశించారు.

'సరిమా గరి సరి గరిస

రిమ పద మప దప మగరిస'

లంబోదర లకుమికర

అంబాసుత అమరవినుత'

అని సంగీత విద్యార్థులంతా ప్రప్రథమంగా నేర్చుకునే పురందరదాసు గీతం కూడా మాయామాళవగౌళ రాగ జన్యమే. మలహరి రాగం. మాయామాళవగౌళ అతి ప్రాచీనమైన రాగం. దీని పూర్వనామం మాళవగౌళ. 72 మేళకర్త రాగ చట్రం రూపొందినప్పుడు మాళవగౌళ రాగానికి ముందు 'మాయా' అనే మాటను చేర్చి 15వ మేళకర్త గా 'మాయామాళవగౌళ' అనే నూతన నామాన్ని సృష్టించడం జరిగింది. సంగీత ప్రపంచమంతా సదా స్మరించుకోదగ్గ మహనీయులు ముగ్గురే ముగ్గురు - 13వ శతాబ్దంలో కాశ్మీర దేశంలో పుట్టి మహారాష్ట్ర దేశానికి వలసపోయిన సారంగదేవుడురెండవవారు 16వ శతాబ్దానికి చెందిన కర్ణాటక దేశ సంగీత విద్వాంసుడు, శ్రీవైష్ణవ భక్తుడు అయిన పురందరదాసులవారు; మూడవవారు 17 వ శతాబ్దంలో తంజావూరు సంస్థాన మంత్రిసంగీత విద్వాంసుడు, పండితుడైన వెంకటమఖి.

సారంగదేవుని 'సంగీత రత్నాకరం', పురందరదాసులవారి అభ్యాస సంగీతంరాగవిభజన చేస్తూ వెంకటమఖి వ్రాసిన 'చతుర్దండి ప్రకాశిక అనే సంగీతగ్రంధం.  ఆనాటినుండి ఈనాటివరకు ఎంతటి ఘనమైన సంగీతవిద్వాంసులైనా పరమపవిత్రంగా, మార్గదర్శకంగా, ఆదర్శనీయంగా  భావిస్తూ అనుసరిస్తూ వస్తున్న ఉత్కృష్ట  సంగీత గ్రంధాలు. కర్ణాటక సంగీతమంటే కర్ణాటక దేశంలో పుట్టిన సంగీతమని అర్ధంకాదు. కర్ణం అంటే చెవి. చెవికి ఇంపుగాశ్రావ్యంగా వినిపించే సంగీతం కర్ణాటక సంగీతంగా భావించాలి.  అటువంటి కర్ణాటక సంగీతాన్ని అభ్యసించేవారంతా ముందుగా నేర్చుకునే రాగం - 15వ మేళకర్త యైన 'మయామాళవ గౌళ'. ఈ రాగంలోనే ప్రాథమికంగా నేర్చుకోవలసిన సరళీస్వరాలు, జంటస్వరాలు, అలంకారాలు స్వరపర్చబడ్డాయి. గురువులు వాటిని ఎలా నేర్పుతారో సంక్షిప్తంగా  ఈ క్రింది ఆడియో లలో విందాము. కర్ణాటక సంగీత విద్యార్థి  తన ప్రాథమిక సంగీతాన్ని మాయామాళవగౌళ రాగంతో నేర్చకోవడం ప్రారంంభిస్తాడు. ఈ రాగంలో స్వరస్థానాల అమరిక, అంటే స్కేల్ పూర్వాంగఉత్తరాంగాలు సమతుల్యం కలిగి వుండడంరెండురాగంలో ఎక్కడా వివాది స్వరాలు లేక పోవడం,   మొదలైన విషయాలు ప్రాథమిక సంగీత శిక్షణకి మాయామాళవగౌళ రాగమే అత్యంత అనుకూలమైన రాగంగా మన సంగీతజ్ఞులు భావించారు. మాయామాళవగౌళ రాగం శాంతశోకవైరాగ్య రసాలను ప్రకటించడానికి అనువైనరాగం. ఉదయసాయంసంధ్యా సమయాలలోనే కాక అన్ని వేళలా ఆలపించదగ్గ రాగం. మాయామాళవగౌళ రాగానికి సమాంతరమైన హిందుస్థానీ రాగం. 'భైరవ్' . 'బౌళి', 'గౌళ', 'రేవగుప్తి', 'లలిత', 'మలహరి', 'నాదనామక్రియ' వంటి రాగాలు  15వ మేళకర్త మాయామాళవగౌళకు జన్యరాగాలుగా ప్రసిధ్ధి పొందాయి.

అటువంటి ఘన చరిత్ర కలిగిన మాయామాళవగౌళ రాగంలో ఘంటసాలగారు ఆలపించిన ఒక అద్భుతమైన గీతమే ఈనాటి మన సజీవరాగం. అదే చంద్రహారం చిత్రంలోని 'ఏనాడు మొదలిడితివో ఓ విధీ! ఏనాటికయ్యెనీ నాటక సమాప్తిఅనే పింగళివారి గీతం. పింగళి సాహిత్యానికి స్వీయ సంగీత నిర్దేశకత్వంలో ఘంటసాల గానం.

పల్లవి: 

ఏనాడు మొదలిడితివో ఓ విధీ!

ఏనాటికయ్యెనీ నాటక సమాప్తి -2

 

చరణం 1: 

జనన మరణాలతో సుఖ దుఃఖములతో -2

ప్రాణులను ఆడించి

పీడింతువేమయ్యా-2

ఎన్నెన్నొ వేడుకల ఈ సృష్టి కల్పించి-2

కనుమూయునంతలో మాయజేసేవయ్య

                                            !ఏనాడు!

చరణం 2:

నేను నాదను ఆశ గగనానికెక్కించి-2

అంతలో పాతాళమున దింతువేమయ్య

                                                        !అంతలో!

తనువు శాశ్వతమంటు మైమరువజేసి-2

తనువును జీవిని విడదీతువేమయ్య

                                            !ఏనాడు!

 

ఏనాడు మొదలిడితివో ఓ విధీ

ఏనాటికయ్యెనీ నాటక సమాప్తి "

జీవితం  ఒక నాటకరంగం. ఒక్క జీవితమనేమిటి! ఈ  విశ్వమంతా నిత్యనూతన నాటకరంగం. జీవులంతా అందులోని చిత్రవిచిత్ర పాత్రధారులు. సర్వసాక్షియైన పరమాత్మే ఈ జగన్నాటకానికి సూత్రధారి. విధి చేసే వింతలన్నీ మతిలేని చేష్టలుగా కనిపించినా, విధివిలాసాన్ని తప్పించే దుస్సాహసాన్ని ఎవరూ చేయలేరు. కన్నుతెరిస్తే జననం; కన్ను మూస్తే మరణం. రెప్పపాటు కాలమే నీ సొంతం. ఆ మూణ్ణాళ్ళ ముచ్చటను కూడా సంపూర్ణంగా అనుభవించకుండా రకరకాల కష్టనష్టాలను కల్పించి జీవుడు దుఃఖపడుతూంటే తాను నడిపించే నాటకాన్ని వినోదంగా చూసి ఆనందించే ఈశ్వరుడితో ఏ విధంగా మొరపెట్టుకోగలడు ' ఏనాడు మొదలిడితివో ఓ విధీ ఏనాటికయ్యెనీ

 నాటక సమాప్తి' అని దైన్యంగా కుమిలిపోవడం తప్ప.

చందనదేశపు భావి మహారాజు చందనరాజును (ఎన్.టి.ఆర్) ఐదేళ్ళ ప్రాయం నుండే  తన సంరక్షణలో  కంటికి రెప్పగా పెంచి పెద్దచేసి అన్ని విద్యలలో ఆరితేరినవాడిగా చేస్తాడు మాలి (ఎస్.వి.రంగారావు).  ఒక దేవకన్య మోహానికి, శాపానికి గురియై అల్పాయుష్కుడైన యువరాజు దుస్థితిని తలచుకొని విరక్తిగా మాలి పాడిన పాట ఇది. 

చంద్రహారం లోని ' ఇది నా చెలి ఇది నా సఖి నా మనోహరి' పాటను గతంలోనే సజీవరాగంగా వినిపించేను. చంద్రహారం సినిమాలోని అన్ని పాటలు ఆపాతమధురాలే. నాకు ఎనిమిది సంవత్సరాల వయసులో విజయనగరం లో 'చంద్రహారం' సినీమా చూసేను. ఆ వయసులో అందులోని ఎన్నో పాటలు నన్ను ఆకర్షించి వుండవచ్చు కాని  అలా జరగలేదు. వివిధ భావావేశాలతో ఘంటసాలగారు సమ్మోహనకరంగా ఆలపించిన ఓ మూడు పాటలు మాత్రం ఆనాటినుండి ఈనాటివరకు నా మెదడులో స్థిరోభవా గా నిలిచిపోయాయి. అవి 'విజ్ఞానదీపమును వెలిగింపరారయ్యా', 'ఇది నా చెలి ఇది నా సఖి', 'ఏనాడు మొదలిడితివో ఓ విధీ' అనే పాటలు.

ఘంటసాల మాస్టారు ఈ పాటను స్వరపర్చడానికి మాయామాళవగౌళ రాగాన్ని ఎన్నుకోవడంలో ఎంతో ఔచిత్యాన్నివిజ్ఞతను పాటించారనిపిస్తుంది. కారణం , మాయామాళవగౌళ సంపూర్ణరాగం. శాంతశోక రసాల ప్రకటనకు చాలా శ్రేష్టమైనది. ఇంతకుముందు చెప్పినట్లు ఈ రాగంలో ఎక్కడా వివాది స్వరాలు లేకపోవడంఆరోహణ, అవరోహణ క్రమంలో స్వరస్థానాల అమరిక సమతుల్యం కలిగివుండడం వలన ఈ గీత స్వరరచన అద్భుతంగా సాగింది. ఈపాట ఆద్యంతం ఘంటసాలవారి గళంలో ధ్వనించిన ఆర్ద్రతనైరాశ్యం అనితరసాధ్యం అంటే అతిశయోక్తి కాదేమో! నాదం పెదవుల మధ్యనుండి కాదునాభిస్థానం నుండి హృదయాంతరాళాలనుండి రావాలనే గురువుల బోధనా సూత్రాన్ని ఘంటసాలగారు తు.చ. తప్పకుండా తన జీవితాంతం ఆచరించారు.

తగుమాత్రపు వాద్యాలు మాత్రమే ఈ పాటలో వినిపిస్తాయి. అందుకుగాను వైలిన్స్ఏక్ తారహేమండ్ ఆర్గన్కోల్, ఫ్లూట్, క్లారినెట్ వంటి వాద్యాలను ఉపయోగించుకున్నారు ఘంటసాల.

చంద్రహారం సినీమా  డైరెక్టర్ కమలాకర కామేశ్వరావుగారి మొట్టమొదటి సినిమా. సూపర్ విజన్ ఎల్విప్రసాద్. తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి నిర్మితమైన చిత్రం చంద్రహారం. తమిళం వెర్షన్ కు  ఘంటసాలగారే సంగీతం నిర్వహించి కొన్ని పాటలు కూడా పాడారు.

1954 ల నాటికే  అక్షరాల 25 లక్షల రూపాయలను దిగమ్రింగి నిర్మాత ల మాడు పగలగొట్టిన  భారీ జానపద తెలుగు చిత్రం చంద్రహారం. అందుకు వారి రెండవ చిత్రమైన పాతాళభైరవిలోని ఎన్.టి.ఆర్, ఎస్.వి.రంగారావు సృష్టించిన ఇమేజే పెద్ద కారణమయిందని చెప్పుకోవడం జరిగింది. సామాన్య ప్రేక్షకుడు ఆశించే కత్తియుధ్ధాలుసాహసాలుథ్రిల్స్ ఏవీ లేకుండా 'ఎన్టీఓడు' పది రీళ్ళపాటు కళ్ళుమూసుకు పడుక్కునే వుంటే సినీమా ఏం ఆడుద్దని' చక్కన్నగారు అభిప్రాయపడ్డారట. 

బాక్సాఫీస్ దగ్గర జయాపజయాల విషయం పక్కన పెడితే చంద్రహారం ఉన్నత విలువలతో నిర్మించబడిన ఉత్తమ సంగీతభరిత చిత్రం. అందులోని ఎన్నో పాటలు ఈనాటికీ సజీవ రాగాలే.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 



Saturday, 18 October 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 104వ భాగం - రాధనురా నీ రాధనురా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నూటమూడవ భాగం ఇక్కడ

104వ సజీవరాగం - రాధనురా నీ రాధనురా

చిత్రం - పెళ్ళిచేసి చూడు
గానం - ఘంటసాల
రచన - పింగళి

సంగీతం - ఘంటసాల

పల్లవి:

రాధనురా ! నీ రాధనురా -2

రాసలీలల ఊసే తెలియని

                                !రాధనురా!

చరణం 1:

కసుగాయల కారాధననురా - రాసలీలల

వలపున కుమిలే ప్రణయజీవులకు

వల్లమాలిన బాధనురా

                                !రాధనురా!

చరణం 2:

ఎంతో తెలిసిన వేదాంతులకే

అంతుదొరకని గాధనురా

మధురానగరి మర్మమెరిగిన

మాధవ నీకే సుబోధనురా!

                                !రాధనురా!

అన్నీ తెలిసిన వేదాంతులకే అంతుదొరకని గాధ రాధ... మధురానగరి మర్మమెరిగిన మాధవునికే సుబోధ రాధ... ఎవరీ రాధ?

సంఘంలో సనాతనధర్మ పరిరక్షణ కోసంపామర జనాలలో ఆధ్యాత్మిక, భక్తిభావనలు పెంపొందించి వారు భగవంతుని సన్నిధిని చేరి ముక్తిని పొందే మార్గం కోసం మహానుభావులెందరో  యుగయుగాలుగా అన్వేషణ సాగిస్తూనేవున్నారు. కలియుగంలో కూడా నాగరికత పెరిగినకొలది భగవంతుని ఉనికికి సంబంధించిన జిజ్ఞాస అమితంగా పెరిగింది. ధర్మపరిరక్షణ కోసం పరమాచార్య త్రయం -- జగద్గురు ఆదిశంకరాచార్యులు, భగవద్రామానుజాచార్యులుమధ్వాచార్యులు  అద్వైతవిశిష్టాద్వైతద్వైత సిధ్ధాంతాలను ప్రచారంలోకి తీసుకువచ్చారు.  ఈ మూడు సిధ్ధాంతాలతోపాటు ద్వైతాద్వైత , శుధ్ధాద్వైత సంప్రదాయాలు కూడా ఉద్భవించాయి. జీవాత్మపరమాత్మ ఒకటేనా? లేక , వేర్వేరా? వాటి ఉనికిని గురించి, అనుసంధానం గురించి, జీవి పరమాత్మలో లీనమై ముక్తిని సాధించడానికి సంబంధించిన తార్కిక, వేదాంత బోధనలు, చర్చలువాద ప్రతివాదాలు కొనసాగుతునేవున్నాయి. ఈ వివిధ మార్గాల సిధ్ధాంతాలలో ఉత్తమమైనదేది అనే విషయంలో  ఏకగ్రీవ నిర్ణయం సాధించలేక వేదాంతులు, మఠాధిపతులుసాధు సత్పురుషులు వారి వారికి నచ్చిన మార్గాన్ని అనుసరించసాగారు.

వీటన్నిటికి తోడుగా మరొక సిధ్ధాంతం కూడా ప్రాచుర్యంలోకి తీసుకురాబడింది. అదే - రాధా మాధవ ప్రణయ భక్తి తత్వం. పరమాత్మ సృష్టించిన స్త్రీమూర్తి యొక్క రెండు అంశలలో ఒకటి శ్రీలక్ష్మిగా మహావిష్ణువును చేరగా, మరొక అంశ రాధగా గోకులాన  జన్మించి కృష్ణుని ప్రాణ సఖిగా  రాధామాధవ ప్రణయభక్తి సిధ్ధాంతానికి మూలపురుషులైయ్యారు. మహాభాగవత పురాణంలో అక్కడక్కడ రాధ ప్రసక్తి కనిపించినా రాధాకృష్ణుల ప్రణయ సంబంధం విషయమై వేదాంతులకే అంతుచిక్కని రహస్యాలెన్నో నిక్షిప్తమై వున్నాయనే భావిస్తారు. రాధామాధవ తత్త్వం అలౌకికమైన ప్రణయ తత్త్వం. జీవాత్మపరమాత్మల ఆత్మీయతానుబంధ తత్త్వం. కృష్ణుని కోసమే పుట్టిన రాధ తన ఆత్మను పరమాత్మ యైన కృష్ణునికే అర్పించుకున్నది. రాధది మధురభక్తి. అన్నమాచార్య, జయదేవ కవుల భక్తి శృంగార రచనలెన్నో రాధాకృష్ణుల మధురప్రేమ తత్త్వానికి ప్రతీకలు.

అలౌకికమైన రాధమాధవ ప్రణయం పరమ పవిత్రంరసవత్తరం, ఆదర్శవంతం అని భావించి తరించే భక్తులెందరో.  అలాటి ఒక ప్రణయారాధకుడు తనను తాను రాధగా ఊహించుకొని తన మనోభావాలను ఒక మధురగీతంగా ఆలపిస్తున్నాడు. ఆ గీతమే నేటి ఘంటసాలవారి సజీవరాగం... 

ఆజన్మ బ్రహ్మచారి పింగళి నాగేంద్రరావుగారి హాస్యచమత్కారశృంగార గీతం - 'రాధనురా నీ రాధనురా' 1952ల నాటి 'పెళ్ళిచేసి చూడు' చిత్రంలోనిది. కొత్తగా పెళ్ళయి మనుగుడుపులకోసం అత్తవారింటికి చేరిన కొత్త పెళ్ళికొడుకు భార్యబావమరదుల సమక్షంలో మనసువిప్పి, కులాసాగా హాయిగా పాడుతున్న పాట. మనోజ్ఞమైన స్వీయ స్వరకల్పనలో బల్ హుషారుగా ఘంటసాల మాస్టారు గానం చేసిన గీతం. 1952 లోని  'పెళ్ళిచేసి చూడు' సినీమానాటికే గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాలగారు ఎంత ప్రాచుర్యం పొందారో పింగళివారి ఈ కితాబు చూస్తేనే తెలుస్తుంది. పెళ్ళిచేసి చూడు సినిమా ట్రైలర్ లో ఘంటసాలగారిని గురించి ఇలా అన్నారు...."ఇంట ఇంటను గంట గంటకు ఎవ్వరి కంఠం వింటారో ఆ ఘంటసాలవారీ చిత్రానికి నాదబ్రహ్మలండీ".  సినిమా పబ్లిసిటీ కోసం పెళ్ళి పిలుపుగా రాసిన ఈ పాటను పాడింది కూడా ఘంటసాలగారే. "రసపట్టులెరిగిభావోచితరాగ సరళిని శబ్దోచిత రమ్యతనూ సమకూర్చి బాణీలు కట్టుటలో ఘంటసాల గానకళా పట్టభద్రుడే" అని అన్న పింగళి వాక్కులు అక్షరలక్షలే.

పెళ్ళిచేసి చూడు సినిమా ద్వారా అంతవరకు ఏ సినిమా సంగీతదర్శకుడు ఉపయోగించని చక్రవాకం, చారుకేశి వంటి సంప్రదాయ రాగాలను శ్రోతలకు పరిచయం చేశారు ఘంటసాల.  శ్రీ కొడవటిగంటి కుటుంబరావు అంతటి రచయిత, విమర్శకుడు ఈ చిత్ర సంగీతం పై సమగ్ర వ్యాసాలు ప్రచురించి ఘంటసాల సంగీతప్రతిభను ఎంతగానో కొనియాడారు. పెళ్ళిచేసి చూడు లోని ప్రతీ పాటా ఒక ఆణిముత్యం. శ్రావ్యమైన ఘంటసాల గళం సంగీతాభిమానులకు తన్మయత్వాన్ని కలిగించింది. హీరో ఎన్.టి.రామారావుకు ఘంటసాల గాత్రం తప్పనిసరి అనే భావన ప్రజలలో కలిగించిన సినిమా పెళ్ళిచేసి చూడు. అభ్యుదయ వాదియైన కథానాయకుడు మంచి సంగీతాభిలాషి కూడా. హార్మోనియం వాయిస్తూ పాటలు పాడుకునే అలవాటు. కానీ, కథానాయకుడు ఎన్.టి.ఆర్ కు హార్మోనియం పట్టుకోవడమే తెలియదు. అందువల్ల ఘంటసాలగారు వాహినీ స్టూడియోలో పాటలు కంపోజ్ చేస్తున్నప్పుడు ఆయన అనుమతితో పక్కనే కూర్చొని హార్మోనియం ఎలా వాయిస్తారో క్షుణ్ణంగా పరిశీలించి, ఆకళింపుచేసుకొని ఆ పాటల షూటింగ్ లో పాల్గొన్నట్లు చెపుతారు. ఆనాటి కళాకారులలో వుండే sincerity, commitment అలాంటిది.

'రాధనురా నీ రాధనురా' పాట కూడా హీరో హార్మోనియం వాయిస్తూ పాడేదే. బావమరది పాత్రధారి నటుడు జోగారావు తబలిస్ట్. ఈ ఇద్దరు కలసి చేసిన గానాబజానా ఆ కాలపు పెళ్ళింటి వాతావరణాన్ని మన కళ్ళముందుంచుతుంది. ఘంటసాలగారు ఈ పాటకు నఠభైరవి రాగాన్ని ఉపయోగించారు. నఠభైరవి కర్ణాటక సంగీతంలో 20వ మేళకర్త. అంటే, ఆరోహణ‌అవరోహణ క్రమంలో ఏడు స్వరాలు గల సంపూర్ణరాగం. హిందుస్థానీ బాణీలో నఠభైరవి ని అసావేరి థాట్ గా చెపుతారు. నఠభైరవి భక్తిరస ప్రధాన రాగం. 'రాధనురా నీ రాధనురాపాట మంద్రస్థాయిలో ఒకదగ్గర కాకలినిషాదం, మరోదగ్గర ప్రతిమధ్యమం  అన్యస్వరాలుగా ప్రయోగం చేసినా అది నఠభైరవి రాగ స్వరూపానికి ఇబ్బందికరం కాని రీతిలో ఘంటసాల ఈ పాటను నడిపించారు. ఈ నాడు వస్తున్న పాటలతో పోలిస్తే చాలా చిన్న పాట. పల్లవి ఓ రెండు చిన్న చరణాలు మాత్రమే గల పాట.  అయినా, కవిగా పింగళిస్వరకర్త గాయకుడిగా ఘంటసాల తమ తమ ముద్రలను  ప్రస్ఫుటం చేసి ఈ పాటను సజీవరాగం చేశారు. ఘంటసాలవారి కంఠంలోని మార్దవం, మధురత్వం శ్రోతలకు మైమరపును కలిగిస్తుంది.

ఈ పాటకోసం ఘంటసాలగారు ఫ్లూట్, క్లారినెట్, వైలిన్స్హార్మోనియం, పియోనాతబలాడోలక్, మువ్వల వంటి వాద్యాలను ఉపయోగించారు.

తెరపై ఎన్.టి.ఆర్., జోగారావు, జి వరలక్ష్మి, మాస్టర్ కుందు, బాలకృష్ణ, పద్మనాభం చక్కని హావభావాలు కనపర్చి అలనాటి పెళ్ళింటి వాతావరణాన్ని జ్ఞప్తికి తెచ్చారు.

డెభ్భై ఎనభై ఏళ్ళ క్రితం మన సమాజంలో వ్రేళ్ళు తన్నుకుపోయిన వరకట్న  దురాచారాన్ని ఖండిస్తూ అభ్యుదయ భావాలతో  నిర్మించబడిన హాస్యరస కుటుంబకథా సాంఘిక చిత్రం 'పెళ్ళిచేసి చూడు'. ఈ సినిమా పెద్దలకు మాత్రమే కాదు చిన్నపిల్లలకు కూడా. చిన్నపిల్లల పాత్రలకే నాలుగు పాటలను పెట్టి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు.

ఒక సినిమా విజయానికి స్టార్ వాల్యూ కంటే స్టోరీ వాల్యూయే ముఖ్యమని నిరూపించిన సినిమా పెళ్ళిచేసి చూడు. ఈ సినిమా హీరో అయిన ఎన్.టి.రామారావు పాత్ర సినిమా ప్రారంభమైన అరగంట తర్వాతే ప్రవేశమౌతుంది. దీనినిబట్టి చూస్తే ఆనాటి దర్శక నిర్మాతలు  చక్కని కథాకథనానికి శ్రావ్యమైన పాటలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చేవారని తెలుస్తోంది.

విజయా ప్రొడక్షన్ చక్రపాణిగారికి, దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ గారికి  హాస్యరసమంటే మక్కువ అనే విషయం వారి సినీమాలన్నీ నిరూపిస్తాయి. అసభ్యతవెకిలితనం లేని హాస్యం విజయా వారి చిత్రాలన్నింటినీ ప్రేక్షకులు ఆదరించారు.

ఎల్.వి.ప్రసాద్ దర్శకుడిగాఘంటసాల సంగీత దర్శకుడిగా వచ్చిన చిత్రాలు ముచ్చటగా  మూడు మాత్రమే. 'మనదేశం', 'షావుకారు', 'పెళ్ళిచేసి చూడు'. సంగీతపరంగా ఈ చిత్రాలన్నీ బహూళజనాదరణ పొందాయి. అయితే ఎల్.వి.ప్రసాద్ గారికి ఘంటసాలగారిపట్ల కలిగిన విముఖత కారణంగా ఆ తర్వాత ఈ ఇద్దరు ప్రముఖులు కలసి ఏ సినిమాకు పనిచేయలేదు, విజయావారి 'అప్పుచేసి పప్పుకూడు' లో మాత్రం ప్రసాద్ గారికి ఘంటసాలగారి చేత పాడించక తప్పలేదు. ప్రసాద్ గారి సొంత చిత్రాలైన 'ఇలవేల్పు', 'ఇల్లాలు', లో ఘంటసాలగారి పాటలే లేవు. చిత్ర విచిత్ర మనస్తత్త్వాలతో నిండిన ఈ చిత్రసీమలో ఇలాటి రాగద్వేషాలను సర్వసాధారణంగానే పరిగణించి ఎవరి బాటలో వారు పయనం సాగిస్తారు.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 

Saturday, 11 October 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 103వ భాగం - వద్దుర బాబూ వద్దుర అసలిద్దరు పెళ్ళాలొద్దురా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నూటరెండవ భాగం ఇక్కడ

103వ సజీవరాగం - వద్దుర బాబూ వద్దుర అసలిద్దరు పెళ్ళాలొద్దురా

చిత్రం - కనకతార
గానం - ఘంటసాల
రచన - కొసరాజు

సంగీతం - ఘంటసాల

పల్లవి:

వద్దుర బాబూ వద్దుర అసలిద్దరు పెళ్ళాలొద్దుర-2

ఆ యిబ్బందే మనకొద్దురా

యములోడికి కూడా వద్దురా

వద్దుర బాబూ వద్దురా!

చరణం 1: 

ఆపెతో సరసాలాడామా అగ్నిపర్వతం పగిలిందే -2

ఈపెతో యిష్టం చూపేమా యిల్లు పిల్లి కూనెగిరిందే

గోడదెబ్బతో చెంపదెబ్బతో  కుమిలి

కుమిలి పడిచస్తున్నాం 

                                !వద్దుర బాబూ!

చరణం 2: 

ఎక్కడ తాళం అక్కడ వేసీ టక్కరితనం నేర్వాలి 

నిజం చెప్పడం మరవాలి

                                        !వద్దుర!

రంభా ఊర్వశి తాతలు మీరని 

రకరకాలుగా పొగడాలి 

                                !వద్దుర బాబూ!

 చరణం 3: 

శివుడిద్దరి పెళ్ళాల బాధతో 

తిరిపమెత్తుకొని తిరిగాడూ

గంగను తలపై నిలిపాడు ! శివుడి!

అదీ యిదేమని పార్వతీదేవిని

అర్ధనారిగా చేశాడూ

                                !వద్దుర బాబూ!

చరణం 4:  

ఏడుకొండల యెంకటేశ్వరా -2

ఈ బాధే నీకున్నదా?

అలివేలు బాధ నీకున్నదా?

నాంచారి బాధ నీకున్నదా ?

దేవుళ్ళగుండే మీపనే యిట్లుంటే

మనుషులు పాట్లు చెప్పాలా

                                !వద్దుర బాబూ!

 

ఇద్దరి భార్యల బాధతో పరమశివుడు బిచ్చమెత్తుక తిరిగాడట; గంగను నెత్తిన పెట్టి గౌరిని తన దేహంలో అర్ధనారిగా చేశాడట. ఇద్దరు పెళ్ళాల జీవితంలోని సుఖము,ఆనందము ఎంతమాత్రమో తెలియదు కానీ ఆ మొగుడి అగచాట్లు మాత్రం చెప్పశక్యంకాదు. మంచితనం, వ్యక్తిత్వం గల మనిషికి రెండిళ్ళ పూజారిత్వం చాలా దౌర్భాగ్యం. ఇచ్చకాలతోమోసకారితనంతో నీతి నిజాయితీలకు తిలోదకాలివ్వాలి.  చూడ దుర్భరంగా వున్నా రంభా ఊర్వశులను చంపిపుట్టిన అందగత్తెలని సదా భజన చేస్తూవుండాలి. మరి అలాటివారిని ఎందుకు కట్టుకున్నాడంటే అది లలాట లిఖితమే. 

నుదుటను జాతకాలు రాసే బ్రహ్మకు సరస్వతి ఒక్కతే; ఆయన తండ్రి మహావిష్ణువు కు ఇద్దరు సతులు శ్రీదేవి, భూదేవి; ఆ విష్ణువు అంశతో అవతారమెత్తిన రాముడు ఏకపత్నీ వ్రతుడనని పరస్త్రీల జోలికే పోలేదు. రాముడి తండ్రి దశరధునికి భార్యలు ముగ్గురు. ముద్దుల భార్య కైక మూలంగా  పెద్ద రామాయణమే జరిగింది. ద్వాపరయుగంలో కృష్ణుడిగా అష్టభార్యలతోపాటు పదహారు వేల మంది గోపికలను మాయచేస్తూ వచ్చాడు. కలియుగంలో  ఇద్దరు భార్యల పోరు భరించలేక శ్రీపతి వేంకటాద్రిపై శిలయైపోయాడు.

ఇలాటి గాథలెన్నో విన్న ఒక అర్భకుడు గ్రహపాటు సరిగాలేక రెండు సంసారాల జంఝాటంలో చిక్కుకొని 'వద్దుర బాబూ వద్దుర అసలిద్దరు పెళ్ళాలొద్దురఅని ఇద్దరు భార్యల ఎంకన్న దేముడికి మొరెట్టుకుంటున్నాడు... అదే నేటి మన సజీవరాగం.

'కనకతార' సినిమాలో ఈపాటను సరదాకోసం హాస్యనటుడు చదలవాడ కుటుంబరావు మీద చిత్రీకరించినాఆలోచించి చూస్తే ఇందులో చాలా వ్యవహారముంది. ఇద్దరు భార్యలు గల మగాడి జీవితంలో ఈతిబాధలనేకం. ఈ విషయంలో అనుభవజ్ఞుడైన వ్యక్తినే ఈ గీతం సంగీతదర్శకుడిగా, గాయకుడిగా వరించడం ఒక విశేషం. తన స్వానుభవసారంతో ఘంటసాలగారు ఈ గీతానికి పరిపూర్ణ న్యాయం చేకూర్చారు.

అసలు ఈ బహుభార్యా వ్యవస్థ ఏనాటిది? దీని అవసరం ఎంతవరకుతరచిచూస్తే రామాయణమహాభారత, భాగవత కాలాలనుండి ఈ బహుభార్యత్వం అనేది మన భారతదేశంలో కొనసాగుతున్నట్లు ఈ కావ్యాల ద్వారా తెలుస్తోంది. గొప్ప గొప్ప చక్రవర్తులురాజాధిరాజులుధనికవర్గాలవారు తమ తమ హోదానుదర్పాన్నిఅహంకారాన్ని చాటుకునేందుకు, తమ తమ రాజ్యాలను సుస్థిరం చేసుకునే క్రమంలో రాచకీయపుటెత్తులలో భాగంగా అనేక పెళ్ళిళ్ళను చేసుకునేవారు. పరశురాముడు దాడి నుండి తప్పించుకునేందుకు దశరథుడు తరచూ పెళ్ళిపీటలెక్కేవాడట. అలాగే తమ సామ్రాజ్య విస్తారణ కోసం శ్రీకృష్ణ దేవరాయలు, అక్బర్ పాదుషా అనేక పెళ్ళిళ్ళు చేసుకున్నారని చరిత్ర చెపుతుంది.  రెండో భార్యగానో, నాల్గవ భార్యగానో కాలం గడపడానికి సిధ్ధపడిన స్త్రీల సంగతేమోకానీ తమ ఇష్టానికి విరుధ్ధంగామనసు చంపుకొని, పరిస్థితుల ప్రాబల్యంతో బలవంతాన ఉంపుడుగత్తెలుగా జీవితాంతం వ్యధలపాలవుతున్న స్త్రీలు ఎందరో!  ఏమైనా, అక్రమ సంబంధాల వలనరహస్య వివాహాలు చేసుకునే సామాన్య స్త్రీలకు సామాజిక గౌరవం, జీవితాలలో ఆత్మ తృప్తిసుఖసంతోషాలు మృగ్యమనే చెప్పాలి. అలాగే మోహావేశాలకుప్రలోభాలకులోనై  పెళ్ళి పేరిట అనేక మంది స్త్రీలతో ఆడుకునే పురుషుల జీవితమూ దుర్భరమే. అక్రమ సంబంధాలురహస్య పెళ్ళిళ్ళు వాటి వల్ల సంభవించే కష్టనష్టాలు ఇతివృత్తాలుగా మనకు వున్నన్ని కథలుసినీమాలుసీరియల్స్ కోకొల్లలు.

వీటికి ఉన్నంత క్రేజ్గిరాకీ ఇతర కథాంశాలకు లేదు. ఇందులోని గొప్ప తమాషా ఏమంటే, మన దేశంలో ఇలాటి సినీమాలను  ఆదరించి పోషించేది, అలాటి హీరోయిజంపై మోజుపడేది ఎక్కువగా మహిళా ప్రేక్షకులే. సంఘానికి చీడపురుగులైన అలాటి స్త్రీ పురుషుల మీదా ఎలాటి తిరుగుబాటుదనమూ మనవాళ్ళలో కనపడదు. 

బహుభార్యత్వం విషయంలో ప్రభుత్వాలు కూడా ద్వంద వైఖరి నే పాటిస్తున్నట్లనిపిస్తుంది. ప్రపంచంలోని పాశ్చాత్య దేశాలతో సహా అనేక దేశాలలో బహుభార్యత్వం నిషేధించబడింది. ముస్లీం దేశాలలో కూడా నిబంధనలతో కూడిన ఆమోదం మాత్రమే అమలులో వుంది. భారతదేశంలో కూడా బహుభార్యత్వాన్ని నిషేధిస్తూ 1956 లో ఒక చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిప్రకారం ఒక భార్య సజీవంగా వుండగా మరొక స్త్రీతో సంపర్కమో లేక రెండవ వివాహం చేసుకోవడమో చట్టవిరుధ్ధంగా పరిగణించబడింది. అయితే చట్టాలలోని లొసుగుల వల్ల రాజకీయ ప్రలోభాలవలన ఈ చట్టం వల్ల కలిగే సత్ఫలితాలు అంతంతమాత్రమే. ఇలాటి చట్టాలనునీతి నియమాలను గౌరవించేది అంతరాత్మకు భయపడే సగటు మనిషి మాత్రమే.

సరి, ఎక్కడో మొదలైన మన చర్చ ఎక్కడికో పోతోంది. ప్రస్తుతం ఈనాటి సజీవరాగం విషయానికి వద్దాము. 1956 లో విడుదలైన ' కనకతార' అనే ఒక జానపద చిత్రంలోని పాట ' వద్దుర బాబూ వద్దుర అసలిద్దరు పెళ్ళాలొద్దుర'. సినిమా లో ఒక జాలరి పాత్ర (చదలవాడ కుటుంబరావు) పాడే పాట. స్వీయ సంగీతంలో ఘంటసాలగారు సంపూర్ణంగా అనుభవిస్తూ జనరంజకంగా ఆలపించిన గీతం. దీనిని జానపదగీత బ్రహ్మ కొసరాజు రాఘవయ్య చౌదరి తనదైన శైలిలో అద్భుతంగా వ్రాసారు. కొసరాజుగారికి తాను వ్రాసిన పాటను ఏదో మీటర్లో పాడుతూ వినిపించడం అలవాటు. కొన్ని సందర్భాలలో ఆయన పాడిన ట్యూన్ నే అవసరమైన సవరణలు చేసి సంగీతదర్శకులు పాటను స్వరపర్చడం జరిగేది. జానపదశైలిలో సాగే ఈ పాటను ఘంటసాలగారు ఖరహరప్రియ రాగస్వరాలతో రూపొందించారు. ఖరహరప్రియ కర్ణాటక సంగీతశైలిలో 22వ మేళకర్త. ఆరోహణ, అవరోహణా క్రమంలో ఏడు స్వరాలు పలుకుతాయి. చాలా ప్రాచీనమైనరాగం.హిందుస్థానీ బాణీలో కాపి థాట్ రాగంగా చెపుతారు. ఖరహరప్రియ రాగానికి ప్రసిధ్ధి చెందిన జన్యరాగాలు ఎన్నో వున్నాయి. ఖరహరప్రియ రాగానికి ఆ పేరు రావణుని గానం వలన శివునిపరంగా (హరప్రియ) ఖరుడనే రాక్షసుని చంపిన రామునికి ఇష్టమైన రాగంగా త్యాగరాజస్వామి వారి వలన కలిగినట్లు ప్రతీతి. ఖరహరప్రియలో, దాని జన్యరాగాలైన ఉదయరవిచంద్రికరీతిగౌళశ్రీరంజనిముఖారిఅభేరిఅభోగిభీంప్లాసdకాపి, మధ్యమావతి, బృందావనసారంగి, మొదలైన వాటిలో స్వరపర్చబడిన సినీమాపాటలు అసంఖ్యాకం.

రాగప్రధానమైన గీతాలను రసానుభవానికి తగినట్లుగా రూపొందించడంలో ఘంటసాలగారు మాస్టరే. జానపద బాణీలో సాగే ఈ పాట కోసం ఘంటసాల మాస్టారు మాండొలిన్వైలిన్స్ఫ్లూట్, క్లారినెట్తబలాడోలక్చిడతలు వంటి వాద్యాలను ఉపయోగించారు. చదలవాడ మ్యానరిజమ్స్ ను దృష్టిలోపెట్టుకొని ఘంటసాల ఈ పాటను బలే గమ్మత్తుగా పాడారు.

తెలుగు సినిమా తొలితరం మాటలపాటల రచయిత చందాల కేశవదాసు వ్రాసిన నాటకం 'కనకతార'. దీనిని 1937లో సరస్వతీ టాకీస్ వారు హెచ్.వి.బాబు డైరక్షన్ లో కన్నాంబ, సూరిబాబుదొమ్మేటి సూర్యనారాయణ లతో సినిమాగా తీసారు. భీమవరపు నరసింహారావు సంగీతం నిర్వహించగా పాటలు పద్యాలను సముద్రాల రాఘవాచార్యచందాల కేశవదాసు వ్రాసారు. అదే కనకతార, తన పుత్రసమానుడు ఘంటసాల సంగీతదర్శకునిగా, 1956లో రెండవసారి  నిర్మించినపుడు అందులో సముద్రాలగారు ఒక పాటను, పద్యాన్ని కూడా వ్రాయకపోవడం ఒక విశేషం. దీనినిబట్టి  ఆనాడు ఎక్కువగా నిర్మాతల మాటే చెల్లుబాటు అయేదని తెలుస్తోంది.

కనకతారలో వున్న 13 పాటలు/పద్యాలను జంపనఅనిశెట్టి, కొసరాజు వ్రాయగా వాటిని ఘంటసాలఎస్.వరలక్ష్మి, జిక్కిమాధవపెద్ది ఆలపించేరు. ఇందులో ఘంటసాలగారు నాలుగు పాటలు పాడగా ఆ నాలుగింటినీ కొసరాజుగారే వ్రాసారు. గోకుల్ ప్రొడక్షన్ దోనేపూడి కృష్ణమూర్తి అంతకుముందు తీసిన 'వదినగారి గాజులు' చిత్రానికి కూడా ఘంటసాలగారే సంగీతం నిర్వహించారు. రజనీకాంత్ సబ్నవీస్ ఈ కనకతార చిత్రదర్శకుడు. 

ఎన్నో మంచి పాటలున్న ఈ చిత్రం విడియో లభించకపోవడం దురదృష్టం. 


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

Saturday, 4 October 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 102వ భాగం - నీ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నూటొకటవ భాగం ఇక్కడ

102వ సజీవరాగం - నీ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి

చిత్రం - మాయింటి దేవత
గానం - ఘంటసాల
రచన - దాశరథి

సంగీతం - మాస్టర్ వేణు

పల్లవి:

నీ లేత గులాబీ పెదవులతో

కమ్మని మధువును తాకాలి -2

విందులు చేసే నీ అందాలు

నామదిలోనే చిందాలి

                                నీ లేత!

చరణం 1: 

మధురమైన ఈ మంచి రేయిని 

వృధాచేయకే...సిగ్గులతో -2

చంద్రుని ముందర తార వలె

నా సందిట నీవే ఉండాలి....

ఈ మధువంతా నీకోసం

పెదవుల మధువే నాకోసం

                                నీ లేత!

 

చరణం 2:

మధువు పుట్టింది నా కోసం

నేను పుట్టింది నీ కోసం -2

కన్నుల కాటుక కరగకముందే

సిగలో పువ్వులు వాడకముందే-2

పానీయముతో పరవశమై-2

నీ కౌగిట నన్నే బంధించుకో

                                నీ లేత!

'ప్రేమరెండక్షరాల ఒక చిన్న మాట. కాని సముద్రమంత లోతైనది, గాఢమైనది. ప్రేమ తత్వాన్ని  సంపూర్ణంగా అర్ధం చేసుకోవడం అంత సులభంకాదు. ఈ విశ్వమంతా ప్రేమమయం. విశ్వశాంతికి, మనుషుల మధ్య ఐక్యతకుసామాజిక పురోభివృద్ధికి ప్రేమమమకారం ఆవశ్యకం. మనిషి  మానసికనైతిక, శారీరక స్వస్థతకు ప్రేమ ఎంతో ముఖ్యం. నీ నా తరతమ బేధం లేకుండా సమస్త ప్రాణులను ప్రేమించగలిగేవారికి ఆయుర్దాయం ఎక్కువగా వుంటుందని పెద్దలంటారు.

ప్రేమ అనే మధురభావం మనస్సుకు సంబంధించినది. ఆ ప్రేమ పరిపరివిధాలు. యువతీయువకుల మధ్య ప్రేమ; భార్యాభర్తల ప్రేమ; తల్లిదండ్రులు, పిల్లల మధ్య ప్రేమ --- ఇలా ప్రేమ భావనా స్వరూపం మారుతూంటుంది. అర్ధవంతముగాఢత్వము కలిగి ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా పూర్తిగా నిష్కల్మషమైన స్నేహమనే పునాదిపై ఇద్దరు వ్యక్తుల మధ్య (అది స్త్రీ పురుషులు కావచ్చు లేదా ఇద్దరూ పురుషులు లేక ఇద్దరు స్త్రీలు కావచ్చు) ఏర్పడిన ప్రేమ  పవిత్రమైనదిగా, ఉన్నతమైనదిగా భావించబడుతుంది. శాశ్వతత్త్వాన్ని కలిగివుంటుంది. అయితే అలాటి ఉత్కృష్టమైన ప్రేమ మనకు కథలలోసినిమాలలో మాత్రమే కనిపిస్తుంది. నిజజీవితంలో అలాటి ఉదాత్తమైన ప్రేమ బహు అరుదు.

సామాన్యంగా సగటు మనిషి  అనుభవించే ప్రేమ,పంచే ప్రేమ  మోహప్రలోభాలకు, స్వార్థానికి అతీతమైనదేమీ కాదు.  బాహ్య సౌందర్యానికి,లౌకిక కోరికలకు లోబడివుంటుంది. జీవితం యవ్వన దశలో స్త్రీ పురుషుల మధ్య ఈ ప్రేమ శారీరక, ఆర్ధికసామాజిక అవసరాలను తీర్చే సాధనంగా  ఉపయోగపడుతున్నది. ఈనాడు యువతీయువకులు  లేదా భార్యాభర్తల మధ్య గల ప్రేమలో కూడా హిపోక్రసి చోటు చేసుకుంటున్నది. ఎదుటి వ్యక్తి బలహీనతలను ఆసరాగాచేసుకొని  మోసందగాకోరుతనంతో తన చెప్పుచేతల్లో వుంచుకునే లక్షణం కనిపిస్తుంది.

స్త్రీ అంటే కేవలం  శారీరక కాంక్ష తీర్చే భోగవస్తువుగా భావించే ఒక కాముకుడు పాడే గీతాన్ని ఈనాటి సజీవరాగంగా ప్రకటించడానికి మనసొప్పకపోయినా అలాటి వికృతభావాలను ప్రకటించడంలో కూడా ఘంటసాలవారి గాన ప్రతిభ ఎంత సున్నితంగా, హృద్యంగా వుంటుందో తెలియజేయడానికే ఈ వారం 'లేత గులాబీ పెదవులును మీ ముందుకు తీసుకురావడం జరిగింది.

వివాహం జరిగిన తొలినాటి రాత్రే శోభనంగదిలో ఆప్యాయంగా ప్రేమానురాగాలు పంచవలసిన భర్త మధువు నిషాలో తన శారీరక వాంఛలు తీర్చుకోవడానికి నిర్బంధిస్తూంటే  సభ్యతా సంస్కారాలు గల ఆ భార్య మనసు ఎంత క్షోభిస్తుంది. వ్యసనపరుడైన ఆ భర్తకు భార్యయైనా ఒక్కటే, వెలయాలైనా ఒక్కటే. తన వాంఛ తీర్చుకోవడమే ముఖ్యం. వ్యామోహమే ప్రధానాంశంగా గల ఈ గీతాన్ని  గొంతులో నిషాను, మోహాన్ని  పలికిస్తూ ఘంటసాల మాస్టారు ఆలపించిన విధం; మగువ, మదిరలకు బానిసయైన భర్తగా తెరమీద హరనాథ్ రాజు, బలిపశువైన భార్యగా జమున నటన ఈ పాటకు సజీవత్వాన్ని కలిగించింది.


'కన్నుల కాటుక కరగకముందే సిగలో పువ్వులు వాడక ముందే నీ కౌగిట నన్ను బంధించుకో;  మధురమైన ఈ మంచిరేయిని వృధా చేయకే సిగ్గులతో విందులు చేసే నీ అందాలు నా మదిలోనే నిండాలి నీ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి' - ఎంత చక్కటి భావన. ఎంత అద్భుతంగా వ్రాసారు దాశరథి ఈ ప్రణయగీతాన్ని.  నిజానికి ఇటువంటి సున్నితమైన శృంగారభావాలు కల ఆ వ్యక్తి మందును ఆశ్రయించవలసిన పనే లేదు. 

ఘంటసాలగారి గాత్ర మాధుర్యంతో ఈ తొలిరేయి గీతం ప్రేమికులందరిలో అనిర్వచనీయమైన మత్తునే కలిగిస్తుంది. పాటలో వచ్చే 'చిందాలి', 'సిగ్గులతో', ' నా కోసం, 'కన్నుల కాటుక కరగక ముందే' వంటి పదాలమీద ఘంటసాల మాస్టర్ గారు ఇచ్చిన వైవిధ్యభరితమైన భావాలు, మధ్య మధ్య చిరునవ్వులు  ప్రేక్షకులలో ఈ పాట పట్ల మోజును పెంచుతుంది.

కృష్ణజమునహరనాథ్, పద్మప్రియలు ముఖ్యపాత్రలుగా చాలా సాదాసీదా కధాంశంతో నడిచే సినిమా 'మాయింటి దేవత'. ఈ సినీమాకు అంతో యింతో ఊరట కలిగించే విషయం మాస్టర్ వేణుగారి సంగీతం, ఘంటసాల మాస్టారు పాడిన 'నీ లేత గులాబీ పెదవులతో' గీతం మాత్రమే. సంతూర్సితార్, ఫ్లూట్, క్లారినెట్వైలిన్స్, వైబ్రోఫోన్ కాంబినేషన్లతో మాస్టర్ వేణు సమకూర్చిన ఆర్కెస్ట్రేషన్ పాటకు ఎంతో శ్రావ్యతను చేకూర్చింది. పాట ఆద్యంతం ఘంటసాల మాస్టారి గాత్రాన్ని అనుసరిస్తూ సాగిన తబలా నడక మనసుకెంతో హాయిని కలిగిస్తుంది. అసలు ఈ పాట ఇంత హృద్యంగా రూపొందడానికి కారణం ఈ గీతాన్ని రూపొందించడానికి ఎన్నుకున్న రాగం. హిందోళ రాగ స్వరస్థానాలతో వేణు ఈ పాటను చేశారు. అంతేకాదు ఆ రాగంలో లేని అన్యస్వరాలను కూడా జోడించి ఎనిమిది స్వరాలతో (రిషభంపంచమంఅంతరగాంధారం అన్యస్వరాలు) మనకు వీనులవిందు చేశారు. కర్ణాటక సంగీత హిందోళానికి సమాంతర హిందుస్థానీ రాగం మాల్కౌంస్. ఈ రెండు రాగాలలో అన్యస్వర ప్రయోగాలతో ఘంటసాల మాస్టారు పాడిన గీతాలెన్నో సంగీత ప్రపంచంలో పెద్ద సంచలనాన్నే సృష్టించాయి.

ఈ సినిమాలోని పదకొండు పాటలలో ఘంటసాలగారు పాడినవి రెండు విడివిడి సాకీలు, ఈ పాట మాత్రమే. ఈ మూడింటిని విలన్ టైప్ పాత్రధారి హరనాథ్ మీదనే చిత్రీకరించారు నటదర్శకుడు బి.పద్మనాభం. ఘంటసాల హరనాధ్ కాంబినేషన్లో గతంలో కూడా చాలా మంచిపాటలు వచ్చాయి. 'నేను పాడిన పాటలకు హరనాథ్ లిప్ మూవ్మెంట్ చాలా చక్కగా సింక్రనైజ్ అవుతుందని ఒక రీరికార్డింగ్ లో ఘంటసాల మాస్టారు హరనాథ్ ను ప్రశంసించడం నేను విన్నాను. ఈ చిత్రంలో మిగిలిన పాటలను ఎస్పిబాలసుబ్రహ్మణ్యం, పి.సుశీలఎస్.జానకివాణీ జయరాం పాడారు. 

'మాయింటిదేవత' సినిమా అసలు నిర్మాత హరనాథ్. ఆర్ధికపరమైన ఇబ్బందులతో చిత్రనిర్మాణం ఆగిపోయింది. హరనాథ్ ఆర్ధికంగా, శారీరకంగామానసికంగా చాలా నష్టపోయారు. తర్వాత సినిమా చేతులు మారి ఏడెనిమిదేళ్ళ తర్వాత  విడుదలయింది. అప్పటికి ఘంటసాలగారు అమరులయి ఆరేళ్ళయింది. ఘంటసాలగారి గొంతును వినిపించిన ఆఖరి సినిమా 'మాయింటిదేవత'. హరనాథ్. తొలి చిత్రమైన 'మా ఇంటి మహాలక్ష్మి' లో కూడా ఘంటసాలగారు జిక్కి తో కలసి ఒక డ్యూయెట్ పాడారు. ఈ చిత్రంలో కూడా జమునే హీరోయిన్.

జమున హరనాథ్ కాంబినేషన్లో వచ్చిన ఎన్నో సినిమాలు ఘనవిజయం సాధించాయి. మరి, 'మాయింటిదేవతకు ఆ అదృష్టం పట్టినట్లులేదు. చిత్రనిర్మాణం లోని జాప్యం ఒక కారణం కావచ్చును.

ఇలాటి సినిమాలు ఇంకా గుర్తుండిపోవడానికి కారణం వాటిల్లోని ఘంటసాలగారి పాటలే అంటే అతిశయోక్తికాదు.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 



ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 107వ భాగం - బలే మంచి రోజు

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...