చిత్రం - జీవనతరంగాలు
గానం - ఘంటసాల
రచన - ఆత్రేయ
సంగీతం - జె.వి.రాఘవులు
పదిమాసాలు మోశావు పిల్లలను
బ్రతుకంత మోశావు బాధలను
ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు
లేక వెళుతున్నావు......
పల్లవి:
ఈ జీవన
తరంగాలలో ఆ దేవుని
చదరంగంలో ఎవరికి
ఎవరు సొంతము
ఎంతవరకీ బంధము....
చరణం 1:
కడుపు చించుకు
పుట్టిందొకరు
కాటికి నిన్ను
మోసేదొకరు
తలకు కొరివి
పెట్టేదొకరు
ఆపై నీతో
వచ్చేదెవరు..
ఆపై నీతో వచ్చేదెవరు
!ఈ జీవన!
చరణం 2:
మమతే మనిషికి
బందిఖానా
భయపడి తెంచుకు
పారిపోయినా
తెలియని పాశం
వెంటపడి
ఋణం
తీర్చుకోమంటుంది! 2!
నీ భుజం మార్చుకోమంటుంది
!ఈ జీవన!చరణం 3:
తాళికట్టిన మగడు
లేడని
తరలించుకుపోయే
మృత్యువాగదు -
ఈ కట్టెను కట్టెలు
కాల్చక మానవు -
ఆ కన్నీళ్ళకు
చితిమంటలారవు -
ఈ మంటలు గుండెను అంటకమానవు
!ఈ జీవన!మమతే మనిషికి బందిఖానా
భయపడి తెంచుకు
పారిపోయినా
తెలియని పాశం
వెంటపడి ఋణం
తీర్చుకోమంటుంది
మనిషి జీవితం క్షణభంగురం, మూన్నాళ్ళ ముచ్చట. ఈ క్షణిక జీవనకాలంలో ఎన్ని మమతలు, మమకారాలు, మోహాలు, ప్రలోభాలు, అహంకారాలు, ఈర్ష్యాద్వేషాలతో కూడిన అజ్ఞానం తొలగించుకొని ముక్తిసాధనకోసం మనిషి తరతరాలుగా పరితపిస్తూనే వున్నాడు. జీవితంపట్ల వైరాగ్యం పెంచుకొని సంసారబంధాలను త్రెంచుకొని సంఘానికి దూరంగా ఏ అడవుల్లోనో దైవాన్ని అన్వేషిస్తూ తపోనిష్టలో మునిగివుండేవారు కొందరైతే, గృహస్థాశ్రమంలోనే వుంటున్నా ఏ రకమైన మమతలకు, పాశాలకు లొంగకుండా తామరాకు మీది నీటిబొట్టులా వుండేవారు కొందరు. వీరందరికీ వారు ఆశించే ఆనందం, మనశ్శాంతి లభిస్తోందా? వారనుకున్న గమ్యానికి చేరుకుంటున్నారా? వారి వారి జీవితానుభవాలే ఆ విషయం తేల్చగలదు.
మనిషి మేథకు అతీతమైన శక్తి ఏదో భగవంతుడనే పేరుతో మనిషిని తన చెప్పుచేతల్లో వుంచుకొని ఆడిస్తోంది. భగవంతుడు ఆడే జీవన చదరంగంలో మనుషులంతా చిన్న చిన్న పావులే. ఎవరికి ఎవరూ సొంతమూ కాదు, ఏ బంధమూ శాశ్వతమూ కాదు. కానీ, మనిషై పుట్టాక ఏదో సందర్భంలో అశాశ్వతమైన మాయా మోహాలు, ప్రేమ, మమకారాలనే సుడిగుండంలో చిక్కుకొని ఆ కష్టాల వలయంలోనుండి బయటపడలేక వైరాగ్యం లో పడతాడు. జీవితమంటే విరక్తిపుడుతుంది. ద్వైదీభావంతో సతమతమౌతూంటాడు. మనసు పరిపరివిధాల ఆలోచిస్తూ విలపిస్తూంటుంది. అలాంటి వైరాగ్య భావాల సమ్మిళిత గీతమే నేటి ఘంటసాలవారి సజీవరాగం. అదే - 'ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము...' 'జీవన తరంగాలు' అనే 1973 నాటి సినిమాలోని సన్నివేశాత్మక శోకమయగీతం.
ఈ రకమైన గీతాలను విన్నప్పుడల్లా మనకు జీవితమంటే ఒక రకమైన వైరాగ్యం, విరక్తి ఏర్పడుతుంది. అందులోనూ ఘంటసాలగారి వంటి అసాధారణ గాయకుడు పాడుతుంటే ఆ పాటలోని సాహిత్యం, సంగీతం ఆ గళంలోని గంభీర భావోద్వేగం మనలను కట్టి కుదుపుతుంది. ఆ ప్రభావం నుండి బయటపడడానికి కొంతకాలం పడుతుంది. సగటు మనిషి జీవితంలో సుఖసంతోషాల కంటే కష్టాలపాలే ఎక్కువ. అందువలన కలిగే నిరాశానిస్పృహలు భరించలేక జీవితం పట్ల వైరాగ్యం, విరక్తి ఏర్పడకతప్పదు.
నిజానికి మనకు కలిగే వైరాగ్యాలు, వాటి ప్రభావాలు ఏవీ శాశ్వతంకావు. కలకాలం మనలను అంటిపెట్టుకొనివుండవు. మరపు అనే లక్షణాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. అందువలన గతంలోని కష్టనష్టాలను మరచిపోయి వైరాగ్యం నుండి బయటపడతాడు. నిరాశానిస్పృహలకు దూరమవడం జరుగుతుంది. సరాసరి మనిషికి కలిగే వైరాగ్యాలు క్షణికమైనవి, తాత్కాలికమైనవి. మామూలుగా దైనందిక జీవితంలో మనం పొందే వైరాగ్యానుభవాలు - ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, దంత వైరాగ్యం, భక్తి వైరాగ్యం, వగైరాలు. ఇవన్నీ మన మనసుకు సంబంధించినవే.
జీవనతరంగాలు సినిమా లో సన్నివేశపరంగా దృశ్యరూపంలో మనం చూసే ఒక బాధిత స్త్రీ అంతిమయాత్ర కేవలం నాలుగైదు నిముషాలే అయినా, అప్పుడు కలిగే శ్మశాన వైరాగ్యం హృదయమున్న ప్రేక్షకులను చిరకాలం పట్టి పీడిస్తూనేవుంటుంది. అందుకు కారణం అర్థవంతమైన ఆత్రేయగారి సాహిత్యం, ఆర్ద్రమైన ఘంటసాలమాస్టారి గళం బలం.
ఘంటసాలవారి దగ్గర దాదాపు 17 సంవత్సరాల శిష్యరికానికి సార్ధకతగా జె.వి.రాఘవులుగారు స్వరపర్చిన మరపురాని గీతం 'ఈ జీవనతరంగాలలో'. రాఘవులుగారి పట్ల ఘంటసాలమాస్టారి మమతానురాగాలకు, స్నేహానుబంధాలకు తర్వాత జరిగిన పరిణామాలకు --- 'ఈ జీవనతరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము' అనే మాటలు అక్షరాలా వర్తిస్తాయి.
జట్టి వీర (అనే గుర్తు) రాఘవులుగారిని 1955 నుండి మాస్టారి నిర్యాణం వరకు బాగా ఎరుగుదును. కోదండపాణి, అప్పారావు లాగే గాయకుడిగా చిత్రసీమలో ప్రవేశించి సంగీతదర్శకుడిగా స్థిరపడ్డారు. ఘంటసాల స్వరప్రభంజనం కారణంగా కొన్ని దశాబ్దాల పాటు పురుష గాయకులెవరు సక్రమంగా నిలబడలేకపోయారు. విజయవాడ రేడియో కేంద్రంలో లలిత గీతాలు పాడుకునే రాఘవులుగారిని ఘంటసాలగారే 1953 ప్రాంతాలలో మద్రాసుకు తీసుకువచ్చి తన చిత్రాలలో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు.
ప్రతీ రోజూ ఉదయాన్నే ఎనిమిది గంటలకల్లా మాస్టారింటికి వచ్చి రాత్రిదాకా వుండేవారు. 'అయ్యగారు, అమ్మగారు' అంటూ ఇంట్లో చాలా కలివిడిగా తిరిగేవారు. ఆయనతోపాటే రికార్డింగ్ లకు, పాటల రిహార్సల్స్ కు కూడా వెళ్ళి సినిమా సంగీతంలోని మెళకువలను నేర్చుకున్నారు. ఘంటసాలగారి కచేరీలలో వంతపాట పాడేవారు. ఒక్కోసారి రికార్డింగ్ ల నుండి రావడం లేటయితే మాస్టారింట్లోనే భోజనం చేసేవారు. ఘంటసాలగారు రాఘవులును తన సొంతమనిషిలా కుటుంబ సభ్యుడిగా ఆదరించి ప్రేమగా చూసుకునేవారు. దాదాపు ఓ పదిహేను సంవత్సరాలు ఘంటసాలగారి దగ్గర అంత నమ్మకంతో మెసిలిన రాఘవులు గారికి ఘంటసాలగారి వద్ద తన పురోభివృద్ధికి తగిన అవకాశాలు లభించవనే భావన కలిగి తానే స్వతంత్రంగా సంగీతదర్శకుడిగా రాణించాలనే కోరిక ప్రబలి ఘంటసాలగారి వాద్యబృందంనుండి వైదొలిగారు. సినిమా రంగంలో ఇది సహజమే. ఎవరో ఒకరి వద్ద పనిచేస్తూ తగినంత అనుభవం వచ్చాక డైరెక్టర్ గానో, సంగీతదర్శకుడిగానో, ఎడిటర్ గానో కెమేరామెన్ గానో స్థిరపడడానికి ప్రయత్నించడం అందరూ చేసేదే. రాఘవులుగారికి నిర్మాత డి.రామానాయుడుగారి రూపంలో మంచి ప్రోత్సాహం లభించింది. తన సంస్థ చిత్రాలలో సహాయ సంగీత దర్శకుడిగా నియమించారు. ఆ సమయంలోనే రాఘవులు గారు ఎమ్.ఎస్.విశ్వనాథన్, కె.వి.మహాదేవన్, మాస్టర్ వేణు మొదలగు వారి దగ్గర పని చేసిన తర్వాత రామానాయుడుగారు రాఘవులుగారికి తన 'ద్రోహి' సినీమాకు సంగీత దర్శకత్వం చేసే అవకాశం కల్పించారు. ఈ పరిణామ క్రమంలో రాఘవులు పూర్తిగా ఘంటసాలగారికి దూరమైపోయారు. మాస్టారింటికి రావడం పూర్తిగా మానేసారు. కానీ, తన సినిమాలలో పాటలు పాడడానికి ఘంటసాలగారే శరణ్యమయేది. రాఘవులుగారి సంగీతదర్శకత్వంలో ఘంటసాలగారు ఓ మూడు సినీమాలలో ఓ ఆరు పాటలు మాత్రమే పాడి వుంటారు. గాయకుడైవుండి కూడా రాఘవులు తన సొంత చిత్రాలలో కూడా హీరోకు పాడే సాహసం చేయలేకపోయారు. ఇతర గాయకులమీదే ఆధారపడవలసి వచ్చింది. ఆయన గాత్రధర్మం గాయకుడిగా రాణించడానికి తగు దోహదం చేయలేకపోయింది. ఆదిలో తనకు నిలువ నీడ కల్పించి తన సొంతబిడ్డలా ఆదరించిన వ్యక్తి అంతిమ ఘడియలలో కూడా చూడడానికి రాకపోవడం ఘంటసాల రాఘవుల అనుబంధం తెలిసినవారందరికీ చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎవరిమీదైతే అమితమైన మమకారాన్ని పెంచుకుంటామో అలాంటి వారి వల్లనే తీవ్రమైన మానసిక వేదన కూడా కలుగుతుందనేది నిజం. జీవనతరంగాలలో ని ఈ పాట ఇలాటి జీవిత సత్యాలన్నింటిని గుర్తు చేస్తుంది.
ఈ పాట స్వరరచన పూర్తిగా ఘంటసాల బాణిని జ్ఞప్తికి తెస్తుంది. ఇదొక situational song. పాటలోని మాటలననుసరించే శోభన్ బాబు, కృష్ణంరాజు, వాణిశ్రీ, శ్రీరంజనిల మీద పాట చిత్రీకరణ సాగింది.
రాఘవులు గారు ఈ నేపథ్యగీతాన్ని అభేరి రాగ స్వరాల ఆధారంగా స్వరపర్చారు. అభేరి రాగం గురించి లోగడ చాలాసార్లు చెప్పుకున్నాము. కర్నాటక సంగీతంలో 22వ మేళకర్త అయిన ఖరహరప్రియ జన్య అభేరి. ఔడవ-సంపూర్ణరాగం. అంటే ఆరోహణలో ఐదు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు పలుకుతాయి. హిందుస్థానీ సంగీతంలో అభేరికి సమాంతర రాగం భీమ్ పలాస్. కర్నాటక దేవగాంధారి రాగమే ముత్తుస్వామి దీక్షితర్ సంప్రదాయం లో అభేరిగా ప్రచారమయింది. ఈ అభేరీ రాగంలో అనేక సంప్రదాయ కీర్తనలు, అనేక భాషలలో సినిమా పాటలు రూపొందించబడ్డాయి.
ఈ జీవన తరంగాలలో పాట ఘంటసాలగారి గళం బలం వలన సంపూర్ణమైన రసానుభూతిని కలిగించింది. పాటంతా పైస్థాయిలోనే సాగుతూ ఘంటసాలవారి రేంజ్ ను ప్రస్ఫుటం చేసింది. రాఘవులుగారి వాద్యనిర్వహణలో బాలీవుడ్ ప్రభావం కనిపిస్తుంది. హెవీ వైయొలిన్స్, షెహనాయ్, డోలక్, తబలా, పాటకు ఎంతో నిండుదనాన్ని కలిగించింది.
ఘంటసాలగారి ఋణం తీర్చుకునేలా రాఘవులుగారి 'ఈ జీవనతరంగాలలో' పాట సజీవరాగమై నిలిచిపోయింది. ఐదు దశాబ్దాలుగా ఈ పాట సదా మన మదిలో మెదులుతూ కలవరపెడుతూనేవుంది.
శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా తీయబడిన 'జీవనతరంగాలు' అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు చేసుకోవడమే కాక మూడు ఫిలింఫేర్ అవార్డ్ లను గెలుచుకుంది. తెలుగులోనే కాక ఈ కథ ఆధారంగా తమిళం, హిందీ, కన్నడ భాషలలో కూడా సినిమాలు వచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన చిత్రం 'జీవనతరంగాలు'. చిత్రంలో వున్న ఆరు పాటలలో ఘంటసాలగారు ఆలపించిన శోకగీతం ' ఈ జీవన తరంగాలలో' ఒక్కటే మకుటాయమానమై సజీవరాగం గా మన హృదయాలలో నిలిచింది.
ప్రణవ స్వరాట్

అమృత గాయకుడు సంగీత సాహిత్యాల మేలు కలయిక గా సరస్వతీ మాత
ReplyDeleteముద్దుపుత్రుడు ఆచంద్రతారార్కం స్మరించే యుగ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గురించి తమరు నిర్వహిస్తున్న సజీవస్వరాలు అమృత గుళికలు. పాటతో పాటు రాగాలను వాటి వివరాలను వివరిస్తున్నారు వ్యక్తుల మనస్తత్వాలను వారి పోకడలను చక్కగా తెలియజేస్తున్నారు ఇంటిలో వ్యక్తిగా వెలిగి తదుపరి కంటిలో నలుసుగా తయారైన వ్యక్తులు అలాగే కాలగర్భంలో కలిసిపోతారు ఘంటసాల గారి సాన్నిహిత్యంలోనే ఉంటే వారు మరింత ఉన్నత స్థితికి వెళ్లేవారు ఎక్కి చనిపోయిన తర్వాత రాలేదంటే ఒడ్డు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్లే వారి కర్మ వారు అనుభవించక తప్పదు మీకు మరొకసారి హృదయపూర్వక నమస్కారము లు