Saturday, 26 April 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 79వ భాగం - నే తాళలేనే ఓ చెలియా ... ఓ లలనా ఓ మగువా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభైయెనిమిదవ భాగం ఇక్కడ

79వ సజీవరాగం - నే తాళలేనే ఓ చెలియా ... ఓ లలనా ఓ మగువా      

చిత్రం - శ్రీకృష్ణావతారం
గానం - ఘంటసాల
రచన - సముద్రాల (సీ)

సంగీతం - టి.వి.రాజు

పల్లవి : తాత్త ఝం తదికిట ఝం

తద్దిగిణ కిటతక తా త్త ఝం

తరికిట ఝం తధ్ధిగిణతోం !!

 

తతత ఝణుత తతత ఝణుత

ఝణు తధంగిణత తధ్ధీం గిణత

తాంగిటతక తరికిటతోం తరికిటతో

తాత్తరికిటతో తధ్ధీం తధికిట తోం

తాధ్ధికిటతక తరికిటతోం...

 

ఆహా! నే తాళలేనే ఓ చెలియా

నే తాళలేనే ఓ చెలియా - 2

ఓ లలనా ఓ మగువా ఓ సఖియా

నే తాళలేనే ఓ చెలియా! ఆహా!

నే తాళలేనే...

ఆనందభైరవి  ప్రాచీన కర్ణాటక సంగీత రాగాలలో ఒకటి. ఇది 20వ మేళకర్త రాగమైన నఠభైరవికి జన్యరాగం. ఆనందభైరవి ఏడు స్వరాలు కలిగిన సంపూర్ణ రాగమైనా వక్రసంచారం వలనఅన్యస్వర ప్రయోగం వలన జన్యరాగంగానే పరిగణించబడుతున్నది.  రీతిగౌళ,హుసేనీ రాగాలు ఈ రాగాన్ని పోలివుంటాయి. సంగీత ముమూర్తులలో ఒకరైన శ్యామశాస్త్రి మధుర రక్తిరాగంగా కొనియాడబడే ఆనందభైరవి రాగంలో అనేక రచనలు చేశారు. చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళై గారి సుప్రసిద్ధ జావళి ' మధురానగరిలో చల్లలమ్మబోదు' ఆనందభైరవి రాగంలోనే చేయబడింది.

ఆనందభైరవి రాగం గురించి ప్రస్తావించినప్పుడు చాలామంది త్యాగరాజస్వామివారి గురించి తలచుకుంటారు. సాహేతుకమైన చారిత్రక ఆధారాలు లేని ఈ ఉదంతం వినడానికి ఆసక్తికరంగానే వుంటుంది.

ఒకసారి త్యాగరాజస్వామి వారి స్వస్థలమైన తిరువైయ్యారులో వీధి భాగవత మేళం జరిగిందట. ఆ మేళంలోని సంగీతకళాకారులు ప్రదర్శించిన ఆనందభైరవి రాగంలోని గీతం త్యాగరాజస్వామి వారిని ఎంతగానో ఆకట్టుకొవడంతో వారు ఆ భాగవత కళాకారులను ఎంతగానో ప్రశంసించి వారికి తగిన కానుక ఇవ్వాలని సంకల్పించారట. అందుకు ఆ భాగవతులు బ్రహ్మానందభరితులై త్యాగబ్రహ్మంగారు తమకు ఆనందభైరవి రాగాన్ని కానుకగా ఇచ్చి ఇకపై వారు ఆ రాగంలో ఏ కృతులు చేయరాదనే వింత కోరిక కోరారట. భవిష్యత్తు లో త్యాగయ్యగారు ఎందువలన ఆనందభైరవి రాగంలో రచనలు చేయలేదనే ప్రశ్న వస్తే  సంగీత ముమూర్తులలో ప్రముఖుడైన  త్యాగరాజస్వామి వారి వలన తమకు కలిగిన ప్రశంసను కూడా ప్రజలు  తలచుకుంటారని ఆ తృప్తే తమకు చాలని అందుకే ఈ కోరికను కోరినట్లు సవినయంగా విన్నవించుకున్నారట. సద్గురు త్యాగరాజస్వామి కూడా వారి కోరికను మన్నించి ఆనందభైరవి రాగాన్ని వారికి కానుకగా ఇచ్చి ప్రతిగా ఆ రాగంలో రచనలు చేయడం మానివేసారట.

ఇలాంటి కథలు ప్రచారమవడానికి  త్యాగయ్యగారు ఎక్కువ కృతులు రక్తిరస ప్రధానమైన ఈ ఆనందభైరవి రాగంలో స్వరపర్చకపోవడం ఒక కారణం కావచ్చును. వేలాది కృతులుకీర్తనలు వ్రాసిన త్యాగరాజస్వామి ఆనందభైరవి రాగంలో చేసినవి మాత్రం మూడే మూడు.

ఈ ఉదంతంలో ముడిపెట్టబడిన మరో ఆసక్తికరమైన  విషయం ఏమంటే త్యాగరాజస్వామి వారి వద్దనుండి ఆనందభైరవి రాగాన్ని కానుకగా పొందిన కళాకారులు ఆంధ్రదేశ కృష్ణాతీర కూచిపూడి భాగవుతులని చెప్పుకోవడం కద్దు.

ప్రాచీన భారతీయ సంప్రదాయ నృత్య కళా రీతులలో పేరెన్నిక పొందినది కూచిపూడి నృత్యం. క్రీ.శ. రెండవ శతాబ్దం నుండే కూచిపూడి నృత్యకళకు సంబంధించిన మూలాలు వున్నట్లు చెపుతారు. 14 వ శతాబ్దానికి చెందిన సిధ్ధేంద్రయోగి కూచిపూడి నాట్యాన్ని మరింత అభివృద్ధి పరచి ఈ నృత్యశైలికి మరింత ప్రాశస్త్యాన్ని తీసుకువచ్చారు. శాతవాహనులు, విజయనగరం రాజులు, తంజావూరు రాజుల పోషణలో కూచిపూడి నాట్యకళ ఎంతో ప్రసిధ్ధికెక్కింది.

కృష్ణాతీర కూచిపూడి గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబాల పురుషులచేత మాత్రమే అభ్యసించబడిన ఈ కూచిపూడి నృత్యకళ 19వ శతాబ్దం ప్రథమార్ధం నుండి మరింత నూతనత్వాన్ని సంతరించుకుంది.  శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, శ్రీ వెంపటి వెంకటనారాయణశాస్త్రిచింతా వెంకట్రామయ్య వంటి కూచిపూడి దిగ్దంతలు కూచిపూడి నాట్యకళకు నూతనత్వాన్ని, నవతేజాన్ని తీసుకువచ్చారు. అంతవరకు పురుషులకు మాత్రమే పరిమితమై వున్న కూచిపూడి నృత్యకళ స్త్రీలకు కూడా అందుబాటులోకి వచ్చింది.

శ్రీ వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రిగారి శిష్యుడైన శ్రీ వెంపటి చిన సత్యంగారి అవిశ్రాంత కృషి ఫలితంగా కూచిపూడి నృత్యకళ ప్రపంచవ్యాప్తంగా ప్రసిధ్ధికెక్కింది. సంగీతసాహిత్య, నృత్య సమాహారంగా అనేక నూతన నృత్యరూపకాలకు రూపకల్పన చేసి దేశ విదేశాలకు చెందిన వేలాది స్త్రీ పురుషులకు కూచిపూడి నృత్యంలో శిక్షణనిచ్చి కూచిపూడి నాట్య విశిష్టతకు  ఎనలేని సేవ చేసిన కళాప్రపూర్ణుడు, పద్మభూషణ్ డా.వెంపటి చిన సత్యం. 

శ్రీ వెంపటి చిన సత్యం కూచిపూడి నృత్యరంగంలోనే కాదు చలనచిత్ర సీమలో కూడా తనదైన ముద్రవేసారు. సినిమాలలో వచ్చే సత్సాంప్రదాయ నృత్య సన్నివేశాలెన్నింటికో ప్రాణ ప్రతిష్ట చేసిన ఘనత ఆయనకు వుంది. డా. వెంపటి చిన సత్యం నిర్దేశకత్వంలో ఆనందభైరవి రాగంలో రూపొందించబడి గాన గంధర్వుడు ఘంటసాల మాస్టారిచే అద్భుతంగా గానం చేయబడిన  ఒక చిన్న కూచిపూడి నృత్య దరువే ఈనాటి మన సజీవరాగం.

నిజానికి ఈ గీతంలో సాహిత్యమంటూ చెప్పుకోవడానికి ఏమీలేదు. 'తాళలేనే,  చెలియాలలనామగువాసఖియాఅంటూ ఐదే ఐదు పదాలతో ఈ పదాన్ని ముగించారు సముద్రాలవారు. ఇందులో మనకు ఎక్కువగా వినపడేది కూచిపూడి నృత్య జతులే. అయితే నృత్యదర్శకుడుసంగీతదర్శకుడుగాయకుడు, నటీనటులు  దీనిని ఆవిష్కరించిన విధానం వలన ఈ చిన్ని నృత్య సన్నివేశం ప్రేక్షకులను ఎంతో ఆకర్షించి అలరించింది. దర్శకుడు కమలాకర కామేశ్వరరావు, నిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య లకు గల ఉత్తమాభిరుచుల ఫలితంగా మంచి కళాత్మక విలువలతో  శ్రీకృష్ణావతారం భారీ పౌరాణిక చిత్రం తెలుగువారి సొంతమయింది. మహాభారతంమహాభాగవతం గ్రంథాలలో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఘట్టాలన్నింటిని పొందుపరచి శ్రీకృష్ణావతారం గా రూపొందించారు. ఈ చిత్రం పూర్తిగా నటరత్న ఎన్.టి.రామారావు భుజస్కంధాలపై నడిచిన సినిమా. రామారావు గారి నటవైదుష్యం, ఘంటసాలవారి గానం శ్రీకృష్ణావతారం చిత్రానికి ఆయువుపట్టులు.

ఈనాటి సజీవరాగం ఈ చిత్రంలో హాస్యరస ప్రధానంగా చిత్రీకరించబడింది. కలహభోజనుడైన నారదుడు శ్రీకృష్ణుని అష్టభార్యల మధ్య తంపులు పెట్టి ఆనందించాలని ఎక్కే గుమ్మం,దిగే గుమ్మంగా ప్రతీ అంతఃపురానికి వెళ్ళి అక్కడ కృష్ణునిపైఇతర సవతుల మీద అవాకులు చెప్పాలనుకునేలోపలే కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమై తన భార్యతో సఖ్యంగా వుండడం చూసి చల్లగా అక్కడనుండి జారుకోవడం ఇందులోని ఇతివృత్తం. అందులో భాగంగా శ్రీకృష్ణుడు (ఎన్.టి.రామారావు) తన అష్టభార్యలలో ఒకరైన కాళింది (ఎల్.విజయలక్ష్మి) తో  ఆనందంగా నృత్య సంగీతాలతో గడుపుతూంటాడు.  ఈ సందర్భంలో కూచిపూడి నృత్య భంగిమలతో ఆనందభైరవి రాగంలో ఈ చిన్న గీతాన్ని ఎంతో ఆకర్షణీయంగా చిత్రీకరించారు. ఈ సన్నివేశం లో ప్రధానంగా మనలను ఆకట్టుకునేది కూచిపూడి జతులతో కూడిన ఘంటసాలవారి గంధర్వగానంలాస్య కృష్ణునిగా ఎన్.టి.రామారావు నటన, సహజంగానే మంచి నర్తకి అయిన ఎల్.విజయలక్ష్మి నృత్యాభినయం.

ఈ గీతంలో ఘంటసాల మాస్టారికి ఇతర కళా ప్రక్రియల పట్ల గల సంపూర్ణ అవగాహన, దానిని సంపూర్ణంగా ప్రయోగించగలిగే సమర్ధత కనిపిస్తుంది. పరిపక్వత చెందిన నాట్యాచార్యుడు ఉచ్ఛరించే పధ్ధతిలో ఈ పాటలోని జతులను సుస్పష్టంగా భావయుక్తంగా పలకడం ఘంటసాల మాస్టారి గానప్రతిభకు దర్పణం పడుతుంది. గాయకుడి విశిష్టత తెలియడానికి ఒక పాట నాలుగైదు చరణాల సాహిత్యంతో, రాగమాలిక రాగాలలో ఎన్నో ఆవృత్తాల స్వరకల్పనలతోనే నిండివుండాలన్న నిర్బంధం ఏమీలేదు. 'నే తాళలేనే ఓ చెలియా' వంటి చిరుగీతం కూడా సంప్రదాయ పధ్ధతిలో గానం చేయబడితే అది కూడా శ్రోతల హృదయాలను తాకి పది కాలాలపాటు సజీవరాగం గా నిలిచిపోతుంది.

శ్రీకృష్ణావతారం సినిమా పాటలు, పద్యాలన్నీ  ఘంటసాలవారి గాన పటిమకు గీటురాళ్ళే. ఈ చిత్ర నిర్మాణ సమయంలో  ఘంటసాల మాస్టారికి సైనస్ ఆపరేషన్ జరిగింది. అందువలన ఘంటసాలగారు రికార్డింగ్ లకు హాజరు కాలేని పరిస్థితి. షూటింగ్ కు అంతరాయం కలగకుండా పద్యాలన్నీ ట్రాక్ పాడిద్దామని నిర్మాత సంకల్పించి ఆ విషయాన్ని ఘంటసాలగారికి చెప్పగా పాటల విషయంలోలా పద్యాలకు ట్రాక్ తీయడమనేది అనుకూలంకాదని పద్యాలను ఒక ఒరవడిలో లైవ్ లోనే రికార్డ్ చేయాలని అందుచేత తానే వచ్చి పాడతానని చెప్పి ఓ రెండు రోజుల తర్వాత పద్యాలన్నీ లైవ్ లో రికార్డ్ చేసారు. ఘంటసాలగారి నిర్యాణం తర్వాత ఆయన శైలిలో నిర్దిష్టంగా పద్యాలు చదివే గాయకులే కరువై పౌరాణిక చిత్రాలలో పద్యాలు పెట్టడమనదే మానేసారు. దానితో పౌరాణిక చిత్ర నిర్మాణం కూడా పూర్తిగా తగ్గిపోయింది. 


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

Saturday, 19 April 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 78వ భాగం - నీ దాన నన్నదిరా నిన్నే నమ్మిన చిన్నదిరా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభైయేడవ భాగం ఇక్కడ

78వ సజీవరాగం -  నీ దాన నన్నదిరా నిన్నే నమ్మిన చిన్నదిరా

     
చిత్రం - జయభేరి 
గానం - ఘంటసాల
రచన - మల్లాది రామకృష్ణశాస్త్రి

సంగీతం - 
పెండ్యాల

పల్లవి :

నీ దాన నన్నదిరా నిన్నే

నమ్మిన చిన్నదిరా... 2

 

చరణం 1:

తానే మధుకలశమని

మనసే నందనమని

వన్నెలతో చిన్నెలతో

మువ్వలతో నవ్వులతో

మోమాటముగా కులికి

                            !నీదాన!

చరణం 2: 

చుక్క.... చుక్క....

చుక్కల కన్నా తానే

చక్కనిదాన నన్నదిరా.. చుక్క..

చక్కని సామీ... చక్కని సామి యని

పక్కనజేరి  పలుకరించి నీ.. దాన నన్నదిరా 

హ్హ హ్హ హ్హా

నిన్నే నమ్మిన చిన్నదిరా... ఆ....

 చుక్క... సుక్క.... చుక్క మూడు చుక్కల రసమాధుర్యాన్ని  అనుభవైకవేద్యం చేస్తూ మల్లాది రామకృష్ణ కవి గారు చక్కని చిక్కని సిరా చుక్కలతో 'నీదాన నన్నదిరా...' అంటూ అలవోకగా వ్రాయగా, పెండ్యాల వారి సుమధుర సంగీతంఘంటసాలవారి సుశ్రావ్య రసస్ఫోరక గానంతో 'జయభేరి' సినిమా లోని ఈ నిషా గీతం తెలుగువారి హృదయాలలో సజీవరాగమై నిలిచిపోయింది. 

చుక్క...సుక్క...చుక్క... వినీలాకాశంలోని నక్షత్రాలను చుక్కలంటారు... అందమైన నవయవ్వనాంగినీ చుక్క అనే అంటారు.  ఈ చుక్కల అయస్కాంత ఆకర్షణ , వ్యామోహం మనిషిని సదా వాటికి బానిసను చేస్తూనేవుంది. ఆ దివిలోని చుక్కలుఈ భువి పైని చుక్కలు తరతరాలుగా కవులందరికి కవితా వస్తువులై సౌందర్యపిపాసులను మైమరపించి మత్తెక్కిస్తూనే వున్నాయి. ఈ రెండు చుక్కలకు తోడు మరో 'సుక్కఅదీ చుక్కే. పౌరాణిక యుగాలలో సురాపానంగా, మదిరగా, ఆధునికకాలంలో కుషీనినిషాను  కలిగించే మత్తు 'మందు'. ఇది మనిషి శారీరక, మానసికారోగ్య వినాశనానికి హేతువని పండితుడి మొదలు పామరుడి వరకు తెలిసినా ఈ సుక్కకు చాలామంది లొంగిపోతారు. చుక్క+సుక్క సంపర్కానికి బానిసైతే ఆ మనిషి జీవితం సర్వనాశనమేనని ప్రముఖులెందరి చరిత్రలో చెపుతాయి.

సమాజంలో ఒక వ్యక్తి తెలివితేటలుశక్తి సామర్ధ్యాలకు గుర్తింపురావడం మొదలెడితే గౌరవం, పరపతి, అంతస్తు, ఆదాయం  అన్నీ ఒకదానివెనక మరొకటిగా ఆ మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దానితోపాటు అంతకుముందు కనివిని ఎరుగని వ్యసనాలెన్నో అలవాటు అవుతాయి. రంభ వంటి అందగత్తెను తలదన్నే భార్య ఇంటిలో వున్నా పరస్త్రీ సావాసాలకు, మధుపానానికి బానిసై జీవితంలో పతనావస్థను అనుభవించిన ఒక గొప్ప సంగీత కళాకారుడి కథే 'జయభేరి' సినిమా కథ.

తనలోని విద్వత్తుకు, సంగీత ప్రతిభకు గొప్ప రాజాశ్రయం, గౌరవప్రతిష్టలు లభించగానే ఒక రాజనర్తకి వ్యామోహంలోబడి, మధుపానానికి కూడా దాసుడైన సందర్భంలో ఆలపించిన నిషా గీతం ఇది. ఎంత మత్తులో వున్నా శ్రుతిలయలు తప్పకుండా మృదుమధురంగా సాగే ఈ పాట ఎన్ని దశాబ్దాలైనా సజీవస్వరమే.

మధుకలశం వంటి ఒక లావణ్యవతి వన్నెచిన్నెలతో కాలి మువ్వల సవ్వడులతోచిరునవ్వులు చిందిస్తూ మోమాటంగా కులుకుతూ చెంతచేరిన వైనాన్ని కథానాయకుని స్వగతంగా మల్లాది వారు ఎంత అద్భుతంగా వర్ణించారో!  తననే నమ్మి వచ్చిన చిన్నదిగా భావించే అతను ఆమె తన పక్కకుజేరి  చక్కని సామి అని ముద్దుముద్దుగా పలుకరించడంతో అతనికెంత మైమరపోఎంత ఆనందమో!  పెండ్యాల గారి బాణిఘంటసాలవారి సుస్వరాలవాణి కథానాయకుని భావోద్వేగాలను ఎంత రసరమ్యంగా పలికించి మన హృదయాలను మత్తెక్కించిందో  సంగీతాభిమానులందరికీ అనుభవమే.

ఈ పాటలో ఘంటసాలగారి కంఠమాధుర్యంరాగాలాపనలు, సంగతులు, గమకాలుభావప్రకటనలు, నవ్వులు అనితరసాధ్యంగా చాలా అలవోకగా జాలువారాయి. మాటల్లో చెప్పలేని అనుభూతి ఘంటసాలవారి గాత్రంలో వినిపిస్తుంది. మాండ్, రాగేశ్వరి రాగఛాయలలో వినిపించే ఈ గీతంలో సితార్వైయొలిన్స్ఫ్లూట్, తబలా వంటి తక్కువ వాద్యాలు మాత్రమే పెండ్యాల గారు ఉపయోగించారు.

సుప్రసిద్ధ హిందీమరాఠీ చిత్రాల దర్శక నిర్మాత వి.శాంతారాం గొప్ప భావుకుడుకళాపిపాసి. భారతీయ కళాహృదయాన్ని ప్రతిబింబించే అద్భుత చిత్రాలనెన్నిటినో నిర్మించి భారతీయ సినీమాకు ప్రపంచ స్థాయిలో ఒక ప్రత్యేక గౌరవాన్ని తెచ్చారు. 1947లో శాంతారాం మరాఠీ భాషలో తీసిన 'లోక్ షేర్ రామ్ జోషి', హిందీలోని 'మత్వాలా శాయర్ రామ్ జోషిసినీమాల ఆధారంగా  మన ప్రాంతీయతకు తగినట్లుగా ఆ కథకు మరింత మెరుగులుదిద్ది పి.పుల్లయ్యగారు 1959లో 'జయభేరి' చిత్రాన్ని  తెలుగులో, 'కలైవాణన్'' తమిళ చిత్రాన్ని అక్కినేని, అంజలీదేవిఎస్.వి.రంగారావుగుమ్మడి, రాజసులోచన, రేలంగిరమణారెడ్డి ప్రధాన తారాగణంగా నిర్మించారు.

మరాఠా పీష్వాల కాలంలోని రామ జోషి అనే కవిప్రజాగాయకుని జీవితకథ ఇది. శారదా ఫిలింస్ బ్యానర్ మీద వాసిరెడ్డి నారాయణ రావు నిర్మించిన జయభేరిలో అగ్రకులం, నిమ్నకులాల ప్రసక్తి కొంచెం తీవ్రంగా చర్చించబడడం ఈ సినిమా పరాజయానికి కారణమయిందని పలువురి అభిప్రాయం.  చిత్రం బాక్సాఫీస్ వద్ద జయభేరులు మ్రోగించకపోయినా గొప్ప కళాత్మక విలువలు కలిగిన సంగీత నృత్యభరిత చిత్రంగా తెలుగులో ఒక ఉత్తమ దృశ్యకావ్యంగా చిరస్మరణీయంగా నిలిచిపోయింది. జయభేరిలో ఎన్నో పాటలు. అన్నీ ఆణిముత్యాలే.

జయభేరి అజరామరం గా నిలిచిపోవడానికి మల్లాది వారి సాహిత్యం, పెండ్యాలగారి సంగీతంఘంటసాలసుశీల అపురూప గానంఅక్కినేనిఅంజలీదేవి నటవైదుష్యం ముఖ్యకారణంగా చెప్పుకోవచ్చును.

కొసమెరుపు -

ఆనాడు తెలుగు రాష్ట్రాలలో మద్యపాన నిషేధం వున్న కారణంగా 'జయభేరి' సినిమాలోని ఈ  మందు నిషా పాట ' నీదాన నన్నదిరా' పాటను సెన్సార్ వారు తొలగించారట. కానీ, మేము స్టూడియోలో 'జయభేరిసినిమా ప్రివ్యూ చూసినప్పుడు ఈ పాట వుండడం బాగా గుర్తు.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 


Saturday, 12 April 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 77వ భాగం - మాధవా... మౌనమా... సనాతనా...

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభైయారవ భాగం ఇక్కడ

77వ సజీవరాగం -  మాధవా... మౌనమా... సనాతనా...

     
చిత్రం - శ్రీ సత్యనారాయణ మహాత్మ్యం
గానం - ఘంటసాల
రచన - సముద్రాల (జూ)

సంగీతం - 
ఘంటసాల

పల్లవి :

మాధవా మౌనమా సనాతనా

కనరావ కమలనయనా.. 

                                !మాధవా!

చరణం :

హే పరంధామ కారుణ్యసింధో

సత్యవ్రతనామ హే దీనబంధో

కనుల నినుజూడ నే నోచలేదా

కావగరావా ప్రభో  

                                !మాధవా!

నారాయణా సత్యనారాయణా

నారాయణా.. నారాయణా..నారాయణా...

మాధవా..... కేశవా....🌺


లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె... నీవే తప్ప ఇతఃపరంబెరుగ... రావే ఈశ్వర.. సంరక్షించు భద్రాత్మకా... అని గజేంద్రుడిచే మొరబెట్టిస్తారు పోతనగారు తన భాగవత కావ్యంలో. "అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ... సర్వధర్మాన్ పరిత్యజ్య  మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్ష యిష్యామి మా శుచఃఅనే  భగవానుడి అభయవాక్కు సర్వకాల సర్వావస్థలలో సత్చింతనాపరుల విషయంలో తప్పక ఫలిస్తుంది అనే విషయం ఈ నాటి సజీవరాగం నిరూపిస్తుంది. సినిమాలో సన్నివేశపరంగానే కాక శ్రీ సత్యనారాయణ మహత్మ్యం సినిమాకు సంగీత దర్శకత్వం వహించి, నేటి సజీవరాగంగా గత ఆరు దశాబ్దాలుగా తెలుగు వారందరినీ అలరిస్తున్న "మాధవా మౌనమా సనాతనా" అనే గీతాన్ని ఆలపించిన మధుర గాయకుడు ఘంటసాలవారి విషయంలో కూడా ఈ శరణాగతి మంత్రం పరిపూర్ణంగా ఫలించింది. ఆ విషయం ఏమిటో మీకు తెలియాలంటే ఈ పాట నేపథ్యెలోకి కొంచెం వెళ్ళాలి.

శ్రీ సత్యనారాయణ మహత్మ్యం సినిమా కు నాయికా నాయకులు కృష్ణకుమారి, ఎన్.టి.రామారావు. అశ్వరాజ్ పిక్చర్స్  కె.గోపాలరావు  నిర్మాత. గతంలో ఎన్.టి.ఆర్ హీరోగా వినాయకచవితి, దీపావళి, సినిమాలను తీసిన అనుభవం వుంది. దర్శకుడు రజనీకాంత్ సబ్నవిస్. దీపావళి సినిమా కు కూడా రజనీకాంతే డైరక్టర్. దురదృష్టవశాత్తు సినిమా సగంలో వుండగా డైరెక్టర్ రజనీకాంత్ స్వర్గస్థులయ్యారు. అప్పటికప్పుడు వేరే డైరెక్టర్ ను నియమించుకునే అవకాశం లేక గత చిత్రాలలోని అనుభవంతో నిర్మాత కె గోపాలరావు ఈ సినిమా  డైరక్షన్ బాధ్యతలను కూడా చేపట్టారు. ఒకరోజు ఆ గోపాలరావుగారు ఘంటసాలగారి వద్దకు వచ్చి "మాస్టారు! అన్నగారు వరస కాల్షీట్లు ఇచ్చారు. ఈ షెడ్యూల్ లో ఆయనతో ఒక సాంగ్, క్లైమాక్స్ సీన్  షూట్ చేస్తే ఆయన వర్క్ కంప్లీట్ అయిపోతుంది. (రామారావుగారు ఈ సినిమాలో మహావిష్ణువుగా, భూలోకంలో భక్తుడైన సత్యదేవునిగా ద్విపాత్రాభినయం చేశారు). దైవం అనుకూలిస్తే అనుకున్న ప్రకారం పిక్చర్ ను జూన్ (1964) లో రిలీజ్ చేసేయొచ్చు" అని చెప్పి పాట రికార్డింగ్ కు డేట్స్ ఫైనలైజ్ చేసుకు వెళ్ళారు.

క్లైమాక్స్ లో వచ్చే  ఈ పాట సినిమాకు కీలకమైనది. మత ఛాందసత్వంతో తాను దైవాంశ సంభూతుడనని, శివకేశవ అపరావతారమైన తననే ప్రజలంతా పూజించాలని, అలా చేయనివారు తీవ్రంగా శిక్షించబడతారని అనేక దురాగతాలకు పాల్పడే శివకేశవ మహారాజు పరమ వైష్ణవ భక్తుడైన సత్యదేవుని, అతని అనుయాయులను చిత్రహింసలకు గురిచేస్తాడు. ఇందుకు తండ్రిని గుడ్డిగా నమ్మే రాకుమార్తెరాజుగారి పేరిట అరాచకాలు సృష్టించే ముఖ్య అనుచరులు సత్యదేవుని కళ్ళూడబెరికి అతని ఆశ్రమాన్నిపరిసర ప్రాంతాలలో దహనకాండ సృష్టిస్తారు. ఈ భీభత్సమైన వాతావరణంలో నిస్సహాయుడైన కథానాయకుడు 'అన్యధా శరణం నాస్తి' అని తనను ఈ కష్టాలనుండి రక్షించి ధర్మాన్ని కాపాడమని  పరమ ఆర్తితో భగవంతునితో మొరపెట్టుకునే సందర్భంలో వచ్చే పాట ఇది.

"మాధవా మౌనమా సనాతనా కనరావా కమలనయనా" అనే పల్లవితో సముద్రాల రామానుజంగారు ఈ పాటను ప్రారంభించారు. శ్రీ సత్యనారాయణ మహత్యం సినిమాకు కథమాటలుపాటలుపద్యాలు అన్నీ జూనియర్ సముద్రాలగారే వ్రాశారు. ఘంటసాల, జూనియర్ సముద్రాల కాంబినేషన్లో అనేక విజయవంతమైన సినిమాలు రూపొందాయి.

కరుణరస ప్రధానమైన ఈ గీతాన్ని ఘంటసాల మాస్టారు ఘూర్జరితోడి రాగంలో చేశారు. ఇది ఒక హిందుస్థానీ రాగం. తోడి రాగంలో వుండే పంచమ స్వరాన్ని తొలగించి పాడితే అది ఘూర్జరితోడి అవుతుంది.  ఆరోహణ అవరోహణలలో ఆరు స్వరాలు మాత్రమే వుండే రాగం.  ఉస్తాద్ బడేగులాం ఆలిఖాన్ గారి ఘూర్జరితోడి తుమ్రీ  ఒకటి చాలా ప్రసిధ్ధి పొందింది.

ఆపదలలో వున్న తనను కాపాడమని భగవంతునితో మొరపెట్టుకునే ఈ పాటలో  పల్లవిఒక చరణం మాత్రమే వుంటూ చివరలో నారాయణా, మాధవాకేశవా అంటూ ఎలుగెత్తి విలపించడంతో ఆర్తత్రాణపరాయణుడైన శ్రీమన్నారాయణుడు తన భక్తునికి తన విశ్వరూప దర్శనాన్నిచ్చి పోయిన  కన్నులు మరల ప్రసాదించి అనుగ్రహిస్తాడు. అందరి తృప్తిమేరకు పాట చాలా ఎఫెక్టివ్ గా బాగా వచ్చింది. ఈ పాట కోసం వైయొలిన్స్, డ్రమ్స్డబుల్ బాస్, వైబ్రోఫోన్ట్రంపెట్స్, బాంజోషెహనాయ్తబలా వంటి వాద్యాలను ఉపయోగించడం జరిగింది. ఆర్కెష్ట్రావారందరికీ రికార్డింగ్ డేట్ కాల్షీట్ టైమ్స్టూడియో తెలియపర్చడం జరిగింది. ఇక మర్నాడు రికార్డింగ్ అనగా  ఒక అవాంఛనీయ సమస్య ఎదురయింది. మండువేసవి రోజులు కావడాన ఘంటసాలగారి ముఖాన సెగ గెడ్డలు లేచాయి. దానితోపాటు దాదాపు 102 డిగ్రీల జ్వరం. ఈ రెండు సమస్యలు మాస్టారిని చాలా తీవ్రంగా ఇబ్బందిపెట్టాయి. నొప్పితో బాధపడుతూ ఇంత తీవ్రమైన జ్వరంతో స్టూడియోకు వెళ్ళవద్దని రికార్డింగ్ క్యాన్సిల్ చేయమని ఇంట్లోవారంతా తెగ ఒత్తిడి చేసినా ఘంటసాల మాస్టారు ఒప్పుకోలేదు. తాను రికార్డింగ్ క్యాన్సిల్ చేయడం మూలంగా నిర్మాత షెడ్యూల్ అంతా తారుమారు అవుతుందని అసలే కష్టాలలో వున్న నిర్మాత మరింత నష్టపోతాడని అది తనకు ఇష్టంలేదని నిర్మాత సాధకబాధకాలన్నీ దృష్టిలో పెట్టుకొని  తనకు జరగబోయే మంచైనా చెడైనా ఆ సత్యనారాయణస్వామిదే భారమని  తన అస్వస్థతను ఏమాత్రం లెఖ్ఖచేయకుండా పాట  రికార్డ్ చేయడానికే నిశ్చయించుకొని  స్టూడియోకు బయల్దేరారు. వాహినీలో 2 టు 9 కాల్షీట్ లో జరిగిన ఈ పాట రికార్డింగ్ కు మాస్టారితో పాటూ నేనూ వెళ్ళాను. ముఖమంతా వ్యాపించిన సెగగెడ్డలమీద చందనం పూసుకొని,శాలువ కప్పుకొని వచ్చిన ఘంటసాలగారి వాలకం చూసి రికార్డింగ్ ధియేటర్ లోని వాద్యబృందంసౌండ్ ఇంజనీర్, చిత్రనిర్మాత అందరూ ఆరోజు పని జరగదనే భావనకు వచ్చారు. కానీ ఘంటసాలగారు మాత్రం దేవుడిమీదే భారం వేసి పాట రికార్డింగ్ ప్రక్రియకు ఉపక్రమించారు. అప్పటికే మాస్టారి అసిస్టెంట్లు అయిన సంగీతరావుగారు, రాఘవులు గారు ఆర్కెష్ట్రావారికి ఇవ్వవలసిన నొటేషన్స్ , సూచనలు పూర్తిచేసినందువలన ఆర్కెష్ట్రాతో ఒకటి రెండు రిహార్సల్స్ చూసి మాస్టారు రెడి ఫర్ టేక్ అంటూ మైక్ ముందుకు వెళ్ళారు. రికార్డింగ్ ధియేటరంతా నిశబ్దమైపోయింది. మాస్టారికి ఏ శ్రమా కలుగకూడదని ఆర్కెష్ట్రా అంతా చాలా జాగ్రత్తగా తమ నొటేషన్స్ మీదే ధ్యాస పెట్టారు. రెండు శ్రుతి లోని మాస్టారి గంభీరమైన స్వరం ధియేటరంతా వ్యాపించింది. ఘంటసాలగారు తన జ్వరంసెగ గెడ్డల నొప్పి అంతా మర్చిపోయారు. క్లైమాక్స్ లో బాధతో కలిగిన అనుభూతితో 'నారాయణామాధవాకేశవా' అంటూ ఎలుగెత్తి పెట్టిన కేకకు అందరూ నిశ్చేష్టులైపోయారు. ఘంటసాలగారికి ఎదో జరిగిందని భయపడిపోయారు. మరుక్షణంలో అందరూ తేరుకున్నారు. సౌండ్ ఇంజనీర్   ఫస్ట్ టేక్ ఓకే చేశారు. సినిమాలో తన భక్తుడిని రక్షించిన శ్రీ సత్యనారాయణస్వామి రికార్డింగ్ ధియేటర్ లో తీవ్ర అనారోగ్యంతో వున్న ఘంటసాలను కూడా కరుణించాడు. 

'మాధవా మౌనమా సనాతనాపాటను విన్నవారెవరూ ఘంటసాల ఈ పాటను అనారోగ్యంతో ఉన్నప్పుడు పాడిన పాటని రవ్వంత కూడా అనుమానించలేరు. సన్నివేశపరమైన ఆవేదనానుభూతికి తన ఈతిబాధను కూడా జోడించి ఆర్తితో అపూర్వంగా పాడిన ఈ పాటకు తెరపై ఎన్టీఆర్ తన నటనా పాటవంతో ప్రాణ ప్రతిష్ట చేసి  ఈ గీతాన్ని  సజీవరాగం చేశారు.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 


Saturday, 5 April 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 76వ భాగం - పూవై విరిసిన పున్నమి వేళా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభైయైదవ భాగం ఇక్కడ

76వ సజీవరాగం -  పూవై విరిసిన పున్నమి వేళా

     
చిత్రం - శ్రీ తిరుపతమ్మ కథ
గానం - ఘంటసాల
రచన - 
సి.నారాయణరెడ్డి 
సంగీతం - పామర్తి - బి.శంకర్

పల్లవి :

పూవై విరిసిన పున్నమి వేళా

బిడియము నీకేలా బేలా 2

పూవై విరిసిన పున్నమి వేళా


చరణం 1: 

చల్లని గాలులు సందడి చేసె

తొలి తొలి వలపులు తొందరచేసె 2

జలతారంచుల మేలిముసుగులో

తలను వాల్తువేలా బేలా 

                         !పూవై విరిసిన !

చరణం 2:

మొదట మూగినవి మొలక నవ్వులు

పిదప సాగినవి బెదరు చూపులు 2

తెలిసెనులే నీ తలపులేమిటో

తొలగిపోదువేలా బేలా 

                         !పూవై విరిసిన!

చరణం 3: 

తీయని వలపుల పాయసమాని

మాయని మమతల ఊయలలూగి 2

ఇరువుర మొకటై పరవశించగా 

ఇంకా జాగేలా బేలా 

                         !పూవై విరిసిన!

1963వ సంవత్సరంలో గానగంధర్వుడు ఘంటసాల గళం బలం కలిగిన సినీమాలు 30 వరకు విడుదలయ్యాయి. వాటిలో ఏకంగా 12 సినీమాలు  - 'శ్రీకృష్ణార్జున యుధ్ధం' మొదలుకొని 'మంచి-చెడు' వరకు  నటరత్న నందమూరి తారక రామారావు గారు నటించినవే. సరాసరిన నెలకు ఒక సినిమా చొప్పున వచ్చాయి. వాటిల్లో 10వ  చిత్రం  'శ్రీ తిరుపతమ్మ కథ'. 1963 అక్టోబర్ (10వ నెల) 4వ తేదీన రిలీజయింది. ఈ సినిమా శ్రీ తిరుపతి వేంకటేశ్వరస్వామి వారి ఒక భక్తురాలి జీవితగాధ ఆధారంగా తీయబడింది.

భార్యాభర్తల బంధం పరమ పవిత్రం. భర్త అనేవాడు సన్మార్గుడైనాదుర్మార్గుడైనా ఆ భార్య అతన్నే అంటిపెట్టుకువుండాలి. పతియే ప్రత్యక్ష దైవం. బ్రతుకునైనాచావునైనా భార్యాభర్తలు కలిసే వుండాలి.  వారిది ఎన్నటికీ ఎవరూఎప్పుడూ విడదీయరాని బ్రహ్మముడి అనే భావనలు ప్రజలలో బలంగా నాటుకుపోయిన రోజులవి. స్త్రీ అబలపరాధీన. మంచైనాచెడైనా పురుషుని ఆశ్రయంలో జీవించవలసిన వ్యక్తిగా ఈ సమాజం ఉన్న రోజులలోని కథ. స్త్రీ స్వాతంత్ర్యానికి, సొంత ఆలోచనలకువ్యక్తిత్త్వానికి చోటులేని కాలమది.

ఈ సినిమా లో ఘంటసాలగారు పాడిన అత్యంత శ్రావ్యమైన ఏకగళ గీతం, డా.సి.నారాయణరెడ్డి గారు వ్రాసిన 'పూవై విరిసిన పున్నమి వేళా బిడియము నీకేలా బేలా' - అదే నేటి మన సజీవరాగం.

ఒక  యువకుడు ఒక పల్లెటూరి అందమైన యువతిని చూసి మోజుపడ్డాడువరించానన్నాడు. కోరుకున్న పిల్లనే పెళ్ళిచేసుకున్నాడు. మంచి కుటుంబంలో కట్టుబాట్ల మధ్య పెరిగి విచక్షణా జ్ఞానం సంపాదించుకున్న ఆ వధువు ఏం చేస్తుంది. పతివ్రతా ధర్మాన్ని పాటిస్తూ భర్త పాదాలవద్దే జీవించాలని అత్తింటికి చేరింది. వారిరువురికి మొదటిరాత్రి. పధ్ధతి ప్రకారం పడకగదికి చేరిన భార్యను లాలించిమురిపించి  వలపు మాటలతో తన మగసిరిని ప్రదర్శించి తన తొలిరేయి కోర్కెలను సఫలం చేసుకుంటాడు.

ఇలాటి తొలిరేయి శృంగార సన్నివేశానికి కావలసిన పడికట్టు మాటలెప్పుడు కైవసం ఉండే కవి నారాయణరెడ్డిగారు కథానాయకుడు నందమూరి వారినికథానాయిక కృష్ణకుమారిలను దృష్టిలోపెట్టుకొని  ప్రేక్షకులకు మోహ పారవశ్యం కలిగేలా ఒక  చక్కటి రొమాంటిక్  గీతాన్ని సమకూర్చారు. ఇదే పాట తర్వాతి సన్నివేశాలలో కథానాయిక పరంగా శ్రీమతి లీల గాత్రంలో శోక గీతంగా వస్తుంది.

ఘంటసాల స్కూల్ కు  చెందిన సంగీత దర్శకుడు పామర్తి వెంకటేశ్వరరావు. ఘంటసాల సంగీత సహాయకుడిగా పనిచేసినవారు.  ఈ పాట కోసం కళ్యాణి రాగాన్ని ఎంచుకొని సంపూర్ణంగా గురువుగారి బాణీనే అనుసరించి ఒక సజీవరాగం సృష్టికి కారకులయ్యారు పామర్తి.  ఘంటసాలకు కళ్యాణికి గల రాగబంధం ఎలాటిదో తెలుగువారందరికీ సుపరిచితమే. గాయకుడిగా ఘంటసాలవారి గాన మాధుర్యం  గురించి ఎంత చెప్పినా తనివి తీరదు.

గత 75 వారాలుగా ఘంటసాలవారి గాన మాధుర్యాన్ని  పలు కోణాలలో నుంచి ఆస్వాదిస్తున్న రసజ్ఞులకుసందర్బం వచ్చింది కనుకఈ వారం ఘంటసాలగారి వ్యక్తిత్వం గురించివారి ఔదార్యం గురించి ఓ నాలుగు మాటలు చెప్పుకోవడం సముచితమైన విషయంగా భావిస్తున్నాను. 

అదే ఘంటసాల వెంకటేశ్వరరావు - పామర్తి వెంకటేశ్వరరావుల మైత్రీబంధం. ఆ విషయాలను ముచ్చటించుకోవాలంటే మనం 1948 లనాటికి వెళ్ళాలి.

అవి స్వర్గసీమ, పల్నాటి యుధ్ధంయోగి వేమనరత్నమాలబాలరాజు, కీలుగుర్రం వంటి సినిమాలు వచ్చి ఘంటసాల అంటే ఎవరో ఏమిటో తెలుగువారంతా తెలుసుకుంటున్న రోజులవి.  కుచేల దశ నుండి బయటపడుతున్న ఘంటసాల తనలాటి కుచేలురను ఆదుకునే స్థితికి ఎదుగుతున్న రోజులవి.

పామర్తి గారిది ఘంటసాలగారి స్వస్థలమైన చౌటపల్లికి దగ్గరలోని సిధ్ధాంతం అనే గ్రామం. ఒకప్పుడు బాగా బ్రతికినవారే. ఘంటసాలగారితో తన ఆర్ధిక దుస్థితి గురించి చెప్పుకోగా ఘంటసాల ఆయనను మద్రాస్ రప్పించి తన దగ్గర ఆశ్రయమిచ్చారు. అప్పటికే ఘంటసాలగారి వివాహమయింది. అద్దెంటిలో కాపురం. పామర్తిగారిని కూడా తన సంగీతం లైన్లోనే పెట్టాలని ఘంటసాల ఆయనకు డోలక్ కొనిపెట్టారు. ముందు తను నేర్చుకొని తర్వాత పామర్తిగారికి నేర్పడం మొదలెట్టారు. వీరికి జీవనోపాధి అయిన సంగీతం ఆ ఇంటి యజమాన్లకు ఇబ్బందిగా తయారయింది. ఉదయాస్తమానం వీరు చేసే డోలక్ సాధన ఆ ఇంటివారు భరించలేక  వెంటనే ఇల్లు ఖాళీ చేయమని ఘంటసాలగారిపై ఒత్తిడి తెచ్చి ఇళ్ళు ఖాళీచేయించగా వేరే ఇంటికి మారవలసి వచ్చిందట.

(ఘంటసాల సావిత్రమ్మగారి వ్యాసాల నుండి సేకరణ)

ఈ విధంగా తనను నమ్ముకున్న వ్యక్తికోసం ఎన్నో తిప్పలు పడిన సహృదయుడు ఘంటసాల. తర్వాత పామర్తి కొంత అనుభవం సంపాదించి ఘంటసాల గారి పాటలకు తబలా వాయించడం, ఆర్కెష్ట్రా కండక్ట్ చేయడం వంటి పనులు చేసేవారు. ఘంటసాలగారు సొంతిల్లు కొనుకున్నాక అందులోని ఔట్ హౌస్ లో పామర్తిగారు తన భార్యా పిల్లలతో కాపురముండేవారు. రెండు కుటుంబాలు  కలసిమెలసి ఒకే కుటుంబంలా వుండేవారు. దాదాపు పది పన్నెండేళ్ళు పామర్తి ఘంటసాలగారి సహాయకుడిగా అనేక సినిమా లకు పనిచేశారు. అయితే ఆ జీవితం పామర్తిగారికి నచ్చలేదు. స్వతంత్రంగా సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలనే కాంక్ష పెరిగి ఆ దిశగా ప్రయత్నాలు మొదలెట్టారు. అందులో భాగంగాఘంటసాలగారు ఎంత వారించినా కాదని కుటుంబంతో అక్కడనుండి వెళ్ళిపోయి వేరే చోటుకు మకాం మార్చి తన ప్రయత్నాలు కొనసాగించారు.

పామర్తిగారి కుటుంబం ఘంటసాలవారి ఔట్ హౌస్ నుండి వెళ్ళిపోయాక  1955లో ఆ ఔట్ హౌస్ లోకి మా కుటుంబం ప్రవేశించగా, ఏకంగా 28 ఏళ్ళు '35 ఉస్మాన్ రోడ్డే' మా స్వంత ఇల్లంత గాఢమైన అనుబంధంతో మా జీవనయానం సాగింది.

పామర్తి గారు వెళ్ళిన తర్వాత  ఓ దశాబ్దకాలంలో ఓ పాతిక డబ్బింగ్ సినిమా లకు సంగీతం చేసివుంటారు. డబ్బింగ్ సినీమాల ద్వారా ఆదాయం అంటే ఒకప్పటి 'బ్రతకలేక బడిపంతులు' సామెతలాటిది. శ్రమతప్ప ఫలితం శూన్యం. తన డబ్బింగ్ నిర్మాత స్నేహితులు స్ట్రైట్ సినిమా లు తీసినప్పుడు ఆ సినిమా ల సంగీత దర్శకత్వం ఛాన్స్ తప్పక తనదేనని పామర్తి గాఢంగా విశ్వసించారు. అదే విషయాన్ని ఘంటసాలగారితోనూ,ఇంట్లోవారితోనూ చాలా నమ్మకంగా చెప్పేవారు. అయితే 'ఎక్కడైనా బావ కాని వంగతోట దగ్గర కాదు' అనే సామెతను ఋజువుపరుస్తూ పామర్తిగారి డబ్బింగ్ నిర్మాత మిత్రులు తాము స్ట్రైట్ సినిమా లు తీసినప్పుడు

పామర్తిగారిని కాదని బాగా పేరున్న పెద్జ మ్యూజిక్ డైరెక్టర్లను నియమించుకోవడం మొదలెట్టారు. ఇది పామర్తిగారిని బాగా కృంగదీసింది. సంసారం పెరిగి ఆర్ధిక ఇబ్బందులు పెరిగాయి. మరల, ఘంటసాలవారినే ఆశ్రయించారు.    అప్పటికే రాఘవులు తన పురోభివృద్ధి ని వెతుక్కుంటూ ఘంటసాల మాస్టారిని వదలిపెట్టిపోవడంతో ఆ స్థానంలో  సంగీత సహాయకుడిగా పామర్తిగారికి  అవకాశాలు కల్పించి ఘంటసాల ఇతోధికంగా తోడ్పడ్డారు. పామర్తిగారింటి వివాహాది శుభకార్యాలన్నింటిలో చేదోడువాదోడుగా వుంటూ ఆర్ధికంగా తగు సహాయం అందించేవారు. మాస్టారింటిలోని వారంతా మంచి స్నేహంగానే ఉండేవారు.  పామర్తిగారి అమ్మాయిలకు అడపాదడపా బృందగానాలలో పాడే అవకాశాన్ని ఘంటసాల మాస్టారు కల్పించేవారు.

దాదాపు తన రెండున్నర దశాబ్దాల సినీజీవితంలో పామర్తిగారు స్వతంత్రంగా పనిచేసిన సినిమాలు ముచ్చటగా మూడే మూడు. అవి - సతీ తులసి, శ్రీ తిరుపతమ్మ కథ, బబృవాహన. ఈ మూడు సినిమాలు పామర్తిగారి పురోభివృద్ధికి ఏమాత్రం దోహదపడలేదనే చెప్పాలి. ఆఖరుగా1973లో  వసంతకుమార్ రెడ్డిగారి 'పూలమాల' అనే సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తూ, ఆ సినిమా  సగంలో వుండగానే పామర్తిగారు కాలం చేయడం జరిగింది. ఆ మిగిలిన సగం సినిమా పాటలనురీరికార్డింగ్ ను ఘంటసాలగారే పూర్తిచేసి తనకు ఇచ్చిన పూర్తి పారితోషకాన్ని ఘంటసాలగారు పామర్తిగారి కుటుంబానికి అందజేసి వారిని ఆదుకున్నారు.

ఈవిధంగా ఘంటసాలవారు తనను నమ్మి వచ్చినవారెందరికో ఆశ్రయమిచ్చి ప్రత్యక్షంగానో , పరోక్షంగానో ఆదుకున్నారు. ఘంటసాలగారు గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఎంతటి ఉన్నతుడో మనసున్న మంచి మనిషిగా మరింత ఉన్నతుడు. కళాకారుడిగా అందరికీ ఆదర్శప్రాయుడు.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 107వ భాగం - బలే మంచి రోజు

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...