75వ సజీవరాగం - మనిషైతే మనసుంటే
చిత్రం - అమాయకుడు
(మూలం -'అనారి' 1959 హిందీ చిత్రం)
గానం - ఘంటసాల
పల్లవి :
మనిషైతే మనసుంటే -2
కనులు కరగాలిరా కరిగి కరుణ
కురియాలిరా కురిసి జగతి నిండాలిరా
ఆగి ఆగి సాగిపోరా సాగిపోతూ
చూడరా !ఆగి ఆగి!
వేగిపోయే వెన్నెన్ని
బ్రతుకులో
వేడుకుంటూ ఎన్నెన్ని చేతులో వేచియున్నాయిరొ
! మనిషైతే!
తేలిపోతూ నీలిమేఘం జాలి
జాలిగ కరిగెరా !తేలిపోతూ!
కేలుచాపి ఆ దైవమే తన
కేలుచాపి
ఆకాశమే ఈ నేలపై ఒరిగెరా
!మనిషైతే!
మనిషైతే మనసుంటే మనసుంటే
మనిషైతే వైకుంఠమే ఒరుగురా
నీకోసమే కరుగురా - 3
జీవితంలో ఏ ఆశయం, లక్ష్యం లేకుండా బ్రతకడం ఒక్కటే ముఖ్యమనుకునేవారికి ఏ ఇబ్బంది లేదు. ఏదో రకంగా బ్రతికేస్తారు. అలా కాకుండా నీతినిజాయితీలతో నిక్కచ్చిగా జీవించాలనుకునేవారికి అడుగడుగునా అడ్డంకులే,అందరూ విరోధులే.
తన చుట్టూవున్న సమాజంలోని కుళ్ళు,కుత్సితాలకు క్షోభించి మనసు ద్రవించి కళ్ళు కరిగి బరువెక్కిన హృదయంతో ఓ యువకుడు పాడుకుంటూ ముందుకు పోతున్నాడు. ఆ పాటే - "మనిషైతే మనసుంటే కనులు కరగాలిరా కరిగి కరుణ కురియాలిరా కురిసి జగతి నిండాలిరా...". అదే నేటి మన సజీవరాగం. అతి కరుణరసాత్మకంగా ఘంటసాలవారి గళం నుండి మృదుమధురంగా జాలువారిన గీతం.
దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు చాలా సున్నితమనస్కుడు. తన బాధలకే గాదు యితరుల బాధలకు కూడా యిట్టే చలించిపోతారు. సమాజపు ఆటుపోట్లకు, అగ్నిజ్వాలలకు తట్టుకోలేక ఎన్నెన్ని బ్రతుకులు వేగివేసారిపోతున్నాయో,ఆసరాకోసం ఎన్నెన్ని చేతులు వేచియున్నాయో ఒక్కసారి ఆగి చూడమంటున్నారు. మనసున్న మనిషైతే వారి కష్టాలకు చలించి కనులు కరిగి కరుణ కురిపించమంటున్నారు. మనసున్న మనిషికోసం దైవం తన అభయహస్తాలతో వైకుంఠాన్నే నేలకు దింపుతాడని భరోసా కల్పిస్తున్నారు. కృష్ణశాస్త్రి గారి భావుకతకు తగినట్లుగానే వారి పదజాలం కూడా విలక్షణమైన రీతిలో వుంటుంది.
సాహిత్యానికి దీటుగా మంచి సంగీతాన్ని సమకూర్చారు బి.శంకర్. తోడి రాగ స్వరాలు ఆధారంగా ఈ పాట మలచబడింది. కర్ణాటక సంగీతంలోని 8వ మేళకర్త రాగం తోడి. సమాంతరమైన హిందుస్థానీ రాగం భైరవి. ఈ రెండు రాగాలకు స్వరాలు ఒకటే అయినా గమక ప్రయోగంలో రెంటికి మధ్య చాలా తేడా కనిపిస్తుంది. హిందుస్థానీ సంగీతంలో కూడా ఒక తోడి వుంది. దానికి సమాంతరమైన కర్ణాటక రాగాన్ని శుభపంతువరాళి (45వ మేళకర్త) అంటారు. తోడి రాగాన్ని పాడి మెప్పించడం చాలా కష్టమని, ఎంతో పాండిత్యప్రకర్ష కలవారికి మాత్రమే సాధ్యమనే భావన సంగీతప్రపంచంలో వుంది. కొత్త సంగీత దర్శకుడైన బి.శంకర్ గారి నిర్దేశకత్వంలో 'అమాయకుడు' సినిమా లోని పాటలన్నీ చాలా వైవిధ్యభరితంగా అమరాయి. ఘంటసాల మాస్టారు పాడిన ఈ పాటలోని orchestration శంకర్-జైకిషన్ స్టైల్ ను, ఆ రిచ్ నెస్ ను గుర్తుకు తెస్తుంది. సహజమే. అందుకు కారణం లేకపోలేదు. 'అమాయకుడు' సినిమా కు మూలం హృషికేశ్ ముఖర్జీ గారి 'అనారి' హిందీ చిత్రం(1959). రాజ్ కపూర్, నూతన్ లు నటించిన ఈ చిత్రానికి సంగీతం నిర్వహించింది రాజ్ కపూర్ ఆప్త మిత్రులు శంకర్-జైకిషన్లే. అందుచేత అదే బాణీ తెలుగులోనూ కనిపించింది. ఎన్నో వైయొలిన్స్, సెల్లోలు, ఎకార్డియన్స్, కాంగో డ్రమ్స్, బ్యాంగోస్, డబుల్ బాస్, గిటార్స్, పియానో, యూనివాక్స్, తార్ షెనాయ్, ఫ్లూట్, తబలాలు వంటి భారీ వాద్యాలు ఈ పాటకు చాలా నిండుదనాన్నిచ్చాయి. మంద్ర, తారస్థాయిలలో ఘంటసాల మాస్టారి కంఠం ఖంగున మ్రోగడమే కాక ఆ సన్నివేశానికి అవసరమైన కరుణరసాన్ని కూడా సమృద్ధిగా కురిపించింది. తన మాడ్యులేషన్ కూడా హీరో కృష్ణకు తగినట్లుగా మార్చారు మాస్టారు.
అందుకే ఈ 'మనిషైతే మనసుంటే' పాట ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా సజీవరాగమై నిలిచింది. బి.శంకర్ సంగీత దర్శకత్వంలో వచ్చిన సినీమాలు చాలా తక్కువ. అయినా మంచి పాటలనే అందించారు. బి.శంకర్, బొంబాయి శంకర్ - ఈ ఇద్దరూ హైదరాబాద్ కు చెందినవారే.
జమున, గుమ్మడి, జి.వరలక్ష్మి, మొదలగువారు నటించిన చిత్రం 'అమాయకుడు'. ఈ సినిమాను తమిళంలో కూడా జెమినీ గణేశన్, బి.సరోజినీదేవీలతో 'పాశముమ్-నేశముమ్' అనే పేరుతో నిర్మించి 1964 లో విడుదల చేశారు. హీరో కృష్ణకు తన తొలినాళ్ళ చిత్రాలలో మంచి గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెట్టిన సినిమా. ఈ సినిమా లో ఘంటసాల మాస్టారు పాడిన ఈ సోలో, సుశీల గారితో పాడిన మరొక డ్యూయెట్ ('చందమామ రమ్మంది చూడు) కృష్ణగారి పురోభివృద్ధికి ఎంతగానో దోహదం చేశాయి.
కృష్ణశాస్త్రి గారి కలం బలం, ఘంటసాల మాస్టారి గళం బలం ఈ పాటను అజరామరం చేసాయి.
ప్రణవ స్వరాట్