"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!
"శారధా... నువ్వు పాడుతున్న రాగమేమిటి, నువ్వు అంటున్న స్వరమేమిటి? శుధ్ధ హిందోళంలో ఆ రిషభం ఎలా వచ్చింది! చెప్పు.. హిందోళానికి ఆరోహణ ఏమిటి... "సగమదనిస", అవరోహణం ! "సనిదమగస" "మరి ఆ రిషభం ఎక్కడనుంచొచ్చింది , స్వర సంకరం చేయడానికి బుధ్ధిలేదుటే !" అని హూంకరించే శంకరశాస్త్రి గదమాయింపు సన్నివేశ చిత్రీకరణకు ఘంటసాలవారి హిందోళరాగమే కె.విశ్వనాథ్ గారికి స్ఫూర్తిని ఇచ్చివుంటుందని నాలాటి కొందరు భావించడంలో తప్పులేదేమో !
లలితగీతాలలో శ్రావ్యతను, మాధుర్యాన్ని పెంపొందించి వాటిని జనరంజకం చేయడానికి ఘంటసాలగారు ఎంతో సాహసంతో శాస్త్రీయ సంగీత రాగాలలో చేసిన అన్యస్వర ప్రయోగాలు సంగీత ప్రపంచంలో అంతటి ఆసక్తిని రేకెత్తించింది. ఛాందస విద్వాంసుల ప్రత్యక్ష, పరోక్ష విమర్శలనెప్పుడూ ఘంటసాలగారు పట్టించుకోలేదు, భయపడలేదు. భావప్రకటన కోసం, ఔచిత్యం కోల్పోకుండా ఔడవరాగమైన హిందోళంలో రిషభ, పంచమాలను అన్యస్వరాలుగా ప్రయోగించి హిందోళరాగానికి ఒక నూతనత్వాన్ని ఆపాదించారు ఘంటసాల. ఈ విషయం గురించి ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించినప్పుడు ఘంటసాల మాస్టారు ఇలా వివరించారు :-
"నేను నా సంగీత దర్శకత్వంలో వచ్చిన అనేక గీతాలకు శాస్త్రీయ సంగీత రాగాలనే ఎన్నుకున్నాను. ఎప్పుడైనా ఒక మంచి ఎఫెక్ట్ కోసం ఆ రాగంలో లేని అన్య స్వరం వాడినా దానిని ఒక సంచార క్రమంలోనే, ఎప్పుడు వాడవలసి వచ్చినా అదే క్రమంలో ఉపయోగిస్తూవచ్చాను. అన్యస్వరం ఉపయోగించినా అది మన సంగీతంలాగే, మన దేశీయత కోల్పోకుండా వినిపిస్తుంది గాని పరాయి సంగీతంలా వినిపించదు. నిజానికి అలాటి అన్యస్వర ప్రయోగ రాగాలకు వేరే కొత్తపేరు పెట్టి నేను కనిపెట్టిన రాగంగా ప్రకటించుకోవచ్చును. కానీ నేను అలా చేయలేదు. కర్ణాటక సంగీతంలోనే అన్యస్వరాలున్న రాగాలు అనేకం వున్నాయి. హిందోళ, అభేరి, ఖమాస్, కళ్యాణి, మోహన వంటి కొన్ని రాగాలు అటు హిందుస్థానీ సంగీతంలో, ఇటు కర్ణాటక సంగీతంలోనూ వున్నాయి. అందువల్ల ఇతివృత్తాన్ని బట్టి నేను చేసిన పాటలలో రెండు శైలుల సంగీత నుడికారాలు వినిపిస్తాయి" అని తన సంగీత సరళి గురించి ఘంటసాల విశ్లేషించారు.
ఆ విధంగా సంగీతలోకంలో సంచలనం సృష్టించిన అన్యస్వర హిందోళ రాగ "సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా"... గీతమే నేటి మన సజీవ రాగం. లవకుశ చిత్రంలోని అజరామ గీతం.
లవకుశుల గాథ ఉత్తర రామచరిత్రలో వస్తుంది. ఆదికవి వాల్మీకి సృష్టించిన శ్రీమద్రామాయణం సనాతన ధర్మాన్ని పాటించేవారికి గొప్ప ఆధ్యాత్మిక, ఆదర్శ గ్రంథం. పరమ పూజనీయం. యుగాలు మారి, యుగధర్మాలు మారినా రామాయణం పట్ల, రామాయణ కావ్యంలోని పాత్రలపట్ల భారతీయుల మనోభావాలు, భక్తిశ్రధ్ధలు ఇంచుకైనా తగ్గలేదు. వాల్మీకి శెలవిచ్చినట్లుగా ఈ లోకంలో గిరులు, నదీనదాలు ఎంత శాశ్వతమో రాముడి కథ కూడా అంత శాశ్వతంగానూ నిలిచివుంటుంది. ఆటువంటి మహనీయ రామాయణ కావ్యాన్ని ప్రపంచ భాషలన్నింటిలో అనేకమంది కవులు వ్రాసారు. వాటికి అనేక భాష్యాలు వెలువడ్డాయి. రామాయణం నృత్య, నాటక, చలనచిత్ర రూపంలో అనేక పర్యాయాలు వెలువడి భారతీయులను ప్రభావితం చేస్తూనేవుంది.
శ్రీమద్రామాయణం పూర్వార్ధ చరిత్ర ప్రాచుర్యం పొందినంతగా ఉత్తరార్ధ చరిత్ర ప్రచారం కాలేదు. కారణం, ఆ భాగమంతా కరుణరస ప్రధానం, విషాదాంతం కావడమేనని చాలామంది విమర్శకుల అభిప్రాయం. ఉత్తర రామచరిత్రను 8వ శతాబ్దం నాటి భవభూతి కవి సంస్కృతంలో వ్రాయగా దానిని 18వ శతాబ్దంలో కంకంటి పాపరాజు అనే కవి తెలుగులో వ్రాసారు.
ఈ ఉత్తర రామచరిత్ర కథ ఆధారంగానే 1934లో సి పుల్లయ్యగారు పారుపల్లి సుబ్బారావు , సీనియర్ శ్రీరంజనిలతో మొదటిసారి గా 'లవకుశ' సినీమా ను తీసి గొప్ప ఆర్ధిక విజయాన్ని పొందారు. మరల 1958లో నిర్మాత ఎ.శంకరరెడ్డి లవకుశ సినీమాను తెలుగు, తమిళ భాషలలో తీయ సంకల్పించి దర్శకత్వ భాధ్యతలను సి.పుల్లయ్యగారికే అప్పగించారు. అలాగే తెలుగు, తమిళ భాషలలో సంగీత దర్శకుడిగా ఘంటసాల నియమితులయ్యారు.
వాల్మీకి రామాయణానికి ఎంత చరిత్ర వుందో ఎ.శంకరరెడ్డి లలితా శివజ్యోతి 'లవకుశకు కూడా అంత చరిత్రవుంది. ఇప్పుడదంతా పునశ్చరణ చేస్తే జపం విడచి లొట్టల్లోపడడమే అవుతుంది. సూక్ష్మంగా చెప్పాలంటే లవకుశ చిత్రాన్ని తెలుపు నలుపులలో కాక రంగులలో నిర్మించాలనుకోవడం వలన నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగిపోయి నిర్మాణం ఆగిపోయింది. దర్శకుడు సి.పుల్లయ్యగారి అనారోగ్య కారణంగా ఆయన స్థానే ఆయన కుమారుడు సి.ఎస్.రావు దర్శకుడయ్యారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా 1958లో మొదలైన సినీమా 1963 నాటికి కానీ విడుదలకు నోచుకోలేదు. సినీమా పంపిణీ హక్కులను, నెగెటివ్ రైట్స్ ను సుందర్లాల్ నహతాకు అప్పగించిన తర్వాత ఆయన ఆర్ధిక సహాయం తో సినీమా పూర్తయింది.
ఈ నిర్మాణంలో జాప్యాన్ని ఘంటసాలగారు చక్కగా సద్వినియోగపర్చుకున్నారు. పాటల రచయిత సముద్రాల రాఘవాచార్యులవారితో కూర్చొని సావకాశంగా ఒకటికి పది ట్యూన్లు అనుకొని ఒక్కొక్క పాటకు, పద్యానికి ప్రాణ ప్రతిష్ట చేసారు. అలాగే లవకుశలో ముఖ్యమైన పాటలు, పద్యాలు పాడిన నేపధ్యగాయనీమణులు పి.లీల, సుశీలల చేత పలుమార్లు రిహార్సల్స్ చేయించి రికార్డింగ్ చేయడం జరిగింది. లవకుశలో లీల, సుశీల నువ్వా! నేనా ! అన్నట్లు తమ సంగీత విద్వత్ నంతా ప్రదర్శించి పోటీ పడి గానంచేసారు. అలాగే లవకుశలో ఘంటసాలవారి సంగీతం గురించి వ్రాయాలంటే అదొక పెద్ద పి.హెచ్.డీ థీసిస్సే అవుతుంది. ఈ సినీమా లోని ఒక్కొక్క పాట వైశిష్ట్యాన్ని వివరించాలంటే ఒక్కొక్క ప్రత్యేక వ్యాసమవుతుంది.
ఈ శీర్షిక లో ఘంటసాలవారి ఏకగళ గీతాలనే ప్రస్తావించడం వలన ఈ రోజు " సందేహించకుమమ్మా" పాటను స్వీకరించడం జరిగింది. ఈ పాటను ఘంటసాల మాస్టారు వాల్మీకి పాత్రధారి నాగయ్యగారికి పాడారు. సహజంగా నాగయ్యగారు అద్భుతమైన నట గాయకుడు. తన పాత సినీమా లలో తన పాటలు తానే పాడుకునేవారు. కానీ 1960ల నాటికి వారి గాత్రం సహకరించక ఇతర గాయకుల మీద ఆధారపడ్డారు. లవకుశలోని నాగయ్యగారి పాటలు, పద్యాలన్నింటినీ ఘంటసాల మాస్టారు ఎంతో హృద్యంగా ఆలపించారు. లవకుశలో నాగయ్యగారి కరుణరసాత్మక నటనకు ఘంటసాలవారి గాత్రం ఎంతగానో సహకరించింది.
"సందేహించకుమమ్మా" పాటలో సాహిత్యం కూడా ఎంతో గంభీరమైనది. రాముడి శీలాన్ని శంకించవద్దని సీతను ఓదారుస్తున్నా వాల్మీకి మనసులో ఎక్కడో చిన్నగా సందేహం, రఘుకులేశుడు తన ఏకపత్నీ వ్రతము విడనాడి వేరొక స్త్రీని చేపడితే... తన తపస్సు, సకలగుణాభిరాముడైన రామునిపట్ల తనకు గల విశ్వాసం, తన రామాయణ కావ్యం ఏమౌతాయి... ఈ ద్వందీ భావాలను రచయిత సముద్రాలగారు, గాయకుడు ఘంటసాలగారు, వాల్మీకి పాత్రధారి నాగయ్యగారు, సీతమ్మ పాత్రధారిణి అంజలీదేవి చాలా అద్భుతంగా పండించారు. అలాగే కరుణరస భావాలను విశదీకరించడానికి అనువైన హిందోళరాగాన్ని ఘంటసాల మాస్టారు తన గళంలో అపూర్వంగా వినిపించారు. ఈ పాటలోని భావరాగాలెన్నటికీ శ్రోతల హృదయాలలో సజీవంగానే నిల్చివుంటాయి.
లవకుశలో దాదాపు 38 పాటలు, పద్యాలు, శ్లోకాలు వున్నాయి. వీటన్నిటికీ అనన్యసామాన్యం అనే రీతిలో ఘంటసాల మాస్టారు సంగీతం సమకూర్చారు. అలాగే లవకుశ రీరికార్డింగ్ లో ఘంటసాలవారి సంగీత ప్రతిభ అణువణువునా గోచరిస్తుంది.
ఇప్పుడు లవకుశ లోని కొన్ని ముఖ్యమైన పాటలకు ఘంటసాల మాస్టారు నిర్దేశించిన శాస్త్రీయ రాగాలను చూద్దాము : -
సందేహించకుమమ్మా - హిందోళం
ఏ నిముసానికి ఏమి జరుగునో - జోగియా
ఇది మన ఆశ్రమంబు(పద్యం) - బేగడ
ఊరకే కన్నీరు నింప - భీంప్లాస్/ అభేరి
జగదభిరాముడు శ్రీరాముడే - దర్బారీ కానడచ
నవరత్నజ్వాల కాంతివంతమౌ ( పద్యం) - శంకరాభరణం
రామకధను వినరయ్యా - హిందోళం
లేరు కుశలవుల సాటి - దేశికర్
విరిసే చల్లని వెన్నెల - కళ్యాణి
వినుడు వినుడు రామాయణగాథా - కీరవాణి
శ్రీరాముని చరితమును - శివరంజని
సప్తాశ్వరధమారూఢం శ్లోకం - తిలాంగ్
శ్రీరామ సుగుణధామా - భాగేశ్వరి
స్థలాభావం వలన కొన్నిమాత్రమే పేర్కొనడం జరిగింది.
లవకుశ సంగీత విజయానికి ఈ చిత్ర గీత రచయితలు - కంకంటి పాపరాజు, దువ్వూరి రామిరెడ్డి( పద్యాలు), సముద్రాల, సదాశివబ్రహ్మం , కొసరాజు ల సాహిత్యం, పి లీల, సుశీల, ఎస్.జానకి, ఎ.పి.కోమల, ఎల్.ఆర్.ఈశ్వరి, వైదేహి, జిక్కి , కె.రాణి, ఎస్ వరలక్ష్మి ల - గళ మాధుర్యం లవకుశ సంగీత ఘన విజయానికి ఎంతో దోహదపడ్డాయి.
ఉన్న ఇబ్బందులు చాలవన్నట్లు సీనీమా సగంలో తమిళ డిస్ట్రిబ్యూటర్ లు సినీమాలో తమ తమిళుల కన్నా తెలుగువారి ప్రాబల్యమే ఎక్కువగా వుందని అందువల్ల తమకు తమ ప్రాంతంలో పేరుపొందిన సంగీత దర్శకుడే కావాలని పట్టుబట్టడంతో తమిళంలో కె.వి.మహాదేవన్ కొన్ని పాటలకు, ముఖ్యంగా మూడు రామాయణం పాటలకు సంగీతం నిర్వహించారు. మిగిలిన పాటలు, రీరికార్డింగ్ ఘంటసాలగారు చేసారు.
ఇలా ఎన్నో అవాంతరాలు దాటుకొని సినీమా మొదలెట్టిన ఐదేళ్ళకు 1963లో తెలుగు తమిళ రంగుల లవకుశ సినీమా విడుదలయింది. మొదటి రెండువారాలు కలెక్షన్స్ డల్. మూడోవారం నుండి ట్రెండ్ మారింది. టాక్ మారింది. సినీమా హిట్ అనే మాట విపడింది. 62 కేంద్రాలలో శతదినోత్సవాలు, 18 కేంద్రాలలో స్వర్ణోత్సవాలు జరుపుకొని అక్షరాల కోటి రూపాయల కలెక్షన్స్ (1963లో) సంపాదించిన తొలి తెలుగు చిత్రంగా లవకుశ ఒక అపూర్వ చరిత్ర సృష్టించింది.
లవకుశ అపూర్వ విజయానికి ఘంటసాల సంగీతమే మూలకారణమని సినీ ప్రముఖులు, విమర్శకులు, సంగీతాభిమానులు ఈనాటికీ కొనియాడుతున్నారు.
లవకుశలోని సీతారాములు అంజలీదేవి, ఎన్.టి.రామారావు కోట్లాది తెలుగుల ఆరాధ్యదైవాలయ్యారు. వారి చిత్రపటాలు అనేక గృహాల పూజా మందిరాలను అలంకరించాయి. లవకుశ లోని ప్రతీ పాటా, పద్యమూ ఈ నాటికీ, ఏనాటికీ సజీవమే.