చిత్రం - దీపావళి
గానం - ఘంటసాల
రచన - సముద్రాల
సంగీతం - ఘంటసాల
కరుణా జూడవయా వరమూ జూపవయా మురళీ మోహన వినీల మేఘ శ్యామా..." ( 2 భాగాలు)
పల్లవి:
కరుణా జూడవయా పరమూ జూపవయా
మురళీ మోహనా వినీల మేఘశ్యామా...
అలుకా మానవయా జాలీ పూనవయా
నరకాధీశ్వరా త్రిలోకజీవపాలా ... అలుకా ...
చరణం:
మృతికీ భీతిలని భుజబలసారము
అదికి కుండలముల దోచుకొనే బీరమూ
కలిగెను నీకీ జగతీ భళాభళీ ... అలుకా మానవయా ...
(స్వరకల్పన) ... అలుకా మానవయా ...
కరుణా జూడవయా పరమూ జూపవయా
మురళీ మోహనా వినీల మేఘశ్యామా...
చరణం:
మనసూ నీపయినా మరలిన చాలుగా
పులులే జింకలయీ లెంకలుగా మారుగా
నిరుపమ లీలా నిలయా దయామయా ... కరుణా ...
మదిలో నీ స్మరణ సలిపిన హాయిగా
బ్రతుకే తీయనయై వెన్నెలయై కాయుగా
త్రిభువన పావనా చరణా సనతానా
బృందం - రాధే గోవిందా కృష్ణ, రాధే గోపాలకృష్ణ
కన్నులకు విందుగా కనిపించవయ్య కృష్ణ
రాధే గోవిందా కృష్ణ, రాధే గోపాలకృష్ణ
రాధే గోవిందా కృష్ణ, రాధే గోపాలకృష్ణ ... నోర్ముయ్ ...
ఘంటసాల మాస్టారిలో వున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు, నటనాపటిమకు దర్పణం పట్టే ఈ పాట సదా నా మదిలో మెదులుతూనే వుంటుంది.
1960 లో విడుదలైన " దీపావళి" చిత్రంలోనిది ఈ పాట. ఎన్.టి.రామారావు, సావిత్రి, ఎస్.వి.రంగారావు, కాంతారావు, గుమ్మడి, రమణారెడ్డి, కృష్ణకుమారి, ఎస్.వరలక్ష్మి, వంటి అగ్రనటుల నటనా వైదుష్యం ఈ చిత్రంలో అణువణువునా కనిపిస్తుంది. రజనీకాంత్ సబ్నవీస్ దర్శకత్వంలో అశ్వరాజ్ ప్రొడక్షన్స్ కె.గోపాలరావు నిర్మించిన మంచి పౌరాణిక చిత్రం. మాయాబజార్, వినాయకచవితి సినీమాల తర్వాత ఎన్.టి.రామారావు మూడవసారి కృష్ణుడిగా తన నటకౌశలాన్ని సమగ్రంగా చూపించిన చిత్రం దీపావళి.
పౌరాణిక సినీమాలంటేనే పాటలకు, పద్యాలకు పెట్టింది పేరు. అందులోనూ ఘంటసాలవారి సంగీతమంటే తప్పక సుశ్రావ్యమైన సంగీతానికి కొదవేముంటుంది. ఇందులో ఎ.పి.కోమల " సరియా మాతో సమరాన నిలువగలడా" అని సత్యభామ సావిత్రికి పాడిన పాట ఎన్నటికీ వన్నె తరగని రత్నమే. దీపావళి చిత్రంలోని సుమారు పదిహేను పాటలు, పది పద్యాలు సంగీతాభిమానుల వీనులకు విందునే చేసాయి. ఈ సినీమాలో పద్యాలు, పాటలు అన్నింటినీ సముద్రాల పెద్దాయనే వ్రాసారు.
ఈ పాట మొదటిభాగంలో నరకాసురుని ఉద్దేశించి -
"నరకాధీశ్వరా త్రిలోకజీవపాలా" ;
"మృతికి భీతిలని భుజబలసారము";
అదితి కుండలముల దోచుకునే బీరము" అనే మాటలు,
రెండవ భాగంలో కృష్ణుని పరంగా -
"పులులే జింకలయీ లెంకలుగా
మారురా( లెంకలు అంటే సేవకులు);
"నిరుపమలీలా నిలయా దయామయా";
"త్రిభువన పావనా చరణా సనాతనా" ;
వంటి పద ప్రయోగాలు సముద్రాలవారి రచనా చాతుర్యానికి మచ్చుతునకలుగా నిలుస్తాయి.
నేటి సజీవరాగమైన "కరుణా జూడవయా వరమూ జూపవయా" గీతం , సాహిత్యంలో స్వల్ప మార్పులతో సినీమాలో రెండుసార్లు వస్తుంది. ఈ రెండు సన్నివేశాలలో నారదుడిగా కాంతారావు హాస్యరసాన్ని అద్భుతంగా పండించారు. కాంతారావు, ఘంటసాల మాస్టారి మధ్య అపారమైన అవగాహన వుందని ఈ పాట చెప్పకనే చెపుతుంది. కాంతారావు గారి హావభావాలను, నటనా శైలిని ముందే ఊహించి అందుకు తగ్గట్లు ఈ పాటలో తానే నటించి చూపారు ఘంటసాల.
దీపావళి సినీమాలో చక్కని వినోదాన్ని , హాస్యాన్ని పంచిపెట్టిన పాట ఇది. మొదటి భాగంలో ఎస్.వి.రంగారావు, కాంతారావుగార్ల ఏక్షన్ - రియాక్షన్ లు, రెండవ భాగంలో ఎన్.టి.రామారావు, కాంతారావు, రమణారెడ్డిల పరస్పర హావభావాలను ముందుగానే ఊహించుకొని తనలో తాను నటిస్తూ ఘంటసాల మాస్టారు ఈ పాటను స్వరపర్చారనిపిస్తుంది. మాస్టారు, కాంతారావుల మధ్య perfect synchronization ఈ పాటలో సుస్పష్టంగా కనిపిస్తుంది.
ఈ సంగీతభరిత హాస్యగీతాన్ని మలచడానికి ఘంటసాల మాస్టారు హిందోళరాగాన్ని తీసుకున్నారు. హిందోళం ఐదు స్వరాలు మాత్రమే కలిగిన జన్యరాగం. ఈ రాగం నటభైరవి, మరియు, హనుమతోడి రాగాల జన్యంగా భావించబడుతున్నది. ఈ రెండు రాగాలలోని రిషభ, పంచమ స్వరాలు తీసేసి పాడితే హిందోళమే అవుతుందని శాస్త్రకారుల ఉవాచ. కర్నాటక సంగీతంలోని హిందోళ రాగం హిందుస్థానీ శైలిలో మాల్కౌంస్ రాగానికి సమాంతరం.
ఘంటసాల మాస్టారు అన్యస్వరాలు చేర్చి హిందోళరాగానికి ఒక సరికొత్త మాధుర్యాన్ని తీసుకువచ్చారు. అలాటి పాటల కోవకే " కరుణా జూడవయా" పాట చేరుతుంది. ఈ పాటలో ఘంటసాల మాస్టారు చేసిన స్వరసంచారం, స్వరకల్పనలు, పక్కపక్క గమకాలు స్వరకర్తగా, గాయకుడిగా ఘంటసాలవారి విద్వత్ ను, రసస్ఫూర్తిని, ప్రతిభను చాటి చెపుతాయి. గాత్రాన్ని అనుసరిస్తూ వీణ, ఫ్లూట్, వయొలిన్స్, క్లారినెట్, తబలా వంటి వాద్యాలు ఈ పాటకు నిండుదనాన్ని చేకూర్చాయి.
దీపావళి సినీమా డివిడి రూపంలో మార్చేటప్పుడు టైటిల్స్ లో సంగీత దర్శకుడిగా ఘంటసాలవారి పేరు మిస్సయింది. ఎలా ఆ పొరపాటు జరిగిందో తెలియదు. ఒరిజినల్ సినీమా ప్రింట్ లో సహాయకులు కార్డ్ లో సంగీతం - సంగీతరావు అని వుంటుంది. దానిని చూసి ఓ ప్రముఖ టివి ఛానల్ వారు దీపావళి సినీమాలోని పాటలను ప్రసారం చేసేటప్పుడు సంగీతం సంగీతరావు అని క్రెడిట్స్ లో చూపించేవారు. ఈ పొరపాటు చాలా కాలం కొనసాగింది.
దీపావళి సినీమా అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు జరుపుకుంది.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్