Saturday, 1 March 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 71వ భాగం - దీని భావము నీకే తెలియునురా - ఈ జన్మ సరిపోదు గురుడా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
డెభైయవ భాగం ఇక్కడ

71వ సజీవరాగం -  దీని భావము నీకే తెలియునురా (సావేరి) & ఈ జన్మ సరిపోదు గురుడా (ఆరభి)

చిత్రం - రహస్యం
గానం - ఘంటసాల
రచన - మల్లాది రామకృష్ణశాస్త్రి & సదాశివ బ్రహ్మం
సంగీతం - ఘంటసాల
అభినయం - రమణారెడ్డి

3. " సాధించినామాట సత్యామయా"

రచన : వెంపటి సదాశివబ్రహ్మం

 

 పల్లవి : దీని భావము నీకే తెలియునురా

ఆనందకృష్ణ దీని మర్మము నీకే తెలియునురా

 

తనువు కానిదేది తానైనదేది

తనలోనే తానైన తన రూపమేది

జగమంత అణువేది అణువంత మహిమేది 

ఆదిలో కలదేది ఆద్యంతమేదీ 

                                !!దీని భావము!!

 

మూడు తీవల మీద మొనసి మీటగ

ఒక్క మొగిరేకు కోలాహలమ్మేదీ

ఏడు వన్నెల పంజరమ్మేదీ 

పంజరానా చిక్కి పట్టశక్యంగాని

పంచవన్నెల రామచిలుకేది  

                                !!దీని భావము!!

 

చీకటుల కావలీ చిక్కనీ వెలుగేది

వెలుగుకూ మూలమౌ తళుకేదీ

తళకులో దాగిన మిడిమేల మదియేది

ఏది తెలియని వాని కెదురయేదేదీ 

                                !!దీని భావము!!

 

ఈ జన్మ సరిపోదు గురుడా 

ఇంకొక జన్మమెత్తకా తప్పదుర నరుడ


ఆరు నదులాపైన ఆంబ యుందన్నా

అంబతో దుర్గాంబ ఆట్లాడునన్నా

ఆట్లాటలో మంచి అర్ధముందన్నా

అర్ధమెరిగినవాడు హరిగురుడోరన్నా

                                     !!ఈ జన్మ!!

మూడారు వాకిళ్ళు మూసివెయ్యాలి

ముక్తి వాకిట నిలిచి తలుపు తియ్యాలి

తలుపు తీస్తె అంబ తేజమిస్తుంది

తేజమందినవాడే తా గురుడోరన్నా

                                     !!ఈ జన్మ!!

 

సాధించి నా మాట సత్యామయా గురుడ సత్యామయా

దేవి చెప్పిన మాట నిత్యామయా గురుడ నిత్యామయా

సత్యము నిత్యము జౌలిగా పెనవేసి

సాధించినది మనకు గత్యంతరం అదే ముక్త్యంతరం 

జన్మలలోకెల్లా మానవజన్మ సర్వోత్కృష్టమైనదని, జీవించినంతకాలం సర్వార్ధసాధకంగా ఆదర్శప్రాయంగా జీవించి అంత్యదశలో భగవద్దర్శనం పొంది, మరుజన్మ లేకుండా మోక్షం సిధ్ధింపజేసుకోవాలని ప్రాచీన సనాతన ధర్మపరాయణులంతా తపోదీక్ష వహించి సదా భగవధ్యానంలో గడిపేవారు.  యంత్ర, తంత్ర, మంత్ర తపోశక్తితో అష్టసిధ్ధులను పొంది తాము కోరుకున్న లక్ష్యాన్ని సాధించేవారు. ఈ శక్తులు, సిధ్ధులు సాధించుకోవడం సామాన్యులందరివల్ల జరిగే కార్యం కాదు. అందుకోసం అర్హుడైన గురువును కనిపెట్టి తన శుశ్రూష,  సేవలతో మెప్పించి ఆయన వద్ద నుండి జ్ఞానాన్ని పొంది ముక్తిని పొందాలని శిష్యులెందరో తపించేవారు. అయితే గురువులంతా ఉత్తములు కారు, సత్చింతనాపరులుకారు. తన తపో శక్తియుక్తులన్నీ తనకు మాత్రమే సొంతమని,  లోకరక్షకి అయిన జగదంబ కరుణాకటాక్షాలు  సదా తనకు మాత్రమే స్వంతమవాలని ఆశించే దురాశపరులు, స్వార్ధపరులూ వుంటారు. అలాటి ఓ కుత్సిత గురువుకు శిష్యుడిగా  సంవత్సరాల తరబడి అహర్నిశలు సేవలు చేసినా  గురువు ద్వారా అంబ కరుణాకటాక్షాలు లభించక చిత్త చాంచల్యానికిలోనైన ఓ అభాగ్యుడు మతిస్థిమితం లేకుండా వల్లించే తత్త్వాలే నేటి మన సజీవరాగం. తర్వాత ఎప్పుడో  ఉత్తముడైన కథానాయకుని ద్వారా దేవి దర్శనం లభించి స్వస్థతతోపాటు తన చిరకాల మనోవాంఛ కూడా నెరవేరుతుంది. వెఱ్ఱిబాగుల వేదాంతి నోట పలికిన ఈ తత్త్వాలను ఘంటసాల మనకు వినిపిస్తారు.

ప్రాముఖ్యత కలిగిన ఒక విభిన్న పాత్రలో రమణారెడ్డి జీవించారు. గతంలో   పాత సినిమాల్లో ఘంటసాల తత్త్వాలు కొన్ని మనం విని వున్నా రహస్యం సినిమా లోని తత్త్వాలు వైవిధ్యంతో కూడినవి. నిగూఢమైన వేదాంతార్ధాలతో పాటు వ్యంగ్యం, హాస్యం కూడా మిళితమైవున్న తత్త్వాలు ఇవి. జ్ఞానబోధకమైన ఈ తత్త్వాలు సినీమాలో వివిధ సన్నివేశాలలో నాలుగైదుసార్లు  వినిపిస్తాయి. వీటిలో మొదటిదానిని మల్లాది రామకృష్ణ శాస్త్రిగారు, మిగిలినవాటిని వెంపటి సదాశివబ్రహ్మంగారు వ్రాసారు.

మతిభ్రమలో వున్న ఒక వెఱ్ఱిబాగుల సాధువు నోట వచ్చిన తత్త్వాలే అయినా వీటిలో అనంతమైన అర్ధం వుంది. యోగా, కుండలిని, యంత్ర, మంత్ర శాస్త్రాలకు సంబంధించిన విషయాలు ఇందులో చర్చించబడ్డాయి. 'తనువు కానిదేది తానైనదేది'; ఆదిలో కలదేది ఆద్యంతమేదీ'; 'మూడు తీవలు ఒక్క మొగిరేకు'; 'ఏడు వన్నెల పంజరము';'పట్టశక్యంగాని రామచిలుక';' చీకటుల కావలి చిక్కని వెలుగు';  అని రామకృష్ణ శాస్త్రిగారు శెలవిస్తే; వీటన్నిటి గురించి అర్ధంచేసుకోవడానికి ఈ జన్మ  సరిపోదంటారు సదాశివబ్రహ్మం గారు. 'ఆరు నదులపైన అంబ';''మూడారు వాకిళ్ళు';సత్యమం నిత్యము జౌలిగా పెనవేసి' వంటి పదాలకు గల నిగూఢార్ధాలు అర్ధం కావడానికి ఎంతో కొంత మంత్ర తంత్ర శాస్త్ర పరిచయం కావాలి. వీటిపట్ల ఏ కొద్దిపాటి అవగాహన, విషయ పరిజ్ఞానము లేని నాబోటివాళ్ళు ఈ మహాకవుల సాహిత్యం గురించి విశ్లేషించేంతటి సాహసం నేను చేను. సరళమైన తెనుగు భాషలో సుస్పష్టంగా ఉన్న ఈ తత్త్వాలలోని భావం అర్ధమవడమనేది వినేవారికి గల జ్ఞానం మీద, మనోధర్మం మీద ఆధారపడివుంటుంది. తెర వెనుక గాయక సంగీత దర్శకుడు ఘంటసాల, తెరమీద ఆనందకృష్ణ పాత్రధారి రమణారెడ్డి  పరస్పరం పరకాయప్రవేశం చేసి ఆ పాత్రను, ఆ తత్త్వాలను సజీవం చేసారు. 

సందర్భోచితమైన సంగీత వాద్యాలను సమర్ధవంతంగా ఉపయోగించుకోవడంలో దిట్ట ఘంటసాల మాస్టారు. ఈ తత్త్వగీతాల కోసమై ఫ్లూట్, తబలా, ఏక్ తారా, డోల్కి, పంబ,  మువ్వలు వంటి జానపద వాద్యాలను ఉపయోగించారు. పాత్ర స్వభావాన్ని సంపూర్ణంగా అర్ధంచేసుకొని దానికి కావలసిన భావప్రకటనతో, నుడికారంతో  ఘంటసాల ఈ గీతాలకు ప్రాణప్రతిష్ట చేసారు.

ఘంటసాల మాస్టారు మొదటి గీతాన్ని సావేరీ రాగంలో , రెండు మూడు గీతాలను ఆరభి రాగంలోనూ స్వరపర్చారు. సావేరీ ఔఢవ-సంపూర్ణరాగం. 15వ మేళకర్త మాయామాళవగౌళకి జన్యం. కరుణరసపూరిత భావప్రకటనకు అనువైన రాగంగా చెపుతారు.

రెండవ తత్త్వానికి ఉపయోగించిన ఆరభి రాగం కూడా ఔఢవ-సంపూర్ణరాగమే. అంటే అరోహణలో ఐదు స్వరాలు, ఆవరోహణలో ఏడు స్వరాలు పలుకుతాయి. ఇది 29వ మేళకర్త  శంకరాభరణానికి జన్యరాగం. అత్యంత ప్రాచీనరాగమైన కర్ణాటక దేవగాంధారి రాగాన్ని  కర్ణాటక సంగీత ముమూర్తులలో ఒకరైన  ముత్తుస్వామి దీక్షితులు అభేరి రాగంగా పేరు మార్చారు. అదే నేడు ప్రచారంలో వుంది. అభేరీ రాగానికి సమానమైన హిందుస్థానీ రాగం భీంప్లాస్. ఘంటసాల  సంగీత ప్రస్థానంలో చోటుచేసుకున్న అనేక అంశాలలో ప్రముఖమైనవి భగవద్గీత, లవకుశ, రహస్యం సినీమాల సంగీత దర్శకత్వం, వాటిలోని గీతాల గానం. రహస్యం చిత్రంలోని గిరిజాకళ్యాణ కూచిపూడి యక్షగానం; త్రిదేవీ స్తోత్రం, ఇతర యుగళ గీతాలు ఘంటసాలవారి సంగీత ప్రతిభకు దర్పణం పడతాయి. రహస్యం సినిమాలో ప్రధాన పాత్రలలో నటించిన ఎస్.వి.రంగారావుకు తప్ప  అక్కినేని, కాంతారావు, గుమ్మడి, హరనాధ్, రమణారెడ్డిలందరికీ ఘంటసాలగారే గాత్రదానం చేసారు. మిగిలిన పాటలు పద్యాలను మాధవపెద్ది, మల్లిక్,  లీల, సుశీల, కోమల, వైదేహి, వసంత మొదలగువారు పాడారు.

ఈ సినిమాలో మొత్తం 34 పాటలు, పద్యాలకు ఘంటసాల అమర్చిన సంగీతం అజరామరం.  సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసుడు శ్రీ చిత్తూరు సుబ్రహ్మణ్యంపిళ్ళైగారు ఈ సినీమాకు ఘంటసాల సమకూర్చిన  సంప్రదాయ సంగీతాన్ని విని ముగ్ధుడై ఎంతో ప్రశంసించారు.  రహస్యం చిత్ర సంగీతం ఘంటసాలవారి కీర్తికిరీటంలో ఒక అమూల్య రత్నం గా ఎన్నటికీ భాసిల్లుతుంది.

బహుభాషా ప్రవీణుడు, జానతెనుగు కవి శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి శిష్యుడనని ప్రముఖ సంగీత, నృత్య విమర్శకుడు, శ్రీ వెంకట ఆనందకృష్ణ రంగారావు సగర్వంగా చెప్పుకుంటారు. రహస్యంలో మల్లాదివారు వ్రాసిన మొదటి తత్త్వగీతంలో తన పేరు (ఆనందకృష్ణ) కూడా ఉటంకించబడడం విఎకె రంగారావుగారికి సదా ఆనందం కలిగించే విషయం.



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్

Saturday, 22 February 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 70వ భాగం - ఇంతేలే నిరుపేదల బ్రతుకులు

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
అరవైతొమ్మిదవ భాగం ఇక్కడ

70వ సజీవరాగం -  ఇంతేలే నిరుపేదల బ్రతుకులు

చిత్రం - పుణ్యవతి
గానం - ఘంటసాల
రచన - సి.నా.రె.
సంగీతం - ఘంటసాల

పల్లవి : ఇంతేలే నిరుపేదల బ్రతుకులు

అవి ఏనాడూ బాగుపడని అతుకులు

                            ఇంతేలే... ఇంతేలే -2

 

ఎండకు యెండి... వానకు తడిసీ

చలిలో వణకీ... వెన్నెలలో చివికీ

ఆరు ఋతువులందు... అన్ని యుగములందు

గతిలేని శ్రుతి లేని గతుకులు! 

                                    ఇంతేలే!

 

పుట్టగనే లేమి తలుపు తట్టింది

శని ఆపై తన పాదం పెట్టింది

పస్తులు లేని రోజే వుండదు

పండుగపూటైనా కడుపే నిండదు 

                                    ఇంతేలే!

 

కాళ్ళకు సంకెళ్ళు....

కళ్ళకు సంకెళ్ళు

నోటికి సంకెళ్ళు నుదుటి రాతకు సంకెళ్ళు

పేదలు ప్రాణమున్న పీనుగలు...

విధి చేతులలో తిరిగే గానుగలు 

                                    ఇంతేలే!

"కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ... ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ" ... అంటూ ఇద్దరు మహాకవుల కవితాశైలిని ఉద్దేశిస్తూ ప్రముఖ రచయిత గుడిపాటి వేంకటా చలం గారు వ్యాఖ్యానించారు.

అలాటి శ్రీశ్రీ బాధలాటిదే 'విశ్వంభర' కవి సి.నారాయణ రెడ్డిగారు ఒక సినిమా పాట కోసం అనుభవించారు. అదే 'ఇంతేలే నిరుపేదల బ్రతుకులు అవి ఏనాడూ బాగుపడని అతుకులు' - నేటి మన ఘంటసాల సజీవరాగం.

 

నిశీధి సమయాన మురికివాడలలోని నిరుపేదల  ఆకలి కష్టాలకు మనసు చలించి ఒక యువకుడు  వేదనతో పాడిన పాట. నిజానికి  పేదరికమంటే ఎరుగని ధనికవర్గ కుటుంబానికి చెందినవాడు. కానీ,  ధనం, ఆడంబర జీవితం,  అహంకారం,   నాగరికతా వ్యామోహం వలన  ఇంటిలో తల్లిదండ్రుల మమతానురాగాలు, ఆప్యాయతలు కరువై వాటికోసం అలమటిస్తూ, త్రాగుడుకు అలవాటు పడి, కుటుంబంతో సంబంధంలేకుండా ఒంటరిగా నిరాశా నిస్పృహలతో బ్రతికే ఒక హృదయమున్న మనిషి యొక్క చీకటి విలాపం ఈ గీతం. 1967 లో వచ్చిన 'పుణ్యవతి' అనే సినిమా కోసం డా.సి.నారాయణరెడ్డిగారు వ్రాసిన ఉదాత్త గీతం.

ఎన్.టి.రామారావు, భానుమతి, ఎస్.వి.రంగారావు, కృష్ణకుమారి వంటి హేమాహేమీల మధ్య ఒక విలక్షణమైన యువకుడి పాత్రలో శోభన్ బాబు ఎంతో రాణించి తన పాత్రలో జీవించారు.  అందుకు సి.నా.రె.గారి కలం, ఘంటసాలవారి గళం ఎంతగానో దోహదం చేసాయి.

"ధనం మూలం  ఇదం జగత్". కలిమిలేని వాడి జీవితం ఎన్నటికీ అతుకు గతుకుల బాటే. పుట్టగనే లేమి తలుపు తడుతుంది. వెనువెంటనే శని తన పాదం పెడుతుంది. సమాజంలో ధనం లేనివాడికి  అధికారము, అంతస్తు,  స్వేఛ్ఛ ఏవీ వుండవు. కాళ్ళకు, కళ్ళకు, నోటికి, చివరకు విధాత నుదుటి వ్రాతకు కూడా సంకెళ్ళే. ప్రాణమున్న పీనుగలు, విధి చేతులలో తిరిగే గానుగలు ఈ పేదలు. ఏనాటికి మారని నిరుపేదల బ్రతుకింతే అనే ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని నారాయణరెడ్డి ఈ పాటలో మనకు అందించారు.

కాపి రాగం  ఏ కలపడం లేని శుధ్ధమైన ఫిల్టర్ కాఫీ అంత మాధుర్యాన్ని, రసానుభూతిని కలిగిస్తుందని రసజ్ఞుల భావన. మన సంప్రదాయ, సినీ నృత్య జావళీ గీతాలు చాలావరకు ఈ కాపి రాగంలోనే స్వరపర్చబడివున్నాయి. ఈ కాపి రాగానికి సమాంతరమైన హిందుస్థానీ రాగం 'పీలు'. అటువంటి సుఖసంతోషాలకు , మధురానందానికి అనువైన  పీలు రాగ స్వరాలను ఆధారంగా చేసుకొని 'ఇంతేలే నిరుపేదల బ్రతుకులు' పాటను శోకరస ప్రధానంగా, అతి గంభీరంగా, అంతే ఉదాత్తంగానూ స్వరపర్చి  ఆ  నిరుపేదల మనోభావాలు తనవిగా భావిస్తూ    ఘంటసాల మాస్టారు సంపూర్ణంగా  లీనమైపోయి    ఆ పాటకు ప్రాణప్రతిష్ట చేసారు. సన్నివేశ బలానికి  మంచి సంగీత సాహిత్యాలు తోడైతే ఆ పాట శ్రోతల హృదయాలలో పదికాలాలపాటు సజీవరాగమై నిలిచిపోతుందనడానికి "ఇంతేలే నిరుపేదల బ్రతుకులు" పాట ఒక నిదర్శనం.

'పుణ్యవతి' సినిమా నిర్మాత, వాసూ స్టూడియో అధినేత వాసుదేవ మీనన్, చిత్రదర్శకుడు దాదామిరాసి సంగీతం విషయం పూర్తిగా  ఘంటసాలగారికే వదలిపెట్టి పరిపూర్ణమైన స్వేఛ్ఛను ఇచ్చారు. అందువల్లనే ఈ పాటే కాకుండా ఈ సినిమా లోని  'మనసు పాడింది సన్నాయి పాట', 'ఎంత సొగసుగా వున్నావు', 'పెదవులపైన సంగీతం' వంటి ఇతర గీతాలు కూడా ఈ నాటివరకు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలచివున్నాయి. వాసుమీనన్ ఈ సినిమా ను ఏకకాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషలలో 'పుణ్యవతి',' పూవుంపొట్టుం', 'నయీ రోషిణి' గా వేర్వేరు ప్రముఖ నటీనటులు, వేర్వేరు సాంకేతిక నిపుణులతో భారీగా నిర్మించారు.

ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు, భానుమతి, కృష్ణకుమారి, హరనాథ్, జ్యోతిలక్ష్మీ ; ఎ.వి.ఎమ్.రాజన్, నాగేష్, ముత్తురామన్, భారతి; అశోక్ కుమార్, బిశ్వజిత్, రాజ్ కుమార్, మాలాసిన్హా, తనూజ ; వంటి ప్రముఖ తారలంతా  ఈ మూడు భాషల్లో నటించారు. తెలుగు తమిళ చిత్రాలకు దాదామిరాసి, హిందీ వెర్షన్ కు సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించారు.

తెలుగు, తమిళం, హిందీ ఈ మూడు భాషల్లో నటించిన పి.భానుమతికి కనీసం ఒక పాటైనా లేకపోవడం ఒక విశేషం. 


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్

Saturday, 15 February 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 69వ భాగం - మగజాతికి నువు బలిపశువమ్మా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
అరవైయెనిమిదవ భాగం ఇక్కడ

69వ సజీవరాగం -  మగజాతికి నువు బలిపశువమ్మా

చిత్రం - స్త్రీజన్మ
గానం - ఘంటసాల
రచన - ఆత్రేయ
సంగీతం - ఘంటసాల

పల్లవి : మగజాతికి బలిపశువమ్మా"

సాకీ -

ఎన్ని పూవులిలా నలగిపోయినవో

ఎన్ని బ్రతుకులిలా చెదరి రాలినవో...

పల్లవి:

మగజాతికి నువు బలిపశువమ్మా

నీ సొగసూ వయసే నీకు పగమ్మా

స్త్రీ ప్రకృతే నీ పాలిట శాపం

ఈ స్త్రీ జన్మే నువు చేసిన నేరం

                                    !మగజాతికి!

అందం నీవే అంటారు

ఆనందానికి నెలవంటారు

ఆ రెంటిని పొందీ నిన్నాఖరుకు

అపవిత్రవని వెలివేస్తారు 

                                   !మగజాతికి!

అరిటాకమ్మా ఆడజన్మము

ముళ్ళకంచె యీ మూఢసంఘము

అమ్మా...ఆ....

ముళ్ళకెన్నడూ దండన లేదూ

చిరిగిన ఆకు విస్తరికాదు

                                    !మగజాతికి!

చిరిగిన ఆకు విస్తరి కాదు

నీ సొగసు వయసే నీకు పగమ్మా...


ఈ పాట రెండవ పార్శ్వం :

సాకీ - " తల్లీ! ఇది తరతరాల కథ చెల్లీ!

           అలాగే జరుగుతున్నది మళ్ళీ మళ్ళీ!...

 

పల్లవి : మగజాతికి నువు బలిపశువమ్మా నీ మనుగడ

ఆరని కన్నీరమ్మా

మాతృత్వం నీ పాలిట శాపం

ఈ స్త్రీ జన్మే నువు చేసిన నేరం

 

లోకుల నిందలు ఓర్చిన తల్లీ

నిను నీ నెత్తురె నిందించినదీ

 

సహనం కూడా సహించరానిదీ

నీ మరణమే దీన్ని మాపేది-2

మరణమే దీన్ని మాపేది....

అరిటాకు మీద ముల్లు పడినా

ముల్లు మీద అరిటాకు పడినా ఛేదము అరిటాకుకే. అదింక విస్తరిగా ఉపయోగపడదు. ఆడజన్మ అరిటాకు వంటిదైతే  పురుషాధిక్యత గల దుష్ట సమాజం ఒక ముళ్ళకంచె వంటిది. యుగయుగాలుగా, తరతరాలుగా ఆడది అబల అనే ముద్రతో పురుష జాతికి అణగిమణగి నిస్సహాయస్థితిలో బానిసలా బ్రతుకుతోంది.  సీత, సావిత్రి, దమయంతి, అహల్య, ద్రౌపది  వంటి మహా పతివ్రతలు, మహనీయమూర్తులు కూడా పురుషాహంకారానికి తీవ్రంగా బలి కావలసివచ్చింది.

ఈ నవీన యుగంలో  స్త్రీ జాతి అభివృధ్ధి చెందిందని, అన్ని రంగాలలో స్త్రీ పురుషుడికి సమానమని చెప్పబడుతున్నా స్త్రీ పురుషుల మధ్య వివక్ష పూర్తిగా సమసిపోలేదు. ప్రతిరోజు పత్రికలలో, టీవిలలో కనపడే దారుణ మానభంగాలు, మానభంగ హత్యలు, ఆత్మహత్యలు, కాలేజీలలో ఆడపిల్లల పట్ల జరిగే అమానుషకృత్య వార్తలే ఇందుకు నిదర్శనం.

Man is a social animal అంటాడు అరిస్టాటిల్. పశువులకు మనిషికి గల తేడా బుధ్ధి. మనిషి ఒంటరిగా జీవించలేడు. జంతువులు లాగే సామూహికంగా, సమాజంలో బ్రతకవలసినవాడు. బుధ్ధిజీవి అయిన మనిషిలో పశుప్రవృత్తి పెచ్చుపెరిగితే పర్యవసానం, ఫలితాలు ఎంత దారుణంగా వుంటాయో చాటిచెప్పే గీతమే  -  "మగజాతికి నువు బలిపశువమ్మా" ఈనాటి ఘంటసాలవారి సజీవరాగం.

త్రాగుడు మైకంలో మనిషిలోని పశువాంఛకు బలైన స్త్రీ ఒకరైతే, ఆ స్త్రీని రక్షించబోయి కులటగా అవమానాలపాలైనది మరో అభ్యుదయ వనిత. ఒకే మనిషి వలన ఈ ఇద్దరి జీవితాలు దుర్భరమైపోయాయి. అటువంటి అభాగినుల దీనగాథే 'స్త్రీజన్మ'  సినిమా.

ఇదొక anti-hero, ladies sentiment Story. పురుషాధిక్య మనోప్రవృత్తితో కథానాయకుడు తన భార్యపట్ల, తోడబుట్టిన అక్కపట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించాడో చిత్రీకరించబడిన చిత్రమే 'స్త్రీజన్మ'. మంచితనానికి మారు రూపైన స్త్రీమూర్తులుగా కృష్ణకుమారి, అంజలీదేవి తమ తమ పాత్రలలో జీవించారు. anti-hero పాత్రను చేయడానికి  ఎన్.టి.ఆర్ వంటి అగ్రనటుడు అంగీకరించడం ఆయన ధైర్యానికి, నిబ్బరానికి దర్పణం. ఏ రకమైన పాత్రలనైనా అవలీలగా పోషించగలనని ఎన్.టి.రామారావు ఈ సినిమాలో నిరూపించారు.

వివిధ సందర్భాలలో  ఇద్దరు స్త్రీలు ఒకే వ్యక్తి వల్ల ఎలా వంచించబడి, అవమానాలపాలయ్యారో "మగజాతికి నువు బలిపశువమ్మా" పాట వివరిస్తుంది. ఈ నేపథ్య గీతం సినిమాలో రెండు కట్స్ గా వస్తుంది.  పాట ట్యూన్ ఒకటే అయినా చరణాల సాహిత్యంలో సందర్భోచితమైన మార్పులను తన సహజశైలిలో చూపించారు మనసుకవి ఆత్రేయ.  మొదటిది కథానాయిక కృష్ణకుమారి పరంగా, రెండవసారి కధానాయకుడి అక్క అంజలీదేవి మీద  వినిపిస్తుంది. చిత్ర దర్శకుడు కోవెలమూడి సూర్య ప్రకాశరావు. సీరియస్ సినిమాల చిత్రీకరణ లో నిష్ణాతుడు.

ఉద్వేగము, ఉద్రేకము, విషాదము నిండిన సన్నివేశాలు ఇవి. గీత రచయిత, సంగీతదర్శకుల వివేచనకు , ప్రతిభకు అగ్నిపరీక్ష ఈ పాట. ఆత్రేయగారి పాటంటే అందరికి తెలిసిన విషయమే. అనుకున్న వెంటనే కాగితంమీద పదాలు పడవు. అందువల్ల చేసిన మెట్టుకు చిత్రిక పట్టడానికి సంగీతదర్శకుడికి కావలసినంత సమయం. 'స్త్రీ జన్మ' కు సంగీత దర్శకుడు ఘంటసాల. సురేష్ కంబైన్స్ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు సినిమాలకు ఘంటసాల పనిచేసిన ఏకైక చిత్రం. బహుశా సహ నిర్మాత ఎ.ఎస్.ఆర్.ఆంజనేయులు జోక్యం కావచ్చును.

ఎట్టకేలకు సన్నివేశబలానికి తగినట్లుగా బరువైన పదజాలంతో వేర్వేరు సాకీలతో, చరణాలతో రెండు పాటలను  శ్రోతల హృదయాలకు హత్తుకుపోయేలా తనదైన బాణీలో  వ్రాసిచ్చారు ఆత్రేయ.

నఠభైరవి  రాగ స్వరాలు ఆధారంగా ఘంటసాల మాస్టారు ఈ పాటను శోకరసభరితంగా, మంచి ఉద్వేగంతో స్వరపర్చారు. నఠభైరవి రాగం కర్ణాటక సంగీతంలో 20వ మేళకర్త. ఏడు స్వరాలు గల సంపూర్ణరాగం. భైరవి, ఆనందభైరవి, సారమతి, వంటి రాగాలు ఈ నఠభైరవి కి జన్యరాగాలు. హిందుస్థానీ సంగీతంలో కూడా భైరవి అనే రాగం వుంది. దానికి సమానమైన కర్ణాటక రాగం తోడి.

పాట సంబంధిత వ్యక్తులందరి ఆమోదముద్ర పొంది రికార్డింగ్ దశకు చేరుకుంది. పాట చాలా బాగా వచ్చింది. సన్నివేశపరంగా పాటను  ఎమోషనల్ గా, చాలా హైపిచ్ లో పాడాలి. అది మాస్టారివల్ల కాకపోవచ్చు. అందుచేత ఈ రెండు పాటలను టి.ఎమ్.సౌందరరాజన్ తో పాడించే ఏర్పాట్లు చేయమని  నిర్మాత రామానాయుడు తాను స్వయంగా మాట్లాడకుండా సంగీత సహాయకుడు జె.వి.రాఘవులు ద్వారా ఘంటసాలగారికి కబురు పంపారు.  ఈ విషయం ఘంటసాలగారికి నొప్పి కలిగించిందనే చెప్పాలి. తాను పాడవలసిన పాటకు ఇతరులచేత పాడించమనే సలహాను ఆయన అంత తేలికగా భావించలేకపోయారు.

ఆయన ఉద్రేకపడకుండా,'అలాగే నాయనా! ముందు నేను ట్రాక్ పాడతాను. దానిని నాయుడుగారిని వినమను. ఆ తర్వాత ఆయనకు కావలసినవారితో ట్రాక్ మిక్స్ చేద్దాము' అని చెప్పి పంపారు.  

పాట ట్రాక్ రికార్డింగ్ డేట్ ఫిక్స్ అయింది. మామూలుగా ఘంటసాలగారు తన పాటలను ఒకటి, ఒకటిన్నర శ్రుతులలో పాడతారు. ఈ పాట సన్నివేశానికి కావలసిన ఆవేశం, ఉద్రేకం, గాంభీర్యానికి తగినట్లుగా  ఈ పాటను రెండు శ్రుతిలో పాడారు. ఈ పాటలో ఆర్కెష్ట్రా కూడా ఘనంగానే వినిపిస్తుంది. తబలా, పక్వాజ్, డ్రమ్స్, షెహనాయ్, వైయొలిన్స్ వంటి వాద్యాల నడుమ  ఘంటసాలవారి కంఠం కంచులా ఎంతో ఆవేశపూరితంగా ధ్వనించింది. ఈ పాటను ఘంటసాల ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. పాట రికార్డింగ్ పూర్తయింది. ఘంటసాలగారి గాత్రబలాన్ని శంకించినవారందరి నోళ్ళు మూతబడ్డాయి. సినిమా రిలీజయ్యాక  ఆడిటోరియంలలో ఈ పాటకు ఘంటసాల కంఠమే ప్రతిధ్వనించింది. శ్రోతలంతా ఎంతో ఉద్విగ్నులయ్యారు.

స్త్రీ జన్మ సినిమాలో మంచి పాటలలో ఒకటి ' ఎడారిలో పూలు పూచె ఎందుకనీ'. ఎన్.టి.ఆర్, కృష్ణకుమారి, అంజలీదేవి, కాంతారావు, నాగయ్య, కృష్ణ, ఎల్.విజయలక్ష్మి, ప్రభాకరరెడ్డి మొదలగువారు నటించిన ఈ చిత్రంలోని  11పాటలను ఆత్రేయ, జూ.సముద్రాల, సి.నా.రె., దాశరధి, ఆరుద్ర, కొసరాజు  రచించగా ఘంటసాలతో పాటు పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, పిఠాపురం, మాధవపెద్ది, స్వర్ణలత మొదలగువారు గానం చేసారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎమ్.కరుణానిథి కథ, మాటలు సమకూర్చి, ఆయన మేనల్లుడు, తరవాతి రోజుల్లో కేంద్రమంత్రి, పత్రికాధినేత 'మురసొలి'మారన్ నిర్మించిన  'పూమాలై' అనే ladies sentiment తమిళ చిత్రం ' స్త్రీ జన్మ' తెలుగు సినిమాకు మూలం.

ఇటువంటి  చిత్రవిచిత్ర  సినీప్రపంచంలోని ఆటుపోట్లన్ని అధిగమిస్తూ ఎంతో సంయమనంతో  మూడు దశాబ్దాల పాటు అగ్రగణ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా తెలుగువారందరి మన్ననలు పొందిన  ఘంటసాలవారి వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయం. 



వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 40 - హిమగిరి సొగసులు

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను...