Saturday, 28 March 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 8 - కనుపాప కరమైన కనులెందుకూ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 8


చిరంజీవులు - కనుపాప కరమైన కనులెందుకూ...


'ఒదినోయ్! నే చెప్పినట్లుగా నీకు కూతురే పుట్టింది. అది మా బుజ్జిగాడికే సొంతం. దానిని నా కోడలిని చేసుకుంటాను. కాదు కూడదని సాకులు చెప్పకుండా ఒట్టేసి మాటియ్యి'.... పురిటి మంచం మీదున్న ఒదినగారిని  బలవంతపెడుతున్న ఓ మరదలు...

'నువ్వింతగా అడగాలా బావా... తరతరాల ఆత్మీయానుబంధం మనది.. నువ్వు అడిగినా అడక్కపోయినా నా కొడుకు నీ అల్లుడే.. ఈ పుట్టినరోజు పండగ శుభసమయంలో నీకు వాగ్దానం చేస్తున్నాను. నువ్వూ నీ మాటమీద నిలబడే వుండు... తన ఐదేళ్ళ కొడుక్కు తన బావమరది కూతురితో పెళ్ళికి నిశ్చయం చేసేసాడు ఓ పెద్దమనిషి. ఎవరింటైనా పిల్లలు పుడితే వారి వరస బంధువులు వెంటనే ఆ పసి పాపల పెళ్ళిముచ్చట్ల దాకా వెళ్ళపోతారు. ఆ  ఇళ్ళలోని ఆడ మగ పిల్లల స్నేహం బలపడడానికి  దోహదమౌతారు. అలాటి వాతావరణంలో పెరిగిన పిల్లలు కూడా ఒకరిపట్ల ఒకరు ఇష్టం ఏర్పర్చుకుని స్నేహంగా వుంటారు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారుతుంది. 'నీవు లేక నేనులేను, నేను లేక నీవులేవు', 'నీకోసమె నే జీవించేది', నువ్వు తప్ప నాకు వేరే లోకం లేదు అంటూ ఘాటుప్రేమలో పడతారు. కాలప్రభావంతో ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలౌతాయి. పెద్దల మనస్తత్త్వాలలో మార్పువస్తుంది. చేసిన, చేయించుకున్న వాగ్దానాలు నీటిలోని ఉప్పుమూటలవుతాయి. పెద్దలు మనసు మార్చుకున్నట్లుగా యవ్వనంలో వున్న యువతీయువకులు మనసు మార్చుకోలేక తమ ప్రేమ ఫలించి తాము ఒకటవడానికి తపిస్తారు. ఈ దిశలో అష్టకష్టాలు పడవలసివస్తుంది. కొందరి జీవిత కథలు సుఖాంతమైతే, మరికొందరి జీవితాలు విషాదాంతమౌతాయి. అలనాటి శశిరేఖాభిమన్యులనుండి నిన్న మొన్నటి  లైలా ఖయస్, మల్లి నాగరాజు, పార్వతి దేవదాసు వంటి చిన్ననాటి స్నేహితుల ప్రేమ గాధలన్నీ కష్టాలమయమే. కొందరు ప్రేమికుల విషయంలో ప్రాణత్యాగమే పరిష్కారమార్గమై  అమరప్రేమికులవుతారు.

అలాటి అమరప్రేమికులే శారదా మోహన్ లు. అతి బాల్యదశనుండి ఒకరికోసం మరొకరు పుట్టినట్లుగా కలసిమెలసి  అంటిపెట్టుకు జీవిస్తారు. ఇరుతరఫు పెద్దలు వీరి స్నేహాన్ని, ప్రేమను ఆమోదించి వారి వివాహానికి ఏర్పాటు చేస్తారు. అయితేఇక్కడే విధి శారద సవతితల్లి తమ్ముడి రూపంలో ప్రవేశించి అతడు చేసిన కుతంత్రాలకు శారదా మోహన్ ల ప్రేమ జీవితం ఛిన్నాభిన్నమై అంతిమంగా వారి ప్రాణాలనే బలితీసుకుంటుంది. ఆ ఇరువురు బాధాతప్త హృదయులుగాప్రేమ చిరంజీవులుగా మిగిలిపోతారు.

ఇంతకు ఈ శారద,మోహన్ లు ఎవరు? వారి ప్రేమ కధ ఏమిటి? ... 

తెలియాలంటే  ఎన్.టి.రామారావు, జమున నటించిన అద్భుత కుటుంబగాధా చిత్రం 1956 నాటి వినోదా ప్రొడక్షన్ వారి 'చిరంజీవులుచూడాలి. విషాదంతో నిండిన ఈ ప్రేమికుల హృదయవేదనే నేటి మన 'ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం'.

ప్రేమించిన యువతితో  తన వివాహం జరుగబోతున్న సంతోషంలో  తన పెళ్ళికోసం నగలను కొని వస్తూండగా కుట్రదారుల కుతంత్రంతో నగలను కోల్పోయి చావుబ్రతుకుల మధ్య వుండి పెళ్ళిముహుర్తానికి రాలేకపోతాడు.  కష్టంలో కష్టంగా కథానాయకుడు బండి ప్రమాదంలో కళ్ళను కోల్పోతాడు. ఈ బాధలన్నీ దాటుకుని ఇంటికి వచ్చేసరికి తాను గాడంగా ప్రేమించిన చిన్ననాటి చెలి మరొకరి ఇల్లాలవుతుంది.

ఆ సందర్భంలో  ... ''కనుపాపలాంటి చెలి పరులపాలైతే ఇంక ఈ బ్రతుకెందుకు...చిననాటి కలలన్నీ కథలేనా అని నాయకుడు తల్చుకు తల్చుకు కుమిలిపోతూంటే ; మనసైన చినదాని మనసు  నేలవ్రాలి ధూళిలో కలసిన విరజాజులేమరుమల్లెలే ... తనవారు ఎప్పటికీ తనవారే... ఇలలో విడిపోయినా కనుమూసాక గగనాన మరల కలుస్తాము' అని నాయిక ఆలపించిన  విలాపగీతం సజీవరాగమై  ఈనాటికీ శ్రోతల మనసులలో రగులుతూనేవుంది....

మోహన్:

కనుపాప కరవైన కనులెందుకో

తనవారె పరులైన బ్రతుకెందుకో-2


శారద:

విరజాజి శిలపైన రాలేందుకే

మరుమల్లె కెంధూళి కలసేందుకే

మనసైన చినదాని మనసిందుకే

రగిలేందుకే 

                                    !కనుపాప!


మోహన్:

అలనాటి మురిపాలు కలలాయెనా

చిననాటి కలలన్ని కధలాయెనా

తలపోసి తలపోసి కుమిలేందుకా

తనువిందుకా  

                                    !కనుపాప!


శారద:

తనవారు తనవారె విడిపోరులే

కనుమూసి గగనాన కలసేరులే

ఏనాటికైనాను నీదాననే  - నీదాననే


మోహన్:

చిననాటి మనపాట మిగిలేనులే

కలకాలమీ గాధ రగిలేనులే

కలకాలమీ గాధ రగిలేనులే...

రగిలేనులే....


ఘంటసాల మాస్టారు ఈ పాటను నఠభైరవి రాగంలో చేశారు. నఠభైరవి కర్ణాటక సంగీతంలోని 20వ మేళకర్త రాగం.హిందుస్థానీ సంగీతంలో అసావేరీ థాట్ అంటారు. 

వినోదా పిక్చర్స్ బ్యానర్ మీద డి.ఎల్.నారాయణ 'దేవదాసు', 'కన్యాశుల్కము' సినిమాల తర్వాత ఎన్.టి.రామారావు, జమున, గుమ్మడిలతో తీసిన విషాదాంత ప్రేమకథాచిత్రం చిరంజీవులు.

వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో రూపొందిన అపురూప చిత్రం 'చిరంజీవులు'. నటుడిగా ఎన్.టి.రామారావుకు, గాయక సంగీతదర్శకుడిగా ఘంటసాలకు చిరస్థాయి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిన చిత్రం 'చిరంజీవులు'. ఈ చిత్రంలోని అన్ని పాటలు సందర్భోచితంగా, సహజత్వానికి దగ్గరగా తెలుగు వాతావరణం ప్రతిబింబిస్తూ రూపొందాయి.

1948 లో వాడియా ఫిలింస్ నర్గీస్, దిలీప్ కుమార్ లతో 'మేళా' అనే హిందీ సినీమా తీశారు. ఆ సినీమా కథ మాత్రమే ఆధారంగా తీసుకొని వినోదావారు 1956 లో  'చిరంజీవులు' సినిమాను నిర్మించారు.

చిరంజీవులు చిత్రంలో గుడ్డివాడిగా నటించడానికి ఎన్ టి రామారావు కృత్రిమ కనుగుడ్లు పెట్టుకొని రోజులతరబడి నటించడంతో నిజంగానే ఆయన దృష్టికి  సమస్య ఏర్పడి వైద్యచికిత్స పొందిన తర్వాత కాని సహజస్థితికి రాలేదు. రామారావుగారి కమిట్మెంట్ కు, వృత్తిపట్ల శ్రధ్ధాభక్తులకు ఒక నిదర్శనం ఈ చిరంజీవులు.

చిరంజీవులు సినిమాకు కెమెరామన్ గా పనిచేసినవారు వి.ఎన్.రెడ్డి. స్వతహాగా తెలుగువారే అయినప్పటికీ హిందీ సినిమాలకే ఎక్కువగా పనిచేశారు. 1943-1986 మధ్య దాదాపు ఓ నలభై సినిమా లకు ఛాయాగ్రహకుడిగా, ఓ ఆరేడు సినిమాలకు డైరక్షన్ చేశారు. వి.ఎన్.రెడ్డి కెమెరామన్ గా పనిచేసిన హిందీ సినిమాలలో - 'ఆగ్', 'బైజుబావ్రా', 'కశ్మీర్ కి కలి', 'పూరబ్ ఔర్ పశ్చిమ్'జహ్రీలీ', చోరీచోరీ, 'ఉపకార్, 'దోబదన్వంటి హిట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. సెసిల్ బి డిమిల్లే నిర్మించిన ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ చిత్రం 'టెన్ కమాండ్మెంట్స్'కు కూడా వి.ఎన్.రెడ్డి ముగ్గురు నలుగురు ఛాయాగ్రహకులలో ఒకరిగా పనిచేసారని ఎప్పుడో ఏదో పత్రికలో చదివిన గుర్తు. అయితే ఈ విషయాన్ని ధృవీకరించే ఆధారాలు ఏవీ ఇప్పుడు నాకు దొరకలేదు. ఏది ఏమైనా 'చిరంజీవులు' చిత్ర ఔన్నత్యానికి వి.ఎన్.రెడ్డి ఛాయాగ్రహణం ఎంతో దోహదం చేసింది.

భావగాంభీర్యంతో కూడిన ఉదాత్త విషాదగీతాలు ఆలపించడంలో, స్వరపర్చడంలో ఘంటసాలగారిని మించినవారు లేరు. ఒక దశలో తమిళ నిర్మాతలు తమ చిత్రాలలోని విషాదగీతాలు రక్తికట్టడానికి తెలుగువాడైనప్పటికీ ఘంటసాలగారే పాడాలనే అభిప్రాయం లో వుండేవారు. ఆయన కంఠంలోని మహత్తు అలాటిది.  

ఘంటసాలగారి సంగీతదర్శకత్వంలో రూపొందిన 'చిరంజీవులు' తమిళంలో 'అమరగీతం' గా డబ్ చేసారు. తమిళనాట కూడా 'అమరగీతం'గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.


వచ్చేవారం  ఘంటసాలవారి  మరో సజీవరాగం తో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

1 comment:

  1. పేరులోనే కాదు.. నిజం చిరంజీవులు. ప్రత్యేకం గా ఘంటసాల గారి సంగీతం, గానం. శ్రీ స్వరాట్ గారికి ధన్యవాదములు... 🙏🙏🙏చల్లా సుబ్బారాయుడు

    ReplyDelete

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 8 - కనుపాప కరమైన కనులెందుకూ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...