Saturday, 27 September 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 101వ భాగం - ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

 "ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నూరవ భాగం ఇక్కడ

101వ సజీవరాగం - ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

చిత్రం - భూమికోసం
గానం - ఘంటసాల
రచన - శ్రీశ్రీ

సంగీతం - పెండ్యాల

పల్లవి:

ఎవరో వస్తారని ఏదో చేస్తారని 

ఎదురుచూసి మోసపోకుమా!

నిజం మరచి నిదురపోకుమా....

చరణం 1:

బడులే లేని పల్లెటూళ్ళలో-2

చదువేరాని పిల్లలకు

చవుడురాలే చదువుల బడిలో

జీతాల్ రాలని పంతుళ్ళకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

                                !ఎవరో వస్తారని!

చరణం 2:

చాలీచాలన పూరిగుడిసెలో-2

కాలేకడుపుల పేదలకు

మందులులేని ఆసుపత్రిలో

పడిగాపులు పడు రోగులకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

                                !ఎవరో వస్తారని!

చరణం 3:

తరతరాలుగా మూఢాచారపు వలలో 

చిక్కిన వనితలకు అజ్ఞానానికి అన్యాయానికి 

బలియైపోయిన పడతులకు 

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

                                !ఎవరో వస్తారని!

 చరణం 4:

కూలి డబ్బుతో లాటరీ టిక్కెట్ -2

కూలి డబ్బుతో లాటరీ టిక్కెట్ కొనే దురాశా జీవులకు

దురలవాట్లతో బాధ్యత మరచి చెడే నిరాశా జీవులకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

                                !ఎవరో వస్తారని!

 చరణం 5:

సేద్యం లేని బీడునేలలో ఓ....-2

పనులే లేని ప్రాణులకు

పగలు రేయి శ్రమపడుతున్నా ఫలితం దక్కని దీనులకు

ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా

                                !ఎవరో వస్తారని!

ఎన్నో శతాబ్దాలుగా మన దేశాన్ని, మన దేశమే ఏమిటి యావత్ప్రపంచాన్ని పట్టి కుదుపుతున్న ప్రధాన సమస్యలు Social injustice & economic inequality అంటే సామాజిక అన్యాయం మరియు ఆర్ధిక అసమానత్వం. వీటివల్ల కలుగుతున్న దురాగతాలనుండికష్టనష్టాలనుండి బక్కచిక్కిన బడుగు ప్రజలను రక్షించి ఉధ్ధరించాలని ఎందరో మహానుభావులు తరతరాలుగా శ్రమిస్తున్నారు, యింకా ఆ దిశగా కృషిచేస్తూనే వున్నారు. అయినా ఫలితం అంతంతమాత్రమే.

దున్నేవాడిదే భూమిప్రజలదే రాజ్యం అనే నినాదాలు కేవలం ఉపన్యాసాలకే పరిమితం. ఫలితం ఎక్కడవేసిన గొంగళి అక్కడే. విదేశీ పాలకుల కబంధహస్తాలనుండి విముక్తి కలిగి స్వరాజ్యంస్వాతంత్ర్యం లభిస్తే పేదప్రజల జీవనవిధానమే మారిపోతుందనే కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. జమిందారీ వ్యవస్థ రద్దువలనభూదానోద్యమాల వల్ల, మరేవేవో సంస్కరణల వలన సగటు మనిషి సమాజంలో ఉన్నతస్థాయికి చేరుకుంటాడని ఆశించినవారి కలలు ఇంకా పరిపూర్ణంగా సఫలీకృతం కాలేదు‌అవి పగటికలలుగానే మిగిలిపోతున్నాయి. కారణం ఏమిటి? లోపం ఎక్కడుందిఈ దుస్థితిని రూపుమాపడానికి సామాజిక స్పృహ కలిగిన సంస్కర్తలు,దీనజనోధ్ధారకులు తమవంతు కృషిని స్వార్ధరహితంగా చేస్తూనేవున్నా పేదా గొప్పా తారతమ్యాన్ని మాత్రం సమూలంగా నిర్మూలించలేకపోతున్నారు.

ఆలోచించి చూస్తే కారణాలెన్నో కనిపిస్తాయి. అట్టడుగు స్థాయిలో ఉన్న నిరక్షరాస్యత, బుధ్ధిహీనతతెలివిలేమి వారి అభివృద్ధికి అడ్డుకట్టగా నిలుస్తున్నాయి. తమ దైనందిక జీవితావసరాలు తీరడానికి, రెండుపూటలా ఇంత గంజి త్రాగడానికి  ఏ డబ్బున్న ఆసామినో ఆశ్రయించక తప్పడంలేదు. ధనికవర్గాలు సర్వవిధాల దోపిడీ చేసి ఆ పేదలను తమ చెప్పుచేతల్లో పెట్టుకొని తమ బానిసలుగా చేసుకుంటున్నారు.  నోట్లతో ఓట్లను కొని పదవులకు ఎగబ్రాకే రాజకీయ నాయకులంతా ఆ ధనికులకు వత్తాసుగా నిలుస్తున్నారు. క్రమంగా ఆ ధనికులే నాయకుల అవతారలెత్తుతున్నారు. 

దీనికి తోడు పేదలలోని అజ్ఞానంఒకే రాత్రిలో అప్పనంగా డబ్బు సంపాదించి కోటీశ్వరులైపోవాలన్న దురాశ. అందుకోసమై తప్పుడు దార్లు తొక్కడం. చాలీచాలని దినసరి కూలి డబ్బులను త్రాగుడు మీదలాటరీ టిక్కెట్ల మీద తగలేసి బాధ్యతారహితంగా బ్రతికేవారిలో  చైతన్యం  తీసుకువచ్చి వారిలోని పిరికిదనాన్ని పోగొట్టి ఆత్మస్థైర్యం కలిగేలా నవసమాజ స్థాపనే ధ్యేయంగా ఎందరో అభ్యుదయవాదులు కృషి చేశారు.

మనిషి తనకు తానుగా  ఆలోచించి సక్రమ మార్గంలో ఎదగడానికి ప్రయత్నించాలి. పరాన్నజీవులుగా బ్రతకడం మానుకోవాలి. నీ కష్టసుఖాలు నీవే. నిన్ను ఉధ్ధరించడానికి ఎవరో తోడు వస్తారని, ఏదో మేలు చేస్తారని ఆశిస్తూ ఎదురుచూడడం అవివేకం.  అలా ఏ స్వయంకృషి లేకుండా   అలసత్వంతో సోమరిగా గడిపితే మొదటికే మోసం వస్తుందంటున్న ఘంటసాల మాస్టారు ఆలపించిన శ్రీశ్రీ ప్రబోధ గేయమే నేటి మన సజీవరాగం... అదే...

'ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదురపోకుమా....'

 ప్రజలను మేల్కొలిపి వారికి కావలసిందేమిటో వారే తెలుసుకునేలా చేయడమే ఈ గీతం లక్ష్యం. వామపక్ష భావజాలం కలిగి అట్టడుగు వర్గ సమాజానికేదో మంచి ఉద్బోధ చేయాలనే తలంపుతో కె.బి.తిలక్, శ్రీశ్రీ, సుంకర , పీపుల్స్ వార్ గ్రూప్  వ్యవస్థాపకుడు కె.జి.సత్యమూర్తి మొదలగువారి సమిష్టి కృషి ఫలితమే 1974లో వచ్చిన  ' భూమికోసం'.

సుప్రసిద్ధ సీనియర్ హిందీ నటుడు అశోక్ కుమార్ ఈ చిత్రంలో అతిధి నటుడిగా కనిపించడం ఒక విశేషం. సాత్వీక మైన పాత్రలలో కనిపించే అశోక్ కుమార్ 'భూమికోసం' లో స్వార్ధపరుడైన  దుష్ట జమీందారుగా నటించడం మరో విశేషం. సామాన్య ప్రజలకు అండగా నిలిచే వ్యక్తిగా జమీందారు కుమారుడిగా జగ్గయ్య, కుమార్తె గా జమున నటించారు. లలితారాణి అనే నూతన నటిని జయప్రదగా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం చేసింది  ఈ 'భూమికోసం'.

ఘంటసాలగారు పాడి, ఆయన నిర్యాణం తర్వాత ఎనిమిది మాసాలకు విడుదలైన సినిమా 'భూమికోసం'. ఈ సినిమా లో ఘంటసాలగారు పాడిన ఏకైక గీతం 'ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకుమా'. ఈ పాటను కథానాయకుడి స్నేహితుడు, శ్రేయోభిలాషి, సమాజ శ్రేయస్సుపై  అక్కరగల పాత్రలో నటించిన గుమ్మడిపై చిత్రీకరించారు.

అనుపమ ఫిలింస్ ఆస్థాన సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావుగారే ఈ సినిమాకు కూడా సంగీతదర్శకుడు.

కరుణ, శోకం, భక్తి,విరహంప్రేమ వంటి రసాల ప్రకటనకు ఎంతో అనువైన రాగం సింధుభైరవి. కర్ణాటక సంగీతంలో 8వ మేళకర్త అయిన హనుమత్తోడికి జన్యరాగం. అక్బర్ ఆస్థాన విద్వాంసుడు మియా తాన్సేన్ ఈ సింధుభైరవి రాగాన్ని ఉత్తరభారతదేశంలో బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చాడని చెపుతారు. అసావేరీ థాట్ కు జన్యరాగం. ఈ సింధుభైరవి రాగంలో అసంఖ్యాకమైన సినిమా పాటలు అన్ని భాషలలో వచ్చాయి. మన తెలుగు సినిమా సంగీతదర్శకులకు, నిర్మాతా దర్శకులకు అత్యంత ప్రీతిపాత్రమైన రాగం సింధుభైరవి. ఈ రాగంలో ఘంటసాల మాస్టారు స్వరపర్చి గానం చేసిన పాటలెన్నో అత్యంత జనాదరణ పొందాయి. అటువంటి ఘనత వహించిన సింధుభైరవి రాగంలో పెండ్యాలగారు 'ఎవరో వస్తారని' అనే పాటను  చాలా చక్కగా స్వరపర్చారు.

పాటలోని ప్రతీ చరణానికి ముందు వచ్చే మొదటి లైన్ ను సాకీగా మలచి మూడు చరణాలకు మూడు సాకీలు చేశారు. డప్పుచిటికలుమువ్వలుమేండొలిన్తబలా, డోలక్ వంటి వాద్యాలను చాలా సమర్థవంతంగా పెండ్యాల ఈ పాటలో ఉపయోగించారు.

శోకశాంతఉదాత్తభావాలను  వ్యక్తపరుస్తూ ప్రేక్షకుల మనస్సులలో అవ్యక్తమైన ఉద్వేగం రేకెత్తిస్తూ హృదయాలకు హత్తుకునేలా ఘంటసాల మాస్టారు ఈ ప్రబోధగీతాన్ని  ఆలపించారు. గుమ్మడిఘంటసాల కలయిక  ఈ పాటకు మంచి రాణింపునిచ్చింది.

భూమికోసం జరిగిన పోరాటాలలో పాల్గొని పోలిస్ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయిన తన సోదరుడు రామనరసింహారావుకు, అశువులుబాసిన  మరెందరో త్యాగమూర్తులకు  కె.బి.తిలక్ 'భూమికోసం' చిత్రాన్ని అంకితం చేశారు.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

Saturday, 20 September 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 100వ భాగం - విరిసే కన్నులలో వేయిబాసలున్నవిలే

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
తొంభతొమ్మిదవ భాగం ఇక్కడ

100వ సజీవరాగం - విరిసే కన్నులలో వేయిబాసలున్నవిలే

చిత్రం - డాక్టర్ బాబు
గానం - ఘంటసాల
రచన - సి.నారాయణ రెడ్డి

సంగీతం - టి.చలపతిరావు

పల్లవి:

విరిసే కన్నులలో వేయిబాసలున్నవిలే

అవి నా గుండెలలో అల్లరి చేస్తున్నవిలే

                                                    !విరిసే!

చరణం 1: 

నీ కనుపాపలే వినీల కాంతి దీపాలు

నీ చిరునవ్వులే వెన్నెలల పారిజాతాలు

నీ సొగసే నాదైతే నీ సొగసే నాదైతే

కలకలలాడులే వసంతాలు..

                                                    !విరిసే!

చరణం 2: 

ఎదురుగ నువ్వుంటే ఉదయకాంతులెందుకులే

జతగా నువ్వుంటే జాబిలి ఇంకెందుకులే

నీ వలపే నాదైతే నీ వలపే నాదైతే

ఏ బృందావనాలు ఎందుకులే...

                                                    !విరిసే!

ఓ పాత తెలుగు సినిమాలో హీరోయిన్ (భానుమతి) 'ప్రేమంటే'... అని అడుగుతుంది హీరో (నాగేశ్శర్రావు) ని. దానికి హీరో ఏం చెప్పాడో నాకు ఇప్పుడు గుర్తులేదు. ఆ సినిమా పేరు కూడా గుర్తులేదు.

'ఆశ అరవైనాళ్ళు-మోహం ముఫ్ఫైనాళ్ళు' అని ఓ సామెత. ప్రేమలో నిజాయితీ గానిగాఢత్వంగాని లేకుండా  కేవలం బాహ్యాకర్షణ వలన కలిగిన వ్యామోహమే ప్రేమగా చెలామణి అవుతోంది ఈ రోజుల్లో, అలాటివారిని ఉద్దేశించిన సామెత. ఎంతో సత్యమున్న సామెత. 'వయసు పిచ్చిది, ప్రేమ గుడ్డిది, మనసొక కళ్ళెం లేని కోర్కెల గుర్రం. పగ్గాలొదిలితే అంతా అస్తవ్యస్తమే. మనస్సు ప్రేరణతో మోహావేశాలకులోనైనప్పుడు  ఏర్పడిన ప్రేమ తాత్కాలికం.  నీటిబుడగలా ఏ క్షణాన్నైనా పేలిపోవచ్చు. అలాకాకుండా, విచక్షణతో తమ తమ వ్యక్తిత్వాలకు భంగం కలుగకుండా ఒకరినొకరు సంపూర్ణంగా అర్ధం చేసుకొని  ఎట్టి పరిస్థితులలోనైనా జీవితాంతం  స్వార్ధరహితంగా, నిష్కల్మషంగా కలసిమెలసి ప్రేమానురాగాలతో జీవనయానం చేస్తామనే దృఢనిశ్చయం కలిగినవారి మధ్య అంకురించిన ప్రేమే  నిజమైన ప్రేమ. అలాటి ప్రేమ మూడు పువ్వులు ఆరుకాయలుగానిత్యకళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంది. ముగ్ధమనోహరంగా అరవిరిసిన కన్నుల్లో ఎన్నో ఆశలు, ఊసులుమౌన భాషలు, చెప్పలేనన్ని బాసలు. అవి వలచినవాడి గుండెల్లో రేపే అల్లరులు అన్నీ ఇన్నీకావు. ప్రేయసి చిరునవ్వులే వెన్నెల పారిజాతాలు, ఆమె కనుపాపలే వినీలకాంతి దీపాలు. అటువంటి సుందరి సొగసులే తన సొంతమైతే వసంతమంతా కలకలలాడుతూ తన జీవితమంతా  ప్రకాశిస్తుందని భావించే ఓ నవయువకుని మనోగతమే నేటి మన సజీవరాగం. అదే డాక్టరు బాబు సినీమాలోని డా.సి.నారాయణరెడ్డి గారి భావుకతలో నుండి పుట్టి ఘంటసాలవారి గళం నుండి జాలువారిన మనోజ్ఞ ప్రణయగీతం 'విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే...'

డాక్టర్ బాబు సినిమా కు సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావుగారు. యువతరం మెచ్చే అధునాతన చలాకీ పాటలతో పాటు మనసుకు ఆహ్లాదం కలిగించే మెలోడియస్ గీతాలను స్వరపర్చడంలో కూడా చలపతిరావు గారు ఆరితేరిన దిట్ట. 'విరిసే కన్నులలో వేయిబాసలున్నవిలేపాటను రూపొందించడానికి ఆయన ఎన్నుకున్న రాగం దర్బారీ కానడ. దర్బారీ కానడ పేరు వినగానే సంగీతాభిమానులందరికీ వెంటనే స్ఫురణకు వచ్చే అద్భుతగీతాలు 'శివశంకరీ; 'నమో భూతనాధా'. రెండూ పెండ్యాల గారివేవిజయావారి కోసం చేసినవి. వేర్వేరు సన్నివేశాలకోసం విభిన్నమైన మూడ్ లో చేసినవి. ఇక్కడ డాక్టరు బాబు సాంఘికం. తాను ప్రేమిస్తున్న మనోహరి నుద్దేశించి కథానాయకుడు ఆలపిస్తున్న ప్రణయగీతం.  రాగం ఒక్కటే కానీ  దానిని పరిపరివిధాలుగా మలచడంలో సంగీతదర్శకుని, గాయకుని ప్రతిభ, మనోధర్మం సుస్పష్టంగా తెలుస్తుంది. దర్బారీ కానడ సున్నితమైన వివిధ మనోభావాలను సుశ్రావ్యంగా వెలిబుచ్చడానికి అనువైన రాగం. 

ఈ రాగం కర్ణాటక, హిందుస్థానీ శైలులు రెండింటిలో చాలా ప్రసిధ్ధమైనది. 20వ మేళకర్త నఠభైరవికి జన్యరాగం. వక్ర సంపూర్ణరాగంగా చెపుతారు.కర్ణాటక సంగీతంలో చిరకాలంగా ప్రచారంలో వున్న ఈ దర్బారీ కానడ రాగం 16వ శతాబ్దపు సుప్రసిద్ధ హిందుస్థానీ సంగీత విద్వాంసుడు మియా తాన్సేన్ ద్వారా ఉత్తర భారతదేశానికి పరిచయం చేయబడింది. ఈ దర్బారీ కానడ రాగంలో ఘంటసాలగారు ఆలపించిన సినిమా గీతాలు ఎన్నో బహుళ జనాదరణ పొందాయి. వాటిలో ఈనాటి 'విరిసే కన్నులలోపాట కూడా గత ఐదు దశాబ్దాలుగా  ఘంటసాల మాస్టారి సజీవరాగంగా సంగీతాభిమానులకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది. ఈ పాట విడియో చూడకుండా ఆడియో విన్నాకూడా మన కళ్ళముందు శోభన్ బాబు మెదులుతారు. అది ఘంటసాలవారి ఘనత. శోభన్ బాబు వాయిస్ మాడ్యులేషన్ ఈ పాటలో స్పష్టంగా వినిపిస్తుంది. చరణాలలో  'నీ సొగసే నాదైతే', అలాగే, 'నీ వలపే నాదైతే' అనే మాటలు రెండుసార్లు రిపీట్ అవుతాయి. అప్పుడు  'నీ' అనే అక్షరం మీద ఘంటసాల మాస్టారు  రెండుసార్లు ఇచ్చిన గమకాలు పాటకి నిండుదనాన్ని, ఎంతో మాధుర్యాన్ని కలిగిస్తుంది. పియోనా వ్యాపింగ్ బిట్ తో పాట మొదలవుతుంది. సితర్, ఫ్లూట్, వైయొలిన్స్, షెహనాయ్, తబలాడోలక్ వంటి వాద్యాలను చలపతిరావు ఉపయోగించుకున్నారు.

పాట మూడ్ కి తగినట్లుగా తెరమీద శోభన్ బాబు, జయలలిత చాలా హుందాగా నటించారు. ఇదే పాట సుశీలగారు పాడగా సినిమా ద్వితీయార్ధంలో  జయలలిత మీద మరోసారి విషాదంగా చిత్రీకరించారు. ఈ సినిమాకు మనోజ్ కుమార్, మాలాసిన్హా నటించిన 'హిమాలయ్ కె గోద్ మే' అనే హిందీ సినిమా మూలం. అదే సినిమా తమిళంలో ఎమ్.జి.ఆర్జయలలిత జోడీగా 'పుదియబూమి' (తమిళ లిపిలో ఒత్తులుండవు) పేరుతో వచ్చింది. తెలుగులో జయలలిత హీరోయిన్ గా నటించడానికి ఇదో కారణం కావచ్చు. ఈ తమిళ సినీమాను తాపీ చాణక్య డైరక్ట్ చేశారు.

డాక్టరు బాబు సినిమాలో ఘంటసాల మాస్టారు పాడిన రెండు పాటల్లో బహుళ ప్రచారమై ఈనాటికీ అందరిచే పాడబడుతూ సజీవరాగం గా నిలిచింది 'విరిసే కన్నులలో వేయి బాసలున్నవిలే' పాట మాత్రమే.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

Saturday, 13 September 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 99వ భాగం - ఘనా ఘన సుందరా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
తొంభయెనిమిదవ భాగం ఇక్కడ

99వ సజీవరాగం - ఘనా ఘన సుందరా 

చిత్రం - భక్త తుకారం
గానం - ఘంటసాల
రచన - 
దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం - పి.ఆదినారాయణరావు

పల్లవి:

ఘనా ఘన సుందరా

కరుణా రస మందిరా

 

అనుపల్లవి:

అది పిలుపోమేలుకొలుపో

నీ పిలుపోమేలుకొలుపో

అది మధుర మధుర మధురమౌ

ఓంకారమో!

పాండురంగ... పాండురంగ...!ఘనా!

 

చరణం 1:

ప్రభాత మంగళ పూజా వేళ

నీ పద సన్నిధి నిలబడి

నీ పద పీఠిక తలనిడి! -2

నిఖిల జగతి నివాళులిడగా-2

వేడగా,కొనియాడగా

పాండురంగ....పాండురంగ

                            !ఘనా.... ఘన...!

చరణం 2: 

గిరులుఝరులువిరులూ తరులూ

నిరతము నీ పద ధ్యానమే

నిరతము నీ నామగానమే!గిరులూ!

సకల చరాచర లోకేశ్వరేశ్వర-2

శ్రీకరా! భవహరా!

పాండురంగ! పాండురంగ

పాండురంగ!పాండురంగ!

పాండురంగ

లోకేశ్వరేశ్వరా! శ్రీకరా! భవహరా! పాండురంగా! ఈ విశ్వములోని చరా చరములుగిరులు,  ఝరులువిరులుతరులు సకలము నీ పద ధ్యానమేనిరతము నీ పాద ధ్యానమే... అంటూ ఓ భక్తుడు ప్రభాత సమయాన భగవంతుని నామ స్మరణలో తన్మయత్వం చెంది పరవశించిపోతున్నాడు.  ఆ భక్తుడు చేసిన నామ సంకీర్తనమే ఈనాటి సజీవరాగం. అదే 'భక్త తుకారాం చిత్రం కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి సాహిత్యానికి తదాత్మ్యంతో ఘంటసాలగారు గానం చేసిన 'ఘనాఘన సుందరా కరుణా రసమందిరా!' అనే భక్తిగీతం. 

నవ విధ భక్తి మార్గాలలో 'కీర్తనం' ఒకటి. భగవంతుని గుణగణాలను అనేక నామాలతో కీర్తిస్తూ, భగవంతుని ఏకాగ్రచిత్తంతో పూజించడం. జ్ఞానశూన్యులై లౌకిక వ్యామోహాలతో, రకరకాల ప్రలోభాలకు లోనయి మూఢాచారాలతో సమాజం నిర్వీర్యమైపోతున్నప్పుడు పామరజనులనుకుహానా పండితులను జాగృదవస్థకు తీసుకువచ్చి, వారిని చైతన్యవంతులను చేయడానికి మహామహులెందరో అహర్నిశలు కృషి చేశారు. ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి ఎన్నో మార్గాలను అనుసరించారు. అందులో భక్తిమార్గం ఒకటి. స్వార్ధంతో, స్వలాభ చింతనతో నాస్తికవాదులు వితండవాదనలు చేస్తూ భగవంతుని ఉనికినే ప్రశ్నిస్తూ సంఘ విద్రోహక శక్తులుగా మారి సనాతన ధర్మాన్ని కూకటివ్రేళ్ళతో పెకలించే తరుణంలో  భక్తి ఉద్యమాన్ని ఒక ఆయుధంగా చేసుకొని ఎందరో మహానుభావులు సమాజ సంక్షేమం కోసం తీవ్రంగా కృషిచేశారు.   భక్తి చింతన ద్వారా ప్రజలలో సాత్విక గుణాలను పెంపొందించి, నిరంతర భగవధ్యానంతో  సన్మార్గాన జీవనం చేస్తూ అంతిమంగా ముక్తిని సాధించడమే ధ్యేయంగా సాధు సత్పురుషులెందరో కృషిచేశారు. 6,7 శతాబ్దాల కాలంలోనే దక్షిణ భారతదేశంలో ప్రారంభమైన ఈ భక్తి ఉద్యమం మరో పది శతాబ్దాల నాటికి ప్రాక్పశ్చిమఉత్తర భారత ప్రాంతాలన్నింటికి తీవ్రంగా వ్యాపించింది. నవ విధ భక్తి మార్గాలతో సామాన్య ప్రజలకు జ్ఞానబోధ జరిగింది.

15-17 శతాబ్దాల మధ్యకాలంలో భక్తి ఉద్యమం మహారాష్ట్ర దేశంలో ముమ్మరంగా సాగింది. అనేకమంది సాధు సత్పురుషులకు జన్మస్థలం మహారాష్ట్ర దేశం. ధ్యానేశ్వర్, నామదేవ్ఏక్ నాథ్సక్కుబాయి, మీరాబాయి, సమర్థ రామదాసు వంటి మహాభక్తులు తమ భక్తిగానాలతో తాము తరించడమే కాక సామాన్య ప్రజానీకానికి మార్గదర్శకులయ్యారు. అలాటివారిలో తుకారాం ఒకడు. ఈయన మరాఠా సింహం ఛత్రపతి శివాజీ మహరాజ్ కాలంనాటివాడు. శ్రీవైష్ణవ భక్తుడు. పండరిపురంలో వెలసియున్న పాండురంగ విఠలుని పరమభక్తుడు.  తరచూ పండరినాథుని దర్శించడమే తమ విధిగా భావించే కుటుంబంలో జన్మించినవాడు. 'మానవసేవయే మాధవసేవగా' భావించినవాడు. సమాజంలో అగ్రకులాల వారి మత మౌఢ్యాన్నిదురాచారాలను,స్వార్థపరత్వాన్ని తీవ్రంగా నిరసిస్తూ, తన భక్తిగానంతో వాడవాడలా పర్యటించి ప్రజలను ఎంతో ప్రభావితం చేశాడు. ఆ క్రమంలో తుకారాం ఎన్నో భక్తిగీతాలను రచించాడు. మరాఠీ భాషలో వాటిని అభంగాలని అంటారు.

అలాంటి అభంగ గీతాలకు తెనుగు రూపమే ఈనాటి మన సజీవరాగం - 'ఘనాఘన సుందరా కరుణా రస మందిరా!' అనే అపురూపమైన ఘంటసాలవారి భక్తిగీతం. సంగీతరస ప్రధానంగా జనరంజకమైన చిత్రాలకు పెట్టింది పేరు అంజలీ పిక్చర్స్. నటి అంజలీదేవిఆమె భర్త సుప్రసిద్ధ సంగీతదర్శకుడు పి.ఆదినారాయణ రావు మంచి అభిరుచి గల చిత్రనిర్మాతలు. ఆ సంస్థ నిర్మించిన మంచి భక్తిరస ప్రధాన చిత్రమే 'భక్త తుకారాం'. శాస్త్రీయ రాగాలమీద మంచి పట్టున్న ఆదినారాయణరావుగారు రాశిపరంగా తక్కువ సినిమా లకే సంగీత దర్శకత్వం వహించినా వాసిలో మాత్రం అగ్రగణ్యులే. ఆదినారాయణరావుగారు సంగీత దర్శకత్వం వహించిన చిత్రాలలో మనసుకు హాయినిప్రశాంతిని కలిగించే సుశ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంది. ఆయన తన సినిమాలలో ఎక్కువగా హిందుస్తానీ శైలిని అనుసరిస్తారని చెపుతారు. అంజలిఆదినారాయణరావు చిత్రాలలో ఘంటసాలగారు పాడిన పాటలెన్నో విపరీతమైన జనాదరణ పొందాయి. ఆదినారాయణరావుగారికిఘంటసాలగారికి మధ్య మంచి అవగాహన వుండేది.  పరస్పర గౌరవ మర్యాదలతో చాలా సన్నిహితంగా వుండేవారు. గాయకుడిగా ఘంటసాలగారికి మంచి స్వేచ్ఛనిచ్చేవారు ఆదినారాయణరావుగారు. ఎంతకాలమైనా ఫర్వాలేదు ఘంటసాలగారే భక్త తుకారాం లోని పాటలు పాడాలని దృఢనిశ్చయంతో ఆదినారాయణ రావుగారు ఆ చిత్రనిర్మాణం సాగించారు. అనారోగ్య కారణాలవలన గొంతు సహకరించక కొన్ని పాటల ట్రాక్ లను రామకృష్ణ చేత పాడించడంమిక్సింగ్ సమయంలో ఘంటసాలగారు ఆ పాటలను విని అవే పాటలను సినిమాలో వుంచమని చెప్పి నూతన గాయకుని ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది.

భక్త తుకారాం  చిత్రం భక్తిజ్ఞానవైరాగ్యాలతో కూడుకొని సంగీతనృత్య సాహిత్యాలు మూడింటికి మంచి ప్రాధాన్యత కల్పించిన చిత్రం. అనుభవజ్ఞులైన నటీనటుల అద్భుత నటనాపాటవంతో భక్త తుకారాం చిత్రం ఉత్తమ విలువలతో రూపొందింది. ఇక సంగీతపరంగా అద్భుత విజయాన్నే సాధించింది. చిత్రంలోని ఇరవైయొక్క పాటలుపద్యాలు సంగీతాభిమానులను ఎంతగానో అలరించాయి. వాటిని రచించిన దేవులపల్లి, దాశరథి, ఆత్రేయ, సి.నా.రె., వీటూరి అందరూ గీత రచయితలు గా లబ్దప్రతిష్టులే. వీరి కలం బలంతో ప్రతీ పాటపద్యము ఆణిముత్యాలై భాసిల్లాయి.

ఈ సినిమా లో ఘంటసాలగారు ఐదు పాటలునాలుగు పద్యాలు పాడారు. వాటిలో మకుటాయమానంగా నిలచిపోయిన గీతం కృష్ణశాస్త్రిగారు వ్రాసిన నేటి సజీవరాగం - 'ఘనాఘన సుందరా...' కృష్ణశాస్త్రిగారి ఈ గీతంలో పద పటాటోపం కనపడదు. మాటలు సరళంగాక్లుప్తంగా వుంటాయి. దైవసన్నిధిలో భక్తులు పాటించవలసిన నియమాలు ఈ పాటలో కనిపిస్తాయి.  పాండురంగ నామ సంకీర్తనం ద్వారా శరణాగతినిఆత్మాశ్రయాన్ని సూచించారు. కవి హృదయగత భావాలను తన గానంతో మూర్తిమంతం చేశారు 'పాండురంగ' నామాన్ని ఉచ్ఛరించిన ప్రతీసారీ మాడ్యులేషన్ లో వైవిధ్యాన్ని చూపించడం ఆయనకే చెల్లు.

తంబురా శ్రుతి మీద  'హరి ఓం...' అంటూ ఓంకార నాదాన్ని పూరిస్తూ ఘంటసాల చేసిన ఆలాపన ప్రభాత సమయాన్నిసుందర ప్రకృతిని కళ్ళకు సాక్షాత్కరింపజేసి శ్రోతల ఒడలు గగుర్పొడిచేలా చేస్తుంది. ఈ పాటలో ఘంటసాలవారి గళం మృదువుగా, గంభీరంగా, ఘనంగా ధ్వనించి అందరిలో భక్తిభావాన్ని ఇనుమడింప జేస్తుంది.

ఈ పాట వాతావరణానికిసన్నివేశానికి తగినట్లుగా ఈ పాటను స్వరపర్చడానికి ఆదినారాయణరావుగారు 'భూప్' రాగాన్ని ఎన్నుకున్నారు. 'భూప్', లేదా'భూపాలి' ఒక హిందుస్థానీ రాగం.కళ్యాణ్ థాట్ జన్యం. భక్తి రస ప్రధానం. ఈ రాగం ఆరోహణఅవరోహణాక్రమంలో ఐదే స్వరాలుంటాయి. (మ)ధ్యమ,(ని)షాదాలు వర్జితాలు. ఔఢవజాతి రాగం. దీనికి సమాంతరమైన కర్ణాటక రాగం 'మోహన'. విజ్ఞతతో ఆదినారాయణ రావుగారు 'భూప్' రాగంలో స్వరపరిచిన 'ఘనాఘన సుందరా' గీతం బహు కమనీయంరమణీయం. 

ఈ పాటలో తంబురా, సితార్, షెహనాయ్హార్ప్ఫ్లూట్, వైబ్రోఫోన్, వైలిన్స్, సెల్లోతబలాడోలక్ మొదలైన వాద్యాలతో atmosphere effect కోసం ఎకో సౌండ్ ను చాలా చక్కగా ఉపయోగించారు. 

ఘంటసాలఅక్కినేని, ఒకరిలో ఒకరు కలసిపోయి  'ఘనాఘన సుందరా' గీతంలో జీవించారు. ప్రాతఃకాల సమయంలో గత కాలం నాటి పల్లెటూరి వాతావరణాన్ని, ప్రకృతి శోభను పాటలో  చక్కగా చూపించారు.

అంజలీదేవికాంచననాగభూషణం, తదితర నటీనటులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేకూర్చి చిత్ర విజయానికి దోహదం చేశారు. తెరపై కనిపించేది కొద్దిసేపైనా నడిగర్ తిలకాన్నని నిరూపించారు ఛత్రపతి శివాజీ పాత్రధారి శివాజీ గణేశన్. విల్లుపురం చిన్నయ మన్రయార్ గణేశమూర్తి అనే సామాన్య రంగస్థలనటుని ప్రపంచ విఖ్యాత శివాజీ గణేశన్ గా మార్చింది రంగస్థలం మీది ఈ వీరశివాజీ పాత్రే. భక్తి రక్తితో పాటు సామాజిక స్పృహ కలిగిన 'భక్త తుకారాం' కధను చాలా రసవత్తరంగా తెరకెక్కించిన ఘనత  డైరెక్టర్ వి.మధుసూదనరావుగారికి దక్కుతుంది. 

ఆదినారాయణరావుగారి సంగీతంఘంటసాలవారి గానం వలన అంజలీవారి ఉత్తమ చిత్రాల కోవలోకి చేరే 'భక్త తుకారం' చిరకాలం గుర్తుండిపోయే చిత్రం.

వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్ 

Saturday, 6 September 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 98వ భాగం - ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
తొంభైయేడవ భాగం ఇక్కడ

98వ సజీవరాగం -  ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో

చిత్రం - జీవనతరంగాలు
గానం - ఘంటసాల
రచన - ఆత్రేయ

సంగీతం - 
జె.వి.రాఘవులు

సాకీ  

పదిమాసాలు మోశావు పిల్లలను

బ్రతుకంత మోశావు బాధలను

ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు

లేక వెళుతున్నావు......

పల్లవి:

ఈ జీవన తరంగాలలో  ఆ దేవుని

చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము

ఎంతవరకీ బంధము....

చరణం 1:

కడుపు చించుకు పుట్టిందొకరు

కాటికి నిన్ను మోసేదొకరు

తలకు కొరివి పెట్టేదొకరు

ఆపై నీతో వచ్చేదెవరు..

ఆపై నీతో వచ్చేదెవరు

                            !ఈ జీవన!

చరణం 2:

మమతే మనిషికి బందిఖానా

భయపడి తెంచుకు పారిపోయినా

తెలియని పాశం వెంటపడి

ఋణం తీర్చుకోమంటుంది! 2!

నీ భుజం మార్చుకోమంటుంది

                            !ఈ జీవన!

చరణం 3:

తాళికట్టిన మగడు లేడని

తరలించుకుపోయే మృత్యువాగదు -

ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు -

ఆ కన్నీళ్ళకు చితిమంటలారవు -

ఈ మంటలు గుండెను అంటకమానవు

                            !ఈ జీవన!

చరణం 4

మమతే మనిషికి బందిఖానా

భయపడి తెంచుకు పారిపోయినా

తెలియని పాశం వెంటపడి ఋణం

తీర్చుకోమంటుంది 

                            !ఈ జీవన!

 

మనిషి జీవితం క్షణభంగురంమూన్నాళ్ళ ముచ్చట. ఈ క్షణిక జీవనకాలంలో ఎన్ని మమతలుమమకారాలుమోహాలుప్రలోభాలుఅహంకారాలుఈర్ష్యాద్వేషాలతో కూడిన అజ్ఞానం తొలగించుకొని ముక్తిసాధనకోసం మనిషి తరతరాలుగా పరితపిస్తూనే వున్నాడు. జీవితంపట్ల వైరాగ్యం పెంచుకొని సంసారబంధాలను త్రెంచుకొని సంఘానికి దూరంగా ఏ అడవుల్లోనో దైవాన్ని అన్వేషిస్తూ తపోనిష్టలో మునిగివుండేవారు కొందరైతేగృహస్థాశ్రమంలోనే వుంటున్నా ఏ రకమైన మమతలకుపాశాలకు లొంగకుండా తామరాకు మీది నీటిబొట్టులా వుండేవారు కొందరు. వీరందరికీ వారు ఆశించే ఆనందం, మనశ్శాంతి లభిస్తోందా? వారనుకున్న గమ్యానికి చేరుకుంటున్నారా? వారి వారి జీవితానుభవాలే ఆ విషయం తేల్చగలదు.

మనిషి మేథకు అతీతమైన శక్తి ఏదో భగవంతుడనే పేరుతో మనిషిని తన చెప్పుచేతల్లో వుంచుకొని ఆడిస్తోంది. భగవంతుడు ఆడే జీవన చదరంగంలో మనుషులంతా చిన్న చిన్న పావులే. ఎవరికి ఎవరూ సొంతమూ కాదు, ఏ బంధమూ శాశ్వతమూ కాదు. కానీమనిషై పుట్టాక  ఏదో సందర్భంలో అశాశ్వతమైన మాయా మోహాలుప్రేమ, మమకారాలనే సుడిగుండంలో చిక్కుకొని ఆ కష్టాల వలయంలోనుండి బయటపడలేక  వైరాగ్యం లో పడతాడు. జీవితమంటే విరక్తిపుడుతుంది. ద్వైదీభావంతో సతమతమౌతూంటాడు. మనసు పరిపరివిధాల ఆలోచిస్తూ విలపిస్తూంటుంది. అలాంటి వైరాగ్య భావాల సమ్మిళిత గీతమే నేటి ఘంటసాలవారి సజీవరాగం. అదే - 'ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము...' 'జీవన తరంగాలు' అనే  1973 నాటి సినిమాలోని సన్నివేశాత్మక శోకమయగీతం.

ఈ రకమైన గీతాలను విన్నప్పుడల్లా మనకు జీవితమంటే ఒక రకమైన వైరాగ్యంవిరక్తి ఏర్పడుతుంది. అందులోనూ ఘంటసాలగారి వంటి అసాధారణ గాయకుడు పాడుతుంటే ఆ పాటలోని సాహిత్యం, సంగీతం ఆ గళంలోని గంభీర భావోద్వేగం మనలను కట్టి కుదుపుతుంది. ఆ ప్రభావం నుండి బయటపడడానికి కొంతకాలం పడుతుంది. సగటు మనిషి జీవితంలో సుఖసంతోషాల కంటే కష్టాలపాలే ఎక్కువ. అందువలన కలిగే నిరాశానిస్పృహలు భరించలేక జీవితం పట్ల వైరాగ్యం, విరక్తి ఏర్పడకతప్పదు.

నిజానికి మనకు కలిగే వైరాగ్యాలు, వాటి ప్రభావాలు ఏవీ శాశ్వతంకావు. కలకాలం మనలను అంటిపెట్టుకొనివుండవు. మరపు అనే లక్షణాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. అందువలన గతంలోని  కష్టనష్టాలను మరచిపోయి వైరాగ్యం నుండి బయటపడతాడు. నిరాశానిస్పృహలకు దూరమవడం జరుగుతుంది. సరాసరి మనిషికి కలిగే వైరాగ్యాలు క్షణికమైనవితాత్కాలికమైనవి. మామూలుగా దైనందిక జీవితంలో మనం పొందే వైరాగ్యానుభవాలు - ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, దంత వైరాగ్యం, భక్తి వైరాగ్యం, వగైరాలు. ఇవన్నీ మన మనసుకు సంబంధించినవే.

జీవనతరంగాలు సినిమా లో సన్నివేశపరంగా దృశ్యరూపంలో మనం చూసే ఒక బాధిత స్త్రీ అంతిమయాత్ర కేవలం నాలుగైదు నిముషాలే అయినాఅప్పుడు కలిగే శ్మశాన వైరాగ్యం హృదయమున్న ప్రేక్షకులను చిరకాలం పట్టి పీడిస్తూనేవుంటుంది. అందుకు కారణం అర్థవంతమైన ఆత్రేయగారి సాహిత్యం, ఆర్ద్రమైన ఘంటసాలమాస్టారి గళం బలం. 

ఘంటసాలవారి దగ్గర దాదాపు 17 సంవత్సరాల శిష్యరికానికి సార్ధకతగా జె.వి.రాఘవులుగారు స్వరపర్చిన మరపురాని గీతం 'ఈ జీవనతరంగాలలో'. రాఘవులుగారి పట్ల ఘంటసాలమాస్టారి మమతానురాగాలకుస్నేహానుబంధాలకు తర్వాత జరిగిన పరిణామాలకు --- 'ఈ జీవనతరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధముఅనే మాటలు అక్షరాలా వర్తిస్తాయి.

జట్టి వీర (అనే గుర్తు) రాఘవులుగారిని 1955 నుండి మాస్టారి నిర్యాణం వరకు బాగా ఎరుగుదును. కోదండపాణిఅప్పారావు లాగే గాయకుడిగా చిత్రసీమలో ప్రవేశించి సంగీతదర్శకుడిగా స్థిరపడ్డారు. ఘంటసాల స్వరప్రభంజనం కారణంగా కొన్ని దశాబ్దాల పాటు పురుష గాయకులెవరు సక్రమంగా నిలబడలేకపోయారు. విజయవాడ రేడియో కేంద్రంలో లలిత గీతాలు పాడుకునే రాఘవులుగారిని ఘంటసాలగారే 1953 ప్రాంతాలలో మద్రాసుకు తీసుకువచ్చి తన చిత్రాలలో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు.

ప్రతీ రోజూ ఉదయాన్నే ఎనిమిది గంటలకల్లా మాస్టారింటికి వచ్చి రాత్రిదాకా వుండేవారు. 'అయ్యగారు, అమ్మగారు' అంటూ ఇంట్లో చాలా కలివిడిగా తిరిగేవారు. ఆయనతోపాటే రికార్డింగ్ లకు, పాటల రిహార్సల్స్ కు కూడా వెళ్ళి సినిమా సంగీతంలోని మెళకువలను నేర్చుకున్నారు. ఘంటసాలగారి కచేరీలలో వంతపాట పాడేవారు. ఒక్కోసారి రికార్డింగ్ ల నుండి రావడం లేటయితే మాస్టారింట్లోనే భోజనం చేసేవారు. ఘంటసాలగారు రాఘవులును తన సొంతమనిషిలా కుటుంబ సభ్యుడిగా ఆదరించి ప్రేమగా చూసుకునేవారు. దాదాపు ఓ పదిహేను సంవత్సరాలు ఘంటసాలగారి దగ్గర అంత నమ్మకంతో మెసిలిన రాఘవులు గారికి ఘంటసాలగారి వద్ద తన పురోభివృద్ధికి తగిన అవకాశాలు లభించవనే భావన కలిగి తానే స్వతంత్రంగా సంగీతదర్శకుడిగా రాణించాలనే కోరిక ప్రబలి ఘంటసాలగారి వాద్యబృందంనుండి వైదొలిగారు. సినిమా రంగంలో ఇది సహజమే. ఎవరో ఒకరి వద్ద పనిచేస్తూ తగినంత అనుభవం వచ్చాక డైరెక్టర్ గానో, సంగీతదర్శకుడిగానో, ఎడిటర్ గానో కెమేరామెన్ గానో స్థిరపడడానికి ప్రయత్నించడం అందరూ చేసేదే. రాఘవులుగారికి నిర్మాత డి.రామానాయుడుగారి రూపంలో మంచి ప్రోత్సాహం లభించింది. తన సంస్థ చిత్రాలలో సహాయ సంగీత దర్శకుడిగా నియమించారు. ఆ సమయంలోనే రాఘవులు గారు ఎమ్.ఎస్.విశ్వనాథన్, కె.వి.మహాదేవన్, మాస్టర్ వేణు మొదలగు వారి దగ్గర పని చేసిన తర్వాత రామానాయుడుగారు రాఘవులుగారికి తన 'ద్రోహి' సినీమాకు సంగీత దర్శకత్వం చేసే అవకాశం కల్పించారు. ఈ పరిణామ క్రమంలో రాఘవులు పూర్తిగా ఘంటసాలగారికి దూరమైపోయారు. మాస్టారింటికి రావడం పూర్తిగా మానేసారు. కానీ, తన సినిమాలలో పాటలు పాడడానికి ఘంటసాలగారే శరణ్యమయేది. రాఘవులుగారి సంగీతదర్శకత్వంలో ఘంటసాలగారు ఓ మూడు సినీమాలలో ఓ ఆరు పాటలు మాత్రమే పాడి వుంటారు. గాయకుడైవుండి కూడా రాఘవులు తన సొంత చిత్రాలలో కూడా  హీరోకు పాడే సాహసం చేయలేకపోయారు. ఇతర గాయకులమీదే ఆధారపడవలసి వచ్చింది. ఆయన గాత్రధర్మం గాయకుడిగా రాణించడానికి తగు దోహదం చేయలేకపోయింది. ఆదిలో తనకు నిలువ నీడ కల్పించి తన సొంతబిడ్డలా ఆదరించిన వ్యక్తి అంతిమ ఘడియలలో కూడా చూడడానికి రాకపోవడం ఘంటసాల రాఘవుల అనుబంధం తెలిసినవారందరికీ  చాలా ఆశ్చర్యం కలిగించింది.  ఎవరిమీదైతే అమితమైన మమకారాన్ని పెంచుకుంటామో అలాంటి వారి వల్లనే తీవ్రమైన మానసిక వేదన కూడా కలుగుతుందనేది నిజం. జీవనతరంగాలలో ని ఈ పాట ఇలాటి జీవిత సత్యాలన్నింటిని గుర్తు చేస్తుంది.

ఈ పాట స్వరరచన పూర్తిగా ఘంటసాల బాణిని జ్ఞప్తికి తెస్తుంది. ఇదొక situational song. పాటలోని మాటలననుసరించే శోభన్ బాబు, కృష్ణంరాజు, వాణిశ్రీ, శ్రీరంజనిల మీద పాట చిత్రీకరణ సాగింది. 

రాఘవులు గారు ఈ నేపథ్యగీతాన్ని అభేరి రాగ స్వరాల ఆధారంగా స్వరపర్చారు. అభేరి రాగం గురించి లోగడ చాలాసార్లు చెప్పుకున్నాము. కర్నాటక సంగీతంలో 22వ మేళకర్త అయిన ఖరహరప్రియ జన్య అభేరి. ఔడవ-సంపూర్ణరాగం. అంటే ఆరోహణలో ఐదు స్వరాలుఅవరోహణలో ఏడు స్వరాలు పలుకుతాయి.  హిందుస్థానీ సంగీతంలో అభేరికి సమాంతర రాగం భీమ్ పలాస్. కర్నాటక దేవగాంధారి రాగమే ముత్తుస్వామి దీక్షితర్ సంప్రదాయం లో అభేరిగా ప్రచారమయింది. ఈ అభేరీ రాగంలో అనేక సంప్రదాయ కీర్తనలు, అనేక భాషలలో సినిమా పాటలు రూపొందించబడ్డాయి.

ఈ జీవన తరంగాలలో పాట ఘంటసాలగారి గళం బలం వలన సంపూర్ణమైన రసానుభూతిని కలిగించింది.   పాటంతా పైస్థాయిలోనే సాగుతూ ఘంటసాలవారి రేంజ్ ను ప్రస్ఫుటం చేసింది. రాఘవులుగారి వాద్యనిర్వహణలో బాలీవుడ్ ప్రభావం కనిపిస్తుంది. హెవీ వైయొలిన్స్, షెహనాయ్డోలక్తబలా, పాటకు ఎంతో నిండుదనాన్ని కలిగించింది. 

ఘంటసాలగారి ఋణం తీర్చుకునేలా రాఘవులుగారి 'ఈ జీవనతరంగాలలో' పాట సజీవరాగమై నిలిచిపోయింది. ఐదు దశాబ్దాలుగా ఈ పాట సదా మన మదిలో మెదులుతూ కలవరపెడుతూనేవుంది.

శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా తీయబడిన 'జీవనతరంగాలు' అనేక కేంద్రాలలో శతదినోత్సవాలు చేసుకోవడమే కాక మూడు ఫిలింఫేర్ అవార్డ్ లను గెలుచుకుంది. తెలుగులోనే కాక ఈ కథ ఆధారంగా తమిళం, హిందీకన్నడ భాషలలో కూడా  సినిమాలు వచ్చాయి. సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు గారికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన చిత్రం 'జీవనతరంగాలు'.  చిత్రంలో వున్న ఆరు పాటలలో ఘంటసాలగారు ఆలపించిన శోకగీతం ' ఈ జీవన తరంగాలలోఒక్కటే మకుటాయమానమై సజీవరాగం గా మన హృదయాలలో నిలిచింది.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్  

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 107వ భాగం - బలే మంచి రోజు

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...