అవి ఏనాడూ బాగుపడని అతుకులు
ఇంతేలే... ఇంతేలే -2
ఎండకు యెండి... వానకు తడిసీ
చలిలో వణకీ... వెన్నెలలో
చివికీ
ఆరు ఋతువులందు... అన్ని
యుగములందు
గతిలేని శ్రుతి లేని గతుకులు!
ఇంతేలే!
పుట్టగనే లేమి తలుపు
తట్టింది
శని ఆపై తన పాదం పెట్టింది
పస్తులు లేని రోజే వుండదు
పండుగపూటైనా కడుపే నిండదు
ఇంతేలే!
కాళ్ళకు సంకెళ్ళు....
కళ్ళకు సంకెళ్ళు
నోటికి సంకెళ్ళు నుదుటి
రాతకు సంకెళ్ళు
పేదలు ప్రాణమున్న పీనుగలు...
విధి చేతులలో తిరిగే గానుగలు
ఇంతేలే!
"కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ... ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ" ... అంటూ ఇద్దరు మహాకవుల కవితాశైలిని ఉద్దేశిస్తూ ప్రముఖ రచయిత గుడిపాటి వేంకటా చలం గారు వ్యాఖ్యానించారు.
అలాటి శ్రీశ్రీ బాధలాటిదే 'విశ్వంభర' కవి సి.నారాయణ రెడ్డిగారు ఒక సినిమా పాట కోసం అనుభవించారు. అదే 'ఇంతేలే నిరుపేదల బ్రతుకులు అవి ఏనాడూ బాగుపడని అతుకులు' - నేటి మన ఘంటసాల సజీవరాగం.
నిశీధి సమయాన మురికివాడలలోని నిరుపేదల ఆకలి కష్టాలకు మనసు చలించి ఒక యువకుడు వేదనతో పాడిన పాట. నిజానికి పేదరికమంటే ఎరుగని ధనికవర్గ కుటుంబానికి చెందినవాడు. కానీ, ధనం, ఆడంబర జీవితం, అహంకారం, నాగరికతా వ్యామోహం వలన ఇంటిలో తల్లిదండ్రుల మమతానురాగాలు, ఆప్యాయతలు కరువై వాటికోసం అలమటిస్తూ, త్రాగుడుకు అలవాటు పడి, కుటుంబంతో సంబంధంలేకుండా ఒంటరిగా నిరాశా నిస్పృహలతో బ్రతికే ఒక హృదయమున్న మనిషి యొక్క చీకటి విలాపం ఈ గీతం. 1967 లో వచ్చిన 'పుణ్యవతి' అనే సినిమా కోసం డా.సి.నారాయణరెడ్డిగారు వ్రాసిన ఉదాత్త గీతం.
ఎన్.టి.రామారావు, భానుమతి, ఎస్.వి.రంగారావు, కృష్ణకుమారి వంటి హేమాహేమీల మధ్య ఒక విలక్షణమైన యువకుడి పాత్రలో శోభన్ బాబు ఎంతో రాణించి తన పాత్రలో జీవించారు. అందుకు సి.నా.రె.గారి కలం, ఘంటసాలవారి గళం ఎంతగానో దోహదం చేసాయి.
"ధనం మూలం ఇదం జగత్". కలిమిలేని వాడి జీవితం ఎన్నటికీ అతుకు గతుకుల బాటే. పుట్టగనే లేమి తలుపు తడుతుంది. వెనువెంటనే శని తన పాదం పెడుతుంది. సమాజంలో ధనం లేనివాడికి అధికారము, అంతస్తు, స్వేఛ్ఛ ఏవీ వుండవు. కాళ్ళకు, కళ్ళకు, నోటికి, చివరకు విధాత నుదుటి వ్రాతకు కూడా సంకెళ్ళే. ప్రాణమున్న పీనుగలు, విధి చేతులలో తిరిగే గానుగలు ఈ పేదలు. ఏనాటికి మారని నిరుపేదల బ్రతుకింతే అనే ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని నారాయణరెడ్డి ఈ పాటలో మనకు అందించారు.
కాపి రాగం ఏ కలపడం లేని శుధ్ధమైన ఫిల్టర్ కాఫీ అంత మాధుర్యాన్ని, రసానుభూతిని కలిగిస్తుందని రసజ్ఞుల భావన. మన సంప్రదాయ, సినీ నృత్య జావళీ గీతాలు చాలావరకు ఈ కాపి రాగంలోనే స్వరపర్చబడివున్నాయి. ఈ కాపి రాగానికి సమాంతరమైన హిందుస్థానీ రాగం 'పీలు'. అటువంటి సుఖసంతోషాలకు , మధురానందానికి అనువైన పీలు రాగ స్వరాలను ఆధారంగా చేసుకొని 'ఇంతేలే నిరుపేదల బ్రతుకులు' పాటను శోకరస ప్రధానంగా, అతి గంభీరంగా, అంతే ఉదాత్తంగానూ స్వరపర్చి ఆ నిరుపేదల మనోభావాలు తనవిగా భావిస్తూ ఘంటసాల మాస్టారు సంపూర్ణంగా లీనమైపోయి ఆ పాటకు ప్రాణప్రతిష్ట చేసారు. సన్నివేశ బలానికి మంచి సంగీత సాహిత్యాలు తోడైతే ఆ పాట శ్రోతల హృదయాలలో పదికాలాలపాటు సజీవరాగమై నిలిచిపోతుందనడానికి "ఇంతేలే నిరుపేదల బ్రతుకులు" పాట ఒక నిదర్శనం.
'పుణ్యవతి' సినిమా నిర్మాత, వాసూ స్టూడియో అధినేత వాసుదేవ మీనన్, చిత్రదర్శకుడు దాదామిరాసి సంగీతం విషయం పూర్తిగా ఘంటసాలగారికే వదలిపెట్టి పరిపూర్ణమైన స్వేఛ్ఛను ఇచ్చారు. అందువల్లనే ఈ పాటే కాకుండా ఈ సినిమా లోని 'మనసు పాడింది సన్నాయి పాట', 'ఎంత సొగసుగా వున్నావు', 'పెదవులపైన సంగీతం' వంటి ఇతర గీతాలు కూడా ఈ నాటివరకు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలచివున్నాయి. వాసుమీనన్ ఈ సినిమా ను ఏకకాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషలలో 'పుణ్యవతి',' పూవుంపొట్టుం', 'నయీ రోషిణి' గా వేర్వేరు ప్రముఖ నటీనటులు, వేర్వేరు సాంకేతిక నిపుణులతో భారీగా నిర్మించారు.
ఎన్.టి.రామారావు, ఎస్.వి.రంగారావు, భానుమతి, కృష్ణకుమారి, హరనాథ్, జ్యోతిలక్ష్మీ ; ఎ.వి.ఎమ్.రాజన్, నాగేష్, ముత్తురామన్, భారతి; అశోక్ కుమార్, బిశ్వజిత్, రాజ్ కుమార్, మాలాసిన్హా, తనూజ ; వంటి ప్రముఖ తారలంతా ఈ మూడు భాషల్లో నటించారు. తెలుగు తమిళ
చిత్రాలకు దాదామిరాసి, హిందీ వెర్షన్ కు సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించారు.
తెలుగు, తమిళం, హిందీ ఈ మూడు భాషల్లో నటించిన పి.భానుమతికి కనీసం ఒక పాటైనా లేకపోవడం ఒక విశేషం.
ప్రణవ స్వరాట్