"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!
చిత్రం - జరిగిన కథ
గానం - ఘంటసాల
రచన - డా.సి.నారాయణరెడ్డి
సంగీతం - ఘంటసాల
పల్లవి:
బలే మంచిరోజు పసందైన
రోజు
వసంతాలు పూచే నేటి
రోజు
హా..య్.. వసంతాలు
పూచే నేటి రోజు
చరణం 1:
గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు ! గుండెలోని!
నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు
!బలే
మంచి రోజు!
చరణం 2:
చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు
తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు! చందమామ!
కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు
లలిత, సినిమా గీతాలకు తన కచేరీల ద్వారా విస్తృత ప్రచారాన్ని కల్పించి, శాస్త్రీయ సంగీత కచేరీల పధ్ధతిలో లలిత సంగీతానికి కూడా ఒక మర్యాదను, విశిష్టతను, ఔన్నత్యాన్ని తెచ్చిపెట్టిన ఖ్యాతి గానగంధర్వుడు ఘంటసాలగారికే దక్కుతుంది. లలిత, సినీమా గీతాలతో సంగీత కచేరీలు చేసే సత్సాంప్రదాయం ఘంటసాలగారితోనే ప్రారంభమై ప్రజా బాహుళ్యంలో ఒక గుర్తింపును పొందిందని చెప్పవచ్చును.
ఘంటసాలవారు తన లలిత సంగీత కచేరీలకు ఒక నూతన ఒరవడిని, క్రమశిక్షణను ఏర్పర్చారు. తన కచేరీ వేదికకు ఒక మర్యాదను, పవిత్రతను కల్పించారు. శాస్త్రీయ సంగీత విద్వాంసులులాగే పరిమిత వాద్యగోష్టితో వేదికమీద కూర్చొనే పాడేవారు. ఒక చేత పాటల పుస్తకం, మరో చేయి చెవిమీద పెట్టుకొని పాడడం ఘంటసాలగారి అలవాటు. ఎన్నో వందల కచేరీల అనుభవం వుండీ కూడా ఆయన పుస్తకం చూడకుండా ఏ పాటా పాడేవారు కాదు. గతం తరంలో అనేకమంది మహావిద్వాంసులంతా తమ కచేరీలను 'ఆది నాట అంత్య సురట' అనే సూత్రాన్ని పాటిస్తూ వచ్చారు. అంటే తమ కచేరీలను నాట రాగంతో ప్రారంభించి చివర సురటి రాగంతో ముగించేవారు. నాట, సురటి రెండు రాగాలు జన్యరాగాలే అయినప్పటికీ అత్యంత శుభప్రదమైన రాగాలుగా భావిస్తారు. అలాగే, ఘంటసాలవారు కూడా తన సినీ గీత కచేరీలలో ఒక క్రమపధ్ధతిని పాటించారు. తన కచేరీలో మొదటి గీతంగా 'వినాయకచవితి' సినిమా లోని 'దినకరా శుభకరా దేవా..' తో ప్రారంభించి ఆఖరున 'బ్రతుకుతెరువు' సినిమాలోని 'అందమె ఆనందం' పాటతో ముగించేవారు. 'దినకరా' పాట లోకరక్షకుడైన సూర్యభగవానుని స్తుతిస్తూ పాడే పాట. పంతువరాళి లేక కామవర్ధని అనే రాగంలో ఘంటసాలవారే స్వరపర్చిన గీతం. ఈ రాగాన్నే హిందుస్థానీ బాణీలో పూర్యాధనశ్రీ అని అంటారు. ఆఖరు పాట 'అందమే ఆనందం' హిందుస్థానీ భీంపలాస్ రాగంలో ఘంటసాలగారే చేశారు. దీనిని కర్ణాటక సంగీత శైలిలో అభేరి అంటారు. ఈ రెండు గీతాలు రెండు విధాలైన మూడ్స్ ను శ్రోతలలో రేకెత్తించి ఆనంద పరవశులను చేసేవి. (ఈ రెండు పాటలు రావడానికి ముందు ఘంటసాలగారు తన కచేరీలలో తమ గురువుగారి కృతులు పద్యాలతో, కరుణశ్రీ, జాషువా, పద్యాలతో, జానపద గీతాలతో కచేరీలు చేసేవారని చెప్పగా విన్నాను).
తర్వాతి కాలంలో అంటే 1969లో తన స్వీయసంగీతంలో ఆలపించిన 'జరిగినకథ' చిత్రంలోని సి.నారాయణరెడ్డిగారి 'బలే మంచిరోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు' అనే పాట బహుళ జనాదరణ పొంది ఘంటసాలవారి కచేరీలలో ఆఖరి వరస పాటలలో చోటు చేసుకుంది. 'అందమే ఆనందం' లేదా 'బలే మంచిరోజు' ఈ రెండు పాటలలో ఏదో ఒక పాటతో మాస్టారు తన కచేరీని ముగించేవారు.
అటు ఘంటసాల మాస్టారికి, ఇటు కోట్లాది తెలుగువారికి హృదయరంజకమైన 'బలే మంచి రోజు పసందైన రోజు' పాటే ఈ ధారావాహికకు ముగింపు సజీవరాగం గా మీకు సమర్పిస్తున్నాను.
యువక దశ దాటి నడివయసులో వున్న ధనిక కథానాయకుడు తన ఇంట ఆశ్రయంకోరి వచ్చిన ఓ పేద పిల్లను చూసి మనసుపడి ఆమెను వివాహం చేసుకునే తలపులో పడి మహదానంతో 'బలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు అని పరవశించి పాడిన పాట. అయితే తన ప్రేమ ఫలించదని, తన తమ్ముడు, ఆ అమ్మాయి పరస్పరం ప్రేమించుకుంటున్నారని తెలిసి మౌనంగా తన ప్రేమను తమ్ముడి సుఖసంతోషాలకోసం త్యాగం చేసిన ఒక అన్నగారి కథే 'జరిగినకథ' సినిమా.
డా. సినారాయణరెడ్డిగారు వ్రాసిన ఈ గీతాన్ని ఘంటసాల మాస్టారు 'శుధ్ధ ధన్యాసి' రాగ స్వరాలతో చేశారు. ఈ రాగాన్నే 'ఉదయరవిచంద్రిక' అని కూడా అంటారు. ఇది కర్ణాటక సంగీతంలో 22వ మేళకర్త యైన 'ఖరహరప్రియ'కు జన్యం. ఐదు స్వరాలు కలిగిన ఔడవరాగం. ప్రపంచదేశాలన్నిటిలో ఈ స్వరాలు కలిగిన స్కేల్స్ ప్రచారం లో వున్నాయి. వెస్ట్రన్ సంగీతంలో ఈ రాగాన్ని 'మైనర్ పెన్టానిక్ స్కేల్' అని, ఈస్టర్న్ కంట్రీస్ లో 'చైనీస్' స్కేల్ ' అని అంటారట. అందుకే జనరంజకమైన రాగంలో ఘంటసాలగారు స్వరపరిచిన 'బలే మంచి రోజు' పాట ఈనాటికీ సంగీతాభిమానులను మురిపించి మైమరపిస్తూనే వుంది. ' అందమే ఆనందం' పాటలాగే ఈ పాటకూడా పియానోను ప్రధాన వాద్యంగా చేసుకొని రూపొందించిన గీతం. పియానోతో పాటు సితార్, ఫ్లూట్, క్లారినెట్, వైలిన్స్, డబుల్బేస్, తబలా, డోలక్, తాళవాద్యాలను ఈ పాటలో ఉపయోగించారు. ఇక పాట పాడిన ఘంటసాలగారి గాత్రమాధుర్యం గురించి ఏం చెప్పగలం! తనివితీరా విని ఆనందించడం తప్ప. పాట మధ్యలో వచ్చే హమ్మింగ్స్, గమకాలు, సందర్భోచితమైన భావప్రకటనలు కేవలం ఘంటసాల మాస్టారికే సాధ్యం. అతి సునాయాసంగా, అలవోకగా ఆలపించారు.
1970లో జరిగిన కథ సినిమాను కన్నడంలో రాజ్ కుమార్ హీరోగా 'నన్న తమ్మ' పేరుతో నిర్మించారు. తెలుగు వెర్షన్ కు డైరక్ట్ చేసిన కె.బాబూరావే కన్నడం సినిమాకు డైరెక్టర్. అలాగే ఈ కన్నడ చిత్రానికి సంగీత దర్శకత్వాన్ని ఘంటసాలగారే నిర్వహించారు. అయితే ఆయన ఈ సినిమా లో ఒక పాట కూడా పాడకపోవడం విశేషం. ' 'బలే మంచిరోజు' వరసలోనే చేసిన కన్నడం పాటను పి.బి.శ్రీనివాస్ ఆలపించారు.
ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారందరికీ తన మధుర గీతాలతో ఆనందప్రదమైన ఎన్నో మంచిరోజులను పంచి ఇచ్చిన గానగంధర్వుడి జీవితంలో చోటు చేసుకున్న కొన్ని మరపురాని మధుర క్షణాలను మనం మననం చేసుకుందాము.
'బలే మంచిరోజు పసందైన రోజు' 1969 లో వచ్చింది.
అంతకుముందు ఘంటసాలవారి జీవితంలో చోటుచేసుకున్న మధుర క్షణమంటే అది సావిత్రమ్మగారితో 1944 మార్చ్ లో జరిగిన వివాహమే. ఆ వివాహం జరిగిన శుభముహుర్త బలం శ్రీ సముద్రాల రాఘవాచార్యులవారి పరిచయ భాగ్యం కలిగి సినిమా రంగంలో బంగారు భవిష్యత్తు కు బాటలు వేసింది.
1969 - తిరుమల-తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయక పదవి.
1970 జనవరి లో భారత ప్రభుత్వ 'పద్మశ్రీ' బిరుదు ప్రదానం.
1970 ఫిబ్రవరి 1 న హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో లో జరిగిన అతి బ్రహ్మాండమైన 'ఘంటసాల
సినీ సంగీత
రజతోత్సవం.
1971 అక్టోబర్- నవంబర్ లలో యూరప్, యు.ఎస్., కెనడా దేశాల సంగీత పర్యటన. అదే పర్యటనలో ఐక్యరాజ్య సమితిలో జరిగిన సంగీత కచేరీలో శాంతి పతకం బహుకరణ.
1972-73 లో అతి పవిత్రమైన, ప్రతిష్టాత్మకమైన తెలుగు తాత్పర్య సహిత భగవద్గీతా గానం.
ఇవి ఘంటసాలగారు
సజీవులైవుండగా వారి జీవితం లో
చోటుచేసుకున్న కొన్ని మధుర స్మృతులు, నవ వసంతాలు విరిసిన బలే మంచి రోజులు.
నిజానికి ఘంటసాల సంగీతం అనంత రసవాహిని. ఎన్ని యుగాలైనా ఈ విశ్వంలో ధ్వని అనేది వున్నంతవరకు ఘంటసాల గళం నిత్యనూతనంగా సంగీతాభిమానులను అలరిస్తూనే వుంటుంది. ఘంటసాల పాట ఏది విన్నా ఏదో ఒక స్ఫూర్తిని, ఒక గమ్యాన్ని సూచిస్తునేవుంటుంది. ఘంటసాల గీతం కలిగించే దివ్యానుభూతి తో ప్రతీరోజు ఆనందప్రదమైన రోజుగా మనసుకు హాయిని కలిగిస్తుంది.
ప్రపంచంలో ఏ ఇతర గాయకుడు పొందనంత అపరిమిత ప్రజాభిమానాన్ని, గౌరవ మర్యాదలను పొందిన అద్వితీయ గాయకుడు మన ఘంటసాల. గత రెండేళ్లుగా వారి శతజయంతిని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నిర్విరామ లలిత సంగీతోత్సవాలే అందుకు నిదర్శనం. వేలాది గాయనీగాయకులు, సాంస్కృతిక సంస్థలు అత్యద్భుతమైన సంగీతోత్సవాలు జరుపుతూ ఘంటసాలవారి పట్ల తమకుగల భక్తిప్రపత్తులను ప్రకటిస్తున్నారు.
ఘంటసాల శత జయంతి సందర్భంగా నేను మొదలు పెట్టిన 'ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం' ధారావాహిక ప్రారంభమై నేటికి 107 వారాలు అయింది. నేను గాయకుడినో లేక భాషాజ్ఞానమున్న రచయితనో కాదు. కేవలం ఘంటసాలవారి సంగీతం పట్ల గల శ్రధ్ధాసక్తులతో 'ఘంటసాల సజీవరాగాలు' శీర్షికను మీ అందరి ప్రోత్సాహంతో, ఆదరాభిమానాలతో కొనసాగించగలిగాను. ఘంటసాల సంగీతం అనంతం. ఎందరు ఎన్ని విధాలుగా విశ్లేషించినా మనసుకందని భావాలెన్నో ఆ పాటలలో నిగూఢమైయ్యే వుంటాయి.
నాకున్న పరిమిత జ్ఞానానికి ఎక్కడో చోట, ఏదో దగ్గర ముగింపు (.) పెట్టక తప్పని పరిస్థితి. చాలామందిలాగే నాకు ఒక చిన్న ఆశ. ఘంటసాల సజీవరాగాలు అందరూ 'బాగానే వుంది' అని అనకుండా 'బాగుంది' అనే స్థాయిలోనే ముగించాలనేది నా కోరిక. 'బాగుంది', 'బాగానే వుంది' అనే మాటల మధ్య గల వ్యత్యాసం ఏమిటో మీ అందరికీ బాగా తెలిసిందే.
అందుకే ఈనాటి ఈ 'బలే మంచి రోజు, పసందైన రోజు' తో ఘంటసాలవారికి భక్తిప్రపత్తులతో నివాళులు సమర్పించుకుంటూ శెలవు తీసుకుంటున్నాను.
