రయమున కలియవె ప్రేమాభిసారికా
చిత్రం - పెళ్ళికాని పిల్లలు
గానం - ఘంటసాల
సంగీతం - మాస్టర్ వేణు
ప్రియతమా రాధికా
ప్రియతమా రాధికా రావే రయమున
కలియవె ప్రేమాభిసారికా !! ప్రియతమా
చరణం :
పరువము నీ మేన పరుగులు తీయ.. ఆ... పరువము !
చరణాల కికిణులు స్వరమేళ పాడ - 2
చరణం :
కడవనిడుకొని కలహంస నడతో
విడువని బిడియాన వేమారు వెదకి-2
అడుగులు తడబడ నడుమల్లాడా.. ఆ..- 2
వడి వడిగా నడిచేటి వనితా లలమా
రాగాలాపన
ప్రియతమా రాధికా -2
స్వరకల్పనలు
ప్రియతమా రాధికా - 2
రాధికా.. రాధికా... రాధికా...
సంగీత రసాస్వాదన అనుభవైకవేద్యం. ఎవరి అభిరుచి, సంగీత సంస్కారాన్నిబట్టి ఆ రకమైన గీతాలాను విని ఆనందిస్తూంటారు. కొన్ని గీతాలు విన్న మొదటి క్షణంలోనే అవి మన మనసుకు పట్టేసి పదే పదే వినాలనే తపన మొదలవుతుంది. ఆ పాటలను ఎన్నిసార్లు విన్నా తనివితీరదు. ఆ పాటలోని రాగభావం, ఆ పాటను ఆలపించిన గాయనీగాయకుల గాన మాధుర్యం, సన్నివేశ చిత్రీకరణ అందుకు కారణమనిపిస్తుంది.
అలాటి ఆపాతమధురమే నేటి ఘంటసాలవారి సజీవరాగం ---
" ప్రియతమా రాధికా రావే రయమున కలియవె ప్రేమాభిసారిక " అనే పాట, 1961 నాటి " పెళ్ళికాని పిల్లలు" సినీమా లోనిది. గీత రచన ఆరుద్రగారిది, సంగీత రచన మాస్టర్ వేణు , చిత్రదర్శకుడు సి.ఎస్ రావు, నిర్మాత హైదరాబాద్ మూవీస్ పి.గంగాధరరావు. నిర్మాతా దర్శకులలో మంచి కళాభిరుచి, సంస్కారమూ వుంటే అమృతతుల్యమైన పాటలూ ఉద్భవిస్తాయని చెప్పడానికి నిదర్శనం ఈ పాట. ఈ పాట నూటికి నూరుపాళ్ళు ఘంటసాలవారికే సొంతం . తెరవెనుక ఈ పాట పాడడమే కాదు తెరమీద కూడా ఘంటసాల చిన వెంకటేశ్వరరావు (హరనాథ్) అనే నకిలి గాయకుడికి తన అపూర్వగళాన్ని ఎరువిస్తూ ఫోటోలో కూడా కనిపిస్తారు. సంగీతం తెలిసిన ఒక అమ్మాయి ప్రేమ సంపాదించడానికి ఒక అబ్బాయి ఘంటసాల పాటను ఆలంబనగా చేసుకొని మహాగాయకుడిలా నటిస్తాడు. మనోజ్ఞమైన సంగీతాన్ని, చక్కటి లాస్యాన్ని మేళవించి మరపురాని హాస్య సన్నివేశంగా రూపొందించారు దర్శకుడు సి.ఎస్.రావు. ఫేక్ సింగర్ గా హరనాథ్, అతనికి డైరెక్టర్ గా జగ్గయ్య, గాయనిగా వాణి ఈ సన్నివేశానికి జీవంపొసారు.
" ప్రియతమా రాధికా" పాట ఇంత మధురంగా వుండడానికి కారణం ఈ పాటను కళ్యాణి రాగంలో స్వరపర్చడమే. సంగీతంలో మంచి ప్రవేశము, రాగజ్ఞానమూ కల మాస్టర్ వేణు ఈ గీతాన్ని అపాతమధురంగా స్వరపర్చడంలో ఆశ్చర్యంలేదు. ఆయన సంగీత దర్శకత్వంలో ఎన్నో ఆణిముత్యాలు సంగీతాభిమానులను అలరించాయి.
కళ్యాణి ఘంటసాలవారి పేటెంట్ రాగమని ఈ పాట మరోసారి నిరూపిస్తుంది. సప్తస్వరాలు కలిగిన శోభాయమాన సంపూర్ణరాగం కళ్యాణి. విస్తారమైన రాగాలాపన చేయడానికి, సుదీర్ఘంగా స్వరకల్పనలు చేయడానికి అవకాశం కలిగిన కళ్యాణి రాగం ఘంటసాలవారిలో జీర్ణించుకుపోయింది. ఈ రాగంలోని పాటలెన్నో అలవోకగా ఘంటసాల మాస్టారి మృదుమధుర కంఠం నుండి జాలువారి శ్రోతలను తన్మయులను చేసాయి. అలాటి గీతాలలో " ప్రియతమా రాధికా" పాట ప్రముఖమైనది.
ఈ పాటకు కూడా సితార్ వాద్యమే జీవనాదం. ఇతర వాద్యాలతో పాటు వేణుగారు ఈ పాటలో తబలా తరంగ్, జలతరంగ్, తబలా వాద్యాలకు ప్రాధాన్యత కల్పించారు. కళ్యాణి రాగ విరుపులు, సంగతులు, గమకాల విషయంలో వేణుగారి ముద్రకు మరింత సొగసులు, సొబగులు చేర్చి ఘంటసాల మాస్టారు ఈ పాటను మరింత క్లాసిక్ గా ఆలపించారు. రాగభావాన్ని ప్రస్ఫుటంగా హృదయాలకు హత్తుకునేలా శ్రావ్యంగా వినిపింపజేయడంలో ఘంటసాలవారి ని మించిన గాయకుడు మరొకరు లేరంటే అది అతిశయోక్తి కానేకాదు. సంగీతజ్ఞులంతా అంగీకరించిన సత్యం. ఈ విషయాలన్నింటినీ నిరూపించ గీతం "ప్రియతమా రాధికా". ఈ పాటలో ఘంటసాలవారి గళం ఎంతో గంభీరంగా, మృదుమధురంగా వినిపిస్తుంది.
ఘంటసాలవారి సినీ సంగీత రజతోత్సవ వేడుకలలో జరిగిన భారీ సంగీత విభావరిలో మాస్టర్ వేణు వాద్యబృందాన్ని పర్యవేక్షిస్తూండగా ఘంటసాల మాస్టారు సమ్మోహనంగా పాడిన " ప్రియతమా రాధికా" పాటకు వేలాది ప్రేక్షకులు చేసిన హర్షధ్వానాలు, కరతాళధ్వనులు ఇంకా నా చెవిలో మార్మోగుతూనేవున్నాయి.
వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.
ప్రణవ స్వరాట్