Saturday, 8 November 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 107వ భాగం - బలే మంచి రోజు

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నూటయరవ భాగం ఇక్కడ

107వ సజీవరాగం - బలే మంచి రోజు

చిత్రం - జరిగిన కథ
గానం - ఘంటసాల
రచన - డా.సి.నారాయణరెడ్డి

సంగీతం - ఘంటసాల

పల్లవి:

బలే మంచిరోజు పసందైన రోజు

వసంతాలు పూచే నేటి రోజు

హా..య్.. వసంతాలు పూచే నేటి రోజు

చరణం 1:

గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు

గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు ! గుండెలోని!

నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు 

                                                !బలే మంచి రోజు!

చరణం 2:

చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు

తొలివలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు! చందమామ!

కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు 

                                                !బలే మంచి రోజు!

లలితసినిమా గీతాలకు తన కచేరీల ద్వారా విస్తృత ప్రచారాన్ని కల్పించిశాస్త్రీయ సంగీత కచేరీల పధ్ధతిలో లలిత సంగీతానికి కూడా  ఒక మర్యాదనువిశిష్టతను, ఔన్నత్యాన్ని తెచ్చిపెట్టిన ఖ్యాతి గానగంధర్వుడు ఘంటసాలగారికే దక్కుతుంది. లలితసినీమా గీతాలతో సంగీత కచేరీలు చేసే సత్సాంప్రదాయం ఘంటసాలగారితోనే ప్రారంభమై ప్రజా బాహుళ్యంలో ఒక గుర్తింపును పొందిందని చెప్పవచ్చును.

ఘంటసాలవారు తన లలిత సంగీత కచేరీలకు ఒక నూతన ఒరవడిని, క్రమశిక్షణను ఏర్పర్చారు. తన కచేరీ వేదికకు ఒక మర్యాదను, పవిత్రతను కల్పించారు. శాస్త్రీయ సంగీత విద్వాంసులులాగే పరిమిత వాద్యగోష్టితో  వేదికమీద కూర్చొనే పాడేవారు. ఒక చేత పాటల పుస్తకం, మరో చేయి చెవిమీద పెట్టుకొని పాడడం ఘంటసాలగారి అలవాటు. ఎన్నో వందల కచేరీల అనుభవం వుండీ కూడా ఆయన పుస్తకం చూడకుండా  ఏ పాటా పాడేవారు కాదు. గతం తరంలో అనేకమంది మహావిద్వాంసులంతా తమ కచేరీలను 'ఆది నాట అంత్య సురట' అనే సూత్రాన్ని పాటిస్తూ వచ్చారు. అంటే తమ కచేరీలను నాట రాగంతో ప్రారంభించి చివర సురటి రాగంతో ముగించేవారు. నాట, సురటి రెండు రాగాలు జన్యరాగాలే అయినప్పటికీ అత్యంత శుభప్రదమైన రాగాలుగా భావిస్తారు. అలాగేఘంటసాలవారు కూడా తన సినీ గీత కచేరీలలో ఒక క్రమపధ్ధతిని పాటించారు. తన కచేరీలో మొదటి గీతంగా 'వినాయకచవితి' సినిమా లోని 'దినకరా శుభకరా దేవా..' తో ప్రారంభించి ఆఖరున 'బ్రతుకుతెరువు' సినిమాలోని 'అందమె ఆనందం' పాటతో ముగించేవారు.  'దినకరా' పాట లోకరక్షకుడైన సూర్యభగవానుని స్తుతిస్తూ పాడే పాట. పంతువరాళి లేక కామవర్ధని అనే రాగంలో ఘంటసాలవారే స్వరపర్చిన గీతం. ఈ రాగాన్నే హిందుస్థానీ బాణీలో పూర్యాధనశ్రీ అని అంటారు. ఆఖరు పాట 'అందమే ఆనందంహిందుస్థానీ భీంపలాస్ రాగంలో ఘంటసాలగారే చేశారు. దీనిని కర్ణాటక సంగీత శైలిలో అభేరి అంటారు. ఈ రెండు గీతాలు రెండు విధాలైన మూడ్స్ ను శ్రోతలలో రేకెత్తించి ఆనంద పరవశులను చేసేవి. (ఈ రెండు పాటలు రావడానికి ముందు ఘంటసాలగారు తన కచేరీలలో తమ గురువుగారి కృతులు పద్యాలతో, కరుణశ్రీజాషువాపద్యాలతో, జానపద గీతాలతో కచేరీలు చేసేవారని చెప్పగా విన్నాను). 

తర్వాతి కాలంలో అంటే 1969లో తన స్వీయసంగీతంలో ఆలపించిన 'జరిగినకథ' చిత్రంలోని సి.నారాయణరెడ్డిగారి 'బలే మంచిరోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజుఅనే పాట బహుళ జనాదరణ పొంది ఘంటసాలవారి కచేరీలలో ఆఖరి వరస పాటలలో చోటు చేసుకుంది. 'అందమే ఆనందం' లేదా 'బలే మంచిరోజు' ఈ రెండు పాటలలో ఏదో ఒక పాటతో మాస్టారు తన కచేరీని ముగించేవారు.

అటు ఘంటసాల మాస్టారికి, ఇటు కోట్లాది తెలుగువారికి హృదయరంజకమైన 'బలే మంచి రోజు పసందైన రోజు' పాటే ఈ ధారావాహికకు ముగింపు సజీవరాగం గా మీకు సమ‌ర్పిస్తున్నాను.

యువక దశ దాటి నడివయసులో వున్న ధనిక కథానాయకుడు తన ఇంట ఆశ్రయంకోరి వచ్చిన ఓ పేద పిల్లను చూసి మనసుపడి ఆమెను వివాహం చేసుకునే తలపులో పడి మహదానంతో 'బలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు అని పరవశించి పాడిన పాట. అయితే తన ప్రేమ ఫలించదని, తన తమ్ముడుఆ అమ్మాయి పరస్పరం ప్రేమించుకుంటున్నారని తెలిసి మౌనంగా తన ప్రేమను తమ్ముడి సుఖసంతోషాలకోసం త్యాగం చేసిన ఒక అన్నగారి కథే 'జరిగినకథ' సినిమా.

డా. సినారాయణరెడ్డిగారు వ్రాసిన ఈ గీతాన్ని ఘంటసాల మాస్టారు 'శుధ్ధ ధన్యాసి' రాగ స్వరాలతో చేశారు. ఈ రాగాన్నే 'ఉదయరవిచంద్రిక' అని కూడా అంటారు. ఇది కర్ణాటక సంగీతంలో 22వ మేళకర్త యైన 'ఖరహరప్రియ'కు జన్యం. ఐదు స్వరాలు కలిగిన ఔడవరాగం. ప్రపంచదేశాలన్నిటిలో ఈ స్వరాలు కలిగిన స్కేల్స్ ప్రచారం లో వున్నాయి. వెస్ట్రన్ సంగీతంలో ఈ రాగాన్ని 'మైనర్ పెన్టానిక్ స్కేల్' అని, ఈస్టర్న్ కంట్రీస్ లో 'చైనీస్' స్కేల్ ' అని అంటారట.  అందుకే జనరంజకమైన రాగంలో  ఘంటసాలగారు స్వరపరిచిన 'బలే మంచి రోజు' పాట ఈనాటికీ సంగీతాభిమానులను మురిపించి మైమరపిస్తూనే వుంది. ' అందమే ఆనందం' పాటలాగే ఈ పాటకూడా పియానోను ప్రధాన వాద్యంగా చేసుకొని రూపొందించిన గీతం. పియానోతో పాటు సితార్, ఫ్లూట్, క్లారినెట్, వైలిన్స్డబుల్బేస్తబలాడోలక్, తాళవాద్యాలను ఈ పాటలో ఉపయోగించారు. ఇక పాట పాడిన ఘంటసాలగారి గాత్రమాధుర్యం గురించి ఏం చెప్పగలం! తనివితీరా విని ఆనందించడం తప్ప. పాట మధ్యలో వచ్చే హమ్మింగ్స్, గమకాలు, సందర్భోచితమైన భావప్రకటనలు కేవలం ఘంటసాల మాస్టారికే సాధ్యం. అతి సునాయాసంగా, అలవోకగా ఆలపించారు.

1970లో జరిగిన కథ సినిమాను కన్నడంలో రాజ్ కుమార్ హీరోగా 'నన్న తమ్మ' పేరుతో నిర్మించారు. తెలుగు వెర్షన్ కు డైరక్ట్ చేసిన కె.బాబూరావే కన్నడం సినిమాకు డైరెక్టర్. అలాగే ఈ కన్నడ చిత్రానికి సంగీత దర్శకత్వాన్ని ఘంటసాలగారే నిర్వహించారు. అయితే ఆయన ఈ సినిమా లో ఒక పాట కూడా పాడకపోవడం విశేషం. ' 'బలే మంచిరోజు' వరసలోనే చేసిన కన్నడం పాటను పి.బి.శ్రీనివాస్ ఆలపించారు.

ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారందరికీ తన మధుర గీతాలతో  ఆనందప్రదమైన ఎన్నో  మంచిరోజులను పంచి ఇచ్చిన గానగంధర్వుడి జీవితంలో చోటు చేసుకున్న కొన్ని మరపురాని మధుర క్షణాలను మనం మననం చేసుకుందాము.

'బలే మంచిరోజు పసందైన రోజు' 1969 లో వచ్చింది.

అంతకుముందు ఘంటసాలవారి జీవితంలో చోటుచేసుకున్న మధుర క్షణమంటే అది సావిత్రమ్మగారితో 1944 మార్చ్ లో జరిగిన వివాహమే. ఆ వివాహం జరిగిన శుభముహుర్త బలం శ్రీ సముద్రాల రాఘవాచార్యులవారి పరిచయ భాగ్యం కలిగి సినిమా రంగంలో బంగారు భవిష్యత్తు కు బాటలు వేసింది.

1969 - తిరుమల-తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయక పదవి.

1970 జనవరి లో భారత ప్రభుత్వ 'పద్మశ్రీ' బిరుదు ప్రదానం.

1970 ఫిబ్రవరి 1 న హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో లో జరిగిన అతి బ్రహ్మాండమైన 'ఘంటసాల

సినీ సంగీత రజతోత్సవం.

1971 అక్టోబర్- నవంబర్ లలో యూరప్, యు.ఎస్.కెనడా దేశాల సంగీత పర్యటన. అదే పర్యటనలో ఐక్యరాజ్య సమితిలో జరిగిన సంగీత కచేరీలో శాంతి పతకం బహుకరణ.

1972-73 లో అతి పవిత్రమైన,  ప్రతిష్టాత్మకమైన తెలుగు తాత్పర్య సహిత భగవద్గీతా గానం.

ఇవి ఘంటసాలగారు సజీవులైవుండగా  వారి జీవితం లో చోటుచేసుకున్న కొన్ని మధుర స్మృతులు, నవ వసంతాలు విరిసిన బలే మంచి రోజులు.

నిజానికి ఘంటసాల సంగీతం అనంత రసవాహిని. ఎన్ని యుగాలైనా ఈ విశ్వంలో ధ్వని అనేది వున్నంతవరకు ఘంటసాల గళం నిత్యనూతనంగా సంగీతాభిమానులను అలరిస్తూనే వుంటుంది. ఘంటసాల పాట ఏది విన్నా ఏదో ఒక స్ఫూర్తిని, ఒక గమ్యాన్ని సూచిస్తునేవుంటుంది. ఘంటసాల గీతం కలిగించే దివ్యానుభూతి తో ప్రతీరోజు ఆనందప్రదమైన రోజుగా మనసుకు హాయిని కలిగిస్తుంది.

ప్రపంచంలో ఏ ఇతర గాయకుడు పొందనంత అపరిమిత ప్రజాభిమానాన్నిగౌరవ మర్యాదలను పొందిన అద్వితీయ గాయకుడు మన ఘంటసాల. గత రెండేళ్లుగా వారి శతజయంతిని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న నిర్విరామ లలిత సంగీతోత్సవాలే అందుకు నిదర్శనం. వేలాది గాయనీగాయకులుసాంస్కృతిక సంస్థలు అత్యద్భుతమైన సంగీతోత్సవాలు జరుపుతూ ఘంటసాలవారి పట్ల తమకుగల భక్తిప్రపత్తులను ప్రకటిస్తున్నారు.

ఘంటసాల శత జయంతి సందర్భంగా నేను మొదలు పెట్టిన 'ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగంధారావాహిక  ప్రారంభమై నేటికి 107 వారాలు అయింది. నేను గాయకుడినో లేక భాషాజ్ఞానమున్న రచయితనో కాదు. కేవలం ఘంటసాలవారి సంగీతం పట్ల గల శ్రధ్ధాసక్తులతో 'ఘంటసాల సజీవరాగాలు' శీర్షికను మీ అందరి ప్రోత్సాహంతో, ఆదరాభిమానాలతో కొనసాగించగలిగాను. ఘంటసాల సంగీతం అనంతం. ఎందరు ఎన్ని విధాలుగా విశ్లేషించినా మనసుకందని భావాలెన్నో ఆ పాటలలో నిగూఢమైయ్యే వుంటాయి.

నాకున్న పరిమిత జ్ఞానానికి ఎక్కడో చోట, ఏదో దగ్గర ముగింపు (.) పెట్టక తప్పని పరిస్థితి. చాలామందిలాగే నాకు ఒక చిన్న ఆశ. ఘంటసాల సజీవరాగాలు అందరూ 'బాగానే వుంది' అని అనకుండా 'బాగుంది' అనే స్థాయిలోనే ముగించాలనేది నా కోరిక.  'బాగుంది', 'బాగానే వుంది' అనే మాటల మధ్య గల వ్యత్యాసం ఏమిటో మీ అందరికీ బాగా తెలిసిందే.

అందుకే ఈనాటి ఈ 'బలే మంచి రోజుపసందైన రోజుతో  ఘంటసాలవారికి భక్తిప్రపత్తులతో నివాళులు సమర్పించుకుంటూ శెలవు తీసుకుంటున్నాను.



ప్రణవ స్వరాట్


Saturday, 1 November 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 106వ భాగం - ముక్తి మార్గమును కనలేవా మాయా మోహమయ జీవా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నూటయైదవ భాగం ఇక్కడ

106వ సజీవరాగం - ముక్తి మార్గమును కనలేవా మాయా మోహమయ జీవా...

చిత్రం - శ్రీకృష్ణమాయ
గానం - ఘంటసాల
రచన - 
రావూరు సత్యనారాయణ రావు
సంగీతం - టి.వి.రాజు

పల్లవి:

జీవా! జీవా! ఆ... ఆ...

ముక్తి మార్గమును కనలేవా

మాయా మోహమయ జీవా! 

                            !ముక్తి మార్గము!

 

చరణం 1:

భ్రాంతుడవై బహు మాయలబడి

యీ బ్రతుకే స్థిరమని నమ్మేవా-2

శాంతుడవై చని వెదకు మదేదో-2

శాశ్వతమగు త్రోవ.... జీవా! 

                            !ముక్తి మార్గము!

చరణం 2: 

సారము లేని సంసార జలధిబడి

సత్యానందము గనలేవా -2

దారాపుత్ర ధనధాన్యాధిక

మమకారపు జాడ్యము కొన్నావా... జీవా! 

                               !ముక్తి మార్గము!

చరణం 3: 

మిథ్యామయమౌ మాయాజగమిది-2

మది విడువుమురా జీవా-2

నిత్యసత్యమౌ పరంజ్యోతిగని

దరిజేరుమురా జీవా! 

                            !ముక్తి మార్గము!

 కనలేవా... జీవా...

"కౌపీన సంరక్షణార్ధం అయం పటాటోపహః" అనే సామెత  ఎప్పుడైనా విన్నారాజపం విడచి లొట్టల్లోపడడంలాటిదే! దీని వెనుక చిన్న తమాషా కథ ఒకటి వుంది.

నీతి నియమాలు లేకుండా, చపలచిత్తంతో మాయామోహ సాగరంలో కొట్టుమిట్టాడే తొంభైతొమ్మిది శాతం గంజాయి సన్యాసులను ఉద్దేశించి శ్రీ రామకృష్ణ పరమహంస తన "కథామృతం" లో చెప్పిన పిట్టకథ.

ఊరికి దూరంగా ఉండే అడవిలో ఒక సన్యాసి  ఒంటరిగా తపస్సు చేసుకుంటూవుండేవాడు. జన్మరాహిత్యంతో కూడిన ముక్తిని పొంది పరమాత్ముని సన్నిధి చేరాలని అతని సంకల్పం. అలా ముక్కుమూసుకొని జపం చేసుకునే ఆ సన్యాసికి అనుకోని చిక్కులు వచ్చిపడ్డాయి. బక్కచిక్కిన దేహాన్ని కప్పిపుచ్చే చాలీచాలని అంగవస్త్రాలను, కౌపీనాలను(గోచీలు) ఎలుకలు వచ్చి పాడుచేయడం మొదలెట్టాయి. ఆ ఎలుకల బెడదనుండి తప్పించుకునేందుకు ఆ సన్యాసి ఒక పిల్లిని పెంచడం మొదలెట్టాడు. ఆ పిల్లి ఆకలి తీర్చే పాలకోసం ఒక ఆవును తెచ్చి కూటీరంలోపెట్టాడు. ఆ ఆవును సంరక్షించడం కోసం ఒక పనివాడిని ఏర్పాటు చేయవలసివచ్చింది. ఆ కుర్రాడి ఆలనాపాలనా చూసుకోవడానికి ఒక ఆడదిక్కు కావలసివచ్చింది. సన్యాసులుండే చోట ఆడవాళ్లు ఎలావుంటారు. తన గోచీలనుపిల్లినిఆవునుపని పిల్లవాడిని సరంక్షించేందుకు ఒక స్త్రీని పెళ్ళాడవలసి వచ్చింది. క్రమక్రమంగా తన లక్ష్యసాధనలో వెనకబడ్డాడు. ఇహలోక వాంఛలకు దూరంగావుంటూ ముక్తిని పొందాలనుకున్న ఆ సన్యాసి  సంసార జంఝాటంలో పూర్తిగా ఇరుక్కుపోయాడు.

ముక్తి సాధన కోసం మరొక జన్మ ఎత్తకా తప్పలేదేమో ఆ సన్యాసికి. 'మిథ్యామయమౌ మాయా జగమిది... నిత్య సత్యమౌ పరంజ్యోతిగని దరిజేరుమురా... ముక్తిమార్గమును కనలేవా... జీవా!' అని భూలోకవాసులను ఆశాపాశములనుండి సంరక్షించి ఉధ్ధరిస్తానని అహంకారంతో  ఒక సినీ  నారదుడు  ఆలపించిన గీతమే నేటి మన సజీవరాగం.

భారతీయ ఆథ్యాత్మిక, తాత్త్విక చింతనలో ప్రధానమైనది ముక్తి సాధన. అసలు ముక్తి అంటే ఏమిటి?దానిని పొందడానికి సనాతనాచారపరులు ఎందుకంత తాపత్రయపడతారు?

ముక్తి అంటే విముక్తి, అంటే విడుదల. జననమరణాలనుండిఇహలోక భవబంధాలనుండి, ఆశాపాశ వలయం నుండి శాశ్వత స్వాతంత్ర్యం. బాహ్యదృష్టికి అగోచరమై సకల ప్రాణులను తన ఆధీనంలో వుంచుకునే ఆ పరమాత్మలో లీనమై శాశ్వత ఆనందస్థితికి చేరుకోవడమే ముక్తి.

అయితే ఈ ముక్తి సాధన అంత సులభమైనది కాదు. పంచేంద్రియాలను తన ఆధీనంలో వుంచుకొనిఇహలోక వాంఛలకు, సుఖాలకు అతీతంగామనసావాచాకర్మేణా సత్య ధర్మాలను పాటిస్తూ సదా భగవత్చింతనలోనే కాలంగడపాలి. ఎన్నో జన్మల కర్మ పరిపక్వత చెందితేనే కానీ ముక్తి సాధ్యంకాదు. ముక్తి సాధనకై మన వేదాంతులు అనేక మార్గాలను సూచించారు. వాటిలో ప్రముఖమైనవి

సాలోక్యసారూప్య, సామీప్య, సాయుజ్య ముక్తులు. వీటన్నిటి పరమార్థం మరుజన్మ లేకుండా పరమాత్మలో ఐక్యంకావడం.  మహామహా జ్ఞానులలైన బ్రహ్మర్షులు మొదలు సర్వ సామాన్య పామర జనాల వరకూ ప్రతీ ఒక్కరూ ముక్తిని కోరుకునేవారే. భక్తిమార్గం ద్వారా ముక్తిని పొందడానికి అందరూ భక్తిని ఆశ్రయిస్తారు. ముక్తి ద్వారా విముక్తిని ఆశించేవారు పరిపూర్ణంగా భగవంతుని పట్ల భక్తివిశ్వాసాలతో శరణాగతిని పాటించాలి.

 అలాకాకుండా ....

'నా తెలివి తేటలకు మెచ్చె నలువ యెపుడో

సిధ్ధపురుషుండ వీవని శివుడు నుడివె

మాయకందవు నీవనె మాధవుండు

ముగురయ్యలు నన్నెద పొగడిరెపుడో'

 (వారణాశి సీతారామశాస్త్రి గారి పద్యం)

అని తనంతటి జ్ఞాని, మహాయోగి  లేడని, త్రిమూర్తులే తన మాటలకు లొంగిపోతారని అహంకారంతో విర్రవీగే నారదుడు, సంసారబంధమనే మాయలో పడి  జన్మ నిరర్ధకం చేసుకుంటున్న మానవులను ఉధ్ధరిస్తానని 'దారాపుత్ర ధనధాన్యాధిక మమకారపు జాడ్యము కొన్నావా.. జీవా! ముక్తి మార్గమును కనలేవా!' అని  జాలిపడే నారదునికి శ్రీకృష్ణుడు తన మాయతో   భార్యపుత్రులను అంటగట్టి మాయా సంసారకూపంలో పడవేసి ఆ మోహంనుండి   బయటపడలేక అతి సామాన్య పామర గృహస్తులా అజ్ఞానంతో ప్రవర్తించే నారదుని అహం అణచి జ్ఞానోదయం కలిగించడం  'శ్రీకృష్ణమాయ' సినిమా లోని ఒక రసవత్తర ఘట్టం. శ్రీకృష్ణుడితోపాటు ప్రేక్షకులందరికీ వినోదాన్ని కలిగించే సన్నివేశం. డైరెక్టర్ సి.ఎస్.రావు ఈ సినిమాను ఆద్యంతం చాలా వినోదభరితంగా ఆసక్తికరమైన రీతిలో తెరకెక్కించారు.

ముక్కు తిమ్మనగారి పారిజాతోపహరణంలోని 'నను భవదీయదాసుని' పద్యం ఈ సినిమా లోనే ప్రథమంగా వినవచ్చింది. కాకపోతే ఆ పద్యం శ్రీకృష్ణ, సత్యభామల పరంగా కాక నారదుడుమాయలపై చిత్రీకరించారు సి.ఎస్.రావు. అలాగే పద్యం చివరలో వచ్చే 'అరాళకుంతలాఅనే విశేషణాన్ని 'వినీలకుంతలా' గా మార్పు చేయించారు.

స్వతహగా దర్శక నిర్మాత అయిన కడారు నాగభూషణంగారు ఈ సినిమాను తాను డైరక్ట్ చేయకుండా అల్లుడు సి.ఎస్.రావుగారికి ఆ బాధ్యత ను అప్పగించారు.

రావూరు సత్యనారాయణ రావుగారి సాహిత్యం, టి.వి.రాజుగారి సంగీతంఘంటసాలవారి అద్వితీయ గళమాధుర్యం, అక్కినేని, కె.రఘురామయ్యల నటనాకౌశలం‌, వీటన్నిటితో  'ముక్తిమార్గమును కనలేవా' గీతం సజీవరాగమై మనలను అలరిస్తోంది. 

ఇదే పాటను మరొక సన్నివేశంలో మారువేషంలో ఉన్న శ్రీకృష్ణుడు (కె.రఘురామయ్యగారు) కూడా పాడడం ఒక విశేషం. ఈ పాట  పాతకాలపు రంగస్థల పౌరాణిక నాటకాల ధోరణిని స్ఫురింపజేస్తుంది.  ఒకరకంగా ఘంటసాల, రఘురామయ్యగార్ల మధ్య ఈ పాట పోటీ పాటగా అనిపిస్తుంది.

టి.వి.రాజుగారు 'ముక్తిమార్గమును కనలేవా' పాటను సింధుభైరవి రాగంలో చేశారు.  వాద్యగోష్ఠిలో పెద్ద హంగామా చేయకుండా గాయకుల గాత్రాన్ని అనుసరించిపోయేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను టి.వి.రాజు సమకూర్చారు.

సింధుభైరవి కర్ణాటక, హిందుస్థానీ శైలులు రెండింటిలో బహుళ ప్రచారంలో వున్న రాగం. కర్ణాటక శైలిలో 8వ మేళకర్త హనుమత్తోడికి జన్యరాగం. హిందుస్థానీ సంగీతంలో సింధుభైరవి అసావేరి థాట్ కు చెందిన రాగం. భక్తి, కరుణ,శోకంవిరహం వంటి రసాల ఆవిష్కరణకు చాలా అనువైన రాగం సింధుభైరవి. సింధుభైరవిలో అసంఖ్యాకంగా సినీమా పాటలు వచ్చాయి. ఘంటసాలగారు పాడిన సింధుభైరవి పాటలెన్నో ఈనాటికీ అజరామరంగా శ్రోతలకు వీనులవిందు చేస్తున్నాయి. 1950-65ల మధ్య ఘంటసాలవారి గళం గురించి చెప్పాలా! అమృతతుల్యమే.  తనకు సహజంగా అలవాటైన 1-1/2 శ్రుతిలోనే 'ముక్తి మార్గమును' పాటను ఘంటసాలగారు నల్లేరుమీద బండి వాటంగా చాలా సునాయాసంగా పాడారు.  అక్కినేని-నారదుడి కి ఘంటసాల-నారదుడు పాడిన మరో అద్భుత గీతం. రాగాధారిత గీతాలెప్పుడూ శ్రోతలకు శ్రవణానందకరమే.





వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 

Saturday, 25 October 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 105వ భాగం - ఏనాడు మొదలిడితివో ఓ విధి

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నూటనాలుగవ భాగం ఇక్కడ

105వ సజీవరాగం - ఏనాడు మొదలిడితివో ఓ విధి

చిత్రం - చంద్రహారం
గానం - ఘంటసాల
రచన - పింగళి

సంగీతం - ఘంటసాల

"ఏమిటీ! సినిమాలలో పాటలు పాడడానికి ఉన్న ఉద్యోగం వదిలేసి వచ్చావా! ఇంతకీ 'సాపాసా'లు పట్టగలవా! ఈ మాట తరచూ నా చిన్నప్పుడు పాండీబజార్లో వినిపించేది. ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఇప్పుడలాటి బాదరబందీయేమీ లేదు సినిమా లో పాటలు పాడడానికి.

 ఇంతకీ 'సాపాసా' లు పట్టడమంటే?

సంప్రదాయ సంగీతంలోని ప్రాథమిక సూత్రాలను (basics) నిత్య సాధన ద్వారా అధ్యయనం చేయడం. 'సరిగమ పదనిస'; 'సనిదప మగరిససప్త స్వరాలు. ఈ సప్తస్వరాలను అనేక కాంబినేషన్లలో వివిధ స్థాయిలలోవివిధ కాలగతులలో శ్రుతిలయలను సమన్వయపర్చుకుంటూ సాధన చేయడం. ఇందుకుగాను 16 వ శతాబ్దానికి చెందిన కర్ణాటక దేశపు పురందరదాసులవారు అభ్యాస సంగీతానికి కావలసిన సిలబస్ ను రూపొందించారు. సరళీస్వరాలుజంటస్వరాలు, అలంకారాలు, గీతాలతో ప్రారంభించి క్రమక్రమేణా స్వరజతులు, వర్ణాలుకీర్తనలుకృతులుజావళీలుతిల్లానాఇత్యాది శాస్త్ర గ్రంథం నేర్చుకోవడానికి కావలసిన విధివిధానాలను ఏర్పరిచినది పురందరదాసులవారే. ఈనాడు మనం  నేర్చుకుంటున్న, వింటున్న సరళీస్వరాలు, జంటస్వరాలుఅలంకారాలు అన్నీంటిని పురందరదాసులవారు 'మాయామాళవగౌళ రాగం'లో నిర్దేశించారు.

'సరిమా గరి సరి గరిస

రిమ పద మప దప మగరిస'

లంబోదర లకుమికర

అంబాసుత అమరవినుత'

అని సంగీత విద్యార్థులంతా ప్రప్రథమంగా నేర్చుకునే పురందరదాసు గీతం కూడా మాయామాళవగౌళ రాగ జన్యమే. మలహరి రాగం. మాయామాళవగౌళ అతి ప్రాచీనమైన రాగం. దీని పూర్వనామం మాళవగౌళ. 72 మేళకర్త రాగ చట్రం రూపొందినప్పుడు మాళవగౌళ రాగానికి ముందు 'మాయా' అనే మాటను చేర్చి 15వ మేళకర్త గా 'మాయామాళవగౌళ' అనే నూతన నామాన్ని సృష్టించడం జరిగింది. సంగీత ప్రపంచమంతా సదా స్మరించుకోదగ్గ మహనీయులు ముగ్గురే ముగ్గురు - 13వ శతాబ్దంలో కాశ్మీర దేశంలో పుట్టి మహారాష్ట్ర దేశానికి వలసపోయిన సారంగదేవుడురెండవవారు 16వ శతాబ్దానికి చెందిన కర్ణాటక దేశ సంగీత విద్వాంసుడు, శ్రీవైష్ణవ భక్తుడు అయిన పురందరదాసులవారు; మూడవవారు 17 వ శతాబ్దంలో తంజావూరు సంస్థాన మంత్రిసంగీత విద్వాంసుడు, పండితుడైన వెంకటమఖి.

సారంగదేవుని 'సంగీత రత్నాకరం', పురందరదాసులవారి అభ్యాస సంగీతంరాగవిభజన చేస్తూ వెంకటమఖి వ్రాసిన 'చతుర్దండి ప్రకాశిక అనే సంగీతగ్రంధం.  ఆనాటినుండి ఈనాటివరకు ఎంతటి ఘనమైన సంగీతవిద్వాంసులైనా పరమపవిత్రంగా, మార్గదర్శకంగా, ఆదర్శనీయంగా  భావిస్తూ అనుసరిస్తూ వస్తున్న ఉత్కృష్ట  సంగీత గ్రంధాలు. కర్ణాటక సంగీతమంటే కర్ణాటక దేశంలో పుట్టిన సంగీతమని అర్ధంకాదు. కర్ణం అంటే చెవి. చెవికి ఇంపుగాశ్రావ్యంగా వినిపించే సంగీతం కర్ణాటక సంగీతంగా భావించాలి.  అటువంటి కర్ణాటక సంగీతాన్ని అభ్యసించేవారంతా ముందుగా నేర్చుకునే రాగం - 15వ మేళకర్త యైన 'మయామాళవ గౌళ'. ఈ రాగంలోనే ప్రాథమికంగా నేర్చుకోవలసిన సరళీస్వరాలు, జంటస్వరాలు, అలంకారాలు స్వరపర్చబడ్డాయి. గురువులు వాటిని ఎలా నేర్పుతారో సంక్షిప్తంగా  ఈ క్రింది ఆడియో లలో విందాము. కర్ణాటక సంగీత విద్యార్థి  తన ప్రాథమిక సంగీతాన్ని మాయామాళవగౌళ రాగంతో నేర్చకోవడం ప్రారంంభిస్తాడు. ఈ రాగంలో స్వరస్థానాల అమరిక, అంటే స్కేల్ పూర్వాంగఉత్తరాంగాలు సమతుల్యం కలిగి వుండడంరెండురాగంలో ఎక్కడా వివాది స్వరాలు లేక పోవడం,   మొదలైన విషయాలు ప్రాథమిక సంగీత శిక్షణకి మాయామాళవగౌళ రాగమే అత్యంత అనుకూలమైన రాగంగా మన సంగీతజ్ఞులు భావించారు. మాయామాళవగౌళ రాగం శాంతశోకవైరాగ్య రసాలను ప్రకటించడానికి అనువైనరాగం. ఉదయసాయంసంధ్యా సమయాలలోనే కాక అన్ని వేళలా ఆలపించదగ్గ రాగం. మాయామాళవగౌళ రాగానికి సమాంతరమైన హిందుస్థానీ రాగం. 'భైరవ్' . 'బౌళి', 'గౌళ', 'రేవగుప్తి', 'లలిత', 'మలహరి', 'నాదనామక్రియ' వంటి రాగాలు  15వ మేళకర్త మాయామాళవగౌళకు జన్యరాగాలుగా ప్రసిధ్ధి పొందాయి.

అటువంటి ఘన చరిత్ర కలిగిన మాయామాళవగౌళ రాగంలో ఘంటసాలగారు ఆలపించిన ఒక అద్భుతమైన గీతమే ఈనాటి మన సజీవరాగం. అదే చంద్రహారం చిత్రంలోని 'ఏనాడు మొదలిడితివో ఓ విధీ! ఏనాటికయ్యెనీ నాటక సమాప్తిఅనే పింగళివారి గీతం. పింగళి సాహిత్యానికి స్వీయ సంగీత నిర్దేశకత్వంలో ఘంటసాల గానం.

పల్లవి: 

ఏనాడు మొదలిడితివో ఓ విధీ!

ఏనాటికయ్యెనీ నాటక సమాప్తి -2

 

చరణం 1: 

జనన మరణాలతో సుఖ దుఃఖములతో -2

ప్రాణులను ఆడించి

పీడింతువేమయ్యా-2

ఎన్నెన్నొ వేడుకల ఈ సృష్టి కల్పించి-2

కనుమూయునంతలో మాయజేసేవయ్య

                                            !ఏనాడు!

చరణం 2:

నేను నాదను ఆశ గగనానికెక్కించి-2

అంతలో పాతాళమున దింతువేమయ్య

                                                        !అంతలో!

తనువు శాశ్వతమంటు మైమరువజేసి-2

తనువును జీవిని విడదీతువేమయ్య

                                            !ఏనాడు!

 

ఏనాడు మొదలిడితివో ఓ విధీ

ఏనాటికయ్యెనీ నాటక సమాప్తి "

జీవితం  ఒక నాటకరంగం. ఒక్క జీవితమనేమిటి! ఈ  విశ్వమంతా నిత్యనూతన నాటకరంగం. జీవులంతా అందులోని చిత్రవిచిత్ర పాత్రధారులు. సర్వసాక్షియైన పరమాత్మే ఈ జగన్నాటకానికి సూత్రధారి. విధి చేసే వింతలన్నీ మతిలేని చేష్టలుగా కనిపించినా, విధివిలాసాన్ని తప్పించే దుస్సాహసాన్ని ఎవరూ చేయలేరు. కన్నుతెరిస్తే జననం; కన్ను మూస్తే మరణం. రెప్పపాటు కాలమే నీ సొంతం. ఆ మూణ్ణాళ్ళ ముచ్చటను కూడా సంపూర్ణంగా అనుభవించకుండా రకరకాల కష్టనష్టాలను కల్పించి జీవుడు దుఃఖపడుతూంటే తాను నడిపించే నాటకాన్ని వినోదంగా చూసి ఆనందించే ఈశ్వరుడితో ఏ విధంగా మొరపెట్టుకోగలడు ' ఏనాడు మొదలిడితివో ఓ విధీ ఏనాటికయ్యెనీ

 నాటక సమాప్తి' అని దైన్యంగా కుమిలిపోవడం తప్ప.

చందనదేశపు భావి మహారాజు చందనరాజును (ఎన్.టి.ఆర్) ఐదేళ్ళ ప్రాయం నుండే  తన సంరక్షణలో  కంటికి రెప్పగా పెంచి పెద్దచేసి అన్ని విద్యలలో ఆరితేరినవాడిగా చేస్తాడు మాలి (ఎస్.వి.రంగారావు).  ఒక దేవకన్య మోహానికి, శాపానికి గురియై అల్పాయుష్కుడైన యువరాజు దుస్థితిని తలచుకొని విరక్తిగా మాలి పాడిన పాట ఇది. 

చంద్రహారం లోని ' ఇది నా చెలి ఇది నా సఖి నా మనోహరి' పాటను గతంలోనే సజీవరాగంగా వినిపించేను. చంద్రహారం సినిమాలోని అన్ని పాటలు ఆపాతమధురాలే. నాకు ఎనిమిది సంవత్సరాల వయసులో విజయనగరం లో 'చంద్రహారం' సినీమా చూసేను. ఆ వయసులో అందులోని ఎన్నో పాటలు నన్ను ఆకర్షించి వుండవచ్చు కాని  అలా జరగలేదు. వివిధ భావావేశాలతో ఘంటసాలగారు సమ్మోహనకరంగా ఆలపించిన ఓ మూడు పాటలు మాత్రం ఆనాటినుండి ఈనాటివరకు నా మెదడులో స్థిరోభవా గా నిలిచిపోయాయి. అవి 'విజ్ఞానదీపమును వెలిగింపరారయ్యా', 'ఇది నా చెలి ఇది నా సఖి', 'ఏనాడు మొదలిడితివో ఓ విధీ' అనే పాటలు.

ఘంటసాల మాస్టారు ఈ పాటను స్వరపర్చడానికి మాయామాళవగౌళ రాగాన్ని ఎన్నుకోవడంలో ఎంతో ఔచిత్యాన్నివిజ్ఞతను పాటించారనిపిస్తుంది. కారణం , మాయామాళవగౌళ సంపూర్ణరాగం. శాంతశోక రసాల ప్రకటనకు చాలా శ్రేష్టమైనది. ఇంతకుముందు చెప్పినట్లు ఈ రాగంలో ఎక్కడా వివాది స్వరాలు లేకపోవడంఆరోహణ, అవరోహణ క్రమంలో స్వరస్థానాల అమరిక సమతుల్యం కలిగివుండడం వలన ఈ గీత స్వరరచన అద్భుతంగా సాగింది. ఈపాట ఆద్యంతం ఘంటసాలవారి గళంలో ధ్వనించిన ఆర్ద్రతనైరాశ్యం అనితరసాధ్యం అంటే అతిశయోక్తి కాదేమో! నాదం పెదవుల మధ్యనుండి కాదునాభిస్థానం నుండి హృదయాంతరాళాలనుండి రావాలనే గురువుల బోధనా సూత్రాన్ని ఘంటసాలగారు తు.చ. తప్పకుండా తన జీవితాంతం ఆచరించారు.

తగుమాత్రపు వాద్యాలు మాత్రమే ఈ పాటలో వినిపిస్తాయి. అందుకుగాను వైలిన్స్ఏక్ తారహేమండ్ ఆర్గన్కోల్, ఫ్లూట్, క్లారినెట్ వంటి వాద్యాలను ఉపయోగించుకున్నారు ఘంటసాల.

చంద్రహారం సినీమా  డైరెక్టర్ కమలాకర కామేశ్వరావుగారి మొట్టమొదటి సినిమా. సూపర్ విజన్ ఎల్విప్రసాద్. తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి నిర్మితమైన చిత్రం చంద్రహారం. తమిళం వెర్షన్ కు  ఘంటసాలగారే సంగీతం నిర్వహించి కొన్ని పాటలు కూడా పాడారు.

1954 ల నాటికే  అక్షరాల 25 లక్షల రూపాయలను దిగమ్రింగి నిర్మాత ల మాడు పగలగొట్టిన  భారీ జానపద తెలుగు చిత్రం చంద్రహారం. అందుకు వారి రెండవ చిత్రమైన పాతాళభైరవిలోని ఎన్.టి.ఆర్, ఎస్.వి.రంగారావు సృష్టించిన ఇమేజే పెద్ద కారణమయిందని చెప్పుకోవడం జరిగింది. సామాన్య ప్రేక్షకుడు ఆశించే కత్తియుధ్ధాలుసాహసాలుథ్రిల్స్ ఏవీ లేకుండా 'ఎన్టీఓడు' పది రీళ్ళపాటు కళ్ళుమూసుకు పడుక్కునే వుంటే సినీమా ఏం ఆడుద్దని' చక్కన్నగారు అభిప్రాయపడ్డారట. 

బాక్సాఫీస్ దగ్గర జయాపజయాల విషయం పక్కన పెడితే చంద్రహారం ఉన్నత విలువలతో నిర్మించబడిన ఉత్తమ సంగీతభరిత చిత్రం. అందులోని ఎన్నో పాటలు ఈనాటికీ సజీవ రాగాలే.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 



Saturday, 18 October 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 104వ భాగం - రాధనురా నీ రాధనురా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
నూటమూడవ భాగం ఇక్కడ

104వ సజీవరాగం - రాధనురా నీ రాధనురా

చిత్రం - పెళ్ళిచేసి చూడు
గానం - ఘంటసాల
రచన - పింగళి

సంగీతం - ఘంటసాల

పల్లవి:

రాధనురా ! నీ రాధనురా -2

రాసలీలల ఊసే తెలియని

                                !రాధనురా!

చరణం 1:

కసుగాయల కారాధననురా - రాసలీలల

వలపున కుమిలే ప్రణయజీవులకు

వల్లమాలిన బాధనురా

                                !రాధనురా!

చరణం 2:

ఎంతో తెలిసిన వేదాంతులకే

అంతుదొరకని గాధనురా

మధురానగరి మర్మమెరిగిన

మాధవ నీకే సుబోధనురా!

                                !రాధనురా!

అన్నీ తెలిసిన వేదాంతులకే అంతుదొరకని గాధ రాధ... మధురానగరి మర్మమెరిగిన మాధవునికే సుబోధ రాధ... ఎవరీ రాధ?

సంఘంలో సనాతనధర్మ పరిరక్షణ కోసంపామర జనాలలో ఆధ్యాత్మిక, భక్తిభావనలు పెంపొందించి వారు భగవంతుని సన్నిధిని చేరి ముక్తిని పొందే మార్గం కోసం మహానుభావులెందరో  యుగయుగాలుగా అన్వేషణ సాగిస్తూనేవున్నారు. కలియుగంలో కూడా నాగరికత పెరిగినకొలది భగవంతుని ఉనికికి సంబంధించిన జిజ్ఞాస అమితంగా పెరిగింది. ధర్మపరిరక్షణ కోసం పరమాచార్య త్రయం -- జగద్గురు ఆదిశంకరాచార్యులు, భగవద్రామానుజాచార్యులుమధ్వాచార్యులు  అద్వైతవిశిష్టాద్వైతద్వైత సిధ్ధాంతాలను ప్రచారంలోకి తీసుకువచ్చారు.  ఈ మూడు సిధ్ధాంతాలతోపాటు ద్వైతాద్వైత , శుధ్ధాద్వైత సంప్రదాయాలు కూడా ఉద్భవించాయి. జీవాత్మపరమాత్మ ఒకటేనా? లేక , వేర్వేరా? వాటి ఉనికిని గురించి, అనుసంధానం గురించి, జీవి పరమాత్మలో లీనమై ముక్తిని సాధించడానికి సంబంధించిన తార్కిక, వేదాంత బోధనలు, చర్చలువాద ప్రతివాదాలు కొనసాగుతునేవున్నాయి. ఈ వివిధ మార్గాల సిధ్ధాంతాలలో ఉత్తమమైనదేది అనే విషయంలో  ఏకగ్రీవ నిర్ణయం సాధించలేక వేదాంతులు, మఠాధిపతులుసాధు సత్పురుషులు వారి వారికి నచ్చిన మార్గాన్ని అనుసరించసాగారు.

వీటన్నిటికి తోడుగా మరొక సిధ్ధాంతం కూడా ప్రాచుర్యంలోకి తీసుకురాబడింది. అదే - రాధా మాధవ ప్రణయ భక్తి తత్వం. పరమాత్మ సృష్టించిన స్త్రీమూర్తి యొక్క రెండు అంశలలో ఒకటి శ్రీలక్ష్మిగా మహావిష్ణువును చేరగా, మరొక అంశ రాధగా గోకులాన  జన్మించి కృష్ణుని ప్రాణ సఖిగా  రాధామాధవ ప్రణయభక్తి సిధ్ధాంతానికి మూలపురుషులైయ్యారు. మహాభాగవత పురాణంలో అక్కడక్కడ రాధ ప్రసక్తి కనిపించినా రాధాకృష్ణుల ప్రణయ సంబంధం విషయమై వేదాంతులకే అంతుచిక్కని రహస్యాలెన్నో నిక్షిప్తమై వున్నాయనే భావిస్తారు. రాధామాధవ తత్త్వం అలౌకికమైన ప్రణయ తత్త్వం. జీవాత్మపరమాత్మల ఆత్మీయతానుబంధ తత్త్వం. కృష్ణుని కోసమే పుట్టిన రాధ తన ఆత్మను పరమాత్మ యైన కృష్ణునికే అర్పించుకున్నది. రాధది మధురభక్తి. అన్నమాచార్య, జయదేవ కవుల భక్తి శృంగార రచనలెన్నో రాధాకృష్ణుల మధురప్రేమ తత్త్వానికి ప్రతీకలు.

అలౌకికమైన రాధమాధవ ప్రణయం పరమ పవిత్రంరసవత్తరం, ఆదర్శవంతం అని భావించి తరించే భక్తులెందరో.  అలాటి ఒక ప్రణయారాధకుడు తనను తాను రాధగా ఊహించుకొని తన మనోభావాలను ఒక మధురగీతంగా ఆలపిస్తున్నాడు. ఆ గీతమే నేటి ఘంటసాలవారి సజీవరాగం... 

ఆజన్మ బ్రహ్మచారి పింగళి నాగేంద్రరావుగారి హాస్యచమత్కారశృంగార గీతం - 'రాధనురా నీ రాధనురా' 1952ల నాటి 'పెళ్ళిచేసి చూడు' చిత్రంలోనిది. కొత్తగా పెళ్ళయి మనుగుడుపులకోసం అత్తవారింటికి చేరిన కొత్త పెళ్ళికొడుకు భార్యబావమరదుల సమక్షంలో మనసువిప్పి, కులాసాగా హాయిగా పాడుతున్న పాట. మనోజ్ఞమైన స్వీయ స్వరకల్పనలో బల్ హుషారుగా ఘంటసాల మాస్టారు గానం చేసిన గీతం. 1952 లోని  'పెళ్ళిచేసి చూడు' సినీమానాటికే గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాలగారు ఎంత ప్రాచుర్యం పొందారో పింగళివారి ఈ కితాబు చూస్తేనే తెలుస్తుంది. పెళ్ళిచేసి చూడు సినిమా ట్రైలర్ లో ఘంటసాలగారిని గురించి ఇలా అన్నారు...."ఇంట ఇంటను గంట గంటకు ఎవ్వరి కంఠం వింటారో ఆ ఘంటసాలవారీ చిత్రానికి నాదబ్రహ్మలండీ".  సినిమా పబ్లిసిటీ కోసం పెళ్ళి పిలుపుగా రాసిన ఈ పాటను పాడింది కూడా ఘంటసాలగారే. "రసపట్టులెరిగిభావోచితరాగ సరళిని శబ్దోచిత రమ్యతనూ సమకూర్చి బాణీలు కట్టుటలో ఘంటసాల గానకళా పట్టభద్రుడే" అని అన్న పింగళి వాక్కులు అక్షరలక్షలే.

పెళ్ళిచేసి చూడు సినిమా ద్వారా అంతవరకు ఏ సినిమా సంగీతదర్శకుడు ఉపయోగించని చక్రవాకం, చారుకేశి వంటి సంప్రదాయ రాగాలను శ్రోతలకు పరిచయం చేశారు ఘంటసాల.  శ్రీ కొడవటిగంటి కుటుంబరావు అంతటి రచయిత, విమర్శకుడు ఈ చిత్ర సంగీతం పై సమగ్ర వ్యాసాలు ప్రచురించి ఘంటసాల సంగీతప్రతిభను ఎంతగానో కొనియాడారు. పెళ్ళిచేసి చూడు లోని ప్రతీ పాటా ఒక ఆణిముత్యం. శ్రావ్యమైన ఘంటసాల గళం సంగీతాభిమానులకు తన్మయత్వాన్ని కలిగించింది. హీరో ఎన్.టి.రామారావుకు ఘంటసాల గాత్రం తప్పనిసరి అనే భావన ప్రజలలో కలిగించిన సినిమా పెళ్ళిచేసి చూడు. అభ్యుదయ వాదియైన కథానాయకుడు మంచి సంగీతాభిలాషి కూడా. హార్మోనియం వాయిస్తూ పాటలు పాడుకునే అలవాటు. కానీ, కథానాయకుడు ఎన్.టి.ఆర్ కు హార్మోనియం పట్టుకోవడమే తెలియదు. అందువల్ల ఘంటసాలగారు వాహినీ స్టూడియోలో పాటలు కంపోజ్ చేస్తున్నప్పుడు ఆయన అనుమతితో పక్కనే కూర్చొని హార్మోనియం ఎలా వాయిస్తారో క్షుణ్ణంగా పరిశీలించి, ఆకళింపుచేసుకొని ఆ పాటల షూటింగ్ లో పాల్గొన్నట్లు చెపుతారు. ఆనాటి కళాకారులలో వుండే sincerity, commitment అలాంటిది.

'రాధనురా నీ రాధనురా' పాట కూడా హీరో హార్మోనియం వాయిస్తూ పాడేదే. బావమరది పాత్రధారి నటుడు జోగారావు తబలిస్ట్. ఈ ఇద్దరు కలసి చేసిన గానాబజానా ఆ కాలపు పెళ్ళింటి వాతావరణాన్ని మన కళ్ళముందుంచుతుంది. ఘంటసాలగారు ఈ పాటకు నఠభైరవి రాగాన్ని ఉపయోగించారు. నఠభైరవి కర్ణాటక సంగీతంలో 20వ మేళకర్త. అంటే, ఆరోహణ‌అవరోహణ క్రమంలో ఏడు స్వరాలు గల సంపూర్ణరాగం. హిందుస్థానీ బాణీలో నఠభైరవి ని అసావేరి థాట్ గా చెపుతారు. నఠభైరవి భక్తిరస ప్రధాన రాగం. 'రాధనురా నీ రాధనురాపాట మంద్రస్థాయిలో ఒకదగ్గర కాకలినిషాదం, మరోదగ్గర ప్రతిమధ్యమం  అన్యస్వరాలుగా ప్రయోగం చేసినా అది నఠభైరవి రాగ స్వరూపానికి ఇబ్బందికరం కాని రీతిలో ఘంటసాల ఈ పాటను నడిపించారు. ఈ నాడు వస్తున్న పాటలతో పోలిస్తే చాలా చిన్న పాట. పల్లవి ఓ రెండు చిన్న చరణాలు మాత్రమే గల పాట.  అయినా, కవిగా పింగళిస్వరకర్త గాయకుడిగా ఘంటసాల తమ తమ ముద్రలను  ప్రస్ఫుటం చేసి ఈ పాటను సజీవరాగం చేశారు. ఘంటసాలవారి కంఠంలోని మార్దవం, మధురత్వం శ్రోతలకు మైమరపును కలిగిస్తుంది.

ఈ పాటకోసం ఘంటసాలగారు ఫ్లూట్, క్లారినెట్, వైలిన్స్హార్మోనియం, పియోనాతబలాడోలక్, మువ్వల వంటి వాద్యాలను ఉపయోగించారు.

తెరపై ఎన్.టి.ఆర్., జోగారావు, జి వరలక్ష్మి, మాస్టర్ కుందు, బాలకృష్ణ, పద్మనాభం చక్కని హావభావాలు కనపర్చి అలనాటి పెళ్ళింటి వాతావరణాన్ని జ్ఞప్తికి తెచ్చారు.

డెభ్భై ఎనభై ఏళ్ళ క్రితం మన సమాజంలో వ్రేళ్ళు తన్నుకుపోయిన వరకట్న  దురాచారాన్ని ఖండిస్తూ అభ్యుదయ భావాలతో  నిర్మించబడిన హాస్యరస కుటుంబకథా సాంఘిక చిత్రం 'పెళ్ళిచేసి చూడు'. ఈ సినిమా పెద్దలకు మాత్రమే కాదు చిన్నపిల్లలకు కూడా. చిన్నపిల్లల పాత్రలకే నాలుగు పాటలను పెట్టి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు.

ఒక సినిమా విజయానికి స్టార్ వాల్యూ కంటే స్టోరీ వాల్యూయే ముఖ్యమని నిరూపించిన సినిమా పెళ్ళిచేసి చూడు. ఈ సినిమా హీరో అయిన ఎన్.టి.రామారావు పాత్ర సినిమా ప్రారంభమైన అరగంట తర్వాతే ప్రవేశమౌతుంది. దీనినిబట్టి చూస్తే ఆనాటి దర్శక నిర్మాతలు  చక్కని కథాకథనానికి శ్రావ్యమైన పాటలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చేవారని తెలుస్తోంది.

విజయా ప్రొడక్షన్ చక్రపాణిగారికి, దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ గారికి  హాస్యరసమంటే మక్కువ అనే విషయం వారి సినీమాలన్నీ నిరూపిస్తాయి. అసభ్యతవెకిలితనం లేని హాస్యం విజయా వారి చిత్రాలన్నింటినీ ప్రేక్షకులు ఆదరించారు.

ఎల్.వి.ప్రసాద్ దర్శకుడిగాఘంటసాల సంగీత దర్శకుడిగా వచ్చిన చిత్రాలు ముచ్చటగా  మూడు మాత్రమే. 'మనదేశం', 'షావుకారు', 'పెళ్ళిచేసి చూడు'. సంగీతపరంగా ఈ చిత్రాలన్నీ బహూళజనాదరణ పొందాయి. అయితే ఎల్.వి.ప్రసాద్ గారికి ఘంటసాలగారిపట్ల కలిగిన విముఖత కారణంగా ఆ తర్వాత ఈ ఇద్దరు ప్రముఖులు కలసి ఏ సినిమాకు పనిచేయలేదు, విజయావారి 'అప్పుచేసి పప్పుకూడు' లో మాత్రం ప్రసాద్ గారికి ఘంటసాలగారి చేత పాడించక తప్పలేదు. ప్రసాద్ గారి సొంత చిత్రాలైన 'ఇలవేల్పు', 'ఇల్లాలు', లో ఘంటసాలగారి పాటలే లేవు. చిత్ర విచిత్ర మనస్తత్త్వాలతో నిండిన ఈ చిత్రసీమలో ఇలాటి రాగద్వేషాలను సర్వసాధారణంగానే పరిగణించి ఎవరి బాటలో వారు పయనం సాగిస్తారు.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము. 

ప్రణవ స్వరాట్ 

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 107వ భాగం - బలే మంచి రోజు

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...