Saturday, 17 October 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 37 - ఎందుకు పిలిచితివో రాజా

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 37


మర్మయోగి - ఎందుకు పిలిచితివో రాజా 


అంగ, వంగ, కళింగ, కాశ్మీర, కాంభోజ, గాంధార, కామరూప, కొంకణ,  టెంకణ, సౌరాష్ట్ర, మగధ, మాళవ, మహారాష్ట్ర, బంగాళ, నేపాళ, పాంచాల, సింహళ, చోళ,  తమిళ, ఆంధ్ర, కేరళ, విదర్భ, విదేహ, కేకేయ, కోసల, కుంతల, మద్ర, విదేహ, బాహ్లిక, ఘూర్జర, వంటి అనేక పెద్ద, చిన్న దేశాల సముదాయం ఒకప్పటి ఈ భరతఖండం. అనాదిగా వస్తున్న ఐక్యతారాహిత్యం వలన  ఈ దేశాల పాలకులెప్పుడు సరిహద్దు పోరాటాలతో, రాజ్యవిస్తరీకరణ యుద్ధాలతో, శాంతి సామరస్యాలకు తరచూ భంగం వాటిల్లేది. బలం కలవాడిదే రాజ్యం. ఇదే అదనుగా చాప క్రింద నీరులా కాలక్రమేణా వచ్చి చేరారు  విదేశీయులైన  కుషానులు, హూణులు, తురుష్కులు, మహమ్మదీయులు, డచ్ లు, పోర్చుగీస్లు, ఫ్రెంచ్ లు, బ్రిటన్ లు. వర్తక, వ్యాపారాలు నెపంతో ఈ దేశంలో చొరబడి స్థానిక పాలకులను తమ ధనబలంతో ఆయుధబలంతో లొంగదీసుకుని యావత్ ఉపఖండాన్ని తమ స్వాధీనం చేసుకుని  స్థానిక ప్రజలను తమ బానిసలుగా చేసుకున్నారు. ఆఖరుగా వచ్చి మూడున్నర శతాబ్దాల పాటు ఈ దేశసంపదలను కొల్లగొట్టి ఇక్కడి ప్రజలను సంపూర్ణంగా నిర్వీర్యులను చేసిన బ్రిటిష్ వారిని ఈ దేశం నుండి వెళ్ళగొట్టడానికి స్వాతంత్ర్య సమరయోధులు ఎంతగా పోరాడవలసి వచ్చిందో, ఎంతోమంది త్యాగధనులు తమ  ప్రాణాలను కొల్పోయారో భారతదేశ చరిత్రను   అధ్యయనం చేసిన వారందరికీ తెలిసినదే.

అనైక్యతతో సదా అంతఃకలహాలతో సతమతమయ్యే కొంతమంది రాజుల భోగలాలసతను, వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని కుట్రదారులు  మంచిగా వుంటూ అదను చూసి రాజును వెన్నుపోటుపొడిచి రాజ్యాన్ని తమ కైవసం చేసుకునేవారు. దీనివలన ఎన్నో రాజవంశాలు నాశనమయ్యాయి. నూతన పాలకుల అరాచకకృత్యాల వలన ప్రజలంతా సామాన్య ప్రజలు తీరని కష్టాలతో నానా బాధలు పడుతూ తమను కాపాడే నాయకుడి కోసం ఎదురుచూస్తూ భారంగా రోజులు నెట్టుకు వచ్చేవారు.

ఇటువంటి బలహీనులైన రాజులను, వారి పంచనచేరి రాజు పేరిట ప్రజల ధనాన్ని, సంపదలను కొల్లగొట్టే కుట్రదారులను ఎదిరించి పౌరుషం, శౌర్యప్రతాపాలు గల యువనాయకులు విప్లవోద్యమాలు సాగించి అక్రమార్జన చేసేవారిని కొల్లగొట్టి  బడుగు బలహీనవర్గాల వారికి సహాయం పడేవారు. మొత్తం మీద ప్రశాంతత, సుఖసంతోషాలకు నోచుకోని ప్రజలతో ఈ దేశ రాచరికపు సంస్థానాలు కొన్ని అల్లకల్లోలంగా, అస్తవ్యస్తంగా వుండేవి.

అలాంటి సామంత రాజ్యాలలో ఒకటి మహేంద్రగిరి. మహేంద్రగిరి మహారాజు భార్యా వియోగంతో బాధపడుతూ రాజ్యపాలనా భారాన్ని తనకు నమ్మకస్తుడు, బావమరిదియైన సేనాధిపతికి అప్పగించి తన ఇద్దరు కొడుకుల సంరక్షణను గమనించుకుంటూ హాయిగా కాలం గడిపేవాడు. అలాంటి మహారాజు ఆశ్రయాన్ని కోరుతూ ఒక నర్తకి, ఆమె అనుచరుడు వచ్చి చేరుతారు. ఆ నర్తకి తన అందచందాలను ఎరగావేసి మహారాజును తనకు దాసుడిని చేసుకుంటుంది. క్రమక్రమంగా ఆశ్రయం కోరి వచ్చిన నర్తకి రాజుకు, రాజ్యానికి రాణి అవుతుంది. ఆ రాణి, ఆమె అనుచరుడు చేసే అమానుష కృత్యాలతో ప్రజలంతా కష్టపడుతూ ఉంటారు. దేశద్రోహం నేరం క్రింద మహారాజు బావమరిదికి దేశబహిష్కార శిక్ష వేసి మరికొందరు రాజభక్తులను చెరలోవేసి  వేధిస్తూంటుంది. 

అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు నౌకా విహారానికి వెళ్ళిన మహారాజు ప్రమాదవశాత్తు నదిలోపడి మరణిస్తాడు. అదే రోజు మహారాజు కొడుకులు ఇద్దరు వున్న రాజమందిరం అగ్నిప్రమాదంలో సంపూర్ణంగా భస్మమైపోతుంది. నీటిలోపడి మహారాజు, అగ్గిలోపడి రాజు వారసులు మరణించడంలోని మర్మం ప్రజలకు అర్ధమైనా నిస్సహాయంగా వుండి పోవాల్సి వస్తుంది. శత్రుశేషం తీరినందుకు రాణి  అనుచరుడు మహదానందంతో మత్తు పదార్థాలు సేవిస్తూ మరింత నిషా, ఖుషీ కోసం సుందరాంగులను ఆహ్వానించగా వారు ఏమీ తెలియనట్లు 'ఎందుకు పిలచితివో రాజా...' అంటూ తమ ఆటపాటలతో అతనిని మరింత రెచ్చగొడతారు ....

 

ఘంటసాల సాకీ:  

మధువు మనకేల సఖియరో

మరచిపొమ్ము  కమ్మ కమ్మని జవరాల రమ్ము రా- రమ్ము

 

జమునారాణి & కోరస్: 

ఎందుకు పిలచితివో రాజా 

అందాల పొందుకో  వేరెందులకో !ఎందుకు!

 

తీపి సొగసుల సింగారమే పసందు

నేడు చేయాలి మోవి తేనియల విందు హోయ్

మందార గంధము తో మై పూత  పూయుటకో

మరు మల్లె మమతల మది ఉయ్యాల లూగుటకో!ఎందుకు!

 

కో:

మేలి  సరసాల జలసాల తేలవోయ


ఘం: 

ఊ..ఊ.. అహ్హహ్హ హాయి


కో: 

హాయి చేతికందే వృధా చేయకోయి  ఇంతి సరసకు చేరగానే

ఇటుల పెడమొగ మగుటకా పండువెన్నెల పరువమంతా

దండుగొనరించేందుకా !ఎందుకు!

ఆ... తానమొంది మేను తహతహలాడేను

జాలమేల బాళి సైపలేను


జ: 

కలసి జలకములాడి కలికిని వలచి కులికేటందుకా


కో: 

చెలిమి చెక్కిలి చేత నిమురుచు చిటికె వేసేందుకా

ఎందుకు ఎందుకు ఎందుకు పిలచితివో 

అంటూ వనితల ఆటపాటల  మైకంలో, సురపానీయాల మత్తులోనున్న రాణి అంగరక్షకుడు పూర్తిగా తెలివిలోకి రాకముందే అతను సేవిస్తున్న మధు పానీయాలలో విషప్రయోగం జరగడంతో   రాణి  ఆంతరంగిక రహస్యాలు బయటకు వచ్చే మార్గాలన్నీ మూయబడ్డాయి.

మరి, ఆ రాణి అకృత్యాలు ఆగేనా!  రాణికి అండదండలు ప్రసాదిస్తున్న యోగి ఎవరు! ప్రజలు కష్టాలు తీరేనా! అసలు మహారాజు, ఆయన కొడుకులు నిజంగానే మరణించారా! వీటికి సమాధానాలు దేశ చరిత్రలో లభించదు. మీ అభిమాన టెలివిజన్ ఛానెల్స్ లో ''మర్మయోగి" ని వెతికి పట్టుకుంటే సారస్వమైన విషయాలెన్నో బయటపడతాయి.

ఈలోగా 'మర్మయోగి' ని గురించి నాకు తెలిసిన నాలుగు విషయాలు చెపుతాను.

తెలుగు సినిమా దర్శకనిర్మాతల దృష్టిలో అంతగా పడని కవి, నాటక రచయిత, హేతువాది అయిన ముద్దుకృష్ణను తెలుగులో సినీమాలు తీసిన తమిళ నిర్మాతలు పక్షిరాజా స్టూడియో, జూపిటర్ పిక్చర్స్ వారే కొంతవరకు ప్రోత్సహించారు. ముద్దుకృష్ణ వ్రాసిన 'అశోకం' నాటకం తెలుగునాట ఎంతో సంచలనం సృష్టించింది. రావణ వధ  తర్వాత సీతను స్వీకరించడానికి అగ్నిప్రవేశం చేసి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోమని అడిగిన రాముడిపై సీత తిరుగుబాటే 'అశోకం' నాటకం కథాంశం. ముద్దుకృష్ణగారి మరో అద్భుత  సృష్టి 'వైతాళికులు' కవితా సంకలనం. 

తెలుగు సాహితీ ముద్దుబిడ్డలనదగ్గ అబ్బూరి, కవికొండల, విశ్వనాధ, దేవులపల్లి, చింతా, తల్లావఝుల, రాయప్రోలు, గురజాడ, దువ్వూరి, బసవరాజు, తల్లాప్రగడ, శ్రీశ్రీ, పింగళి, కాటూరి, నోరి, నండూరితో పాటు  మరెందరో శ్రేష్ట కవుల ప్రముఖ కవితలన్నింటిని వైతాళికులు పేరిట సేకరించి, సంకలనపర్చి తెలుగువారికి ఎంతో మేలు చేశారు ముద్దుకృష్ణ.

అటువంటి కవిశ్రేష్టుడే జూపిటర్ పిక్చర్స్ వారు  1964 లో తీసిన 'మర్మయోగి' సినిమాకు సంభాషణలు వ్రాశారు. 'సమగ్ర ఆంధ్ర సాహిత్య పరిశోధనాత్మక గ్రంథ' రచయిత ఆరుద్ర ,  'జానపద సాహిత్య కవిబ్రహ్మ' కొసరాజు మర్మయోగి పాటలను వ్రాశారు. సంగీతం, గానం 'అమరగాయకుడు' ఘంటసాల. మర్మయోగి సినిమా లోని పాటలను ఘంటసాలగారితో పాటు జమునారాణి, పి.లీల, పి.సుశీల, ఎ.పి.కోమలు పాడారు. ఆ సినిమాలో  ఏడు పాటలు ఓ రెండు పద్యాలు వున్నాయి.

కథాపరంగా కొంత ప్రాధాన్యత, వైవిధ్యం గల పాట నేటి మన సజీవరాగం 'ఎందుకు పిలచితివో'.

ఈ పాటలోని ఘంటసాల గారి వాయిస్ మాడ్యులేషన్, భావప్రకటన ఈ పాటికే హైలైట్.  నిజానికి ఈ నృత్యగీతంలో అభినయించిన  లంక సత్యం, సి.ఐ.డి.శకుంతల, ఉదయ చంద్రిక, కౌసల్య మొదలగువారు ఓ చిన్నపాటి నటులే అయినా ఘంటసాలగారి గాన ప్రతిభ వలన ఈ నృత్య గీతానికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. లంక సత్యం గొంతులోని కరకుదనాన్ని, జీరను  ఈ పాటలో చాలా స్పష్టంగా, సమర్ధవంతంగా వ్యక్తీకరించారు ఘంటసాల. ఎ.పి.కోమల, జమునా రాణి  ఈ పాటను పాడారు. గాయనిమణుల గాత్రధర్మం బాగా ఎరిగిన  ఘంటసాల కోమల, జమునా రాణిల స్థాయిననుసరించి ఆయా చరణాలను వీనుల విందుగా పాడించారు. 

ఘంటసాల  ఈ నృత్య గీతాన్ని హేమంత్ రాగ స్వరాలతో వరసకూర్చారు. హేమంత్ ఒక హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం రాగం. బిలావల్ థాట్ కు చెందిన ఔడవ-సంపూర్ణ రాగం. ఆరోహణ లో ఐదు, అవరోహణ లో ఏడు స్వరాలుంటాయి. ఆరోహణాక్రమంలో రిషభ(రి), పంచమా(ప) లు ఈ రాగానికి వుండవు. హేమంత్ రాగంలో అన్నీ శుద్ధ స్వరాలే వుండడం గమనార్హం. రహస్యం చిత్రంలోని 'సాధించనౌనా జగానా...' ; శకుంతల లోని ' సరసన నీవుంటే జాబిలి నాకేలా...' పాటలను ఈ హేమంత్ రాగంలోనే చేశారు ఘంటసాల. వారి భగవద్గీత లోని 59,  60 శ్లోకాలు కూడా ఈ హేమంత్ రాగంలోనే వున్నాయి.

హిందుస్థానీ ఖవాలి రీతిలో సాగే ఈ నృత్య గీతంలో ప్రధానంగా వినిపించే హార్మోనియంను సంగీతరావు, ఆర్గన్ ను హుస్సేన్ రెడ్డి,  తబలా డోలక్ లను ప్రసాద్, జడ్సన్,  సుబ్బారావులు, ఫ్లూట్ ను రాజేంద్ర, సితార్ ను జనార్దన్ వాయించారు. ఈ వాయిద్యాలతో పాటు వయొలిన్స్, పియోనా,  హార్ప్, క్లారినెట్, తంబొరిన్, కబాష్ వంటి వాద్యాలను కూడా ఉపయోగించారు ఘంటసాల.

మర్మయోగి లోని మంచి పాటల్లో ఎన్నదగ్గ గీతం 'ఎందుకు పిలచితివో'. ఇదే సినిమాలో పి.లీల పాడిన 'నవ్వుల నదిలో పువ్వుల పడవ' పాటలో కూడా శ్రోతలకు బాగా గుర్తుండిపోయేది ఘంటసాలవారి నవ్వులు, హమ్మింగ్ లే.

సినిమా టైటిల్స్ తన పాత్రకు సంబంధించినవే వుండాలనే నిర్బంధంకాని, పట్టుదలకాని వున్న హీరో కాదు ఎన్.టి.ఆర్., at least మర్మయోగి సినిమా నాటికి. మర్మయోగి సినిమా కథానాయకుడు ఎన్.టి.రామారావే అయినా కథంతా ఎక్కువగా వ్యాంప్ పాత్రధారిణి లీలావతి (కన్నడ నటి), మహారాజు/రాజగురువు/మర్మయోగి పాత్రధారి గుమ్మడి చుట్టే వుంటుంది. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్. ఎక్కువగా ఛత్రపతి శివాజీ గెటప్ లో కనిపించి తన అభిమానులకు మిక్కిలి ఆనందాన్ని కలుగజేశారు.

విలియం షేక్స్పియర్ 'మ్యాక్ బెత్', మారీ కొరెల్లి 'వెన్డట్టా', ' రాబిన్ హుడ్ కథాపాత్రల ఆధారంగా జూపిటర్ పిక్చర్స్ తయారుచేసిన కథను ఎమ్.జి.ఆర్., అంజలీదేవి, మాధురీదేవి, నంబియార్, సహస్రనామం, సెరుకళత్తూర్ సామ,  మొదలగు వారితో 'మర్మయోగి' గా తమిళంలో ' ఏక్ థా రాజా' గా హిందీలో ను ఒకేసారి నిర్మించి 1951లో విడుదల చేశారు. మర్మయోగి ఘనవిజయం ఎమ్.జి.ఆర్. ప్రజా నాయకుడి ఇమేజ్ కు ఎంతో సహాయపడింది. అదే జూపిటర్ పిక్చర్స్ 1964 లో అదే మర్మయోగి జానపద కథను తెలుగులో తీసి విడుదల చేశారు.

ఎన్.టి.రామారావు, కాంతారావు, గుమ్మడి, లీలావతి, కృష్ణకుమారి, ఎ.వి.సుబ్బారావు, బాలకృష్ణ, లంక సత్యం,  మీనాకుమారి మొదలగువారు నటించిన ఈ చిత్రానికి ప్రముఖ దర్శక నిర్మాత బి.ఎ.సుబ్బారావు దర్శకత్వం వహించారు.

కొసమెరుపు:

1935ల నుండి చిత్రనిర్మాణం సాగించి  తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 45 సినిమాలు తీసిన జూపిటర్ పిక్చర్స్ సంస్థ ఆఖరి చిత్రం  1964 లో వచ్చిన తెలుగు 'మర్మయోగి' యే. ఆ తర్వాత జూపిటర్ పిక్చర్స్ మరే భాషలోనూ సినిమాలు తీసినట్లు ఏ సమాచారం లేదు.


వచ్చే వారం ఘంటసాల వారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 37 - ఎందుకు పిలిచితివో రాజా

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను...