అధ్యాయం - 2. - భాగం 1
నేడు కోట్లాది తెలుగువారల అత్యంత అభిమాన, ఆరాధ్యగాయకుడు శ్రీ ఘంటసాల వేంకటేశ్వరావు గారి 52వ వర్ధంతి. 52 ఏళ్ళకే ఈ లోకంతో బంధాన్ని తెంచుకొని మనకు తెలియని లోకాలకు తరలి పోయి అప్పుడే 52 సంవత్సరాలు అవుతున్నదంటే నమ్మశక్యం కాదు. భౌతికంగా ఘంటసాల మనకు దూరమైనా ఆయన పాట, మాట, రూపం మన మనస్సుల్లో ఇంకా పదిలంగానే వుంది. తెలుగు భాష వున్నంతవరకు ఘంటసాల పాట వినిపిస్తూనేవుంటుంది.
సంగీత సరస్వతి మానసపుత్రుడు ఘంటసాల. తెలుగువారి అదృష్టంకొద్ది లభించిన అపురూప గానపెన్నిధి. కఠోర పరిశ్రమతో సంప్రదాయ, శాస్త్రీయ సంగీతాలలో అపారమైన ప్రజ్ఞను సాధించినప్పటికి అధునాతన లలితసంగీత నిర్మాతగా ఘంటసాల వేసిన ముద్ర ఎన్నటికి చెరగదు, చెరపబడదు.
1944 లో తెలుగు చలనచిత్ర రంగప్రవేశం చేసినది మొదలు 1974 లో (అతి చిన్నవయసులో 52 ఏళ్ళు) నిర్యాణం చెందేంతవరకుఘంటసాల పాట, ఘంటసాల సంగీతం తెలుగువారందరినీ తీవ్రంగా ప్రభావితం చేసింది. సుమధురమైన గాత్రం, ఆపాతమధుర స్వరరచనలు, ఉన్నత వ్యక్తిత్వం, సామాజిక స్పృహ ఘంటసాలను తెలుగువారి ఆరాధ్యపురుషునిగా చేసాయి. మరి ఏ ఇతర గాయకుడికి లభించని ప్రజాదరణ, అభిమానం, గౌరవమర్యాదలు ఘంటసాల సొత్తై ఎవరికీ అందనంత ఉన్నతశిఖరాలపై కూర్చుండబెట్టాయి. రాశికన్నా వాసి యే మిన్నయని నిరూపించిన ఏకైక లలితసంగీత గాయకుడు మన ఘంటసాల. తన 30 సంవత్సరాల సినీజీవిత కాలంలో తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషలలో పాడిన పాటలు నాలుగువేలకు లోపే అయినా, స్వర రచన చేసినది 120 సినీమాలకే అయినా అవి అపూర్వ చరిత్రను సృష్టించి ఘంటసాలవారిని మరపురాని మధురగాయకుడిగా నిలబెట్టాయి. మానవతా దృక్పథంతో ఘంటసాల సమాజానికి, చిత్రసీమకు చేసిన సేవలను పాలిత ప్రభుత్వాలు తగురీతిలో గుర్తించకపోయినా, కోట్లాది తెలుగు హృదయాలు కనపరుస్తున్న భక్తిపూర్వక ప్రేమాభిమానాలు ఘంటసాలవారిని అత్యున్నత బిరుదులన్నింటికీ అతీతుడిని చేశాయి.
శ్రీ ఘంటసాల గానగంధర్వుడు, అమరగాయకుడు. నవరసభరితమైన ఈ అపూర్వ గాయకుని గీతాలు ఎల్లప్పుడు శ్రోతల మనస్సులను రంజింపజేస్తూ, మనకే తెలియని ప్రశాంతతను, మానసికానందాన్ని, స్ఫూర్తిని కలుగజేస్తాయి.
శ్రీ ఘంటసాల శతజయంతి ఉత్సవాల తర్వాత, ప్రపంచవ్యాప్తంగా వారి జయంతి, వర్ధంతి సంగీతోత్సవాలు నిరంతరం భారీగా ఎక్కడో చోట నిర్విరామంగా జరుగుతున్నాయి.
నిజానికి శాస్త్రీయ, లలిత సంగీతాలు నా వృత్తి, ప్రవృత్తి కాకపోయినా కేవలం ఘంటసాలవారి సంగీతం మీద వున్న మక్కువ, మమకారాలతో ఒక సామాన్య సంగీతాభిమానిగా నా వంతు పాలుపంచుకునే ఉద్దేశంతో ఘంటసాల 101వ జన్మదినోత్సవ సందర్భంగా, ఆయన గానం చేసిన వేలాది గీతాలనుండి 101 ఏకగళ గీతాలను కొన్ని వాట్సప్ సమూహాలలో ఘంటసాల సజీవరాగాలుగా పునశ్చరణ చేసుకోవడం జరిగింది.
ఈనాడు శ్రీ ఘంటసాల 52వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన స్వీయసంగీత దర్శకత్వంలో తాను ఇతర గాయనీ గాయకులతో పాడిన ఆణిముత్యాలను 'ఘంటసాల-సదా మదిలో మెదిలే సజీవరాగాలు' అనే మకుటంతో వారం వారం ధారావాహికగా సమర్పించాలని సంకల్పిస్తున్నాను.
మీ అందరి ప్రోత్సాహాభిమానాలు తప్పక లభిస్తాయని
ఆశిస్తున్నాను.
ప్రణవ స్వరాట్
...తరువాయి వచ్చేవారం...
