Saturday, 28 March 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 8 - కనుపాప కరమైన కనులెందుకూ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 8


చిరంజీవులు - కనుపాప కరమైన కనులెందుకూ...


'ఒదినోయ్! నే చెప్పినట్లుగా నీకు కూతురే పుట్టింది. అది మా బుజ్జిగాడికే సొంతం. దానిని నా కోడలిని చేసుకుంటాను. కాదు కూడదని సాకులు చెప్పకుండా ఒట్టేసి మాటియ్యి'.... పురిటి మంచం మీదున్న ఒదినగారిని  బలవంతపెడుతున్న ఓ మరదలు...

'నువ్వింతగా అడగాలా బావా... తరతరాల ఆత్మీయానుబంధం మనది.. నువ్వు అడిగినా అడక్కపోయినా నా కొడుకు నీ అల్లుడే.. ఈ పుట్టినరోజు పండగ శుభసమయంలో నీకు వాగ్దానం చేస్తున్నాను. నువ్వూ నీ మాటమీద నిలబడే వుండు... తన ఐదేళ్ళ కొడుక్కు తన బావమరది కూతురితో పెళ్ళికి నిశ్చయం చేసేసాడు ఓ పెద్దమనిషి. ఎవరింటైనా పిల్లలు పుడితే వారి వరస బంధువులు వెంటనే ఆ పసి పాపల పెళ్ళిముచ్చట్ల దాకా వెళ్ళపోతారు. ఆ  ఇళ్ళలోని ఆడ మగ పిల్లల స్నేహం బలపడడానికి  దోహదమౌతారు. అలాటి వాతావరణంలో పెరిగిన పిల్లలు కూడా ఒకరిపట్ల ఒకరు ఇష్టం ఏర్పర్చుకుని స్నేహంగా వుంటారు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారుతుంది. 'నీవు లేక నేనులేను, నేను లేక నీవులేవు', 'నీకోసమె నే జీవించేది', నువ్వు తప్ప నాకు వేరే లోకం లేదు అంటూ ఘాటుప్రేమలో పడతారు. కాలప్రభావంతో ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలౌతాయి. పెద్దల మనస్తత్త్వాలలో మార్పువస్తుంది. చేసిన, చేయించుకున్న వాగ్దానాలు నీటిలోని ఉప్పుమూటలవుతాయి. పెద్దలు మనసు మార్చుకున్నట్లుగా యవ్వనంలో వున్న యువతీయువకులు మనసు మార్చుకోలేక తమ ప్రేమ ఫలించి తాము ఒకటవడానికి తపిస్తారు. ఈ దిశలో అష్టకష్టాలు పడవలసివస్తుంది. కొందరి జీవిత కథలు సుఖాంతమైతే, మరికొందరి జీవితాలు విషాదాంతమౌతాయి. అలనాటి శశిరేఖాభిమన్యులనుండి నిన్న మొన్నటి  లైలా ఖయస్, మల్లి నాగరాజు, పార్వతి దేవదాసు వంటి చిన్ననాటి స్నేహితుల ప్రేమ గాధలన్నీ కష్టాలమయమే. కొందరు ప్రేమికుల విషయంలో ప్రాణత్యాగమే పరిష్కారమార్గమై  అమరప్రేమికులవుతారు.

అలాటి అమరప్రేమికులే శారదా మోహన్ లు. అతి బాల్యదశనుండి ఒకరికోసం మరొకరు పుట్టినట్లుగా కలసిమెలసి  అంటిపెట్టుకు జీవిస్తారు. ఇరుతరఫు పెద్దలు వీరి స్నేహాన్ని, ప్రేమను ఆమోదించి వారి వివాహానికి ఏర్పాటు చేస్తారు. అయితేఇక్కడే విధి శారద సవతితల్లి తమ్ముడి రూపంలో ప్రవేశించి అతడు చేసిన కుతంత్రాలకు శారదా మోహన్ ల ప్రేమ జీవితం ఛిన్నాభిన్నమై అంతిమంగా వారి ప్రాణాలనే బలితీసుకుంటుంది. ఆ ఇరువురు బాధాతప్త హృదయులుగాప్రేమ చిరంజీవులుగా మిగిలిపోతారు.

ఇంతకు ఈ శారద,మోహన్ లు ఎవరు? వారి ప్రేమ కధ ఏమిటి? ... 

తెలియాలంటే  ఎన్.టి.రామారావు, జమున నటించిన అద్భుత కుటుంబగాధా చిత్రం 1956 నాటి వినోదా ప్రొడక్షన్ వారి 'చిరంజీవులుచూడాలి. విషాదంతో నిండిన ఈ ప్రేమికుల హృదయవేదనే నేటి మన 'ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం'.

ప్రేమించిన యువతితో  తన వివాహం జరుగబోతున్న సంతోషంలో  తన పెళ్ళికోసం నగలను కొని వస్తూండగా కుట్రదారుల కుతంత్రంతో నగలను కోల్పోయి చావుబ్రతుకుల మధ్య వుండి పెళ్ళిముహుర్తానికి రాలేకపోతాడు.  కష్టంలో కష్టంగా కథానాయకుడు బండి ప్రమాదంలో కళ్ళను కోల్పోతాడు. ఈ బాధలన్నీ దాటుకుని ఇంటికి వచ్చేసరికి తాను గాడంగా ప్రేమించిన చిన్ననాటి చెలి మరొకరి ఇల్లాలవుతుంది.

ఆ సందర్భంలో  ... ''కనుపాపలాంటి చెలి పరులపాలైతే ఇంక ఈ బ్రతుకెందుకు...చిననాటి కలలన్నీ కథలేనా అని నాయకుడు తల్చుకు తల్చుకు కుమిలిపోతూంటే ; మనసైన చినదాని మనసు  నేలవ్రాలి ధూళిలో కలసిన విరజాజులేమరుమల్లెలే ... తనవారు ఎప్పటికీ తనవారే... ఇలలో విడిపోయినా కనుమూసాక గగనాన మరల కలుస్తాము' అని నాయిక ఆలపించిన  విలాపగీతం సజీవరాగమై  ఈనాటికీ శ్రోతల మనసులలో రగులుతూనేవుంది....

మోహన్:

కనుపాప కరవైన కనులెందుకో

తనవారె పరులైన బ్రతుకెందుకో-2


శారద:

విరజాజి శిలపైన రాలేందుకే

మరుమల్లె కెంధూళి కలసేందుకే

మనసైన చినదాని మనసిందుకే

రగిలేందుకే 

                                    !కనుపాప!


మోహన్:

అలనాటి మురిపాలు కలలాయెనా

చిననాటి కలలన్ని కధలాయెనా

తలపోసి తలపోసి కుమిలేందుకా

తనువిందుకా  

                                    !కనుపాప!


శారద:

తనవారు తనవారె విడిపోరులే

కనుమూసి గగనాన కలసేరులే

ఏనాటికైనాను నీదాననే  - నీదాననే


మోహన్:

చిననాటి మనపాట మిగిలేనులే

కలకాలమీ గాధ రగిలేనులే

కలకాలమీ గాధ రగిలేనులే...

రగిలేనులే....


ఘంటసాల మాస్టారు ఈ పాటను నఠభైరవి రాగంలో చేశారు. నఠభైరవి కర్ణాటక సంగీతంలోని 20వ మేళకర్త రాగం.హిందుస్థానీ సంగీతంలో అసావేరీ థాట్ అంటారు. 

వినోదా పిక్చర్స్ బ్యానర్ మీద డి.ఎల్.నారాయణ 'దేవదాసు', 'కన్యాశుల్కము' సినిమాల తర్వాత ఎన్.టి.రామారావు, జమున, గుమ్మడిలతో తీసిన విషాదాంత ప్రేమకథాచిత్రం చిరంజీవులు.

వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో రూపొందిన అపురూప చిత్రం 'చిరంజీవులు'. నటుడిగా ఎన్.టి.రామారావుకు, గాయక సంగీతదర్శకుడిగా ఘంటసాలకు చిరస్థాయి కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టిన చిత్రం 'చిరంజీవులు'. ఈ చిత్రంలోని అన్ని పాటలు సందర్భోచితంగా, సహజత్వానికి దగ్గరగా తెలుగు వాతావరణం ప్రతిబింబిస్తూ రూపొందాయి.

1948 లో వాడియా ఫిలింస్ నర్గీస్, దిలీప్ కుమార్ లతో 'మేళా' అనే హిందీ సినీమా తీశారు. ఆ సినీమా కథ మాత్రమే ఆధారంగా తీసుకొని వినోదావారు 1956 లో  'చిరంజీవులు' సినిమాను నిర్మించారు.

చిరంజీవులు చిత్రంలో గుడ్డివాడిగా నటించడానికి ఎన్ టి రామారావు కృత్రిమ కనుగుడ్లు పెట్టుకొని రోజులతరబడి నటించడంతో నిజంగానే ఆయన దృష్టికి  సమస్య ఏర్పడి వైద్యచికిత్స పొందిన తర్వాత కాని సహజస్థితికి రాలేదు. రామారావుగారి కమిట్మెంట్ కు, వృత్తిపట్ల శ్రధ్ధాభక్తులకు ఒక నిదర్శనం ఈ చిరంజీవులు.

చిరంజీవులు సినిమాకు కెమెరామన్ గా పనిచేసినవారు వి.ఎన్.రెడ్డి. స్వతహాగా తెలుగువారే అయినప్పటికీ హిందీ సినిమాలకే ఎక్కువగా పనిచేశారు. 1943-1986 మధ్య దాదాపు ఓ నలభై సినిమా లకు ఛాయాగ్రహకుడిగా, ఓ ఆరేడు సినిమాలకు డైరక్షన్ చేశారు. వి.ఎన్.రెడ్డి కెమెరామన్ గా పనిచేసిన హిందీ సినిమాలలో - 'ఆగ్', 'బైజుబావ్రా', 'కశ్మీర్ కి కలి', 'పూరబ్ ఔర్ పశ్చిమ్'జహ్రీలీ', చోరీచోరీ, 'ఉపకార్, 'దోబదన్వంటి హిట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. సెసిల్ బి డిమిల్లే నిర్మించిన ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ చిత్రం 'టెన్ కమాండ్మెంట్స్'కు కూడా వి.ఎన్.రెడ్డి ముగ్గురు నలుగురు ఛాయాగ్రహకులలో ఒకరిగా పనిచేసారని ఎప్పుడో ఏదో పత్రికలో చదివిన గుర్తు. అయితే ఈ విషయాన్ని ధృవీకరించే ఆధారాలు ఏవీ ఇప్పుడు నాకు దొరకలేదు. ఏది ఏమైనా 'చిరంజీవులు' చిత్ర ఔన్నత్యానికి వి.ఎన్.రెడ్డి ఛాయాగ్రహణం ఎంతో దోహదం చేసింది.

భావగాంభీర్యంతో కూడిన ఉదాత్త విషాదగీతాలు ఆలపించడంలో, స్వరపర్చడంలో ఘంటసాలగారిని మించినవారు లేరు. ఒక దశలో తమిళ నిర్మాతలు తమ చిత్రాలలోని విషాదగీతాలు రక్తికట్టడానికి తెలుగువాడైనప్పటికీ ఘంటసాలగారే పాడాలనే అభిప్రాయం లో వుండేవారు. ఆయన కంఠంలోని మహత్తు అలాటిది.  

ఘంటసాలగారి సంగీతదర్శకత్వంలో రూపొందిన 'చిరంజీవులు' తమిళంలో 'అమరగీతం' గా డబ్ చేసారు. తమిళనాట కూడా 'అమరగీతం'గీతాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.


వచ్చేవారం  ఘంటసాలవారి  మరో సజీవరాగం తో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

Saturday, 21 March 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 7 - పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలోయ్

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 7


పెళ్ళిచేసిచూడు – పెళ్ళి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగ కాలం గడపాలోయ్...

 

పెళ్ళిలో ఇచ్చిన ఐదులక్షలు తమ ఖర్చులకే చాలలేదని మరో ఐదు ఇస్తే తప్ప కోడలిని గడపలోకి రానివ్వమని ఖరాఖండీగా చెప్పడంతో అంత సొమ్ము సేకరించలేకఅత్తింటివారి సూటిపోటి మాటల అవమానాన్ని భరించలేక పరంధామం, అతని కూతురు ఆత్మహత్య చేసుకున్నారని ఉదయాన్నే వాకర్స్ పార్క్ లో సంచలన వార్త. వరకట్న పిశాచి ధనదాహానికి మరో రెండు ప్రాణాలు బలి.

పెళ్ళిళ్ళలో కట్నం పేరుతో డబ్బు, నగలు, ఆస్తులు ఇచ్చినా, పుచ్చుకున్నా నేరమేనని, అందుకు శిక్షార్హులేనని భారత్ సర్కారు చట్టం తెచ్చినా ఈ మహమ్మారి జాడ్యం మన జాతిని పట్టి పీడిస్తూనేవుంది. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలలో లేని ఈ జాడ్యం శతాబ్దాల కాలంగా ఆసియాలో ముఖ్యంగా దక్షిణాసియా దేశాలలో ఇంకా ప్రబలంగానే వుంది.

ఇటీవలి కాలంవరకు తండ్రి ఆస్తిలో హక్కు లేని ఆడపిల్ల సంరక్షణకోసం, భద్రత కొంత నగదునో, బంగారు నగలనో, భూములనో తమతమ స్తోమతకు  తగినట్లు కేటాయించి ఆ పిల్ల వివాహంలో కట్నంగా అత్తింటివారికి ఇవ్వడమనేది ఒక సంప్రదాయంగా మారి చివరికి కట్నం ఇవ్వకపోతే పెళ్ళిళ్ళే జరగని పరిస్థితి ఏర్పడింది. ఎంత నాగరికత పెరిగినా, ఎంత ప్రపంచీకరణ జరిగినా, మన వివాహ వ్యవస్థలో ఎన్ని మార్పులు వస్తున్నా ఈ ఇచ్చిపుచ్చుకోవడాలలో తలెత్తే సమస్యలను, జరిగే ఘోరాలను ఎవరూ రూపుమాపలేకపోతున్నారు.

పెళ్ళంటే నూరేళ్ళపంట. అవును, కట్నం పేరిట అత్తింట పంటే. స్తోమత కలిగినవాళ్ళకు పండగే. కానీ, స్తోమతలేని పెళ్ళి కూతురి తండ్రి మాత్రం రోడ్డున పడడం ఖాయం. ఈ విషయంలో తప్పనిసరిగా  ప్రజల మనస్తత్త్వం మారాలి. మానవత్వం పెరగాలి. అప్పుడే ఈ వరకట్న విషవృక్షం సమూలంగా పెకలించబడుతుంది.  వరకట్నాల నిషేధం విషయంలో వధువరులే ముందంజ వేయాలి. అదుపు ఆజ్ఞాలేని పెళ్ళి ఖర్చులను అరికట్టాలి.

డాబు, దర్పం, దర్జాల కోసం జరిగే ఆడంబరపు పెళ్ళిళ్ళను శాశ్వతంగా కట్టడి చేయాలి. అందుకు యువతే నడుంకట్టి ముందుకు సాగాలి. ఇందుకు మీకు మంచి స్ఫూర్తి కావాలా? వెంటనే చూడండి 1952 నాటి సినిమా 'పెళ్ళిచేసిచూడు'. 

ఇందులోని విద్యాధికుడైన కధానాయకుని సందేశమేమిటో తెలుసా!---

 

ఓ భావిభారత భాగ్యవిధాతలారా!

యువతీ యువకులారా! 

స్వానుభవమున చాటు నా సందేశమిదే ...వారెవ్వా...

తాధిన్న తకధిన్న తాంగిడితక తరికిటతక తోం...

పెళ్ళిచేసుకుని యిల్లుచుసుకుని చల్లగ కాలం 

గడపాలోయ్ మీరెల్లరు హాయిగ వుండాలోయ్! 

 

కట్నాల మోజులో మన జీవితాలనే బలిచేసి 

కాపురములు కూల్చు

ఘనులకు శాస్తికాగ.. పట్నాల పల్లెల

దేశ దేశాల మన పేరు చెప్పుకొని ప్రజలు సుఖపడగా

తాధిన్న తకధిన్న తాంగిడితక తరికిటతక తోం...

 

ఇంటా బయటా జంటకవుల వలె

అంటుకు తిరగాలోయ్ తరంపం-2

కంటిపాపలై దంపతులెపుడూ చంటి పాపలను సాకాలోయ్ -2

!!పెళ్ళి!!

 

నవభావములా నవరాగములా

నవజీవనమే నడపాలోయ్ -2

భావకవులవలె ఎవరికి తెలియని

ఏవో పాటలు పాడాలోయ్

పెళ్ళి చేసుకుని హాయిగా...

వుండాలోయ్...

                  🌿🌷🌿

ఇదే నేటి మన సజీవరాగం.

సంగీత సాహిత్యాల పస వున్న గీతాలే పదికాలాలపాటు ప్రజల హృదయాలలో నిల్చివుంటాయనేందుకు 'పెళ్ళిచేసిచూడు' లోని ఈ పాటే నిదర్శనం.

 

తాళి కట్టడానికి ముందే  ఇస్తానన్న కట్నం డబ్బు తాళి కట్టిన తర్వాత కూడా ఆడపెళ్ళివారు చెల్లించకపోవడంతో  వియ్యంకుడు ఆగ్రహించి కొడుకును అక్కడనుంచి లాక్కుపోతాడు.  రమణ, అమ్మడుల పెళ్ళి జరిగినా జరగనంత విషాదాన్ని పెళ్ళిపందిట్లో మిగిల్చిపోతుంది. అయితే, చదువు సంస్కారంగల రమణ  తండ్రికి తెలియకుండా అత్తవారింట్లో మకాంవేసి కొత్తల్లుడి హోదాలో మనుగుడుపు లాంఛనాలన్ని మహదానందంగా అనుభవిస్తూ , అత్తగారు, భార్య, బావమరదులను  కూడా తన గానా బజానాలతో సంతోషపరుస్తూంటాడు.

ఆ సందర్భంలోనే సంగీతప్రియుడైన కథానాయకుడు రమణ తన బావమరది తబలా వాయిస్తూండగామరో సిసింద్రీ బావమరది డ్యాన్స్ చేస్తూండగా తాను హార్మోనియం వాయిస్తూ కట్నాలమోజులో జీవితాలను బలిచేసే ఘనులందరికీ శాస్తి జరగాలని ఘంటసాల బాణీలో భావిభారత భాగ్యవిధాతలైన యువతీయువకులందరికీ మంచి సందేశమిస్తాడు. తర్వాత,  తన భార్యతో వేరే వూళ్ళో కాపురం పెడతాడు.చిత్రవిచిత్ర నాటకాలతో ఎవరి మనసు నొప్పించకుండా తండ్రి మనసుమార్చి కథను సుఖాంతం చేస్తాడు. అభ్యుదయవాదిగా అందరి మన్ననలు పొందుతాడు.

తరతరాలుగా మన దేశంలోని మధ్యతరగతి కుటుంబీకులను పట్టిపీడిస్తున్న వరకట్న జాడ్య సమస్యను పెద్ద పెద్ద ఉపన్యాసాలతోను, ఏడుపు పెడబొబ్బలతోను కాకుండా చాలా వినోదాత్మకంగా, వ్యంగాన్ని కూడా మిళితం చేసి హాస్యరస ప్రధానంగా తెరకెక్కించారు 'పెళ్ళిచేసిచూడుదర్శకుడు అక్కినేని లక్ష్మీ వరప్రసాద్సింపుల్ గా 'ప్రసాద్'.  చెప్పదలుచుకున్న విషయాన్ని సున్నితంగా ప్రేక్షకుల హృదయాలలో నాటేలా సినిమా లోని ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఇందులో చక్రపాణి గారి హస్తం ఎంతైనావుంది.

విజయావారి సినిమాల కథాసంవిధానమంతా చక్రపాణిగారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. సినిమా నిర్మాణ వ్యవహారమంతా చక్రపాణిగారిదే, నాగిరెడ్డిగారి జోక్యమేం వుండదు. పెట్టుబడి, వ్యాపార వ్యవహారాలు మాత్రం ఆయనవి. సినిమా నిర్మాణంలో తనకు ఏ మాత్రం అసంతృప్తి కలిగినా చక్రపాణి సహించేవారు కాదు. తనకు కావలసిన పద్ధతిలో పనిజరగకపోతే ఎంత పెద్ద నటులనైనాసాంకేతిక నిపుణులనైనా తొలగించి మరల కొత్తగా పని మొదలెట్టడానికి సంశయించేవారు కాదు. అందుకు నిదర్శనంగా పెళ్ళిచేసిచూడు, మిస్సమ్మ, మాయాబజార్ సినీమాలు చెప్పుకోవచ్చు. పెళ్ళిచేసిచూడులో నటన విషయంలో కధానాయిక జి.వరలక్ష్మి పెట్టే ఇబ్బందులు భరించలేక ఆవిడ స్థానంలో అంజలీదేవిని పెట్టుకుందామని నిర్ణయించుకున్నారట. కానీఅంజలీదేవి మధ్యవర్తిత్వంతో జి.వరలక్ష్మిగారినే కొనసాగించినట్లు  చెప్పుకుంటారు. అలాగే మిస్సమ్మలో మొదట హీరోయిన్ గా భానుమతి గారితో కొంత షూటింగ్ అయాక ఆవిడ సమయపాలన సక్రమంగా పాటించకపోవడంతో  విసుగెత్తిన చక్రపాణి భానుమతి స్థానే కధానాయికగా సావిత్రిని తీసుకున్నారు. మాయాబజార్ సినిమా సంగీత దర్శకుడిగా ఎస్.రాజేశ్వరరావు ఓ నాలుగు పాటలు కంపోజ్ చేసిన తర్వాత నిర్మాతలతో ఏర్పడిన విభేదాలవలన పక్కకు తప్పుకోగా ఆయన స్థానంలో ఘంటసాల వచ్చారు. ఈవిధంగా విజయా వారి సినిమా నిర్మాణ బరువుబాధ్యతలంతా చక్రపాణి గారే భరించేవారు.

విజయావారి సినీ నిర్మాణం అంతా ఒక ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా జరిపించినట్లుగా కనిపిస్తుంది. తమ సినిమాలు ఒకే రకంగా కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందడానికి కావలసిన అన్ని అంశాలతో రూపొందించేవారు. ఒక ఏడాది సాంఘిక సినిమా తీస్తే ఆ మరుసటి సంవత్సరం జానపదం, తర్వాత మళ్ళీ సాంఘికం,  ఇలా రొటేషన్ లోనే వారి సినీమాలు వచ్చాయి. విజయావారి మొదటి చిత్రం షావుకారు సాంఘికం, రెండవ సినిమా పాతాళభైరవి జానపదంమూడవ సినిమా పెళ్ళిచేసిచూడు సాంఘికంతర్వాత చంద్రహారం జానపదం, మిస్సమ్మ సాంఘికం, తర్వాత మాయాబజార్ పౌరాణికం...

అలాగే డైరక్టర్స్ కూడా సాంఘికాలను ఎల్.వి.ప్రసాద్ చేస్తే జానపదాలుపౌరాణికాలను కె.వి.రెడ్డి చేసేవారు.ఈ ఆనవాయితీ 'అప్పుచేసి పప్పుకూడు' వరకు కొనసాగింది. తర్వాత విజయాలో ప్రసాద్ గారు పనిచేసినట్లు లేదు.

ఉదాత్తము, గంభీరము అయిన కథాశంతో కూడిన పెళ్ళిచేసిచూడు సినిమా కేవలం పెద్దలను మాత్రమే కాదు పిల్లలను కూడా అలరించింది. మద్రాసు ఆలిండియా రేడియో బాలానంద సభ్యులు ---  కుందు, కందా మోహన్ , బేబీ గిరిజ (నటి కాంచన చెల్లెలు), బేబి ఉష, మొదలగువారు ఈ సినిమాలోని హాస్యాన్ని నూటికి నూరుపాళ్లూ పండించారు.  పెళ్ళిచేసిచూడు లో సగం ప్రముఖ పాత్ర పిల్లలిదే. ఇంతవరకూ ఏ పెద్దల సినిమాలోను పిల్లలమీద ఏకంగా నాలుగు వినోదభరిత గీతాలు చిత్రీకరించిన దాఖలాలు లేవు. ఘంటసాలగారి సంగీత దర్శకత్వంలోని ఆ పిల్లల పాటలు... 'బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా!'; 'అమ్మా నొప్పులే'; 'ఏవూరిదానవే వన్నెలాడీ'  ఈనాటికీ కూడా  అందరినీ గిలిగింతలు పెడుతున్నాయి. ఆ చిన్నపిల్లల పాటలను మాస్టర్ రామకృష్ణ, గిడుగు భారతి,ఉడత సరోజిని పాడారు.సినిమా మొదటి గంట కాలం పిల్లలదే. సినిమా ప్రారంభమైన గంటవరకు హీరో ఎన్టీఆర్ తెరమీద కనపడడంటే

ఎవరైనా నమ్ముతారా! కానీ పచ్చి నిజం. ఈనాడు అలా చూపిస్తే సూపర్ స్టార్ల వీరాభిమానులు ఊరుకుంటారా! తెరలు చించి, కుర్చీలు విరక్కొట్టి సోడాబాటిల్స్ తో రణరంగమే సృష్టిస్తారు. కానీ ఆనాడు సినిమా కు కధే ప్రధానం. కథ ప్రకారమే నాయికా నాయకుల ఉనికి.

మొదటినుంచి విజయావారి సినిమాలలో  సంగీతానిదే పెద్ద పీట. శ్రవణానందకరమైన పాటలకు పెట్టింది పేరు సంగీతదర్శకుడు ఘంటసాలైనాఎస్.రాజేశ్వరరావు అయినా, పెండ్యాల అయినా, మరొకరు మరొకరు అయినా మెలొడికే ప్రాధాన్యత. విజయావారి పాటలెప్పుడూ ఆపాతమధురాలే. ఆ బీజం వేసింది విజయా తొలి ఆస్థాన సంగీత దర్శకుడు ఘంటసాలే అంటే అతిశయోక్తికాదు.

కర్ణాటక సంగీతంలో సుశిక్షితుడైన ఘంటసాలగారికి హిందుస్థానీ సంగీతం పట్ల కూడా చక్కటి అవగాహన వుంది. శాస్త్రీయ సంగీత రాగాలను  లలితసంగీతానికి అనువుగా వినియోగించుకోవడంలో ఘంటసాలవారి ప్రతిభ అనన్య సామాన్యం. ఆవిషయం వారి తొలికాలపు సినిమాలనుండి ఆఖరి చిత్రాలవరకూ నిరూపిస్తూనే వచ్చాయి.

ఘంటసాలవారికి కళ్యాణి రాగమంటే మహా ఇష్టం అనే ముద్రపడింది విజయావారి షావుకారులోని 'పలుకరాదటే చిలుకా' పాటతోనే. ఈ పాటకు ముందు ఆ రాగంలో ఘంటసాలగారు మరేదైనా పాట స్వరపర్చి పాడారో లేదో  తెలియదు కానీ, పెళ్ళిచేసిచూడు సినిమా లోని ఈనాటి సజీవరాగం ' పెళ్ళిచేసుకుని ఇల్లుచూసుకుని చల్లగ కాలం గడపాలోయ్' ను కూడా  అదే కళ్యాణి రాగంలో చేసి సంగీతాభిమానుల అభిప్రాయాన్ని మరింత బలపర్చారు.

తదాదిగా ఘంటసాలగారు కళ్యాణి రాగంలో ఎన్నో పాటలు స్వరపర్చి గానం చేశారు. ఆ రాగంలో ఎన్ని పాటలు విన్నా విసుగుచెందని రీతిలో శ్రోతలను మైమరపించి పరవశింపజేసిన ఘనత ఘంటసాలగారిది.

అసలు మహత్తు అంతా ఆ రాగంలోనే వుంది. మంగళప్రదమైన రాగం కళ్యాణి. కర్ణాటక సంగీత మేళకర్తరాగ విభజనాచక్రంలో 'కళ్యాణి' 65వ మేళకర్త రాగంగా గుర్తింపబడింది. 

మేళకర్త రాగం అంటేనే సంపూర్ణరాగం అని అర్ధం. ఆరోహణా అవరోహణా క్రమంలో సప్తస్వరాలు వుంటాయి.

మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే కళ్యాణి రాగాన్ని విద్వాంసులు కచేరీ ఆరంభంలోనే ఆలపిస్తారు. ప్రసిధ్ధి పొందిన త్యాగరాజస్వామి వారి 'నిధి చాల సుఖమా', ముత్తుస్వామి దీక్షితులవారి 'కమలాంబాం భజరే' కీర్తనలు ఈ కళ్యాణి రాగానికి చెందినవే.

ఇక సినిమాల విషయానికి వస్తే కళ్యాణి రాగంలో పాటలు చేయని సంగీతదర్శకులే వుండరు. కర్ణాటక సంగీతంలోని కళ్యాణి రాగానికి సమాంతర హిందుస్థానీ రాగం 'యమన్'. ఈ యమన్ రాగంలో అనేక సూపర్హిట్ సాంగ్స్ హిందీ సినిమా లలో ఉన్నాయి. ఈ కళ్యాణి రాగ స్వరాలను వెస్ట్రన్ సంగీతంలో 'లిడియన్' అంటారు. అంతటి జగత్ప్రసిధ్ధి చెందిన కళ్యాణి

ఘంటసాలవారి ఇష్టసఖి కావడంలో ఆశ్చర్యం ఏముంది. ఈ కళ్యాణిరాగంలో ఘంటసాలగారు పాడిన ప్రతి ఒక్కపాటా వైవిధ్యం తో కూడినవే.


'ఓ.. భావిభారత భాగ్యవిధాతలారా!యువతీ యువకులారా!..' అని సాకీ ఎత్తుగడ...  వారెవ్వా! తాధిన్న తకధిన్న తాంగిడితక తరికిటతక తోం... అన్న ముక్తాయింపు  మనకెంతో ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని  రేకెత్తిస్తుంది. పాట మొత్తం ఆనందసాగరంలో ఓలలాడిస్తుంది. కథానాయకుడు సంగీతప్రియుడు, హార్మోనియం వాద్యగాడు కూడా కావడంవలన అతను పాడిన రెండు మూడు పాటలను హార్మోనియం ప్రధానవాద్యంగా మలచారు ఘంటసాల.  సంగీతంతో ఏమాత్రం సంబంధంలేని హీరో ఎన్టీఆర్ నటనకు ఇదొక పెద్ద సవాలు. ఏదో ఆషామాషీగా హార్మోనియం ముందు కూర్చుంటే సన్నివేశం రక్తికట్టదు. అందుకోసం రామారావుగారు ప్రత్యేక శ్రధ్ధతో ఘంటసాలగారు ఈ పాటలను కంపోజ్ చేస్తున్నప్పుడు, రిహార్సల్స్ సమయంలో పక్కనే కూర్చుని హార్మోనియం ఎలా పట్టుకుంటారోమెట్లమీద వ్రేళ్ళు ఎలా వుంచుతారో మొదలైన విషయాలను అవగాహన చేసుకుని ఆ విధంగా పాటల షూటింగ్ లో అనుసరించారట. ఈ పాట మరింత రక్తి కట్టడానికి ఎన్టీఆర్ తోపాటు  తెరమీద తబలావాయించిన జోగారావు, పాటకు తగిన డ్యాన్సాడిన మాస్టర్ కుందుల నటన కూడా చాలా దోహదం చేసింది. ఘంటసాలగారు ఈ పాటను చాలా నాచురల్ గా, సునాయాసంగా, హుషారుగా పాడారు. ఆ కంఠంలోని మాధుర్యానికి, భావప్రకటనకు ఎవరైనా ముగ్ధులు కాకతప్పదు.

ఘంటసాలగారి వాద్యగోష్టి ఎప్పుడూ సున్నితంగా, వీనులవిందుగా వుంటుంది. కర్ణకఠోర ధ్వనులు దరికిచేరవు. ఈ పాటలో కూడా హార్మోనియం, వయొలిన్స్, పియానోఫ్లూట్, క్లారినెట్‌, తబలా, టేప్ (డప్పు) వంటి వాద్యాలనే సరళంగా ఉపయోగించారు.

పెళ్ళిచేసిచూడులో ఎన్ని పాటలున్నాయో అంతమంది గాయనీగాయకులుండడం ఓ విశేషం. పింగళివారు పదహారు పాటలనుఊటుకూరు సత్యనారాయణ ఒక పాట వ్రాయగా వెరసి  ఆ 17 పాటలను ఘంటసాలవారి సంగీత నిర్దేశకత్వంలో, ఆయనతోపాటు పి.లీల, రాణి, ఉడత, కోమల, భారతిరామకృష్ణ, శకుంతల, జిక్కి , విజె వర్మపిఠాపురం, పామర్తి మొదలగువారు పాడించారు. సాటి గాయనీగాయకులను ప్రోత్సహించడం లో ఘంటసాలవారి సహృదయతకు ఈ సినీమా ఓ మచ్చుతునక.

ఎన్.టి.ఆర్, జి.వరలక్ష్మి, సావిత్రి, ఎస్.వి.రంగారావు, డా. శివరామకృష్ణయ్య, జోగారావు, పద్మనాభం, మహంకాళి వెంకయ్యపుష్పలత మొదలగువారు నటించిన 'పెళ్ళిచేసిచూడు' తమిళంలో 'కళ్యాణం పణ్ణి పార్'  ఒకేసారి తీసారు. పాటలన్నీ రెండు భాషలలో విపరీతమైన ప్రజాదరణ పొందాయి. ఓ పుష్కర కాలం తర్వాత విజయావారే ఈ సినిమా ను హున్సూర్ కృష్ణమూర్తి దర్శకత్వంలో 'మదువే మాడినోడు' పేరుతో రాజ్ కుమార్, లీలావతి హీరో హీరోయిన్ లుగా కన్నడంలో తీసి మంచి విజయం పొందారు. ఆ సినిమాకు కూడా ఘంటసాలగారే సంగీతదర్శకత్వం వహించి హీరో పాటలు పాడారు. తెలుగులో లీల పాడిన పాటలను కన్నడంలో పి.సుశీల పాడారు. తెలుగు తమిళాలకు డైరక్ట్ చేసిన ఎల్.వి. ప్రసాద్ గారు ఈ సినిమా ను హిందీలో 'షాదీ కె బాద్' గా స్వీయదర్శకత్వంలో రంగుల్లో నిర్మించారు. జితేంద్ర, రాఖి నటించిన ఈ చిత్రానికి లక్ష్మీ కాంత్ ప్యారేలాల్ సంగీతం సమకూర్చారు.

ఈ విధంగా విజయావారి మూడవ సినిమా 'పెళ్ళిచేసిచూడు' సర్వత్రా కళ్యాణప్రదంగా ప్రేక్షకులను ఆనందపర్చింది. 

'పెళ్ళిచేసిచూడు' సినిమా పబ్లిసిటీ విషయంలో విజయావారు వినూత్న పోకడలు పోయారు. సినిమా విడుదలకు ముందు ఈ సినీమా కధలోని ముఖ్యాంశాలతో, ముఖ్య సూత్రధారులను పరిచయం చేస్తూ పింగళివారిచే   ఒక పెద్దపాటను వ్రాయించి ఘంటసాలవారిచేత పాడించి దానిని ఆంధ్రదేశంలోని అన్ని థియేటర్లలో పెళ్ళిచేసిచూడు సినిమా స్లైడ్స్ మీద వినిపించి సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులలో ఈ సినిమా పట్ల గొప్ప ఉత్కంఠను కలిగించారు.

విజయావారికి ఘంటసాలగారి మీద ఎంత అభిమానమూ, నమ్మకమూ లేకపోతే ... 'గంట గంటకూ ఇంట ఇంటనూ ఎవ్వరి కంఠం వింటారో ఆ ఘంటసాలవారీ చిత్రానికి నాదబ్రహ్మలండీ...' అని అంటారు! చిత్రం ఏమంటే ఈ ట్రైలర్ గీతాన్ని ఘంటసాలగారే పాడి తన గురించి తానే పరిచయం చేసుకున్నారు.

సినిమా పబ్లిసిటీ విషయంలో విజయావారి ఈ సరికొత్త పోకడ మంచి ఫలితాలనే ఇచ్చింది.

నాకు ఏడేళ్ళ వయసులో 'పెళ్ళిచేసిచూడు' సినిమా బొబ్బిలి శ్రీరామా టకీస్ (రాజావారిదే) లో విడుదలైనప్పుడు కోటలోని ఘోషా స్త్రీలతోపాటు మా ఇంటి ఆడవాళ్లకూ అందిన ఆహ్వానం మేరకు ఆ సినిమాను మొదటిసారిగా  బాక్స్ లో కూర్చొని  పరదాల వెనకనుండి  చూడడం ఎన్నటికి మరపురాని అనుభవం.

కొసమెరుపు:-

ఈ సినిమా లోని ' ఏడుకొండలవాడా వెంకటా రమణా' అనే గీతాన్ని ముందుగా జిక్కితో పాడించారు. ఆది రికార్డు గా కూడా వచ్చింది. కానీ ఆ పాట తమకంత తృప్తికరంగా లేకపోవడంతో మరల పి.లీలతో పాడించి రికార్డు చేశారు. ఆదే సినిమాలో కూడా వినిపిస్తుంది.

కర్ణాటక సంగీత రాగాలైన 'చారుకేశి','చక్రవాకం' లను తెలుగు సినిమాలకు మొట్టమొదటి సారిగా పరిచయం చేసినది ఘంటసాలగారే.


అటువంటి ఘనత కల్గిన ఘంటసాలవారి మరో సజీవరాగంతో వచ్చే వారం మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

Saturday, 14 March 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 6 - ఎంత ఘాటు ప్రేమయో

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!


ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం - 2 -  భాగం 6


పాతాళభైరవి - ఎంత ఘాటు ప్రేమయో

ఒక సాయంత్రం పార్క్ లోకి వచ్చిన ఓ వృధ్ధదంపతులు  ఒకరికొకరు ఆసరాగా మెల్లగా నడుచుకుపోతున్నారు... 'ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేటు వయసులో' అంటూ వేళాకోళంగా ఓ యువజంట వారిని దాటుకుంటూ ముందుకు పోయారు. ఇది నా మనసుకు పట్టలేదు. ఫన్ కి సీరియస్నెస్ కు తేడా తెలియని ఆ వయసులో, ఈ యువజంట చేసిన కామెంట్ కు నా ఒళ్ళుమండింది. ఆనాడు ఇలాటి పేరడీలు కోకొల్లలు. శ్రీరంగం నారాయణబాబు పేరడీ కింగ్. నాకు సాహిత్యంలో ఓనామాలు తెలియకపోయినా  వీళ్ళంతా తెలుగు సాహిత్యాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారని తెగ ఫీలయైపోయేవాడిని. 

శ్రీశ్రీ వంటి మహాకవి కూడా పేరడీ ప్రభావానికి లోనై ఘాటుప్రేమను లేటు వయసుకు అన్వయించి ఒక సినిమాలో పాట వ్రాశారు. తదాదిగా మరింతమంది సినీ గేయరచయితలు ఈ ఘాటుప్రేమను  ఉపయోగించి మరింత ఆదాయం పొందారు.  వాళ్ళ తప్పేంలేదు. 'శంఖంలో పోసిందే పవిత్రతీర్థం' అని నమ్మే మనస్తత్త్వం ఉన్నంతకాలం మనకు సెలబ్రిటీస్ చెప్పిందే వేదం, దానికే విలువ, గుర్తింపు, గౌరవం. అప్పటికే ఉన్న అసలు మూలాలను గురించి ఎవరూ పట్టించుకోరు. తలవను కూడా తలవరు.

సరే ఈ విషయం పక్కనపెట్టి అసలు విషయానికి వద్దాము.

'ఘాటు ప్రేమ'..' కన్నుకాటు'... 'తీవ్రవీక్షణం', లేత వలపులో కళలు విరియడం వంటి పదప్రయోగాలతో తెలుగు ప్రజానీకాన్ని తీవ్రంగా బాధపెట్టిన ఆద్య సినీ కవి పింగళి నాగేంద్రరావు గారు. ఇలాటి పదాలు మన తెలుగులో ఎప్పటినుంచో వున్నవే, నేను కొత్తగా కనిపెట్టిందేమీ లేదని పింగళి గారు ఎంత చెప్పినా ఒప్పుకోరే.. కాదు కాదు మీరే నూతన పద సృష్టికర్తలంటూ తెలుగు సినిమా ప్రేక్షకులు ఆయనను అగ్రాసనంపై కూర్చోపెట్టారు.

గత 75 సంవత్సరాలుగా తెలుగువారందరినీ అంతటి ప్రభావితులను చేసిన 'ఎంత ఘాటు ప్రేమయో ఎంత తీవ్రవీక్షణమో.....' పాతాళభైరవి' సినిమా లోని ఈ గీతమే ఈనాటి ఘంటసాల సజీవరాగం.

పింగళి రచనకు ఘంటసాల సంగీతం; పి.లీల, ఘంటసాలల యుగళం; తెరపై మాలతి (రాకుమారి-ఇందుమతి), ఎన్.టి.రామారావు (తోటరాముడు) ల అభినయం. ----

రాకుమారి (లీల): 

'ఎంత ఘాటుప్రేమయో ఎంత తీవ్ర వీక్షణమో! ఓ...

                                                            !ఎంత!

కన్నుకాటు తిన్నదిగా కళలు విరిసెనే..

నా.. మనసు మురిసెనే...

                                                            !ఎంత!

తోటరాముడు(ఘంటసాల):

ఎంత లేత వలపులో ఎంత చాటు మోహములో ఓ... 

                                                            !ఎంత లేత!

కన్నులలో కనినంతనే  తెలిసిపోయెనే

నా... మనసు నిలిచెనే-2 

                                                            !ఎంత లేత!


రాకుమారి: 

ఈ జాబిలి, ఈ వెన్నెల ఈ మలయానిలమూ-2

విరహములో వివరాలను విప్పి చెప్పెనే

                                                            !ఎంత!


తోటరాముడు:

ఓ జాబిలి... ఓ వెన్నెల.. ఓ మలయానిలమా - 2

ప్రియురాలికి విరహాగ్నిని పెంపుజేయవే

                                                            !ఎంత లేత!

అసలు ప్రేమంటే... చాలామందికి కలిగే సందేహమే. కుల మత భాషా ప్రాంతాలకు, కాలమాన పరిస్థితులకు అతీతమైనది. అవ్యక్తం, అనుభవైకవేద్యం. పరమ పవిత్రం. స్వార్ధరహిత పరస్పరానురాగ బంధం. వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన, విశ్వాసాల ప్రాతిపదికన  గాఢంగా పెనవేసుకునే జీవితబంధం.  శారీరక సౌందర్యాకర్షణల వలన, ఆస్తిఅంతస్తులు,హోదాల మోజులో కలిగే ప్రేమ తాత్కాలికం. నీతి, నిజాయితీ లేని ప్రేమ అశాశ్వతం. ప్రేమ తత్త్వం సరిగా అర్ధంకానివారికి అదెప్పటికీ బ్రహ్మ పదార్ధమే. 

నిజాయితీ తో కూడిన సున్నితమైన, మధురమైన  అసలు ప్రేమలోని గాఢత్వాన్ని విశదపర్చే క్రమంలో పింగళివారు ప్రయోగించిన  నవ్యపదం 'ఘాటు ప్రేమ'. సున్నితము,లలితము అయిన ప్రేమను  ఈ 'ఘాటు'తప్పక ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

ప్రథమ వీక్షణలోనే ప్రేమాంకురం. అది అతి'తీవ్రం'. నాయిక కన్ను ప్రేమకాటు తినడంతో విరిసిన కళలు మనసును మురిపించి పరవశం కలిగించాయి. నాయిక లేతవలపులోని చాటు మోహం చూసిన మరుక్షణమే అర్ధం చేసుకున్న నాయకుడు నాయికలో విరహాగ్నిని మరింత పెంచమని జాబిలి, వెన్నెల, మలయానిలాల సహాయాన్ని అర్ధిస్తున్నాడు. ప్రేమ జంటలకు ప్రేరణను, స్ఫూర్తిని కలిగించే ఈ ప్రేమగీతాన్ని అద్భుతమైన పదజాలంతో పింగళి నాగేంద్రరావుగారు 'పాతాళభైరవి' సినిమా కోసం వ్రాశారు. 'పాళాళభైరవి' సినిమా విడుదలై 75 సంవత్సరాలు గడిచినా ఈ ప్రేమగీతం ఆనాటినుంచి ఈనాటివరకు నవ్యహరితంగా ప్రేమజంటలను,శ్రోతలను మురిపిస్తూనే వున్నది,మైమరపిస్తూనే వున్నది.

ఈ డ్యూయెట్ పాటలోని విశేషమేమిటంటే...  ఈపాటను నాయికా నాయకులిద్దరూ  ఒకే స్థలంలో నుండి ఆలపించరు. ఓ వెన్నెల రాత్రివేళలో  రాజమందిరంలోనుండి రాకుమార్తె,తోటలోనుండి తోటరాముడు తమ తమ మనసులోని ప్రేమభావాలను చంద్రుడి సమక్షంలో ఈ పాటరూపంలో విప్పి చెప్పుకుంటారు.

ఈ ఆపాతమధుర గీతాన్ని మనకు అందించిన 'పాతాళభైరవి' సినిమాకు సంబంధించిన విషయాలు, విశేషాలు ఒకటా, రెండా ! తవ్వినకొద్ది ఈ అమూల్యనిధి నుండి బయటపడుతూనే వుంటాయి.

ఆసియా ఖంఢంలోనే అతి పెద్ద సినిమా స్టూడియోగా పేరుపొందిన వాహినీ స్టూడియో అధినేత బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. 1948లో వాహినీ స్టూడియో కట్టిన తర్వాత  నిర్మించబడిన మొదటి సినీమా వాహినీ పిక్చర్స్ బ్యానర్ మీద కెవిరెడ్డి దర్శకత్వంలోని 'గుణసుందరి కథ'. 1949లో వచ్చింది.  తర్వాత, నాగిరెడ్డిగారు విజయా ప్రొడక్షన్ సంస్థను చక్రపాణి సహ నిర్మాతగా ప్రారంభించి 1950లో 'షావుకారు' సినిమాను విడుదల చేశారు. 'పాతాళభైరవి' విజయావారి రెండవ చిత్రం. విజయా వాహినీ స్టూడియో పెర్మెనెంట్ కెమేరామన్ మార్కస్ బార్ట్లీ. విజయావారి చిత్రాలలో పాటలకు, ముఖ్యంగా, వెన్నెల పాటలకు పెట్టింది పేరు. 

చక్రపాణి గారి ఆధ్వర్యంలోని 'చందమామ'  పత్రిక అంటే ప్రజలకెంత అభిమానమో, అంతే ప్రేమ విజయావారి సినిమా చందమామ. తెలుపు నలుపు సినిమా లలో చందమామను, తటాకాలలో వెన్నెలక్రీనీడలను, చల్లగ వీచే పిల్లతెమ్మెరలకు సన్నగ నడుమూపే లతా సౌందర్యాలను అత్యద్భుతంగా చిత్రీకరించడంలో మార్కస్ బార్ట్లీని మించినవారు లేరు. భారతీయ కళా సంస్కృతిని పూర్తిగా అర్ధం చేసుకుని తెలుగు సినిమాఔన్నత్యానికి పాటుపడిన ఛాయాగ్రహకుడు. ఒంటికన్నుతో అపూర్వాలను సృష్టించిన మేధావి మార్కస్ బార్ట్లీ. ఆయన పనితనం పాతాళభైరవి సినిమాలో అణువణువున ప్రతిబింబిస్తుంది.

'ఎంత ఘాటు ప్రేమయో' పాట చిత్రీకరణ ప్రేక్షకులలో మోహాన్ని రేకెత్తించి పరవశం కలుగజేసింది. ఈ విషయంలో గాయక,సంగీత దర్శకుడు ఘంటసాల; ఛాయాగ్రహకుడు మార్కస్ బార్ట్లీ పోటాపోటీగా కృషి  చేశారనిపిస్తుంది.

కాశీమజిలి కథలు, అల్లావుద్దీన్ కథల ఆధారంగా తీయబడిన అపూర్వ జానపద చిత్రం 'పాతాళభైరవి'. చిత్రనిర్మాణంలోని 24 శాఖల అసమాన్య కృషి ఫలితం 'పాతాళభైరవి'. తెలుగు తమిళ భాషలలో నిర్మించిన ఈ కళాఖండం ఘనవిజయానికి ముఖ్య కారణం పింగళివారి మాటలు, ఘంటసాలవారి పాటలు. మాటలు, పాటలు రెండూ సమానంగా తెలుగనాట ప్రజలనోట నానాయి.  కెవిరెడ్డిగారి దర్శకత్వ ప్రతిభతో 200 రోజులు ఆడిన మొట్టమొదటి తెలుగు సినిమా 'పాతాళభైరవి'. అలాగే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడిన మొట్టమొదటి తెలుగు సినిమా 'పాతాళభైరవి'. ఈ సినీమా హీరో తోటరాముడు ఎన్.టి.ఆర్ కు, విలన్ మాయలమాంత్రీకుడు ఎస్.వి.రంగారావుకు తిరుగులేని స్టార్ ఇమేజ్ ను సంపాదించిపెట్టిన ఫాంటసీ సినిమా 'పాతాళభైరవి'. మొదట్లో ఈ సినిమా హీరోగా ఎవరిని పెట్టాలనే మీమాంసలో డైరెక్టర్ కెవిరెడ్డి గారు పడ్డారు. అంతవరకూ ఫోక్లోర్, గ్లామరస్ హీరోగా పేరు సంపాదించుకున్న  ఎ.ఎన్.ఆర్ కు బదులుగా కొత్త హీరో (షావుకారు) ఎన్.టి.ఆర్ ను  తోటరాముడు పాత్రకు ఎన్నుకున్నారు. 

పండిత పామర జనాలను ఒకే రీతిలో అలరించిన 'పాతాళభైరవి'సంచలన విజయానికి ఘంటసాల సంగీతం, పాటలు ముఖ్య కారణమయ్యాయి. ఈ సినిమా లో వున్న 11 పాటలను ఘంటసాల, పి.లీల, జిక్కి, కోమల, టి.జి.కమలాదేవి, రేలంగి, పిఠాపురం పాడారు. 

ఈ సినిమా లో ఏ పాటకు ఆ పాటే గొప్పగా వున్నప్పటికి సాహిత్య పరంగా, సంగీతపరంగా పి.లీల, ఘంటసాల 'ఎంత ఘాటు ప్రేమయో' పాట ఈనాటికీ సజీవరాగంగా తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది.

ఘంటసాలగారికి ఉస్తాద్ బడేగులాం ఆలీఖాన్ గారి హిందుస్థానీ సంగీతమంటే చాలా మక్కువ. ఖాన్ సాహేబ్ గానం చేసిన అనేక రాగాల స్ఫూర్తితో ఘంటసాలగారు మంచి మంచి పాటలెన్నో స్వరపర్చారు. అలాటి రాగాలలో రాగేశ్రీ (రాగేశ్వరి) ఒకటి. ఆ రాగంలోనే 'ఎంత ఘాటు ప్రేమయో' పాటను స్వరపర్చారు. రాగేశ్రీ లేదా రాగేశ్వరి హిందుస్థానీ సంగీతం లో ఖమాస్ థాట్ రాగం. అంటే జన్యరాగం. ఔడవ షాడవ రాగం. ఆరోహణలో ఐదు స్వరాలు, అవరోహణలో ఆరు స్వరాలు పలుకుతాయి. శృంగార రసానికి, సరళమైన మృదుభావాలకు అనువైన రాగం రాగేశ్వరి. 

ఘంటసాలగారికి, మలయాళ గాయని పి.లీలగారికి  తెలుగు, తమిళ భాషలలో ఎనలేని ఖ్యాతి తెచ్చిపెట్టిన పాట 'ఎంత ఘాటు ప్రేమయో'. ఘంటసాల మాస్టరు ఈ పాటలో ఉపయోగించిన పియానో, వైయొలిన్స్, సాక్సో, ట్రంపెట్, క్లారినెట్, ఫ్లూట్, మాండొలిన్, గిటార్, తబలా వంటి వాద్యాలు ఎంతో మృదుమధురంగా ఈ ప్రేమగీతాన్నిఉన్నతస్థాయి కి తీసుకువెళ్ళాయి. ఎన్ని తరాలు మారినా చెక్కుచెదరని సజీవరాగం, నిత్యనూతన ప్రేమగీతం' ఘంటసాలవారి 'ఎంత ఘాటు ప్రేమయో'. 

జెమినీ వాసన్ 'పాతాళభైరవి'ని హిందీలోకి డబ్ చేసినప్పుడు. తెలుగులోని ఈ యుగళగీతాలను తలత్ మహమ్మద్, గీతాదత్ పాడారు. ఆ హిందీ డబ్బింగ్ 'పాతాళ్ భైరవి' కూడా వాసన్ గారికి మంచి ఆదాయాన్నే అందించింది.

విజయా నాగిరెడ్డి-చక్రపాణి లు తీసిన 'పాతాళభైరవి' ని నాగిరెడ్డి గారి అబ్బాయిలు ఎన్.టి.ఆర్ కుమారుడు

బాలకృష్ణ హీరోగా 'భైరవద్వీపంగా' రంగుల్లో తీసి మంచి విజయం పొందారు.


అలాగే హీరో కృష్ణ  1985 లో ఈ సినిమా ను జితేంద్ర, జయప్రద హీరో హీరోయిన్ లుగా హిందీలో భారీ ఎత్తున నిర్మించి నిర్మాత గా తన ఖ్యాతిని పెంచుకున్నారు.

నూరు భారతీయ ఉత్తమ కళాఖండ చిత్రాలలో  విజయావారి తెలుగు 'పాతాళభైరవి' చోటుచేసుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం.

కొసమెరుపు:-

ఒకసారి మద్రాస్ మ్యూజిక్ ఎకాడెమీలో మద్రాసు తెలుగు అకాడెమీ ఉగాది పురస్కారోత్సవంలో 'ఘంటసాల సకల గాయక సంగీతోత్సవం' జరిగింది. లబ్దప్రతిష్టులైన సినీ గాయనీగాయకులంతా ఆ అమరగాయకుని స్మరించుకుంటూ ఆయన పాటలనే ఆలపించారు. ఆ సందర్భంగా ప్రముఖ నేపధ్యగాయకుడు పి.బి.శ్రీనివాస్ గారు   పాతాళభైరవి లోని ఈ 'ఎంత ఘాటు ప్రేమయో ' పాటలోని ప్రతీ వాక్యాన్ని తన సహజ వాగ్ధోరణిలో విశ్లేషిస్తూ, పాడుతూ ఘంటసాల మాస్టారి సంగీత ప్రతిభను బహుదా ప్రశంసించారు. తానే కనుక  భోజరాజు అయివుంటే ఈ పాటలోని ఘంటసాలగారి స్వరమాధుర్యానికి, 'ఓ జాబిలి, ఓ వెన్నెల, ఓ మలయానిలమా అనే పదాల మీద ప్రయోగించిన స్వరస్థానాల తీరుకు లక్షేసి వరహాలు కానుకగా సమర్పించుకునేవాడినని చెప్పగానే  వేలాది ప్రేక్షకుల హర్షధ్వానాలు, కరతాళధ్వనులతో మ్యూజిక్ ఎకాడెమీ ఆడిటోరియం మార్మోగింది.  సాటి గాయకుడి ప్రశంసను మించిన ప్రశంస వేరింకేముంటుంది! గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఘంటసాల అంతటి ఘనతను సాధించారు.


వచ్చే వారం,మరల,ఘంటసాలవారి

మరో సజీవరాగంతో మరల కలుద్దాము.


ప్రణన స్వరాట్

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 8 - కనుపాప కరమైన కనులెందుకూ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను,...