Saturday, 9 August 2025

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 94వ భాగం - రామయ తండ్రీ - ఓ రామయ తండ్రీ

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"

   
 
ఘంటసాల మదిలో సదా మెదిలే సజీవరాగం!!
తొంభై మూడవ భాగం ఇక్కడ

94వ సజీవరాగం - రామయ తండ్రీ - ఓ రామయ తండ్రీ

చిత్రం - సంపూర్ణ రామాయణం
గానం - ఘంటసాల
రచన - కొసరాజు

సంగీతం - కె.వి.మహాదేవన్

పల్లవి 

రామయ తండ్రీ - ఓ రామయ తండ్రీ మా నోములన్ని పండినాయి

రామయతండ్రి మా సామివంటే నువ్వేలే

రామయ తండ్రీ ! రామయతండ్రీ!

 

చరణం 1:

తాటకిని ఒక్కేటున కూల్చావంట

శివుని విల్లు ఒక్క దెబ్బకే యిరిశావంట

పరశురాముడంతవోణ్ణి పారదరిమినావంట 

ఆ కధలు సెపుతుంటె విని ఒళ్ళు మరచిపోతుంట

                            రామయ తండ్రీ ! రామయతండ్రీ!

 

ఆగు బాబు ఆగు !

అయ్యా నే వత్తుండా బాబూ నే

వత్తుండా - !అయ్యా!

చరణం 2:

నీ కాలుదుమ్ము సోకి రాయి ఆడది

అయినాదంట .... నాకు తెలుసులే

నా నావమీద కాలు పెడితె ఏమౌతుందో

తంట ! నీ కాలు!

దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట

మూడు మూర్తుల నువ్వు

నారాయణమూర్తివంట

                            రామయ తండ్రీ ! రామయతండ్రీ!

 చరణం 3:

అందరినీ దరిజేర్చు మా రాజువే

అద్దరిని జేర్చమని అడుగుతుండావే-2

నువు దాటలేక కాదులే రామయతండ్రి

నన్ను దయజూడగ వచ్ఛావు రామయతండ్రి! నువు..!

 

హైలెస్సా హేలో హైలెస్సా.....

ఓహోహో..... హైలెస్సా...

అందరిని దరిజేర్చు మారాజు( భగవంతుడు)

అద్దరిని జేర్చమని అడుగుతున్నాడట. యుగయుగాలుగా భగవంతుని పట్ల గల దృఢమైన విశ్వాసంనిరంతర ఆధ్యాత్మిక చింతన ఈ దేశవాసులను సత్ప్రవర్తనతో ధర్మపథాన ముందుకుసాగేలా చేస్తోంది. రామాయణమహాభారతభాగవతాది ఇతిహాసాలు వాస్తవాలు కావచ్చుకాకపోవచ్చు, కానీ అవి భోధించే నీతిని, ధర్మసూత్రాలను మాత్రం అనాదిగా భారతీయులు మనసావాచాకర్మేణా ఆచరిస్తూనేవున్నారు.

శ్రీమద్రామాయణంలోని అనేక అంశాలు ఈనాటికీ మనకు మంచి స్ఫూర్తిని కలిగిస్తూ ఆదర్శప్రాయమై నిలిచివున్నాయి. రామాయణ మహాకావ్యంలో చోటుచేసుకున్న -- తల్లిదండ్రులుగురువులుపెద్దలయెడల వినయవిధేయతలుపితృవాక్య పరిపాలనకుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం ప్రేమానురాగాలుసహోదర ప్రేమ; సీతారాముల అన్యోన్యదాంపత్యం; రాముడు పాటించిన ఏకపత్నీ వ్రతం; పాలకుల పట్ల ప్రజల స్వామిభక్తిపరాయణత్వం; మైత్రీబంధం; రాముడి శాంతంసహనంసౌజన్యం, సచ్చీలత వంటి అంశాలకు మనము ఈనాటికీ ప్రధాన్యతనిచ్చి ఆచరిస్తూనే వున్నాము.

ప్రతీ భారతీయ స్త్రీ రాముడివంటి భర్తే లభించాలని కోరుకుంటూందంటే రాముడు ఎంతటి గుణ సంపన్నుడో అర్ధమౌతుంది. రాముడు మానవుడే అయినా ఆనాడుఈనాడు కూడా ఆయనను భగవత్స్వరూపునిగానే ఆరాధించి పూజిస్తున్నారు. బాల్యదశలోనే విశ్వామిత్రుని యాగరక్షణలో రాక్షస సంహారం; శివధనుర్భంగం; పరశురాముడిలోని క్రోధత్వాన్ని అణచడం వంటి  శౌర్యప్రతాపాలను గమనించిన ఆనాటి ప్రజలు రాముడిని దైవస్వరూపంగా భావించి పూజించడం మొదలుపెట్టారు. రాముడికి సంబంధించిన అనేక విషయాలు కథలు కథలుగా ప్రచారమై దశరథరాముడిని దర్శించితరించాలని ఉవ్విళ్ళూరే స్వామిభక్తి పరాయణులైన పామరజనులెందరో. అలాటి స్వామిభక్తులలో ముఖ్యంగా చెప్పుకోవలసినవాడు గుహుడు. 

గుహుడు  పడవలు నడిపే సామాన్య పల్లెవాడు. అయోధ్య యువరాజు రఘురాముడి లీలలు విని ఆ రామచంద్రుని దర్శనం కోసం పరితపిస్తున్న గుహుడు, రాముడు నది ఆవలివొడ్డుకు చేర్చమని అడగడంతో  తనకు దక్కిన అదృష్టానికి ఆశ్చర్యానందాలతో ఉబ్బితబ్బిబై  "రామయ తండ్రీ - ఓ రామయ తండ్రీ మా నోములన్ని పండినాయి రామయ తండ్రీ" అంటూ భక్తిప్రపత్తులతో తన అమాయక మనోభావాలను పాట రూపంలో వెల్లడిస్తున్నాడు. ఆ పాటే ఈనాటి మన ఘంటసాల సజీవరాగం.

బాపురమణలకు అత్యంత ప్రీతిపాత్రమైన కథావస్తువు రామాయణమే. రామాయణం ఇతివృత్తంగా బాపు అనేక పౌరాణిక, సాంఘిక చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో ప్రముఖమైనవి ముత్యాలముగ్గు, సీతాకళ్యాణం, శ్రీ రామాంజనేయయుధ్ధం, సంపూర్ణరామాయణం. అన్నీ  మంచి కళాత్మకదృష్టితో, ఉత్తమ సాంకేతిక విలువలతో బాపు తన అభిరుచికి తగినట్లు రూపొందించారు.

అందులోశోభన్ బాబుచంద్రకళ సీతారాములుగా నటించిన సంపూర్ణరామాయణంలోని గీతమే నేటి సజీవరాగం. గుహుడు పాడే పాట. సామాన్య జనపదాలకు చెందిన గుహుడిగా (నటుడి పేరు తెలియదు) రాముడిగా శోభన్ బాబు, సీతగా చంద్రకళలక్ష్మణుడిగా నాగరాజు హృద్యమైన ఈ సన్నివేశంలో అగుపిస్తారు.

స్వామిభక్తుడైన గుహుడు శ్రీరాముడిని చూసిన ఆనందంలో పరవశించిపోతూ పాడిన ఈ పాటను కొసరాజు రాఘవయ్య చౌదరి వ్రాయగా, కె.వి.మహాదేవన్ సంగీతనిర్దేశకత్వంలో ఘంటసాల ఆలపించారు. కొసరాజుగారు గుహుడు పాత్ర ద్వారా రాముడి లీలలు వర్ణించే క్రమంలో...

రాముడి పాద స్పర్శతో శాపగ్రస్థయై బండగా పడివున్న అహల్య నిజరూపం ధరించడం; జీవులన్నిటికి మోక్షాన్ని ప్రసాదించే భగవంతుని అవతారం తనను నది దాటించమని కోరడం; వంటి విషయాలలో చిన్న చిన్న చమత్కార చెణుకులు విసరడం శ్రోతలకు మంచి వినోదాన్నే కలిగిస్తుంది.

కె.వి.మహాదేవన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో 33 పాటలుపద్యాలుండగా  గాయకుడిగా ఘంటసాలగారి భాగస్వామ్యం మూడు పాటలు, ఐదు పద్యాల వరకే పరిమితమైయింది. వీటిని గుహుడు(పాత్రధారి పేరు తెలియదు) అర్జా జనార్దన్ రావు(హనుమంతుడు)శోభన్ బాబు (రాముడు), నాగయ్య(వశిష్టుడు)పై చిత్రీకరించడం జరిగింది. రాశి తక్కువగా వుంటేనేం, ఘంటసాల తన వాసిని, ముద్రను ఈ పాటల్లో ప్రస్ఫుటంగానే ప్రకటించారు. ఉన్నంతవరకు మంచి వైవిధ్యాన్నే ఘంటసాల చూపించారు.

స్టార్ నటులుచిన్న నటులు అనే తేడా లేకుండా వివిధరకాల పాత్రధారులకు అసంఖ్యాకంగా పాటలు పాడిన ఘనత ఘంటసాలగారికే దక్కింది. సంపూర్ణ రామాయణంలో గుహుడుగా నటించిన నటుడెవరోగానీ మరీ గొప్ప గుర్తింపు గల నటుడు కాదు. అలాటి నటులకు కూడా ఘంటసాల గళం వలన మంచి గుర్తింపు లభించింది.

సంపూర్ణ రామాయణంలోని గుహుడు పాడిన 'రామయ తండ్రీ ఓ రామయతండ్రీ మా నోములన్ని పండినాయి రామయతండ్రి...పాట బహుళ జనాదరణ పొంది ఈనాటికీ తరచు ఔత్సాహిక గాయకులందరిచేతా పాడబడుతూనేవుంది.

కె.వి.మహాదేవన్ ఈ పాటకోసం  కర్ణాటక సంగీతంలోని 28 వ మేళకర్త హరికాంభోజి రాగ స్వరాలనే తీసుకున్నా ఆ రాగానికి జన్యరాగమైన మోహన రాగపు ఛాయలతోనే పాటను కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. ఐదుస్వరాలతో నిండిన మోహన ఇతర దేశ సంగీతాలలో కూడా పేరు పొందిన రాగం. పల్లెజనాలు పాడుకునే రీతిలో మహాదేవన్  స్వరపర్చగా ఘంటసాల మాస్టారు ఈ పాటను అసలు సిసలు జానపద  శైలిలో అలవోకగా ఆలపించి మరింత భావపుష్టినిరసపుష్టిని కలిగించారు. పాట చివరలో వినవచ్చే ఆలాపన ఈ పాటకు హైలైట్ గా చెప్పుకోవచ్చు. గిటార్, మేండలిన్ఫ్లూట్, కాంబో ఆర్గన్, వైయొలిన్స్, తబలాటేప్, డోలక్బెల్స్ వాద్యాలతో నిండిన ఈ పాట అన్ని వర్గాల శ్రోతలను అమితంగానే రంజింపజేసి ఈనాటికి సజీవంగా వుంది.


వచ్చే ఆదివారం "ఘంటసాల మదిలో మెదిలే సజీవరాగం" శీర్షికలో మరల మరో మరపురాని గీతంతో కలుసుకుందాము.  

ప్రణవ స్వరాట్  


1 comment:

  1. గుహుడు పాత్రధారి కూడా అర్జా జనార్దన రావు గారే!
    🇮🇳🙏

    ReplyDelete

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - 107వ భాగం - బలే మంచి రోజు

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి రాగాధారిత ఏకగళ గీతాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించ...