Saturday, 14 November 2026

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 41 - ఎందుకనో నిను చూడగనే కవ్వించాలని ఉంటుంది

"ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను, బృంద గానాలను పరిచయం చేస్తూ ఘంటసాలగారికి సంబంధించిన ముచ్చట్లతో సాగే జ్ఞాపకాలమాలిక!!"


ఘంటసాల -   సదా మదిలో మెదిలే సజీవరాగం

అధ్యాయం – 2 భాగం - 41

సి.ఐ.డి. – ఎందుకనో నిని చూడగనే - కవ్వించాలని వుంటుంది.

 

"రాధ ఈవేళ కాలేజీ టైమ్ పూర్తికాకుండానే ఏడుస్తూ ఇంటికి వచ్చేసింది తెలుసా!"

 

"ఏం.. ఎందుకని.. ఏమయింది.. ఆరోగ్యం బాగాలేదా?

"అదేం కాదు, తోటి స్టూడెంట్స్ వేధిస్తున్నారంటూ ఇంకా ఆ కాలేజీ పక్కకే వెళ్ళనంటోంది."

"ఆ కాలేజీ అలాంటిది కాదే... చాలా డీసెంటైన కాలేజీగా మంచి పేరుంది. ఇంతకీ వాళ్ళు రాధను వేధించారా... కవ్వించారా...."

"వేధిస్తేనేం...

కవ్విస్తేనేం .... రెండూ ఒకటే !

"కాదు, రెండూ ఒకటి కాదు. వేధింపులనేవి సున్నిత మనస్తత్త్వం కలవారిని  మాటల ద్వారా, చేష్టల ద్వారా నొప్పించి వారు  భయపడుతూ బాధపడుతూంటే చూసి ఆనందించడం. ఇది ఒక మానసిక రుగ్మత. కవ్వింపులు అలాంటిది కాదు. మనకు నచ్చిన వ్యక్తుల దృష్టిని ఆకర్షించడం కోసం, వారితో సాన్నిహిత్యం పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నంలో భాగం కవ్వింపు. చుట్టుపక్కల వాతావరణం, మనుషులు నిరాసక్తిగా ఉత్సాహరహితంగా వున్నప్పుడు తమకు బాగా సన్నిహితులైన వారిని కవ్వింపు మాటలతో, చేష్టలతో ఆటపట్టించి అందరినీ సంతోషపర్చడానికి చేసే చర్య. ఇది వ్యక్తుల మధ్య దూరాన్ని తగ్గించి సాన్నిహిత్యాన్ని పెంచుతుంది.

అయితే, ఈ సరదా కవ్వింపులు అవతలి మనిషిలో ఎలాంటి స్పందనలు కలిగిస్తున్నాయో గమనించాల్సిన అవసరం ఎంతైనా వుంది. మితిమీరితే కథ అడ్డం తిరుగుతుంది. కోపతాపాలు, ద్వేషం, కక్షలు, ప్రతీకార చర్యలంటూ శతృత్వాలు పెరుగుతాయి.

"సరే... ఈ లెక్చర్ నాకు కాదు.. మీ చెల్లెలు రాధకు ఉపదేశించి ఎప్పటిలా కాలేజీకి వెళ్ళి శ్రద్ధగా చదువుకునేలా చేయండి చాలు."

మధు ఆలోచనలు గతంలోకి మళ్ళాయి. ఇప్పుడు పెద్ద ఆరిందాలాగ కబుర్లు చెపుతున్న ఈ రోహిణి పెళ్ళికి ముందు ప్రేమించుకుంటున్నరోజుల్లో ఎంతలా కవ్వించి అల్లరి చేసి ఆటపట్టించేదో...

ప్రేమికుల మధ్య కవ్వింపు సహజ ప్రక్రియ. ఒకరిపట్ల ఒకరికి ఆకర్షణ పెరగడానికి, ప్రేమానుబంధం దృఢతరం చేయడానికి కవ్వింపులనేవి తప్పనిసరి. ఆ కవ్వింపుల వల్ల కలిగే చిన్న చిన్న కలహాలు, కీచులాటలు కూడా ప్రేమికులకు ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రేమికులు ఒకరినొకరు మాటలతోనో, చేష్టలతోనో కవ్వించుకునే ముందు అవతలి వ్యక్తి మూడ్స్ (మానసికస్థితి)ని గమనిస్తూ పరిస్థితి శ్రుతి మించి రాగాన పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రేమలో పరస్పర ఆత్మగౌరవం ప్రధానం. దానికి భంగం కలగకుండా  చూసుకోవాలి. 

రోహిణి నన్ను డైరెక్ట్ గానే టీజ్ చేసేది. నన్ను చూడ్డానికి వచ్చినప్పుడల్లా "ఎందుకనో నిను చూడగానే కవ్వించాలని వుంటుంది.. కవ్వించి నీవు కలహమాడితే నవ్వు కొనాలని వుంటుంది..." అనే పాటను హమ్ చేసేది. సిఐడి సినిమాలోలాగా తాను జమున, నేను ఎన్.టి.ఆర్.లా స్టెప్స్ వేసి పాడుకోకపోయినా ఆ పాటను ఇద్దరం బాగానే ఆస్వాదించే వాళ్ళం.

మాలాంటి జంటలెందరికో ప్రేమానందం కలిగించిన సజీవరాగం, పింగళివారి గీతం,  ఘంటసాల, సుశీల యుగళం 'ఎందుకనో నిను చూడగానే...' ఇప్పటికీ  అందరి మదిలో మెదులుతూనే వుంటుంది.

 

జమున: 

ఎందుకనో నిను చూడగానే

కవ్వించాలని వుంటుంది... !ఎందుకనో!

కవ్వించి నీవు కలహమాడితే

నవ్వుకొనాలని వుంటుంది... !ఎందుకనో!


ఎన్.టి.ఆర్: 

ఎందుకనో నిను చూడగనే 

ఏదో ఇదిగా వుంటుంది... !ఎందుకనో!

నీ పెదవులపై నవ్వు చిందితే 

మనసు చల్లగా వుంటుంది

ఎందుకనో... ఎందుకనో...


జ: అడుగడుగున నీ రాజసమంతా

ఒలికిస్తూ నువు

కులుకుతువుంటే -2

కొంగున కట్టుకు నిను తిప్పాలని

నా !కొంగును!

ఏదో వేడుక పుడుతుంది... !ఎందుకనో!


ఎన్.టి.ఆర్: 

ఎందుకనో

జ: !కవ్వించి!


ఎన్.టి.ఆర్: 

అణువణువునా నీ సొంపులు వంపులు 

నను మైకంలో ముంచుతువుంటే ! అణువణువునా!

నీలో ఐక్యం చెందాలంటూ-2

ఏదో తహతహ పుడుతుంది

ఎందుకనో... ఎందుకనో...

పింగళివారు ఈ పాటలో కథానాయిక  నాయకుని చూసి కవ్వించాలనుకోవడం, జాలిపడి నవ్వుకోవాలనుకోవడం; మరో పాటలో 'యువతులు చూసి చూడకముందే ఐసౌతావా అబ్బాయీ' అని ఆటపట్టించడం చూస్తే పురుషులకంటే స్త్రీలే మానసికంగా బలవంతులని,  అధికులని చెప్పదల్చుకున్నారనిపిస్తుంది. ఆ అమ్మాయి ఏమన్నా అలిగి పోకుండా సరదాగా తీసుకుని ఆనందించే సహృదయుడైన అబ్బాయి వున్నప్పుడు సందేహాలకు తావే లేదు. 

పింగళి వారి సరళమైన పదజాలానికి తగినట్లుగా తేలికగా, సరసమైన రీతిలో వరసను కట్టి సుశీలగారితో కలిసి పాడి శ్రోతలకు శ్రవణానందాన్ని కలిగించారు ఘంటసాలవారు. మాస్టారు ఈ పాటలో ఉపయోగించింది సినిమారాగం. ఈ పాట మోహన, శుద్ధసావేరీ, బిలహరి,ఆరభి, అంటూ అనేక రాగ ఛాయల మిశ్రమం. ఏ ఒక్క రాగానికి కట్టుబడిలేదు. అందుచేత ఈ పాటను సినీమా రాగం అనడమే సమంజసం. మాస్టారు ఈ పాటలో వెస్ట్రన్ ఇన్స్ట్రుమెంట్స్ కే ఎక్కువ ప్రాధాన్యత యిచ్చి ఆ స్టైల్ లోనే  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను వినిపించారు. ఎకార్డియన్, పియోనా, మేండొలిన్, గిటార్, వయొలిన్, బాంగోస్, కాంగో డ్రమ్స్ వంటి వాద్యాలను మెలొడియస్ గా ఉపయోగించుకుని ఇది ఘంటసాల బాణి అనే స్టాంప్ ను సార్థకం చేశారు.

పాటకు తగ్గ హావభావాలతో సిఐడిగా ఎన్.టి.ఆర్ ఆయన ప్రేమికురాలుగా  జమున,  మంచి రొమాన్స్ నే అభినయించారు. గుండమ్మకథలో "ప్రేమ యాత్రలకు..." పాటలో ఎ.ఎన్.ఆర్., జమున గ్రామీణ యువతి యువకుల గెటప్ నే మరల ఎన్.టి.ఆర్., జమునలకు రిపీట్ చేయించారు చక్రపాణి.

1965వ సంవత్సరంలో విజయా వారు అతి నిశబ్దంగా ఎటువంటి హంగు, ఆర్భాటం, స్వయం డబ్బాలు లేకుండా ఒక సాధన చేసి చూపారు. నిదానమే ప్రధానంగా ఏడాదికి, రెండేళ్ళ కొకసారి తమ సొంత సినిమాలు చూపే నాగిరెడ్డి - చక్రపాణి గార్లు 1965 లో ఏకంగా నాలుగు  పెద్ద హీరోల సినీమాలను తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయడం అపూర్వమే.

ఎమ్.జి.ఆర్., సరోజాదేవిలతో 'ఎంగవీట్టు పిళ్ళై'; ఎన్.టి.ఆర్., ఎస్ వరలక్ష్మిలతో 'సత్య హరిశ్చంద్ర'; ఎన్.టి.ఆర్., జమునలతో 'సి.ఐ.డి.'; రాజ్ కుమార్, లీలావతి లతో 'మదువే మాడినోడు' సినిమాలను విడుదల చేసి ఆర్ధికంగా  మంచి విజయాలనే పొందారు. ఈ నాలుగు సినిమాలు రీమేక్ లే కావడం మరో విశేషం. తెలుగులోని రాముడు భీముడు తమిళంలో ఎంగవీట్టు పిళ్ళైగా; తమిళ 'దైవత్తాయ్' తెలుగులో 'సిఐడి'గా; తెలుగులోని 'పెళ్ళి చేసి చూడు' కన్నడంలో 'మదువే మాడినోడు'గా భాషాంతరమయాయి. 'సత్యహరిశ్చంద్ర' కూడా ఒక రకంగా రీమేక్ సినిమాయే. ఎస్.వి.ఆర్. హరిశ్చంద్ర పద్య హరిశ్చంద్ర అయితే తర్వాత ఎన్.టి.ఆర్.తో వచ్చిన సత్యహరిశ్చంద్ర గద్య హరిశ్చంద్ర. ఈ నాలుగు సినిమాలు మూడు-నాలుగు నెలల తేడాతో విజయావారు విడుదల చేశారు.

విజయా వారి 'సి.ఐ.డి.' వెనుక ఒక చిన్న నేపథ్యంవుందనేవారు. తెలుగు సినిమాలకు కొంత విరామం ఇచ్చి తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్ సినిమాలు తీయ సంకల్పించారు. అందుకోసం డి.రామానాయుడుగారి 'రాముడు భీముడు' సినిమా హక్కులను కొనుగోలు చేసి తమిళంలో తీయడానికి హీరోగా ఎమ్.జి.ఆర్. ను సంప్రదించగా,  ఆయన తన సన్నిహిత నిర్మాత, తదనంతర కాలంలో తన పార్టీ నేత అయిన ఆర్.ఎమ్.వీరప్పన్ ను ఆర్ధిక ఇబ్బందులనుంచి ఆదుకునే క్రమంలో  పెట్టిన నిబంధనల మేరకు వీరప్పన్ తీసిన 'దైవత్తాయ్' సినిమా హక్కులను కొనుగోలు చేసి దానిని  తెలుగు లో 'సి.ఐ.డి.' గా రూపొందించారు. తాము తమిళంలో తీసిన 'ఎంగవీట్టు పిళ్ళై' ఘనవిజయాన్ని పురస్కరించుకొని దానిని హిందీలో దిలీప్ కుమార్ హీరోగా 'రామ్ ఔర్ శ్యామ్' గా తీసి జాతీయస్థాయి నిర్మాతలయ్యారు విజయా నాగిరెడ్డి - చక్రపాణి. విజయా ప్రొడక్షన్స్ తెలుగు, తమిళ భాషలలో తీసిన అత్యధిక సినీమాలకు సంగీత దర్శకత్వం వహించి ఆ సంస్థ విజయాలకు మూలకారకులయ్యారు ఘంటసాల. 1965 లోని 'సిఐడి', 'మదువే మాడినోడు' సినీమాల తర్వాత విజయా వారి  ఇతర చిత్రాలలో ఘంటసాల పాటలు పాడారే తప్ప  సంగీత దర్శకుడిగా పనిచేయలేదు.

ఘంటసాలగారి సంగీతంలో మెలొడికి కొదవ వుండదని మరోసారి నిరూపించిన సినిమా 'సి.ఐ.డి.'. ఈ సినిమాలో సుశీల, ఘంటసాల ఆలపించిన ఎనిమిది పాటలు మంచి శ్రావ్యతను సంతరించుకున్నవే. ఘంటసాలగారు సంగీతం నిర్వహించిన మొదటి మూడు చిత్రాల్లో ఒకటైన 'లక్ష్మమ్మలో పెట్టిన పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి తిల్లానాకే చిన్న చిన్న మార్పులు చేసి మరల 'సిఐడి' సినిమాలో రమణారెడ్డి కోసం తానే పాడడం ఒక విశేషం.


కొసమెరుపు:

ఏ చోట కూర్చొని అసంఖ్యాకమైన అజరామర గీతాలకు వరసలు కూర్చారో, ఏ వాహినీ రికార్డింగ్ థియేటర్లో వందలాది పాటలను పాడి రికార్డ్ చేసారో అదే వాహినీ లో అదే స్థలంలో  అదే నాగిరెడ్డిగారి నిర్వహణలోని విజయాహాస్పిటల్ బెడ్ మీదే ఘంటసాలగారి అంతిమ దినాలు గడిచాయి.

తరాలు మారినా, ఆయా స్థలాల రూపురేఖలు మారినా వాటి జ్ఞాపకాలు మాత్రం మనలను అంటి పెట్టుకునే వుంటాయి.

 

వచ్చేవారం, ఘంటసాలవారి మరో సజీవరాగంతో మరల కలుద్దాము.

 

ప్రణవ స్వరాట్

No comments:

Post a Comment

ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం - అధ్యాయం - 2 - భాగం 41 - ఎందుకనో నిను చూడగనే కవ్వించాలని ఉంటుంది

" ఘంటసాల - సదా మదిలో మెదిలే సజీవరాగం" పేరుతో సాగే ఈ శీర్షిక, ఘంటసాలవారి స్వీయసంగీత దర్శకత్వంలో రూపు దిద్దుకున్న ఏకగళ, యుగళ గీతాలను...