చిత్రం - ప్రేమనగర్
గానం - ఘంటసాల
రచన - ఆత్రేయ
సంగీతం - కె.వి.మహాదేవన్
తాగితే మరిచిపోగలను
తాగనివ్వరు
మరిచిపోతే తాగగలను
మరువనివ్వరు...
మనసుగతి ఇంతే మనిషి బ్రతుకింతే
మనసున్న మనిషికి
సుఖము లేదంతే-2
ఒకరికిస్తే మరలిరాదు
ఓడిపోతే మరిచిపోదు - ఒకరి 2
గాయమైతే మాసిపోదు
పగిలిపోతే అతుకుపడదు
మనసు గతి ఇంతే
అంతా మట్టేనని
తెలుసు
అదీ ఒక మాయేనని
తెలుసు! అంతా!
తెలిసి వలచీ
విలపించుటలో
తీయదనం ఎవరికి
తెలుసు ! మనసు!
మరుజన్మ వున్నదో
లేదో
ఈ మమతలప్పుడేమౌతాయో-2
మనిషికి మనసే తీరని
శిక్ష
దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష
మనసు గతి ఇంతేరామానాయుడుగారికి సినిమాల పట్ల ఆకర్షణ, అసక్తి తన తండ్రిగారి నుండే సంక్రమించిందని చెప్పాలి. ఆయన 'నమ్మినబంటు' చిత్ర నిర్మాతలలో ఒకరు. ఆ సమయంలో ఆ సినిమా హీరో అక్కినేని నాగేశ్వరరావుగారిచ్చిన ప్రోత్సాహ బలంతో రామానాయుడు, మరో యిద్దరు నిర్మాత ల భాగస్వామ్యం తో ' అనురాగం' అనే సినిమా ద్వారా చిత్రసీమలోనికి అడుగుపెట్టారు రామానాయుడు. భానుమతి ప్రధాన పాత్రలో గుత్తా రామినీడు దర్శకత్వంలో తయారైన 'అనురాగం' ఆర్ధికంగా పరాజయాన్నే చవిచూసింది. అయితేనేం, రామానాయుడుగారికి కొంత అనుభవం కలిగింది. స్వతంత్రంగా సినిమాలు తీయాలని సంకల్పం కలిగింది. తన పెద్ద కుమారుడు సురేష్ బాబు పేరుమీదుగా సురేష్ ప్రొడక్షన్స్ చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి ప్రథమ ప్రయత్నంగా ఎన్.టి.రామారావు కథానాయకుడుగా సొంత సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు రామానాయుడు. అదే 'రాముడు భీముడు' ఎన్.టి.ఆర్ ద్విపాత్రాభినయం ప్రధానాకర్షణగా 'రాముడు భీముడు' సినిమా ఘనవిజయం సాధించింది. రామానాయుడు పేరు సినీలోకానికి తెలిసింది. తదాదిగా రామానాయుడు నిర్మించిన మరో ఐదారు సినిమాలు ఆర్ధికంగా అపజయాన్నే మూటగట్టిచ్చి రామనాయుడును అప్పుల ఊబిలోకి లాగేయి. ఇక చిత్రనిర్మాణానికి స్వస్తిచెప్పి స్వస్థలమైన కారంచేడుకే చేరుకోక తప్పని పరిస్థితిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆఖరి ప్రయత్నంగా ఒక ప్రముఖ తెలుగు నవల ఆధారంగా అక్కినేని, వాణిశ్రీ నాయికానాయకులుగా, నిన్నటి తరం ప్రముఖ నిర్మాతాదర్శకఃడు కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో సినిమా తీయ సంసిధ్ధమయ్యారు రామానాయుడు. ఆ సినిమా యే 'ప్రేమ నగర్'.
ప్రతి పురుషుడి విజయం వెనుకా ఒక స్త్రీ ఉంటుందంటారు. అది నాయుడుగారి విషయంలో అక్షరాలా నిజమయిందనే చెప్పాలి. ఆనాడు తెలుగు మహిళా నవలా లోకంలో మకుటంలేని మహారాణిగా వెలుగొందిన కోడూరి (అరికేపూడి) కౌసల్యాదేవి 'ప్రేమ నగర్' నవల సృష్టికర్త. ఆ నవలా బలమే రామానాయుడు 'ప్రేమ నగర్' సినిమా ఘనవిజయానికి దోహదం చేకూర్చింది. వివిధ భాషలలో 'ప్రేమ నగర్ ' సినిమా సృష్టించిన సంచలనం అందరికీ తెలిసిందే. విజయా నాగిరెడ్డి-చక్రపాణిలతో చేతులు కలిపి సురేష్-విజయా కంబైన్స్ సంస్థను స్థాపించి 'ప్రేమనగర్' ను తమిళంలో శివాజీ గణేశన్- వాణిశ్రీ తో 'వసంతమాళిగై' గా; రాజేష్ ఖన్నా- హేమమాలిని లతో హిందీలో 'ప్రేమ్ నగర్' గా పునర్నిర్మించారు. అదృష్టం రామానాయుడును వెన్నంటింది. ఈ రెండు భాషల్లో కూడా ప్రేమనగర్ ఘనవిజయం సాధించింది. నిర్మాత గా రామానాయుడు పేరు మార్మోగింది.
ప్రేమ నగర్ సినిమా తర్వాత రామానాయుడు గారి జాతకమే మారిపోయింది. భారతీయ భాషలన్నింటిలో శతాధిక సినిమాలు నిర్మించి చరిత్రపుటల్లో చోటుచేసుకున్నారు. మూవీ ముఘల్ అనే కీర్తిని సంపాదించారు. రాజకీయాలలో కూడా ప్రవేశించి రాజ్యసభ సభ్యుడిగా పేరుపొందారు.
ఎ.ఎన్.ఆర్. ప్రేమకధా చిత్రాలలో ప్రేమనగర్ ఆనాటి దేవదాసంతటి జనామోదం పొందడానికి కె.వి.మహాదేవన్ అద్భుత సంగీతం, ఘంటసాల గాత్ర మాధుర్యం, అక్కినేని, వాణిశ్రీ ల నటనావైదుష్యం ఎంతగానో తోడ్పడ్డాయి. అక్కినేని వారి సాధనలో సగ భాగం ఘంటసాలవారిదేనన్న మాట ప్రేమనగర్ లో ఘంటసాలగారు పాడిన పాటలు మరోసారి నిరూపించాయి.
ప్రేమనగర్ సినిమా కోసం మనసు కవి ఆత్రేయ మనసు పెట్టి రాసిన పాటలన్నీ శ్రోతలను కట్టిపడేస్తాయి. అలాటి పాటల్లో ప్రముఖమైనది 'మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే' పాట. అదే ఈనాటి ఘంటసాల సజీవరాగం.
మంచి మనసు గల ఒక భగ్నప్రేమికుని మానసికక్షోభ అంతా ఈ 'మనసుగతి ఇంతే' పాటలో ధ్వనిస్తుంది. ప్రియురాలి కోసం తన చెడు వ్యసనాలన్నీ వదులుకున్నా, ఆమె ఎడబాటు సహించలేక మరల మధువునే ఆశ్రయించి పాడిన పాట. మనసున్న మనిషికి సుఖసంతోషాలుండవనేది ఈ పాట సారాంశం. సారాయి మైకంలో వున్న కథానాయకుని మనసులో గూడుకట్టుకున్న విషాదాన్నంతా తన గళంలో నింపుకొని ఈ పాటకు జీవం పోసారు ఘంటసాల. పాట మధ్యలో నిర్వేదంతో కూడిన నవ్వులు, పాట చివరలో దగ్గు వంటి expressions ను సందర్భోచితంగా ప్రయోగించడంలో ఘంటసాలగారిని మించినవారు లేరు.
ఆరభి రాగంలో ఈ పాటను మలచినట్లు కొందరు అభిప్రాయపడుతున్నా ఖరహరప్రియ రాగ స్వరాలు ఆధారంగా మహాదేవన్ ఈ పాట చేసినట్లు తెలుస్తోంది. సితార్, ఫ్లూట్, ఎకార్డియన్, గిటార్స్, వైయొలిన్స్, సెల్లో, బాంగోస్, కాంగో డ్రమ్స్, తబలా వంటి వాద్యాల సహకారంతో ఈ మనసు పాటను అతి సున్నితంగా మృదుమధురంగా స్వరపర్చారు.
భారీసెట్లతో, కన్నులకింపైన రంగులలో చిత్రీకరించబడిన ప్రేమనగర్ సినిమా పాటలన్నీ బహుళజనాదరణ పొందినవే. 9 పాటలు, 2 పద్యాలు. ఆత్రేయ వ్రాసిన ఈ పాటలకు ఘంటసాల, సుశీల గాత్ర మాధుర్యం తోడై చిత్ర విజయానికి దోహదపడ్డాయి.
ఘంటసాల అద్భుతంగా ఆలపించిన దువ్వూరి రామిరెడ్డి గారి 'అంతములేని ఈ భువనమంత' పద్యాన్ని ఒక విమానంలో అక్కినేని పై చాలా హృద్యంగా చిత్రీకరణ జరిపారు దర్శకుడు కె.ఎస్.ప్రకాశరావు. ఈ సన్నివేశంలో అక్కినేని, వాణిశ్రీ, నల్లరామూర్తి తో పాటు చిత్రనిర్మాత రామానాయుడు కూడా కనిపిస్తారు. రామానాయుడుకు తాను నిర్మించిన సినిమాలన్నింటిలో ఏదో ఒక సన్నివేశంలో కన్పించడం ఒక సరదా.
తెలుగు ప్రేమనగర్ పాటల్లో వున్న మృదుత్వం, మాధుర్యం ఇతర భాషల పాటలలో కనపడదు. మొత్తం మీద రామానాయుడుగారు మహర్జాతకుడని 'ప్రేమనగర్' సినిమా నిరూపించింది.
అన్వేషించే ఆసక్తి వుండాలేగానీ ఘంటసాల సంగీత సాగరగర్భంలో ఇలాటి ఆణిముత్యాలు అసంఖ్యాకంగా లభిస్తాయి.
ప్రణవ స్వరాట్